Saturday, April 15, 2017

ఊరిపేర్ల చివర ‘పాడు’ ఎందుకొచ్చింది?


అందరికీ నమస్కారం!

ఇందులో "పాడు" ( దోసపాడు, దొండపాడు, దూపాడు మొదలైనవి) అనేవి ఒకప్పటి అగ్రహారాలు. ఇక్కడ పాడు అనేది "పాఱుడు" శబ్దభవం. పాఱులకు అంటే బ్రాహ్మణులకు దానంగా ఇచ్చిన ఊర్లు. 

-డా. ఎస్.ఎల్.వి.ఉమామహేశ్వరరావు
పాడు అనేది పారుడు కాదు. అగ్రహారానికి పారుడు అని పేరు ఉండదు. 
పాడు అనే పేర్లు ఉన్నవన్నీ  ఒకప్పుడు జైన కేంద్రాలు. వాటిని పాడు చేశారు కాబట్టి ఆ పేరు వచ్చింది. ఇదే విషయాన్ని ఆరుద్ర గారు కూడా రాశారు. 
కన్నడంలో కూడా పాడు అనే అర్థం లోనే హాళు  (నేగినహాళు) అనే పేరుతో  ఊర్లు ఉన్నాయి. అవి కూడా జైన కేంద్రాలే. 
ఆర్వీయస్ సుందరం 

అందరికీ నమస్కారం.  ముఖ్యంగా సుందరం గారికి.  సుందరం గారూ బాగున్నారా?  ఇప్పుడు ఎక్కడున్నారు?

పాడు అనే రూపంతో మూడు మాటలు ఉన్నై తెలుగులో. ఒకటి క్రియ; రెండవది విశేషణం, నామం కూడా వాడవచ్చు; మూదవది కేవలం నామవాచకమే.  (1) పాడు (క్రియ) =  గానం చేయు; (2) పాడు (ప్రధానంగా విశేషణం) = చెడిపోయిన; దీనికి నామంగా కూడా వాడుతాం: పాడు అయింది = చెడిపోయినదిగా అయింది.  (3) పాడు = గ్రామం.  ఈ మూడూ మూడు వేరువేరు ధాతువులనించి వచ్చినై.  చెడిపోయిన అనే అర్థంలో వాడే పాడు కన్నడంలో హాళు, తమిళంలో పాళ్.  తమిళం పాళ్ లోని ళ్ వేరు.  ఆ ధ్వని పూర్వం తెలుగులో కూడా ఉండేది (శాసన భాషలో).  ఆ లిపి ఇప్పుడు మన ఫాంట్స్ లో లేదు.  గ్రామం అనే అర్థంలో ఉన్న పాడుకు తమిళంలో పాటి (ఉచ్చారణలో పాడి) = town, city, hamlet, pastoral village; కన్నడంలో పాడి = settlement, hamlet, village, కొడగు భాషలో పడి = hut of a Kurumba; తెలుగులో పాడు (ఊళ్ళ పేర్ల చివర మాత్రమే వస్తుంది) = village,  (చూ. Dravidian Etymological Dictionary; entry No. 4064).    

తెలుగు వ్యుత్పత్తి పదకోశం పైన పేర్కొన్న మూడవ పాడుకు ఈ కింది అర్థాలు ఇచ్చింది.

పాడు3 (రూపాంతరం: పాడ; పాండ్ర, పాండ్రి).  దున్నని భూమి; గ్రామం నశించిన ప్రదేశం; నివసించటానికి ఏర్పరచుకొన్న స్థలం; జిగురు ఇసక సమపాళ్ళుగా ఉన్న మట్టి (పాటిమట్టి) ఊళ్ళ పేర్ల చివర వచ్చే అనుబంధం (కూరపాడు; దొండపాడు మొ.)
కన్నడం: పాడి = కొత్తగా ఏర్పరచుకొన్న గ్రామం.

పై సమాచారాన్ని బట్టి పాడు అనేది కారంచేడు, కురిచేడు వంటి ఊళ్ళ పేర్లలోని చేడు వలె నేల స్వభావాన్ని తెలుపుతూ ఏర్పడ్డ ఊళ్ళ పేర్లల్లో కనిపిస్తుంది.  ఇట్లాంటి పదాలు ఇంకా ఉన్నై.  కుర్రు (కుఱ్ఱు అని రాయాలి పాత పద్ధతి ప్రకారం); పర్రు (పఱ్ఱు); మర్రు మొదలైనవి.  కుర్రు, పర్రు లతో  ఉన్న ఊళ్ళ పేర్లు గుర్తురావటం లేదు; చీమకుర్తి, పాలపర్తి వంటి ఊళ్లపేర్లు మొదట చీమకుర్రు, పాలపర్రు అని ఉండేవి.  పామర్రు అన్ఉే ఊరు ఉంది.  అది ఇంటి పేరు అయినప్పుడు పామర్తి అవుతుంది. 

-పాడు, -చేడు చివర ఉన్న ఊళ్ళపేర్లు కూడా ఇంటి పేర్లు అయినప్పుడు -పాటి, -చేటి అవుతై.  గరికపాడు : గరికపాటి; పులిపాడు : పులిపాటి; కురిచేడు : కురిచేటి; కారంచేడు : కారంచేటి -- ఈ విధంగా. 

నామవాచకాలు విశేషణాలుగా మారినప్పుడు ఔపవిభక్తిక రూపాలుగా మారుతై.  ఇల్లు : ఇంటి; చేయి : చేతి లాగా. 
-డు చివరి అక్షరంగా కలిగిన అమహద్వాచక (పురుషులను బోధించని) నామవాచకాలు ఔపవిభక్తికాలుగా మారినప్పుడు వాటి చివరి -డు -టిగా మారుతుంది.  తాడు : తాటి మీద; నాడు : నాటి -- ఈ విధంగా.  ఈ కారణంగానే పైన పేర్కొన్న గరికపాటి, పులిపాటి; కారంచేటి మొదలైన రూపాలు వచ్చినై.  ఇది బలమైన కారణం -- పైన పేర్కొన్న నామవాచకం అయిన మూడవ పాడు’ (= గ్రామం) విశేషణమైన రెండవ పాడు’ (= చెడిపోయిన) వేరువేరు అనటానికి.  కనుక జైనులు పాడు చేసిన ఊళ్ళు కనుక ఈ ఊళ్ళ పేర్ల చివర -పాడు అని ఉన్నది అన్న సుందరం గారి మాట గురించి ఆలోచించవలసి ఉంది.  రెండవ కారణం చెడిపోయినఅనే అర్థంలోని పాడులోని డకాకారానికి మూలం మూలద్రావిడ భాషలోని వేరే అక్షరం.  (దాన్ని రాయటానికి ఇప్పుడు మనకు లిపి లేదు.)  కాని, ’గ్రామంఅనే అర్థంలోని పాడులోని డకారానికి డకారమే (నిజానికి అది మూలద్రావిడంలో టకారం అనాలి - ఉచారణలో డకారమే).  కనుక ఈ రెండూ వేరువేరు మూలాల నించి వచ్చిన పదాలు.  క్రియాపదం అయిన మొదటి పాడు’ (=గానం చేయు) లోని డకారానికి కూడా డకారమే మూలం.  గ్రామం అనే అర్థంలో వచ్చే పాడులోనూ, గానంచేయు అనే అర్థం లో వచ్చే పాడులోనూ డకారమే ఉన్నప్పటికీ వీటి మూల ధాతువులు వేరు; ఒకటి క్రియ; రెండవది నామం.     

రామనరసింహం.        

ప్రియమిత్రులారా,
తెలుగు ఊళ్లపేర్ల చివరన ఉన్న -పాడు పుట్టుక, వ్యుత్పత్తి గురించి మీరు చేస్తున్న చర్చను చూశాను.

 నా అభిప్రాయం తెలపాలనిపించింది. తెలుగు రాష్ట్రాలూ, మిగిలిన దక్షిణాది రాష్ట్రాలలోనూ -పాడు
 చివరన ఉన్న ఊళ్ల పేర్లు  వేలాదిగా కనబడుతున్నాయి. దీనికి ఎమెనో-బరోలు కూర్చిన ద్రావిడ వ్యుత్పత్తి కోశం నుండి  ఈ కింది  ఆరోపాలను చూపించవచ్చు. 
1. Te. pāḍu village (<మూల ద్రా. *pāṭu[pāḍu]) at the end of names of places). 
         DEDR 4064;  దీనికి తమిళాది ద్రావిడ భాషలలో సజాతి పదాలు ఇలా ఉన్నాయి. Ta. pāṭi town, city,        hamlet, pastoral village; pāṭam street, street of herdsmen. Ma. pāṭi  (in n.pr. of villages). Ka. pāḍi settlement, hamlet, village.
2.  Te. pāḍu (< మూల ద్రా. *pār̤ ) ‘ruined, dilapidated, desolate, waste, dreary, bad, wicked, evil.’; In other Dravidian languages in the sense of ‘barren or waste land, empty, abandoned (house, village-site)’; DEDR 4110; DEDR= ద్రావిడ వ్యుత్పత్తి పదకోశం, 2వ సంస్కరణ.
    
       ఐతే ఈ రెండింటిలోనుంచీ అర్థపరంగా చూస్తే మొదటిది మాత్రమే సరైన మూలం అని చెప్పాలి. వేలాదిగా ఉన్న ఈ ఉళ్లు పాడుబడినవీ, చెడిపోయినవీ, వదిలేసినవీ కాకూడదు కాబోవుకూడా. ఇవన్నీ అగ్రహారాలు కూడా కావాల్సిన పని లేదు. అలాగే అవన్నీ జైన కేంద్రాలూ కానక్కరలేదు. ఇక, పాఱుడు, పారుడు, మొదలైనవాటితో దీనికి సంబంధం లేదు. ఇంకా,  ఊరు చివర -పాడు ఉన్న ఊళ్లను మన శాసనాలలో ఎక్కడా ఎప్పుడూ -పాు అని రాయ లేదనుకుంటా. ఇది ఈ నిర్ణయానికి ఒక ఆధారం. 
ఉమా మహేశ్వరరావు

Uma Maheshwar G  


No comments: