Saturday, March 22, 2014

డా.బద్దిపూడి జయరావుగారి కవితాసంపుటి ‘కొత్త నెత్తురు’

‘కొత్త నెత్తురు’ కవిత్వం
డా.బద్దిపూడి జయరావు
ప్రతులకు : ప్రముఖ పుస్తక కేంద్రాలలో
-------

గుండె బొటన వేలుకి కులం గొప్పుతగిలి చివ్వున చిమ్మిన నెత్తుటి ధార. అవమానాల కత్తులతో దేహాన్ని నిలువెల్లా చీల్చుకుంటున్న, ప్రాణాల్ని సంతర్పణ చేసుకుంటున్న నిరసనాత్మక ఛీత్కారం. కొత్తగా కనిపిస్తున్నా, గుప్పుతున్న పాత నెత్తురే ఇది.
డా.బద్దిపూడి జయరావు కొత్తనెత్తురు కవితా సంపుటిలోని కవితల్లో వస్తు వైవిధ్యముంది. చాలావరకూ కులం చేసిన గాయాలు, వాటిపై తిరుగుబాటు ఉంది. కులం వల్ల గాయపడ్డవాళ్లే కులం గురించి రాస్తారు. కులం గురించి రాయటం వాళ్లకు సరదా కాదు. ఎంత తప్పించుకుందామనుకున్నా, ఆత్మవంచన చేసుకుందామనుకున్నా, ఎంతగా దాని జోలికి పోకూడదనుకున్నా కులం వెంటాడుతున్నప్పుడు, అన్నివేళలా, అన్నిచోట్లా కులమే నీచంగా, హీనంగా ప్రభావితం చేస్తున్నప్పుడు కులాన్ని తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అనివార్యతలో కవి పడిపోతున్నాడని ఈ కవి మరో నిరూపణ.
ఎవరినుంచి రాస్తున్నామో, ఎవరికోసం రాస్తున్నామో, ఎవరికి చేరాలని రాస్తున్నామో వాళ్లు అందుకునేలా కవిత్వం రాయటం దళిత కవి చూపిస్తున్న ఒక మెలకువ. వాళ్లే స్వయంగా అనుభవించిన కష్టాలు, వేదనలు, వాటిపట్ల ప్రతిఘటన ఇప్పుడు కవిత్వం అయిన సందర్భం. అయితే అది పేలవంగా కేవలం ఏవో మాటలుగా చెదిరిపోకుండా జాగ్రత్తపడాల్సిన ఆవశ్యకత ఉంది. లేకపోతే అది కవిత్వంగానే కాదు ఆవేదనగా, ఆవేశంగా, ఆలోచనగా కూడా మిగలకుండా పోయే ప్రమాదముంది. కొత్తనెత్తురు కవితల్లో ఆ ప్రమాదం అంతగా లేదు.
దళిత జీవితాల్లో విడదీయరాని రెండు విషయాలున్నాయి- అమ్మ- ఆకలి, అందరూ కలిసి తినటానికి పరిస్థితుల్లేని బతుకులవి. బిడ్డ ఆకలి తీర్చటానికి తల్లి తన ఆకలి చంపుకోవటం ఆ జీవితాల్లో ఇప్పటికీ అతి సాధారణం.
‘అమ్మ’ కవితలో- పసిగుడ్డు ప్రాయంలో ఆకలి అరుపులైతే/ రక్తాన్ని పాలుగా పట్టిన దానివి/ ఆశల్ని తుంచుకున్న దానివి/. ఆకల్ని చంపుకున్న దానివి- అనటం వెనకాల మామూలు మాటలే పైకి కనిపిస్తున్నప్పటికీ ఆవేదన వెనుక లోతైన అర్థంలో కవిత్వముంది. అన్నీ సమృద్ధిగా అమరి, ఆహారం లోటులేకుండా తీసుకుంటున్నప్పుడు రక్తం పాలుగా రూపాంతరం చెందే సహజత్వం కాదిక్కడ. గర్భం దాల్చింది మొదలు బిడ్డకు పాలిచ్చే ప్రాయంవరకూ చాలీచాలని ఆహారంతో పస్తులతో బతికే తల్లి తనలో మిగిలిన రక్తాన్ని, తను పూర్తి ఆరోగ్యంతో బతికి ఉండటానికి కూడా సరిపోని రక్తాన్ని కూడా పాలుగా మార్చి బిడ్డకు పడుతుంది.
ఇదంతా మామూలు మాటల్లో చెప్పటంలోని లోతుని ఈ కవి చాలాచోట్ల సాధించారు.
‘సమరశంఖం’ కవితలో- నేనొక సమర గీతాన్ని/ తరతరాల నుండి/ అణచబడుతున్న ఆవేశాన్ని/ మను ధర్మానికి మండుతున్న అగ్నిగోళాన్ని/ పురాణాల పొలిమేరల్లో/ మగ్గుతున్న మట్టిని- అంటూనే అదే కవితలో- పీడిత శ్రామికుల్లారా!/ పిడిబాకుల్లా రండి/ సమతకోసం సమరం చేద్దాం/ కలాలకు కులం రంగు లేదు/ ప్రాణాలకు విశ్రాంతి లేదు/ అక్షరాలే ఆరని జ్వాలలుగా చేసి/ సమాజంలోకి ఒదులుదాం/ నేటి ప్రతిఘటనా పవనాలే/ వేకువ వెలుగులవుతాయి- అంటున్నప్పుడు కవికి కుల దృక్పథ మేకాక వర్గ దృక్పథమూ ఉందని, నేటి అసమానతలని ప్రతిఘటిస్తున్నప్పుడే రేపటి సమ సమాజం సిద్ధిస్తుందన్న స్పృహఉందని స్పష్టవౌతోంది.
‘ఖైర్లాంజీ కండకావరం’ కవితలో- ముక్కోటి దేవతలు సంచరించే కర్మభూమిలో/ వర్ణ విశృంఖలం/ ఇంత క్రూరమైందని ఊహించలేకపోయాం- అని మహారాష్ట్ర ఖైర్లాంజి గ్రామంలో ఒక దళిత కుటుంబాన్ని పాశవికంగా చంపేసిన ఘటనకు నివ్వెరపోయి- బిడ్డల ముందు తల్లుల్ని చెరచిన చర్య/... చెల్లెళ్లను దిగంబరులను చేసి/ అన్నల్నే అనుభవించమని/ చిత్రవధ చేసిన రాక్షసక్రీడ/ ఏ నాగరికత నెత్తుటి చరిత్ర నేర్పిందో... అంటూ దుఃఖపడిన కవి- కాలం మారింది/ అగ్నికండలు ఆక్రోషమవుతున్నాయి/ ప్రాణానికి ప్రాణం నినాద శ్లోకమయింది/ ప్రతి గుండె ఓ వజ్రాయుధమవుతుంది/ వారు గౌతమబుద్ధులే కాదు/ అవసరమైతే చండాశోకులవుతారు- అంటూ ఆగ్రహిస్తున్నారు. వర్ణ దురహంకారాన్ని వదులుకోకపోతే, తోటి మనుషుల్ని సాటి మనుషులుగా కూడా గుర్తించక, వారికి భూమి హక్కు, గౌరవంగా బతికే హక్కు నిరాకరిస్తూ ఇంకా ఇంకా పీడించాలని చూస్తున్నప్పుడు ప్రతి సామాన్యునిలోనూ సహనం నశించి ఇలాంటి ఆగ్రహం పెల్లుబుకుతుంది. అప్పుడు సమాజాలు యుద్ధశిబిరాలుగా మారిపోతాయి. దేన్నీ ఎంతోకాలం అణచివేసి ఉంచలేరని, మరీ ముఖ్యంగా చైతన్యవంతమవుతున్న దళితుల్ని ఇంకా అణచివేసే ప్రయత్నాలు చేస్తే సహించరని చెప్పటమే కవి ఉద్దేశం.
ఇది ప్రతిఘటించే కాలం/ రాచరికపు రాజధానులనుండి/ ఢిల్లీ గల్లీలవరకూ/ మా శ్రమ కట్టడాలై ఆవిష్కరించబడ్డాయి/ మా రక్తమాంసాలే పెట్టుబడిగా/ నాగరికతలు వర్ధిల్లాయి/ వేల యేళ్ళుగా నా శరీరం/ ముక్కలుగా నరకబడుతూనే ఉన్నా/ మళ్లీ ఆత్మ త్యాగానికే / ప్రాణం పట్టం గడుతుంది- అంటూ కొత్తనెత్తురు కవిత, తరతరాలుగా జరుగుతున్న అణచివేతపై హత్యాచారాలపై దళితులు సాగిస్తున్న తిరుగుబాటు, ఈ దురహంకార వర్ణసమాజం మారేవరకూ సాగుతూనే ఉంటుందని, అందుకోసం ఎన్ని త్యాగాలకైనా సిద్ధమని ప్రభావవంతంగా చెబుతోంది.
అన్ని కవితల్లోనూ అంతరప్రవాహంగా సరైన మానవ సంబంధాలకోసం కవి పడిన ఆరాటం కనిపిస్తుంది. ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆ వ్యతిరేకత సానుకూలమైన సమాజం కోసం తపనగా చాలా కవితలు నిరూపిస్తాయి. కేవలం వర్ణదృక్పథమో, కేవలం వర్గదృక్పథమో భారత సమాజాన్ని మార్చలేదని రెండు దృక్పథాలూ అవసరమని కవి గుర్తించినట్టు, వాటికి తత్వవేత్త అంబేద్కర్ ఆలోచనా విధానం మూలమని కవి నమ్ముతున్నట్లు కొత్తనెత్తురు కవిత్వం సంపుటి ఒక అంతఃసూత్రాన్ని సాధించింది. వస్తువుల్లో వైవిధ్యం చూపించిన కవి డా.బద్దిపూడి జయరావు శిల్పం, నిర్మాణంలోనూ ఇంకొంచెం జాగ్రత్తవహిస్తారని, కవిత్వం వచనంలా తేలిపోకుండా ముందుముందు ఇంకా మంచి కవిత్వంతో వస్తారని ఆశించటం తప్పదు.
-రాపాక సన్ని విజయక్రిష్ణ
http://www.andhrabhoomi.net/content/kavithvam-2
(ఆంధ్రభూమి సౌజన్యంతో)


No comments: