"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

13 జనవరి, 2015

‘‘దళితసాహిత్య మాదిగ దృక్పథం’’ పుస్తకానికి డా. జె.భీమయ్య గారి ముందుమాట ‘‘మాదిగ చైతన్యం’’


మాదిగ చైతన్యం

            సాధారణంగా రచయితలు తాము ప్రచురించే పుస్తకాల్లో ముందుమాటలను ఆయా రంగాలలో ముఖ్యంగా సాహితీ రంగంలో అనుభవం, కీర్తి ప్రతిష్టలు మరియు నిష్ణాతులైన వ్యక్తుల చేత రాయించుకోవటం పరిపాటి. ఇది ఒక బలమైన సాంప్రదాయంగా సాహితీ జగత్తులో కొనసాగుతున్నది. ప్రసిద్ధ భారతీయ ఆంగ్ల నవలా రచయిత ముల్క్‌రాజ్‌ ఆనంద్‌ రచించిన మొట్టమొదటి నవల "అంట్‌చబుల్‌' (1935)కి ఇ.యం.ఫోర్‌స్టర్‌ ముందుమాట రాయటంతో ఇంగ్లాడులోని "పెంగ్విన్‌ పబ్లికేషన్స్‌' ప్రచురించింది. అంతకు ముందు ఆ నవలను ప్రచురించటానికి ప్రచురణ కర్తలు నిరాకరించారు. ఆనాటి ప్రచురణ కర్తల స్వభావాన్ని ఆర్థిక పరిభాషలో గుత్తాధి పత్యంగాను, సామాజిక రీతిలో బ్రాహ్మణత్వంగా పోల్చవచ్చు. డబ్బే ప్రధానాంశంగా మారిన ఈ రోజుల్లో అటువంటి పరిస్థితికి తెరపడింది.
            నా దృష్టిలో పుస్తకానికి ముందుమాట అనేది ఒక టార్చ్‌లాంటిది. వార్తా పత్రికల్లోని సంపాదకీయం లాంటిది. శరీరంలోని అన్ని అవయవాలతో అనుసంధానంగా విధి నిర్వహించే గుండెకాయలాంటిది. పుస్తకంలో జాలువారిన రచయిత మనోభావాలను ప్రతిబింబిస్తూ ముందుమాట రాయటం అంత సులువైన పనేమీకాదు. విప్లవ రచయితలు సైతం విప్లవోద్యమాలతో సంబంధమున్న వ్యక్తుల చేతనే ముందుమాటలు రాయించటం జరుగుతుందే. ఒక పుస్తకంపై రకరకాల అభిప్రాయాలు  వెలువడవచ్చు. ముందుమాటలోని అభిప్రాయాలే సర్వస్వం కాజాలవు. అలాంటపుడు ఫలానా వ్యక్తే తన పుస్తకానికి ముందుమాట రాయాలని రచయిత పట్టుబట్టటం మొండితనమే అవుతుంది. రచయిత అభిప్రాయాలు ఎలా ప్రతిబింబించినా, పాఠకుడే అంతిమ న్యాయ నిర్ణేత.
            పుస్తకానికి ముందుమాట రాసే వ్యక్తి అనుభవ్యజ్ఞుడై, విషమ నిష్ణాతుడై ఉండాలని లేదా కనీసం వయస్సులోనైన తనకంటే కొంత పెద్దవాడై ఉండాలని ఒక నిబంధనగా రచయితలు ఏర్పరచుకున్న "సాంప్రదాయాన్ని' "బ్రేక్‌' చేస్తూ ఏ అనుభవం లేని, విషయ నిపుణత ఆశించినంతగా లేని నాతో తన పుస్తకానికి "ముందుమాట' రాయించిన డా.      దార్ల వెంకటేశ్వర రావు అభినందనీయుడు.
            మనిషిని మనిషిగా గుర్తించని సమాజం ఇంకా బతికే ఉందనటం అతిశయోక్తి కాదు. వర్ణ ధర్మంపై మొలిచిన "కులం' మొక్క ఏపుగా పెరిగి మర్రి ఊడల్లా సమాజమంతటా ప్రాకింది. కృత్రిమ సంస్కృతిలో రూపుదిద్దుకున్న నగరవాసి యొక్క యాంత్రిక జీవితం సామాజిక కులజాడ్య సమస్యను అంతగా పట్టించుకోదు. గ్రామ పెత్తందార్ల అదు పాజ్ఞల్లో ఉంటూ, కుల వివక్షకు గురవుతూ ఆర్థిక దుస్థితికి లోనైన సామాన్య దళిత జీవి వ్యధ వర్ణనాతీతం.
            ఇలాంటి బడుగు జీవుల దుస్థితి సాహీతీకరించబడినా తమ జీవితానుభవాలను అక్షరాలలో చూసుకోలేని అభాగ్యులు ఎందరో ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. సంస్కరణ వాదంతో మొదలైన దళిత జీవిత చిత్రీకరణ అభ్యుదయ రచనగా ఎదుగుతూ తిరుగుబాటు సాహిత్యంగా రూపుదిద్దుకుంది. నేడు దళిత వాదానికి ఎవరి సానుభూతి అక్కరలేదు. తమదైన శైలిలో గుర్తింపుకు, సమాన హక్కులకై నిరంతర పోరాటం చేస్తున్న దళితులు ఒక సామాజిక శక్తిగా ఎదుగుతున్నారు.
            కులమతాలు మనం ఏర్పరచుకున్న అడ్డుగోడలని నిజమైన ప్రేమకు ఇవేవి అడ్డం రావని "ప్రేమ' కంటే బలమైన శక్తి ఏదీ లేదని తెలియజెప్పే అరుంధతీదేవి వసిష్ఠుల ఆదర్శ వివాహం కులాంతరాలు పెంచుతున్న సవర్ణ హిందువులకు కనువిప్పు అవుతుంది. బోయి భీమన్న గారి "రాగా వాసిష్ఠం' నాటకాన్ని ఈ సందర్భంగా దార్ల తన పుస్తకం ప్రారంభంలోనే ప్రస్తావించటం దళిత సాహితీ చరిత్ర క్రమాన్ని పాటించడమే అవుతుంది.
            మాదిగ దండోరా ఉద్యమం, దాని దృక్పథం, ఆశయాలు దార్ల పుస్తకం నిండా పరుచుకొని ఉన్నాయి. అంబేద్కర్‌ ఆశించిన సామాజిక న్యాయం, సమానత్వం ప్రతిఫలించే దిశగా దండోరా ఉద్యమం కొనసాగుతున్న వైనాన్ని దార్ల తన పుస్తకంలో ప్రస్తావించటం మాదిగ చైతన్యాన్ని దాని పోరాట పఠిమను తెలియ జెప్పే బాధ్యతను నిర్వహించటమే అవుతుంది. మాదిగ చైతన్యం రివ్వున ఎగసిపడే విధంగా ఉద్యమ కాంతులు మన రాష్ట్ర నలు మూలల ప్రసరించాయి. సామాజిక న్యాయంలో భాగంగానే రిజర్వేషన్‌ ఫలాలు ప్రజాస్వామ్య బద్దంగా పంపీణి జరగాలనే
డిమాండ్‌తో దండోరా ఉద్యమం ముందుకెళ్ళుతుంది.   

            దళితుల సమస్య పరిష్కారానికి దళితేతర ప్రజాతంత్ర శక్తుల తోడ్పాటు ఎంతైన అవసరమేనని గుర్తించాల్సి ఉంది. అలా కానప్పుడు దళిత ఉద్యమాలు పరిమితుల్లోనే ఉండిపోతాయి. మాదిగ దండోర ఉద్యమాన్ని పరిమిత అర్థం నుండి విసృత అర్థంలోకి తెచ్చే క్రమంలో దాని స్వరూప స్వభావాన్ని మార్చే ప్రక్రియ ఎంతైనా అవసరమనే భావన చాలామందికి ఉంది. రిజర్వేషన్‌ వర్గీకరణ నేపథ్యంగానే ఈ ఉద్యమం పుట్టిందనే అపవాదు. నిజానికి వర్గీకరణ సమస్య దళిత సమస్యల్లో ప్రధానాంశమే. దళితుల సమస్య పరిష్కారానికి, సమైఖ్యతకు దోహదపడే విధంగా వర్గీకరణ సమస్యను పరిష్కరించాలి. అంతర్గత సమస్యలను పరిష్కరించుకోకుండా దళిత సమైఖ్యతను కోరటం గురువింద చందమే అవుతుంది. దళితుల్లో 62 ఉపకులాలు ఉన్నాయన్న నిజం దండోరా ఉద్యమం మూలంగానే బైటికి వచ్చింది. ఇన్ని ఉపకులాలు అట్టడుగున పడి ఉన్నాయి కాబట్టే, ఇది మాల మాదిగల సమస్యగానే ఉపరితలంపై కనిపిస్తున్నది. మాదిగ చైతన్యాన్ని మాదిగ ఉపకులాల ప్రాతినిథ్య చైతన్యంగానే అర్థం చేసుకోవాలి. జస్టిస్‌ రామచంద్ర రాజు కమీషన్‌తో ప్రారంభమైన దండోర సమస్య అధ్యయన ప్రస్థానం ఎన్నో ఒడిదొడుకులను అధిగమిస్తూ ఉషా మెహ్ర కమీషన్‌ దాక కొనసాగింది. పార్లమెంటులో ఒక నిర్దిష్టమైన చట్టం తీసుకవస్తే గాని దండోరాకు విముక్తి కలుగదేమో!
            అంబేద్కర్‌ చేసిన సామాజిక కృషిని స్పృశించకుండా, దళిత సాహిత్యాన్ని చర్చించలేం. కుల రహిత సమాజ ఆవిర్భావానికై అంబేద్కర్‌ చేసిన సామాజిక పోరాటం ఒక చారిత్రాత్మక ఘట్టం. కులమత విశ్వాశాలను ప్రేరేపించే హిందూ ధర్మశాస్త్రాలను  నిర్వందంగా వ్యతిరేకించాడు. కులాంతర వివాహాలు జరుగుతున్నప్పటికి కులం పోవటం లేదు. కులం పునాదులపై నిర్మింపబడిన హిందూ మతం వర్దిల్లినంత కాలం కులం నిర్మూలన జరుగదనేది అంబేద్కర్‌ అభిప్రాయం. ఆయన హిందువుగా జన్మించినా, తాను హిందువుగానే చనిపోరాదన్న ఆలోచన బౌద్ధ మత స్వీకరణకు గట్టి పునాది వేసింది. మానవత్వం, సమానత్వ భావన, ప్రేమ లాంటి సుగుణాలు హిందూ మతంలో కొరవడిన కారణంగ?ానే దళితులకు ఆ మతంలో విముక్తి లేదని తేల్చిచెప్పాడు అంబేద్కర్‌. తన తండ్రి బ్రిటీషు సైన్యంలో పనిచేయటం, తాను ఆర్థికంగా కొంత నిలదొక్కుకొని ఉన్నందు వల్ల విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించటానికి అవకాశమేర్పడింది. తన స్థాయిలోనూ తనకు కులపరంగా అవమానం కలగటం తన జాతి మొత్తాన్ని అర్థం చేసుకోవటానికి తోడ్పడింది. విదేశాల్లో తాను నేర్చుకున్న విద్యను తన జాతి విముక్తికై దారపోశాడు. సామాజిక పోరాటాలు నిరంతరంగా నిర్వహించాడు. ఇది అంబేద్కర్‌ గొప్పతనం.  
            నాటి నుండి నేటి వరకూ హీనంగానే చూడబడుతున్న దళితులకు రిజర్వేషన్‌ అనే రాజ్యాంగ ఉపశమనం అంబేద్కర్‌ సాధించి పెట్టక పోయినట్లయితే అంబేద్కర్‌ను శత్రువుగా పరిగణించే అగ్ర వర్ణాల ఇళ్ళల్లో, పోలాల్లో దళితులు ముఖ్యంగా మాదిగలు పని మనుషులుగా, పాలేర్లుగా ఉండేవారు. అంటే అందరికీ ఈ రిజర్వేషన్‌ వల్ల విముక్తి లభించిందని కాదు. పని మనుషులుగా, పాలేరులుగా ఉండటం లేదని కాదు. కొంతమంది దళితులైనా పైకొచ్చారనే వాస్తవాన్ని కాదనలేం. కానీ, అధిక సంఖ్యాకులైన దళిత పేదలకు రిజర్వేషన్‌ ప్రయోజనాలు చేరటం లేదనేదే బాధ. ఇలాంటి పరిస్థితిల్లో రిజర్వేషన్‌ ఫలాలను ప్రజాస్వామ్య బద్దంగా అనుభవించాలనే డిమాండ్‌ సరియైనదే. రాజ్యాంగ ప్రయోజనాలను జనాభా నిష్పత్తిపై దళిత ఉపకులాల మధ్య పంపిణీ చేయమని అడగటం దళితులను విడగొట్టటమేననే అపోహకు దారితీసింది. రిజర్వేషన్‌ ఫలాలను అనుభవించిన వారే మళ్ళీ మళ్ళీ అనుభవించటం ద్వారా "క్రిమిలేయర్‌' పుట్టుకొచ్చింది. ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్‌ అమలు చేయాలనే డిమాండ్‌ క్రిమిలేయర్‌ వర్గానిదే. ఈ డిమాండ్‌ సరైందా? కాదా? అని తేల్చేముందు ప్రభుత్వ సంస్థల్లో అమలవుతున్న రిజర్వేషన్‌ ప్రయోజనాలు ప్రజాస్వామ్య బద్దంగా పంపిణీ అవుతున్నాయా? లేదా? అనేది ముందు చూడాలి. అగ్ర వర్ణాల ఇండ్ల ముందు పని మనుషులుగాను, వారి పోలాల్లో పాలేరులు గాను కొనసాగే పరిస్థితి నుండి "రిజర్వేషన్‌ తంతు' కొంత మేరకు ఒక పార్శ్వంలో దళితులను కాపాడినా, మరో పార్శ్వంలో అది ఒక దళితుని ఇంట్లో సాటి దళితుడు పనిమనిషిగా ఉంటున్న వైనాన్ని కల్గించింది. ఒక దళిత ఉన్నతుని ఇంటి గేటు బైట చేతులు కట్టుకొని నిలుచుండే దళిత పేదలు ఉన్నారంటే ఆశ్చర్యం కలగదు. ఇలాంటి ఆర్థిక అసమానతలు, సామాజిక అంతరాలు దళితుల మధ్యే ఉన్నాయంటే వింతగా తోచదు. అన్ని రకాల అవకాశాలను వినియోగించుకుంటు ఉంటూ, అగ్ర వర్ణ భూస్వాముల ఇళ్ళల్లో పెంచుతున్న కుక్కలను తమ ఇళ్ళల్లో పెంచే సంస్కృతి కల్గి ఉంటూనే, దళితులం కాబట్టే వివక్షకు గురవుతున్నాం, అన్యాయం జరిగిందని గగ్గోలు పెట్టే దళిత బ్రాహ్మణులు ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. వీరికే దళిత సమైఖ్య వాదమనే పాట అవసరం. ఈ భావాల్ని ఈ పుస్తకంలో దార్ల సమన్వయించిన తీరు ప్రశంసనీయం.
            ప్రజాసాహితీ, జన సాహితీ లాంటి విప్లవ సాహితీ పత్రికల, సంస్థల దృక్పథాన్ని కూడా దార్ల ఈ పుస్తకంలో విశ్లేషించటం సందర్భోచితమే. సంస్కరణోద్యమాలు ఉపరితల మార్పునే తెస్తాయి కానీ, మౌలికమైన మార్పుని సాధించలేవు. దోపిడి సమాజంలో సమస్త పీడిత ప్రజల విముక్తి వర్గ పోరాటం పైనే ఆధార పడి ఉంటుందన్న "ప్రజా పత్రిక'ల వాదన సరైనదే. వర్గ పోరాటాన్ని కులం అడ్డుకుంటున్నదన్న వాదాన్ని కూడా కొట్టి పారేయలేం. కులాధిపత్యం కారణంగానే విప్లవ పార్టీలలో సైతం నాయకత్వం అగ్రవర్ణాల చేతుల్లోనే ఉండి పోయిందన్న విమర్శను కూడా వాస్తవిక దృష్టితో చూడాలి. కులాధి పత్యానికి, వివక్షకు బలమైన కారణంగా నిలిచే భూస్వామ్య, సామ్రాజ్య సంస్కృతిని నిర్మూలించే దిశగా పోరాటాన్ని సాగించాలనే విప్లవ సాహీతీ పత్రికల సంస్థల పిలుపు ఆహ్వానించదగినదే. అవినీతిని, దోపిడిని, దౌర్జన్యాలను ప్రశ్నించకుండా కులంపైనే చేసే ఉద్యమాలు అశేష పీడిత ప్రజానికానికి విముక్తిని ఇవ్వలేవు. ఉద్యమ నాయకత్వం పీడిత వర్గాల చేతుల్లో ఉండాలి. కుల సమస్యపై ఏకమైనంతగా ఆర్థిక సమస్య, భూ సమస్యలపై సామాజిక వర్గాలు ఏకం కావటం లేదు. ఈ దిశగా ప్రజల్లో చైతన్యం రావలసి ఉంది.

            కుల-వర్గ సమస్య, వర్తమాన దండోరా ఉద్యమ సమస్యలాంటి సామాజిక ప్రధానాంశాలపై సమగ్రమైన చర్చను లేవదీస్తూ అది సాహిత్యంలో ప్రతి ఫలిస్తున్న తీరును శాస్త్రీయంగా విశ్లేషిస్తూ ప్రచురించిన ఈ పుస్తకం దార్ల సామాజిక అవగాహనకు, సాహిత్య కృషికి, అంకిత భావానికి తార్కాణంగా నిలుస్తుంది. చైతన్యాన్ని మహా చైతన్యంగా మలిచి అశేష పీడిత ప్రజల ఆర్థిక సామాజిక విముక్తి దిశగా ప్రయనించాలని కోరుకుంటూ.............

                                                            -డా.      జె. భీమయ్య,
25/12/2008
హైదరాబాదు విశ్వవిద్యాలయం  


కామెంట్‌లు లేవు: