"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

20 జులై, 2022

ఆచార్య దార్ల ఆత్మకథ (నెమలి కన్నులు) - 3 వ భాగం

 












కోనసీమ ప్రేమ కౌగిలిలో మా వూరు


మా ఊరిపేరు

చెయ్యేరు అగ్రహారం అని చెప్పాను కదా!

అదెక్కడుంది?

మీరు కోనసీమ పేరు వినుంటారు.

దక్షిణ భారతదేశంలోనే ఒక అందమైన ప్రాంతం.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో...

తూర్పుగోదావరి జిల్లాలో

కోనసీమ

ఎటు చూసినా కొబ్బరి చెట్లు. 

ఎటుచూసినా గలగల ప్రవహించే నదులు, కాల్వలు...

ఎటుచూసినా  తినగానికి పిలిచే తియ్యని ఫలవృక్షాలు...  

మనసుని మత్తెక్కించే పరిమళాల్ని వెదజల్లుతూ రంగురంగుల పూలమొక్కలు...

ఆ కోనసీమలో అమలాపురం.

దాన్ని కేంద్రంగా అలంకరిస్తూ చుట్టూ నిలిచే గ్రామాలు... 

దాని చుట్టూ స్వచ్ఛంగా నిత్యం వేదంలా ప్రవహించే నదులు...

ప్రకృతి సింగారించుకున్న పచ్చని చీరలా పరుచుకున్న పొలాలు... 

ప్రతి రోజూ ఏదో పండుగ చేసుకుంటుంటే మ్రోగే 

మంగళ ధ్వనుల్లా పలికే పక్షుల కిలకిలారావాలు...

గ్రామ గ్రామాన ఆత్మగౌరవ చిహ్నమేదో దారిచూపుతున్నట్లుగా కనిపించే 

నిలువెత్తు అంబేద్కర్ శిలా విగ్రహాలు ...

సాగర సంగమం కోసం 

వేగంగా ఉరికొస్తున్నట్లు ప్రవహించే గౌతమీ గోదావరినదిని

కుండలేశ్వరం మీదుగా చెలికత్తెలెవరో రహస్యంగా తీసుకెళ్తున్నట్లుండే ఆ మండలం...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిపదవితో మారుమ్రోగిన కాట్రేనికోన మండలం..

ఆ మండలంలోని పదహారు గ్రామాల్లో చెయ్యేరు ఒక మేజర్ పంచాయితీ గ్రామం...

ఆ చెయ్యేరుని వీడకుండానే తన ప్రత్యేకతను నిలుకుంటున్నదే చెయ్యేరు అగ్రహారం.

 దీనికి తూర్పునే బ్రాహ్మణ చెరువు ఉంది... ఊరి మధ్యలో బ్రాహ్మణలు...రాజులు, వైశ్యులు, కాపులు, శెట్టి బలిజ తదితరుల ఇళ్ళు ఉంటాయి. మెయిన్ రోడ్డు మొదలు కొని, పంచాయితీ రోడ్డుకి ఇరుకైపులా కూడా ఆ కులస్తుల ఇళ్లే ఉంటాయి. రాజుల ఇళ్ళు దూర దూరంగా ఉన్నా, అవి పెద్ద పెద్దగా ఉంటాయి. దాన్ని రాజుల వీధి అంటారు. ఆ వీధిలోనే ఒకటో రెండో ముస్లిముల ఇళ్ళు కూడా ఉన్నాయి. ఊరి చివరికి పశ్చిమ దిశగా వెళితే చింతల మెరక, కాల్వగట్టు ప్రాంతాల్లో కొంతమంది దళితులు నివసిస్తుంటారు. అక్కడ కూడా మాదిగల ఇళ్ళే ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళకి కొంచెం దూరంలో కొన్ని మాలల ఇళ్ళు ఉన్నాయి. అలాగే ఊరికి ఉత్తరం వైపు ప్రధాన రహదారిని ఆనుకొని కొన్ని కాపులు, మరికొన్ని వైశ్యలు, శెట్టి బలిజల వారిళ్ళుంటాయి. ఉత్తరం వైపు ఊరి చివరిలో కండ్రిగ చెరువుని ఆనుకొని దళితలు ఇళ్ళుంటాయి. ఇంచుమించు అక్కడ అంతా మాలవారి ఇళ్ళే సుమారు వందకు పైగానే ఉంటాయి. ఊరికి దక్షిణం వైపు గుమ్మడి చెరువు అని ఒకటి ఉంది. దాని చుట్టూ మాదిగల ఇళ్ళు కొంచెం ఎక్కువగాను, ఒకటొ, రెండో మాలల ఇళ్ళున్నాయి. అంటే మా చెయ్యేరు అగ్రహారం ఊరుకి అన్నివైపులా చివరిలో దళితుల ఇళ్ళే ఉన్నాయి. చెయ్యేరు అగ్రహారానికీ, చెయ్యేరు గ్రామానికీ మధ్యలో ఒక పెద్ద పేట ఉంది. దాన్ని వడ్డి పేట అంటారు. అక్కడ సుమారు వంద ఇళ్లకు పైగానే ఉంటాయి. అక్కడున్నవాళ్ళంతా ఇంచుమించు మాలకులస్థులే. అందుకని వాళ్ళు రెండు ఊర్లనీ అనుసంధానిస్తూ మధ్యలో ఒక  పెద్ద అంబేద్కర్ విగ్రహం వేశారు. అక్కడ డిగ్రీ, పిజిల వరకు చదువుకున్నవాళ్లున్నారు. అంబేద్కర్ చైతన్యం బాగా ఉంది. అక్కడ వాళ్ళు కూడా చాలామంది ఆ దగ్గరలోనే ఉన్న చర్చికి వెళ్తుంటారు. అయినా వీళ్ళ ఇళ్ళు కూడా ఈ ఊరుకీ, ఆ ఊరుకీ చివరిలోనే ఉన్నట్టయ్యింది. మొత్తం మీద వీళ్ళంతా తెల్లవారి లేస్తే చుట్టూ పచ్చని పొలాలు కనిపిస్తాయి. కానీ, ఆ పొలాలు మాత్రం ఊరిమధ్యలో ఉన్నవాళ్ళవి. పొలం పనులకు వెళ్ళడానికీ, రావడానికి మాత్రం వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. దళితుల ఇళ్ళన్నీ ఊరుకి చివరన ఉన్నట్లున్నా అవసరమైతే ఊరునంతా వీళ్ళంతా తలచుకుంటే అష్టదిబ్ధంధనం కూడా చేయొచ్చన్నమాట.  

నాకు ఊహ తెలియనప్పుడు, ఈ సామాజిక వ్యవస్థ అర్థమయ్యేది కాదు, అందకని ‘‘మనవాళ్ళెవ్వరు చూసినా ఊరికి చివరిలోనే ఇళ్ళుకట్టుకున్నారెందుకు?’’ అని అడిగేవాణ్ణట. ‘‘మనవాళ్ళకి సొంత భూముల్లేవు కదా... అందుకని ఆ గవర్నమెంటు భూముల్లో కట్టుకున్నారు’’ అని చెప్పేవారు. ‘‘అయితే మనం గవర్నమెంటు మనుషులన్నమాట’’ అనేవాణ్ణి. ఆ మాటెవరన్నా కాపుగారో, రాజుగారో వింటే ‘‘అవున్రా... మీకేంట్రా మీరు గవర్నమెంటోళ్ళు... మీకు అన్నీ ఉచితంగానే వస్తాయి. ఉచితంగా చదువు చెప్తారు. స్కాలర్ షిప్పులిస్తారు. లోన్లిస్తారు. ఉద్యోగాలిస్తారు... మీరే గవర్నమెంటోళ్ళురా...’’ అనేవారు కొంతమంది వెటకారంగా.  అన్నిచ్చినా మాకు మీలాంటి ఇళ్ళులేవేంటి సార్ అనేవాణ్ణి. తర్వాత వాళ్ళ నుండి మాటలు వచ్చేవే కాదు.

పంచాయితీ రోడ్డు ప్రక్కనే, మా బ్రాహ్మణ చెరువుకి దగ్గర్లో ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. ఆ స్థలాన్ని ఆకాశం సన్యాసి చిట్టిబాబుగారని ఒక వేదోత్తముల వంశానికి చెందినవారు ఆ స్థలాన్ని పాఠశాల కోసం దానం చేశారు. దాన్ని ఆనుకొనే సుమారు రెండు ఎకరాల వరకు పొలం ఉంటుంది. ఆ పొలాన్ని మాకే కౌలుకిచ్చేవారు. మా ఇంటిల్లిపాదీ ఆ పొలంలో పనిచేసుకునేవాళ్ళం. వారికవ్వవలసినవన్నీ ఎప్పటికప్పుడు ఇచ్చేసేవాళ్ళం. అందువల్ల ఇంకెవరైనా ఎక్కువ కౌలు ఇస్తామన్నా వాళ్ళకివ్వకుండా ‘‘పిల్లల్తో ఉన్నారు. కష్టపడుతున్నారు. మాకివ్వలసినవాటికంటే అప్పుడప్పుడూ అపరాలు కూడా ప్రేమతే పట్టుకొస్తారు. వాళ్ళవల్ల మాకే ఇబ్బందీ లేదు. వాళ్ళనలా బ్రతకనివ్వండిరా’’ అనేవారట. ఆ పొలాన్ని ప్రభుత్వం పేదలకు ఇళ్ళిచ్చేటప్పుడు, ఆ భూమిని ఆ బ్రాహ్మణులు ఎలాంటి ఆలంకం పెట్టకుండా ఇచ్చేశారు. మేము ఆ భూమిని వదిలి వచ్చేటప్పుడు తల్లిని కోల్పోయిన బిడ్డల్లా ఏడ్చాం. మా అభివృద్ధికీ ఆ పొలానికీ మాకూ విడదీయరాని సంబంధం అంత గొప్పది.

ఊరుకి మధ్యలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంటుంది. దానికి దగ్గర్లోనే వినాయకుడి ఆలయం, ఆ పరిసరాల్లోనే శ్రీకనకదుర్గమ్మవారి చిన్న దేవాలయం ... ఇలా ఊరు మధ్యలో మూడు దేవాలయాలు ఉన్నాయి. బస్సెక్కాలన్నా, దిగాలన్నా ఎవరైనా అక్కడికే రావాలి. అక్కడే బస్ స్టాప్ ఉంది.  వీటితో పాటు ఊరు కి అటువైపు ఒకటి ఇటువైపు ఒక్కో  శ్రీరాముని దేవాలయం కూడా ఉంది. ప్రతి రోజూ ఏదో సమయంలో మైక్ ద్వారా దేవుడి పాటలు, భజనలతో ఊరంతా భక్తి పారవశ్యమవుతుంటుంది. వాటి ధర్మకర్తలంతా దళితేతరులే. వాళ్ళంతా కూడా కాపులు, శెట్టి బలిజ, వైశ్యులు(కాముట్లు), రాజులు ఇలా వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలోనే వాటి కార్యక్రమాలన్నీ జరుగుతుంటాయి. వినాయక చవితికీ, విజయ దశమికీ పదేసి రోజుల చొప్పున పండుగ చేస్తారు. ఆ దేవాలయాల్లోకి దళితులకు ప్రవేశం లేదని చెప్పలేం, కానీ, దళితులెవరూ ఆ దేవాలయాల్లోకి వెళ్ళి అందరితో కలిసి కళ్యాణోత్సవాలు, పూజలు చేస్తారని మాత్రం గట్టిగా చెప్పలేం. చదువుకున్నవాళ్లు అప్పుడప్పుడు ఆ దేవాలయాల్లోకి వెళ్తుంటారు. కానీ, వాళ్ళ ముఖాల్ని చూస్తే మనది కాని దేవాలయంలోకేదో వెళ్తున్నట్లుగా కనిపిస్తాయి. అందువల్ల దళితులు అత్యధికంగా చర్చిల్లోకి వెళ్తుంటారు. ఒక్క చెయ్యేరు అగ్రహారంలోనే మూడు చర్చిలున్నాయి. అవి చిన్నచిన్నవే కావచ్చు. కానీ ఆదివారాలు, మరికొన్ని ప్రార్థనా సమయాల్లో ఆ చర్చిలన్నీ పిల్లలు, పెద్దలు, వయోవృద్ధులతో పూర్తిగా నిండిపోతాయి. ఆ చర్చికి వెళుతున్న వాళ్ళ ముఖాల్లో ఎంతో ఆత్మవిశ్వాసం, సంతోషం కనిపిస్తాయి. పాస్టర్లంతా ఇంచుమించు దళితులే. తర్వాత కాలంలో కాపులు, ఇతర కులస్థులు కూడా ఫాస్టర్లయ్యారు. కేవలం దళితులే కాకుండా ఇతర కులాల వాళ్ళు కూడా చర్చిల్లోను, వాళ్ళు చేసుకునే కార్యక్రమాల్లోను సంతోషంగా పాల్గొంటారు. ఒకరిద్దరు తప్ప ఇతర కులస్తులైనప్పటికీ వీళ్ళంతా క్రైస్తవులుగా కలిసిమెలిసి భోజనాలు కూడా చేస్తుంటారు. బాప్తిజం తీసుకొని చర్చికి వెళ్ళేవాళ్ళు పుట్టిన రోజులు, వివాహాలు జరుపుకొనేటప్పుడు  కుల భేదాలు లేకుండా ఆ చర్చికి చెందిన వాళ్ళంతా ఆ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చివరికి ఎవరైనా చనిపోయినా అంత్యక్రియల్ని పాస్టరుగారు దగ్గరుండి, చర్చి భాగస్తులంతా పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదే ఒక హిందువు చనిపోతే, అది కూడా దళితేతరులైతే చూడ్డానికి వెళ్ళినా, ఆ కార్యక్రమాలన్నింటిలోను అందరూ పాల్గొనరు. కానీ, అదే ఒక క్రైస్తవుడు లేదా క్రైస్తవురాలు చనిపోతే  అది దళితులైనా సరే అందరూ పాల్గొంటారు. అయినప్పటికీ, మా చెయ్యేరు అగ్రహారంలో ఎవరు చనిపోయినా రంగరాజు కాల్వగట్టు మీదే పూడ్చి పెట్టడం లేదా దహనం చేయడం చేస్తారు. సాధారణంగా హిందువులైతే దహనం చేస్తారు. అదే క్రైస్తవులైతే ఏ కులస్తులైనా శవాన్ని భూమిలో పూడ్చిపెడతారు. ఈ మధ్య కాలంలో కొంచెం వ్యవసాయ భూమి, కొబ్బరి తోటలు ఉన్నవాళ్లు మాత్రం వాళ్ళవాళ్ళ స్థలాల్లో పూడ్చిపెట్టుకొని స్మారక చిహ్నాల్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. చిత్రమేమిటంటే, ఆ కాల్వ గట్టు మీద కూడా హిందువులైనా వాళ్ళ వాళ్ళ కులాల్ని బట్టి వాళ్ళకు కేటాయించిన స్థలంలోనే అంత్యక్రియలు చేసుకోవాలి. స్మశానంలో కూడా కులం వదిలిపెట్టని స్థితిని నేను మా ఊరిలో చూశాను. ఆ కాల్వగట్టు ప్రభుత్వ స్థలాలు కూడా కొంతమంది వాళ్ళ వాళ్ళ పొలాల దగ్గర ఆక్రమణ చేసుకొని కొబ్బరితోటలు పెంచేసుకున్నారు. నిజానికి ఆ రంగరాజుకోడు కాల్వగట్టుకీ నాకూ ఎంతో అనుబంధం ఉంది. నా చిన్ననాటి జ్ఞాపకాలెన్నో దానితో ముడిపడి ఉన్నాయి.  ఆ రంగరాజు కోడు కాల్వ వంతెనపై నుండి ఆ కాల్వలోకి దూకుతూ ఆడిన సరదా ఈతలున్నాయి. ఆ కాల్వ గట్టున మా పశువుల్ని మేపేటప్పుడు పడిన గొడవలున్నాయి. ఆ కాల్వగట్టుపై కొబ్బరిచెట్లు పాతిన ఉద్యమాలున్నాయి. ఆ కాల్వ గట్టు మీద శవాల్నికాలిస్తే ఆ శవాల్ని వైద్యుడిలా పరిశీలించిన అల్లరి పనులున్నాయి.  

(సశేషం)

  • ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,  

తెలుగు శాఖాధ్యక్షులు, 

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్


కామెంట్‌లు లేవు: