Sunday, May 15, 2011

మహిళా చైతన్యమా? మార్మిక శిల్పమా?            మధ్యకాలంలో సంచనలం సృష్టించిన తెలుగు నవల డా..కేశవరెడ్డిరాసిన మునెమ్మ.దీనికి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ఉత్తమ నవల బహుమతి వచ్చింది. నవలికలో ఒక స్త్రీ పాత్రను కేంద్రంగా చేసి భిన్నమైన సమస్యలతో సతమతవుతున్న మహిళల జీవితాల్ని చిత్రించారు. స్త్రీని అర్థం చేసుకోవడంలో వైఫల్యానికి గురవుతున్న పురుషుల అంతరంగాల్ని మన ముందు ఆవిష్కరించారు. మాతృస్వామ్యంపై పెత్తనం చెలాయించే పితృస్వామిక వికృత స్వరూపాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. నిజానిజాల్ని పసిగట్టడం అంత సులువైన పనికాదన్నట్లు, దానికి సరిగ్గా సరిపోయే మ్యాజిక్రియలిజమ్టెక్నిక్ని ఎన్నుకున్నారు. నోరుండీ తమకిష్టమొచ్చినట్లు మాట్లాడే మనుషుల కంటే, నోరున్నా మాట్లాడలేని పశువుల్లో ఉండే ఉదాత్తతని మన కళ్ళ ముందు నిలిపారు. బొల్లిగిత్తను ఒక పాత్రగా తీసుకుని నిష్కల్మషమైన వాత్సల్యం, విశ్వాసం, కృతజ్ఞతలను వర్ణించి వాటితో పోల్చుకున్నప్పుడు మానవుడు ఎంత వరకూ ఎదిగాడో పరీక్షించుకొమ్మన్నట్లుగా మనముందీ నవలికను పెట్టారు. దీన్ని వివరించడానికి నవలికలో స్త్రీ, బొల్లిగిత్త, పురుషుడు అనే మూడు ప్రధాన పాత్రల చుట్టూ కథని నడిపించారు.
            మునెమ్మ, జయరామిరెడ్డి భార్యా భర్తలు. వాళ్ళిద్దరూ ఆరేళ్ళు కలిసిమెలిసి కాపురం చేశారు. వాళ్ళిద్దరూ ఒకరోజు పొలంలో పనిచేస్తున్నప్పుడు బొల్లిగిత్త తన రెండు కాళ్ళూ పైకెత్తి మునెమ్మ మీది కొస్తుంది. అది గమనించిన భర్త, బొల్లిగిత్తను కక్ష తీరా కొట్టి, దాన్ని అమ్మేయాలనుకుంటాడు. దాన్ని అమ్మడానికి పశువుల సంతకు వెళ్ళిన తన భర్త ఇంటికి రాడు. కానీ, బొల్లిగిత్త మాత్రం  వచ్చేస్తుంది. రాత్రి మునెమ్మకు తన భర్త చనిపోయినట్లు కల వస్తుంది. తనకి మరిది వరసైన సినబ్బను తోడు తీసుకుని తెల్లవారగట్లే తన భర్తను వెతకడానికి వెళ్తుంది. తన భర్తను మధ్యవర్తులు హత్య చేశారని తెలుసుకుని, వాళ్ళపై ప్రతీకారం తీర్చుకుంటుంది. తన భర్త చనిపోయినందువల్ల తాను కూడా
చనిపోవాలనుకోలేదు. అవసరం అన్నీ నేర్పుతుందంటూ, అది మనిషికే కాదు, గొడ్డుకీ వర్తిస్తుందనడంతో నవలిక ముగుస్తుంది. ఇది స్థూలంగా కథ.  కథ ముగ్గురు చుట్టూ తిరుగుతుంది. వాళ్ళు మునెమ్మ, బొల్లిగిత్త, జయరామిరెడ్డి.
            ఈకథలో పితృస్వామికస్వభావం అనువర్తితమైన తీరుని చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంది. జయరామిరెడ్డికి తన తండ్రి గుణాలే వచ్చాయని చెప్పడానికే ద్రౌపది వేషం వేసిన వాణ్ణి నరికేసిన నేపథ్యాన్ని రచయిత వివరించారనుకోవడానికి వీల్లేదు. అతనికున్న మధ్యపాన వ్యసనం, స్త్రీలోలత్వం, భార్యని కూడా సంప్రదించకుండానే తానూ నిర్ణయాలు తీసేసుకోవడం వంటి వన్నీ తరతరాలుగా సంక్రమిస్తున్న పురుషాధిపత్య పితృస్వామిక అవశేషాలు. అవి రెండు తరాల్లో చూపి, మూడవ తరం సినబ్బ తరంలో మార్పుని ఆశించారు రచయిత. జాగ్రత్తగా చూస్తే, రెండవ తరంలోనే తానేమిటో నిరూపించుకోవడానికి స్త్రీ పడుతున్న సంఘర్షణ మునెమ్మలో చిత్రించారు. అందుకనే నవలికకు ముందు మాట రాసిన జయప్రభ ఇలా అభిప్రాయపడ్డారు.
" కథకుడైన కేశవరెడ్డిగారికి ఇవాళ్టి కాలంలోని స్త్రీలు చేస్తూన్న ఆలోచనలూ... వాళ్ళు వేస్తూన్న అడుగులూ తెలుసు. అందువలన ఆయన ఎంతగా అరవై ఏళ్ళ వెనకటి కథనే ఎన్నుకున్నా, మునెమ్మ పాత్రని చిత్రీకరిస్తున్నప్పుడు అనివార్యంగా ఆయనపై సమకాలీన  స్త్రీల ఆలోచనల ప్రభావం పనిచేసినట్టుంది.''  ( జయప్రభ, ఆధునిక తెలుగు కాల్పనిక సాహిత్యంలో "మునెమ్మ' ప్రత్యేకత  , మునెమ్మ నవలికకు ముందుమాట, 2008: vii)
              అభిప్రాయాన్ని విమర్శిస్తూ ఒక తెలుగు బ్లాగు (www.soumyabhavalu.blogspot.com, 28 February  2009) లో సౌమ్య (?)  ""గిత్తలతో రంకులు కట్టి చెంప పగలగొట్టే మొగ?ుడ్ని హంతకుల్ని తమ చేతులతో తామే చంపేందుకు బయల్దేరతారా ఈనాటి ఆడవాళ్ళు! హతవిధీ!''  అన్నారు. ఇక్కడొకటి గమనించాలి.
            ఈనాటి స్త్రీ వాదంలోనూ రకరకాలు ధోరణులు  ఉన్నాయి. సమకాలీన స్త్రీల ఆలోచనల ప్రభావం పనిచేయడాన్నెలా లెక్కించాలనేది ఆలోచించవలసిన అంశం. తనపైకి  వచ్చిన బొల్లిగిత్తతో రంకు కట్టినట్లెక్కడా మునెమ్మ భావించలేదు. అంత స్ఫ?ురద్రూపికి ఆమాత్రం అర్థం కాలేదా అనీ కొంతమంది  విమర్శించారు. జయరాముడి ఆలోచనకీ, మునెమ్మ ఆలోచనకీ చాలా వ్యత్సాసాలు ఉన్నాయి. ఆలోచనలతో మునెమ్మను అర్థం చేసుకోవాలి. ఆమెకు బొల్లిగిత్తపై ఉన్నది వాత్సల్యమే తప్ప, మరో భావన లేదు. కనుక, ఆమె బొల్లిగిత్త గురించెలా ఆలోచిస్తుంది!
            మనం కథను లోతుగా చూస్తే, మునెమ్మపైకి బొల్లిగిత్త కాళ్ళెత్తడంతో, ఆమె భర్త జయరామిరెడ్డిలో ఒక అనుమానం రేకెత్తుతుంది. వాళ్ళిద్దరి మధ్యా లైంగిక సంబంధం ఉందేమోననీ, అందువల్లనే అది అలా ప్రవర్తించిందనీ, అవన్నీ ఆమెకు తెలుసునన్నట్లు అతడు తనకు తానే నిర్థారణకు వచ్చేస్తాడు. దాన్ని అమ్మేయాలనుకుని, సంతకు తోలికెళ్ళి, తాను హత్యకు గురవుతాడు. నిర్ణయాలన్నీ పితృస్వామిక స్వభావానికి సంబంధించినవే. దీనిలో తాను శాసించడమే తప్ప, స్త్రీ చెప్పే మాటకు విలువ ఉండదు. ఇంకా చెప్పాలంటే, స్త్రీ (మునెమ్మ) చెప్పుకునే   అవకాశమే ఉండదు. తనపై పడిన నిందను నిరూపించుకోవడానికి, అసలు విషయం చర్చించుకునేలోగానే నిర్ణయాలు వెలువడుతుంటాయి. అవన్నీ ఆధిపత్యంతో వెలువడే నిర్ణయాలు. అది నవలికలో  బొల్లిగిత్తనూ, తననూ ఎందుకు కొట్టాడో తెలుసుకుందామనుకునే లోగానే అన్నీ అయిపోయాయని వర్ణించడం ద్వారా వ్వక్తమయ్యాయి. దీనికి ఉదాహరణగా తన భార్యతో మాట మాత్రం చెప్పకుండానే  బొల్లిగిత్తను అమ్మేయాలనుకున్నట్లు వర్ణించారు రచయిత. అంతే కాకుండా జయరాముడు హత్యకు గురికావడం కూడా జరిగిపోయింది. స్త్రీ చెప్పుకోవడానినికి ఇంకెక్కడ అవకాశం ఉంది? బహుశా జయరామిరెడ్డి బతికుంటే తప్పకుండా తన తప్పేమిటో నిరూపించుకోగలిగేదని సినబ్బతో మునెమ్మ మాట్లాడిన మాటల్ని బట్టి తెలుస్తుంది.
            పసుపులేటి పూర్ణ చంద్రరావు దీన్ని" ఫండమెంటల్' కథ అంటూనే డబుల్కొటేషన్స్లో పెట్టి    ""A manifesto on the feminine''  అని అన్నారు.  (   ది సండే ఇండియన్,  1 నవంబరు 2009 : 42) చర్చలో పాల్గొంటూ నగ్నముని (ది సండే ఇండియన్‌ 15 నవంబరు 2009: 40) మునెమ్మలో భావి స్త్రీత్వ ఉద్యమాలు ఊపిరులూదడానికి బలమైన విత్తనాలు ఉన్నాయన్నారు. మునెమ్మలో ఎద్దుని ఒక Metaphorగా వాడారని (అదే సంచికలో) శ్రీనివాస్దెంచనాల  అన్నారు.
            మునెమ్మ తనని కొట్టిన భర్తని వెతకడానికి వెళ్ళడంలోను; తనని ఎందుకు కొట్టాడో బొల్లిగిత్తకు కూడా తెలియకపోయినా (ఒక వేళ దానికి తెలిసినా) తనని ఇన్నాళ్ళూ పెంచి పోషించిన యజమానికి తన వంతు కర్తవ్యాన్నీ నెరవేర్చడంలోనూ అవ్యక్తానురాగాలున్నాయి. అందుకే తన భర్తని చంపిన వాళ్ళపై కక్షతీర్చుకోవాల్ని మునెమ్మ భావించింది.  తన యజమానిని చంపిన వాళ్ళని బొల్లిగిత్త చంపింది.
            ఇక్కడ మునెమ్మలో అనురాగం, బొల్లిగిత్తలో వాత్సల్యమే ప్రధానం. ప్రకృతిలోని పశుపక్ష్యాదులతో మానవులకున్న విడదీయరాని అనుబంధాన్ని ఏవో కొన్నింటితోనే అంచనా వేయలేం. వాటితో కలిసిమెలిసి జీవించిన వాళ్ళకే అది బాగా తెలుస్తుంది.
            ఇటువంటి అభిప్రాయాన్నే దాము  చెప్తూ "  మునెమ్మ నవల ఆధునిక పూర్వ సమాజపు అవశేషాల్ని మిగుల్చుకొన్న గ్రామీణ జీవితానికి సంబంధించింది  '' గా కనిపిస్తుందని చెప్తూనే "   మునెమ్మని అర్థం చేసుకోవడానికి మనం మునెమ్మ జీవించిన స్థలంలోకి, కాలంలోకి ప్రవహించగలగాలి'' ( ది సండే ఇండియన్  15 నవంబరు 2009: 40, 41) అని అన్నారు. ఇది చాలా పరిశీలనతో చేసిన వ్యాఖ్య అనిపిస్తుంది. అయితే ఇక్కడే మనకో ప్రశ్నకూడా ఉదయిస్తుంది.
              నవలికలోని వస్తువు ఏకాలం నాటిది? మనం కాలంలో ఉండి మాట్లాడుతున్నాం లేదా కాలంలో మనుషులుగా అర్థం చేసుకుంటున్నాం? దీన్నీ చూద్దాం.
            మునెమ్మకు, జయరామిరెడ్డికి వివాహం అయ్యిన తేదీ: 16-2-1939.బొల్లిగిత్తను అమ్మడానికి బయలుదేరిన రోజు : ఆదివారం.
ఇంటికి రావాలనుకుని ప్రణాళిక వేసుకున్న రోజు: మంగళవారం.అమ్మడానికి తోలికెళ్ళిన  బొల్లిగిత్త తిరిగి ఇంటికొచ్చిన రోజు : మంగళ వారం.మునెమ్మకు కల వచ్చిన రోజు: మంగళవారం రాత్రి.
            కల గురించి సినబ్బకు చెప్పిందెప్పుడు: మర్నాడు ( బుధవారం) ( పుట: 29).జయరామిరెడ్డిని వెతకడానికి బయలుదేరినదెప్పుడు : బుధవారం తెల్లవారగట్ల.బొల్లిగిత్త కొమ్ములకు తగిలించి ఉన్న చీటి పై ఉన్న తేది: 28-6-1945.
            దీన్ని బట్టి సంఘటనలో బొల్లిగిత్తను కొట్టిన తేదీ ఎప్పుడై ఉంటుంది? మనకు కథను వివరిస్తున్న సినబ్బ బొల్లిగిత్తను అమ్మడానికి జయరామిరెడ్డి బయలుదేరిన రోజు " ఆదివారం '' అని చెప్తున్నాడు. అంటే, బొల్లిగిత్త కొమ్ములకున్న చీటిని బట్టి దాని ముందు రోజున 27-6-1945 గా నిర్థారించే అవకాశం ఉందా? రెండు రోజులూ రోజులై ఉన్నాయో గణించాల్సిందే.
            కథకుడే మనం ఇబ్బంది పడకుండా మరోచోట "ఇరవై ఎనిమిదో తారీఖున - అనగా సోమవారం బొల్లిగిత్త పరసలో ఉండినట్లు దాని కొమ్ముకు ఉన్న చీట్టిని బట్టి తెలుస్తుంద''ని ( పుట: 36) చెప్పేశారు.
            దీన్ని బట్టి బొల్లిగిత్తను ఆదివారం, 27-6-1945 తేదీన పరసలో అమ్మేయడానికి బయలుదేరినట్లు స్పష్టమవుతుంది. సంఘటన జరిగేటప్పటికి మునెమ్మకు సుమారు ఆరేళ్ళ క్రితం పెళ్ళైందని (పుట: 5) తెలుస్తుంది. దాన్ని రచయిత 16-2-1939,   28-6-1945 అనే తేదీలను జాగ్రత్తగానే వివరించాడు.
            ఇక మనకు తెలియవలసింది, కథను సినబ్బ  చెప్పడం ఎప్పుడు ప్రారంభించాడు?     ఘటన జరినప్పటికి తన వయసు ఇరవైయ్యేండ్లని చెప్తాడు సినబ్బ ( పుట: 4). ఇంకా ఇలా చర్చలు చేసుకుంటూ పోవచ్చు. కానీ, అదే ప్రధానం కాదు. దాని ద్వారా రచయిత చెప్పాలనుకున్నది వేరు.
            ఇక్కడ కథాకాలాన్నీ, చారిత్రక వాస్తవాంశాలుగా చెప్పే ప్రయత్నాన్నీ మనం కథనంలో భాగంగా అర్థం చేసుకోవాలి. ఇది అద్భుత కథనం. కత్తి మహేష్ కుమార్భావించినట్లు సినబ్బలోని కథాకథన నైపుణ్యం. అలాగని కాలం నాటి విషయాలతో కథకు సంబంధం లేదని కాదు. అది వాస్తవానికీ, సత్యానికీ ఉన్నంత భేదంతో కూడింది. మనం చదివేది సృజనాత్మక రచనే తప్ప, చరిత్ర గ్రంథం కాదు!చరిత్రలో వాస్తవాలు ప్రధానమైతే, సృజన సాహిత్యంలో సత్యం ప్రాధాన్యత వహిస్తుంది. సృజనకారుడు చారిత్రక అంశాలను స్ఫ?ురిస్తూనే, తన లక్ష్యాన్ని సాధించుకుంటాడు. అది పితృస్వామ్య భావజాలంలో వస్తున్న పరిణామాల్ని మ్యాజిక్రియలిజమ్టెక్నిక్తో చెప్పడంగా నేను అర్థం చేసుకుంటున్నాను.   
గతంలో రచయితే రాసిన అతడు అడవిని జయించాడు  నవలికలో పంది రూపంలో ఓడిపోయినట్లు కనిపించిన స్త్రీత్వం గానీ, ముసలివాని విజయాన్ని గానీ మరింత స్పష్టంగా చూపడానికి గాని రచయిత మునెమ్మ ద్వారా ప్రయత్నించాడేమో అనే సందేహాలు కూడా కలుగుతుంటాయి. దీనిగురించి సుజాత (www.manishi-manashulomaata.blogspot.com )  "మునెమ్మ మనోభావాల చిత్రణ చదువుతుంటే, అతడు అడవిని జయించాడు లోని ముసలివాడి పాత్ర గుర్తొస్తుంది. ఆమె కర్తవ్య నిర్వహణ, అలుపెరుగని ప్రయాణం, పంది పిల్లల్ని కాపాడే ప్రయత్నంలో ముసలివాడు పడే తాపత్రాయాన్ని గుర్తుచేసుంది'' అని వ్యాఖ్యానించారు. దీనిలో కూడా మహిళ సాహసాన్ని గుర్తించమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. రకంగా అది కూడా ఒక రకమైన  స్త్రీచైతన్యమే.
            రచనను మూడు కోణాల్లో అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. మొదటిది మునెమ్మలో ఉన్న మహిళా చైతన్యం. రెండవది వాస్తవమనిపించేలా చారిత్రకాంశాల్ని గుదిగుచ్చుతూ, కథని ముందుకీ వెనక్కీ నడిపిస్తూ, కథనంలో ప్రవేశించే అవాస్తవిక విషయాల్ని అద్భుతంగా చిత్రిస్తూ, వాస్తవాలుగా చెప్పే మ్యాజిక్రియలిజమ్శిల్పంలో రచన కొనసాగించడం. మూడవది రచనను సాధ్యమైనంత ఎక్కువ మంది చదివించగలిగేందుకు తోడ్పడే విషయ ప్రకటనల్లో కావాలనే వివాదస్పదంగా మార్చగలగడం.
            మొదటిది రచన ద్వారా రచయిత చెప్పాలనుకున్న సందేశం.రెండవది రచన ద్వారా రచయిత నిరూపించుకోవాలనుకున్న రచనా నైపుణ్యం. మూడవది రచనను మార్కెట్అని పూర్తిగా అనలేం గానీ, సమకాలీన టి.వి. సినిమా, ఇంటర్నెట్వంటి వాటి ప్రభావం నుండి పుస్తక పఠనాన్ని సీరియస్గా మార్చగలిగే ఆలోచనలు వ్యక్తమవుతున్నాయి. ఇది రచయిత ఉద్దేశపూరకంగా పన్నిన వ్యూహం కావచ్చు.
            కాత్యాయని (  సాక్షి  దిన పత్రిక,13 అక్టోబరు 2009 ) రచయిత డా. కేశవరెడ్డి గురించి చెప్తూ"చవకబారు పాఠకులను ఆకట్టుకోవాలని తపించిపోతున్నార''ని తీవ్ర స్వరంతో చెప్పినా నేను మూడో అంశంగా పైన ప్రతిపాదించిన రచయిత ఉద్దేశానికి సంబంధించిన విషయమే కాత్యాయని తన దైన మాటల్లో చెప్పారనిపిస్తుంది. పాఠకుల్ని రచయిత అంత తక్కువ అంచనా వేస్తాడని భావించలేం. అలా చెప్పడంలో పాఠకుల్ని నమ్మించే ప్రయత్నంగా కాకుండా, ఆలోచించే ప్రయత్నంగా అద్భుతమైన ముగింపుగా అర్థం చేసుకోవాలి.  మార్మికతలోని మౌలిక అంశమే అది కదా!  తెలుగు బ్లాగు లోకంలో కూడా నవలికపై విస్తృతంగానే చర్చజరిగింది. కత్తి మహేష్కుమార్‌ ( www.parnashaala.blogspot.com)  దీన్ని తార్కిక బుద్ధితో కంటే, రసస్పందనతో, రచయిత ఉద్దేశాలను పరిగణన తీసుకుంటూ చదవాలన్నారు.  అంటే సృజనాత్మక సాహిత్య మౌలిక అంశాన్ని గుర్తించాలి. అలా చూసినప్పుడు మునెమ్మ రచయిత పాఠకులను రసహృదయుల్ని చేయగలిగినట్లే.  విధంగా రచయిత మహిళా చైతన్యాన్ని గుర్తిస్తూ, పాఠకులకు మార్మిక శిల్పానుభూతిని అందించగలిగారు.
             రచయితలోని మూడవ కోణం, రచయిత వ్యూహం అనుకున్నాం కదా! అది ఇలా సాగింది. పాఠకుల్ని ఇలా తనలో తాను చర్చించుకునేలా చేశారు
            నవలిక సురేంద్రరాజు అన్నట్లుగానే ‘‘ మునెమ్మ ప్రయాణం   ఆసాంతం ఒక నేటివ్క్రైమ్థ్రిల్లర్లా, డిటెక్టివ్స్టోరీలా సాగుతుంది''  ( అంబటి సురేంద్రరాజు, 2008 : 105) తన భర్తని చంపిన వాళ్ళెవరో తెలుసుకొనే అన్వేషణలో మునెమ్మ ఉంటే, మునెమ్మే భర్తని చంపి, మళ్ళీ తనెందుకు అలా ప్రవర్తిస్తుందని ఉత్కంఠతో పాఠకులూ అన్వేషణలో పడతారు. దానికి కారణం, ప్రారంభంలోనే రచయిత ఒక అనుమానాన్ని రేకెత్తిస్తాడు. కథనంతా చదివేసిన తర్వాత సంతోషంతో ఊపిరి పీల్చుకున్నా, మళ్ళీ ఆలోచనలు వెంటాడతాయి. అన్ని అసాధారణమైన తెలివితేటల్ని ప్రదర్శించిన మునెమ్మ, బొల్లిగిత్తని భర్త చావబాదిందెందుకో అర్థం కావట్లేదనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆమెకి తెలిసీ అలా ఎందుకు అడిగిందో ఆలోచించాలనిపిస్తుంది.
            చిత్రమేమిటంటే, రచయిత కథాగమనంలో జోక్యం చేసుకున్నట్లు కనిపించదు. కానీ, సినబ్బలోనే రచయిత ఉన్నాడు. అతడే కదా దీనిలో నెరేటర్‌! మరి అతడికి తెలియని రహస్యమెలా ఉంటుంది?పిలగాడా అని మునెమ్మ బొల్లిగిత్తను పిలవడం సినబ్బకెలా తెలుసునని విమర్శించిన వాళ్ళు దీన్ని గుర్తించాలి. పాత్రల సృష్టి, స్థితి, లయ కారకుడు రచయితే కదా! అయితే, డా. కేశవరెడ్డి తన రచనలన్నింటిలోనూ పాత్ర పోషణలో భావజాల విస్తరణ ఉంటుంది. ఒక తాత్త్వికత నిండి ఉంటుంది. అందువల్ల పాత్ర గతంగా మాట్లాడేటప్పుడు ద్వైదీభావం కనిపిస్తుంటుంది. మిగతా నవలికల కంటే దీనిలో రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల భాషను చాలా పాత్రల్లో పలికించారు. 
            మునెమ్మ తన భర్త జయరాముడిని ఏకాంతంగా "పిలగాడా' అని పిలిచినట్లే, తనకు తెలియకుండానే బొల్లిగిత్త గురించి " పిలగాడా' అని అంటుంది. తన భర్తని తన వెంట్రుకలతో పేనిన తాడుతోనే చంపేశారని తెలిసి వివశురాలైపోతుంది. వర్ణన అద్భుతంగా ఉంది. దీన్ని కొంతమంది మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టాన్ని స్ఫ?ురింపజేసిందనీ, సందర్భంలో కృష్ణా అని పిలిచింది నిజంగా తన సోదరుడైన శ్రీ కృష్ణుణ్ణా? తన భర్త అయిన అర్జునుణ్ణా? అని రచయిత ఇచ్చిన వివరణ ( సాక్షి  పత్రిక) గమనించవలసి ఉంది. అర్జునుడికి కూడా కృష్ణ అనే నామం ఉందట. అయితే మునెమ్మ సందర్భంలో ఇలా పిలవడాన్ని కూడా తప్పుపట్టిన వాళ్ళున్నారు. అది ఒక భయంకరమైన సన్నివేశం. అలాంటి సమయంలో ఏమి మాట్లాడుతున్నామో, స్థితోలో ఉన్నామో, ఏమి చేస్తున్నామో తెలియని ఉన్మాద స్థితిలోకి వెళ్ళిపోతాం. దీన్ని స్ఫ?ురించడానికే రచయిత తన శరీరంపై చీర లేదని గమనించలేకపోయిందంటారు. పిలగాడా అనిపిలవడం వివాదంగా కనిపించే వివాదం లేని సన్నివేశ కల్పన. రస స్పందనకు సంబంధించిన చిత్రణ.
            కానీ, వివాదానికి కారణమైనది ఇంకొకటి ఉంది.జయరాముడికి పిల్లల్లేరు. జయరాముడు తాగుబోతు. జయరాముడు తండ్రిలాంటివాడే. తన జాకెట్టు చీరిపోతే, తన అత్తగారితో బొల్లిగిత్త గోకిందని చెప్తుంది. బొల్లి గిత్తనెందుకు తన భర్త తీవ్రంగా కొట్టాడో తనకి తెలియదా? కథచెప్తున్న సినబ్బ రూపంలో రచయిత గ్రామస్థులకే కాకుండా, మునెమ్మకు కూడా  విషయం తెలియదంటాడు.
            అత్తగారు మాత్రం వెంటనే పసిగట్టేస్తుంది. బొల్లిగిత్త ఒళ్ళంతా చీరికిపోయిన స్థితిని చూసి, కోడలితో మాట్లాడిన తర్వాత ఆమె కూడ బొల్లిగిత్తను అమ్మేయడమే మంచిదనే నిర్ణయానికొస్తుంది. అత్తగారు కూడా బొల్లిగిత్తను అమ్మేయడానికే సహకరిస్తుందని మునెమ్మ ఆశ్చర్యపోతుంది. అంత సూక్ష్మగ్రాహి అయిన మునెమ్మ వీటినెందుకు గుర్తించలేకపోయిందనే ఆలోచన వస్తుంది. ఇక్కడ సర్వ సాధారణంగానే, సామాన్య పాఠకులకు కలిగే అనుమానం ఇది.
            కథాగమనంలో బొల్లిగిత్తనెందుకు కొట్టాడో తెలుసు కోలేదా అని అడిగిన సినబ్బతో "  తెల్సుకునేదానికి తేల్చుకునేదానికి యాడ తీరిందిరా. అది జరిగినాక ఆయన బూమ్మీద ఉండింది రెండేరెండు దినాలు గదా''  అన్నది మునెమ్మ. ( పుట: 6) దీన్ని బట్టి మునెమ్మ నిలదీయగలిగే ఆలోచన ఉన్న స్త్రీగానే కనిపిస్తున్నా, ఒక జంతువుతో మనిషికి లైంగిక సంబంధాన్ని ముడిపెట్టేటంతటి మూర్ఖ స్వభావాన్ని తన భర్తలో ఊహించలేకపోయిందనుకోవచ్చా?
            పోనీ అనుకోలేదని అనుకుంటే, తన భర్త స్థానాన్ని బొల్లిగిత్త భర్తీ చేసిందని, అది పోయిటిక్జస్టీస్గా విమర్శకులు సమర్థించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
            భర్తని చంపేసినా, పిల్లలు లేకపోయినా, తిరిగొచ్చేసిన బొల్లిగిత్తను బండి తోలాలని నిర్ణయించుకుంటూ "అవసరం అన్నీ నేర్పుతుందిరా సినబ్బా. మాట గొడ్డుకు కూడా వర్తిస్తుంది''( మునెమ్మ, 2008 : 95) అని అంటుంది మునెమ్మ.కథనాన్ని జాగ్రత్తగా చూస్తే పెళ్ళై ఇన్నాళ్ళైనా పిల్లలు పుట్టక పోవడానికి భర్తలో లోపాన్నేదో రచయిత సూచించాలనుకుంటున్నాడా?            సినబ్బ మునెమ్మను "అక్కా'' అని ఒక వరసలో పిలుస్తుంటాడు. ఆమె మాత్రం మరో వరసలో అతణ్ణి మరిదిగా భావిస్తుంది.
            ఇలాంటి సన్నివేశాల్ని కల్పించడంలో రచయిత ఏదో చెప్పదలచుకుంటాడు. మునెమ్మలో అంత: చేతనలో లైంగిక వాంఛల్ని అణచుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయా? ఇటువంటి వర్ణనలే కాత్యాయిని, మరికొంతమంది ఈనవలికను తీవ్రంగా విమర్శించడానికి అవకాశం కల్పించాయని చెప్పక తప్పదు. మరికొంతమందైతే దీన్ని పురాగాథగానూ కీర్తించారు. గ్రామ దేవత కథనిలా చెప్పారనీ అన్నారు. మానవహక్కుల పోరాట నాయకులు, మానసిక వైద్యులు, రచయితలు, రచయిత్రులు, సామాన్య పాఠకులు   ఇలా అనేకమంది పాఠకులను ఈనవలిక ఆకట్టుకోగలిగింది.  ఇలాంటి చోట్ల మ్యాజిక్రియలిజమ్మోతాదు మించిపోయిందనిపించినా రచయిత లక్ష్యాన్ని సాధించారని చెప్పవచ్చు. తాను భావించిన మూడు కోణాల్లోనూ రచయితగా డా. కేశవరెడ్డు తాను విజయం సాధించారనుకోవచ్చు. రచయిత మాటల్తోనే దీన్ని ముగిస్తే ""  మునెమ్మ ఒక అద్భుతమైన పాత్ర. సమయస్ఫూర్తి, నిశిత పరిశీలన, బాధా సహిష్ణుత, పరేంగితావగాహన, సిన్నితత్త్వము, కాఠిన్యము కలగలిసిన పాత్ర గా తెలుగు నవలికా సాహిత్యంలోఇదొక సంచలనం. మహిళా చైతన్యపరిణామంలో మునెమ్మ ఒక ధీరవనిత. మునెమ్మ పితృస్వామ్యంతో మాతృస్వామ్య చేస్తున్న సంఘర్షణకు ప్రతిరూపం. అందుకే దీన్ని ఎవరెన్ని రకాలుగా వ్యాఖ్యానించినా   మునెమ్మ  లో మహిళాచైతన్యం ఉందనే నా ప్రతిపాదన. అయితే చైతన్యం మ్యాజిక్రియలిజమ్పద్ధతిలో వ్యక్తంచేశారు. రచనకు చిన్న కాన్వాస్నే ఎన్నుకున్నా, శాశ్వతంగా గుర్తుండిపోయేలా చిత్రించారు. నవలా సాహిత్యంలో చైతన్య స్రవంతి శిల్పాన్ని అనుసరించి నవీన్రాసిన   అంపశయ్య   తెచ్చిన సంచలనం మళ్ళీ ఇన్నేళ్ళకి   మునెమ్మ  నవలికకు దక్కింది. దీన్ని తెలుగులో మ్యాజిక్రియలిజమ్పద్ధతిలో ప్రయోగాత్మకంగా వచ్చిన మొదటి నవలికగా గుర్తించవచ్చు. విధంగా ఇదొక ప్రయోగాత్మక నవలిక. 
-డా.దార్ల వెంకటేశ్వరరావు

2 comments:

వనజవనమాలి said...

మునెమ్మ నవల చదవ లేదన్న కోరిక తీరింది...జయప్రభ గారి ముందు మాట, కొందరి సమీక్షను..మీ విశ్లేషణను చూసాను.ధన్యవాదములు.

జాన్‌హైడ్ కనుమూరి said...

"అతడు అడవిని జయించాడు" నవల చదువుతున్నప్పుడు నా జీవితంలో నేను ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార ఆలోచనలని కనుగొన్నాను. అలాంటి సంస్యలలో వున్నవారికి ఆ నవల చదవమని సూచించాను.
మునెమ్మ నవలకూడా అదే దృష్టితో చదవడం మొదలుపెట్టాను, కానీ అలాంటిది నాకు కనబడకపోగా ఏకబిగిన చదివించే శైలి ఎదో నన్ను ఆకట్టుకుంది. చదవటం పూర్తి చేసేసరికి నేను ఆశించినది లేకపోయేసరికి ఒక రకమైన స్తబ్దతకు(బ్లాంక్) లోనయ్యాను. మళ్ళీ చదువుదాములే అని ప్రక్కన పడేశాను. మళ్ళీ చదవటం తటస్థించలేదు. ఇప్పుడు మీరు చెప్పిన అంశాలదృష్ట్యా మళ్ళీ చదవాలనిపిస్తుంది.
ధన్యవాదాలు