"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

01 April, 2014

మట్టి మహిళలసాహిత్య చరిత్రల్ని గుర్తించరా?-జూపాక సుభద్ర


 
తెలంగాణ వచ్చిన తర్వాత కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగం ఆధ్వర్యంలో 'తెలంగాణ సాహిత్య చరిత్ర పునర్నిర్మాణం'పై జాతీయ సదస్సును నిర్వహించి, మసకబార్చిన తెలంగాణ సాహిత్య చరిత్రల్ని వెలికితీయడం అభినందనీయం. తెలంగాణ ఉద్యమంలో అణగారిన సామాజికవర్గాలు జెండర్‌లు సమానత్వాల్ని కలగన్నాయి. వలసాంధ్ర పాలనలో విద్య, ఉద్యోగం, నీళ్లు, నిధులే గాదు, చరిత్రల్ని, సాహిత్యాల్నీ పెద్దఎత్తున నష్టపోయింది తెలంగాణ. అవన్నీ తిరగదోడి పునర్నిర్మాణం చేసుకోవాల్సిన అవసరము ంది. తెలంగాణ సాహిత్య ప్రత్యేకతల్ని వెలుగులోకి తెచ్చి తెలంగాణ సాహిత్య చరిత్రల ఉన్నతి పునర్నిర్మాణం కావల్సి వుంది.
అయితే అట్టి సాహిత్య చరిత్ర నిర్మాణాలు అట్టడుగు సమూహాల, జెండర్‌ల సాహిత్య చరిత్రలుగా నిర్మాణం జరగాల్సిన అవసరం నవ తెలంగాణకు ఉంది. ఇలాంటి తెలంగాణ కోసమే అణగారిన కులాల బిడ్డలు ఆత్మబలిదానాలు చేశారు. కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తున్న ఈ సాహిత్య సదస్సులో ఆరు సమావేశాల్లో తెలంగాణ సాహిత్య చరిత్ర, తెలంగాణ విమర్శ, తెలంగాణ విప్లవ సాహిత్యం, తెలంగాణ జిల్లాల చరిత్రలు, తెలంగాణ దళిత కవిత్వం, తెలంగాణ జానపద సాహిత్యం, తెలంగాణ భాష, తెలంగాణ ముస్లిం మైనారిటీ సాహిత్యం, తెలంగాణ స్త్రీవాద సాహిత్యం, తెలంగాణ గిరిజన సాహిత్యం ఇంకా అనేక అంశాలు చేర్చడం జరిగింది. కానీ బహుజన సమూహానికి చెందిన రుద్రమదేవి ఏలిన కాకతీయ గడ్డమీది యూనివర్సిటీ నిర్వహిస్తున్న 'తెలంగాణ సాహిత్య చరిత్ర పునర్నిర్మాణం' సదస్సు అంశాల్లో దళిత, బీసీ, ఆదివాసీ, ముస్లిం మైనారిటీ మహిళా సాహిత్యాల ప్రస్తావన లేకపోవడం, మట్టి మహిళల సాహిత్యాల అస్తిత్వాన్ని మరుగుపరిచే ఆధిపత్యాల పునర్నిర్మాణంగానే కనిపిస్తుంది.
సాహిత్య చరిత్రల పునర్నిర్మాణం పేరుతో మళ్లీ అప్రజాస్వామికమైన ఫూడ్యల్ పాత రోతల్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నమే ఇది. సామాజిక తెలంగాణ, బహుజన తెలంగాణ అని నినదిస్తున్న ఈ సందర్భంలో కూడా తెలంగాణ మట్టి మహిళల సాహిత్య చరిత్రలను గుర్తించకపోవడం ఆధిపత్య సాహిత్య రాజకీయాల పునర్నిర్మాణమే.
తెలుగు సాహిత్య చరిత్రల్ని ఆక్రమించుకున్న, నియంత్రణలో పెట్టిన కోస్తాంధ్ర ఆధిపత్య కుల పితృస్వామ్యాలు అణగారిన కులాల సాహిత్యాల్ని కుక్కముట్టిన కుండలాగ నిషేధించాయి. ఆ భావజాలాలే తెలంగాణ నుంచి జాజుల గౌరి, సూరేపల్లి సుజాత, అనిశెట్టి రజిత, పచ్చనూరి అనురాధ, నాంపల్లి సుజాత, గోగు శ్యామల, అడువాల సుజాత, తాయమ్మ కరుణ, షాజహాన, కొలిపాక శోభ, షహనాజ్ ఫాతిమ, గంధం విజయలక్ష్మి, కృష్ణవేణి మేరి మాదిగ, జ్వలిత, భాగ్యలక్ష్మి, జూపాక సుభద్ర ఇంకా అనేక మంది తెలంగాణ మట్టి మహిళలు తమ సాహిత్యాల్ని అస్తిత్వ కోణాల నుంచి వెలువరిస్తున్నారు. వారికి సాహిత్య కారులుగా వలసాంధ్ర సాహిత్య చరిత్రలు గుర్తింపు, గౌరవాలను అవాచ్యం చేశాయి.
ఈ కొత్త తెలంగాణలోనూ అవే ఆధిపత్య సాహిత్య రాజకీయాల్ని కొనసాగిస్తే నవ తెలంగాణకు అర్థమేముంది? తెలంగాణ మట్టి మహిళలు తమ కులదోపిడీ, శ్రమదోపిడీ, సామాజిక హింసలు, దొర, దొర్సాని ఆధిపత్యాలమీద తమ అస్తిత్వ సాహిత్యాల్ని వెలువరించారు. అలాంటివారి విస్తృతమైన సాహిత్యాల్ని అప్రస్తుతం చేసి సదస్సు అంశాల్లో చేర్చకపోవడం మళ్లీ ఈ సాహిత్యాలపై చీకట్లు మోపే పునర్నిర్మాణ ప్రయత్నాలే.
తెలంగాణ సాహిత్య చరిత్ర పునర్నిర్మాణ సదస్సులో తెలంగాణ దళిత సాహిత్యం, తెలంగాణ ఆదివాసీ, తెలంగాణ బహుజన, తెలంగాణ ముస్లిం మైనారిటీ, స్త్రీవాద సాహిత్యాలు, మట్టి మహిళల సాహిత్యాలకు సమాన భాగస్వామ్యాలు కల్పించిన సాహిత్య దాఖలాల్లేవు. దళిత, బీసీ, ఆదివాసీ, మైనారిటీ సాహిత్యాలంటే ఆయా మగవాళ్ల సాహిత్యాలుగానే సాహిత్య చరిత్రల్లో చెలామణి అయ్యాయి. అలానే స్త్రీవాద సాహిత్యమంటే కోస్తాంధ్ర అగ్రకుల మహిళల సాహిత్యంగా కొనసాగింది. స్త్రీవాద సాహిత్యంలో తెలంగాణ మహిళా సాహిత్యం లేదు, ఏ ప్రాంత మట్టి మహిళా సాహిత్యాల్లేవు. ఈ మహిళల సాహిత్యాల్ని స్త్రీవాదం అక్కున చేర్చుకున్న చరిత్రల్లేవు.
ఇలాంటి సాహిత్య రాజకీయాలు తెలిసీ కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగం నిర్వాహకులు తెలంగాణలోని దళిత, బీసీ, ముస్లిం మైనారిటీ, ఆదివాసీ మహిళల బలమైన అస్తిత్వ సాహిత్యాల్ని చీకటి చేసి తెలంగాణలో లేని స్త్రీవాద సాహిత్యాన్ని అంశంగా పునర్నిర్మాణంగా చేయటం అన్యాయం.
తెలంగాణ మహిళలు, మట్టి మహిళల చరిత్రలు, సాహిత్యాలు ధిక్కార పోరాట చరిత్రలు. రుద్రమ్మ నుంచి సమ్మక్క సారక్కల దాకా. ఇక్కడి మహిళలు, ముఖ్యంగా మట్టి మహిళలు తరతరాలుగా అనేక బతుకు పోరాటాలు, ఆత్మగౌరవ పోరాటాలు చేసినవారు. పోరాటాల్లో చాకలి ఐలవ్వ నుంచి కొదురుపాక రాజవ్వ దాకా ఎందరో ఉద్యమకారులు. తెలంగాణలో మహిళల రచనలు స్త్రీవాదంగా కేవల పితృస్వామ్య వ్యతిరేకంగా లేవు. తెలంగాణకు వలసొచ్చిన కోస్తాంధ్ర రచయిత్రుల రచనల్ని తెలంగాణ స్థానిక స్త్రీవాదంగా చెలామణి చేసే దౌర్జన్యం ఒకటి జరుగుతుంది. దీనిని తెలంగాణ రచయిత్రులంతా తీవ్రంగా నిలువరించాల్సిన అవసరముంది.
- జూపాక సుభద్ర
Published at: 31-03-2014 08:53 AM ( Andhra Jyothy vividha సౌజన్యంతో)
http://www.andhrajyothy.com/node/81336
 

No comments: