-డా॥దార్ల వెంకటేశ్వరరావు
అసిస్టెంటు ప్రొఫెసరు,
తెలుగుశాఖ, సెంట్రల్‌యూనివర్సిటి,
గచ్చిబౌలి, హైదరాబాదు-46
ఫోన్: 9989628049
హైదరాబాదు, రవీంద్రభారతిలో మే 14 వతేదీన రాష్ట్ర సాంస్కృతిక మండలి, సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో‘‘నవలా సాహితీ సమాలోచనం’’ సదస్సుని నిర్వహించారు.దీనిలో వివిధ రకాల నవలల్ని, వాటి స్వరూప స్వభావాల్ని సమీక్షించారు. తొలితరం నవలలు, చారిత్రక,హాస్య, ఉద్యమ నవలలు, నవలల్లోని రచనా శిల్పం, సమకాలీన నవలల్లోని ప్రధాన సమస్యలతో బాటు ఈ సదస్సులో మాండలిక నవలలనే అంశాన్ని కూడా చర్చకు పెట్టారు. వీటిలో మాండలిక నవలల గురించి విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉన్నా, సమయాభావం వల్ల అది కొనసాగలేదు. కానీ,దీనిలో పాల్గన్న సాహితీవేత్తల ప్రసంగాల్లో కొన్ని తాత్కాలిక సూత్రీకరణలతో దీన్ని ముగించేశారు.
అసలు దేన్ని మాండలిక రచన అనాలి? సాంఘిక,రాజకీయ,చారిత్రక,మనోవైజ్ఞానిక హాస్య నవలా విభాగాలు చేసినట్లే, మాండలిక నవలా విభాగం కూడా చేస్తే సరిపోతుందా? అలా వర్గీకరణ చేయడానికి రూపం,శిల్పాలలో దేన్ని ప్రమాణంగా తీసుకోవాలి? భాష రూపానికి చెందిందా? శిల్పానికి చెందిందా?ఈ విభజన నవలలకీ వర్తిస్తుందా? తెలుగులో మాండలికంలో రాసిన నవలలున్నాయా? మాండలికంలో రాయడానికి చారిత్రకంగా ఏమైనా ప్రత్యేక కారణాలు కనిపిస్తున్నాయా? మాండలికంలో రాస్తే అందరికీ అర్థమవుతుందా ? మొదలైనప్రశ్నలన్నింటినీ చర్చించుకోవాలి.
అస్తిత్వఉద్యమాల నేపథ్యంలో తమ వ్యవహార భాషలోనే రచనల్ని రాయడమనేది జీవనవాస్తవికతకూ,ఆత్మగౌరవాభివ్యక్తికి, గతంలో తమపై పెత్తనం చెలాయించిన భాషపై ధిక్కారస్వరానికి నిదర్శనంగాను గుర్తించాలనే వాదన ఉంది.సాధారణంగా కొందరివ్యవహారంలోని భాష విస్తృతంగా వాడుకలో ఉండడం వల్ల అది ప్రమాణభాషగాను, మరికొంతమంది వ్యవహారంలోనే ఉన్న భాష మాండలికభాషగా గుర్తింపుపొందుతుంది.భాషావ్యవహారాన్ని బట్టి ఒకే భాషలో అనేక మాండలికాలు ఉండొచ్చు.అవి ప్రాంతాలను బట్టి ప్రాంతీయ మాండలికాలు, కొన్ని సామాజికవర్గాలను బట్టి వర్గమాండలికాలుగాను పిలుస్తుంటారు. దీన్ని మామూలు మాటల్లో చెప్పుకోవాలంటే, ఒక ప్రత్యేక ప్రాంతంలో నివశించే ప్రజలు మాట్లాడే భాషలో కనిపించే వ్యవహార భేదమే మాండలికం. ఈ దృష్టితో చూసినప్పుడు మాండలికాలనేవి, ప్రాంతాలను బట్టి, ఆయా ప్రాంతాల్లో నివశించే ప్రజల వృత్తుల్ని బట్టి ఏర్పడుతుంటాయి. పాలనా పరంగా ఒక రాష్ట్రం లేదా ఒక దేశంగా ఉన్నప్పుటికీ మళ్ళీ ఒకే భాష మాట్లాడే వ్యవహారంలోను వ్యత్యాసాలు ఉంటాయి.
మన భాషా శాస్త్రవేత్తలు ఆంధ్రప్రదేశ్‌లో వృత్తిపదాల్ని ఆధారం చేసుకొని తెలుగులో నాలుగు భాషామండలాల్ని గుర్తించారు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ అనేవి ఆ ప్రాంతాలు. ఆ ప్రాంతాల నుండి వచ్చిన రచనల్ని ఆ ప్రాంత మాండలిక రచనలు అనే అవకాశం ఉంది. కానీ, అప్పుడు మాండలిక రచనను స్పష్టంగా వివరించుకున్నట్లవ్వదు. ఆ ప్రాంతానికి చెందిన కొన్ని ప్రత్యేక పదాలున్నా, మిగతా పదాలన్నీ ఒక భాష మాట్లాడేవాళ్ళందరికీ పెద్దగా వ్యత్యాసం కన్పించకుండా, పాత్రోచితంగానో, సన్నివేశానుగుణంగానో భాషాప్రయోగం జరిగితే దాన్ని పూర్తి మాండలిక రచన అనలేం కానీ, దాన్ని మాండలిక ప్రయోగాలున్న రచనగా గుర్తించవచ్చు. అలా కాకుండా, ఒకే భాషకి చెందినా, కొన్ని సామాజిక వర్గాలవాళ్ళు మాట్లాడుకుంటున్న భాషలో మాత్రమే రాస్తే దాన్ని మాండలిక రచన అనొచ్చు.తెలుగులో నాలుగు ప్రాంతాల నుండీ వెలువడుతున్న రచనల్లోను ఒక నిర్దిష్ట ప్రాంతానికి మాత్రమే పరిమితమైనట్లున్నా, కొంచెం ప్రయత్నిస్తే అర్థమైయ్యేటట్లు ఆ భాషలో రాయబడిన రచనల్ని ‘‘మాండలిక రచనలు’’ అని పిలవడం సమంజసం.అయితే, పాత్రలు మాత్రమే కాకుండా, రచయిత చెప్పేది కూడా పూర్తిగా మాండలికంలో ఉన్నప్పుడే దాన్ని మాండలిక రచన అని పిలవాలి. ఈ సూత్రీకరణలో చూస్తే తెలుగులో చాలా తక్కువగానే మాండలిక రచనలు వచ్చాయి. అందులో నవలల్ని చూస్తే,పదుల సంఖ్యలో కూడా ఉండవనిపిస్తుంది.
తెలుగు నవల రచనా ప్రయత్నం 1872లో నరహరిగోపాలకృష్ణమచెట్టి రాసిన ‘‘శ్రీరంగరాజ చరిత్రం’’ (సోనాబాయి చరిత్రం)లో జరిగినా, 1878 వెలువరించిన కందుకూరి వీరేశలింగం ‘‘రాజశేఖరచరిత్రం’’తోనే నిజమైన లక్షణాలున్న నవలా ప్రారంభంగా చాలా మంది విమర్శకులు భావిస్తున్నారు. ఇలా వచ్చిన నవలలన్నింటినీ చెప్పడానికి ఇక్కడ కుదరదు. కానీ, 1872 నుండి 1900 వరకు ప్రారంభ యుగంగాను, అక్కడ నుండి 1920 వరకు అనువాదయుగంగాను,తర్వాత 1942 వరకు వికాస యుగంగాను, 1942 నుండి 1960 వరకు మనోవైజ్ఞానిక యుగంగాను,ఆ తర్వాత సమకాలీన యుగంగా పేర్కొన్నా, 1980 తర్వాత అస్తిత్వ ఉద్యమాలతో నవలా రచనల్లో ప్రయోజనాపేక్షతో మాండలికం ప్రవేశించింది.
తొలి మాండలిక భాషాప్రయోగాలున్న నవల మాత్రం 1935 నాటి సామాజిక, ఆర్థికపరిస్థితుల్ని చిత్రిస్తూ దాశరథి రంగాచార్య రాసిన ‘‘చిల్లరదేవుళ్ళు’’ నవలగానే విమర్శకులు గుర్తిస్తున్నారు. పోరంకి దక్షిణామూర్తి ప్రయోగాత్మకంగా కోస్తాంధ్ర, తెలంగాణ రాయలసీమ, మాండలికంలో మూడునవలల్ని రాశారు.ఆ నవలలు ‘వెలుగూ వెన్నెలా గోదారీ ( రచన 1958,), ముత్యాలపందిరి (1964), రంగవల్లి (1974). మరికొంతమంది విమర్శకులు అల్లంరాజయ్య రాసిన ‘‘ఊరు’’ ‘‘ కొలిమంటుకున్నాది’’ ‘‘ అగ్నికణం’’ వంటి నవలల్ని కూడా మాండలిక నవలలు గానే భావిస్తున్నారు. అయితే, పూర్తిగా మాండలిక నవలగా చెప్పదగినవి మొదట తెలంగాణ ప్రాంతం నుండి, తర్వాత రాయలసీమ నుండీ వచ్చాయి. వేముల ఎల్లయ్య ‘‘కక్క’’ ( 2000), ‘‘సిద్ధి’’ ( 2005), భూతం ముత్యాలు ‘‘సూర’’ ( 2004) కదిరెకృష్ణ ‘‘పొద’’, పెద్దింటి అశోక్‌కుమార్ ‘‘దాడి’’ నవలలు పూర్తిగా తెలంగాణ మాండలికంలోనే ఉన్నాయి. ఈ ప్రాంతం నుండే బోయజంగయ్య రాసిన జాతర, జగడం నవలల్లోను మాండలిక పదప్రయోగాలు కనిపించినా, పూర్తి మాండలిక నవలలుగా చెప్పలేం.
రాయలసీమ మాండలికంలో నామిని సుబ్రహ్మణ్యంనాయుడు రాసిన ‘‘మునికన్నడి సేద్యం’’ స్వామి ‘‘ మీరాజ్యం మీరేలండి’’,శాంతినారాయణ ‘‘పెన్నేటిమలుపులు’’, కేతు విశ్వనాథరెడ్డి ‘‘వేర్లు’’ నవలలు వచ్చాయి. తెలంగాణాలో వేముల ఎల్లయ్య, రాయలసీమలో నామిని పూరి ్తమాండలికంలో రాయడంలో చేయితిరిగిన రచయితలుగా ప్రసిద్ధి చెందారు. ఉత్తరాంధ్రలో రావిశాస్త్రి ‘‘ సొమ్ములు పోనాయండి, అల్పజీవి, రత్తాలు ` రాంబాబు’’ వంటి నవలల్లో మాండలిక ప్రయోగాలు విరివిగానే ఉన్నా, ఈ నవలల్ని కూడా పూర్తిగా మాండలిక నవలలని అనలేం.రాయలసీమ భాషాసౌందర్యాన్ని నామిని సుబ్రహ్మణ్యం నాయుడు రాసిన నవలల్లో పట్టుకోగలిగారని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు.
శ్రీపాదసుబ్రహ్మణ్యం రాసిన ‘‘ ఆత్మబలి, రక్షాబంధనం’’ మహీధర రామమోహనరావు రాసిన ‘‘ ఓనమాలు’’ రథచక్రాలు’’ ‘‘ కొల్లాయిగట్టితేనేమి, నవలల్లో గోదావరి ప్రాంత ప్రజల వ్యవహారభాష అక్కడక్కడా కనిపిస్తుంది. రావిశాస్త్రి రాసిన ‘‘అల్పజీవి’’, సొమ్ములు పోనాయండి, రత్తాలు`రాంబాబు వంటి నవలల్లో ఉత్తరాంధ్ర మాండలిక వ్యవహారం కనిపిస్తుంది. అప్పలనాయుడు రాసిన ‘‘పునరావాసం’’ ‘‘ ఉత్కళం’’ లలో కళింగాంధ్ర మాండలిక పదజాలంతో పాటు ఆ ప్రాంతసాంస్కృతిక జీవనం కనిపిస్తుంది. వీటిని నవలకుండే ఒక లక్షణమైన నేపథ్యాన్ని అందించడానికి, సన్నివేశ కల్పనకు ఉపయోగపడే విధంగా ఆ వ్యవహారాన్ని ఉపయోగించుకున్న నవలలుగా భావించడం సమంజసం. ఎందుకుంటే, నవల చదువుతుంటే కొన్ని పుటల్ని చదివేసరికి తెలుగులో ఏ ప్రాంతానికి చెందిన పాఠకుడికైనా ఆ వ్యవహారంలో ఉన్న భాషా పలుకుబడులు తెలిసిపోతాయి.కానీ, పూరి ్తమాండలిక నవలల్ని రెండు మూడు సార్లు చదివితేనే గాని అవగాహన కావు. ఆచార్య ననుమాసస్వామి ‘‘కక్క’’ నవల గురించి వ్యాఖ్యానిస్తూ, నవలను కనీసం రెండు మూడు సార్లు చదవాల్సిందేననీ, అప్పుడే ఆ భాషలో ఉన్న సౌందర్యం అనుభూతిలోకి వస్తుందన్నారు. పద్యకవిత్వాన్ని చదించుకుని ఆస్వాదించినట్లే దీన్నీ అవసరమైతే చదివించుకుని, వ్యాఖ్యానం రాయించుకొని చదువుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
మాండలికంలో రచనలు చేసేవారంతా ఆత్మగౌరవాభివ్యక్తి వంటి భావాల్ని కలిగి ఉన్నారని చెప్పలేకపోయినా, తమ నిత్యవ్యవహార భాషలోనే రాయాలనుకునే వాళ్ళు చాలా మంది ఈ ఆలోచనలు కలిగిఉన్నారని మాత్రం చెప్పేవీలుంది. ఆచార్య ఎస్వీ సత్యనారాయణ సంపాదకత్వంలో ఇలాంటి వాదోపవాదాల్ని ‘‘దళితవాదవివాదాలు’’ పేరుతో 2000వ సంవత్సరంలోనే గ్రంథరూపంలో తీసుకొచ్చారు.
తెలంగాణ ప్రత్యేకరాష్ట్ర ఉద్యమంలో భాగంగా తమది మాండలికం కాదనీ, ఒక ప్రత్యేకభాష అనేవాదనలు కూడా వస్తున్నాయి.ముస్లిం మైనారిటీ సాహిత్యంలో తమ నేటివిటీని ఉర్దూ, హిందీ పదాల కలయికతో కూడిన తెలుగు భాషావాడుకను ప్రయోగించేవాళ్ళూ అధికంగానే ఉన్నారు.వీరి భాషా ప్రయోగ వైచిత్రి పట్ల కూడా వాదోపవాదాలు జరిగాయి.
ఇవన్నీ పరిశీలిస్తే, భాషకు ఒక వ్యవస్థ అవసరమనీ, దాని వల్ల ఆ భాషావ్యవహారంలో ఉన్నవాళ్ళు ఒకేలా అర్థం చేసుకోగలుగుతారనేది శాస్త్రీయమైన అవగాహన.దీనితో పాటు వ్యాకరణ సూత్రాల్ని నిర్మించుకొని, క్రమబద్దంగా భాషను నేర్చుకోవడానికీ, భవిష్యత్తు తరాలు ఒకేలా అర్థం చేసుకోవడానికీ ఇవన్నీ ఉపయోగపడతాయనేది ఒక ఆలోచన. లక్ష్యం నుండి లక్షణం పుట్టినా, లక్షణం లక్ష్యాన్ని చేర్చడానికి ఉపకరించినా కేవలం కొన్ని సూత్రాలు, కొన్ని అర్థ తాత్పర్యాలతో నిర్మించుకున్న నిఘంటువులతో సహాయంతో మాత్రమే భాషను సంపూర్ణంగా అర్థం చేసుకోవడం కుదరదు. సాహిత్యం విస్తృతమైయ్యేకొద్దీ పదజాలం పెరుగుతుంది. దీనితో అప్పటికే ఉన్న నియమాలు మాత్రమే భాషను అవగాహన చేసుకోవడానికి సరిపోవు.అందువల్ల ఒక ప్రాంతవాళ్ళు రాస్తున్నదో, ఒక వర్గం వాళ్ళ వ్యవహారంలో ఉన్నది మాత్రమేమిగతావాళ్ళంతా అర్థం చేసుకోవాలనీ, అదే ప్రామాణిక భాషగాను, మిగతా భాషలన్నీ మాండలికభాషలుగాను భావించుకోవాలనుకోవడాన్ని కూడా తీవ్రంగానే వ్యతిరేకిస్తున్నవాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు పద్యాల్లో రాస్తే, దాన్ని చదువుకోవాలనుకుంటే, వ్యాఖ్యానాలు రాశారు. అంతే తప్ప అవి నేటికీ యథాతధంగా ఎంతమందికి అర్థమవుతున్నాయని, అలాగే తమ వ్యవహారంలో రాసిన సాహిత్యాన్ని కూడా అర్థం చేసుకోవడానికి అవసరమైతే వ్యాఖ్యానాలు రాసుకోవాల్సిందేననే వాళ్ళున్నారనుకున్నాం కదా!
ఇక్కడో ప్రశ్న తలెత్తే అవకాశం ఉంది. పద్యాల్ని, పద్యకావ్యాల్నీ అర్థం చేసుకోవడానికిఒక వ్యవస్థ ఉంది. కానీ, ఒక ప్రత్యేకప్రాంతం వాళ్ళు లేదా కొన్ని ప్రత్యేక వర్గాల వాళ్ళు వ్యవహరించే భాషను అర్థం చేసుకోవడానికి ఏదైనా ఒక వ్యవస్థ ఉందా అనేది ఆ ప్రశ్న.
పద్యసాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఆ వ్యవస్థ రూపొందడానికి చాలా కాలం పట్టింది. కొన్ని వర్గాల వాళ్ళు తమ జీవనవిధానం నుండి దాన్ని రూపొందించారు. కొన్ని వర్గాల వాళ్ళ పదజాలం రాకుండా జాగ్రత్తపడ్డారు. ఒకవేళ ఏదోలా నేర్చుకొని ఆ వర్గాల వాళ్ళు రాస్తే,
‘‘ఉపమగలిగిన శయ్యలనొప్పియున్న
నంఘ్రిభవుని కావ్యంబు గ్రాహ్యంబుగాదు
పాయసంబైన సంస్కారపక్వమైన
గాక జుష్టంబు గానియట్లు’’ దాన్నీ చదవకూడదని అప్పకవిలాంటి పండితులు శాసించారు.శూద్రుల్ని పద్యాల్లో వర్ణిస్తే మొదట ళ,క్ష,ఱ మొదలైన వర్ణాలతో వర్ణించాలని ఛందోవేత్తలన్నారు.
‘‘ వసుధామరులకు క చటలు
వసుధాపతులకును తపరవలు వైశ్యులకున్
యసహలశషలును శూద్రుల
కసమపుళక్షఱలు చెప్పనగు బద్యాదిన్’’ అని అధర్వణునిఛందం చెప్తుంది. (చూడు: సులక్షణసారము, పుట: 141) ఒకసామాజికవర్గం చేసిన కుట్ర ఫలితంగా ఈ దేశంలో సంస్కృతాన్ని దళితులు ఏ నాటికి తమ భాషగా చెప్పుకోవడానికి ఇష్టపడనిస్థితి ఏర్పడిరది.అవసరమైతే ప్రపంచంలోని ఏ భాషనైనా తమ భాషగా సొంతం చేసుకోవడానికైనా అంగీకరిస్తారేమో గాని, సంస్కృతాన్ని మాత్రం ఇష్టపడని భావజాలాన్ని ఆ భాష ద్వారా ప్రచారం చేశారు.ఆ చారిత్రక నేపథ్యం కూడా మాండలిక భాషా ప్రయోగంలో పరిగణనలోకి తీసుకోవాలి.
మాండలికంలో రచనలు రావడానికి కింది కారణాల్ని చెప్పుకోవచ్చు.
1.తెలుగులో అస్తిత్త్వ ఉద్యమాలు వచ్చిన తర్వాత సాహిత్యంలో ఉత్పత్తి శక్తుల స్వరూప స్వభావాల్లో మార్పులు వచ్చాయి. సాహిత్యంలో వాస్తవికతకు ప్రాధాన్యం పెరిగింది.
2.భాషలో తప్పొప్పుల నిర్ణయం, వ్యాకరణ బంధనాల వల్ల తమ భావాల్ని స్వేచ్ఛగా చెప్పుకొనే అవకాశం లేకపోవడం వల్ల, తమ నిత్యవ్వవహారంలో ఉన్న భాషలోనే రచనలు రాసేవారు ఎక్కువైయ్యారు.
3.భాషాదోషాలు, వ్యాకరణం తమ భావప్రకటనా స్వేచ్ఛను అడ్డగించే పరిస్థితి లేకపోయినా, ఉన్నతచదువులు చదివి సాహిత్యాన్ని రాస్తున్న వాళ్లు తమ వ్యవహారంలో సృజనసాహిత్యాన్ని రాయడం ఒక ఆత్మగౌరవంగా భావిస్తున్నారు.
4. కళాత్మక విలువల (ఈస్తటిక్ వాల్యూస్)మూల్యాంకనంలో ప్రమాణాలు మారాయి.5. మాండలిక రచన ప్రయోగం కోసం కాకుండా, ప్రయోజనాపేక్ష ప్రధానంగా మారడం.
అస్తిత్త్వ ఉద్యమాలు ప్రారంభం కాకముందే మాండలికభాషను వివిధ రచనల్లో, అదీ నవలల్లో కనిపిస్తుందనే అనుమానం రావచ్చు.అస్తిత్త్వ ఉద్యమంలో కావాలని భాషను ప్రయోగిస్తే, అంతకుముందు పాత్రోచిత భాషగా వర్ణించారనేది గమనించాలి.ప్రతి రచనకుండే స్వభావాన్నీ బహి:స్వభావం,అంత:స్వభావాలని విభజించుకోవచ్చు.వస్తువు యొక్క స్వభావాన్ని బట్టి వివేచించటం బహి: స్వభావమైతే, ఎలాంటి భావజాలాన్ని ప్రతిపాదిస్తున్నారనేది సారానికి సంబంధించిన విభజన. అంటే విమర్శలో దీన్ని అంత: స్వభావంగా చెప్తారు. ఏ రచనలోనైనా ప్రయోగించే భాష రెండిరటికీ చెందుతుంది.
1 కామెంట్:
డియర్ దార్ల:
చాలా రోజుల తరవాత చాలా శ్రద్ధగా రాసిన మంచి విశ్లేషణ వ్యాసం చదివాను. ఈ కింద మీరు పేర్కొన్న ప్రశ్నలకి సమాధానాలు ఇంకా వెతకాలిసిందే. మీరు ఈ ప్రశ్నలకి భాష కోణం నించి వెతికిన వొక సమాధానమే సరిపోదనుకుంటా.
"అసలు దేన్ని మాండలిక రచన అనాలి? సాంఘిక,రాజకీయ,చారిత్రక,మనోవైజ్ఞానిక హాస్య నవలా విభాగాలు చేసినట్లే, మాండలిక నవలా విభాగం కూడా చేస్తే సరిపోతుందా? అలా వర్గీకరణ చేయడానికి రూపం,శిల్పాలలో దేన్ని ప్రమాణంగా తీసుకోవాలి? భాష రూపానికి చెందిందా? శిల్పానికి చెందిందా?ఈ విభజన నవలలకీ వర్తిస్తుందా? తెలుగులో మాండలికంలో రాసిన నవలలున్నాయా? మాండలికంలో రాయడానికి చారిత్రకంగా ఏమైనా ప్రత్యేక కారణాలు కనిపిస్తున్నాయా? మాండలికంలో రాస్తే అందరికీ అర్థమవుతుందా ? మొదలైనప్రశ్నలన్నింటినీ చర్చించుకోవాలి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి