Monday, January 30, 2012

స్వర్గీయ డా.దేవదాస్ సేవలు చిరస్మరణీయం.

వికారాబాదు మున్సిపాలిటీ తొలి చైర్మన్, స్వర్గీయ డా.ఎం.దేవదాసు నీతికీ, నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనంగా చెప్పుకోదగిన ఆదర్శపరిపాలనా దక్షుడు అని పలువురు వక్తలు పేర్కొన్నారు.ఆదివారం (29.1.2010) పట్టణంలోని దళితసంఘాలు సంయుక్తంగా వికారాబాదు రవీంద్రమండపంలో డా.దేవదాసుగారి సంస్మరణ సభను నిర్వహించాయి. ఈ సభ ఉదయం 11 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకూ జరిగింది. సభలో డా.దేవదాసు గారి ఆత్మీయులు, అధికారులు, ప్రజాప్రతినిథులు, ప్రజలు అధికసంఖ్యలో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. 

‘సాక్షి’ రంగారెడ్డి ఎడిషన్ పుట: 5
వికారాబాదు మున్సిపాలిటీ తొలి చైర్మన్, స్వర్గీయ డా.ఎం.దేవదాసు నీతికీ, నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనంగా చెప్పుకోదగిన ఆదర్శపరిపాలనా దక్షుడు అని పలువురు వక్తలు పేర్కొన్నారు.ఆదివారం (29.1.2010) పట్టణంలోని దళితసంఘాలు సంయుక్తంగా వికారాబాదు రవీంద్రమండపంలో డా.దేవదాసుగారి సంస్మరణ సభను నిర్వహించాయి. ఈ సభ ఉదయం 11 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకూ జరిగింది. సభలో డా.దేవదాసు గారి ఆత్మీయులు, అధికారులు, ప్రజాప్రతినిథులు, ప్రజలు అధికసంఖ్యలో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.
వికారాబాదు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, డా.ఏ.చంద్రశేఖర్ తన సుదీర్ఘప్రసంగంలో డా.దేవదాసుగారితో తనకున్న ఆత్మీయమైన అనుబంధాన్నీ, ఆయన చేసిన సేవలను వెల్లడించారు. డా.దేవదాసుగార్ని తన రాజకీయజీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని గురుతుల్యులుగా అభివర్ణించారు. వికారాబాదు పరిసర ప్రజలు, ముఖ్యంగా దళితులు గుండెలమీద చేతులేసుకొని స్వేచ్చగా నిద్రపోగలుగుతున్నారంటే, ఆ స్వేచ్ఛ వెనుక డా.దేవదాసుగారు చేసిన పనులెన్నో ఉన్నాయన్నారు. కులాంతరవివాహాలు చేసి జైలు జీవితాన్ని కూడా అనుభవించారన్నారు. దళితులకి ఏ అన్యాయం జరిగినా వాళ్ళకు వెంటనే డా.దేవదాసుగారే గుర్తుకొచ్చేవారనీ, అందుకనే వాళ్ళంతా ఆయన దగ్గరకు పరుగెత్తికెళ్ళేవారనీ వివరించారు. రాజకీయంగా తన అభ్యున్నతికి ఎన్నో విలువైన సూచనలు చేసేవారనీ, తానే పార్టీలో ఉన్నా, తన విజయాన్ని మనస్ఫూర్తిగా ఆకాంక్షించేవారని పేర్కొన్నారు. ఆయన సాధించాలనుకున్న వాటినెన్నింటినో అమలు చేస్తున్నానంటూ, తానిక రాజకీయాలకు దూరంగా ఉంటానని అన్నారని చంద్రశేఖర్ వివరించారు. తెల్లవారగట్లే లేచి వికారాబాదు పట్టణమంతా పరిశుభ్రంగా ఉందో లేదో చూస్తూ, ఉద్యోగుల చేత పనిచేయించడం, వారికి తగిన గుర్తింపునివ్వడంలో ఆయనకు ఆయనే సాటి అని వ్యాఖ్యానించారు. వికారాబాదు నియోజకవర్గ ప్రజలందరికీ అధికారికంగా తన సేవలను అందించాలనే తపనతో శాసనసభ్యుడిగా అనేకసార్లు పోటీచేసినా, అగ్రవర్ణపెద్దలు కొందరు ఆయన వెనకుండే వెన్నుపోటుపొడిచారని, అయినా, ఆయన ప్రజల మనిషిగానే సేవచేశారని అన్నారు. ఆయన సేవలను నిరంతరం గుర్తుచేసుకోవడం వికారాబాదు ప్రజలందరికీ ఎంతో అవసరమని, ఆయన శిలావిగ్రహాన్ని త్వరలోనే ఏర్పాటు చేయాలనీ, దానికి తనవంతూ సహాయ, సహకారాలు అందిస్తానని ప్రకటించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ సభ్యుడు, నవాబుపేట మండలం మాజీ అధ్యక్షుడు యాదయ్య మాట్లాడుతూ డా.దేవదాసు నిస్వార్థ ప్రజాసేవకుడనీ, ఇంటికంటే, పట్టణ ప్రజల అభివృద్దినే కోరుకునేవారని గుర్తుచేసుకున్నారు. ఆయనకు కాంగ్రెసు టక్కెట్టు ఇవ్వకుండా అగ్రవర్ణానికి చెందిన ఒక రెడ్డి భూస్వామి అడ్డుకున్నారని నాటి పరిస్థితులన్నీ సోదాహరణంగా వివరించారు. నేడు మనం తెలంగాణ గురించి ఉద్యమాలు చేస్తున్నాం. స్థానికులకు విలువ ఉండాలని కోరుకుంటున్నాం. కానీ, ఈ పార్టీలు స్థానికేతరులకు టిక్కెట్స్ ఇస్తున్నాయి. అప్పుడు తమ ప్రాంతాభివృద్ధి కి వాళ్ళేవిధంగా సహాయపడతారనీ, ఆ విధంగా మన ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోతుందనీ, అందులో భాగంగానే ఈ నియోజకవర్గప్రజలు  డా.దేవదాసుగారి సేవల్ని కోల్పోయారనీ ఆవేదన చెందారు. నేటికైనా స్థానికులు, దళితులు నిజమైన చైతన్యంతో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
వికారాబాదు ప్రస్తుత ఎమ్మెల్యే జి.ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వమే అధికారికంగా ఆయన విగ్రహాన్ని మునిసిపాలిటీ దగ్గర ప్రతిష్టిస్తే బాగుంటుందని, దీనికి తనవంతు కృషి చేస్తానని ప్రకటించారు.
ఆంధ్రజ్యోతి 30.1.2012 రంగారెడ్డి జిల్లా


సిద్దార్థ కళాశాల ప్రిన్సిపాల్ టి.జయదేవ్ మాట్లాడుతూ దళితులు హిందువులుగానే ఉండడానికీ, మతాంతరీకరణ జరగకుండా అడ్డుకోవడంలోను డా.దేవదాసుగారి పాత్ర మరిచిపోలేనిదనీ, ఆలంపల్లిలో నిర్మిస్తున్న దేవాలయానికి తామెంతగానో సహకరించామని గుర్తుచేసుకున్నారు. భారతీయ సంస్కృతిని పరిరక్షించడంలో ఆయన గొప్పసేవ చేశారనీ, అటువంటివారి వల్లనే ధర్మం కాపాడబడుతుందనీ అన్నారు.
శ్రీ అనంత పద్మనాభ కళాశాల  ప్రిన్సిపాల్ డా. వీరయ్య మాట్లాడుతూ ఏ పనిని చేసినా నిబద్ధతతో చేసేవారనీ, కళాశాల మేనేజిమెంటు సమావేశాల్లో ఆయన పాల్గొన్నప్పడు కూడా చాలా చురుకుగా చర్చల్లో పాల్గొనేవారనీ, నియమ నిబంధనలన్నీ సక్రమంగా పాటిస్తూ, దళితులకు అన్యాయం జరగకుండా వ్యవహరించమని హెచ్చరించేవారనీ, ఆయన్ని చూస్తే నిజాయితీ, నిబద్ధతకు నిలువెత్తురూపంగా అనిపించేదనీ నివాళులర్పించారు.
మునిసిపాలిటీ వైస్ చైర్మన్ చిగుళ్ళపల్లి రమేష్ మాట్లాడుతూ, మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పటి నుండీ ఆయన పాలనాదక్షతను గమనించేవాడిననీ, సభ్యుల నుండి ముందుగానే సమస్యల్ని అడిగి తెలుసుకొని వాటిని ఎజెండాలో పెట్టి, చర్చించేవారనీ సమావేశాన్ని ఎంతో సమర్థవంతంగా నిర్వహించేవారనీ ప్రశంసించారు.
రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు హఫీజ్, పట్టణ నాయకులు రామచంద్రారెడ్డి, ప్రముఖన్యాయవాది గోవర్ధన్ రెడ్డి, యువజన నాయకుడు శుభప్రధ, పట్టణనాయకులు సి.అనంతయ్య, ఎం.ఆర్.పి.ఎస్ నాయకుడు పెండ్యాల అనంతయ్య,  మల్లేష్; బెంజిమన్, రిటైర్డ్ అధ్యాపకులు శంకరయ్య, నాగభూషణం తదితరులు ఈ సంస్మరణ సభలో నివాళులర్పించారు.
 
సూర్య 30.1.2012 రంగారెడ్డి జిల్లా
 నాగభూషణం గారు మాట్లాడుతూ తమ యాజమాన్యంలో నడుస్తున్న న్యూ నాగార్జున హైస్కూలులో ప్రతీ యేడాదీ ప్రతిభావంతుడు లేదా ప్రతిభావంతురాలైన విద్యార్థులకి డా.దేవదాసు స్మారక పురస్కారంగా వెయ్యిరూపాయల నగదు బహుమతిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
వికారాబాదులోని దళిత సంఘాలు వరుసగా అంబేద్కర్ సంఘం, జగజ్జీవన్ రామ్ సంఘం, అరుంధతి మిత్రమండలి, మాదిగ సంక్షేమ సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, దళిత మేధావుల ఫోరం, ఎస్.సి., ఎస్.టి. రిజర్వేషన్ పరిరక్షణ వేదిక,  ఆదిజాంభవ అరుంధతీయ ఫెడరేషన్ లు సంయుక్తంగా ఈ సభను నిర్వహించాయి. ఈ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు ఎస్.భీమయ్య, సి. అనంతయ్య, యం.ఆనందకుమార్, సి. జగదీశ్, ఎన్.దేవదాస్, సి.నాగరాజ్, ఎస్. రాజలింగం, బి.రాములు, సాయన్న( రిటైర్డ్ హెడ్మాస్టారు) తదితర నాయకులు ఈ సభను నిర్వహించి, ఘనంగా నివాళులర్పించారు.
ఈ సంస్మరణ సభలో డా.దేవదాసు కుటుంబసభ్యుల్ని వేదికపై కూర్చోబెట్టి, మిగతా వాళ్ళంతా ఒక్కొక్కరు చొప్పున వేదికపైకి వచ్చి నివాళులర్పించారు. ఎస్.భీమయ్య అధ్యక్షతన జరిగిన ఈ సభను నిర్వహించడంలో రాజలింగం చురుకుగా వ్యవహరించారు. డా.దేవదాసుగారి సేవల్ని ప్రస్తుతిస్తూ రాజలింగం, ఆనందం కవిత్వం చదివారు.
డా.దేవదాసు గారి కుటుంబ సభ్యుల్లో శశి కళాధర్, మంజుశ్రీ, వేణుగోపాల్, డా.దార్ల వెంకటేశ్వరరావు, టి. వెంకటేశ్ లు సభ నిర్వహించిన వాళ్ళకు, వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి ఆశయాల్ని సాధించడానికి కంకణబద్దులమై, వారి ఆదర్శాన్ని శిరోధార్యంగా భావిస్తామని కుటుంబసభ్యులు ప్రకటించారు.
ఈ సందర్భంగానే అల్లుళ్ళు డా.దార్ల వెంకటేశ్వరరావు, టి. వెంకటేశ్, ఆయన తమ్ముడు వేణుగోపాల్ కొన్ని విషయాల్ని చర్చించుకోవాల్సిన అవసరం ఉందంటూ, డా.దేవదాసు గారి సేవలకు తగినట్లు మరింతగా గుర్తింపు లభించాల్సి ఉందన్నారు. డా.దేవదాసుగారి భావజాలం భిన్న సంఘర్షణలతో కూడినప్పటికీ, అది శాంతిని ఆకాంక్షించిందేనని పేర్కొన్నారు.

No comments: