నమస్తేతెలంగాణ ‘బతుకమ్మ’ ఆదివారం అనుబంధం
పుట: 27 ( 7-4-2013)
బహుజన
సాహిత్యం-శాస్త్రీయ దృక్పథం
వర్తమాన సాహిత్య విమర్శకుల్లో ఒకరైన దార్ల వేంక నిరంతర అధ్యయనశీలి. హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు విభాగంలో అధ్యాపకులు. రచయితగా, విమర్శకులుగా ఆయన సమాజంలోని అసమానతలపై పదునైన తన రచనలతో పీడిత జాతిని మేల్కొలిపే ప్రయత్నం చేస్తున్నారు. సాహిత్య విమర్శకులు తాము ప్రతిపాదించే అంశాలలోని సాహిత్య, శాస్త్ర, సామాజిక నేపథ్యం తెలుసుకోగలిగితే, బలమైన ప్రతిపాదనలు చేయగలరని అంటారు. అందుకు దార్ల ప్రత్యేక సాధన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, అతను అట్టడగు వర్గం నుంచి ఎదిగి వచ్చిన విద్యా కుసుమం. అందుకే, అతని విమర్శల్లో పదునుంటుంది. ఇప్పటికే అతను ‘సృజనాత్మక రచనలు చేయడం ఎలా?’ సాహితీ సులోచనం, ‘వీచిక,’ ‘పునర్మూల్యాంకనం’ వంటి విమర్శనాత్మక గ్రంథాలు ప్రచురించారు. తాజాగా ప్రపంచీకరణ తర్వాత వచ్చిన మానవ సంబంధాల్లోని మార్పులు, ముఖ్యంగా బహుజనుల్లో పెంపొందుతున్న సాహితీ వికాసాన్ని ఆయన ఈ పుస్తకంలో చక్కగా ఆవిష్కరించారు. ఒక్కమాటలో చెప్పాలంటే, సమకాలీన తెలుగు సాహిత్యంలో వస్తున్న ధోరణులను అవగాహన చేసుకోవడానికి ఈ పుస్తకం చక్కగా దోహదపడుతుందనడంలో సందేహం లేదు. వివరంగా చెబితే, ఈ వ్యాసాలన్నీ కులం, మతం, ప్రాంతీయ సమస్యల్ని దళిత, స్త్రీవాద, మైనారిటీ, బహుజన వాదుల కోణం నుండి ఎలా అర్థం చేసుకుంటున్నారనే విషయాల్ని విశ్లేషించేవిగానే ఉన్నాయి. నిజానికి ఇవన్నీ వివిధ పత్రికల్లో అచ్చయినవే. ఇప్పుడు వాటన్నిటినీ క్రోడీకరించి ‘బహుజన సాహిత్య దృక్పథం’ పేరుతో వెలువరించారు. ఇందులోని వ్యాసాలు చదివితే వారి పరిశోధనా పటిమ, అధ్యయన విస్తృతి పాఠకులకు తెలుస్తుంది. అంతేకాదు, ఈ పుస్తకం ప్రజల్లో సహేతుకమైన ఆలోచనల్ని రేకెత్తించి తమ అస్తిత్వపు చైతన్యాన్ని మేల్కొలుపుతుందనడంలో సందేహం లేదు. ....అశోక్
వెల: 100, ప్రతులకు: యం. మంజుశ్రీ, చిరునామా: బి.202, సాయి
క్లస్టర్ ఆపార్ట్ మెంట్, శివాజీనగర్ కాలనీ, పెట్రోల్ బంక్ పక్కన, శేరిలింగంపల్లి, హైద్రాబాద్,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి