"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

12 జనవరి, 2011

జ్ఞానానందకవి అస్తమయం

(కాకినాడ, కెఎన్‌ఎన్‌ ప్రతినిధి) కూలీ నుండి పద్మశ్రీ వరకు ఎదిగిన సురగాలి తిమోతి జ్ఞానానందకవి జీవితం విషాదంగానే ముగిసింది. ఇది కవులతో పాటు సామాజిక భావాలు కలిగిన అందరిని ఆందోళనకు గురిచేస్తోంది. సామాన్యుడి నుండి కవిసార్వభౌముని వరకు అంచెలంచెలుగా ఎదిగిన జ్ఞానానందకవి సాహితీ లోకంలో దీర్ఘకాలం పాటు అత్యద్భుతంగా ప్రకాశించారు. కవి కోకిలగా.. కవితా విశారదగా...కవి లోక విభూషణుడిగా...సాహితీ వల్లభునిగా ... అధ్య, విద్యప్రభువునిగా ఇలా అనేక అంశాలలో తనదైన శైలిలో సాహత్యాన్ని పోషించారు. బాల్యం నుండే రచనాసక్తిని చేపట్టిన జ్ఞానందకవి చివరివరకు అకుంతాసక్తిని కనబరిచారు. పలు రచనలు చేసి సాహతీ లోకంలో ప్రత్యేక స్థానాన్ని పదిలపరుచుకున్నారు. సహజ కవితావేశబంధుర హృదయుడైన ఆయన తన కలం ద్వారా అలవోకగా రచనలు చేసి సాహితీ భూమిపై పాదుకొల్పారు. అవి నేడు వృక్షాలై ఎందరికో మార్గదర్శకంగా నిలిచాయి. వేలాదిమంది సాహితీప్రియుల్నుంచి ఆయన ఇప్పటికీ గాడ్‌ఫాదర్‌గా గౌరవాన్నందుకుంటున్నారు. తెలుగుబాషపై అపార ప్రతిభతో సాహితీ కృషివరులకు, సాహితీ ప్రయులకు సంబ్రమాశ్చర్యాల్ని కలిగించే రీతిలో ఆయనచేసిన రచనలు దేశ విదేశాల్లో బహుళ ప్రాచుర్యంపొందాయి. 1944లో తరంగ మాల కావ్యం ద్వారా తన రచనా ప్రాభవాన్ని చాటుకుని 40పైగా రచనల్తో తెలుగు సాహితీ జగత్తులో అనేక బిరుదులు స్వీకరించారు.
జ్ఞానానందకవి రచనలు
వసంతగానం(1947), గాంధీ (1950), దేశబంధు, పాంచజన్యము (1956), ప్రభంజనం, పర్జన్యం (తొలి భాగము)(1959), గోల్కొండ, క్రీస్తు చరిత్ర (1963), విజయాభిషేకం (1966), పర్జన్యం(రెండో భాగము)(1969), అక్షరాభిషేకం (1971), ఆమ్రపాలి (1972), అక్షరాక్షతలు (1973), అక్షరగుచ్చము (1975), వెలుగుబాట (1976), క్రీస్తు ప్రబంధం (1977), క్రీస్తుప్రబంధం తొలిభాగము (1992), నా జీవిత గాథ తొలిభాగం (1977), అక్షరపూజ (1979), హరిజనులు అంటరానివారా (1980), పిల్లనగ్రోవి (1982), రాజధాని (1987), వంశధార(1989), ది విజన్‌ ఇన్‌ ది వర్సస్‌ ఆఫ్‌ డాక్టర్‌ జ్ఞానందకవి (1990), కూలీ నుండి కళాప్రపూర్ణ వరకు (1988), ధర్మాగ్రహము (1998), వివేకానందగానం(2004), రెండు వేల పద్యాలతో క్రీస్తు ప్రబంధం, మనదేశం, రోజలుమారాలి (లఘునాటిక) బాష్ప సందేశం, పిల్లనగ్రోవి, రాజధాని, ఆహ్వానం, రెండంకితాలు, ఆరుదశాబ్ధాల కవితా పరిశ్రమ, అభినందన పద్యగద్య వ్యాససంపుటిలతో పాటు జ్ఞానందకవి చేసిన మరి కొన్ని రచనలు బహుళ ప్రాచుర్యం పొందాయి.
బిరుదులు
విజయనగరం జిల్లాలో 1987 డిశంబర్‌ 7న కవితా విశారద, విజయవాడలో 1950 మే 20వ తేదీన కవికోకిల, కాకినాడలో 1961ఏప్రిల్‌ 24న కవిలోక విభూషణ, 1968నవంబర్‌ 10వ తేదీన విద్వత్‌కవిచూడామణి, 1968నవంబర్‌ 15వ తేదీన సాహితీవల్లభ, 1974 జనవరి 27న మహాకవి, 1979 అక్టోబర్‌ 28న కవిసార్వభౌమ, 1991 ఫిబ్రవరి 7వ తేదీన బ్రహ్మీ విభూషణ, విశాఖ ఆంధ్రవిశ్వవిద్యాలయంలో 1974 ఆగష్టు 3వ తేదీన కళాప్రపూర్ణ, విజయవాడలో 1974 సెప్టెంబర్‌ 29వ తేదీన అభినవ జాషువ, బొబ్బిలి చిలుకలపల్లిలో 1975సెప్టెంబర్‌ 28వ తేదీన సాహితీ కృషి వల, రామచంద్రపురంలో 1982 సెప్టెంబర్‌ 28వ తేదీన కవితాశ్రీనాధ, 1982లో పద్యవిద్యాప్రభు, 1996లో డి.లిట్‌, 2001లో పద్మశ్రీ బిరుదులను స్వీకరించారు.
విద్యాబ్యాసం
1922జూలై 16వ తేదీన విజయనగరం జిల్లా బలిజపేట మండలం పెదపెంకి గ్రామంలో జన్మించిన జ్ఞానానందకవి ఆరవఏటే రచనలు రాయడం ప్రారంభించారు. భీమునిపట్నం బోర్డింగ్‌ స్కూల్‌లో 8వ తరగతి వరకు విద్యాభ్యాసానంతరం కాకినాడలో ఉపాధ్యాయశిక్షణ పొందారు. అనంతరం ఆయన తొలిసారిగా 14వ ఏటనే అప్పటి విశాఖ జిల్లా అలజంగి గ్రామంలో తెలుగుపండిట్‌గా ఉపాధ్యాయవృత్తి చేపట్టారు. 1982లో పదవీ విరమణ చేసేనాటికి 512రూపాయలను వేతనంగా స్వీకరించేవారు. ఈయన ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం మరో ఐదేళ్ళ పాటు సర్వీసును పెంచినప్పటికి వేతనం చెల్లింపులో మాత్రం నిర్లక్ష్యం వహించింది.
చేపట్టిన పదవులు
జ్ఞానానందకవి రాష్ట్రంలో పలు గౌరవ పదవుల్ని చేపట్టి వాటికి వన్నెతెచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం, ఆంద్రప్రదేశ్‌ లైబ్రరీ యాక్ట్‌ రివ్యూ కమిటీ, ఆంధ్రప్రదేశ్‌ సాహితీ అకాడమీ, ఆంధ్రవిశ్వవిద్యాలయ అకాడమీ కౌన్సిల్‌, తూర్పు గోదావరి జిల్లా రెడ్‌క్రాస్‌ సంఘం, తూర్పుగోదావరి జిల్లా గ్రంథలాయ సంస్థ సభ్యుడిగా పలు పదవులు నిర్వహించారు. రచనలు చేయడంతో జ్ఞానానందకవి సాహితీ సంస్థలను ఏర్పాటు చేయడంపై ప్రత్యేక శ్రద్ద కనబరిచారు. 1967లో సాహితీ సమాఖ్య, 1972లో సాహిత్య కళాపీఠం, 1980లో జాషువాకవి సాహిత్య పీఠాల్ని ఏర్పాటు చేశారు.
ప్రముఖుల ప్రశంసలు
జ్ఞానందకవి రచనలను శ్లాఘించిన వారిలో కవిసామ్రాట్‌ డాక్టర్‌ విశ్వనాధ సత్యనారాయణ, డాక్టర్‌ బెజవాడ గోపాల్‌లెడ్డి, ఆచార్యరంగ, డాక్టర్‌ సి నారాయణరెడ్డి, అయ్యదేవర కాళేశ్వరరావు పంతులు, డాక్టర్‌ దివాకర్ల వెంకటావధాని, ఆంధ్రసారస్వత రిషదధ్వక్షులు దేవులపల్లి రామానుజరావు, బ్రహ్మీభూషణ కాకకపర్తి కృష్ణశాస్త్రి, జస్టిస్‌ ఆవుల సాంబశివరావు, డాక్టర్‌ నందూరి రామకృష్ణమాచార్య, డాక్టర్‌ కులుకలూరి ఇనక్‌, ఆర్‌ఎస్‌ సుదర్శనం, కవిరాజ మూర్తిలతో పాటు అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రత్యేకంగా అభినందించిన వారిలో ఉన్నారు. భారత మాజీ రాష్ట్రపతి కెఆర్‌ నారాయణన్‌ నుండి జ్ఞానందకవి అత్యున్నతమైన పద్మశ్రీ అవార్డును స్వీకరించారు.
కుటుంబ వివరాలు
సురగాలి ఎలయ్య, పాపమ్మ దంపతులకు 1922లో జ్ఞానందకవి జన్మించారు. మారెటి తల్లి పోలమ్మ సమక్షంలోఆయన పెరిగి పెద్దవారయ్యారు. అనంతరం ఆయనకు సుగుణ మణితో వివాహం జరుగగా ముగ్గురు కుమారులు, ఇరువురు కుమార్తెలు కలిగారు. వీరిలో ఒకబ్బాయి యుక్తవయస్సులోనే మరణించగా మిగిలిన వారు వివిధ హోదాలలో ఉన్నత స్థాయిలో జీవిస్తున్నారు. చివరిదశలో ఆయన దుర్భర దారిద్య్రాన్ని అనుభవించారు. నడకుదురులోని జనావళి అనాధాశ్రమంకు చెందిన మందపల్లి శ్యామ్‌ ఆయన్ను ఆదరించి చివరివరకు ఆయనకు సదుపాయాలు కల్పించారు. మాజీమంత్రి ముత్తా గోపాలకృష్ణ నెలకు రెండువేల చొప్పున కొన్నాళ్ళపాటు ఆయనకు ఆర్ధికసాయాన్నందించారు. నగరానికి చెందిన మరికొంతమంది ఆయనకు ఆర్ధికసాయం చేసి సహకరించారు. చివరివరకు సాహిత్యసేవలోనే గడిపిన ఆయన జీవితం ధన్యం.
..............


'పద్మశ్రీ' జ్ఞానానందకవి కన్నుమూత
కాకినాడ, న్యూస్‌టుడే: ప్రముఖ గ్రంథ రచయిత, సాహితీవేత్త, పద్మశ్రీ సురగాలి జ్ఞానానందకవి(89) ఇకలేరు. అనారోగ్యంతో ఆయన తూర్పుగోదావరి కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఈయన కాకినాడ మెక్లరిన్‌లో తెలుగు పండితునిగా పనిచేసి పదవీవిరమణ పొందారు. అప్పట్నుంచి కాకినాడలోనే స్థిరపడ్డారు. 40కుపైగా గ్రంథాలు రచించారు. తరంగమాల, వసంతగానం, దేశబంధు, గొల్కొండ, ఆమ్రపాళి, తదితర గ్రంథాలు వీరి ప్రముఖ రచనలు. ఆయన ప్రముఖ కవి గుర్రం జాషువాకు అనుయాయులు. జ్ఞానానందకవి రచనలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో 'పద్మశ్రీ' అవార్డును అప్పటి రాష్ట్రపతి కె.నారాయణన్‌ చేతులమీదుగా అందించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం 'కళాప్రపూర్ణ' బిరుదుతో గౌరవించింది. ఈయన రచనలు రాష్ట్రంలో నాలుగు విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా అమలు చేస్తున్నారు. జ్ఞానానందకవి మృతి పట్ల రాష్ట్రమంత్రులు తోట నరసింహం, పినిపే విశ్వరూప్‌, కలెక్టర్‌ ఎం.రవిచంద్ర సంతాపం తెలిపారు.
( Courtesy  :  http://www.eenadu.net/archives/archive-7-1-2011/story.asp?qry1=21&reccount=26 )

.............

ప్రజాశక్తి - కాకినాడ ప్రతినిధి
ప్రముఖ సాహితీ వేత్త, కళాప్రపూర్ణ డాక్టర్‌ జ్ఞానానంద కవి గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 88 సంవత్సరాలు. ఆయన గతేడాదిన్నరగా నడకుదురు వృద్ధుల ఆశ్రమంలో కాలం గడుపుతున్నారు. తీవ్ర అనారోగ్యంతో లైఫ్‌లైన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి 7 గంటలకు తనువు చాలించారు. శుక్రవారం ఆయన పార్ధివ శరీరాన్ని ఖననం చేస్తారు.
జ్ఞానానందకవి 1922 జూలై 16న విజయనగరం జిల్లా, బొబ్బిలి వద్ద పెద కంచి గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించారు. తల్లి పాపమ్మ, తండ్రి పాపయ్య. ఆయన పుట్టిన రెండేళ్లకే తల్లి మరణించారు. జ్ఞానానందకవి భాషా ప్రావీణ్యాన్ని పరిగణనలోకి తీసుకొని అప్పటి ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి ఆయనను తెలుగు పండితునిగా నియమించారు. జిల్లాలోని ఆలగంజి, పెంట, మేడపల్లి పాఠశాలల్లో జ్ఞానానందకవి పనిచేశారు. అనంతరం కాకినాడ మెక్లారిన్‌ హై స్కూల్లో 35 సంవత్సరాల పాటు తెలుగు పండితుడిగా పనిచేసి, అక్కడే ఉద్యోగ విరమణ చేశారు. 1954లో ఆయనకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన సుగుణమణితో వివాహం అయింది. వారికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. జ్ఞానానందకవి పలు రచనలు చేశారు. వీటిలో ప్రధాన మైనది ఆమ్రాపాలి. గోల్కొండ మొదలగు 26 పుస్తకాలు రచించారు.
సత్కారాలు, బిరుదులు
తెలుగు సాహిత్యానికి జ్ఞానానంద కవి చేసిన సేవలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సన్మానాలు, బిరుదులు అందించాయి. 1991లో భారత ప్రభుత్వ పద్మశ్రీ అవార్డు, 1974లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదు, 1988లో నాటి ముఖ్యమంత్రి ఎన్‌టి.రామారావు చేతుల మీదుగా కవి సార్వభౌమ బిరుదు జ్ఞానానంద కవి అందుకున్నారు. ఆయన రచనలు, జీవితంపై ఐదు విశ్వవిద్యాలయాల్ల్లో పరిశోధనలు జరిగాయి.
పలువురి సంతాపం
డాక్టర్‌ జ్ఞానానంద కవి మరణం సాహిత్య లోకానికి తీరని లోటని రాష్ట్ర స్టాంపులు, రిజిష్ట్రేషన్ల శాఖ మంత్రి తోట నరసింహం పేర్కొన్నారు. అనేక రచనల ద్వారా సాహితి లోకానికి ఆయన ఎనలేని సేవ చేశారని కొనియాడారు. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. జ్ఞానానందకవి మృతి సాహితి లోకానికి తీరని లోటని జిల్లా కలెక్టర్‌ ఎం.రవిచంద్ర సంతాపం ప్రకటించారు. సాహిత్య లోకం పెద్ద దిక్కును కోల్పోయిందని కాకినాడ ఆర్‌డిఓ జిసి.కిశోర్‌కుమార్‌ పేర్కొన్నారు. జెఎన్‌టియు వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ అల్లం అప్పారావు మాట్లాడుతూ జ్ఞానానందకవి మృతి సాహితి ప్రియులకు తీరని లోటని అన్నారు. సాహితీ లోకానికి జ్ఞానానంద కవి చేసిన సేవ చిరకాలం గుర్తుంటుందని జిల్లా పౌరసంబందాధికారి వి.రామాంజనేయులు పేర్కొన్నారు.
( soujanyam :  http://www.prajasakti.com/eastgodavari/article-190676

అనాధాశ్రమంలో 'పద్మశ్రీ'

ప్రజాశక్తి - కాకినాడ ప్రతినిధి
కవి సార్వభౌముడు, పద్మశ్రీ, కళా ప్రపూర్ణ డాక్టర్‌ సురగాని తిమోతి జ్ఞానానంద కవి 20 రోజులుగా అనాధాశ్రమంలో తలదాచుకుంటున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి ఎన్నో పురస్కారాలు అందుకుని అనేక బిరుదులతో సత్కారాలు అందుకున్న కళా ప్రపూర్ణ జ్ఞానానందకవి దిక్కూ మొక్కూ లేక అనాధాశ్రమంలో చేరడం పలువురిని విస్మయానికి గురి చేసింది. ఆయనకు ఐదుగురు పిల్లలున్నా వారు పట్టించుకోవడం లేదు. దీంతోపాటు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయమూ అందకపోతుండటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
కాకినాడకు చెందిన దళిత కవి జ్ఞానానంద 20 రోజుల క్రితమే కాకినాడ సమీపంలోని కరప మండలం నడకుదురులో ఉన్న జనావళి అనాధ వృద్ధాశ్రమానికి వెళ్లినట్లు ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఎన్నో పురస్కారాలు అందుకున్న దళిత కవికి కొన్నేళ్లుగా ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదరణా ఉండటంలేదని, తాను ఉండేందుకూ స్థలం ఇవ్వలేదని వాపోతూ వచ్చారు. అంతేకాకుండా ఆయనకు ఎటువంటి పింఛనూ అందడం లేదని ఆవేదన చెందేవారు. ఆయన కాకినాడలోనే ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇటీవల ఉగాది పురస్కారం ఇచ్చేందుకు కూడా కలెక్టర్‌ జ్ఞానానంద కవిని ఆహ్వానించారు. ఈ సందర్భంగానూ ఆయన 'కవి పట్ల మీకు ఉన్న విజ్ఞత ఇదేనా?. నేను ఎలా వస్తానో కూడా ఆలోచించరా?. కనీసం వాహనం కూడా ఏర్పాటు చేయలేకపోయారు' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 'పద్మశ్రీ అవార్డు ఇచ్చారు ఎందుకు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ జిల్లా అధికారులు కూడా ఆయనకు ఎటువంటి సహాయమూ అందించలేదు. జ్ఞానాంద కవికి ఐదుగురు పిల్లలున్నా వారు కూడా పట్టించుకోవడం లేదు. దీంతో ఆలనా పాలనా కరువవడంతో ఆయన ఆనాధ వృద్దాశ్రమంలో తలదాచుకుంటున్నారు.
నా దుస్థితికి ప్రభుత్వమే కారణం : జ్ఞానానందకవి
నా దుస్థితి ప్రభుత్వమే కారణం. నాకు ఎటువంటి రాజకీయ అండదండలూ లేకపోవడం వల్లే నన్ను పట్టించుకోవడం లేదు. నేను దళితుణ్ని. నాకు ఎంఎల్‌ఎ, ఎంపీ, అధికారుల సపోర్టు లేదు. రాజకీయ బలం ఉంటే ఎక్కడో ఉండేవాణ్ణి. కలెక్టర్‌కు తెలుగు రాదు. ఉగాది రోజున రూ.200 ఇచ్చారు. భోజనానికి కూడా సరిపోలేదు. నాకు అన్నం లేదు. ఆకలితో అలమటిస్తున్నాను. ప్రభుత్వానికి దళిత కవులు అంటే చిన్న చూపు. పట్టించుకునే పరిస్థితి లేదు. ఒకప్పుడు ముఖ్యమంత్రులు జలగం వెంగళరావు, కోట్ల విజయభాస్కరరెడ్డి, మర్రి చెన్నారెడ్డి వంటి వారి హయాంలో గౌరవం దక్కేది. ముఖ్యమైన వాటిలో తనకు ప్రాధాన్యత కల్పించేవారు. ఇప్పుడు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి...
జ్ఞానానంద కవి అవార్డులు..
1974లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా కళా ప్రపూర్ణ అవార్డు.
2001లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు.
ఎన్‌టిఆర్‌ హయాంలో హంసకవి అవార్డు. రూ.30 వేల నగదు పురస్కారం.
1974లో ప్రభుత్వం ద్వారా కనకాభిషేక పురస్కారం.
1991లో తెలుగు యూనివర్శిటీ నుంచి డాక్టరేట్‌.
చేపట్టిన పదవులు..
అధికార భాషా సంఘం రాష్ట్ర సభ్యుడు.
రెడ్‌క్రాస్‌ మెంబర్‌.
రాష్ట్ర గ్రంథాలయ చట్టం సమీక్షా కమిటీ సభ్యుడు.
ఆంధ్రా యూనివర్శిటీ కౌన్సిల్‌ సభ్యుడు. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడెమీ సభ్యుడు. దూరదర్శన్‌ సభ్యుడు.
వచ్చిన బిరుదులు...
పద్మశ్రీ, కళాప్రపూర్ణ, శారదా వల్లభ, కళారత్న, కవికోకిల, కవితా విశారద, అభినవ జాషువా, కవి సార్వభౌమ, మహాకవి, కవి విభూషణ, కళా రత్న.
..........

పద్మశ్రీ జ్ఞానానందకవి కన్నుమూత

కాకినాడ, జనవరి 6: ప్రముఖ కవి, కళాప్రపూర్ణ, పద్మశ్రీ డాక్టర్ ఎస్‌టి జ్ఞానానంద కవి గురువారం రాత్రి కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జ్ఞానానంద కవి సాహితీ లోకానికి అందించిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో సత్కరించింది. విజయనగరం జిల్లా బొబ్బిలి వద్ద పెదకంకి గ్రామంలో నిరుపేద కుటుంబంలో 1922 జూలై 16న జ్ఞానానంద కవి జన్మించారు. తల్లిదండ్రులు పాపమ్మ, ఎల్లయ్యలు. ఆయన అసలు పేరు సురగాలి తిమోతి జ్ఞానానందం. కాకినాడ నగరంలో మెక్లారిన్ హైస్కూల్‌లో తెలుగు పండిట్‌గా చేరి దాదాపు 35 ఏళ్ళు ఇక్కడే పని చేసి పదవీ విరమణ చేశారు. జ్ఞానానందకవి కవితల్లో ప్రధానమైనవి అమ్రపాలి. గౌతమబుద్దుని శిష్యురాలు అమ్రపాలి పేరున ఈ పుస్తకాన్ని రాశారు. అలనాటి రచనల్లో ఈ పుస్తకం బహుళ ప్రాచుర్యం పొందింది. 1974లో ఈ పుస్తకాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయం బిఎస్సీ విద్యార్థులకు పాఠ్యాంశంగా పెట్టింది. 1944 నుండి 1970 సంవత్సరాల మధ్య తరంగమాల, వసంతగానం, గాంధీ, దేశబంధు, పాంచజన్యం, ప్రభంజనం, గోల్కొండ, క్రీస్తుచరిత్ర, క్రీస్తు శతకం, వెలుగుబాట, విజయాభిషేకం, పర్జన్యం వంటి పుస్తకాలను రచించారు. తెలుగు సాహిత్యానికి జ్ఞానానంద కవి చేసిన సేవలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సత్కారాలు, పురస్కారాలు అందచేశాయి. ప్రతీ ఏటా నిర్వహించే ఉగాది సమ్మేళనంతోపాటు వివిధ సాహితీ సభలు, కార్యక్రమాలకు ఆయన పెద్ద దిక్కుగా ఉండేవారు. నగరంలోని మెక్లారిన్ హైస్కూల్‌లో తెలుగు పండిట్‌గా పని చేసి పదవీ విరమణ చేసిన ఈయన అనేక రచనలు, కవితల ద్వారా సమాజంలో కీర్తింపబడ్డారు. జాషువా సాహిత్య పీఠాన్ని నెలకొల్పిన ఈయన రచనలు పలువురు యువ కవులు, రచయితలకు మార్గదర్శకంగా నిలిచాయి.
జ్ఞానానంద మృతికి మంత్రి తోట, కలెక్టర్ సంతాపం...
ప్రముఖ కవి, పద్మశ్రీ, కళాప్రపూర్ణ జ్ఞానానందకవి మృతి పట్ల మంత్రి తోట నరసింహం తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన గురువారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో జ్ఞానానంద కవి మృతి జిల్లా సాహితీ, కవితా లోకానికి తీరనిలోటన్నారు. జిల్లా కలెక్టర్ ఎం రవిచంద్ర విడుదల చేసిన మరో ప్రకటనలో జ్ఞానానంద కవి మృతిపట్ల సంతాపం తెలియచేశారు. కవి కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే జిల్లా పౌర సంబంధాధికారి వి రామాంజనేయులు విడుదల చేసిన ప్రకటనలో దశాబ్ధాలుగా సాహితీ ప్రపంచానికి సేవ చేసిన జ్ఞానానంద కవి మృతి చెందడం బాధిస్తోందని పేర్కొన్నారు.
soujanyam : andhra bhoomi 

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

నాకు జ్ఞానానందకవిగారు వ్యక్తిగతంగా తెలుసు. చిన్నప్పుడు కాకినాడలో అప్పుడప్పుడు ఆయన్ని కలిసి మాట్లాడేవాళ్ళం. ఆయన సహృదయుడూ, శాంతుడు, సౌమ్యుడూ, నిష్కపటి, నిరంతర సాహితీమథన తత్పరుడు, నిరాడంబరుడు. ఇజాలకూ, వర్గాలకూ దూరంగా గడిపిన ఋషితుల్యుడు,

ఆయన పోయారని తెలిసి బాధనిపించింది.