"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

08 May, 2016

డా॥బోయ జంగయ్య గారు 8 మే 2016న కన్నుమూత

(ప్రముఖ కవి, కథా రచయిత డా.బోయజంగయ్యగారు 8 మే 2016 న మరణించారు. ఆయనకు నా నివాళిని అర్పిస్తున్నాను. గతంలో   ఈయన గురించి నేను రాసిన వ్యాసం ది 2-5-2011 న సూర్య దినపత్రికలో ప్రచురించారు.  ఆ వ్యాసాన్ని  ఈ సందర్భంగా పున: ప్రచురిస్తున్నాను. దార్ల వెంకటేశ్వరరావు)

-డా॥దార్ల వెంకటేశ్వరరావు
అసిస్టెంటు ప్రొఫెసరు, తెలుగు శాఖ,
సెంట్రల్‌ యూనివర్సిటి, గచ్చిబౌలి, హైదరాబాదు`500 046

(ప్రముఖ రచయిత డా॥బోయ జంగయ్య రాసిన ‘‘జగడం’’ నవల హైదరాబాదు విశ్వవిద్యాలయంలో ఎం.ఏ.,తెలుగు విద్యార్థులకు పాఠ్యాంశంగా కొనసాగుతుంది. ‘‘దళితసాహిత్యం’’ ఒక ఐచ్చికాంశంగా బోధిస్తున్న నేపథ్యంలో ఆయన్ని ఈ నెల (ఏప్రిల్‌) 19 న పలకరించాను. ఆ సందర్భంగా ఆయన వ్యక్తిగత జీవితానికీ, రచనలకీ సంబంధించిన విలువైన విషయాలెన్నింటినో వివరించారు.
నాటికీ నేటికీ అట్టడుగు వర్గాల్లో చాలా గుణాత్మకమైన మార్పులు వచ్చాయనీ, వీటన్నింటి వెనుకా అంబేద్కర్‌, మరికొంతమంది సామాజిక ఉద్యమకారులు సాధించి పెట్టిన హక్కులు, ఆ ఉద్యమ స్ఫూర్తీ ఉందనీ, దీన్ని కవులు, రచయితలు, కళాకారులు నేటికీ వివిధ రూపాల్లో ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడం వల్ల ప్రజలు చైతన్యవంతమవుతున్నారని వ్యాఖ్యానించారు. అయినా, ఇప్పటికీ కులం, మతం, జెండర్‌, ప్రాంతం, భాషల ఆధారంగా వివక్ష కొనసాగుతుందనీ, అందువల్లనే రచయితలు అవిశ్రాంత యోధులుగా రాయకతప్పట్లేదనీ, దానిలో భాగమే తన రచనల్నీ చూడాలని వివరించారు.
‘‘జాతర’’ నవలలో తాను ప్రస్తావించిన మన్మథపూజ నేటికీ జరుగుతుందనీ, అయితే అది రూపం మార్చుకుందన్నారు. వారి రచనల్లో వివిధ సందర్భాల్లో  జోగినీ దురాచారం, గిరిజనులు పిల్లల్ని అమ్ముకోవడం,రిజర్వేషన్ల వల్ల అధికారం వచ్చినా దాన్ని అట్టడుగు వర్గాల వాళ్ళు సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నారని ప్రకటించారు. తన రచనల్లో కల్పించిన సన్నివేశాలు, వర్ణనల రూపంలో యథాతథంగా నేడు లేకపోవచ్చునేమో గానీ, అవి రూపాలు మార్చుకొని సమాజంలో నేటికీ కొనసాగుతున్నాయన్నారు.అయితే, చాలా వరకూ మనకున్న చట్టాల వల్ల ప్రత్యక్షంగా అవి చాలా చోట్ల బయటపడట్లేదన్నారు. ‘‘జగడం’’ నవల తన ఆత్మకథ వంటిదనీ, తన రచనల్లో అనేక పాత్రల్లో తన జీవితాన్నీ, ఆశల్నీ, ఆశయాల్నీ చొప్పించానని పేర్కొన్నారు.వాటిని ఈ వ్యాసం రూపంలో అందిస్తున్నాను.)
‘‘అమ్మా కుంటోన్ని
‘‘పోయిరా’’
తల్లీ గుడ్డోన్ని
‘‘వెళ్ళిరా’’
మా తల్లీ, ముసలోన్ని
‘‘ ఫో,ఫో’’
ఏడుకొండలవాడా, వెంకటరమణా
‘‘ వస్తున్న ఉండు’’  ఈ మినీకవిత చాలా మందికి తెలుసు. కానీ, దీన్ని రాసిన కవి డా॥బోయజంగయ్య అని వాళ్ళందరికీ తెలుసని చెప్పలేం. కవిత్వం ఇలా ప్రజల పక్షం కావాలంటే, ఆ కవితా వస్తువులో బలం ఉండాలి. దాన్ని చెప్పడంలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలగాలి. వీటితో పాటు దాన్ని శక్తివంతంగా వివరించడానికి సరిపోయే రూపాన్ని ఎన్నుకోగలగాలి! ఇలా తాను చెప్పాలనుకున్న వస్తువుకి తగిన శిల్పాన్నీ, రూపాన్నీ సమపాళ్ళలో అందిస్తున్న గొప్ప రచయితల్లో ఒకరు డా॥బోయి జంగయ్య. ఈయన రాసిన జాతర  (1988) , జగడం (2003) నవలలు స్వాతంత్య్రానికి ముందూ, ఆ తర్వాతా దళిత,బడుగు, అట్టడుగు వర్గాల్లో వచ్చిన పరిణామాల్ని అర్థం చేసుకోవడానికి నిదర్శనాలుగా నిలుస్తాయి.
1942 లో పుట్టిన జంగయ్య తన పదిహేనవ సంవత్సరం నుండే రచనలు ప్రారంభించినా, తన బాల్యం నాటి జీవితంతో పాటు, తన ముందు తరాల జీవితాల్ని కూడా అక్షరబద్దం చేశారు.పుట్టి, పెరిగింది తెలంగాణలోని నల్గండ ప్రాంతమైనా, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల సమస్యలతోను మమేకమై, అందర్నీ ఆలోచింపజేసేవిధంగా తన సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించి పండితపామరుల చేత ‘‘శభాష్‌’’ అనిపించుకున్నా, ఆయనకంటూ కొన్ని ప్రత్యేకమైన అభిప్రాయాలున్నాయి. అవి వారి రచనల్లోను, వారు వివిధ సందర్భాల్లో వ్యక్తం చేసిన రచనల్లోను గుర్తించవచ్చు.పాటలు, నాటికలు రాయడంతో తన సాహిత్య ప్రయాణాన్ని ప్రారంభించి, కవిత్వం, కథలు, నవలలు, విమర్శ వంటి వివిధ ప్రక్రియల ద్వారా తన అభిప్రాయాల్ని వ్యక్తీకరించారు. వీరి రచనల్ని చదువుతున్న పాఠకులకు ప్రాంతం, భాషలు ఏవైనా మానవుల అనుభూతులు, అందులోను దళిత,బడుగు,అట్టడుగు వర్గాల వేదనామయజీవితాలన్నీ ఒకేలా ఉంటాయేమో అనే తాదాత్మ్య భావన కలుగుతుంది.నిజానికీ గుణం సమర్థుడైన ప్రతి కవి,రచయితకు ఉంటుంది. 
సాధారణంగా ఏ రచయితైనా తన జీవితాన్ని గాని, తన అనుభవంలోకి వచ్చిన జీవితాన్ని గాని తన రచనకు నేపథ్యంగా తీసుకుంటారు. ఈ జీవితాన్ని సృజనలోకి తీసుకొచ్చేటప్పడు అనేక కల్పనల్నిజోడిరచడం ద్వారా అది ‘‘కళ’’గా మారుతుంది. వీరి రాసిన జగడం నవలలో రాజయ్య పాత్ర గురించి చదువుతుంటే, అది రచయిత జీవితంలా అనిపిస్తూనే, కాదేమో అనీ ఆ పాత్రలోని అనేక విశేషాంశాల్ని బట్టి అనిపిస్తూ రచనను సాధారణీకరిస్తుంది.
‘‘జగడం’’నవలలో రాజయ్య ఐదవతరగతి తర్వాత చదువుకోవాలని ఉన్నా, ఆ తాహతు లేని నిస్సహాయస్థితిలో ఒక ఆబ్కారీ జవాను సూచనతో కల్లులారీ ఎక్కి పట్నం వెళ్ళి చదువుకున్నట్లు  (పుట: 30) రాశారు రచయిత. తన జీవిత నేపథ్యాన్ని రచయిత ఒక వ్యాసంలో ఇలా చెప్పుకున్నారు. ‘‘ ఐదవతరగతి పూర్తయ్యింది.... ఒక రోజు ముంజకాయల కోసం పాటిమీదకి వెళ్ళా. అక్కడ కల్లు తాగుతూ ఓసాయిబు కూర్చున్నాడు. ఆయన ఉద్యోగ రీత్యా ఆబ్కారీజవాను. నన్ను వివరాలడిగి నల్లగొండ తీసికెళ్ళి ఓ స్కూల్లో, ఆ తర్వాత యస్సీ హాస్టల్లో జాయిన్‌ చేయకపోతే నా చదువు అంతటితో ఆగిపోయేది...’’ అని రాసుకున్నారు. జగడం నవల మొదటిసారి చదివినప్పుడు ఈ భావాలు నాకు తెలియవు. తర్వాత ఆయన రచనల్ని చదువుతుంటే, ఈ వాక్యాలు ఆ నవలను, ఆయన సృజనాత్మక రచనల్ని అన్నింటినీ మళ్ళీ చదివించేలా చేశాయి. ఇలా రాసినంత మాత్రం చేత ఆ నవలలో రాజయ్య పాత్రకున్న లక్షణాలన్నీ రచయితకే ఉన్నాయని సూత్రీకరించలేం! ఇదే రచయితలోని సృజనాత్మక ప్రతిభ. తన జీవితం నుండే లోకాన్ని చూస్తున్నా, లోకాన్నే తన జీవితం నుండి చూస్తున్నా, ఆ చూపుతో సామాజిక వాస్తవికతను కళాత్మకంగా పాఠకుని ముందుంచడానికే ప్రయత్నిస్తుంటాడు రచయిత.అది ఈ రచయితలో పుష్కళంగా కనిపిస్తుంది.ఆయన్ని ఈ విషయంలో పలకరించినప్పుడు జగడం నవల తన ఆత్మకథ వంటిదనీ, రాజయ్య పాత్ర తనదేననీ, అయితే, అతను న్యాయవాదిగా మార్పుచేశాననీ వెల్లడిరచారు. దీనిలో శిరీష అనే ఒక దళితేతర అమ్మాయి పాత్ర ఉంటుంది. ఆమె, కథానాయకుడు ప్రేమించుకున్నా, కులం అడ్డొచ్చి వివాహం జరగకపోవడం తన జీవితంలో జరిగిన సంఘటనేనని నవ్వుతూ చెప్పేశారు. విమల అనే జోగినిని కథానాయకుడు వివాహం చేసుకున్నట్లు రాసిందానిలో కళాత్మకసృజన దాగిఉందన్నారు.
1963లో ‘‘కష్టసుఖాలు’’ నాటికను తన తొలిపుస్తకంగా ప్రచురించిన వీరి కలం నుండి అనేక రచనలు వెలువడ్డాయి.వీరి తొలికథ‘‘ జీవితమలుపులు’’ ఆ తర్వాత విస్తృతంగానే  రాసినా, విశిష్టమైన కథల్ని రాశారు.‘‘లోకం, గొర్రెలు (1981), ఎచ్చరిక (1984), దున్న(1989), రంగులు (1984), చీమలు (1996), తెలంగాణ వెతలు  (1998), బోజ కథలు ( 2000), బమ్మలు (2002), ఉప్పనీరు (2002), ఇప్పపూలు (2003), ఆమె ( 2004) మొదలైన కథా సంపుటాలుగా ప్రచురించారు. మనుషుల్లోని క్రూరత్వాన్ని ప్రతీకాత్మకంగా చెప్పడానికి జంతువుల కంటే వికృతంగా ప్రవర్తించేదోపిడీదారుల గురించి గొర్రెలు కథలు రాశారు.అంబేద్కర్‌, జగజ్జీవన్‌, గుర్రం జాషువ, కె.ఆర్‌.నారాయణన్‌ ల జీవిత చరిత్రల్ని రాశారు.వీటితో పాటు బాలల కోసం ప్రత్యేకించి ‘‘బడిలో చెప్పనిపాఠాలు’’, గుజ్జనగూళ్ళు, ఆటలు`పాటలు, చిలకల పలుకులు మొదలైనవి రాశారు.
 తెలంగాణాలోని రజాకార్లు, వాళ్ళ పేరుతో దౌర్జన్యాలు చేసేవాళ్ళ గురించి, నాటి తెలంగాణా పోరాటాల్లోని వివిధ పార్శ్వాల్ని ‘‘తెలంగాణ వెతలు’’ కథల్లోను, జాతర, జగడం నవలల్లోను వర్ణించారు. సంతానం లేకపోతే రాళ్ళూ, రప్పలకు మొక్కే గ్రామీణుల్ని ఎలా వంచిస్తుంటారో జాతర నవలలో వివరించి, ప్రజల్ని చైతన్యవంతం చేశారు. జాతర నవలలో పిల్లలు పుట్టకపోవడానికి తన కోడల్లోనే లోపముందని భూస్వామి సీతయ్య పటేలు నమ్ముతుంటాడు. తన కొడుకులో ఏ లోపం లేనట్లు, కోడల్ని జట్టు జాతరకి పంపిస్తాడు. జాతర నుండి వచ్చిన తర్వాత ఆమె  గర్భవతి అవుతుంది. ఎందువల్ల అలా జరిగిందో ఆమెకు తెలియకపోయినా, పాఠకులకు తెలుస్తుంది. జాతరలో పిల్లలు పుట్టడానికి పూజారి పూజ చేస్తాడు.రకరకాల దృశ్యాలు చూపిస్తాడు. మన్మథపూజ చేస్తానని, ఆమెను వశపరుచుకుంటాడు. వ్యక్తావక్తంగా ఉన్న స్థితిలో ఆమెను కళ్ళు మూసుకున్న సమయంలో పూజారి ఆమెను వశపరుచుకుంటాడు. ఇలా తమకేమి జరుగుతుందో తమకే తెలియకుండా స్త్రీలు ఎలా వంచనకు గురౌతున్నారో, వాటిని నవలలో చక్కగా వర్ణించారు.  ఇలాంటి సంఘటనలు నేటికీ జరుగుతున్నా, గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నాయనీ, చదువుకున్నవాళ్ళు కూడా ఇలాంటి పనులకు పాల్పడడానికి కారణం, నేటికీ విద్యా, వైద్య విషయాల్లో శాస్త్రీయత రాకపోవడమూ, వైద్యం ఖరీదై, మోసపూరితమై, దోపిడీగా మారడం కూడా ఒక బలమైన కారణంగా రచయిత నాకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇలా జాతర నవలలో సామాజిక వాస్తవాల్ని సాహిత్యీకరించారు. రాసినవి రెండే నవలలైనా, రెండూ తెలుగు నవలాసాహిత్యంలో విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఈ రచనకే తెలుగు విశ్వవిద్యాలయం వారు 1989లో ఉత్తమ నవలా పురస్కారం ఇచ్చింది.
కలిసి మెలిసి జీవించడానికి ఉపయోగపడేలా కొన్ని జీవన సూత్రాల్ని ప్రతిపాదిస్తే, వాటిని తమ రాజ్యాధికారాల్ని కాపాడుకోవడానికి పాలకులు ప్రయత్నించారని ఏ దేశ చరిత్రనడిగా చెప్తుంది. శాంతికి సంకేతాలుగా పావురాల్ని వర్ణిస్తూ, మతమేదైనా, పావురాలు మసీదుల్లోనో,చర్చిల్లోనో, దేవాలయాల్లోనో కలిసిమెలిసి జీవిస్తున్నట్లే, మానవులు కూడా సమైక్యంగా జీవించాలనే ఆకాంక్షతో ‘‘ వెలుతురు’ కవితా సంకలనంలో ‘‘పావురాలు’ కవితను వర్ణించారు.
‘‘జగడం’’ నవల సుమారు ఐదు దశాబ్దాల భారతీయ సామాజిక జీవనంలో అట్టడుగు వర్గాల ఆశల్నీ, ఆశయాల్ని వర్ణించారు. కథ రాష్ట్ర రాజకీయాల కేంద్రంగా నడుస్తున్నా, దేశవ్యాప్తంగా జరుగుతున్న అనేక పరిణామాల్ని స్ఫురించేటట్లు కథనీకరించారు.ఆర్థికంగా మార్పు రాకుండా, కేవలం రాజకీయాధికారం ఉన్నా ఫలితం ఉండదనీ, ఆ ఆర్థికపరిపుష్టి ఈ దేశంలో కులంతో ముడిపడి ఉందని, అందు వల్ల ముందు కులనిర్మూలన జరగాలనే ప్రతిపాదన, దాని ప్రణాళికను ఈ నవల్లో అందించారు.కులంతో ముడిపడి ఉన్న జోగినీ వ్యవస్థను కూడా విమల పాత్ర ద్వారా స్పర్శించారు. విమలకి దేవునితో పెళ్ళి చేశారు. అందు వల్ల దేవాలయ భూముల మీద వచ్చే ఆదాయం  ఆమెకే చెందాలి. కానీ, ఆ ఆస్తిని అనుభవించేది మాత్రం భూస్వాములు. దేవుడి భార్యగా ఉన్నా, ఆ ఆస్తిపై హక్కులేక, వాళ్ళ అందాన్ని మాత్రం అనుభవిస్తూ, వాళ్ళ జీవితాల్ని ఎలా నాశనం చేస్తున్నారో ఈ పాత్ర ద్వారా వివరించారు.న్యాయం, చట్టం, శాసనాలన్నింటిపైనా కులం ప్రభావితం చేయడం వల్ల వీళ్ళ ఆర్థికస్థితిగతుల్లో మార్పులెలా వస్తాయని, అందుకనే ఈ దేశంలో కమ్యూనిజం పేదవర్గాల్ని పట్టించుకున్నా, కులాన్ని పట్టించుకోకపోవడం వల్ల విజయవంతం కాలేకపోతోందని రాజం పాత్ర ద్వారా స్పష్టంగానే చెప్పారు. ‘‘పనిష్‌మెంటు’’ కథలో కూడా లైంగికదోపిడీకి కులం అడ్డురాని వైనాన్ని వర్ణించారు. మొత్తం మీద ఈ నవల చదివితే అంబేద్కర్‌ దృక్పథమేమిటో సామాన్యుడికి కూడా చక్కగా అవగాహనకొస్తుంది.ఈయన రాసిన కథల్లో కూడా ఇలాంటి లక్షణమే కనిపిస్తుంది.
దళితులు,బడుగు వర్గాల వారికీ కేవలం కొన్ని పదవులు లభించినా, వాటిని సమర్థవంతంగా నిర్వహించుకోగలిగే సామర్థ్యం కలిగి ఉన్నప్పుడే వాటి లక్ష్యం నెరవేరుతుందంటారు. పంచాయితీ నుండి పార్లమెంటు వరకూ నామినేట్‌ చేయగలిగే వాళ్ళంతా దొరలేనంటారు. ఆ దొరలు చెప్పినట్లు చేయడానికే వీళ్ళూ, వీళ్ళ పదవులూ ఉపయోగపడుతున్నాయని, అందువల్ల ముందుగా సామాజికంగా చైతన్యవంతమై, ఆర్థికంగా నిలదొక్కుకుంటూ,రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవడం ద్వారానే నిజమైన అధికారాన్ని ఉపయోగించుకోగలుగుతారనే అభిప్రాయం వీరి రచనల్లో కనిపిస్తుంది.పేదవాళ్ళంతా ఏకమై తమ హక్కుల్ని ఎలా సాధించుకోవాలో ‘‘చీమలు’’ కథల సంపుటి నిండా కనిపిస్తుంది. రిజర్వేషన్ల వల్ల అధికారంలోకి వచ్చినా, వాళ్ళు చెప్పినట్లే నడిస్తే తమ జీవితాలెలా నాశనమైపోతాయో ఆలోచించి, తన అధికారానికి కారణమైన ప్రజలందరినీ  ముందు చైతన్యవంతం చేసి, తమ హక్కుల్ని కాపాడుకోవడమెలాలగో ఒక ఎస్టీ సర్పంచ్‌ పాత్ర ద్వారా అద్భుతంగా వివరించారు.
సాహిత్యం ప్రాంతీయ, లింగ, కుల భేదాల్ని పోగొట్టడానికీ, మానవీయ విలువల్ని గుర్తించడానికీ ఉపకరించేలా ఉంటే బాగుంటుందనే లక్ష్యంతో తన సాహిత్య సృజనను కొనసాగిస్తున్నారు. ఉన్నత చదువులు చదివేకొద్దీ సంస్కారం పెరగాల్సింది పోయి, రకరకాలుగా పెడ ధోరణుల్లో పయనించడం పట్ల వీరిలో ఆవేదన కనిపిస్తుంది.సాహిత్యాన్ని ప్రాంతాలవారీగా గిరిగీసి పంచుకుందామంటే తనకి ఇష్టముండదని స్ఫష్టంగానే ఒక వ్యాసంలో ప్రకటించారు కూడా! రచయిత నా కిచ్చిన ఇంటర్వ్యూలో నేటికీ ఈ అభిప్రాయాల్లో మార్పులేదన్నారు. భాష అనేది భావప్రకటనకు ఉపయోగించుకునే ఒక సాధనం మాత్రమే. అది ఆ యా ప్రాంత ప్రజల సౌకర్యానికి అనుగుణంగా ఉంటుందే తప్ప, కొన్ని ప్రాంతాల వాళ్ళ భాషలు గొప్ప, మరికొన్ని గొప్పవి కాదనే ధోరణి సరైంది కాదన్నారు.వీరి రచనల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, వ్యాసాల్ని శిష్టవ్యావహారికంలోను, సృజనాత్మక సాహిత్యాన్ని పాత్రోచితంగాను, అదీ తెలంగాణాలో వాడుకలో ఉండే సజీవమైన భాషను ప్రయోగిస్తుంటారు. జాతరలో కంటే, జగడం నవలలో తెలంగాణా ప్రాంత వ్యావహారిక భాషను ఎక్కువగా ఉపయోగించారు. భాషా ప్రయోగాల గురించి ఆయన  ఇలా ఆన్నారు. ‘‘ జరిగిన లేదా జరుగుతున్న అన్యాయాన్ని అది జరిపేవాళ్ళకు మనచూట్టూరావున్నవాళ్ళకు అర్థమైయ్యే భాషలో చెప్తే రియాక్షన్‌ తొందరగా వస్తుందని నా నమ్మకం’’ వీరి రచనల్లో గుర్తించదగిన మరో విశిష్టత రచనావిధానం. దేన్ని చెప్పినా కటువుగా చెప్పకుండా, సుతిమెత్తగా చెప్తూనే, పాఠకుణ్ణి మళ్ళీ మళ్ళీ చదివించేలా వర్ణిస్తారు. ఇలా ఎన్నో విశిష్టతలు గల డా॥బోయ జంగయ్య  రచనల్లో అట్టడుగు వర్గాల జీవితాల్లోని అనేక పార్శ్వాల్ని పట్టిచూపించారు. ఎచ్చరిక కథలకు 1984లో నాగార్జున విశ్వవిద్యాలయం వారు బంగారు పతకాన్ని ఇచ్చారు. తెలుగు విశ్వవిద్యాలయం వారు 2002లో ప్రతిభా అవార్డు, 2003లో గౌరవడాక్టరేట్‌నీ ఇచ్చి గౌరవించింది. వీటితో పాటు  డా॥అంబేద్కర్‌ పురస్కారం, స్వరాజ్యలక్ష్మి, విశాల సాహిత్య అకాడమీ అవార్డులు చాలా వచ్చాయి. వీరి సాహిత్యాన్ని గమనించే వారికి సాహిత్యంలో సామాజిక వాస్తవికతను ఎలా సృజనీకరించవచ్చో తెలుస్తుంది.

No comments: