Sunday, April 16, 2017

మహీధర రామమోహనరావు ‘ఓనమాలు’ : తెలంగాణా పోరాటం

పుట్టిందీ, పెరిగిందీ సనాతన సంప్రదాయ యజ్ఞ యాగాదులు చేసుకునే కుటుంబంలోనే అయినా, అభ్యుదయ భావాలతో జీవించి అనేక ఉద్యమాల్లో పాల్గొని, ఆ జీవిత సారాంశాన్ని అందిస్తున్నట్లుగా అనేక నవలలు రాసిన రచయిత మహీధర రామమోహనరావు. 
మహీధర రామమోహనరావు సుమారు 15 నవలల్ని రాశారు. అనేక రచనల్ని అనువదించారు. 1954లో రథ చక్రాలు; 1956లో ఓనమాలు; 1957లో మృత్యువు నీడల్లో; 1959లో ఎవరికోసం; 1960 లో కత్తుల వంతెన; 1965లో కొల్లాయిగట్టితేనేమి? 1969లో స్వయంవరణం; 1972లో అగ్ని గుండం; 1984లో దేశం కోసం; 1993లో జ్వాలా తోరణం నవలల్ని గ్రంథ రూపంలో వెలువరించారు. రథ చక్రాలు నవల 1948లోనే 
రాసినా అది 1954కి గాని గ్రంథ రూపంలోకి రాలేదు. మిగిలిన రచనలు కూడా వివిధ పత్రికల్లో సీరియల్‌గా వచ్చినా, గ్రంథ రూపంలోకి రావడం మాత్రం ఆలస్యమైంది. వీటితో పాటు మబ్బు తెర, పరిష్కారము వంటి నాటకాల్ని కూడా రాశారు. మరికొన్ని అభ్యుదయ రచనలను అనువదించారు. తన స్వగ్రామం ముంగండలో విశ్వసాహిత్యమాలను స్థాపించి, దాని ద్వారా మార్క్సిస్టు గ్రంథాలను అనువాదం చేసి, ఆ భావాల్ని ప్రచారం కల్పించేవారు. కమ్యూనిస్టు నిషేద కాలంలో రాయలసీమలో రహస్య జీవితాన్ని గడిపారు. పీడితుల పక్షాన నిలబడిన మహీధర రామమోహనరావు తాను పుట్టి పెరిగిన ప్రాంతం కాకపోయినా, తెలంగాణాలో జరిగిన సాయుధ పోరాటాన్ని సమర్థిస్తూ, ఆ చారిత్రక నేపథ్యాన్ని ఓనమాలు నవలలో ఎంతో విపులంగా రాశారు. 
తూర్పు గోదావరి జిల్లాలోని ఒక విస్మృత ప్రాంతంలో తాను భాగస్వామిగా ఉండిన పరిణామాలు కేంద్రంగా స్వాతంత్రోద్యమ తీరుతెన్నుల్ని, ఆ ప్రాంత తెలుగు సమాజంలో కలిగిన సామాజిక చలనాన్ని స్వాతంత్రానంతరం కాలంలో మహీధర కొల్లాయి గట్టితేనేమి'', "దేశం కోసం'', జ్వాలా తోరణం'' అనే నవలాత్రయంగా రచించార''ని ఆ రచనల గురించి రాస్తూ ప్రముఖ విమర్శకుడు బి. సూర్య సాగర్‌ పేర్కొన్నారు. 
కొల్లాయి గట్టితేనేమి'' 1920 వ సంవత్సరంలో గాంధీ సహాయ నిరాకరణోద్యమ నేపథ్యాన్ని, దేశం కోసం'' 1935-39 కాలానికి, జ్వాలా తోరణం'' 1939-45 కాలానికి చెందిన ఇతివృత్తాలతో కూడిన నవలలు. ప్రపంచ యుద్ధ కాలంలో కమ్యూనిస్టుల పాత్ర, అంతర్జాతీయ ప్రభావం వంటి వన్నీ వీటిలో కనిపిస్తాయి. మరింత స్పష్టంగా చెప్పుకోవాలంటే, గాంధీ సంస్కరణ వాదం కొల్లాయి గట్టితేనేమి'' లోనూ, కమ్యూనిస్టు పోకడల్ని దేశం కోసం'' లోనూ, సామ్యవాద వాస్తవికతను జ్వాలా తోరణం'' లోనూ ఆయన వివరించారు. కొల్లాయి గట్టితేనేమి''లో కథానాయకుడు రామనాథం ఆ సంస్కరణ భావాల ప్రభావంతో నాడు హరిజనుల్ని పిలిచే దళితులకు తన తోటలోని మంచినీటి బావిని 
తాగునీటి కోసం కేటాయిస్తాడు. రామనాథానికి, గాంధీ ఉద్యమం కోరేదేమిటో స్పష్టంగా తెలియక పోయినా, గాంధీ సంస్కరణ భావాల్ని ఆచరించే పాత్రగా కనిపిస్తాడు. ఈ నవల లక్ష్యాన్ని వ్యాఖ్యానిస్తూ బి. సూర్య సాగ?ర్‌ ఇలా అన్నారు. కొల్లాయి గట్టితేనేమి''లో సంస్కరణ వాదము కేంద్ర దృక్పథంగా ఉన్నది. స్వాతంత్ర్య పోరాటంలో గాంధీ మార్గం యొక్క నిస్సారతను ఆ నవలలో పసికట్టడం కష్టమేమి కాదు. అయితే ఆ నిస్సారతను వెల్లడించడం మహీధర లక్ష్యం కాకపోవచ్చు అందువల్లనే మౌలికమైన మార్పుల్ని గాంధీ సంస్కరణ వాదం కలిగించ లేకపోయిందనీ, రామనాథం దళితులకు బావిని కేటాయించినా, దానిపై హక్కుని సాధించలేక పోయారని స్పష్టంగ?ా దీన్ని బట్టి తెలుస్తుంది. రామనాథం దళితులకు బావిని కేటాయించినా, దానిపై హక్కుని సాధించలేక పోయారని స్పష్టంగా దీన్ని బట్టి తెలుస్తుంది. 
జ్వాలా తోరణం'' నవల శోభాదేవి (మంగమ్మ) వర్ణనతో ప్రారంభమవుతుంది. ముంగండ సత్యనారాయణ కూతురు మంగ?ాదేవి, బాల వితంతువు. అతడు ఆమెను మద్రాసు తీసుకెళ్ళి చదివిస్తాడు. పునర్వివాహాన్ని ప్రోత్సహించినా, కులాంతర వివాహాన్ని మాత్రం వ్యతిరేకిస్తాడు. వయొలిన్ నేర్చుకుని మంగమ్మ తన పేరుని శోభాదేవి''గా మార్చుకుంటుంది. ఆమె కుల, మతాంతరుడూ అయిన కుట్టన్‌ ను వివాహం చేసుకుంటుంది. ఈ నవలలో కులాంతర వివాహాలతో పాటు, వితంతు పునర్వివాహాల్ని చర్చలోకి తెచ్చారు రచయిత. ఈ మూడు నవలల్ని వరుసగా చదివితే రాష్ట్రంలో చారిత్రకంగా వచ్చిన, ముఖ్యంగా కోనసీమలో వచ్చిన సామాజిక పరిణామాలను, సంస్కృతిలో వచ్చిన మార్పులను అవగాహన చేసుకోవచ్చునని విమర్శకుల అభిప్రాయ పడ్డారు. 
దేశం కోసం'' నవలలో కథానాయకుడు వెంకట్రామయ్య. వామపక్ష భావాలకు ఆకర్షితుడవుతాడు. కొంతమంది యువకులతో కలిసి గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాడు. గ్రామంతో ప్రారంభించి, క్రమేపీ చుట్టు ప్రక్కల గ్రామాలు, తాలుకా, జిల్లా స్థాయి వరకు 
ఉద్యమాన్ని విస్తరిస్తాడు. గ్రంథాలయాలు, గురుపీఠాలు, యువజన సంఘాల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని మేల్కొలుపుతాడు. మతం పేరుతో జరిగే దోపిడీల్ని వెల్లడి చేసి ప్రజల్ని చైతన్య పరుస్తాడు. మత భావాన్ని విస్తృతంగా వ్యాప్తి చేసే రామానుజాచారిని కూడా ప్రజా సాహిత్యం సాంస్కృతిక కార్యక్రమాల వైపు దృష్టి మళ్ళించ గలుగుతాడు. 
వెంకట్రామయ్య వివాహమైనా బతుకు తెరువు కోసం పది మందికి పాఠాలు చెప్తాడు. కానీ, తన లక్ష్యం మాత్రం సమ సమాజ స్థాపనే! అతడు తనకోసం, తన కుటుంబం కోసం ఆస్తి కూడ బెట్టక పోవటమే కాకుండా, సంతానం కూడా వద్దనుకుంటాడు. భార్య అన్నపూర్ణకు తెలియకుండా ఆపరెషన్‌ చేయించుకుంటాడు. అది భార్యకు తెలిసి ఇద్దరి మధ్య స్పర్థలొస్తాయి. భార్యా భర్తలిద్దరూ విడిపోతారు. వ్యక్తిగత స్వార్థం కోసం కాకుండా, సమాజం కోసమే బతకాలనుకునే తన భర్త త్యాగాన్ని అర్థం చేసుకొని, ఆమె అతని దగ్గరకు చేరుకుందామనుకునేసరికి కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధిస్తారు. దీనితో నవల ముగుస్తుంది. కమ్యూనిస్టు ప్రాధమిక దశలో ఉద్యమకారులు పడిన కష్ట, నష్టాల్ని వారి వ్యూహాల్ని అర్థం చేసుకొని, ఆ సిద్ధాంతం లోటు పాట్లను గుర్తించడానికి ఈ నవల ఉపయోగపడుతుంది. 
మానవ సంబంధాలలో స్వేచ్ఛను ప్రతిపాదించటమే మహీధర నవలల్లోని రచనా ఉద్దేశ్యమని ప్రముఖ విమర్శకుడు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి వ్యాఖ్యానించారు. 
స్వయంవరణం నవల కులాంతర వివాహాన్ని చర్చిస్తుంది. పెళ్ళి చూపులు, తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధాన్ని చేసుకుంటూ ప్రేమ'' లేని జీవితాన్ని కొనసాగించటం కంటే ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించగలిగే ప్రేమ వివాహాలే ఆదర్శనీయం అని చెప్తుంది. ఈ నవలలో పితృస్వామ్య ఈ వ్యవస్థకు చెందిన పెళ్ళి చూపుల్ని తిరస్కరించి సమ్ముఖం'' పద్ధతిని ప్రవేశ పెట్టారు. యువతీ, యువకులు చదవడం వల్లనో, వృత్తి చేయడం వలనో ఒకరినొకరు పరిచయమై, ఒకరినొకరు అర్థం చేసుకుని, అభిప్రాయాలు పంచుకుని ప్రేమను పెళ్ళిలో పరవశింప 
చెయ్యడం సమ్ముఖం. ఈ పద్ధతి అభ్యుదయమైనదని రచయిత ప్రతిపాదన. 
సుధ బ్రాహ్మణ అమ్మాయి. కామేశ్వరరావు బ్రాహ్మణేతరుడు. ఇద్దరూ కాలేజీలో లెక్చరర్స్‌గా పనిచేస్తూ ప్రేమించుకొని పెళ్ళి చేసుకుంటారు. అలాగే రుక్మిణి బ్రాహ్మణేతర కులస్తురాలు. ప్రభాకరరావు బ్రాహ్మణుడు. ఈ రెండు జంటలూ ప్రేమ పయనంలో సమాజంలో జరిగే సంఘర్షణ అంతా స్వయం వరణం'' చిత్రించి అంతిమ విజయం కుల రహిత ప్రేమ సమాజానికేనని తేల్చారు రచయిత. 
శుభలేఖ? నవల ప్రేమ కోసం తపించే లక్షణమున్నా దానికి తగిన చైతన్యం కొరవడితే కలిగే పర్యవసాలను చిత్రించింది. చంద్రశేఖర శాస్త్రి, సత్యవతి దంపతులు. వాళ్ళ సంతానం ఉమాదేవి, రామక్రిష్ణ. భాస్కరరావు అనే యువకుడిని ఉమాదేవి ప్రేమించినా, ఆమె తన తండ్రిలోని సనాతన తత్వాన్ని పోగొట్టలేకపోతుంది. రామక్రిష్ణ వర్ణాంతర వివాహం చేసుకోవడంతో పాటు, తన చెల్లెలు ఉమాదేవి ప్రేమ వివాహం కూడా విజయవంతం కావాల్ని ఆశిస్తాడు. అయినా ఆమె ప్రేమ వైఫల్యం చెందడానికి సమాజంలో పాతుకుపోయినా సంప్రదాయ సంకెళ్ళు ఒక వైపు, ఆ సంకెళ్ళు మానసికంగా కనిపించినా అధైర్యం మరొక వైపు స్త్రీ స్వేచ్ఛను హరిస్తున్నాయని నిరూపించే దిశగా శుభలేఖ నవలా రచన కొనసాగింది. 
తెలంగాణలో జరిగిన విప్లవ పోరాటాన్ని మూడు దశలుగా విభజించుకోవచ్చు. 1930 నుండి 1944 వరకు ఆంధ్ర మహాసభ పరిణామం చెందుతూ, భాషా సాంస్కృతిక ఉద్యమంతో పాటు రైతాంగ సమస్యలపై ఆందోళన, పోరాటం చేసే స్థితికి, ఆ తరువాత మిలిటెంటు ఉద్యమ స్థాయికీ అభివృద్ధి చెందిన మొదటి దశ నిజాం రెవిన్యూ పోలీసుల అధికారుల దౌర్జన్యాలు, దేశంలో భూ కబ్జాలకు వ్యతిరేకంగా పోలీసు, రజాకార్లను, ఎదుర్కొనటం, సాయుధంగా దున్నేవానికే భూమిని రైతాంగమే అమలు పరచుకుంటూ, గ్రామ రాజ్యాలను ఏర్పరచుకోవటం, ఈ దశలోనే 3000 గ్రామాలలో నిజాం ప్రభుత్వం లేకుండా స్థానిక 
స్వరూపాలను నెలకొల్పుకోవటం జరిగింది. ఇది 1944 నుండి 1948 సెప్టెంబర్‌ లో యూనియన్‌ సైన్యాలు పోలీసు యాక్షన్‌ పేరుతో ప్రవేశించే దాకా సాగింది. ఇందులో రెండు సంవత్సరాలు సాయుధంగా సాగింది. దీన్ని రెండవ దశగా చెప్పుకోవచ్చు. మూడవ దశ భూమిని కాపాడుకొంటూ యూనియన్‌ సైనిక బలాన్ని ఎదుర్కొంటూ, గెరిల్లా రైతాంగ పోరాటం వరకు సాగినదశ మూడవది. అది 1948 నుండి 1951 వరకు సాగింది. 
  దీనిలో మొదటి దశకు చెందిన నవల ఓనమాలు. రచయితే దీనిలోని కథా వస్తువుని ఇలా వివరించారు. ..నాటి తెలంగాణ ఒక అగ్ని గుండం. దుస్సహనమైన జాగీర్దారీ వ్యవస్థను నిర్మూలించగల పోరాటాల్ని ప్రజానీకం కొనసాగిస్తుంది. వాటినన్నింటినీ ఒకే జెండా కిందికి తెచ్చి, రాజకీయ నాయకత్వం సమకూర్చడానికై ఆంధ్ర మహా సభా, కమ్యూనిస్టు పార్టీ సన్నాహాలు సాగిస్తున్నాయి. రెండో వైపున విదేశీ పాలనకు, సంస్థానాధీశుల నిరకుశ పాలనకూ వ్యతిరేకంగా జాతీయ ప్రజాతంత్ర పోరాటాలు తెలంగాణాని అలుముకుంటున్నాయి. ఈ దశలో విచ్చిన్నమై పోతున్న జాగీర్దారీ వ్యవస్థను రక్షించగల శక్తి నిజాం ప్రభుత్వానికి లేదని గ్రహించిన భూస్వామ్య వర్గం, నూతన నాయకత్వం కొరకు వెతుకులాడుతూ జాతీయోధ్యమంలో తనకు రక్షణ ఇవ్వగల శక్తుల్ని చూసుకుంది. సమాజంలో తనకున్న బలం క్రమంగా క్షీణించి పోతూంటే కూలిపోతున్న తన అధికారాన్ని పరిరక్షించు కొనేటందుకై మత వాదుల్ని, రౌడీల్ని సమీకరించీ విధ్వంస కాండకు పూనికొంది నిజాం సర్కారు. ప్రజానీకానికీ, ప్రతి నిరోధక శక్తులకు మధ్య జరిగిన ఈ ఘర్షణలతో తెలంగాణా ఒక అగ్నిగుండమే అయ్యింది. ఆనాటి సంఘర్షణలే నాయీ నవలకు కథా వస్తువు''.
తెలంగాణా ప్రాంతంలో దొరలు ఒక కుటుంబానికి బంజరు భూమినిచ్చి, దాన్ని పంటపొలంగా వాళ్ళు బాగ?ు చేసిన తర్వాత ఆ పొలాన్ని ఆ దొర కొడుకులు, మనవలు ఎలా లాగేసుకుంటారో, దాన్ని కాపాడుకోవడానికి ఆ పొలాన్ని ఆ దొర కొడుకులు, మనవలు ఎలా 
లాగేసుకుంటారో, దాన్ని కాపాడుకోవడానికి ఆ పొలాన్ని నమ్ముకున్న వాళ్ళెలా బాధ పడతారో ఓనమాలు నవలలో చెప్పారు రచయిత. సత్తెమ్మ, వాళ్ళమ్మ వీరమ్మ, రంగయ్యలు దీనిలో ఆ కుటుంబ సభ్యులు. ఆ కుటుంబానికి భూమినిచ్చి, మళ్ళీ దాన్ని లాక్కున్న కుటుంబం శివరామిరెడ్డి, ఆయన కొడుకులు రఘనందనుడు, రమణారెడ్డులు. దీన్ని ఆసరా చేసుకొని తెలంగాణా ప్రాంతంలో జరిగిన అనేక చారిత్రక సంఘటల్ని నవలలో చేర్చారు. చివరికి సత్తెమ్మ దొరలపై తిరగబడ్డంతో, వాళ్ళు పారిపోవడంతో నవల ముగుస్తుంది. 
తెలంగాణ ప్రాంతంలో నైజాం ప్రభుత్వం, దాన్ని బూచిగా చూపి పోలీసులు, జాగీర్థారులు, కొంతమంది ముస్లింలు చేసే అకృత్యాలు, దుర్మార్గ?ాల్ని అవగాహన చేసుకోడానికి "ఓనమాలు' నవల ఎంతగానో సహకరిస్తుంది. అప్పుడు జరిగిన చారిత్రక సంఘటనలన్నీ సన్నివేశాలుగా, పాత్రలుగా రూపొందించటంలో రచయిత మహీధర రామ్మోహనరావు ప్రదర్శించిన సృజనశీలత ప్రశంసనీయం. ఒక కుటుంబంలో జరుగుతున్న కథనే చెప్తున్నట్లున్నా, ఆ సంఘటనల తీవ్రతను అద్భుతంగా వర్ణించి ఆ సమస్యల్ని ఒక కుటుంబానికే పరిమితమైనవి కాదని పాఠకుడు గ్రహించేటట్లు, ఆనాటి చారిత్రక సంఘటనల్ని అర్థం చేసుకునేట్లు నవల్ని అద్భుతంగా కొనసాగించారు. 
తెలంగాణలో ఉర్దూ, పారశీక భాషల ఆధిపత్యం మధ్య నలిగిపోయిన తెలుగు భాష "ఓనమాలు'' నేర్చుకోవాలన్నా ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవలసి ఉంటుందో దొంగబాటుగా "ఓనమాలు'' పుస్తకాన్ని తెచ్చుకొని, సత్తెమ్మ చేసే బోళ్ల పోలంలో సంగం సభ్యులు రహస్యంగా చదువుకోవటం తెలుపుతుంది. ఆ పుస్తకం కూడ దొరల మనుషులు చింపేస్తుంటే కొన్ని కాగితాలు దాచుకున్నారట! 
నాడు ఆంధ్ర మహాసభ కలిగించిన చైతన్యం విప్లవాత్మకమైంది. పేద వర్గాల సమస్యల్ని పోరాట పంథాలో భాగ?ం చేయగలగడం వల్ల మరింత శక్తివంతంగా సంగం'' సామాన్య జన వ్యవహారంలోకి రాగలిగింది. చిలుకూరులో వెట్టి వ్యతిరేక తీర్మానం చేసినా, దాన్ని భువనగిరి మహా సభ 
కార్య రూపంలో పెట్టిన తర్వాత సంగం సామాన్య జనంలోకి చొచ్చుకుపోగలిగింది. అనేక ప్రాంతంల్లో జరిగిన వెట్టి వ్యతిరేక పోరాటాన్ని సంగం'' ప్రోత్సహించింది. ఆ వార్తల్ని ప్రజాశక్తి పత్రికలో అందిస్తుంటే, వాటిని రహస్యంగా మరో వారం రోజుల తర్వాతనైనా చదివి చైతన్యం పొందే వారంటే సంగం, ఆ పత్రికలు తెచ్చిన చైతన్యం ఎంత గొప్పదో తెలుస్తుంది. 
సంగం'' అన్ని కుల వృత్తుల వాళ్ళనీ ఐక్యం చేసి నిర్భంధ చాకీరి నుండి విముక్తి కలిగించాల్ని ప్రయత్నించింది. సంగం'' సభ్యుల మీద ఎన్ని నిషేధాలు ఉన్నా చాకలి మంగమ్మ వంటి వాళ్ళు ఆ నాయకుల్ని కాపాడేవారని తెలుస్తుంది. ఆ నాయకులు కూలీ రాజ్యం వస్తుందనే వారు. అప్పుడు అణగారిన వర్గాల వారే 
పాలకులవుతారని, వారి సమస్యల్ని వాటి పరిష్కారాల్ని వారి చేతనే చెప్పించటం వలన సంగం సభ్యులు ఎలాంటి కార్య చరణను కొనసాగించే వారో అర్థమవుతుంది. 
వెంకటయ్యను సత్తెమ్మ రెండో పెళ్ళి చేసుకోవాలనుకోవటం సావిత్రి తల్లి, అనసూయమ్మ, ముంతాజ్‌ వంటి స్త్రీల అక్రమ సంబంధాలు విషయంలో నాటి పాలకుల, ప్రజల విధానాల్ని, ఆకాంక్షల్ని అర్థం చేసుకోవచ్చు. 
బుడాన్‌ పొద్దున్నుండి రాత్రి వరకు అనసూయమ్మ ఇంటి దగ్గరుండి, ఓ దొర నరిసిరెడ్డి లాగేసుకున్న యాభైయ్యెకరాల భూమిని మళ్ళీ స్వాధీనం చేసుకోవడానికి ఖాసీం రజ్వీ అనుయాయీ, పెద్ద జాగీర్దార్‌ ఖాజీ మహమ్మద్‌ రసూల్‌తో మాట్లాడానని చెప్పి, అత్తా కోడళ్ళను మోసగించి కోడల్ని శారీరకంగా అనుభవించే సంఘటల్ని చదివినప్పుడు, ప్రజలెలా మోసపోయేవారో అర్థమవుతుంది. నాడు ప్రభుత్వం, కోర్టులు, చట్టం, పట్టించుకోని భూవ్యాజ్యాల్ని పరిష్కరించుకోవటానికి అక్రమ'' సంబంధాల్ని కూడా తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకరించవలిసి వచ్చేదని, అది ప్రజలక తెలిసి పరువు, ప్రతిష్ఠల్ని కోల్పోవలసి వచ్చేదని స్పష్టమవుతుంది. 
వ్యక్తిగతంగా హిందూ - ముస్లింల మధ్య కుటుంబాల్లో కలిసి మెలిసి ఉండే సంబంధాలున్నా, నైజాం నవాబుల పాలనలో హిందువుల పట్ల నిర్లక్ష్యం, ఖాశీం రజ్వీ పోషించే రజాకారుల దురాగతాల వల్ల ముస్లింలంతా వ్యవస్థీకృతంగా హిందువుల్ని వ్యతిరేకించే భావన కలిగించగలిగే వారని తెలుస్తుంది. అది ముస్లిం అయినా ముంతాజ్‌ ఇంటికి సత్తెమ్మ వెళ్ళటం, ఆమె ఇంటికి వెంకటయ్య రావటం, బుడాన్‌ ఆజాద్‌ - హైదరాబాద్‌'' ప్రచారం వంటివన్నీ స్పష్టం చేస్తున్నాయి. 
తెలంగాణాలో నైజాం ప్రభుత్వం ఢిల్లీ పాలకులతో, అసాంఘిక శక్తులతో సంబంధాలు పెట్టుకొని రహస్యంగా ఆయుధాల్ని దిగుమతి చేసుకుంటూ, వాటిని అన్ని ప్రాంతాల్లో హిందువులపై జరిగే అల్లర్లలో ఉపయోగించుకోవడానికి సహకరించేదని తెలుస్తుంది. అలాంటి ఆయుధాల్ని వెంటబెట్టుకుని కొంతమంది లారీల్లో ఊరేగింపుగా వచ్చి, జనాన్ని భయ భ్రాంతులకు గురి చేసి, ముసలి వాడ్ని చంపేస్తారు. కారుతున్న రక్తం చూసి, అతడు చనిపోయాడని గమనించి, ఊరేగింపు చేస్తున్నవాళ్ళు పారిపోతారు. ఊళ్ళో ప్రజలు వాళ్ళు పారిపోతున్నారని తెలిసి, ముసలివాడి దగ్గరకు వస్తారు. వాళ్ళని చూసి వచ్చిన వాళ్ళంతా పారిపోతారు. అలాగే అంతకు ముందు కూడా సత్తెమ్మ కర్ర తీసుకుని బోళ్ళబావి పొలాన్ని స్వాధీనం చేసుకోబోతున్న దొర మనుషుల్ని కొట్టడానికి వెళ్ళినపుడు కూడా ప్రజలు చాలా మంది తిరగబడాలనే ఉద్దేశంతో వెళ్ళిన వారు కాదు. అయినా గుంపులుగా వస్తున్న మనుషుల్నీ చూసి వాళ్ళు పారిపోయారు. కాబట్టి స్థానిక ప్రజల్లో దొరలు నైజాం ప్రభుత్వం, పోలీసులు పట్ల భయం ఉన్నా అవకాశం వస్తే తిరగబడాలనే ఆకాంక్షే ఉందని స్పష్టమవుతుంది. అదే పద్ధతి ముగింపులోనూ కనిపిస్తుంది. 
తెలంగాణాలో సాయుధ పోరాటం జరగడానికి వెనక ఎంతో నేపథ్యం ఉంది. సాయుధ పోరాటం ఒక్కసారిగా ఎగిసి పడలేదు. ప్రజల కష్టనష్టాల నుండి వచ్చింది. పాలకుల, పాలకుల ఉదాసీన వైఖరి వల్లా, పాలకులను ఆశ్రయించుకున్న హిందు జాగీర్దారీ పీడనను అవగాహన 
చేసుకోవాలంటే ఓనమాలు నవల చదివి తీరాల్సిందే. 
తెలంగాణా సాయుధ పోరాటం జరగడానికి సమాజంలో స్పష్టంగా వర్గాలుగా విడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. భూస్వాములు, ఉన్నంత వర్గం, మధ్య తరగతి, పేద వర్గంగా వాళ్ళు విడిపోయారు. కులం, వారి వృత్తులతో సంబంధం లేకుండా అందరూ ఒకే రకమైన పీడనను అనుభవించినట్లు నవలలో కనిపిస్తుంది. బహుశా, కుల సమస్య ఉన్నా, పీడన ప్రధానమైనప్పుడు దాన్నుండి రక్షించుకోవడానికి కొన్ని కులాలు ప్రయత్నించేవని కూడా అర్థమవుతుంది. అయితే రచయిత మాల, మాదిగలను ముస్లింలుగా మార్చుకోవడాన్ని మరోలా వివరించే ప్రయత్నం చేశారు. 
సిలారు ముస్లిం అయినా, హిందువుల పట్ల బుడాన్‌ లాంటి ద్వేషం ఉన్నవాడు కాదు. బుడాన్‌ ఒకసారి పందినీ, ఒక హిందువునీ చంపిన వాడు. ఆ తర్వాత ఖాసీం రజ్వీ ముఠాలో చేరినవాడు. ఆ దుర్మార్గం చూసిన తర్వాత బుడాన్‌ని తన అల్లుడుగా సిలార్‌ అంగీకరించలేదు. అలాంటి బుడాన్‌, ఒకరోజు సమాజ్‌ చేసుకొనే సమయంలో సిలార్‌ దగ్గర కొచ్చి ముస్లింల స్థితిగతుల గురించి వివరిస్తాడు. నిజాం నవాబుల పాలననూ, ఖాసీ రజ్వీసేనల అవసరాన్నీ చెప్తున్న సందర్భంలో రచయిత ఇలా వ్యాఖ్యానిస్తాడు. 
సిలారుకు అవన్నీ తెలీదు, పల్లెటూళ్ళలో మాల మాదిగలకు ఇతర దళిత జాతులకూ తురక మతం ఇప్పించి వారిని ఇతర కులాల మీదికి ఎగతోలేటందుకే ఖాజీ తీవ్రమైన వుద్యమం సాగిస్తున్నాడు. ఆ విధంగా మతం మార్చుకున్నవాళ్ళ మీద పెద్ద కులాల వాళ్ళు ఆర్థిక ఆంక్షలు ప్రయోగించి లొంగదీసుకుంటున్నారు. ఆర్య సమాజం వారి ద్వారా వారిని శుద్ధి చేస్తున్నారు. ఖాజీ ముస్లిం మత ప్రచారానికి తీసుకున్న శ్రద్ధ మూలంగానే ఆయన భూముల్ని రైతులు వదలకుండా చేయిస్తున్నారని బుడన్‌ చెప్పేడు.'' (ఓనమాలు, తృతీయ ముద్రణ, 1980:163) కులం చేత సమాజంలో అవమానాలు ఉన్నా, రచయిత ఆ కోణం నుండి చూడడం కంటే, వర్గ దృక్పథంతోనే వివరించే ప్రయత్నం చేశాడు. 
ప్రముఖ విమర్శకుడు దివికుమార్‌ ఒక వ్యాసంలో వ్యాఖ్యానించినట్లు బ్రిటీషు వలస వాదులు వ్యతిరేకంగా సాగిన జాతీయోద్యమ విభిన్న దశలను, పరిణామాలను, తొలి కమ్యూనిస్టు ఉద్యమ కృషినీ, వీరోచిత తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట నేపథ్యాన్ని, పోరాటాన్ని, కోస్తా జిల్లాలలో జమిందారీ వ్యతిరేక పోరాట కాలం నాటి రాజకీయ ఉద్యమ సంఘర్షణాత్మక చరిత్రను మహీధర రామ మోహనరావు అక్షర బద్దం చేయడంలో ఎంతగానో కృతకుత్యులయ్యారు. ఆ చరిత్రను, సామాజిక, ఆర్థిక, రాజకీయ విషయాలను సులభంగా అర్థం చేసుకోవడానికి ఆయన రచనలు ఎంతగానో సహకరిస్తాయనడంలో సందేహం లేదు. 

No comments: