(ఈరోజు అంటే 8 మే 2016
వతేదీ మధ్యాహ్నం 12-30నిమషాలకు 10 TV వారు ‘ధిక్కారస్వరాలు’ కార్యక్రమంలో
నా గురించి సుమారు 9.27 నిమషాల పాటు ప్రసారం చేశారు. దీనిలో
ప్రముఖ విమర్శకుడు జి.లక్ష్మీనరసయ్యగారు నా కవిత్వం గురించి వ్యాఖ్యానిస్తూ
సహజత్వంతో కవిత్వాన్ని రాసే కవిగా, శిల్పం కోసం
కృత్రిమత్వాన్ని పాటించడనీ విశ్లేషించారు. ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసిన
10 టి.వి.,వారికీ, నా కవిత్వం
గురించి నాలుగు మంచి మాటలు చెప్పిన జి.లక్ష్మీనరసయ్యగారికీ నా ధన్యవాదాలు
తెలుపుతున్నాను....డా.దార్ల వెంకటేశ్వరరావు)
మనువు సృష్టించిన నిచ్చెన మెట్ల సమాజంలో దళితులు ఎదుర్కొంటున్న అవమానాలను, మానసిక సంఘర్షణలను అద్భుత కవిత్వంగా చిత్రిస్తున్న దళిత కవి దార్ల
వెంకటేశ్వరరావు. కుల వ్యవస్థలోని వైరుధ్యాలు, వైవిధ్యాలను అంబేద్కర్ దృక్పథంతో కవిత్వంగా ఆవిష్కరిస్తున్న అరుదైన కవి
ఆయన. దళితకవి, విమర్శకుడు, పరిశోధకుడైన దార్ల వెంకటేశ్వరరావు కవిత్వాన్ని, ఆయన సృజనలోని దళిత తాత్వికతను, కవితా నిర్మాణ పద్ధతులను ప్రముఖ సాహితీ విమర్శకులు జి.లక్ష్మీనర్సయ్య
విశ్లేషించారు. 'దార్ల రాసిన
మాదిగ మానిఫెస్టో కవిత మనల్ని తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. సరికొత్త ఆలోచనల్ని
రేకెత్తిస్తుంది. దండోరా తీసుకొచ్చిన దళితవాదాన్ని గట్టిగా సమర్థిస్తుంది' అని పేర్కొన్నారు. ఈ దేశంలో వర్ణవ్యవస్థ సృష్టించిన అసమానతలను అన్యాయాలను
అధర్మాలను, తన
కవిత్వంలో తూర్పారబట్టారు ఈ కవి. ఒక బాలునిగా, విద్యార్థిగా,
పరిశోధకునిగా దళిత విద్యార్థి అనుభవించే కష్టాలను ఆర్ద్రమైన
కవితలుగా శిల్పీకరించారు దార్ల వెంకటేశ్వరరావు. నగర నాగరికత, తెలుగుభాష, తెలంగాణా
కోస్తా దళితుల జీవన చిత్రాలను ఈ కవి చక్కగా కవిత్వీకరించారు. ఇదే విషయం గురించి
ప్రస్తావిస్తూ దార్ల కవిత్వంలో వస్తు వైవిద్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందంటారు
జి.లక్ష్మీనర్సయ్య.
చాలా
మంది దళిత కవులు శిల్పం కోసం ఆరాట పడుతుంటారు. పదచిత్రాల కోసం పలవరిస్తుంటారు.
వీరికి వస్తుసాంద్రత, సమస్యతీవ్రత
కన్నా శిల్పమే ముఖ్యం. కాని దార్లవెంకటేశ్వరరావు శిల్పం కోసం కృత్రిమ చిత్రణచేయడని
ప్రతి మాట, ప్రతి
పదం కవిత్వంతో జవజవలాడాలన్న తపన ఈకవికి లేదంటారు లక్ష్మీనర్సయ్య. ఇక... దార్ల
వెంకటేశ్వరరావు జీవిత విశేషాల్లోకి వెళితే ఆయన 1973 లో తూర్పుగోదావరి జిల్లా చెయ్యేరు అగ్రహారం లో పెదనాగమ్మ, లంకయ్య దంపతులకు జన్మించారు. బి.ఏ.స్పెషల్ తెలుగు చదివి హైదరాబద్
విశ్వవిద్యాలయంలో ఎం.ఏ., ఎం.ఫిల్., పి.హెచ్.డి చేశారు.
అదే యూనివర్సిటీలో తెలుగుశాఖలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు
.వెంకటేశ్వరరావు కవిత్వం, సాహిత్య
విమర్శ, సౌందర్య
శాస్త్రం, మాదిగ
సాహిత్యం పై విశేష కృషి చేశారు. దళిత
తాత్వికుడు, నెమలి
కన్నులు కవిత్వంతో పాటు సాహితీ సులోచనం సమీక్షాగ్రంథం, వీచిక సాహితీ
విమర్శ, ‘బహుజన
సాహిత్య దృక్పథం, సృజనాత్మక
రచనలు ఎలా చేయడం, పునర్మూల్యాంకనం, సాహితీ మూర్తులు-స్పూర్తులు’ మెుదలైన సాహితీ వ్యాస సంపుటాలు వెలువరించారు. దార్ల వెంకటేశ్వరరావు కృషిని
గుర్తించి భారతీయ దళిత సాహిత్య అకాడమీ, న్యూఢిల్లీ
వారు 2007లో డాక్టర్
బి.ఆర్.అంబేద్కర్ పురస్కారంతో సత్కరించారు. ఈయన రాసిన తెలుగు సాహిత్య విమర్శకు 2012 లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం లభించింది.
భవిష్యత్తులో ఈ సృజనకారుని కలం నుండి మరెన్నో రచనలు వెలువడాలనిఆశిద్దాం. (10 టి.వి. సౌజన్యంతో...)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి