Wednesday, June 15, 2011

శ్రీశ్రీ పై వివాదాలు వ్యక్తిగతమా ?


1.      Sri Sri pai Vivadalu Vyaktigatamaa? Surya Telugu Literary Supplement, 13-6-2011, page: 4
శ్రీశ్రీ అనే రెండు అక్షరాలు తెలుగు సాహిత్యంలో తెచ్చిన సంచలనం ఇంతా అంతా కాదు. ఒక సందర్భంలో తానే యుగ కవి నని ప్రకటించుకోవడం, దానితో అనేక వివాదాలకు కేంద్రం కావడం కూడా శ్రీశ్రీ వంతైంది. కేవలం ‘యుగకవి’ అని ప్రకటించుకోవడమే కాదు, ఆయన సాహిత్యంలో ఉన్న అనేక అంశాలు కూడా వివాదాస్పదమవ్వడానికి కారణాలైయ్యాయి. సాధారణంగా రచయితలు వివాదాస్పదులు కావడానికి రెండు కారణాలుంటాయి. అవి వ్యక్తి కేంద్రంగా గాని, ఆ రచనల సాహిత్య కేంద్రంగా గాని జరుగుతుంటాయి. ఇలా తెలుగులో వివాదాస్పదులైన రచయితలు చాలామంది ఉన్నా, శ్రీశ్రీ, చలం తర్వాత విశ్వనాథసత్య నారాయణ, దిగంబర, స్త్రీవాద, దళిత, ముస్లిం కవుల్ని, ప్రాచీన సాహిత్యంలో శివకవుల్నీ ప్రముఖంగా పేర్కొనవచ్చు. బహుశా త్వరలోనే ‘సింగిడి’ కవులు కూడా ఈ జాబితాలో చేరే అవకాశం కనుపిస్తోంది.


విశ్వనాథ సత్యనారాయణ, చలం, శ్రీశ్రీ లది పైకి భావజాల పరమైన వివాదంగా కనిపించినా, అది ప్రధానంగా వ్యక్తుల్ని ఆశ్రయించుకున్నదే. నన్నయకు ముందో, ఆ తర్వాతనో పుట్టవలసిన వాడు విశ్వనాథ సత్యనారాయణ అయితే, ఇరవై ఒకటో శతాబ్దాన్ని ముందే తీసుకొచ్చిన వాడు చలం. వీళ్ళకి అతీతమై, తన సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వాడు శ్రీశ్రీ. అలాగే శివకవులు, దిగంబర, దళిత, స్త్రీవాద కవుల వివాదాల్ని చూస్తే, అవి పూర్తిగా భావజాలాశ్రీతాలు. విశ్వనాథ సత్యనారాయణని అనేక సాహితీ సంస్థలు సన్మానించినా, ఆయన భావజాలాన్ని కొనసాగించే సంస్థలుగా మారినా, ఆయన సాహిత్య సంస్థల వల్ల పేరు ప్రఖ్యాతులు సంపాదించుకో లేదు.

ఆయనే ఓ సంస్థగా ప్రచారం పొందాడు. దీనికి అనేక పరిస్థితులు దోహదపడ్డాయి. వాటిలో ఆయన పుట్టిన కులం, ఆయనకు వారసత్వంగా వచ్చిన ఆస్తిపాస్తులు, పాండిత్యం ప్రధానమై, అనేక సన్మానాలకీ, పదవులకీ కారణాలై ఉంటాయి. శ్రీశ్రీ పరిస్థితి అలాంటిది కాదు. పుట్టింది పండిత కులమే అయినా, విశ్వనాథ సత్యనారాయణకు వారసత్వంగా లభించినన్ని ఆస్తిపాస్తులు శ్రీశ్రీ కి లేవు. కానీ, శ్రీశ్రీని కూడా ఆయన కులం చాలా వరకూ కాపాడుతోంది. అది నేటికీ శ్రీశ్రీని వెనకేసుకొచ్చేవాళ్ళలో అత్యధికులెవరున్నారో గమనిస్తే స్పష్టమవుతుంది.

శ్రీశ్రీ చిన్నప్పుడే కొన్ని భావ గీతికల్ని రాసుకుని ‘ప్రభవ’గా ప్రచురించినా, వాటికి ప్రాచుర్యం రాకపోవడానికి పేదరికమే ఒక ప్రధాన కారణం (నిజానికి ప్రభవ కవితల్ని సాహితీవేత్తలు గుర్తించింది ఆయనకి పేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాతనే). ఆ పేదరికమే తెలిసో, తెలియకో ఆయన ఎలా రాసినా, ఆ రచనల్లో మార్క్సిస్టు భావాల్ని పలికించేలా చేసింది. అలాంటి భావాలే ఆ భావజాలాన్ని ప్రచారం చేసే సాహిత్య సంస్థల్లోకి ప్రవేశించడానికీ కారణాయ్యాయి.ఆ సంస్థల్లో ‘పని’ చేయడం వల్లేనేనేమో ఆ భావజాలం ఉత్సాహంతో రాస్తున్న తొలిదశలో ఆ సిద్ధాంత చట్రంలో ఒదగని అంశాల్ని రాయలేక పోయాడు. దానిలో ఒకటి కులం వాసన రాకుండా, శ్రామిక వర్గం చట్రంలోనే రచనలు చేయడం. రెండవది తెలంగాణకు బదులు సమైక్యాంధ్రనే సమర్థించడం జరిగాయి. అందుకనే 
‘కమ్మరి కొలిమీ, కుమ్మరి చక్రం 
జాలరి పగ్గం, సాలెల మగ్గం 
శరీర కష్టం స్ఫురింపజేసే
 గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి
సహస్రవృత్తుల సమస్త చిహ్నాలు’ వర్గంగానే కనిపించాయి.

1969లో వచ్చిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్నీ, 1972లో వచ్చిన ప్రత్యేకాంధ్ర ఆందోళనను శ్రీశ్రీ వ్యతిరేకిస్తూ కవిత్వాన్ని రాశాడు. ‘తెలంగాణ జెండా మీద ద్వేషం లేదు నాకు/ అది అఖిలాంధ్రపతాకం అయితే మరీ ఆనందిస్తాను’ అని వర్ణించాడు. అంతే కాదు, ప్రత్యేకాంధ్ర ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ.....
ఆంధ్రులకే ఆంధ్ర అనే నినాదం అందంగానే ఉండొచ్చు
నెత్తురు పీల్చే చక్రవడ్డీ వ్యాపారస్తుల్ని తరమగలిగితే
ఉ...హు! డబ్బుతో ఏమైనా కొనగలం అనుకుంటున్నారు వీళ్ళు
ఆ సంగతి మాత్రం అడగొద్దంటారు ఆ స్వేచ్ఛా వ్యాపారప్రవక్తలు
అక్కడే పొరబడుతున్నారు/ డబ్బు సంచుల్తో అమ్మని కొనలేరు
అభిమానాన్ని కొనలేరు
 ఆత్మల్ని అసలు కొనలేరు...’ ఇలా కొనసాగుతుంది ఆ కవిత. ఇలాంటి కవితల్ని ప్రత్యేకించి విశ్లేషిస్తే, రంధ్రాన్వేషణ చేస్తున్నారనే వాళ్ళున్నారు. ఇప్పటికే దళితులు, మైనారిటీలు, స్త్రీవాదులు శ్రీశ్రీని అస్తిత్వదృక్పథంతో విమర్శిస్తున్నారని, వాటిని ఖండిస్తూ అనేక వ్యాసాలు వెలువడ్డాయి.

అస్తిత్వ నేపథ్యంతో 
‘క్షమించండి, నా స్నేహితుల్లారా!
వక్రీకరణకి వత్తాసుగా
పదబంధాన్ని సృష్టించి
నన్ను వెక్కిరించడానికి వెనుదీయని
మహాకవినీ నేను మన్నించలేన’ని ‘కసాయిబు’ వంటి పదాల్ని సృష్టించడాన్ని వ్యతిరేకించారు. అలాగే శ్రీశ్రీ పదజాలంలో బ్రాహ్మణీయ పదజాలమే అత్యధికంగా కనిపిస్తుందనే విమర్శ కూడా వచ్చింది.
‘దొంగ లంజ కొడుకులసలే మెసలే ఈ
ధూర్తలోకంలో నిలబడజాలక
తలవంచుకుపోయావా నేస్తం...’ అంటూ కొంపెల్ల జనార్దనరావు గురించి వర్ణించే సందర్భంలో ఒక ప్రయోగం చేశాడు శ్రీశ్రీ. ఇలాంటప్పుడు, ఆ యా వర్గాల వాళ్ళు ఆ సాహిత్యాన్ని చదువుకొనేటప్పుడు సహజంగానే తనకి తగిలే గాయాన్ని వ్యక్తీకరిస్తారు. మరికొంతమంది దాన్ని పెద్దగా పట్టించుకోకపోవచ్చు.

పునర్మూల్యాంకనం, అస్తిత్వం పేర్లతో శ్రీశ్రీ సాహిత్యాన్ని విమర్శించేవాళ్ళున్నారు. అందువల్ల సాహిత్యానికుండే సార్వకాలిక పరిధుల్ని, రచయితల బలహీనతల్నీ వారి సామాజిక జీవిత నేపథ్యాల నుండి కూడా చూడాల్సిన అవసరం ఉంటుందని ఒప్పుకుంటే తప్పేముంది? నిజానికి స్త్రీవాదం ఉధృతంగా నడుస్తున్న సమయంలోనే దేవాలయ ప్రవేశం చేశాడని బలవంతంగా దళితుడి చేత మలం తినిపించినందుకు ఆగ్రహాన్ని పట్టలేక ఒక దళిత కవి- మగాణ్ణి తిట్టడానికి కూడా ఆడదాన్ని అడ్డం పెట్టుకోవాల్సి వస్తున్నందుకు క్షమించు తల్లీ- అంటూ కవిత్వీకరించాడు.

ఇంకా చాలా మంది నేటికీ ‘ఛండాలంగా ఉంది’, ‘ఆడదానిలా గాజులు తొడుక్కున్నావా?’ వంటి ప్రయోగాల్ని చేస్తున్నారు. సినిమాల్లో అయితే ‘ఛండాలం’ పదం వాడ్డం పెద్ద ఫ్యాషనైపోయింది. ఇటువంటివి సాధారణంగానే కనిపించినా, ఆ యా వర్గాల వాళ్ళ మనసుల్ని గాయపరిచే చాలా సీరియస్‌ విషయాలు. అందుకే వాళ్ళు రియాక్ట్‌ అవుతుంటారు. వాళ్ళ మానసిక గాయాల్ని పరిగణనలోకి తీసుకోకుండా, వీళ్ళని కూడా పోస్టుమోడర్నిస్టులు గానో, ప్రపంచీకరణను సమర్దించే వాళ్ళు గానో, కమ్యూనిస్టు భావజాలాన్నే తిరస్కరించేవాళ్ళుగానో పొరపడాల్సిన పన్లేదు.

ఒక దశవరకూ శ్రీశ్రీ రచనలు ఆ వ్యవస్థ పరిధిలో, ప్రణాళికలో కొనసాగినట్లనిపించినా, తన ప్రతిభతో చేసిన ప్రయోగాలవల్ల ఆ భావజాలాన్ని ఇష్టపడేవాళ్ళెందరినో తనని ఆరాధించేలా చేసుకోగలిగాడు. ఆ ఆరాధనతోనే ఆయన రాసిన రచనలన్నింటినీ భుజాన వేసుకుని, సమర్ధించేవాళ్ళ వల్ల మరికొందరు కొన్ని విమర్శలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. శ్రీశ్రీ గానీ, ఇతరులు గాని కొన్ని సాహితీ సంస్థల పరిధుల్లో రాసినంతవరకూ ‘స్వేచ్ఛ’ ఉంటుందో లేదో గానీ, ‘రక్షణ’ మాత్రం ఉండొచ్చు! అలాంటి రక్షణే శ్రీశ్రీ వ్యక్తిగతంగా రాసిన వాటిని కూడా నేటికీ వెనకేసుకొస్తోంది.

శ్రీశ్రీ శతజయంతి ( 30-4- 1910 నుండి 30-4-2011 వరకు) సందర్భంగా ప్రత్యేక సంచికలు, గ్రంథాలు వెలువడ్డాయి. వీటిలో ఇలాంటి వాదోపవాదాలు కనిపిస్తున్నాయి. వీటిలో తెలకపల్లి రవి రాసిన ‘శ్రీశ్రీ జయభేరి జీవిత ంసాహిత్యం రాజకీయాలు’ గ్రంథాన్ని శ్రీశ్రీ ఛాయా చిత్రాలతో పాటు, విషయ వివరణలతో సహా చక్కగా అందించారు. ఇలాగే చాలా మంది వివిధ వ్యాసాలతో ప్రత్యేక సంచికల్ని అందించారు. మహబూబ్‌నగర్‌, ఖమ్మం జిల్లా కవులు ప్రత్యేకంగా శ్రీశ్రీపై కవిత్వాన్నే రాసి ప్రచురించారు.అప్పటికే శ్రీశ్రీ ప్రాచ్య, పాశ్చాత్య సాహిత్య స్థితిగతుల్ని బాగా అవగాహన చేసుకున్నాడు.

సంస్కృత పదభూయిష్టమైన శబ్దజాలాన్ని వాడుకుంటున్నా, దాన్ని తనకి దాసోహం అయ్యేటట్లు చేసుకోగలిగాడే తప్ప, దానికి తాను దాసోహం కాలేదు. అది అర్థమైనా, కాకున్నా, దాని ఊపు సామాన్యుల్ని సైతం ఆకర్షించగలిగింది. ఆధునిక కవిత్వం అర్థం కావాలంటే, ఆధునిక జీవితం అర్థం కావాలన్నది నిజమే కావచ్చునేమో కానీ, శ్రీశ్రీ కవిత్వసౌందర్యమంతా అవగాహన కావాలంటే మాత్రం చాలా కవితలకి వ్యాఖ్యానం కూడా అవసరమే. అది శ్రీశ్రీ మొదట్లో రాసిన ‘ప్రభవ’ (ప్రచురణ,1928) నాటి కవితల్లోను, ‘మహాప్రస్థానం’ (ప్రచురణ,1950) కూర్చిన తొలినాళ్ళ కవితల్లోను ఈ స్వభావం కనిపిస్తుంది.
అయితే, భారతీయ ఆలంకారిక సూత్రాల అవగాహనతో సైద్ధాంతిక విభేదాన్ని కవిత్వీకరించడంతో పండితుల్ని సైతం శ్రీశ్రీ కవిత్వం ఆకర్షించగలిగింది. ‘కవితా ఓ కవితా’ పూర్తిగా అలాంటిదే. శ్రీశ్రీకి గల పాశ్చాత్య సాహిత్య అవగాహన కూడా తెలుగు కవిత్వాన్ని ముందుకు నడిపించేందుకే దోహదపడింది. అందరికీ ఉన్నట్లే శ్రీశ్రీ సాహిత్యానికీ కొన్ని పరిమితులున్నాయి. అయినా, అవి మాత్రమే ఆయన సాహిత్యాన్ని ఆటంక పరిచేవనుకోవడానికి అవకాశం లేదు. కాకపోతే, శ్రీశ్రీ సాహిత్యంలో కనిపించినంత కమ్యూనిస్టు భావజాలం, సామాన్యుణ్ణి సైతం ఉర్రూతలూగించగల శబ్దవిన్యాసం మరో కవిలో కనిపించకపోవడమే శ్రీశ్రీ సాహిత్యం నేటికీ ఒక వర్గం వారికి ఆదరణీయమవడానికి కారణం. ఈ పరిధుల్లోనే శ్రీశ్రీది వ్యక్తిగతమైన వివాదమైనా వ్యవస్ధీకృతంగా కనిపిస్తోంది. 
-Dr.Darla Venkateswara Rao,
Assistant Professor, 
Dept .of Telugu, 
University of Hyderabad, (Central University), 
Gachibowli, Hyderabad-500 046 
e-mail: vrdarla@gmail.com 
Ph: 040-23133563 (O), Mobile: 09989628049,


-డా॥దార్ల వెంకటేశ్వరరావు
అసిస్టెంటు ప్రొఫెసరు,
తెలుగుశాఖ, సెంట్రల్‌యూనివర్సిటి,
గచ్చిబౌలి, హైదరాబాదు-46
ఫోన్‌: 9989628049

( జూన్ 15, శ్రీ శ్రీ వర్ధంతి )

No comments: