"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

28 డిసెంబర్, 2017

‘సామాజిక ప్రయోజనమే కవిత్వ ప్రయోజనం’ -ప్రముఖ కవి నిఖిలేశ్వర్ ఉద్ఘాటన

శ్రీ త్యాగరాయ గానసభహైదరాబాదులో  గత నెల బుధవారం (27.12.2017 ) విమల సాహితీ సమితి ఆధ్వర్యంలో  ప్రముఖకవులతో అతిరథకవుల అరుదైన కవి సమ్మేళనం జరిగింది. ఈ కవి సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత కె. శివారెడ్డి మాట్లాడుతూ పరిణతి చెందేకొద్దీ చిక్కదనంతో పాటు, బలమైన అభివ్యక్తితో కవిత్వం వస్తుందన్నారు. కవిత్వంలో అనవసరమైన శబ్దాలు తగ్గడం వల్ల తక్కువ నిడివితోనే మంచి కవిత్వాన్ని వర్ణించవచ్చునన్నారు. నిజమైన కవికి వస్తువు కోసం ప్రాకులాడవలసిన పనిలేదనీ, తన చుట్టూ ఉన్న సమాజమే నిజమైన వస్తువు అని పేర్కొన్నారు. అయితే కవిత్వానికి వస్తువే ముఖ్యమని గుర్తించాలని హితబోధ చేశారు. 
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుని సత్కరిస్తున్న కె.శివారెడ్డి, బైస దేవదాస్, నిఖిలేశ్వర్, జల్డి విద్యాధరరావు, రమణ వెలమకన్ని, వెంకటదాసు తదితరులు
సభలో మాట్లాడుతున్న బైస దేవదాస్
అతిధులుగా పాల్గొన్న  నేటి నిజం పత్రిక సంపాదకుడు శ్రీ బైస దేవదాస్ మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న తర్వాత కవులమని చెప్పుకునేవాళ్ళు చేసే పనులు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయనీ, తన కవిత కాకపోయినా తనకు డబ్బులిస్తుంటే కవిత్వం చదవడానికి ఎగబడ్డం చూశానని, అకవులు ఎంతో మంది కవులుగా చెలామణి అయ్యారని, కానీ ఈ కవి సమ్మేళనంలో అందరూ కవిత్వం కోసమే వచ్చిన కవులని ప్రశంసించారు. ఈ కవిసమ్మేళనంలో ప్రతి కవి సామాజిక బాధ్యతతో కవిత్వం రాసినవాళ్లేనని వ్యాఖ్యానించారు.

కవిత్వం వింటున్న ప్రముఖ కవులు, శ్రోతలు

 దిగంబర కవుల్లో ఒకరైన ప్రముఖకవి నిఖిలేశ్వర్ మాట్లాడుతూ కవికి సామాజిక స్పృహ ఎంతో ముఖ్యమన్నారు. సభకు రమణ వెలమకన్ని అధ్యక్షత వహించగా, ప్రముఖ కవి పెద్దూరి వెంకటదాసు కవిసమ్మేళనం నిర్వహించారు. విమల సాహితీ సమితి ఆధ్యక్షుడు ప్రముఖ కవి జెల్డి విద్యాధరరావు సభకు స్వాగతం పలికారు.కవిసమ్మేళనంలో ప్రముఖ కవులు సుగుమ్ బాబు, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఆశారాజు, డా. ప్రసాదమూర్తి, డా.బిక్కి కృష్ణ, డా. చిల్లర గంగాభవాని, శ్రీమతి శైలజామిత్ర, డా.ఏనుగు నరసింహారెడ్డి, మౌనశ్రీ మల్లిక్ తదితరులు కవిత్వాన్ని చదివి వినిపించారు. సభల్లో పాల్గొన్న వారిని, కవులను విమల సాహితీ సమితి అధ్యక్షుడు కవి, జెల్డి విద్యాధరరావు, శ్రీత్యాగరాయ గానసభ అధ్యక్షుడు శ్రీ కళా.వి.జనార్థనమూర్తి సంయుక్తంగా సత్కరించారు.
శ్రీ త్యాగరాయ గానసభలో 27.12.2017 తేదీన జరిగిన కవి సమ్మేళనంలో పాల్గొని కవిత్వం చదువుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు.
శ్రీ త్యాగరాయ గానసభలో 27.12.2017 తేదీన జరిగిన కవి సమ్మేళనంలో పాల్గొని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు కవిత్వాన్ని  వింటున్న కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత కె.శివారెడ్డి, నేటినిజం పత్రిక సంపాదకుడు శ్రీ బైసా దేవదాస్, ప్రముఖకవి నిఖిలేశ్వర్ తదితర కవులు.

శ్రీ త్యాగరాయ గానసభలో 27.12.2017  వతేదీన  జరిగిన కవి సమ్మేళనంలో పాల్గొని కవిత్వం చదివిన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుని సత్కరిస్తున్న కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత కె.శివారెడ్డి, నేటినిజం పత్రిక సంపాదకుడు శ్రీ బైస దేవదాస్, ప్రముఖకవి నిఖిలేశ్వర్ తదితర కవులు.
కవి సమ్మేళనం కరపత్రం










23 డిసెంబర్, 2017

ప్రజల్లో చైతన్యం, ప్రభుత్వ విధివిధానాల్లో మార్పుల వల్లే తెలుగు భాషాభివృద్ధి

ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించిన ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావుగారు
తెలుగు భాషామాధ్యమంలో విద్యాబోధన కొనసాగాలన్నా, తెలుగులో చదువుకున్నవాళ్లకు ఉపాధి అవకాశాలు లభించాలన్నా ప్రజల్లో చైతన్యం, ప్రభుత్వ విధివిధానాల్లో మార్పులు రావడం వల్లనే సాధ్యమవుతుందని సోమవారం (18 డిసెంబరు 2017) అబిడ్స్ లోని హైదరాబాదు విశ్వవిద్యాలయ ప్రాంగణం ‘గోల్డెన్ త్రెషోల్డ్ లో జరిగిన చర్చాగోష్ఠిలో వక్తలు పేర్కొన్నారు. అనువర్తిత భాషాశాస్త్ర అనువాద అధ్యయనాల కేంద్రం (CALTS)హైదరాబాదు విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భాన్ని పురస్కరించుకొని ఈ చర్చాగోష్ఠి జరిగింది. కాల్ట్స్ విభాగాధిపతి ఆచార్య రాజ్యరమ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 
సమావేశ లక్ష్యాలను వివరిస్తున్న ఆచార్య రాజ్యరమగారు
మాతృభాషగా తెలుగు మాధ్యమం అమలు, భాషా ప్రణాళిక, తెలుగు కంప్యూటరీకరణ, వివిధ సాంకేతిక సమస్యలపై ఈ సమావేశంలో చర్చించి, ఆ సారాంశాన్ని తెలుగు భాషావేదిక ద్వారా భాషాశాస్త్రవేత్తలకు, ప్రభుత్వానికి నివేదించడానికి ఉపకరించడమే దీని లక్ష్యమని తెలుగు భాషా గోష్టి లక్ష్యాలను ఆచార్య రాజ్యరమ ప్రకటించారు.
సమావేశంలో మాట్లాడుతున్న ఆచార్య రెడ్డిశ్యామల గారు

తెలుగు పాఠ్యాంశాల్ని రూపొందించేటప్పుడు పాఠ్య నిర్ణాయక సభ్యులుగా తామెంతో లోతుగా ఆలోచించవలసి వచ్చేదనీ,  తెలుగు ఒక అంశంగా కొనసాగడానికీ, తెలుగు భాషామాధ్యమంగా కొనసాగడానికీ మధ్య వ్యత్యాసం ఉందనీ ఈ సమావేశంలో ఆత్మీయ అతిథిగా పాల్గొన్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం భాషాశాస్త్ర అధ్యాపకురాలు ఆచార్య రెడ్డి శ్యామల అన్నారు. తెలుగు అమలుకి కొన్ని సమస్యలున్నాయనీ, తగిన నిఘంటువులు, పారిభాషిక పదకోశాలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్కొక్కసారి తెలుగు మీడియంలో చదివితే ఎదుర్కునే సమస్యలకు ఇంటిలోని సభ్యులు అడిగే ప్రశ్నలకే కొంత స్థాయిలో సమాధానం చెప్పినా, పూర్తివాళ్ళనే సంతృప్తిపరచలేకపోతున్న పరిస్థితి కనిపిస్తుందని కొన్ని ఉదాహరణలను వివరించారు. పాలకుల విధాన నిర్ణయాలు తెలుగుభాష అమలులో కీలకమైన పాత్రను పోషిస్తాయని ఆమె పేర్కొన్నారు.
            తెలుగు భాషా మాధ్యమం అమలులో అనేక సమస్యలున్నాయి. తెలుగు విశ్వవిద్యాలయంలోనే తమకెన్నో అటంకాలు ఎదురయ్యాయని, అయినప్పటికీ కొన్ని ప్రాజెక్టులు పూర్తిచేశామని ప్రసిద్ధభాషాశాస్త్రవేత్త ఆచార్య అయినవోలు ఉషాదేవి వివరించారు. 


సమావేశంలో మాట్లాడుతున్న ఆచార్య అయినవోలు ఉషాదేవి గారు

భాషారాష్ట్రాలు ఏర్పడకముందే కొమర్రాజు లక్ష్మణరావు, సురవరం ప్రతాపరెడ్డి వంటివాళ్ళెంతోమంది రకరకాల శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించిన పుస్తకాలు రావడానికి కృషిచేశారన్నారు. కొంతమంది తాము పుట్టి పెరిగిన ప్రాంతం తెలుగే అయినప్పటికీ అది తమ భావాల్ని సమర్థవంతంగా వ్యక్తీకరించలేకపోతున్నామనేవాళ్ళున్నారనీ, అలాంటి వాళ్ళలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా విద్యావిధానాన్ని ప్రవేశపెట్టడంలో విశేషమైన కృషి చేసిన డా.రామిరెడ్డి లాంటివాళ్ళున్నారు. దానికి కారణాల్ని మనం అన్వేషించాలి. మాధ్యమానికి కావాల్సిన సరుకుని తయారుచేసుకోవాలి. తెలుగు మాధ్యమంలో భాషాబోధన జరగాలంటే ప్రభుత్వం పూనుకోవాలి. వాటికి కావలసిన నిఘంటువులు, పారిభాషిక పదకోశాలు కావాలి. మనం తయారుచేయాలి. నేను చదువుకునే రోజుల్లో ‘వాక్కాయ’ అనేపదం వచ్చింది. నాకు తెలియలేదు. దాన్ని తెలంగాణాలో ‘కలింకాయ’ అంటారు. అలాంటి పదాల్ని నిఘంటువుల్లో అందించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పదాలు కథల్లోను, కవితల్లోను  మనం మాట్లాడే తెలుగు భాషలోనే రాసుకోవాలనే గురజాడ అసమ్మతి పత్రం రాశారనీ గుర్తుచేశారు. మనం చాలా వరకు వాళ్ళ ప్రాంతాల్ని బట్టి గొప్పతనాన్ని ఆపాదించడం సరైందికాదని చెప్పారు.

శ్రీ సురేశ్ కొలిచాల, ఆచార్య దార్ల వెంకటేశ్వరారావు, ఆచార్య రాజ్యరమ గార్లు చిత్రంలో ఉన్నారు.
            ఆచార్య రాజ్య రమ మాట్లాడుతూ చేకూరి రామారావు,  కె.కె.రంగనాథాచార్యులు, భద్రిరాజు కృష్ణమూర్తి మొదలైన వారి ప్రభావం వల్ల భాషాశాస్త్రంలోకి వచ్చాను. తెలుగు భాషకు సంబంధించినదాన్నే ఆంగ్లంలో పరిశోధన చేశానని, తర్వాత నాకు ఉమామహేశ్వరరావుగారిచ్చిన ప్రోత్సాహాన్ని మరిచిపోలేనని అన్నారు. తెలుగు మాధ్యమం గురించి మనం చర్చించుకుంటున్నాం. దాన్ని ప్రభుత్వం అమలుచేస్తే గనుక, దాని విధివిధానాల్ని మనం రూపొందించుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు, ప్రయివేటు పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమంలో చదివిన వాళ్ళు ఎంతో విజయపథంలో పయనిస్తున్నారు. దీనికి కారణం ప్రణాళికలేనని స్పష్టమవుతుంది. ప్రభుత్వం అవకాశం కల్పిస్తే, దాన్ని మనం అమలు చేసుకోవాలా? లేక ప్రభుత్వం తెలుగు మాధ్యమానికి అవకాశం కల్పించకపోతే దాన్నెలా సాధించుకోవాలి? దీనికి మనమెలాంటి ప్రయత్నాలు చెయ్యాలి? వంటివన్నీ మనం ఈ గోష్టిలో నిర్ణయించుకోవాలి. ఒక వేళ మనం ఇప్పుడే పూర్తిస్థాయిలో తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెడితే దానికి కొన్ని సాధకబాధకాలున్నాయనిపిస్తుంది. ఆంగ్ల మాధ్యమంలో ఉన్నవాళ్ళస్థాయిలో మనం తెలుగు మాధ్యమంలో బోధించగలమా? బోధనకు కావలసిన పారిభాషికపదాలు, అనువాద గ్రంథాలు వంటివన్నీ ఉన్నాయా? అనేవన్నీ నాకు అనుమానాలనిపిస్తున్నాయి. వీటితో పాటు అంతర్జాలంలో తెలుగు భాషా వాడుక గురించి జరుగుతున్న చర్చల్ని చూస్తుంటే తెలుగుభాషకు ఉజ్జ్వలమైన భవిష్యత్తు ఉందనిపిస్తుంది. మనం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమంలో పాఠ్యాంశాల్ని బోధిస్తున్నామంటున్నా, నిజానికి చాలా చోట్ల తెలుగులోనే వాళ్ళకు పాఠాలు చెప్తున్నారు. అప్పుడది ఆంగ్లమాధ్యమం అవుతుందా? తెలుగు మాధ్యమం అవుతుందా? ఇవన్నీ తనకెంతో గందరగోళాన్ని కలిగిస్తున్నాయని వీటి గురించి లోతుగా చర్చించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న సురేశ్ కొలిచాల గారు

అమెరికా నుండి ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనడానికి వచ్చిన ఈమాట అంతర్జాజాల మాసపత్రిక వ్యవస్థాపకులు, ప్రముఖ భాషావేత్త సురేశ్ కొలిచాల  ఈ చర్చాగోష్ఠిలో విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. తెలుగు భాష కూడా ఆర్థిక భాషగా మారనంతవరకు ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు ఈ భాషను పట్టించుకోవడం సాధ్యంకాదన్నారు. ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోయే భాషల్లో తెలుగు ఉండకూడదని కోరుకునేవాళ్ళంతా ముందుగా తెలుగు భాషను అన్నిరంగాల్లోను వాడుకోవడానికి ప్రజల్ని చైతన్యవంతం చేయాలన్నారు. అమెరికాలోని కొన్ని సాప్ట్వేర్ సంస్థల్లో తెలుగువాళ్లు అత్యధికంగానే ఉన్నప్పటికీ, తెలుగు భాషను కొన్నింటిలో చేర్చలేకపోవడానికి దాని వాడుక తక్కువగా ఉందని గుర్తించడమేనన్నారు. సురేశ్ కొలిచాల మాట్లాడుతూ తాను ప్రత్యేకించి భాషాశాస్త్ర చదువుకోలేదనీ, కంప్యూటర్ ఇంజనీర్ గా ఉన్నా, సాహిత్యాభిలాషితో ‘ఈమాట’ అంతర్జాల పత్రికను 1998లో ప్రారంభించాం. అప్పుడే యూనికోడ్ గురించి ఆలోచించాం. ఈ శతాబ్ది అంతానికి చాలా భాషలు అంతరించిపోతాయని, అలాంటి అంతరించిపోయే భాషల్లో తెలుగు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని సురేశ్ కొలిచాల అన్నారు. తెలుగులో రాసే వాళ్ళున్నా ప్రచురించే పత్రికలు మూత పడిపోతున్నాయని గమనించాం. ఇంగ్లీష్ తో పోటీ పడాలంటే తెలుగులో మంచి పత్రికను తీసుకొని రావాల్సిన అవసరం ఉందని భావించి ఈమాట అంతర్జాల పత్రికను ప్రారంభించాం. తెలుగులో మొట్టమొదటిసారిగా అంతర్జాలంలో ఈమాట అనే పత్రిక ద్వారా డైనమిక్, యూనికోడ్ లిపుల ద్వారా తెలుగు భాషలో పత్రికను నడిపేవాళ్ళమని వివరించారు. యూనికోడ్ కోర్ కమిటీలో తాను కూడా ఒక సభ్యుడిగా ఉండి తెలుగు యూనికోడ్ భాష కావడానికి తన కృషి, తన మిత్రుల కృషి  కూడా ఉందని చెప్పారు. అమెరికాలోని ప్రిన్సిటన్  విశ్వవిద్యాలయంలో తొలిసారిగా ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారిని 1999లో కలుసుకున్నానని, అప్పటినుండి భాషా శాస్త్రం పై ఆసక్తిని పెంచుకున్న అని ఆయన వివరించారు. 
సమావేశంలో పాల్గొన్న సభ్యులు
అంతకుముందు వరకూ భద్రిరాజుకీ బూదరాజుకీ  మధ్య తేడా కూడా తనకు తెలియదని చెప్పారు.  ఆచార్య రాజ్యరమ గారు మాట్లాడుతూ తాను పాల్గొన్న అంతర్జాల సమావేశాన్ని చూసిన తర్వాత తెలుగుభాష అంతరించి పోవటం లేదని ఆశాభావం కలుగుతుందని అనిపిస్తుందని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరువేల భాషల్లో తొంబై శాతం భాషలు అంతరించి పోతాయని భాషాశాస్త్ర వేత్తలు అంటున్నారు. భారతదేశంలో కూడా హిందీవల్ల అనేక భాషలు అంతరించి పోయాయని గణాంకాలు చెబుతున్నాయి. అలా ప్రపంచ  అనేక భాషలు అంతరించిపోయే అవకాశం ఉందని అంటున్నారు. అలా మిగిలి భాషలలో ఒక పది భాషలు మాత్రమే ఉండవచ్చని వహిస్తున్నారు. అంతరించిపోయే 10 భాషలలో తెలుగు భాష ఉండాలా లేదా అనేది ప్రభుత్వ విధానాలు, ప్రజల చైతన్యం, ప్రజల ఆలోచనలు నిర్ణయిస్తాయని అన్నారు. అంతరించపోకుండా మిగిలే భాషల్లో తెలుగు భాష కూడా ఉండాలంటే ఆరు అంశాలు ప్రధానమైన పాత్రను నిర్వహిస్తాయన్నారు. వాటిలో భాష ఆర్థిక భాషగా మారడం ప్రధానమని అన్నారు. వినియోగదారులు తాము కొనే ఉత్పత్తులపై  తమ భాష ఉన్నప్పుడు మాత్రమే ఆ ఉత్పత్తులను కొనడానికి ముందుకు రావడం భాష ఆర్థిక భాషగా మారడానికి దోహదం చేసే ఒక ప్రధాన అంశం. ప్రకటించలేదు తమ సాఫ్ట్వేర్ కంపెనీలలో భాష వాడుక కు సంబంధించి లోతైన మార్కెట్ పరిశీలన చేస్తాయని, అలా ఫిన్లాండ్   చిన్న దేశమైనప్పటికీ ఆ దేశ ఫినిష్ భాష ఆర్థిక భాషగా మారగలిగిందన్నారు. భాష ఆర్థిక భాషగా మారడానికి  ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థల సహకారం, ప్రజల చైతన్యం ఎంతో అవసరం అన్నారు. తమది తెలంగాణ లోని జగిత్యాల్లో పుట్టిన వాడినేనని, తమ బంధువుల్లో స్త్రీలు కొంతమంది ఉన్నత చదువులు పూర్తి చెయ్యలేకపోవడానికి తమ మాతృభాషలో విద్యాబోధన లేకపోవడమేనని వివరించారు. 
సమావేశంలో పాల్గొన్న సభ్యుల గ్రూపుఫొటో
ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో ప్రజలు తమ మాతృభాషగా తెలుగు చదువుకుంటున్నారు, కానీ వాళ్ళ ఇంటి భాష గోండి. మరెందుకు తెలుగు అని చెప్తున్నారనేది గమనించాలి. ఆ భాష లో మాట్లాడితే తమని తక్కువగా చూస్తారేమోననే న్యూనతా భావమే కారణం. తాము కూడా చాలా కాలం వరకూ గుంటూరు, కోస్తా జిల్లాల భాషలో మాట్లాడకపోతే గుర్తించరేమోననే భావన ఉండేదన్నారు. కొన్ని సామాజిక వర్గాలు తెలుగులో చదువుకుంటే తమకు ఉద్యోగాలు రావని భయపడ్డంలో తప్పులేదనీ, దానికి ప్రస్తుత ప్రభుత్వ  విధానాలే కారణమవుతున్నాయన్నారు. కానీ, నిజానికి ఆంగ్ల మాధ్యమంలో చదివితేనే ఉద్యోగాలనీ, ఉద్యోగాలు వస్తాయని అనుకుంటున్నారు. వాస్తవానికి సినిమా వంటి రంగంలో తెలుగు మాట్లాడే వాళ్ళే ఎక్కువ కనిపిస్తారని చెప్పారు.


సమావేశంలో మాట్లాడుతున్న ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావుగారు
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ భాషాశాస్త్రవేత ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు హాజరైయ్యారు. ప్రజల ఆకాంక్షల్ని ప్రభుత్వాలే నెరవేర్చవలసి ఉంటుందని, దానికి ముందుగా ప్రజలు తమకేమి కావాలో ప్రభుత్వానికి తెలియజేయాలని, అలా తెలియజేయాలంటే ముందుగా ప్రజలకు తమ మాతృభాష ప్రాధాన్యం, దానివల్ల దేశాభివృద్ధి జరుగుతున్న తీరుతెన్నుల పట్ల లోతైన అవగాహన ఉండాలన్నారు. మాతృభాషలో చదువుకుంటే సమగ్రంగా అవగాహన అవుతుందని ప్రముఖ భాషాశాస్త్రవేత్త ఆచార్య గారపాటి ఉమా మహేశ్వర రావు అన్నారు.  సెంట్రల్ యూనివర్సిటీలతో సహా తమ మాతృ భాషలో పరీక్షలు, సిద్ధాంతం గ్రంథాలు రాయనివ్వాలన్నారు. ఆంగ్లం లో రాయడం వల్ల నేటికీ అక్షర దోషాల్ని దిద్దేపరిస్థితి వస్తుందన్నారు. కొరియా వంటి దేశాల్లో తమ మాతృభాషలోనే ఉన్నత విద్యాబోధన కూడా జరుగుతుంది. అందువల్ల వారిలో విషయ నైపుణ్యం పెరుగుతుందన్నారు. సృజనాత్మకంగా ఆలోచించగలుగుతున్నారని అన్నారు. తెలుగు భాషకు సంబంధించిన పారిభాషిక పదాల గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన పనిలేదనీ, అవసరాలను బట్టి అప్పటికప్పుడు ఆ పారిభాషిక పదాలు కూడా తయారవుతుంటాయని అన్నారు. ముందుగా తెలుగు భాష మాతృభాషగా, తెలుగు భాష మాధ్యమంగా అమలు చేయాలనే కృతనిశ్చయం, దానికి సంబంధించిన అవగాహన మనలో కలగాలన్నారు. ఒక్కొక్క సభ్యుడు ఒక్కొక్క సైనికుడిలా మారగలగాలనీ, ఆ దిశగా ముందుగా చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని ఉద్బోధించారు.

సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుగారు

హైదరాబాదు విశ్వవిద్యాలయం తెలుగు విభాగానికి చెందిన ప్రముఖకవి, విమర్శకుడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు సమావేశానికి అధ్యక్షత వహించి వక్తల ప్రసంగాల్ని, సభ్యుల చర్చను సమన్వయం చేశారు. చర్చలో డా.క్రిష్టాఫర్, పరిశోధక విద్యార్థులు మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

 ఫోటోల సౌజన్యం : ఎం.చంద్రమౌళి, మసాన్, పరిశోధక విద్యార్థులు, హైదరాబాదు విశ్వవిద్యాలయం. 

13 డిసెంబర్, 2017

ప్రపంచ మహాసభల తెలుగు భాషా చైతన్య ర్యాలి (12-12-2017)

తెలుగు భాష, దాని ఔన్నత్యం, తెలుగు వారి సంస్కృతుల వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడమే ప్రపంచతెలుగు మహాసభల ఆశయమని, తెలుగు మాతృభాషగా ఉన్న ప్రతి ఒక్కరు తెలుగు భాషావ్యాప్తికి తోడ్పడాలని, అందుకు ఈ భాషా చైతన్య ర్యాలీ ఎంతగానో ప్రేరణనిస్తుందని హైదరాబాద్ విశ్వవిద్యాలయం, డిప్యూటి డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఉద్భోదించారు. శేరిలింగంపల్లి, కొత్తగూడలోని సఫిల్ నగర్ లో గల న్యూబ్లూమ్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో జరిగిన తెలుగు భాషా చైతన్య ర్యాలిని ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మంగళవారం (12-12-2017) ఉదయం జెండా ఊపి ప్రారంభించారు.  పాఠశాల కరస్పాండెంట్ శ్రీ యు.కిరణ్ గారి అధ్యక్షతన జరిగిన ర్యాలి ప్రారంభ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మాతృభాషలు, దానిలో తెలుగు భాషావైశిష్ట్యాన్ని, అది కుటుంబం, స్థానిక ప్రజలు, పాలనతో ఎలా ముడిపడి ఉందో సోదాహరణంగా వివరించారు.(ప్రసంగ సంక్షిప్త రూపాన్ని కింద వేరేగా చదువుకోవచ్చు)  ప్రయివేటు పాఠశాల అయినప్పటికీ తెలుగు భాష గొప్పతనాన్ని చాటేలా ‘తెలుగుభాషా ర్యాలి’ని పాఠశాల యాజమాన్యమే నిర్వహిస్తున్నందుకు వారిని ఆయన అభినందించారు. సమావేశంలో విశిష్ట అతిథిగా ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ తాడిబోయిన రామస్వామి యాదవ్ పాల్గొని తెలుగు భాష ప్రాచీనతను, దానిలోని గొప్పతనాన్ని వివరించారు. తమ విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొనడం తనకెంతో సంతోషంగా ఉందని శ్రీ కిరణ్ అన్నారు. పెద్దసంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానికులు పాల్గొన్నారు. తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేస్తూ స్థానిక వీధుల్లో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. 





ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ప్రసంగం పూర్తి పాఠం
తెలుగు భాషా చైతన్య ర్యాలీని నిర్వహిస్తున్న న్యూ బ్లూమ్ ఉన్నత పాఠశాల, సఫిల్ నగర్, కొత్తగూడ యాజమాన్యాన్ని, ముఖ్యంగా పాఠశాల కరస్పాండెంట్ శ్రీ కిరణ్ గార్ని అభినందిస్తూ, నమస్కరిస్తున్నాను. ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా నా పేరుని సూచించిన ప్రముఖ సామాజిక సంఘసంస్కర్త శ్రీ తాడిబోయిన రామస్వామి యాదవ్ గార్కి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ర్యాలీ ప్రారంభానికి ముందు జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొని తెలుగు భాషా వైభవాన్ని గుర్తుచేసేలా చైతన్య పరుస్తూ మంచి మాటలు చెప్తున్న పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు, దీనిలో భాగస్వాములైన విద్యార్థినీ విద్యార్థులకు, సిబ్బందికీ, స్థానిక ప్రజలకు నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
            మనలో కొంతమంది పొద్దున్నే‘గుడ్ మార్నింగ్’ అని పలకరించుకుంటాం కదా! తెలుగులో దాన్నే మంటారు? ‘‘శుభోదయం’’.  అందుకే మీ అందరికీ శుభోదయం.
            ఇప్పటి దాకా మనం మీలో కొంతమంది పాడిన పాటల్ని విన్నాం. కవితల్ని విన్నాం. కొంతమంది ఎంత మంచి సూక్తుల్ని చెప్పారు. ఇవన్నీ మనకి వెంటనే చక్కగా అర్థమయ్యాయి. మనం నిత్యం మాట్లాడుకునే తెలుగులో ఉండడం వల్లనే కదా మనకి బాగా అర్థమయ్యాయి.  బహుశా ఇక్కడున్న వాళ్లందరం మనింట్లో తెలుగులోనే మాట్లాడుకుంటాం కదా. పొద్దున్న లేచినది మొదలు పడుకునే వరకూ మన చుట్టుపక్కల వాళ్ళందరితోనూ ఎక్కువగా తెలుగులోనే మాట్లాడుకుంటున్నాం. అలాంటి తెలుగు భాషలోని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికే మన ప్రభుత్వం ‘ప్రపంచ తెలుగు మహాసభలు’ నిర్వహిస్తుంది. మనకున్న సాంస్కృతిక వారసత్వాన్ని, మారుతున్న జీవన విధానాన్ని, మారాల్సిన పరిస్థితుల్నీ చర్చించుకోవడానికే మనం ప్రపంచ మహాసభల్ని నిర్వహించుకుంటున్నాం. మన ముఖ్యమంత్రి గౌరవనీయులు కె. చంద్రశేఖరరావుగారు స్వయంగా తెలుగు భాషాభిమాని. అందువల్ల ఆయనే అనేక సార్లు ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాల్సిన తీరుతెన్నుల్ని చక్కగా పర్యవేక్షించారు. ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియెట్ వరకు తెలుగు మాతృభాషగా అమలు చేయాలనే కృతనిశ్చయంతో కూడా పనిచేస్తున్నారు. మరి మనం కూడా మన తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసేపనిలో భాగస్వాములవ్వాలి కదా... అందుకే ఈ ‘తెలుగు భాషా చైతన్య ర్యాలీ’. దీనిలో పాల్గొంటున్న మీ అందరికీ ముందుగా నా శుభాకాంక్షలు. ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్న ఈ క్రమంలో ఒక ప్రయివేటు పాఠశాల తెలుగు భాష గొప్పతనాన్ని చాటుతూ ఈ విధమైన ర్యాలీని జరపడం ఒక చారిత్రక సందర్భంగా నమోదవుతుంది. దీనిలో పాల్గొన్న మీరంతా ఆ చరిత్రలో ఒకరవుతున్నారు. అందుకు మిమ్మల్ని మరోసారి అభినందిస్తున్నాను.
మనం తెలుగు భాషా చైతన్య ర్యాలీని నిర్వహించుకునే ముందు మన తెలుగు భాష గొప్పతనాన్ని, తెలుగులో చదువుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాల్ని కొంత తెలుసుకోవాలి. అందువల్ల కొన్ని ముఖ్యాంశాల్ని మీకు చెప్తాను. మనం మన మాతృభాషలో చదువుకోవాలి. అప్పుడు మనకి చదువు భారమనిపించదు. ‘మాతృభాష’ అంటే మన అమ్మా, నాన్న, కుటుంబం అంతా మనం పుట్టినప్పటి నుండీ ఏ భాషలో అయితే మాట్లాడుకుంటామో ఆ భాషే మనకి మాతృభాష అవుతుంది. బహుశా ఇక్కడున్న మనందరిదీ తెలుగే మాతృభాష అయి ఉంటుంది. మన మేధావులు కూడా మన జీవన వాస్తవాల్ని దృష్టిలో పెట్టుకొని ‘త్రిభాషాసూత్రాన్ని’ అమలు చేసుకోవాలన్నారు. అంటే మనం ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియెట్ లేదా డిగ్రీ వరకూ మన మాతృభాషా మాధ్యమంలోనే చదువుకోవాలి. దీనితో పాటు భారతదేశంలోని మన సోదర రాష్ట్రాల్లోని అందరితో కలిసి మెలిసి ఉండడానికి హిందీని నేర్చుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న విజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికీ, ఉన్నత చదువులు చదువుకోవడానికీ, ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికీ ఇంగ్లీషు మూడో భాషగా నేర్చుకోవాలి. అదే మన భాషా విధానం. కానీ, కొన్ని పాఠశాలలు, కళాశాలలు ఈ విధానాన్ని పాటించడం లేదు. చిన్ననాటి నుండే ఇంగ్లీషు భాషను కచ్చితంగా నేర్చుకోవాలంటున్నారు. ఇంగ్లీషు మాధ్యమంలోనే ఇతర సబ్జెక్టులన్నీ చదువుకోవాలంటున్నారు. మన తల్లిదండ్రులతో, బంధువులతో, ఉపాధ్యాయులతో, విద్యార్థినీ విద్యార్థులతో ఇంగ్లీషులోనే మాట్లాడాలంటున్నారు. దీనివల్ల మనలో చాలామంది చదువంటే భయపడుతున్నారు. మనం నేర్చుకోవాలనుకున్న ఇంగ్లీషు మన ఇంట్లోవాళ్ళకి తెలయకపోవడం వల్ల మనమేమి చదువుతున్నామో వాళ్ళకు తెలియడంలేదు. మనకేమైనా తెలియకపోతే మనవాళ్లని అడిగి తెలుసుకోలేకపోతున్నాం. దీనివల్ల మన కుటుంబానికీ, మనకీ తెలియని దూరమేదో మనమధ్య ఏర్పడిపోతుంది. ఇప్పటికే చాలామంది ఇంగ్లీషు మాధ్యమంలో చదువుతున్నవాళ్ళు, వాళ్ళకున్న నిబంధనలవల్ల కుటుంబసభ్యులతో మాట్లాడ్డం లేదు. కుటుంబసభ్యులతో, చుట్టుపక్కలవారితో మాట్లాడాలంటే వాళ్ళకొచ్చిన తెలుగుభాషలో మాట్లాడాలి. అలా మాట్లాడొద్దని పాఠశాల, కళాశాల యాజమాన్యాలు సూచిస్తున్నాయి. అందువల్ల మానవసంబంధాలన్నీ విచ్ఛిన్నమైపోతున్నాయి. మన కష్టాన్నో, సుఖాన్నో మనవాళ్ళతో పంచుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది.
ఇంటికెళ్లితే మనం ఎక్కువగా కుటుంబసభ్యులతో గడపాలి. మనం ఇంగ్లీషులోనే మాట్లాడితే మనకొచ్చిన ఇంగ్లీషు వాళ్ళకు రాకపోతే మనతో మాట్లాడ్డానికి ఇష్టపడరు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఎక్కువగా తాతయ్య, నానమ్మ/అమ్మమ్మలతో గడపడానికి ఇష్టపడుతుంటారు. కానీ వాళ్ళకేమో వీళ్లకొచ్చిన ఇంగ్లీషు రాదు. అప్పుడు వాళ్ళు వీళ్ళతో మాట్లాడలేరు. పోనీ ఇరుగుపొరుగువాళ్ళతో మాట్లాడదామన్నా వాళ్ళకీ వీళ్ళకొచ్చిన భాష రాదు. అందువల్ల వీళ్ళెక్కువగా టీ.విలు ముందు కూర్చోవాల్సి వస్తోంది. చేతుల్లో మొబైల్స్ పెట్టుకొని తమకి నచ్చిన వాటిని చూసుకుంటూ గడపేస్తున్నారు. ఇదంతా ఒకవిధంగా కుటుంబంతో కలిసి మెలిసి ఉండాల్సిన వాళ్ళు అందరూ ఉండి కూడా ఒంటరితనంలోకి జారిపోవడానికి కారణమవుతుంది. ఈ ఒంటరితనం క్రమేపీ అనేక మానసిక వ్యాధులకు దారితీస్తుంది.
మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. పెద్దపెద్ద స్కూల్లోనో, కాలేజీల్లోనో ఇంగ్లీషు మీడియంలోనే చదివినవాళ్ళు ఓట్లు అడగడానికి వస్తుంటారు. ఓట్లేసేవాళ్ళకు అందరికీ ఇంగ్లీషు వస్తుందా? అందువల్ల వాళ్లతో మాట్లాడ్డానికి వాళ్ళెంతో ఇబ్డందులకు గురవుతున్నారు. సమస్యలున్నా వాటిని ఒకర్నొకరు స్పష్టంగా వ్యక్తీకరించుకోలేకపోతున్నారు. అందువల్ల ప్రపంచంలో మనం ఎక్కడ చదువుకున్నా మళ్ళీ మనం మన ప్రాంతంలో ఉద్యోగం చేయాలంటే మన భాష రావాల్సిందే. మనల్ని పరిపాలించాలన్నా, మనం మనవాళ్ల ప్రజాప్రతినిథులుగా ఎన్నికవ్వాలనుకున్నా స్థానిక భాష రావాల్సిందే. అప్పుడు మాత్రమే ఆ ప్రజలు, ఆ అధికారులు, ఆ ప్రజాప్రతినిథులు ఒకరికొకరు దగ్గరవుతారు. అలా కానప్పుడు తమనెవరో పరాయివాళ్లు పాలిస్తున్నట్లు ప్రజలు భావిస్తారు. ప్రజల సమస్యల్ని ప్రత్యక్షంగా అర్థంచేసుకోలేక ప్రజాప్రతినిథులు, ప్రభుత్వాధికారులు మధ్యవర్తుల ద్వారా ప్రజల సమస్యల్ని తెలుసుకుంటూ, అవినీతికి అవకాశమిస్తుంటారు. అందువల్ల మాతృభాషలో, మాతృభాషామాధ్యమంలో అవసరమైనంతవరకూ మన చదువుల్ని మనం చదువుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న విజ్ఞానం కూడా నేడు సత్వరమే అనువాదంమై మనకి అందుబాటులోకి వచ్చేస్తుంది. అందువల్ల మన మాతృభాషలోనే మనం చదువుకోవడం వల్ల మనమెంతో సృజనాత్మకంగా ఆలోచించగలుగుతాం. మనదేశ సంపదను ఎన్నోరెట్లు పెంచగలుగుతా. అప్పుడే మనం నిజమైన దేశభక్తులవుతాం.
మీరంతా ముందుగా మన తెలుగులో కూడా మన చదువుల్ని చదువుకుందామనే నిర్ణయానికి రావాలి. సుమతీ శతకకారుడు ఒక చక్కని పద్యం చెప్పాడు.
వినదగు నెవ్వరు చెప్పిన  
వినినంతనె వేగపడక వివరింపదగున్
గని కల్ల నిజము దెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ...!
మీరెప్పుడూ ఈ పద్యంలో చెప్పినట్లు ఎవ్వరు చెప్పినా ముందు వినండి. విన్నవెంటనే అదే సరైందని నమ్మేయకండి. దానిలోని నిజానిజాల్ని మీ పెద్దవాళ్లను అడిగి తెలుసుకోండి. అలా తెలుసుకొని సరైన నిర్ణయం తీసుకోండి. మాతృభాషలో అంటే మన మాతృభాష తెలుగు మాధ్యమంలోనే చదువుకోవడం వల్ల వచ్చే ఉపయోగాల్ని మీ పెద్దవాళ్లను అడిగి తెలుసుకోండి. కేవలం ఇదే కాదు; ఏది విన్నా, దానిపై నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. అర్థం కాకపోతే పెద్దవాళ్లను అడిగి తెలుసుకోండి. అమ్మనో, నాన్ననో, మీ ఉపాధ్యాయుల్నో, మీకు తెలిసిన పెద్దవాళ్లనో అడిగి తెలుసుకోండి. అప్పుడే నిర్ణయం తీసుకోండి. మనతెలుగు చదువుకోవడంలో కూడా అలాగే నిర్ణయం తీసుకోండి. మనతెలుగులో ఆంధ్రమహాభారతం, ఆంధ్రమహాభాగవతం, రామాయణాలు, పురాణాలు ఎన్నో ఉన్నాయి. అదంతా మనవాళ్లు మనకిచ్చిన గొప్ప విజ్ఞానం. దాన్ని మనం తెలుసుకోవాలి. మన వారసత్వసంపదను మనం కాపాడుకోవాలి. దాన్ని కాపాడుకోవాలంటే మనభాషను మనం నేర్చుకోవడానికి ముందుకురావాలి. మనభాషలో చదువుకోవడానికి ఇష్టపడాలి. మనభాష మనకి బాగా వస్తే, ఇతరభాషలైన హిందీ, ఇంగ్లీషు వంటి ఏ భాషలైనా చాలా సులభంగా వస్తాయని మన భాషాశాస్త్రవేత్తలు చెప్తున్నారు. మీరంతా మనదేశానికి ఎంతో కావలసిన వాళ్ళు. మీరే మరలా ఈ దేశాన్ని పాలించేవాళ్లు. మీరే మరలా ఈ దేశభవిష్యత్తుని తీర్చిదిద్దేవాళ్ళు. మన విజ్ఞాన పునాదులమీదే కొత్త విజ్ఞాన భవనాల్ని నిర్మించుకోవాలి. అప్పుడే మనం నిజమైన దేశభక్తులవుతాం.
మనం ఇంగ్లీషుకూడా నేర్చుకుందాం. డాక్టర్లు, ఇంజనీర్లు, సాప్ట్వేర్ నిపుణులవుదాం. కానీ అవన్నీ మళ్ళీ మనవాళ్ళకే ఉపయోగపడాలంటే మన మాతృభాషే మనకు శరణ్యం. అందువల్ల ఇతర భాషల్ని నేర్చుకున్నా, మన తెలుగు భాషను మనం విస్మరించొద్దు. మన తెలుగు భాషలోని గొప్పతనాన్ని తెలియజెప్పే గొప్ప కార్యక్రమాలు ప్రపంచతెలుగు మహాసభల్లో జరుగుతాయి. అవన్నీ మన తెలుగువాళ్ల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుతాయి. ఆ ప్రపంచమహాసభలు డిసెంబరు 15 నుండి 19 వరకు ఘనంగా జరుగుతాయి. ఆ సభల్ని మనం విజయవంతం చేసుకుందాం. నలుదిశలా మన జాతి, మన భాషల గొప్పతనాన్ని ఎలుగెత్తి చాటుదాం. దానికోసం మనమంతా నేడు ‘తెలుగు భాషా చైతన్య ర్యాలీ’ ని నిర్వహించుకుంటున్నాం. దీనిలో భాగస్వాములవుతున్న మీరందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
జైహింద్! జై భారత్! జై తెలుగు తల్లి!!
 ( ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా న్యూ బ్లూమ్ ఉన్నత పాఠశాల, కొత్తగూడలోని సఫిల్ నగర్ లో తెలుగు భాషా చైతన్య ర్యాలీ ప్రారంభ సభలో మాట్లాడిన సంక్షిప్త ప్రసంగం)


11 డిసెంబర్, 2017

‘సాహిత్య, సామాజిక దార్శనికుడు డా. కట్టమంచి రామలింగా రెడ్డి ’.. ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

సమాజంలోనూ, సాహిత్యంలోను గొప్ప దార్శనిక దృష్టి గల అభ్యుదయవాది డా.కట్టమంచి రామలింగారెడ్డి అని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ డిప్యూటి డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆచార్య  దార్ల వెంకటేశ్వరరావు అన్నారు.  కట్టమంచి రామలింగారెడ్డి జయంతి సందర్భంగా శ్రీ త్యాగరాయగానసభ, హైదరాబాదులో 10 డిసెంబర్ 2017 సాయంత్రం  జరిగిన సాహితీ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 
ఈ కార్యక్రమాన్ని శ్రీత్యాగరాయ గానసభ, ద్వానాసాహితీ కుటీరం సంయుక్త ఆధ్వర్యంలో జరిగింది. కట్టమంచి రామలింగారెడ్డి వ్యక్తిత్వాన్ని, సాహిత్య కృషిని, విద్యా సంస్కరణలను సోదాహరణంగా వివరించారు.
ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ద్వా.నా.శాస్త్రి అధ్యక్షత వహించిన ఈ సభలో కళా వి.ఎస్. జనార్ధనమూర్తి, ప్రముఖ కవులు రఘువీర్ ప్రతాప్, బండి శ్రీనివాస్ తదితరలు పాల్గొన్నారు. సభలో ముందుగా కట్టమంచి రామలింగారెడ్డి గారి చిత్రపటానికి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పూలమాలవేసి, జ్యోతి ప్రజ్వలనం చేశారు.  తన  ఉపన్యాసాన్ని కొనసాగుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ప్రతివాళ్లూ ఏ సాహిత్యాన్ని చదివినా ముందుగా తమ అస్తిత్వ మూలాలను వాటిలో వెతుక్కుంటారని , కట్టమంచి వారి రచనలు కూడా ఈఆ దృష్టితో చూసే అవకాశం ఉందన్నారు. నిజానికి అలా చూడవలసిన అవసరం  ఉందని కూడా చెప్పారు.

జ్యోతి ప్రజ్వనం చేస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు తదితరులు 
 ప్రస్తుతం తెలుగులో అస్తిత్వ ఉద్యమ సాహిత్యం  విస్తృతంగా కనిపిస్తోంది. ప్రతివాళ్ళూ  తమ గురించి ఆ సాహిత్యంలో కనిపించే తమ జీవితం గురించి చేసే అన్వేషణ మొదలైంది. కట్టమంచి వారిని నేను కూడా దృష్టితో చూశాను. నాకు ఆయన వ్యక్తిత్వంలో  సాహిత్యంలో మూడు ముఖ్యాంశాలు బాగా నచ్చాయి. మొదటిది సామాజిక అభ్యుదయ ఆకాంక్షతో అందరికీ కలగాలనే దృష్టి ఆయన వ్యక్తిత్వంలో కనిపిస్తుంది. రెండవది ... ప్రాంతీయ దురభిమానం లేకుండా జాతీయ సమైక్యత సమగ్రతలను పెంపొందించే దృష్టి కలిగి ఉండటం. మూడవది లింగపరమైన వివక్షకు దారిలేకుండా స్త్రీ ఔన్నత్యాన్ని గుర్తించే రచనలు చేయటం. వీటితోపాటు సాహిత్యంలో సంప్రదాయాలతో పాటే ఆధునికతను తీసుకొచ్చారు. కవిగా, రచయితగా, విమర్శకుడిగా, పాలనాదక్షుడుగా, మానవతావాదిగా  కట్టమంచి రామలింగారెడ్డి అనేక పార్శ్వాలలో కనిపిస్తాడని పేర్కొన్నారు.  ఆయన వ్యక్తిత్వాన్ని వివరించే అనేక  అంశాల్ని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వివరించారు. 

సభలో మాట్లాడుతున్న  ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 
కట్టమంచి రామలింగారెడ్డి  మైసూరులో విద్యాశాఖాధిరిగా ఉన్నప్పుడే మొట్టమొదటిసారిగా దళితులకు విద్యాలయాల్లో చదువుకునే అవకాశాన్ని కలిగించారన్నారు. దానికోసం మైసూరు సంస్థాన దివానుగారితో కూడా పోరాడాల్సి వచ్చిందన్నారు. అప్పుడు మైసూరు రాజా కట్టమంచి వారి నిర్ణయాన్నిస్వాగతించారనివివరించారు.అలాగే, ఆంధ్రవిశ్వవిద్యాలయాన్ని విశాఖపట్టంలో పెట్టడానికి కట్టమంచి ఎంతో కృషిచేశారని, ప్రాంతీయ భేదాలు లేని వ్యక్తి అని కొనియాడారు. స్త్రీ ఔన్నాత్యాన్ని చాటిన గొప్ప అభ్యుదయవాదిగా ఆయన రాసిన ముసలమ్మ మరణం, నవయామిని కావ్యాలు తెలుపుతాయని వాటిలోని కొన్ని ఉదాహరణలను పేర్కొన్నారు. విద్యావేత్తగా ఉస్మానియా, మైసూరు, ఆంధ్ర విశ్వవిద్యాలయాల స్థాపనలో ఆయన నివేదికలు ఎంతగానో ఉపయోగపడ్డాయని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు కొనియాడారు. పాఠం చెప్పడంలో, ప్రసంగాన్ని రక్తికట్టించడంలో, విద్యాసంస్కరణలు అమలు పరచడంలో కట్టమంచి ఎంతో పరిణత దృష్టితో వ్యవహరించేవారని, అందువల్ల ఆయన చేసిన కృషిని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తన గురువు డా.ద్వానాశాస్త్రి గారు తననెంతో ్రపోత్సహించారనీ, ఒక వ్యక్తి ఉన్నతమైన స్థానంలో ఉండడానికి గురువులు, సహృదయులెందరి సహకారమో ఉంటుందనీ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు చెప్పారు. డా. ద్వానాశాస్త్రి గారి దగ్గర తాను ఇంటర్మీడియెట్ నుండి డిగ్రీవరకు స్పెషల్ తెలుగు చదువుకున్నానని, ఆయన, మరికొంతమంది డా. చక్రపాణిరావు, డా. మార్గశీర్ష వంటి వారి సహకారంతో హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటిలో ఎం.ఏలోచేరానన్నారు. తర్వాత ఆ విశ్వవిద్యాలయంలోనే డాక్టరేట్ పూర్తిచేసి ఆచార్యుడిగా కూడా పనిచేయడం వెనుక గురువుల ప్రోత్సాహం  ఎంతో ఉందని గుర్తుచేసుకున్నారు. అలాంటి  గురువులెంతోమంది డా.కట్టమంచి రామలింగారెడ్డిగారికి దొరకడం వల్లనే  ఉన్నత వ్యక్తిత్వాన్ని అలవర్చుకున్నారరన్నారు. సంస్కృతాన్ని కాపాడ్డం కోసం మద్రాసు శాసనసభలో బడ్జెట్ కేటాయించాలని వాదించారనీ, అంతేకాకుండా శత్రువుల్ని సహితం ప్రేమించే గుణం ఉందనీ వివరించారు.
ఆహ్వాన పత్రం 

సభలో పరిచయ ప్రసంగం చేస్తూ డా.ద్వానాశాస్త్రిగారు కట్టమంచి రామలింగారెడ్డి తెలుగు సాహిత్య విమర్శకు దిక్సూచి వంటివారన్నారు. కవిత్వతత్వవిచారం తో తెలుగు సాహిత్య విమర్శ మలుపుతిరిగిందనీ, శాస్త్రీయత పొందిందనీ అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుని ఘనం
తన గురువు డా.ద్వానాశాస్త్రి గారు తననెంతో ్రపోత్సహించారనీ, ఒక వ్యక్తి ఉన్నతమైన స్థానంలో ఉండడానికి గురువులు, సహృదయులెందరి సహకారమో ఉంటుందనీ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు చెప్పారు. డా. ద్వానాశాస్త్రి గారి దగ్గర తాను ఇంటర్మీడియెట్ నుండి డిగ్రీవరకు స్పెషల్ తెలుగు చదువుకున్నానని, ఆయన, మరికొంతమంది డా. చక్రపాణిరావు, డా. మార్గశీర్ష వంటి వారి సహకారంతో హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటిలో ఎం.ఏలోచేరానన్నారు. తర్వాత ఆ విశ్వవిద్యాలయంలోనే డాక్టరేట్ పూర్తిచేసి ఆచార్యుడిగా కూడా పనిచేయడం వెనుక గురువుల ప్రోత్సాహం  ఎంతో ఉందని గుర్తుచేసుకున్నారు. అలాంటి  గురువులెంతోమంది డా.కట్టమంచి రామలింగారెడ్డిగారికిదొరకడంవల్లనేఉన్నతవ్యక్తిత్వాన్ని అలవర్చుకున్నారరన్నారు. సంస్కృతాన్ని కాపాడ్డం కోసం మద్రాసు శాసనసభలో బడ్జెట్ కేటాయించాలని వాదించారనీ, అంతేకాకుండా శత్రువుల్ని సహితం ప్రేమించే గుణం ఉందనీ వివరించారు. 
ఈ సందర్భంగా నిర్వాహకులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుని ఘనంగా సత్కరించారు. తననింతగా గౌరవించిన గురువు డా.ద్వానాశాస్త్రి గార్ని తమ శిష్య, సతీసమేతంగా  ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు శ్శాలువాతో సత్కరించారు. 


సభలో మాట్లాడుతున్న డా.ద్వానాశాస్త్రిగారు 
 ఆచార్య దా ర్ల వెంకటేశ్వరరావుని సత్కరిస్తున్న డా.ద్వానాశాస్త్రి, కళా వి.ఎస్.జనార్ధనమూర్తి, బండిశ్రీనివాస్, శ్రీమతి వసుంధర తదితరులు  
డా.ద్వానాశాస్త్రిగార్ని సత్కరిస్తున్న సతీ, శిష్యసమేతంగా సత్కరిస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

 సభలో పాల్గొన్నసాహితీవేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు


08 డిసెంబర్, 2017

'తెలంగాణ దళిత కథా సాహిత్యం- సమాలోచన' జాతీయ సదస్సు (7, 8 డిసెంబరు 2017)


సదస్సులో పత్ర సమర్పణ చేస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, వేదికపై ఆచార్య వెలుదండ నిత్యానందరావు, డా.సాగి కమలాకరశర్మ, డా.ఏలే విజయలక్ష్మి, డా.జిలుకర శ్రీనివాస్ ఉన్నారు.
యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాల, సికింద్రాబాద్ లో 7, 8 డిసెంబరు 2017 తేదీల్లో ఉన్నత విద్యామండలి, తెలంగాణ రాష్ట్ర సంయుక్త ఆధ్వర్యంలో 'తెలంగాణ దళిత కథా సాహిత్యం- సమాలోచన' పేరుతో రెండు రోజుల జాతీయ సదస్సు జరిగింది.  
భారతరాజ్యాంగం ప్రకారం మాదిగలు అని పిలిచే కులస్థులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో షెడ్యూల్డు కులాల జాబితాలో ఉన్నారు. చనిపోయిన పశువుల తోలుతీసి చెప్పులు కుట్టడం, డప్పులు చేయడం, తోలుతిత్తులు చేయడం మొదలైన చర్మకారవృత్తులు చేసేవాళ్ళని ఒక నమ్మకం కొనసాగుతోంది. దీనితో పాటు చావులకు, పెళ్ళిళ్ళకు డప్పులు కొట్టేవాళ్ళుగా కూడా చెప్తుంటారు. చర్మకారవృత్తులు చేసేవాళ్ళను మాదిగలుగా పిలిచేవారు. కానీ, చరిత్రను జాగ్రత్తగా పరిశీలిస్తే, కేవలం చర్మకారవృత్తులు మాత్రమే కాదు; మిగతా అనేక వృత్తుల్లో మాదిగలు ఉన్నారు. ఆ యా వృత్తుల వల్ల పొందిన జీవితాన్ని కథల్లో ఎలా చిత్రించారనే అంశమే ప్రధానంగా మాదిగ కథాసాహిత్యాన్ని విస్తృతపరుస్తోందని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అన్నారు. 
తెలుగు శాఖ, యూనివర్సిటీ పోస్ట్  గ్రాడ్యుయేట్ కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయం, సికింద్రాబాద్ మరియు ఉన్నత విద్యామండలి,  తెలంగాణ రాష్ట్ర సంయుక్త ఆధ్వర్యంలో 7,8 డిసెంబర్ 2017 తేదీల్లో జరుగుతున్న "తెలంగాణా దళిత కథా సాహిత్యం-సమాలోచన" అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సులో ‘‘మాదిగ కథా సాహిత్యం- జీవన చిత్రణ’’ గురించి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పత్ర సమర్పణ చేశారు.
 మాదిగ కథా సాహిత్యాన్ని గుర్తించేటప్పుడు  మనం రెండు పద్ధతులను అనుసరించవలసి ఉంటుంది. మాదిగ రచయిత్రులు, రచయితలు రాసిన కథా సాహిత్యం, మాదిగేతరులు రాసిన కథా సాహిత్యం. మాదిగ రచయితలు, మాదిగేతరులు అని గుర్తించడానికి కొన్ని అవకాశాలున్నా, దానిలో పాటే మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. మన జీవిత వివరాలు ముఖ్యంగా కుల వివరాలు తెలిస్తేనే వాటిని గుర్తించడానికి వీలవుతుంది. కొంతమంది తమ కులాన్ని చెప్పుకోరు. కానీ కులానికి సంబంధించిన సాహిత్యాన్ని రాస్తారు. అటువంటి వారు ఏ కులానికి చెందిన వాళ్ళో గుర్తించటం అంత సులభం కాదు. అందువల్ల నేను ఈ పత్రంలో మాదిగ రచయిత్రులు, రచయితలు రాసిన మాదిగ కథా సాహిత్యాన్ని మాత్రమే ప్రస్తావిస్తున్నాను. తెలంగాణ మాదిగ జీవితాన్ని కథలుగా రాసిన వాళ్లలో జూపాక సుభద్ర, జాజుల గౌరి, గోగు శ్యామల ప్రధానంగా కనిపిస్తారు. వీరితోపాటు ఎండ్లూరి సుధాకర్,  డప్పోల్ల రమేశ్, పసునూరి రవీందర్, సిద్దెంకి యాదగిరి, ఐనాల సైదులు, వేముల ఎల్లయ్య, గుండెడప్పు కనకయ్య, ఎలమంద, సుధాకర్ అరూరి, ఎండ్లూరి మానస తదితరులు కూడా మాదిగ జీవితాన్ని చిత్రించే కొన్ని కథలను రాశారన్నారు. 
సదస్సులో పాల్గొన్న పరిశోధకులు, విద్యార్థులు, అధ్యాపకులు
సదస్సులో పత్ర సమర్పణ చేస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, వేదికపై ఆచార్య వెలుదండ నిత్యానందరావు, డా.సాగి కమలాకరశర్మ, డా.ఏలే విజయలక్ష్మి, డా.జిలుకర శ్రీనివాస్ ఉన్నారు.
 జూపాక సుభద్ర, గోగు శ్యామల ప్రధాన సంపాదకులుగా "నల్ల రేగటి సాల్లు"లోని కథలు మాదిగ జీవిత చిత్రణను వివరిస్తున్నాయన్నారు. అలాగే జూపాక సుభద్ర రాసిన శుద్ది చెయ్యాలె’, జాజుల గౌరి కంచె’, డప్పోల్ల రమేశ్ అక్కర్లేదా’, పసునూరి రవీందర్ అవుటాఫ్ కవరేజ్ ఏరియామొదలైన కథలను వివరించి, వాటిలో చిత్రితమైన మాదిగ జీవన చిత్రణను  విశ్లేషించారు. 

04 డిసెంబర్, 2017

తెలుగు మాధ్యమంలో విద్యా బోధన సాధ్యాసాధ్యాలు - ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు


నమస్తే తెలంగాణ, హైదరాబాద్ టాబ్లాయిడ్, 4 డిసెంబర్ 2017
వేదికపై వరుసగా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య రెడ్డి శ్యామల, ఆచార్య రామకృష్ణారెడ్డి, ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు, ఆచార్య వెంకటేశ్వరశాస్త్రి ఉన్నారు.


మాతృభాషలోనే విద్యాబోధన జరగాలనే ఆశయం చాలా ఉన్నతమైందే, కానీ దానికి అమలకి కొన్ని అవరోధాలున్నాయి. ఉదాహరణకి తెలుగు రాష్ట్రాల్లో ఒకేరకమైన తెలుగు బోధించటానికి వీలుకాదు. తెలంగాణలో చాలా కాలం వరకు తమది కాని భాషనేదో తమ పాఠ్యపుస్తకాల ద్వారా  తాము చదువుకుంటున్న అనే భావన చాలా కాలం అనుభవించారు. తమపై ఎవరి భాషో ఆధిపత్యం చెలాయిస్తుందనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. దాన్ని తమ తెలుగు కూడా భావించని వాళ్లున్నారు. అందువల్ల ఆ ప్రాంతానికి సంబంధించిన వాడుకభాషను పాఠ్యాంశాలలో చేర్చగలిగితే మరింత బాగుంటుంది. దీనితోపాటు ప్రపంచ విజ్ఞానానికి కేంద్రంగా మారిన ఆంగ్లభాషలో వచ్చే విజ్ఞానాన్ని తమ మాతృభాషలో వెంటనే మార్చుకోగలిగే సదుపాయాన్ని మనం కలిగించగలగాలి. ఆంధ్రప్రదేశ్ లోవ్యవహారంలో ఉన్న తెలుగుకీ, తెలంగాణలో వ్యవహారంలో ఉన్న తెలుగుకీ మధ్యే ఎన్నో వైరుధ్యాలు ఉన్నాయి. వీటన్నింటినీ కంప్యూటర్ సహాయంతో క్షణాల్లో మార్చుకోవచ్చుని ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావుగారు చెప్తున్నారు. అలా చేయగలిగితే అంత కంటే గొప్ప విషయం మరొకటి ఏదీ ఉండదేమో. అయితే అది అందుబాటులోకి రావాలి. గూగుల్ తెలుగు భాషను వాడుకలోకి తీసుకు వచ్చిన తర్వాత ఉత్తరాలు ఈ-మెయిల్స్ రాసుకోవడం వంటివన్నీ కూడా చాలామంది తమ మాతృభాష తెలుగులోనే కొనసాగిస్తున్నారు. దీనికి కారణం అందుబాటులోకి ఆ సాధనాలు రావడమే. అలా భాషా శాస్త్ర వేత్తలు ఇతర భాషల్లోని విజ్ఞానాన్ని తెలుగు లోకి కూడా తీసుకు రాగలిగే సాధనాలను అందుబాటులోకి తీసుకొస్తే (మాతృభాష) తెలుగులో కూడా ఉన్నత విద్యను కూడా అభ్యసించవచ్చు.
సాక్షి, హైదరాబాద్ (ముషీరాబాద్ జోన్)

 మనం కొన్ని తెలుగు అనువాదాలను చూస్తుంటాం. తెలుగు పేరుతో సంస్కృతాన్నో, అన్య భాషా పదజాలాన్నో అనువాదం చేసి దాన్ని  తెలుగు అని భ్రమింపచేస్తుంటారు. వాటిని చదివి అర్థం చేసుకోలేనివాళ్ళు వాటికంటే ఆంగ్లమే చాలా సులభం అనే భావానికి రావడం సహజం. మాతృభాషగా తెలుగు మాధ్యమంలోనే ఉన్నత చదువులు కూడా చదవాలంటే కావలసిన నిఘంటువులు,  పదకోశాలు, అనువాద సాధనాలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నించమని భాషాశాస్త్రవేత్తలను కోరుతున్నాను.
Aఈ సందర్భంలో ఒకటి గుర్తుంచుకోవాలనుకుంటున్నాను. తెలుగుతో పాటు ఆంగ్లాన్ని కూడా ఒక సబ్జెక్టుగా  చదవడాన్ని వ్యతిరేకించొద్దు. ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఎంతో ఆలోచిస్తుంది. ఆ విధాన రూపకల్పనలో కూడా మన భాషా శాస్త్రవేత్తలు సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థతోపాటు సమాంతరంగా ప్రైవేటు విద్యా వ్యవస్థ కొనసాగడానికి కూడా కొన్ని కారణాలున్నాయి. విద్యాభివృద్ధికి, విజ్ఞానాభివృద్ధి అవసరమైనంతమేరకు  పోటీతత్వాన్ని పెంచడం కోసం ఈ వ్యవస్థ అవసరం కూడా. అయితే, దురదృష్టవశాత్తు పాలకులు ఉన్నత, ధనికి వర్గాల నుండి అధికసంఖ్యలో రావడం జరుగుతోంది. దానివల్ల ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలు, కళాశాలలు ప్రైవేటు విద్యతో పోటీ పడలేకపోతున్నాయి.
నిజానికి ప్రభుత్వ విద్యా సంస్థలలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఉంటున్నారు. కానీ వాళ్ళకు పాఠాలు చెప్పడానికి తగిన వాతావరణం ఉండటం లేదు. చాలాచోట్ల విద్యా  సంస్థలకు సరియైన భవనాలు లేవు. కొన్నిచోట్ల విద్యార్థులు కూర్చోడానికి బల్లలు కూడా లేని పరిస్థితి. చాలాచోట్ల మరుగుదొడ్లు కూడా ఉండవు. తగినంత మంది ఉపాధ్యాయులను, అధ్యాపకులను నియమించరు. ఉన్న ఈ సిబ్బందిని కూడా ప్రభుత్వ  కార్యక్రమాలలో పాల్గొనాలని సూచిస్తుంటారు. ఓటర్లనమోదుతో పాటు, కొన్ని ప్రభుత్వ పథకాల ప్రచారం వంటివన్నీ వీళ్ళు నెత్తినే పడుతుంటాయి. కొన్ని ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయి. దానిలో ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉంటాడు. ఒక వేళ మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో జరిగే సమావేశాలకు ఆ ఉపాధ్యాయుడు హాజరైతే  పాఠశాల మూసేయాల్సిందే. దీనికితోడు విద్యా కమిటీల పేరుతో రాజకీయాలు మరొకవైపు. నిష్ణాతులైన ఉపాధ్యాయులు, అధ్యాపకులు ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉన్నా, వారిని విద్యా బోధన కోసం సమర్థవంతంగా వినియోగించడం లేదు. అందువల్ల ప్రభుత్వ విద్యాసంస్థలు అంటే ఆ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కూడా అపనమ్మకమే కలుగుతోంది. తమ పిల్లలను కూడా ప్రైవేటు పాఠశాలల్లో చదివించుకోవాలన్న కుంటున్నారు.
మరి ఇవన్నీ పాలకులకు తెలియవా? తెలిసినా తెలియనట్లుండే అవకాశమే ఎక్కువ. ప్రైవేటు పాఠశాలల నడిపేదెవరు? ప్రభుత్వంలో భాగస్వామ్యం ఆయన కుటుంబాల వారు ప్రైవేటు పాఠశాలలను నడపకుండా ఉండగలరా? ఇవన్నీ క్షేత్ర స్థాయిలో, ఆచరణలో కనిపించే వాస్తవాలు.  తెలుగు మాతృ భాషను అమలు చేయడానికి ఇవన్నీ ఆటంకాలు. ఈ ఆటంకాలు తొలగిపోవాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి. ఆ దిశగా కృషి ని ప్రారంభించిన తెలుగు భాషా వేదిక వార్ని అభినందిస్తున్నాను.
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
డిప్యూటి డీన్, తెలుగు శాఖ, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్
హైదరాబాద్, ) 

(తెలుగు భాషావేదిక వారు 3 డిసెంబరు 2017 తేదీన షోయబ్ హాలు, సుందరయ్య విజ్ఞాన భవనంలో జరిగిన ‘‘మాతృభాషా బోధన - తెలుగు అమలు’’ అనే అంశంపై జరిగిన సమావేశంలో చేసిన ప్రసంగ సంక్షిప్తరూపం)