భూమి పుత్ర దినపత్రిక, 13.7.2022 సౌజన్యంతో
(ఆచార్య దార్ల ఆత్మకథ -2 వ భాగం)
మా ఊరి పేరు అగ్రహారం !
మా పేట పేరు బ్రాహ్మణ చెరువు !!
నా ఆత్మకథ రాయాలా?
ఒక్కసారిగా అద్దం ముందుకెళ్ళాను.
నా ప్రతిబింబాన్ని ఓసారి పరిశీలనగా చూసుకున్నాను.
నా బాల్యం
నా యౌవనం
నా జీవితం
నా జాతి
నా కుటుంబం
నేను బతకడానికి పడిన కష్టాలు..
నా పై ఎక్కడెక్కడో చిరు జల్లుల్లా కురిసిన ఆనందపు క్షణాలు...
తెరలు తెరలుగా కళ్లముందు కదులుతున్నాయి.
నవ్వు, విషాదం, అసహనం... అన్నీ ఒక దానిపై ఒకటి పొరలు పొరలుగా కదిలిన్నావస్తున్నాయి.
ఒక్కసారిగా వాటిని ఒడిసి పట్టుకోవడమెలా?
వాటన్నింటినీ అక్షరరూపంలో పెట్టగలనా?
నా భావోద్వేగాల్ని గుర్తించడమెలా?
అన్నింటికీ మించి తియ్యగా నెమరు వేసుకోవలసిన స్మృతులేమైనా ఉన్నాయా?
సున్నితంగా సాగిపోవాల్సిన నా బాల్యమంతా ఎటు పోయిందో...
దాన్ని మళ్ళీ తీసుకు రాగలనా?
ఆ బాల్యంలో ఉండాల్సినవన్నీ నాకు అందాయా?
అసలు అది ఒక బాల్యమేనా...
ఎంతోమంది ఎన్నోకథల్లో...ఎన్నో నవలల్లో ... ఎన్నో కవితల్లో...
ఎన్నో చోట్ల ఎంతో అందంగా వర్ణించే బాల్యం...
ఆడుతూపాడుతూ హాయిగా సాగిపోయే బాల్యం...
పిల్లలందరూ గువ్వల్లా కలిసి మెలిసి తిరగాల్సిన బాల్యం లో
అందరూ ఆడిపాడిన ఆ బాల్యపు నీడలేమైనా కనిపిస్తున్నాయా?
ఏమో... ఏమూలనున్నాయో...
ఉన్నా వాటినెలా బయటకు లాగాలో...
బడిలో కెళితే
బంతాట రానప్పటి బస్కీలే గుర్తొస్తున్నాయేంటో
శిక్షలయిన గాయాలేమైనా బుసలు కొడతాయేంటో...
***
మా ఊరి పేరు చెయ్యేరు అగ్రహారం...
అందులోనూ మేముండేది ‘బ్రాహ్మణ చెరువు గటు’్ట.
ఒకప్పుడు మా ఊళ్ళో బ్రాహ్మలెక్కువగా ఉండేవారట.
నాకు ఊహ తెలిసేటప్పటికే
బ్రాహ్మలంతా ఊరొదిలి వెళ్ళిపోయారు.
ఎందకంటే రకరకాల కారాణాలు చెప్తుంటారు.
అయినా రెండు మూడిళ్ళు మాత్రం ఉండేవి.
ఇప్పుడయితే ఒకటే ఇళ్ళుంది.
అయినా మా ఊరుకి మాత్రం ‘‘అగ్రహారం’’ అనే పేరు మాత్రం అలాగే ఉండిపోయింది
ఉన్న రెండు మూడిళ్ళూ కూడా మా ఊళ్ళో ప్రధాన వీధిలో ఉండేవి.
అక్కడెవరో గొప్ప పండితుడుండేవారట.
ఆయనకి రాజుగారు బహుమతిగా మా ఊరునిచ్చారట.
నిజానికి మా చెరువుగట్టు
ఒకప్పుడు ఊరికి దూరంగా ఉండేది.
ఊరుకి తూర్పువైపునుంది.
సూర్యుని తొలికిరణాలు మా ఊరిమీదే పడతాయి.
అక్కడికి వచ్చి రోజూ బ్రాహ్మలు స్నానాలు చేసేవారట...
వేదాలు చదివేవారట...
వాళ్ళకి ఎన్నో పొలాలు కూడా ఉండేవి
అయితే అవి ఎక్కడున్నాయో... ఎన్ని ఉన్నాయో వాళ్ళకే తెలియవు.
వాళ్ల వారసులకీ సరిగ్గా తెలియవు
నాకు తెలిసే నాటికే
బ్రాహ్మల భూములన్నీ దానాల కింది ఇచ్చేశారు.
మా ఊరిలో ‘‘హోతా’’ వారని ఓ బ్రాహ్మణ కుటుంబం ఉండేది.
ఊళ్ళో ఎవ్వరు పనిలో పెట్టుకున్నా... పెట్టుకోక పోయినా...
‘‘హోతా’’ వారి పొలంలో మాత్రం అందరికీ పనిదొరికేది.
అందుకని సెలవు వచ్చినా, డబ్బులు అవసరం పడినా పిల్లలం కూడా వాళ్ళ పొలంలో పని చేయడానికి వెళ్ళేవాళ్ళం.
పనిచేసినా చేయక పోయినా ఆ బ్రాహ్మణాయన ఎప్పుడూ అడిగేవాడు కాదు.
అడగడానికి ఆయన పొలం వస్తే కదా...
ఆయన పూజలకో, తద్దినాలకనో వెళ్ళిపోయేవాడట. సరిగ్గా చదువుకోలేదు
ఆయనకు ఇద్దరు కొడుకులు...
ఒక అమ్మాయి. ఆమెను ప్రాథమిక పాఠశాలతోనే చదువు ఆపేశారు. ఆమెకు ఇరవైయే
నేను అప్పటికిళ్ళు పైనే ఉండొచ్చు.
నేను హైస్కూల్ కి వెళ్ళేవాణ్ణి. సెలవుల్లో కూలిపనికి వెళ్ళేవాణ్ణి
నేను వాళ్ళింటికి వెళ్ళికాఫీలు టీలు తేవడానికి వెళ్ళినప్పుడు ఆమె నాతో మాట్లాడేది.ఎంతో ఆత్మీయంగా మాట్లాడేది. ఎప్పుడూ చదవుగురించే మాట్లాడేది. తాను చదువుకోలేకపోయానని బాధపడేది. ఆమెను చూస్తే నాకు ఒక అక్కలా అనిపించేది. ’’ మీరు ఇంటి దగ్గర్నుండి కూడా చదువుకోవచ్చండీ... ఆంధ్రాయూనివర్సిటిలో కరస్పాండెన్స్ కోర్సు ఉంది. ఓపెన్ యూనివర్సిటీలో డైరెక్ట్‌గా డిగ్రీ చదవొచ్చండీ‘‘ అని చెప్వేవాణ్ణి. తమ ఇంటిలో ఎవరూ లేకుండా చూసి నా తలమీద చెయ్యేసి నన్నో తమ్ముడిలా నిమిరి ‘‘ అయితే నాకు ఆ వివరాలు తెలుసుకొని చెప్పు’’ అనేవారు. నాకు
ఇంట్లో ఎవరూ చూడకుండా నాకు ప్రత్యేకంగా ఏదైనా పిండి వంటకం పెట్టేవారు.
‘‘సరేనండి’’ అనిచెప్పి వచ్వేవాణ్ణి. కాకు కూడా ఒక ఇలాంటి అక్క ఉంటే బాగుణ్ణనిపించేది.
హోతావారి పొలాన్నంతా మాఊరి పెత్తందార్లే పొలం పని చేయించేవారు.
పనికి వచ్చింది పదిమందైతే, ఇరవై మంది వచ్చారని బ్రాహ్మల దగ్గర కూలి వసూలు చేసేవారు. ఒక్కోరోజు ఆ సాయంత్రానికి వచ్చిన ఆ బ్రాహ్మణాయన దగ్గర అలా వసూలు చేయడాన్ని నేను కూడా గమనించాను.
ఇరవై మందికి సరిపడా ఉప్మా, టీలు తెచ్చేవారు. మిగిలితే ఙళ్ళకు పట్టికెళ్ళేవారు.
అలా చెప్పి తెమ్మని కూడా మమ్మల్నే బ్రాహ్మణాయన దగ్గరకు పంపించేవారు పెత్తందార్లు.
బ్రాహ్మాణాయన్ని మోసం చేస్తున్నారనిపించేది.
ఒక్కొక్కరూ ఆకలి తీరినంత ఉప్మా తిని, దాహం తీరినంత టీ తాగేవాళ్ళం.
నిజం చెప్పాలంటే నేనూ, నాతోపాటు ఒకరిద్దరు దళిత పిల్లలమూ కడుపు నిండాఉప్మా తినడానికీ టీ తాగడానికే ఆయన పొలం వెళ్ళేవాళ్లం.
పెత్తందార్లు కూలి ఇచ్చినా ఇవ్వకపోయినా ఉప్మా, టీలు మాత్రం ఖచ్చితంగా ఇచ్చేవారు.
అలాంటి బ్రాహ్మణచెరువు గట్టిప్పుడు మాదిగలతో నిండిపోయింది.
వీళ్ళతో పాటు రెండు మాలల కుటుంబాలు కూడా చేరాయి. ఇళ్ళు కట్టుకున్నారు. కొన్నేండ్లుగా అక్కడే స్థిర పడిపోయారు.ఒకప్పుడు ఆ చెరువు గట్టు చుట్టూ పోరంబోకు భూమి ఉండేది.చెరువంతా పాడైపోయింది. చుట్టూ చెట్లు పొదలు పెరిగి పోయాయి. రైతులు గ్రామంలో పొలాల దగ్గర కి వెళ్ళాలంటే దాన్ని దాటుకొని వెళ్ళాలి. పొలం వెళ్ళాలంటే ఒకవిధంగా ఆ పరిస్థితుల్లో భయపడేవారు.ఇవేమీ బయటకి చెప్పకుండా ‘‘దానిలో గుడిసెలేసుకోండ్రా’’ అని ఆ పరిస్థితుల్లో, అమాంతంగా పుట్టికొచ్చిన ప్రేమతో గ్రామ కరణం మునసబులన్నారట.
అక్కడ దెయ్యాలు తిరిగేవని కూడా ప్రచారం జరిగిందట కూడా! అయినా దెయ్యాలే దళితుల్ని చూస్తే పారిపోతాయిలే అనే ధైర్యంతో దళితులంతా అక్కడకి చేరారని మా తాత చెప్పేవాడు. అంతే కాకుండా దళితులకు నీళ్లకీ ఆ చెరువు ఉపయోగ పడుతుందనీ, పొలం పనులకీ అందుబాటులో ఉంటారనీ ఆ చెరువు గట్టుమీద ఉండమన్నారట.
అక్కడ దెయ్యాలకు భయపడో, ఊరికి దూరంగా ఉండాలనో ఎందుకో గాని ఎవ్వరూ రాకపోయినా ‘దార్ల’ వాళ్ళు ధైర్యం చేసి అక్కడకు వచ్చారు. దారీతెన్నూలేని ఆ బ్రాహ్మణచెఱువు గట్టుని బాగుచేసి దారిచేసినందుకే వాళ్ళకి ‘దార్ల’ అనే ఇంటిపేరొచ్చిందని చెప్తుంటారు.ఆ విధంగా బ్రాహ్మణ చెరువు గట్టు మా నివాసమైపోయింది. ఇప్పుడది ఊరికి నడిబొడ్డయి పోయింది.
బ్రాహ్మలు వెళ్ళి పోయినా ఇప్పుడు ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు మాత్రం ఆ చెరువు గట్టునే ఉన్నారు. ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా అక్కడేఉన్నారు. నేనూ ఆ చెరువు గట్టు నుండే వచ్చినవాణ్ణి.
ఇంతవరకూ మా ఊళ్ళో ఏ కులంలోనూ నాలా డాక్టరేట్ చేసినవాళ్ళు లేరు. మాఊళ్ళో మొట్టమొదటి పిహెచ్.డి., చేసింది నేనే. యూనివర్సిటిలో అధ్యాపకుడుగా ఉద్యోగం పొందింది నేనే. రేడియో, టీ.వి.లలో మాట్లాడిరది కూడా నేనే. ఇలా ‘‘నేనే మొట్టమొదటి’’ అని చెప్పుకుంటుంటే వీరేశలింగంగారు గుర్తొస్తుంటారు. అయితే, ఇది అహంకారంతో చెపుతున్న మాటకాదు. ఆత్మాభిమానంతో చెప్తున్నమాట.
చరిత్రను తిరగరాసిన జీవిత చరిత్ర లోని మాట.
ఇప్పుడు మా చెరువుగట్టు
అంబేద్కర్ ఆశయం ప్రతిఫలించిన పూలతోట.
ఈ విషయం మాఊళ్ళోకెళ్ళి ఎవరినడిగినా
ఇష్టమున్నా, లేకున్నా చెప్పక తప్పని మాట.
(సశేషం)
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,
తెలుగు శాఖ అధ్యక్షులు, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్,
హైదరాబాద్ -500 046
ఫోన్ : 9182685231
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి