"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

14 జనవరి, 2015

‘‘వీచిక’’ పుస్తకానికి ఆచార్య బన్న అయిలయ్య గారి ముందుమాట ‘‘ సూక్ష్మ వివేచన’’

ఆచార్య బన్న అయిలయ్య
ఎం.ఏ., పిహెచ్‌.డి
ప్రొఫెసర్‌
తెలుగు విభాగము, కాకతీయ విశ్వవిద్యాలయం
విద్యారణ్యపురి, వరంగల్‌.
సెల్‌ నెం: 9949106968

సూక్ష్మ వివేచన

            అధ్యయనం, అధ్యాపన, అభివ్యక్తి, పరిశోధన విశ్వ విద్యాలయాచార్యుల విధి. విశ్వ విద్యాలయంలోకి అడుగిడడం గొప్ప అవకాశంగా భావించిన వారెవరైనా ఈ విధిని నిర్వర్తించాల్సిందే. విశ్వ విద్యాలయానికి సమాజానికి అనుసంధానంగా ఉన్న ఆచార్యులు సమాజాన్ని చైతన్యంతో గమనించడం, అది ఎట్లా ఉందో వ్యాఖ్యానించడం, అవసరమైతే పరిష్కారం చూపడం ఒక జీవన విధానంగా మలచుకోవాలి. వృత్తిలో నిబద్ధత చూపే వాళ్ళకే ఇది సాధ్యం. డా//దార్ల వెంకటేశ్వరరావు గారి వీచికవిమర్శ వ్యాస సంపుటి చదివాక అతనెంతగా నిబద్ధత కలిగిన ఆచార్యులో అర్థమవుతుంది. పద్నాలుగు వ్యాసాలతో దార్ల ప్రకటిస్తున్న సాహిత్య విమర్శ గ్రంథమిది.
            వల్లంపాటి వారు జగమెరిగిన మార్క్సిస్టు విమర్శకులు. అయితే వీరు సంప్రదాయ మార్క్సిస్టు విమర్శకులుగా నిలిచిపోక, కాలంతో పాటు తన దృక్పథాన్ని విస్తరించుకున్న విమర్శకులుగా దార్ల వ్యాసం చదివితే అర్థమవుతుంది. మార్క్సిస్టులు కేవలం వస్తువుకే ప్రాధ్యాన్యమిస్తారు. శిల్పానికివ్వరనే అభిప్రాయాన్ని వల్లంపాటి విమర్శ చూసాక మార్చుకోక తప్పదు. వారు కథా శిల్పం, నవలా శిల్పం పేరుతో చేసిన లోతైన పరిశోధనలే కాకుండా వస్తు శిల్పాల్లో ఏ ఒక్క దానికి ప్రాధాన్యమిచ్చినా సాహిత్యం తన ప్రత్యేక అస్తిత్వాన్ని కోల్పోతుందనే వారి ప్రతిపాదన పూర్తి విశ్వాసాన్నిస్తుంది. ఇంకా కాల్పానిక సాహిత్యం మూలాలు పాశ్చాత్య సాహిత్యంలోనే ఉంటాయన్ష్మి అగ్ని పురాణంలో కథానిక మూలాలు వెదకడం సరికాదన్ష్మి అట్లాగే ‘‘ఆఖ్యాయిక’’ అంటే నవల కాదనే వల్లంపాటి అభిప్రాయాల్ని దార్ల వ్యక్తం చేసాడు. అట్లాగే అలంకార శాస్త్రం పరిధి, పరిమితి తెలియని వాళ్ళు దాన్ని విమర్శగా భావించడాన్ని వల్లంపాటి ఒప్పుకోరు. అలంకార శాస్త్రం రాచరిక కాలంలో ప్రభవిస్తే, విమర్శ ప్రజాస్వామ్య యుగంలో జనించింది. అలంకార శాస్త్రం రచనకు నిరంకుశంగా డైరెక్షనిస్తుంది. రచన ఎలా ఉండాలో చెప్పుతుంది. విమర్శ రచన ఎలా ఉందో చెప్పుతుంది. అయితే, అలంకార శాస్త్రం - విమర్శను అధ్యయనం చేయడం జ్ఞాన ప్రపంచంలో భాగమని గుర్తించాలంటారు వల్లంపాటి. వారు చేసిన రాయలసీమ సాహిత్య సామాజిక సాంస్కృతిక విశ్లేషణ ఆంధ్ర ప్రాంత స్థితిగతులను అధ్యయనం చేయడానికి అదొక ఆకరంగా దార్ల భావించారు.
            వల్లంపాటిలోని మరొక అరుదైన ప్రతిపాదనను దార్ల స్పష్ట పరిచారు. ఒకే సామాజిక నేపథ్యం కలిగిన కవులు, ఒకే ప్రాంతీయ నేపథ్యం కలిగిన రచయితల రచనలు ఒకేలా ఉండవు. అందుకు జాషువా - జ్ఞానానంద కవులు, విశ్వనాథ - కుటుంబరావులను ఇలాంటివే మరికొన్ని ఉదాహరణలు వల్లంపాటి అందిచారని దార్ల నిర్థారించారు. మార్క్సిజం చలనశీలత గలిగిన ఒక మెథడాలజీగా ఉపయోగిస్తే దానిలో వర్గంతో పాటు వర్గ నిర్మూలన ఉందనే వల్లంపాటి అభిప్రాయాన్ని దార్ల నిర్ద్వంద్వంగా ఖండిరచారు. ఇలా అనేకమైన ఆసక్తికర అంశాలను దార్ల చర్చించారు.
            ‘‘మల్లవరపు జాన్‌ కవిత్వంలో మాధుర్యం’’లో ఆలంకారికులు చెప్పిన మాధుర్యం కంటే మించి ఉన్నదని దార్ల అంటున్నారు. ఇది కొంచెం అతిశయోక్తిగా అన్పించినా, నిజం కూడా లేకపోలేదు. భిన్న ధ్రువాలు కలిగిన వ్యక్తులను వస్తువులుగా స్వీకరించినా, భిన్న భిన్న వస్తువుల స్వీకరణ వల్ల, కఠిన వాస్తవాలను కవిత్వీకరించడం వలన మాధుర్యం వస్తుంది. అంతేకాదు ఇంకా పద్యం చదవడం వలన, శైలి వలన కూడా మాధుర్యం వస్తుందన్నారు.
            కుల వ్యవస్థ అమానవీయమైనదని అంబేద్కర్‌ అంటే, ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని గాంధీ అభిప్రాయం. జాన్‌ కవిత్వంలో ఈ ఇద్దరూ కన్పిస్తారు. అంటే తనకు తెలియకుండానే ఇరువర్గాల పాఠకులను రంజింప జేసే కవిత్వం జాన్‌ రాసారు. రెండు వర్గాలు ఏకం కావాలంటే ‘‘సహృదయత’’ ఉండాలి. సహృదయత సామరస్యానికి బీజం వేస్తుంది. సామరస్యం కవిత్వంలో మాధుర్యాన్నిస్తుంది. దార్ల తార్కికంగానే ఈ విషయం చెప్పాడు. అట్లాగే జాన్‌ కవిత్వం ‘‘కళ కళ కోసం’’ కాదనే విషయాన్ని నొక్కి చెప్పాడు.
            ప్రపంచీకరణకు సరిగ్గా వ్యతిరేకమైనది స్థానీయత. స్థానీయతను సెంటిమెంటుగా చేసికొని వచ్చిన కవితా సంకలనమే ‘‘కళింగాంధ్ర’’ సంకలనమని దార్ల అభిప్రాయం. తమ మూలాలను తాము కాపాడుకునే క్రమంలో కోస్తాంధ్ర ప్రాంతంపై ఇతరులకున్న భ్రమలను ఇది తొలగిస్తుందన్నారు. భూతల స్వర్గంగా పేరున్న ఈ ప్రాంతం, అందరికి అంది వచ్చిన స్వర్గం కాదనే ధ్వనిని తెలియజేసారు. తెలంగాణాకున్నంత చైతన్యం కళిగాంధ్రకు లేకపోవడానికి కారణాలు వేరే ఉన్నాయన్నారు. ప్రాంతీయతలో విశ్వజనీనత ఇమిడి ఉన్న సంకలనంగా ‘‘తూరుపు’’ కళింగాంధ్ర కవిత్వం పుస్తకాన్ని దార్ల ప్రకటించారు.
            కులం, అస్పృశ్యత రెండూ సామాజిక వాస్తవాలే. కులం వల్ల కొందరు అదనపు సౌకర్యాలు అనుభవిస్తుంటే, మరికొందరు అవసరాలు తీరక విలవిల్లాడుతూ అవమాన భారంతో బతుకీడుస్తున్నారు. తరాలు మారినా ఈ విషయంలో మార్పు రాకపోవడం ‘‘వెంటాడే అవమానం’’ కథలో కన్పిస్తుంది. ఉత్తమ కథలో సంఘర్షణతో పాటు, అనుభూతి ఐక్యతలు గుణాలుగా చెప్పుకోవాలి. వెంటాడే అవమానంలో ఇవి తగిన విధంగా పోషింపబడ్డాయని వీరు అంటున్నారు.
            మూడు విధాలైన సంఘర్షణలున్న ఈ కథలో - దళిత దళితేతరుల మధ్య సాంఘిక అసమానతల సంఘర్షణ వారు కలిసి మెలిసి ఉండేటప్పుడు సాంస్కృతిక సంఘర్షణ వీరు కలిసిమెలిసి జీవిస్తే భౌతిక భావ వాద సిద్ధాంతాలలో వాళ్ళు దీన్ని అనుసరించి జీవించడంలో సంఘర్షణలున్నాయని కథలోని పాత్రల ఆధారంగా దార్ల విశ్లేషించారు.
            కథను విశ్లేషించే క్రమంలో అంబేద్కర్‌ తాత్వికతను అన్వయించడంలో వీరి విమర్శా నైపుణ్యం బహిర్గతమవుతుంది. కులం, అస్పృశ్యతలు నిర్మూలన జరగడానికి ఇంకెంతో సాంఘిక ప్రక్రియ రావాలని, అవి శాస్త్రీయ దృక్కోణంలో అమలు పరచాలని, కాని శాస్త్రీయతకు కూడా రుజువు కానివెన్నో ఉన్నాయన్నారు. నేడున్న పరిశోధనల ఫలితాల మీదే ఆధారపడితే కులం - అస్పృశ్యతల నిర్మూలన జరగదని దార్ల అభిప్రాయ పడ్డారు.
            ఈ దేశం నుండి బౌద్ధం కనుమరుగైయ్యాక భారతీయ సంస్కృతికి విఘాతం కలిగిందనేది అభివృద్ధి కాముకుల అభిప్రాయం. తరువాత తరువాత ఈ దేశంలో మానవతా విలువలు అడుగంటాయి. బుద్ధుని జాతక కథల్లో ‘‘ఆమ్రపాలి’’ కథ కూడా ఒకటి. ఆమ్రపాలిని వస్తువుగా చేసుకొని తెలుగులో జ్ఞానానందకవి, కరటూరి సత్యనారాయణలు కావ్యాలు రాస్తే, లల్లాదేవి నవల రాసారు. జ్ఞానానందకవి కావ్యం శాంతానికి, కరటూరి కావ్యం కరుణకు ప్రాధాన్యమిస్తే, లల్లాదేవి రచన సామాజికాంశాలకు ప్రాధాన్యమిచ్చారన్నారు. ఈ మూడు రచనల్లోని తండ్రి పాత్రలను గూర్చి తెలియజేస్తూ, జ్ఞానానందకవి తండ్రి పాత్ర నైతిక విలువలకు పట్టం గట్టితే, కరటూరిది దేశభక్తి పూరితంగా ఉందని, లల్లాదేవి తండ్రిని భయస్తుడిగా చిత్రించినట్లు దార్ల తెలిపారు.
            ఆమ్రపాలి గణభోగ్యగా మారిన తర్వాత ఆమె తండ్రి పాత్రలను జ్ఞానానందకవి, కరటూరి  బాగా చిత్రించారన్నారు. వీరిద్దరికంటే లల్లాదేవి చిత్రించిన ఆమ్రపాలి భిన్నంగా ఉందని, ఆమె నిర్భంధ వేశ్యగా మారాకా, ఆమెను బౌద్ధ బిక్షువుగా చూపడంతో విలువలకు పట్టం గట్టినట్లున్నదని వీరు భావించారు. ఈ ముగ్గురి రచనల్లో దార్లను బాగా ఆకట్టుకున్నది జ్ఞానానందకవి ఆమ్రపాలని తెలుస్తుంది. ఇందుకు కారణం కావ్యం చారిత్రక తత్త్వ లక్షణాలతో, బౌద్ధం బోధనలతో నిండి ఉండడమే. జ్ఞానానందకవి కావ్యంలో అన్ని పాత్రలు ఆమ్రపాలివైపు కదలగా, ఆమ్రపాలి మాత్రం బౌద్ధం వైపుకు నడవడం జరుగుతుందన్నారు. వర్తమాన కాలానికి బౌద్ధం ఎంతో అవసరమని జ్ఞానానందకవి భావించటం వల్లే, ఎంతో ఔచిత్యంతో దీన్ని తీర్చి దిద్దారనే అభిప్రాయాన్ని దార్ల వ్యక్తం చేసారు.
            సాహితీ లోకంలో ఒక వాదం ప్రచలితంగా ఉన్నప్పుడు తత్‌ కాలంలో వచ్చిన సాహిత్యం ఆ వాదానికి ఎంత దగ్గరగా ఉంటుందో విమర్శకులు తేల్చే పనిలో ఉంటారు. సాధారణ మధ్య తరగతి స్త్రీల జీవితాన్ని ఇతివృత్తంగా చేసుకొని వచ్చిన ‘‘మనసున మనసై’’ నవలలో స్త్రీవాదం ఏ మేరకుందో దార్ల పరిశీలించారు. స్త్రీ జీవితం చుట్టూ చదువు, ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, పితృ స్వామ్య ఆధిపత్యం, ఆర్థికాంశాలుంటాయి. ఈ నవలలో కూడా పై అంశాలను పాత్ర గతంగా రచయిత్రి మలిచిన తీరును వివరిస్తూ పరిష్కారం దిశగా వచ్చాక దీనిలో లిబరల్‌ రాడికల్‌ ఫెమినిజం ఉందని దార్ల తేల్చారు. జీవిత దృక్పథాన్ని బట్టి హక్కులు, బాధ్యతలు వ్యక్తులే సాధించుకుంటారని, నవలలోని దమయంతి - జయంతి పాత్రల ఆధారంగా దార్ల తెలిపారు. దమయంతికున్న జీవిత దృక్పథం జయంతికి లేకపోవడం వల్లనే జీవితాన్ని సాఫీగా గడపక పోయిన విషయాన్ని వీరు గుర్తించారు.
            గమ్యం స్పష్టంగా లేకపోతే గమనం కూడా స్పష్టంగా ఉండదనేది జయంతి పాత్ర ద్వారా తెలిపే ప్రయత్నం చేసారు. దాంపత్య తఫ: ఫలమే సంతానం. దాంపత్య వ్యవస్థపై గౌరవం, అవగాహన లేకపోతే సంతానం విలువ కూడా తెలియదని జయంతి పాత్రను బట్టే తెలుస్తుంది. భర్త మీది కోపం చేత అబార్షన్‌ చేయించుకొన్న జయంతి, భర్తది ఆధిపత్య భావజాలంగా భ్రమపడి విడాకులు తీసుకున్నది. మొదలు ఏ వ్యక్తినైతే భర్తగా పనికిరాడని తిరస్కరించిందో అదే వ్యక్తిని భర్తగా పొందాలని అనుకుంటుంది. కాని ఆమె కోరిక నెరవేరదు. అట్లాగే ఏ సంతానమైతే వద్దనుకుందో మళ్ళీ అదే సంతానంపై మమకారం కలుగడం అనివార్యమైంది. ఈ అంశాలనన్నీ దార్ల హేతు పూర్వకంగా, తర్క
బద్ధంగా చర్చించారు.
            జయంతిలో ఇంతటి చాంచల్యం ఉండడానికి కారణం ఆమెలో సర్దుబాటు మనస్తత్వం లేకపోవడమనే విషయాన్ని దార్ల నిర్ధారించాడు. ఈ సర్దుబాటును దార్ల మనోవిజ్ఞాన శాస్త్రంలోని అనుగుణ్యతకు అన్వయించారు. దీని ప్రకారం, సమాజానికి అవసరమైన సర్దుబాటు, అభివృద్ధి నిరోధకమైన సర్దుబాటులుంటాయన్ష్మి దమయంతికి అవసరమైన సర్దుబాటు ఉంటే జయంతికి అభివృద్ధి నిరోధకమైన అనవసరమైన సర్దుబాటుందని దార్ల చక్కగా విశ్లేషించారు.
            ‘‘దళిత సాహిత్యం - మౌలిక భావనలు’’ అనే వ్యాసం ఇప్పటి వరకు వచ్చిన దళిత సాహిత్య వ్యాసాలన్నింటి కంటే సర్వ సమగ్రమైనది. దళిత సాహిత్యం ప్రక్రియా వైవిధ్యంతో గేయం, పద్యం, వచన కవిత, నవల, కథ, విమర్శ, నాటకంగా వచ్చిందనేది ఈ వ్యాసం స్పష్టం చేస్తుంది. ఈ వ్యాసం చదివాక దార్ల చేసిన ప్రతిపాదనలు గతంలో ఎవరూ చేసి ఉండరేమో అన్పిస్తుంది. కొత్త ఆలోచనలకు కూడా ఈ వ్యాసం వీలు కల్పిస్తుంది. 1910లో వచ్చిన మాల వాండ్ర పాటతో దళిత సాహిత్యం ప్రారంభమైనదని గత పరిశోధకులు తెలిపినా, దళిత పాటకు వందేళ్ళుంటాయనే నిర్ధారణకు రావచ్చు (ఒకటి రెండు సంవత్సరాలను విషయంలో పట్టింపు లేకపోతే).
            తొలి దళిత నాటకం బోయి భీమన్న రాగవాశిష్టంగా దార్ల నిర్ధారించారు. కారంచేడు సంఘటన తరువాత వచ్చిన సాహిత్యంలో అంబేద్కర్‌ ఆలోచనా విధానం కన్పిస్తుందని దార్ల నొక్కి చెప్పారు. దళిత కథలో వస్తు విస్తృతి, శిల్ప పరమైన మార్పులున్నాయి కాని దళిత తాత్వికతను విస్మరించకుండా, అంబేద్కర్‌ భావజాలాన్ని అందించేలాగా కథా సాహిత్యం రావాలనేది దార్ల సూచన. మరాఠి, కన్నడ భాషల ద్వారా దళిత సాహిత్యం దేశ వ్యాప్తంగా విస్తరించిందనేది వాస్తవం. దార్ల వ్యాసం చదివాక శివసాగర్‌, గద్దర్‌, మాష్టార్జి, కత్తి పద్మారావు వంటి కవులు, గేయ రచయితలు, ప్రజా వాగ్గేయకారులు, తాత్వికులు మరాఠి, కన్నడ భాషల్లో ఉన్నారా? అన్పిస్తుంది. తులనాత్మక అధ్యయనం చేస్తే ఈ అంశాలు బయట పడ్తాయేమో చూడాలి. ఏది ఏమైన తెలుగులో వచ్చిన దళిత సాహిత్యం ప్రక్రియా వైవిధ్యమే కాకుండా, సంపద్వంతమైనదిగా ఈ వ్యాసం చదివాక అన్పిస్తుంది.
            అంబేద్కర్‌ భావజాలం ఆలస్యంగా తెలుగులోకి రావడానికి కారణం ఒకటి గాంధీజం, రెండోది మార్క్సిజం. మొదటి తరం, రెండో తరం దళిత విద్యావంతులు, మేధావులు కొంచెం అటు ఇటుగా ఈ రెండు మార్గాల్లోనే పయనించారు. కాలం గడిచినకొద్దీ ఈ మార్గంలోని ఫలితాలు వికటించడంతో, అంబేద్కర్‌ ఆలోచన వైపు మళ్ళారు. వర్గంతో పాటే వర్గాన్ని నిర్మూలించే శక్తి మార్క్సిజానికుందన్న వాళ్ళే ఆచరణలో రెండిరటికి ఆటంకం కల్పించే చర్యలు చేపట్టారు. దీన్ని గమనించే ముఖ్యంగా ఎనభైయ్యో దశకంలో దళిత రచయితలు, మేధావులు ఈ మార్గాలనొదిలి అంబేద్కర్‌ ఆలోచనవైపుకు దృష్టి మరల్చడం జరిగింది. ఈ నేపథ్యం నుండే శంబూక కవిత్వాన్ని అర్థం చేసుకోవాలి. అంబేద్కర్‌ తాత్త్విక భూమికను, మార్క్సిజాన్ని దేశీయ పరిస్థితులకు అనుగుణంగా చేసుకోవాలనే శంబూక మాటల్ని దార్ల స్పష్టపరిచారు. శంబూక వర్తమాన దళిత ఉద్యమ భావాలన్నింటితో అంగీకరించక పోయినా, వర్గ వాదులు మాత్రం శంబూక చెప్పిన అంశాలను గుర్తించేలాగున్నాయన్నారు.
            ఇక శంబూక కవిత్వంలో శిల్పం సరిగ్గా ఉండదనే వాళ్ళ వాదనను దార్ల తేలికగా కొట్టిపారేసారు. శంబూక కవిత్వం దళితుల కోసం రాసార్ష్ము సిద్ధాంతాన్ని ప్రచారం చేసారు. కనుక వస్తువుకే ప్రాముఖ్యమిచ్చారు శంబుక. అయితే అటు వస్తువుకు ఇటు శిల్పానికి సమ ప్రాధాన్యమిచ్చి అద్భుత కవిత్వం రాసిన దళిత కవులున్నారనే విషయం కూడా గమనించాలన్నారు.
            తెలుగు సాహిత్యంలో నానీలు ఎన్నో బాలారిష్టాలనెదుర్కొని ఒక ప్రక్రియగా స్థిరపడ్డాయి. ద్వా.నా. శాస్త్రి ద్వారా అవి ప్రయోగ దశకు చేరుకున్నాయి. వంద సంఖ్య ఉంటే శతకం అంటారు. కాని 75 నానీలు రాసిన ద్వా.నా. దీన్ని శతకమే అనాలంటున్నారు. తెలుగు కవిత్వానికి పర్యాయ పదమైన ‘‘సినారె’’ పైనే ఈ 75 నానీలుండడం విశేష్ష్మం నానీల నాన్న గోపికే వీటిని అంకిత మివ్వడం మరో విశేషం. ఈ నానీల నిండా ‘‘సినారె’’ సంస్కారమే కన్పిస్తుందనేది దార్ల భావన. ద్వా.నా. శాస్త్రి గారు ఆధునిక కవితా ప్రక్రియలో చెప్పి, సంప్రదాయాన్ని, ఆధునికతనూ ముడివేసే ప్రయత్నం చేసారని ‘‘ప్రయోగాల పల్లకిలో నానీలలో సినారె’’ వ్యాసంలో దార్ల తెలిపారు.
            రష్యన్‌ విప్లవ చరిత్రను కళాత్మకంగా మలచినది మాక్సిం గోర్కీ ’’అమ్మ’’ నవల. పీడనను ఎదుర్కొనేందుకు కాలంతో, దేశంతో నిమిత్తం లేకుండా ‘‘తమదే’’ అని ఫీలయ్యేటట్లు రచయిత నైపుణ్యంతో దీన్ని తీర్చి దిద్దారన్నారు. మార్క్స్‌ భావజాలాన్ని మాత్రమే ప్రచారం చేసిన నవలగా కాక, మనసుల్ని కదిలిస్తూ ఇంద్రియానుభూతుల్ని సుఖ దు:ఖాలతో నింపేసింది కనుక వందేళ్ళయినా ’’అమ్మ’’ నవల సజీవంగానే ఉందని దార్ల అంటున్నారు.
            ‘‘కులవృత్తి’’ కథ భౌతిక మానసిక కోణాల నుండి విశ్లేషించారు దార్ల. కులం ఆవిర్భావానికి కారణం హిందూ మతం. హిందూ మతానికున్న బలం, బలహీనతలను దార్ల చర్చించారు. నాటి లోకాయతుల నుండి నేటి హేతువాదుల దాకా హిందూ మతం చర్చోప చర్చలకు తావిస్తుందంటే కారణం ఈ రెండిరటి వల్లనే. మారుతున్న కాలానికి అనుగుణంగా మారే స్వభావం హిందూ మతానికున్న బలమైతే, ఆ మతానికున్న ప్రామాణిక గ్రంథం ఒక్కటి కూడా చూపలేక పోవడం దాని బలహీనత. ఈ బలహీనత, బలములే ద్వంద్వ ప్రమాణాలకు ఆస్కారమిస్తుంది.
            రామాయణంలో వాలీ, సుగ్రీవుల కథ్ష్మ భారతంలో పాండవుల జన్మ వృత్తాంతం ఈ ద్వంద్వ ప్రమాణాలకు అవకాశమిస్తుందని దార్ల ఉదహరించారు. దీనికి కారణం దేవుడా మానవుడా (పూజారా?) అనేది దార్ల చర్చించారు. మానవులకు ఏది ప్రీతి పాత్రమైతే అదే దేవుడికి ఆపాదిస్తారనే వాస్తవాన్ని దార్ల నిర్ధారించారు. పవిత్రత, కులం, అస్పృశ్యతలు కూడా మానవ కల్పితాలే అనేది ’’కులవృత్తి%‘‘% కథ ఇస్తున్న సందేశంగా దార్ల తెలిపారు. భగవంతుడికి, భక్తుడికి మధ్య పూజారి అవసరం లేదనేది కులవృత్తి కథ ప్రతిపాదించిన అంశం. ఇంత చర్చకు అవకాశమున్న ఈ కథను ‘‘కళ కళ కోసమే’’ అనే సిద్ధాంతం కోసం రాసినదనే వాదాన్ని దార్ల తిరస్కరిస్తున్నారు.
            ముస్లిం స్త్రీవాద కవిత్వంలో స్త్రీవాద దృక్పథాన్ని దార్ల పరిశీలిస్తూ, ముస్లిం మైనార్టీ కవిత్వం రాసిన వాళ్ళంతా స్త్రీవాద కవిత్వం రాయలేదని దార్ల తెలిపారు. వివక్ష ఆధారంగానే ముస్లిం స్త్రీవాదం ఆవిర్భవించిందన్నారు. ఈ స్త్రీవాదంలో ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాలు అంతర్గతంగా ఉన్నా, బహు భార్యత్వం, సంతానోత్పత్తి, లైంగిక హింస, కట్టుబాట్లను ముస్లిం స్త్రీవాదం ప్రశ్నిస్తుందన్నారు. ఈ స్త్రీవాదంలో షాజహానాను శక్తివంతమైన కవయిత్రిగా వీరు గుర్తించారు. అంతేకాదు ముస్లిం స్త్రీవాదమంతా షాజహానా చుట్టే తిరుగుతుందని దార్ల నిర్ధారించారు.
            ఒక తరం మరో తరానికి చేసిన త్యాగమే నాగరికత అంటారు. దీన్ని సాహిత్యానికి అన్వయిస్తే, ముఖ్యంగా తొలి తరం సాహితీవేత్త పింగళి లక్ష్మీకాంతం గారికి అన్వయిస్తే పరిశోధకుడిగా, సాహిత్య చరిత్ర నిర్మాతగా, విమర్శకుడిగా వారెంత కృషి చేసారో, దాని ఫలితమే నేడు తెలుగు సాహిత్యంలో కన్పించే వెలుగు బాటలని దార్ల వ్యాసం చదివాక అర్థమవుతుంది.
            ఆంధ్ర మహా భారతం, రంగనాథ రామాయణం, పల్నాటి వీర చరిత్రల కర్తృత్వ నిర్ణయంలో సప్రామాణికమైన ఆధారాలు చూపుతూ వాటిని నన్నయ్య, గోన బుద్ధారెడ్డి, శ్రీనాథులు రాసారని నిరూపించారు. అట్లాగే ‘‘మార్గ - దేశీ’’ లను వివరించే క్రమంలో సంగీత, నాట్య శాస్త్ర పరిభాషను ఉపయోగించి అన్వయించడం పింగళి నిశిత పరిశోధనను తెలియజేసేదే. అట్లాగే సాహిత్య చరిత్రలో కావ్య సమీక్ష, విమర్శ లక్షణాలుండడం వలన తత్‌ పూర్వం చరిత్రల కంటే విశిష్టమైనదిగా గుర్తింపు పొందినది. ఇంకా పింగళి వారు ప్రాచ్య, పాశ్చాత్య సమన్వయ దృక్పథంతో విమర్శ చేసారని దార్ల గుర్తించారు. తొలి తెలుగు కథానికపై బండారు అచ్చమాంబ కథలను తొలిసారిగా చర్చలోకి దార్ల తీసుకొచ్చారు. 
            ప్రతి విషయాన్ని పాక్షిక దృష్టితో కాకుండా సమ వీక్షణంతో దార్ల దర్శిస్తారని ఈ వ్యాసాలను చదివితే అర్థమవుతుంది. ప్రతి వ్యాసం ఒక ప్రామాణిక పత్రంగా భాసిస్తుంది. పరిశీలనా పటుత్వం, సూటిదనం, అధ్యయన శీలం వ్యాఖ్యానించే చతురత దార్లలో ఉందని ‘‘వీచిక’’లోని ప్రతి వ్యాసం సాక్ష్యమిస్తుంది. ఇలాంటి చక్కని వ్యాస సంపుటిని అందించిన డా//దార్ల వెంకటేశ్వరరావును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.


                                                                                                                (ఆచార్య బన్న అయిలయ్య)   
రాజ గృహం, హన్మకొండ


కామెంట్‌లు లేవు: