Sunday, January 29, 2012

అంబేద్కర్‌ విగ్రహాలకు రక్షణేదీ...? తాగిన మైకంలో కూల్చారట! ( ప్రజాశక్తి 30.1.2012)

తూర్పు గోదావరి జిల్లాలో అనేక సార్లు ఎన్నో గ్రామాల్లో దళితులపై పెత్తందారుల దురహంకార దాడులు జరిగాయి. పెత్తందారులు దళితులపై దాడులు చేయడం, దళిత పేటల్లో భయానక వాతావరణం సృష్టించడం తరచూ జరుగుతూనే ఉన్నాయి. మామూలు సమయాల్లో అన్ని కులాల వారు కలిసి ఉంటున్నా గొడవలు వచ్చినప్పుడు ఎవరి సామాజిక తరగతి వైపునకు వారు వెళ్లిపోతుంటారు. అన్ని రంగాల్లోనూ జిల్లా అభివృద్ధి చెందుతున్నప్పటికీ అనేక రూపాల్లో దళితులు కుల వివక్షకు గురవుతూనే ఉన్నారు. దళితులకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ అంటే ఎంతో గౌరవం. ఆయనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఊరుకోరు. ఆయన విగ్రహాలపై దాడి జరిగితే తమపై దాడిగానే దళితులు భావిస్తారు. ఈ ప్రాంతంలో పెత్తందారులకు, దళితులకూ మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న సందర్భాల్లో అంబేద్కర్‌ విగ్రహాలు ధ్వంసం చేసిన ఘటనలున్నాయి. పోలీసులు మాత్రం అంబేద్కర్‌ను ఓ సామాజిక తరగతికి మాత్రమే చెందిన నాయకునిగా భావించి దోషులపై చర్యలు తీసుకోవడంలేదని దళితులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ, పోలీసుల ఉదాసీనత వల్ల కోనసీమలో అంబేద్కర్‌ విగ్రహాలకు అవమానం జరుగుతోంది. కోనసీమలో ఒకే రోజు నాలుగు విగ్రహాలు ధ్వంసమైన ఘటనపై ఐదు రోజుల పాటు దర్యాప్తు చేసిన ప్రత్యేక పోలీసు బృందాలు దీనిని తాగుబోతుల పనిగా తెరకెక్కించారు. ఇది హాస్యాస్పదంగా ఉందని లోకం కోడై కూస్తోంది.ఈ నెల 23న అమలాపురం రూరల్‌లో ఐదు అంబేద్కర్‌ విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనకు వెనుక ఎన్నో కారణాలుండవచ్చు. అయితే కాంగ్రెస్‌లో పదవుల పంపిణీకి సంబధించిన సమస్య అని చాలా మంది చెబుతున్నారు. ఈనెల 22న అమలాపురం ఎంపీ జివి హర్షకుమార్‌ కాంగ్రెస్‌ పార్టీలో కాపు సామాజిక తరగతికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల దళితులు పార్టీకి దూరమవుతారని ఆరోపించారు. 23వ తేదీ వేకువజామున అమలాపురం పట్టణం, బండివారిపేట, చిందాడగరువు, రోళ్లపాలెం శివారు చిట్టిగరువు ప్రాంతాల్లో అంబేద్కర్‌ విగ్రహాలు ధ్వంసమయ్యాయి. అమలాపురంలోని నల్లవంతెన వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు రోళ్లపాలెంలోని మరో విగ్రహాన్ని ధ్వంసం చేశారు. బండివారిపేటలో మాజీ స్పీకర్‌ జిఎంసి బాలయోగి విగ్రహం వద్దే అంబేద్కర్‌ విగ్రహం కూడా ఉంది. అయితే ఇళ్ల మధ్యలో ఉన్న అంబేద్కర్‌ విగ్రహాన్ని మాత్రమే దుండగులు ధ్వసం చేశారు. అనంతరం చిందాడగరువు గ్రామంలో రోడ్డు పక్కనే ఉన్న అంబేద్కర్‌ విగ్రహాన్ని కూల్చివేసి పక్కనే ఉన్న కాలువలో పడేశారు. విగ్రహాల ధ్వంసం ఘటన తెలుసుకున్న దళితులు 23వ తేదీ ఉదయం ఆందోళనకు దిగారు. అంబేద్కర్‌ విగ్రహాలను ధ్వంసం చేసిన దోషులను శిక్షంచాలని కోరుతూ అమలాపురం పట్టణంలో బంద్‌ను నిర్వహించేందుకు సిద్దమయ్యారు. షాపులను మూయిస్తుండగా అక్కడికి వచ్చిన సామాజిక తరగతికి చెందిన యువకులు దళితులతో గొడవకు దిగారు. దీంతో ఒక్క సారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరు వైపులవారి మధ్య ఘర్షణ జరగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గ్రామాల్లో ఉద్రిక్తతలు పెరగకుండా పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు. పది రోజులపాటు 144 సెక్షన్‌ విధించారు. రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ సంఘటపై స్పందించి దోషులను 48 గంటల్లోగా అరెస్టు చేస్తామని ప్రకటించారు. విగ్రహాల ధ్వంసం సంఘటనకు సంబంధించి రాజకీయ కోణంతోపాటు అన్ని కోణాలనూ దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు ప్రకటించారు. ఐజి కృషంరాజును ప్రత్యేక దర్యాప్తు అధికారిగా నియమించారు. కాని వారు చెప్పినవిధంగా 48 గంటల్లోగా దోషులను పట్టుకోలేకపోయారు. ఇదిగో పట్టేస్తాం అదిగో పట్టేస్తామని ప్రకటనలిచ్చారు. కేసులో పురోగతి లేకపోవడంతో దళితులు ఈనెల 26న నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అంబేద్కర్‌ విగ్రహాల వద్ద నల్ల జెండాలను ఎగురవేసారు. ఈనెల 27న మంత్రుల బృందం విగ్రహాలు విధ్వంస మయిన ప్రాంతాల్లో పర్యటిం చినపుడు సిపిఎం జిల్లా కార్యదర్శి దడాల సుబ్బారావు విగ్రహాల రక్షణకు ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో విగ్రహాల రక్షణకు చట్టం చేస్తామని మంత్రుల బృందం హామీ ఇచ్చి వెళ్లింది. అయితే ఐదు రోజుల పాటు దర్యాప్తు జరిపిన పోలీసులు 13 మందిపై కేసులు పెట్టి ముగ్గుర్ని మాత్రం ఈనెల 28న అరెస్టు చేశారు. తాపీపని చేసుకునే వాకపల్లి దుర్గబాబు, కంచిపల్లి అంజిబాబు, మంజూరి అనిల్‌ను అరెస్టు చేసిన పోలీసులు ఈ కేసులో ప్రధాన నిందితునిగా భావిస్తున్న గంధం పల్లంరాజును 13వ నిందుతునిగా చూపిస్తున్నారని దళితులు విమర్శిస్తున్నారు. తాము తప్పతాగి అమలాపురంలోని విగ్రహాలను పగులగొట్టామని నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు చెప్పడాన్ని వారు తప్పు పడుతున్నారు. విగ్రహాల ధ్వంసం కేసులో డిజిపి దినేష్‌రెడ్డి కీలక ఆధారాలు లభించాయని ప్రకటించారు. వాటిని బహిర్గతం చేయకుండా తాగిన మైకంలోనే విగ్రహాల ధ్వంసం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. పోలీసుల మాటలను జనం విశ్వసించడంలేదు. వారం రోజుల పాటు పోలీసు ఉన్నతాధికారులు అమలాపురంలో మకాం వేసినప్పటికీ పది మంది నిందితులను ఇంతవరకూ అరెస్టు చేయకపోవడం పోలీసుల పనితీరుకు నిదర్శనం. వేరే ఒత్తిళ్లవల్ల పట్టుకోవడం లేదని అనుకోవచ్చు.
రిపబ్లిక్‌డే రోజు ధవళేశ్వరంలో
రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజునే ధవళేశ్వరంలో ఆయన విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. అమలాపురంలో విగ్రహాలను ధ్వంసం చేసిన దోషులను అరెస్టు చేయడంలో పోలీసులు విఫలమవడంతో దుండగులు రెచ్చిపోయి ధవళేశ్వరంలోనూ విధ్వంసానికి దిగారు. క్వారీ కెనాల్‌ రోడ్డులో కాలువ పక్కనే ఉన్న అంబేద్కర్‌ విగ్రహం ఈనెల 26 తెల్లవారు జామున విధ్వంసానికి గురైంది. దుండగులు విగ్రహం తల భాగాన్ని వేరుచేసి పక్కనే ఉన్న పొదల్లో పడేశారు. విషయం తెలుసుకున్న దళితులు, సిపిఎం నాయకులు, దళితులు ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి దోషులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు. 48 గంటలలోగా దోషులను అరెస్టు చేస్తామని రాజమండ్రి అర్బన్‌ జిల్లా ఎస్‌పి పి.ఉమాపతి ఆందోళన కారులకు హామీ ఇచ్చి ఆందోళ విరమింపచేశారు. ఈనెల 27 మంత్రుల బృందం పర్యటించి ధవళేశ్వరంలో ధ్వంసమైన అంబేద్కర్‌ విగ్రహాన్ని పరిశీలించి వెళ్లింది.సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు టి.అరుణ్‌, తెలుగుదేశం నాయకుడు, సినీనటుడు మురళీమోహన్‌, పెదపల్లి ఎంపీ జి.వివేక్‌, అమలాపురం ఎంపీ జివి హర్షకుమార్‌ ఘటన జరిగిన ప్రాంతాల్లో పర్యటించారు. దోషులను జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు రాజమండ్రి అర్బన్‌ ఎస్‌పి ఉమాపతి ఇచ్చిన హామీ ప్రకారం దోషులను అరెస్టు చేయకపోవడంతో ఎంఎల్‌సి కందుల దుర్గేష్‌ రాజమండ్రిలోని గోకవరం బస్టాండు వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఆదివారం ఉదయం ఆమరణ దీక్షకు దిగారు.
విగ్రహాలకు తరచూ అవమానాలు
అంబేద్కర్‌ విగ్రహాలకు తరచూ అవమానాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం పెద్దగా పట్టించుకోవడంలేదని దళితులు విమర్శిస్తున్నారు. అంబేద్కర్‌ను జాతీయ నాయకునిగా కాకుండా దళిత నాయకునిగా చూడం సరికాదని వారు చెబుతున్నారు. విగ్రహాలు ధ్వంసం చేసిన దోషులపై జాతీయ భద్రతా చట్టం ప్రయోగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అంబేద్కర్‌ విగ్రహాలకు అవమానం జరిగింది. కొన్ని సందర్భాల్లో చెప్పుల దండలు వేయడం, విగ్రహం తల, చేతులు విరగ్గొట్టం, విగ్రహాన్ని పూర్తిగా ధ్వంసం చేయండం వంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే దుండగులు రెచ్చిపోతున్నారని దళితులు, ప్రగతికాముకులు విమర్శిస్తున్నారు.
దోషులపై జాతీయ భద్రతా చట్టం ప్రయోగిస్తారా?
అమలాపురంలో నాలుగు ప్రాంతాల్లో ఐదు విగ్రహాలు ధ్వంసం చేసిన 13 మంది దుండగుల్లో ఇప్పటి వరకూ కేవలం ముగ్గుర్ని మాత్రమే పోలసులు అరెస్టు చేశారు. కేసులో రాజకీయ, కుట్ర కోణాలు లేవని తాగిన మైకంలోనే నిందితులు ఈ పనిచేశారని పోలీసులు చెబుతున్నారు. అంటే వీరి చేత ఈ పని ఎవరూ చేయించలేదని దీనికి రాజకీయ, కుల కోణాలు లేవని పోలీసులు చెప్పకనే చెబుతున్నారు. 23న అమలాపురంలో దళితులు వ్యాపార దుకాణాలు మూయిస్తున్నప్పుడు ఒక సామాజిక తరగతికి చెందిన వారు దళితులను ఎందుకు అడ్డగించారో పోలీసులే చెప్పాలి. తాగిన మైకంలో నాలుగు గ్రామాలు తిరిగి దుండగులు అంబేద్కర్‌ విగ్రహాలను ధ్వంసం చేశారంటే నమ్మశక్యంగా లేదు. గతంలో మాదిరిగానే ఈ కేసును కూడా పోలీసులు నీరు కారుస్తున్నారని దళితులు అంటున్నారు. విగ్రహాల కూల్చివేత వెనుక ఉన్న అసలు దొంగలను పట్టుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. అమలాపురం కేసు పరిస్థితి ఇలా ఉంటే ఈనెల 26న ధవళేశ్వరంలో క్వారీ కెనాల్‌ వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు. 48 గంటలలోగా దోషులను పట్టుకుంటామని రాజమండ్రి పోలీసు అర్బన్‌ జిల్లా ఎస్‌పి పి.ఉమాపతి హామీ ఇచ్చినప్పటికీ ఆదివారం వరకూ దుండగులను అరెస్టు చేయలేదు. మొత్తం మీద అంబేద్కర్‌ విగ్రహాలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. దోషులపై కఠిన చట్టాలు అమలు చేయకపోవడం వల్ల తరచూ అంబేద్కర్‌ విగ్రహాలకు అవమానాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం విగ్రహాల రక్షణకు చర్యలు చేపట్టాలి.
ప్రభుత్వం తీరు అమానుషం

భారత రాజ్యాంగ నిర్మాత, మేధావి డాక్టర్‌ బాబా సాహెబ్‌ బిఆర్‌.అంబేద్కర్‌ విగ్రహాల విధ్వంసం విషయంలో ప్రభుత్వం స్పందించిన తీరు అమానుషం. నిందితులను అరెస్టు చేసిన అంశాలు అనుమానాస్పదంగా ఉన్నాయి. పోలీసులు సరైన రీతిలో వ్యవహరించకుండా రాజకీయ ఒత్తిళ్లు పని చేశాయి. రాజకీయ ప్రయోజనాలు ప్రధానంగా తూతూమంత్రంగా అరెస్టులు, అసలు నిందితులను తప్పించినట్లు అనమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి అసలు నిందితులను అరెస్టు చేయాలి.
ఎం.రాజశేఖర్‌, వ్య.కా.స, తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు
( ప్రజాశక్తి 30.1.2012)

No comments: