"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

13 November, 2014

‘ఫిరదౌసి’ కావ్య సౌందర్యం

(నిన్న (12-11-2014) పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదులో జరిగిన ‘‘గుర్రం జాషువా సాహిత్య సమాలోచన’’ సదస్సులో పాల్గొని సమర్పించిన పత్రంలోని ముఖ్యాంశాలను ఇక్కడ అందిస్తున్నాను. పూర్తి పత్రాన్ని త్వరలో అందిస్తాను)
-డా. దార్ల వెంకటేశ్వరరావు
అసిస్టెంటు ప్రొఫెసరు, తెలుగు శాఖ,
 హైదరాబాదు విశ్వవిద్యాలయం, హైదరాబాదు-500 046


కావ్య సౌందర్యాన్నెలా చూడాలి? కావ్యంలో ముందగా కనిపించేవి శబ్దాలు, అర్ధాలు. అందుకనే భామహుడు ‘శబ్దార్థౌ సహితౌ కావ్యం’ అన్నాడు.
స్త్రీ,పురుషుల శరీరసౌందర్యాన్ని పెంపొందించడానికి నగలు ఎలా తోడ్పడతాయో, అలాగే కావ్యానికి శబ్దార్థాలవల్ల వ్యక్తమయ్యే వక్ర్తోక్త్యాద్యాలంకారాలు సహకరిస్తాయన్నాడు.
అంటే కావ్య సౌందర్యాన్ని పెంపొందించేవి అలంకారాలు.
అసలు అలంకారం అంటే ఏమిటి?
‘‘సౌందర్యమలంకారః’’ అన్నారు మన లాక్షణికులు.
శరీరంలోని బాహ్య సౌందర్యాన్ని అలంకారాలు పెంపొందించవచ్చు. కానీ, గుణాలే అంతః సౌందర్యాన్ని కలిగిస్తాయని దండి వాదించాడు.
          ‘కావ్యశోభాయకర్తారో గుణాః తదతిశయహేతువస్త్వలంకారాః’ అని వామనుడు చెప్పి కూడా కావ్యానికి అత్యంత ముఖ్యమైంది ఆత్మ అన్నాడు. దాన్ని ‘రీతరాత్మకావ్యస్య’గా చెప్పాడు. కావ్య సౌందర్యం ‘రీతి’వల్ల వస్తుందన్నాడు. ఈయన ఉద్దేశ్యంలో ‘రీతి’ గుణాల వల్ల రీతి ఏర్పడుతుంది. దశవిధగుణాలున్నప్పటికీ వాటన్నింటినీ వైదర్భీ, గౌఢీ, పాంచాలి రీతులు అని మూడింటిగా రచనాశైలిని బట్టి వర్గీకరించవచ్చునని అన్నాడు. కాబట్టి వామనుని దృష్టిలో కావ్యాన్ని రాసేవిధానమే కావ్యసౌందర్యాన్ని అభివ్యక్తం చేస్తుంది.
కావ్యానికి ఆత్మ ధ్వని అని చెప్పి, అలంకారాలు కూడా కావ్యశోభను పెంచినా, అవి ధ్వనితో కూడిన అలంకారాలై ఉండాలన్నాడు. అందువల్ల కావ్యసౌందర్యం వ్యక్తమయ్యే స్థాయాభేదాల్ని వస్తు, అలంకార, రసధ్వనులనే ప్రధానమైన విభాగాన్ని చేశాడు. రసధ్వని ప్రధానమైన కావ్యమే ఉత్తమకావ్యమన్నాడు. ఆనందవర్థనుడు భరతుడు, భామహుడు, దండి, వామనుడు సిద్ధాంతాలన్నింటినీ తన ధ్వని సిద్దాంతంలో అంతర్భాగం చేసుకొని కావ్యసౌందర్యాన్ని వివరించాడు. కావ్య సౌందర్యం అనేది తీసుకునే వస్తువుని బట్టీ, దాన్ని వర్ణించే శిల్పాన్ని బట్టీ, దాన్ని ఆస్వాదించే పాఠకుణ్ని బట్టీ ఉంటుందని ఆధునిక సౌందర్యశాస్త్రం చెప్తోంది. ఈ లక్షణాలన్నింటినీ పట్టుకొని పాఠకుని హృదయాన్ని ఉర్రూతలూగించగలిగేలా ఈ కావ్యాన్ని వర్ణించాడు కవి. 
·        గుఱ్ఱం జాషువాని సాహిత్య లోకం ‘కవి’గా గుర్తించిన ఖండకావ్యం ఫిరదౌసి’
‘‘కవినిఁ కన్న తల్లి గర్భంబు ధన్యంబు;
కృతినిఁ జెందువాఁడు మృతుఁడు గాఁడు;
పెరుగుఁ దోటకూర, విఖ్యాత పురుషులు;
కవిని వ్యర్థజీవిగాఁ దలంత్రు.’’ అనే పద్యం ఈ ఖండకావ్యంలోనే ఉంది.
·      
·        గజనీని పరిపాలించిన చక్రవర్తి ‘మహమ్మద్ ఘజనీ’ నవంబరు 2, 971లో పుట్టి, ఏప్రిల్ 30, 1030 లో మరణించాడు. అరబిక్, సంస్కృత భాషల్లో ప్రావీణ్యం ఉన్నవాడు. మొట్టమొదటిసారిగా ‘సుల్తాన్’ బిరుదు పొందిన చక్రవర్తి. భారతదేశంపై సుమారు పద్దెనిమిది సార్లు దండయాత్రలు చేసి హిందూ దేవాలయాల్ని దోచుకున్న చక్రవర్తిగా ప్రఖ్యాతి పొందాడు.
·        ఫిరదౌసి క్రీ.శ. 940లో పుట్టి, 1020 వరకు జీవించాడు. ఫిరదౌసి అసలు పేరు: మన్సూర్ ఇబిన్ అహ్మద్. ఒక భూస్వామి ఇంట్లోనే పుట్టి పెరిగిన కవి.
·        ఘజనీమహమ్మద్ సుమారు 60సంవత్సరాలు, ఫిరదౌసి సుమారు 70సంవత్సరాలు పైగా బతికారు. ఇరువురూ చారిత్రక పురుషులే.
·                    ఒక చారిత్రక సంఘటనను తీసుకొని ఒక రసభరిత కావ్యంగా తీర్చిదిద్దిన ఖండకావ్యం ‘ఫిరదౌసి’ ఇది మూడాశ్వాసాల కావ్యం. దీన్ని జాషువా1930లో రాశారు. జాషువా పుట్టింది 1895. అంటే అప్పటికి 35 యేండ్ల ప్రాయం. గొప్పకావ్యం రాయాలనే ఉబలాటపడే వయస్సు.
‘‘క్షణము గడచిన దాని వెన్కకు మఱల్ప
సాధ్యమే మానవున కిలాచక్రమందు?
దాఁటిపోయిన యుగములనాఁటి చరిత
మరలఁ బుట్టింపఁ గవియ సమర్థుఁడగును’’
·        ఫిరదౌసి ‘షానామా’ రాయడానికి గత చరిత్రను తవ్వాడో లేదో గానీ, సుమారు  వెయ్యి సంవత్సరాల తర్వాత ఆ చరిత్రను ‘ఫిరదౌసి’ కావ్యంగా జాషువా  వర్ణించాడానికి ఆ పని చేసే ఉంటాడు.
·        వస్తువైక్యతతో రసభరితంగా రాసే చిన్ని కావ్యాన్ని ఖండకావ్యం అంటారని విశ్వనాథుడు తన ‘సాహిత్య దర్పణం’  (‘‘ఖండకావ్యం భవేత్కావ్యస్త్వైకదేశానుచారిచ’’) లో చెప్పాడు.
·        సాధారణంగా మహాకావ్యంలోని ఏదైనా ఒక రసవద్ఘట్టాన్ని తీసుకొని రాస్తే దాన్ని ఖండకావ్యం అంటారని విశ్వనాథ సత్యనారాయణ (ఆంధ్ర వార పత్రిక, జనవరి, 1938) వివరించారు.

కథాసారాంశం:
Ø ఫిరదౌసి ఒక కవి పేరు. కవిని కథానాయకుడిగా చేసి వర్ణించని కావ్యం ‘ఫిరదౌసి’  గజనీమహమ్మద్ తన వంశ చరిత్రను కావ్యం రాయించుకోవాలనుకుంటాడు.
Ø దాన్ని రసభరితంగా, సమర్ధవంతంగా రాయగల కవి ఫిరదౌసి అని తెలుసుకుంటాడు.
Ø ఫిరదౌసిని తన ఆస్థానానికి రప్పించుకొని కమ్మని కావ్యాన్ని రాయమంటాడు. ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క బంగారు నాణాన్ని(దీనారం) ఇస్తానని వాగ్దానం చేస్తాడు.
Ø ఫిరదౌసి ముప్పయ్యేళ్లు కష్టపడి సుమారు అరవై వేల పద్యాల్లో ‘షాహనామా’ పేరుతో కావ్యాన్ని వర్ణిస్తాడు.
·        కావ్యాన్ని విన్నతర్వాత తన ఆస్థానంలో గల కవుల మాటలు విని బంగారు నాణాలకు బదులు వెండి నాణాలిస్తానంటాడు.
·        రాజు మాట తిప్పినందుకు కవి ఆ నాణాల్ని తిరస్కరిస్తాడు.
·        అంతే కాకుండా రాజుని నిందిస్తూ కొన్ని పద్యాల్ని రాసి పంపిస్తాడు.
·        ఆ పద్యాల్ని విన్న రాజు కవిని పట్టి చంపమని ఆజ్ఞాపిస్తాడు.
·        ఫిరదౌసి ప్రాణభయంతో గజనీని వదిలి ‘తూసు’ పట్టణానికి కుటుంబ సమేతంగా పారిపోతాడు.
ü కొన్నాళ్ళకు సామంతరాజులు, కొంతమంది ఉత్తమ కవులు ఫిరదౌసి కవిత్వం గొప్పతనాన్ని రాజుకి వివరిస్తారు.
ü ఆ మాటలు విని గజనీమహమ్మదు మనసు మారుతుంది. కవి ఋణాన్ని తీర్చుకోవాలనుకుంటాడు.
ü పదివేల బంగారు నాణాల్ని కవికి ఇవ్వమని భటుల చేత పంపిస్తాడు.
ü కానీ, అప్పటికే కవి ఫిరదౌసి చనిపోతాడు. ఆ నాణాల్ని కవిగారి కూతురుకివ్వబోతారు.
ü తన తండ్రిని క్షోభకు గురిచేసిన ఆ సొమ్ము తనకు వద్దని వాటిని తిరస్కరిస్తుంది.
Ø ఈ వార్త విని రాజు తన తప్పుకి విచారించి, ఆ ధనంతో తూసు పట్టణంలో ఒక సత్రాన్ని కట్టిస్తాడు.
Ø నేటికీ ఆ గుర్తులు కనిపిస్తాయి. కానీ, అందులో ఒకరికి కీర్తి, మరొకరికి అపకీర్తి కనిపిస్తాయి.
Ø కవిగానీ, రాజు గానీ ఇద్దరూ భౌతికంగా లేరు.
Ø  శాశ్వతంగా నిలిచిపోయింది మాత్రం సత్యం ఒక్కటే.


కావ్య సౌందర్యం – ధ్వని
·        గుఱ్ఱం జాషువా ఈ ఖండకావ్యం ద్వారా మహాకవిగా దర్శనమిస్తారు.
·        ఖండకావ్యాన్ని గొప్ప ప్రణాళికతో రాశాడు జాషువా.
·        కావ్యాన్ని రాయమని చక్రవర్తి ఆశచూపడం
·        కవి ఆశపడి తన శ్రమనంతా ధారపోసి కావ్యాన్ని రాయడం
·        కావ్యాన్ని రాసేముందు ఒక కల వచ్చినట్లు వర్ణించారు.
·        కలలో కవితాకన్య కవిని వరిస్తుంది.
·        పారసీక పట్టపురాణి ‘‘ నీకులసతినయ్యెదన్, కవితకున్ చిరకాలము తల్లినయ్యెదన్’’ అంటుంది.
‘‘ముద్దరాల, నంతిపురుల నుండెడుదానఁ
దెగువ బూని, సిగ్గు తెరలు చీల్చి
బయలు పడిన నాదు పావన స్నేహంబుఁ
జెప్ప నేల పారసీక కవికి?’’ అని అడుగుతుంది.
·         అంతః పురంలో ఉండాల్సిన సుందరీమణి ఒక సామాన్యమైన కవిని వలిచినట్లు కల రావడమే కవివి ఆందోళన కలిగించినట్లు వర్ణించాడు కవి.
·        అందుకనే వెంటనే...
·        జరగబోయే ఇతివృత్తాన్ని స్ఫురింపజేసే కవితానైపుణ్యాన్ని దీనిద్వారా వ్యక్తం చేశాడు కవి. సూర్యోదయాన్ని వర్ణిస్తూ చేసిన  ఈ పద్యం అద్భుతమైంది.

‘‘అతఁడా రాతిరి కన్ను మూయక తదీయ స్వప్నవృత్తాంతమ
ద్భుతమైనన్ దలపోయుచుండె నపుడంభోజాప్తుఁడున్ దూర్పుఁగొం
డ తలన్ గుంకుమ చల్లెఁ బశ్చిమగిరిన్ భస్మచ్ఛివిన్ జంద్రుఁడున్
మృతుఁడై వ్రాలె నభస్సునందణఁగిపోయెం తారకాగోళముల్’’

·        సూర్యుడు ఉదయించాడు. ఉదయించే ముందు చంద్రుడు, తారకలు ఆకాశంలో అణిగిపోయాయి అనేది పైకి కనిపించే భావం. అది వాచ్యార్థం. కానీ, కవి ఉద్దేశించిన వ్యంగ్యార్థం వేరు. దాన్నే కావ్యసూచ్యార్థం అనికూడా అంటారు.
·        సూర్యుడు వెలుగుకీ. ప్రతాపానికి ప్రతీక. గజనీ మహమ్మదు చక్రవర్తి చూపబోయే అధికారాన్ని సూచిస్తున్నాడు కవి. అలాగే ఆ సూర్య ప్రతాపంలో కోల్పోవాల్సిన యశస్సుని చంద్రుఁడున్ మృతఁడైవ్రాలెన్ అనడం ద్వారా వర్ణించాడు. రాజుకి శాశ్వతమై ఉండాల్సిన కీర్తి అశాశ్వతంగా మారిపోతుందనే సూచనను ‘‘అణగిపోయెన్ తారకాగోళముల్’’ అనడం ద్వారా  ధ్వనింపజేస్తున్నాడు కవి. సూర్యోదయవర్ణనను అత్యద్భుతంగా వాడుకున్నాడు కవి.

·        కరుణ రసానికి స్థాయీభావం శోకం. ఫిరదౌసి పడిన ముప్పయ్యేళ్ల కష్టానికి రాజు ఇచ్చిన బహుమానం అతడిని పట్టుకొని చంపమనడం. తన కొడుకు చనిపోయినా, ఆ దుఃఖాన్ని దిగమింగుకొని కావ్యాన్ని రాశాడు కవి. కానీ మళ్ళీ తనకు దుఃఖమే మిగిలింది. ఆ దుఃఖం మళ్ళీ ఎవరినీ దుఃఖపెట్టేటట్లు చేయకూడదనే సందేశాన్నిచ్చింది. చివరిలో కవి కూతురికి బంగారు నాణాలివ్వబోయినప్పటికీ దాన్ని తిరస్కిరించడంలో ధర్మాగ్రహాన్ని ప్రకటించాడు కవి. ఆ సన్నివేశం పాఠకుల్ని ‘శభాష్’ అనిపిస్తుంది. కవినీ, కవి వారసత్వాన్నీ, కవి నిజాయితీని పాఠకునిలో ప్రసరిస్తుంది. అదే కవి ఇవ్వదలచుకున్న సందేశం. అదే ఈ కావ్యసౌందరాన్ని దీప్తిమంతం చేసే అత్యంతఉదాత్తసన్నివేశం. ఈ కావ్యం ద్వారా చరిత్రను స్ఫురింపజేస్తూనే చరిత్ర వెనుక దాగిన సత్యాసత్యాల్ని విడదీసి చూడమంటున్నాడు కవి. 

2 comments:

Rakesh said...

ధన్యవాదాలు!!

Unknown said...

ఆద్యంతమూ ఆకట్టుకున్నది•