Saturday, April 26, 2014

సమైక్య పోరాటాలే దళితసమస్యల పరిష్కారమార్గాలు


(హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటిలో ది 25 ఏప్రిల్ 2014 న సాయంత్రం డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నన్ను కూడాఒక వక్తగా ఆహ్వానించారు.  ఈ సమావేశంలో మాట్లాడిన నా ప్రసంగాన్ని ఇక్కడ ప్రచురిస్తున్నాను-డా.దార్ల వెంకటేశ్వరరావు, 26-04-2014)
ముందుగా అంబేద్కర్ స్టూడెంట్స్ అసోషియేషన్  వారికి, నన్ను పిలిచినందుకు నాకృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వేదిక మీదున్న ప్రొఫెసర్ నాంచారయ్యగారు, ఇతర అతిథులకు, సభలో ఉన్న అధ్యాకపకులు, పరిశోధకులు, విద్యార్థి మిత్రులారా-
సమయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మూడు విషయాలను మాత్రమే మాట్లాడాలనుకుంటున్నాను.
డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ చేసిన అనేక పోరాటాల ఫలితంగా ఈరోజు మనం ఇక్కడ చదువుకోగలుగుతున్నాం. ఒక సందర్భంలో ఆయనే అన్నాడు. ‘‘నేను సాధించిన హక్కుల్ని మీరు అమలు చేయగలిగితే చేయండి. లేకపోతే వాటిని అక్కడే వదిలేయండి. కానీ వాటిని వెనక్కి తీసుకొని వెళ్ళకండి’’ అన్నాడు గొప్పదార్శనికుడు డా. బాబాసాహెబ్ అంబేడ్కర్. ఈ రోజు చుండూరు సంఘటన గురించి చాలా విషాదకరమైనటువంటి సన్నివేశంలో ఉన్నాం. దీనికి కారణమేంటి? మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ చెప్పినటువంటి భావజాలాన్ని మనం నిజంగా జీర్ణించుకుంటే ఈ పరిస్థితి వచ్చేదా? లేకపోతే దళితులు నిజంగా చైతన్యవంతమవుతున్నారు కనుక, వాళ్ళని మరింత అణగదొక్కడానికి ఇటువంటి తీర్సుల్పి ప్రయోగిస్తున్నారా? అనేది  మనం చాలా లోతుగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.  
మనం జీవిస్తున్న సమాజం- LPG లో ఉన్న సమాజం. అంటే Liberalization,  Privatization, Globalization వ్యవస్థలో ఉన్నాం మనం. మీడియా ఆధిపత్య వర్గాల చేతుల్లో ఉంది. కనీసం చుండూరు సంఘటనకు సంబంధించిటువంటి ఒక ఖండన ఇస్తే, దాన్ని ప్రచురించే, ప్రసారం చేసే ఒక మీడియా కూడా లేని స్థితిలో ఉన్నాం . ఈ స్థితిలో దళితులు నిజమైనటువంటి సమైక్యతతో ఉండకపోతే గనుక, డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ మనకిచ్చినటువంటి ఈ హక్కుల్ని, ఉన్న హక్కుల్ని కూడా కనీసం అనుభవించలేం.
ఇదే యూనివర్సిటీలో నేను, పిజి టు పిహెచ్.డి., ఇక్కడే చేశాను... ఇక్కడే ఫ్యాకల్టీగా ఉన్నాను... క్యాంపస్ లో జరుగుతున్నటువంటి దళితరాజకీయాలు, దళితసమైక్యతకోసం జరుగుతున్నటువంటి విషయాలు చాలా తెలుసు. వీటిని నిష్పాక్షికంగా, నిష్కల్మషంగా డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ ఏ విధంగా అయితే మనకి హక్కుల్ని సాధించడం కోసం ప్రయత్నించాడో, అదే పద్ధతిలో ఎంతో ఆశావాహంగా వచ్చినటువంటి డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరుతో ఉన్నటువంటి అసోసియేషన్, హైదరాబాద్ సెంట్రలో యూనివర్సిటీలో చాలా పేరు ప్రఖ్యాతులున్నటు వంటి అసోసియేషన్.  ఒకప్పుడు ASA (అంబేద్కర్ స్టూడెంట్స్ అసోషియేషన్ ) పేరు చెప్తే క్యాంపస్ అంతా అది ఏదైనా సాధిస్తుంది అనే స్థితిలో ఉండేది. అటువంటి స్థితినుండి నేడు క్యాంపస్ లో ఇన్ని అసోసియేషన్స్ రావడానికి కారణాలేంటి? అని మనలో మనం కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది.
 భిన్న ఆలోచనలు రానిద్దాం. భిన్న సంఘర్షణల్ని చేయనిద్దాం. కానీ, ఆ సంఘర్షణల్ని మనం ఎంతవరకు మనం ఆహ్వానిస్తున్నాం? ఎంతవరకు మనం వాటిని ఆచరిస్తున్నాం? అనేది మనకి మనం ప్రశ్నించుకోకపోయినట్లయితే గనుక, నిజమైన అంబేడ్కరిస్టులుగా  మనం ముందుకు వెళుతున్నామా లేదా అనేది మనల్ని మనం ప్రశ్నించుకొనే పరిస్థితి. మనం ఈ చుండూరు తీర్పుని ఎలా ఎదుర్కోవాలి? దానికి, హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ ఒక గొప్ప కేంద్రం కావాలి.  తెలుగు సాహిత్య చరిత్రలో దళిత సాహిత్యానికి ఒక కేంద్రంగా భాసిల్లినటువంటి యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్ లో ఉన్నటువంటి విద్యార్థులు... గొప్పకేంద్రం. మరలా అటువంటి చైతన్యాన్ని మనం తీసుకురావాలి. ‘‘నిజమైనటువంటి’’ దళిత సమైక్యతను మనం తీసుకొచ్చినప్పుడు , అప్పుడు మనం ఏ పోరాటాల్నైనా చేయగలుగుతాం. ఎందుకంటే- ఉన్న రిజర్వేషన్లని మనం అమలు చేసుకోలేకపోతున్నాం. మరోవైపు ప్రయివేటైజేషన్ బాగా విస్తృతమైపోతుంది. ఈ పరిస్థితుల్లో యూనిర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఉన్నటువంటి దళితవిద్యార్థి ఒక గొప్పమేధావిగా ఆలోచించి, ఆంధ్రప్రదేశ్ కీ, భారతదేశానికీ ఒక గొప్ప దార్శనికుడుగా మారాలనీ, అటువంటి రోజుకోసం  మనం ఎదురుచూడాలనీ, అప్పుడు నిజమైనటువంటి డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆలోచనల్ని మనం ఆచరించినవాళ్ళమవుతామని చెప్తున్నాను.
ఒక రెండవ అంశం- Implementation of the Ideology of Dr.Baba Saheb Ambedkar.  మనం ఏ రంగంలో ఉన్నామో ఆ రంగంలో బాబాసాహెబ్ అంబేడ్కర్ భావజాలాన్ని మనం వ్యాప్తిలోకి తీసుకురావాలి. ఇప్పుడే మిత్రుడు నన్ను Introduce  చేస్తూ...దళితలిటరేచర్ ని ఒక పాఠ్యాంశంగా ప్రారంభించారని  చెప్పాడు. దాన్ని ఈ సందర్భంలో చెప్పడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది.  ఇక్కడ (ఈ క్యాంపస్ లో) 2004లో నేను Faculty చేరిన వెంటనే దళితసాహిత్యాన్ని ఎం.ఏ., స్థాయిలో ఒక subject గా పెట్టినప్పుడు దళితేతరులు కూడా అంగీకరించారు. కానీ, దళితులు కొంతమంది అంగీకరించలేదు. కాబట్టి, ఈ సందర్భంలో మనం గుర్తించవలసిన అంశమేమిటంటే, మనం చాలా సమస్యల్ని ఎదుర్కొంటున్నాం. దళిత రిజర్వేషన్లు అనుభవిస్తూ దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటివాళ్ళున్నారు. దళితులు కానటువంటి వాళ్ళు దళితులకు సహకరిస్తున్నవాళ్ళున్నారు. కేవలం దళితులుగా పుట్టడమే దళిత అవకాశాల్ని అందుకోవడానికి అర్హత అవుతుందా? కేవలం దళితేతరులుగా పుట్టడమే దళితులు వాళ్ళని నిందించడానికో, వ్యతిరేకించడానికో కారణంగా చూడాలా? అనేది నిజాయితీగా మనకు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందనుకుంటున్నాను.

ఇక, మూడో అంశం- మనం దేన్నయినా ఆచరణలో ప్రతీదీ చూపించగలిగినప్పుడు మాత్రమే మనపట్ల  ఎవరికైనా విశ్వసనీయత అనేది పెరుగుతుంది. అది డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయాలతో ముందుకి వెళుతున్న అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఇప్పటికే ఎన్నింటినో సాధించింది. భవిష్యత్తులో ఈ దిశగా మరింతముందుకి వెళ్ళాలని ఆకాంక్షిస్తున్నాను. నాకు ఈ సదవకాశాన్నిచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థాంక్యూ వెరీమచ్.కార్యక్రమ వివరాలు:
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏప్రిలో, 25, 2014 వతేదీ సాయంత్రం  గంటలకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో డా.బి.ఆర్.అంబేద్కర్ 124వ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ముందుగా డా.అంబేద్కర్ ఆశయాలను సాధిస్తామని నినదిస్తూ క్యాంపస్ లో ఊరేగింపు జరిపారు.  సాయంత్రం డి.ఎస్.టి. ఆడిటోరియం లో అంబేద్కర్ జయంతి సభ నిర్వహించారు. సభా ప్రారంభానికి ముందు ఈ దేశంలో బహుళ సంస్కృతలను, విభిన్నజాతుల, మతాల సామరస్యాన్ని కాపాడవలసిన ఆవశ్యకతను వివరించే అనుభవాలను వివిధ ప్రాంతాలనుండి వచ్చిన విద్యార్థినీ, విద్యార్థులు వివరించారు. కొంతమంది కవితాత్మకంగా, మరికొంతమంది స్వీయానుభవాలుగా, ఇంకొంతమంది వ్యాఖ్యానప్రాయంగా, అందరూ కలిసి ఏకనినాదంగా విభిన్న సంస్కృతులను ఆహ్వానించాల్సిన అవసరాన్ని ఎలుగెత్తి చాటారు. ఇది చాలా ఆలోచనాత్మకంగా ఉంది. విద్యార్థినీ విద్యార్థుల వేషధారణలో, మాటల్లో సహజత్వం ఉట్టిపడింది. సభ ప్రారంభానికి ముందే వినిపించిన సంగీతం, ఒకామెను వ్యభిచారి అని ముద్రవేసి చంపేశారనీ, ఆమె స్మృతిగీతం పాడుతున్నాని చెప్పి ఆలపించిన ఆ గీతం అందర్నీ చెతన్యపరిచేలా ఉంది.
సభను ప్రారంభించేముందు వేదికపై ఏర్పాటు చేసిన డా.బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, ఆయన ఆశయాలను సాధిస్తామిన ప్రకటించారు. సభకు అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ అధ్యక్షత వహించారు. సభలో ముఖ్యఅతిథిగా ప్రముఖ దళిత ఉద్యమకారిణి శ్రీమతి మంజుల ప్రదీప్, ప్రత్యేక అతిథిగా రచయిత, ఉద్యమకారుడు, ప్రముఖకార్డియోలజిస్ట్ డా. ఎం. ఎఫ్. గోపీనాథ్ పాల్గొని ప్రసంగించారు. వక్తలుగా హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ, స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ డీన్, ఆచార్య జి.నాంచారయ్య, సెంట్రల్ వర్సిటీ తెలుగుశాఖలో అసిస్టెంటుప్రొఫెసర్ డా. దార్లవెంకటేశ్వరరావు  రచయిత్రి, పరిశోధకురాలు డా.స్వాతీ మార్గరెట్, సినీనటుడు శ్రీ సందేష్, ఇప్లూ లో అసిస్టెంటు ఫ్రొఫెసర్ డా.షరీన్ బి.ఎస్., తదితరులు ప్రసంగించారు. ప్రశాంత్ వందన సమర్పణ చేశారు. సభానంతరం చక్కటి భోజనాలు ఏర్పాటు చేశారు. డి.ఎస్.టి.ఆడిటోరియంలో ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రముఖ చిత్రకారుడు, పరిశోధకుడు గోనెలింగరాజు చిత్రాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అక్కడ రంగులతో చిత్రించి డా. అంబేద్కర్ చిత్రం చూపర్లను విశేషంగా ఆకర్షించింది. 


  పరీక్షలు జరుగుతున్నప్పటికీ పెద్దసంఖ్యలో విద్యార్థులు, పరిశోధకులు, అధ్యపక, అధ్యాపకేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ వారు చక్కని క్రమశిక్షణతో కార్యక్రమాన్ని నిర్వహించి తమదైన ముద్రను వేయగలిగారు. డి.ఎస్.టి. ఆవరణలో దళిత, బహుజన తాత్త్వికుల చిత్రపటాలు ఏర్పాటు ఈకార్యక్రమానికి మరింత వన్నెతెచ్చింది.
3 comments:

ఉత్తరామ్నాయమ్ స్వస్త్యయనమ్ said...

"కేవలం దళితేతరులుగా పుట్టడమే దళితులు వాళ్ళని నిందించడానికో, వ్యతిరేకించడానికో కారణంగా చూడాలా? అనేది నిజాయితీగా మనకు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందనుకుంటున్నాను. "

బాగా చెప్పారు. మఱో విషయం. one-sided laws పుణ్యమా అని అసలు కుటుంబమే విచ్ఛిన్నం కాబోతున్న వ్యవస్థ వైపు ప్రయాణిస్తున్నాం.. ఈ పరిస్థితుల్లో మన కులగుర్తింపులు నిలబడడం దీర్ఘకాలిక దృష్టితో చాలా కష్టం.

THIRUPALU P said...

//ఈ పరిస్థితుల్లో మన కులగుర్తింపులు నిలబడడం దీర్ఘకాలిక దృష్టితో చాలా కష్టం. //
కుల గుర్తింపులు కొన సాగాలా? ఎందు వల్ల? ఎందుకు?

Hari Babu Suraneni said...

నిజంగా చుండూరు నరమేధం గురంచి తీర్పు అలా రావదం అన్యాయమే.కానీ ఇలాంటి గుంపులు చేసే నరమేధాలకి ప్రత్యేకించి వ్యక్తిగతంగా సాక్ష్యాల్ని పట్టుకోవడం కష్ట మనుకుంటాను.చట్టంలో బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఒకటి ఉంది, అది చాలా చిత్రాలు చేస్తుంది.మత కలహాల విషయంలో కూడా చాలా గొడవలు యేళ్ళ తరబడి సాగి సాగి ఆఖరికి ఇలాగే అంతమవడం లేదా? ఈ రెండు రకాల గొడవల మధ్యన ఉన్న సామాన్యతని తెలియజెయ్యడం యాదృచ్చికం కాదు.అన్నీ ఒక లాంటివే.

నేను చూసిన ఒక సన్నివేశం చెప్పనా?మా ఫాదర్ కి మా వూళ్ళోని హరిజన గిరిజన వర్గాల్లో మంచి పలుకుబడి ఉంది.రాజకీయంగా పలుకుబడి ఉన్న వాళ్ల దగ్గిరకి అప్పుడప్పుడు వ్యక్తిగతమయిన విషయాలకి కూడా సంప్రదించడం పల్లెటూళ్ళలో మామూలు విషయమే కదా!

విషయం:ఒక హరిజన అబ్బాయి గిరిజన అమ్మాయిని ఇష్ట పడ్డాడు.అబ్బాయి తండ్రి మా ఫాదర్కి తన సమస్య చెప్పుకుంటున్నాడు, వాళ్ళబ్బాయికి మా ఫాదర్ అంటే గౌరవం కనక ఆ విషయంలో కలగ జేసుకుని తను చెప్పాలనుకున్నది వాళ్లబ్బాయికి చెప్పి ఒప్పించమని.అతని కున్న అభ్యంతరం యేమిటో తెలుసా - "ఆ గొడ్డుమాసం తినే వోళ్ల పిల్లని చేసుకోవటం".కమ్యునిష్టుల నుంచీ పైన మాట్లాడుతున్న వారందరూ నీడతో యుధ్ధం చేస్తున్నారు.మను వాదం, బ్రాహ్మణాధిపత్యం అంటూ మూలాన్ని వదిలేసి ఆకుల మీద యుధ్ధం చేస్తున్నారు.తమ కులం మిగతా వాటికన్నా గొప్పది అని బ్రాహ్మణులు విర్రవీగడం నిజమే కానీ దాన్ని హరిజనులు కూడా ఒప్పుకుంటున్నారనే నేను చెప్పిన విషయం స్పష్టం చేస్తుంది కదా!అసలు హరిజనుల్నీ గిరిజనుల్నీ వీటిని నమ్మని విధంగా తీర్చి దిద్దాలి.

అయితే మాల మహా నాడు, మాదిగ దండోరా అంటూ చదువుకున్న వాళ్ళు కూడా యెవరి దుకాణం వాళ్ళు తెరుచుకుని వాళ్ళలో వాళ్ళు తగువులాడుకుంటూ ఉన్న పర్రిస్థితిలో పిల్లి మెదలో గంట కట్టేదెవరు?