భూతం ముత్యాలుగారి సాహిత్య సమగ్ర అవగాహన
ప్రజాపక్షం దినపత్రిక, 11.7.2022 సౌజన్యంతో
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగు శాఖ అధ్యక్షులు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ( సెంట్రల్ యూనివర్సిటీ), హైదరాబాద్. ఫోన్: 9182685231
భూతం ముత్యాలుగారి సాహిత్య
సమగ్ర అవగాహన
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగు శాఖ అధ్యక్షులు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ( సెంట్రల్ యూనివర్సిటీ), హైదరాబాద్. ఫోన్: 9182685231
ఆధునిక సాహిత్యంలో మరీ ముఖ్యంగా దళిత సాహిత్యంలో భూతం ముత్యాలు గారు తనదైన
ప్రత్యేక శైలితో పాఠకుల్ని ఆకర్షిస్తున్న రచయిత. తెలంగాణ దళిత భాషను
సాహిత్యీకరిస్తున్న ముత్యం గారి రచనలపై వేము రాములుగారు చక్కని సమీక్షావ్యాసాలను
రాసి, ముందుగా వాటిని
పత్రికల్లో ప్రచురించి, మరలా ఒక పుస్తకం రూపంలో తీసుకొస్తున్నారు. కరోనా వచ్చిన తర్వాత పత్రికారంగంలో
అనేక మార్పులు వచ్చాయి. పెద్ద పత్రికలనేవి చాలావరకు మూతపడ్డమో, పుటలసంఖ్యను
తగ్గించేయడమో చేశాయి. అయితే విచిత్రమేమిటంటే స్థానిక పత్రికలు మాత్రం బాగా
విస్తరించాయి. ఒకప్పుడు కేవలం పెద్ద, ప్రసిద్ధ పత్రికల్లో మాత్రమే రాసే కవులు, రచయితలు చిన్న, స్థానిక పత్రికల్లో
రాయడం మొదలుపెట్టారు. అటు పెద్దపత్రికైనా, చిన్నపత్రికైనా సోషల్ మీడియాలో మరలా ప్రాచుర్యంలోకి తెచ్చుకున్నప్పుడే ఎక్కువ
మందికి తెలిసే అవకాశం ఉంది. ఆ విధంగా కరోనా స్థానికపత్రికలకు ఒక మేలు చేసిందనే
చెప్పాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నాననంటే భూతం ముత్యాలు గారు గానీ, వేము రాములుగారు
గానీ పెద్ద, చిన్న భేదం లేకుండా
అన్ని పత్రికల్లోనూ రాస్తున్నారు. మరీ ముఖ్యంగా చిన్న పత్రికల్లో రాయడం వల్ల రచయిత
రాసిన దానికి ఎడిటింగ్ అవసరం లేకుండా వ్యాసం లేదా కవిత ఏదైనా పూర్తిగా ప్రచురణ
అవుతుంది. ఫలితంగా ఈ వ్యాసాలన్నీ
ముందుగా పత్రికలలో ప్రచురణ పొందాయి. ఇప్పుడు పుస్తక రూపంలోకి వచ్చి అన్ని వర్గాల పాఠకులను ఆకట్టుకోబోతున్నాయి.
వేము రాములుగారు సూరి నవలపై రాసిన వ్యాసంలో నవలను ముందుగా పరిచయం
చేశారు. ఆ తర్వాత నవల లోని పాత్రులను, రెండుతరాల దళిత భూస్వాముల జీవితాలను వర్ణించిన తీరుతెన్నులను చక్కగా
పట్టుకోగలిగారు. నవలలోని శైలిని గురించి ఆయన వ్యాఖ్యానిస్తూ పాఠకులకు ఆ శైలి
కొంత ఇబ్బందికరంగానే ఉంటుందని చెబుతూనే తెలంగాణ భాషలో రాసినందుకు రచయితను అభినందించటం వేమురాములుగారి పరిశీలనా
దృష్టికి నిదర్శనం. సూర నవలలో అంబేద్కరిజం ప్రతిపాదింపబడిందని, దళితులు చదువుకోవడం వల్లనే తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి వీలు కలుగుతుందని
ఆ నవల ప్రతిపాదించిందని నవల ముఖ్య ఉద్దేశాన్ని మేము రాములు పట్టుకోగలిగారు. సూర
నవల నేను కూడా చదివాను. ఒక జాతీయ సదస్సు (శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి వారు 24 .10.2018 సంవత్సరంలో
నిర్వహించిన సదస్సులో) ఆ స్త్రీ పాత్రల గురించి నేను కూడా ప్రస్తావించాను.
''భూతం ముత్యాలు ‘సూర’(2004) లో మాల కులానికి చెందిన చెన్నడు కొడుకు సూరడు. తల్లిదండ్రులతో పాటు పట్నం వచ్చేసి, అక్కడే
చదువుకుంటుంటాడు. కొన్నాళ్ళ తర్వాత తమ ఊరికి చెందిన పెద్దదొర కూతురు జయలక్ష్మి ఆ
కళాశాలలో చేరుతుంది. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళిద్దరి మధ్యా పరిచయం ప్రేమగా
మారుతుంది. వాళ్ళిద్దరూ పెళ్ళిచేసుకుంటారు. చదువుకున్న సూరడుకి ఊరిలో పెత్తందారులు
భయపడుతూ, ప్రత్యక్షంగా ఏమీ చేయలేకపోయినా పరోక్షంగానైనా ఎలాగోలా అతడ్ని చంపెయ్యాలని
చూస్తారు. మైసమ్మ పండుగ నాడు ఊరంతా ఉత్సవాల్లో మునిగి ఉంటారనీ, అదే సమయంలో సూరడిని
మాయం చేసి చంపాలని పటేలు నాగిరెడ్డి ప్రణాళిక వేస్తాడు. దాని ప్రకారమే తన మనుష్యుల
చేత కత్తులతో దాడిచేయిస్తాడు. ఆ డప్పుల హోరులో సూరడి భార్య తన భర్తని రక్షించమని
అరిచే అరుపులు ఎవరికీ వినిపించవు. పండగ జరుపుకుంటున్న జనానికి జయమ్మ ఆ వార్త
తెలపడంతో, ఎలాగోలా కొంతమంది ఆడవాళ్ళే (చంద్రి, జయలక్ష్మి, ఝాన్సీ) అతడిని ఆసుపత్రిలో చేరుస్తారు. ఈ లోగా
మరొకరెవరో నాగిరెడ్డిని చంపేశారనే వార్త తెలుస్తుంది.
‘సూర’లో కులాంతర వివాహాల గురించి చిత్రించినా, దానివల్ల వచ్చే పరిణామాల్ని పరోక్షంగా చెప్పేప్రయత్నం
చేశాడు రచయిత. కానీ, కులాంతర వివాహాలు చేసుకున్న తర్వాత వెంటాడే భయాన్ని, అందని సహకారాన్ని
వాస్తవికంగా చిత్రించాడు రచయిత'' అని రాశాను.(చూడు: ఔచిత్యమ్, అంతర్జాల మాసపత్రిక, అక్టోబరు, 2020)
ఇప్పుడు వేము రాములుగారు రాసిన వ్యాసం చదువుతుంటే మొత్తం సూర నవల అంతా మరోసారి
గుర్తుకొచ్చింది. నిజంగా ఆ నవల సారాంశాన్నీ, పాత్రలనూ, ఆ
వస్తువైవిధ్యాన్నీ ఈయన బాగా సమీక్షించారు.
రాములుగారు ముత్యాలుగారి 'మాలపల్లె' కథలు గురించి ఎంతో
లోతుగా, చక్కని శైలితో
రాశారు. ఈ కథల్లో కూడా అంబేద్కర్ ఆశయాల్ని రచయిత భూతం ముత్యాలుగారు ప్రతిఫలించేలా
రాశారని కొనియాడారు. దళితులు అవసరమైతో తమని తాము కోల్పోయినా మోసం మాత్రం చేయరని
చేసే ప్రకటనాత్మక వాక్యాలు స్పూర్తిదాయకంగా ఉన్నాయి. అలాగే, ముత్యాలు గారు
రాసిన 'బేగరి కథలు'లో గల సామాజిక
అంశాల్నీ జాగ్రత్తగా విశ్లేషించారు. వీటితోపాటు బుగాడ, దగ్ధం కథలను కూడా
చక్కగా విశ్లేషించారు. ఈ అంశాల్ని చదువుతుంటే మూలకథలను చదవాలనే
కుతూహలం కలిగించేలా రాశారు. భూతం ముత్యాలుగారు రాసిన నవల, కథలతో పాటు ఆయన రాసిన
కవిత్వం, ఇతర సాహిత్య ప్రక్రియల
గురించి కూడా రాములుగారు ఒక పరిశోధన గ్రంథంలా ఒక వ్యాసంలో వివరించారు.
భూతం ముత్యాలుగారి సాహిత్యంపై ఒక చక్కని అవగాహన కలగడానికీ, ఆయన్ని ఒక
సాహితీవేత్తగా మరింతమంది తెలుసుకోవడానికీ ఈ వ్యాసాలన్నీ ఎంతగానో తోడ్పడతాయి. వేము రాములుగారు ఏ సాహిత్య
ప్రక్రియనెలా సమీక్షించాలో అలా ఎంతో ఔచిత్యంతో సమవీక్షణం చేశారు. అప్పుడే
వ్యాసాల్ని రాస్తున్న ఔత్సాహిక వ్యాసరచయితలకు వ్యాసం రాయడమెలాగో తెలుసుకోవడానికి
ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. వ్యాసాలన్నింటి సారాంశాన్ని చూస్తే, సహృదయులందర్నీ భూతం ముత్యాలుగారి రచనల్లోని తత్వాన్ని తెలుసుకోమని
వేమురాములుగారు ఉద్బోధించారని స్ఫష్టమవుతుంది.
ముత్యాలుగారు దళితుల్లోని మాల ఉపకులం కేంద్రంగా తన రచనలు చేసినా, అవన్నీ దళిత
సమస్యలుగా సాధారణీకరించిన విధానాన్ని రాములు గారు ఏకసూత్రతతో నిరూపించే లా రాశారు.
ఇక్కడే వేమురాములుగారొక మేథావిలా కనిపిస్తారు. ఈ వ్యాసాలన్నీ విడివిడిగా ముందు
పత్రికల్లో రావడం వల్ల భూతం ముత్యాలు గారి పరిచయంలో ఆయన రచనలు అక్కడ విడివిడిగా
వ్యాసాల్లో పాఠకులకు మంచి అవగాహన కలిగిస్తాయి. కానీ, ఆ వ్యాసాలన్నీ ఒకేచోట పుస్తకంగా వేసేటప్పుడు కొన్ని
అంశాలు పునరావృతమైనట్లు అనిపిస్తాయి. కొన్ని స్టేట్మెంట్స్ విషయంలోను, కొంచెం శైలి పట్లా
మరింత దృష్టి పెడితే వేము రాములుగారు ఒక ఉత్తమ విమర్శకుడుగా రాణించే అవకాశాలు
మెండుగా ఉన్నాయి. ఈ వ్యాసాల్లోనే సహృదయ విమర్శకుడుగా తన పయనాన్ని మొదలు పెట్టినట్లు
పాఠకులు గుర్తిస్తారు. భూతం ముత్యాలుగార్కి వేము రాములుగారు దొరకడం ఒక అదృష్టం.
భవిష్యత్తులో ఇరువురూ తెలుగు సాహిత్యలోకానికి తమదైన రీతిలో మరిన్ని రచనలను
అందించాలని ఆకాంక్షిస్తున్నాను. వ్యాసకర్త వేమురాములుగార్ని హృదయపూర్వకంగా
అభినందిస్తున్నాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి