ఆంధ్రభూమి (7-3-2015) సమీక్ష
సాహితీ మూర్తులు - స్ఫూర్తులు
(సాహిత్య వ్యాసాలు)
డా.దార్ల వేంకటేశ్వరరావు
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో
ఇటీవల విమర్శ, పరామర్శ వ్యాసాల్ని రాస్తున్న వాళ్ళలో డా.దార్ల వేంకటేశ్వరరావు ఒకరు. ఆయన విశ్వవిద్యాలయంలో పనిచేస్తుండడంవల్ల ఎన్నో జాతీయ సదస్సులకు వెళ్ళి, పత్రాలని సమర్పిస్తున్నారు. అంతేకాకుండా ఆ స్ఫూర్తితోనే రచయతల, కవుల గురించి వాళ్ళ సాహిత్య సేద్యం గురించి తాము పొందిన స్ఫూర్తిని మరికొంతమందికీ అందించడానికీ పత్రికలలో వ్యాసాలు రాస్తున్నారు. అలాంటి వాటిలో పంతొమ్మిది వ్యాసాలతో ‘సాహితీమూర్తులు- స్ఫూర్తులు’ అనే సాహిత్య వ్యాసాల సంపుటిని తీసుకొచ్చారు. వివిధ సాహితీవేత్తలకు సంబంధించిన వ్యాసాలైనా ఒకే రచయిత రచనలు కాబట్టి సంపుటి.
సాహిత్యమంటే అప్పటి సమాజోద్ధరణకి తోడ్పడేదే కాదు, ముందు తరాలకు మార్గనిర్దేశాన్నిచ్చేది కూడా అని భావించే దార్ల- అందుకు తగ్గట్టే వ్యాసాల్ని రూపొందించారు. రచయితలు, కవులు జీవితాల్ని, వాళ్ళ సాహిత్య సొగసుల్ని తెలుగులో కళాతత్త్వ శాస్త్రాల గురించి సాహితీ సృజన గురించి కొన్ని కావ్యాలు గురించి, కళ అనుకరణ గురించి తమదైన ధోరణిలో రాసిన వ్యాసాలివి. సమర్పించిన పత్రాలైతే సమయం, పత్రికలలో ప్రకటించిన వ్యాసాలకైతే స్థలాభావం కూడా వస్తువుతోబాటు ముఖ్యం కాబట్టి రేఖామాత్రంగా చిన్నచిన్న వ్యాసాల్నే రాశారు.
చిన్నవైనా పరిపూర్ణంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించారు. వ్యాసాల చివరలలో ఆధార గ్రంథాల పట్టికా ఇచ్చారు కాబట్టి ఆ విషయాల మీద ఇంకా తెలుసుకోవాలనుకునే వారికి ఈ గ్రంథాల్ని చదివి-ఇంకా తెలుసుకోవచ్చనే సూచనా కనిపిస్తుంది. అలాగే ఈ విషయాలు నేను ఆషామాషీగా రాయలేదు. వీటిని చదివి ప్రామాణికంగా రాసారు రచయిత అని తెలుస్తుంది.
సృజనాత్మక సృష్టి జరుగుతున్నంత పెద్దమొత్తంలో విమర్శాసాహిత్యం రావడం లేదు. విమర్శతోనే సృజనాత్మక సాహిత్యానికెంతో మేలు జరుగుతుంది. అందుకని ఇలాంటి గ్రంథాలు ఇంకా ఇంకా రావలసిన అవసరముంది. డా.దార్ల వేంకటేశ్వరరావుగార్ని అభినందించాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటి ఆధునిక భాషాశాస్తవ్రేత్త మొదటి ఆధునిక భాషా విమర్శకుడు, మొదటి గిరిజన సాహితీ పరిశోధకుడు గిడుగు వేంకట రామమూర్తి ఆధునిక సాహిత్య యుగకర్త గురజాడ వేంకట అప్పారావు, ప్రముఖ కవి గుర్రం జాషువా, బండారు అచ్చమాంబ, కొలకలూరి ఇనాక్, బేతవోలు గారల గురించి, పెయ్యేటి లక్ష్మీకాంతమ్మ, తరిగొండ వేంకమాంబ లాంటి ఆధ్యాత్మికవేత్తల గురించి, సాహిత్య కళా, విమర్శల గురించి, ఆధునిక విషయం ‘అంతర్జాలంలో పిల్లల పత్రికలు’ గురించి సోదాహరణ వ్యాసాలున్నాయి ఈ గ్రంథంలో.
....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి