యౌవనుల రాజ్యం
ఎవ్వరైనా ఇక్కడ యవ్వనులే
ఇక్కడి వినోదాలపై బ్రతుకుతోంది ప్రపంచమో సగం
ఇక్కడి వినోదంకోసం తన్నుకుఛస్తోంది ఇంకో సగం
ఇక్కడ చావుకూ వినోదానికి పెద్ద తేడా లేదు
ఆడుకోటానికి వాల్‌మార్టుల్లో
దొరుకుతాయ్ స్టెన్ గన్నులు
తెలుపు నలుపు కుర్రకారుకు
అవే అంతులేని ఫన్నులు
అసహనం, అహంకృతి కలిసి ఆడుకొంటుంటాయి
అంతర్జాతీయ వేదికపై ‘తొక్కుడు’ బిళ్లలాటలు
ఆకాశమంత ఎత్తైనది దీని ప్రాభవం
అవనీ, అంతరిక్షంపై తనదే ఆధిపత్యం
ఇది అ-మేరక
‘మేర’లు దేనికో తెలియని ప్రహేళిక
ఉడత కూడా ఇక్కడ కుందేలంత
అడుగడుగున కనువిందు చేసే వింత
రెండొందలేళ్ల గొప్పని గొప్పగా చెప్పే ఘనత
బాల యవ్వనులు, నవ యౌవనలు,
ప్రౌఢ యౌవనలు, పెద్ద యవ్వనులు,
మాట తేడానే; మనసు తేడా లేదు
వయసడుగుట తగదు; సంస్కారం కాదు..
ఇది నిరతోత్సాహ యౌవన ప్రదర్శనశాల
బహనాగరకతల సంగమ కేళీ విలోల..
ఇది అన్ని జాతిమొక్కల సుందరోద్యానవనం
అంటుగట్టుట ఇక్కడి స్వాభావిక హృదయ ధర్మం
ఇక్కడ ప్రేమా, స్వాతిశయం పక్కపక్కనుంటాయ్
నిరాడంబరత, నార్సిజం ముడిపడుతుంటాయ్
అమాయకత్వం, చురుకుదనం జతకడుతుంటాయ్
వ్యక్తినవ్యక్తిత్వం చదరంగం ఆడుకొంటుంటాయ్
సగటు ప్రజకు ఇక్కడ వినోదమే తారక మంత్రం
ప్రపంచమే ఓ వినోద విలాస విహార క్షేత్రం..
అణచివేత, ఐశ్వర్య సాధనల మహచ్చరిత్ర
వాణిజ్య ప్రతిభ సృష్టించిన సంస్కృతి ‘జాత్ర’..
ఇది ఆదిమత, ఆధునికతలు సమసించినచోటు
ఆదర్శం, అధికారం చెట్టాపట్టాలేసుకొన్న చోటు
ప్రజాస్వామ్యానికి పెట్టని కోటలా మారిన చోటు
ఇది అ-మేరక
అవకాశాలకు మెరక
అతి నాజూకుల చిలక..
పట్టపగలు ఇక్కడ వీధులు
అర్థరాత్రి దొంగలు పడ్డట్లుంటాయ్
మనుష్యుల్ని కార్లు దోచుకుపోతుంటాయ్..
ఇక్కడ ప్రతి ఇల్లూ ఒక ద్వీపం
ప్రతిమనిషీ ఒక ద్వీపకల్పం
అదృష్టం!.. ఓ వైపైనా
పలకరింపు చోటుంది!!
(ఆంధ్రభూమి, సాహితి, 6 ఫిబ్రవరి 2017 పత్రికలో ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారి కవిత ప్రచురితమైంది. ఈ పత్రిక సౌజన్యంతో ‘డయాస్పోరా సాహిత్యం’ మా విద్యార్థుల చదువుతున్న సౌకర్యార్థం దీన్ని ఇక్కడ పున: ప్రచురిస్తున్నాను. ..దార్ల)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి