"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

04 జనవరి, 2011

“ఆదికవి” లో సాహిత్యకీయం?



తెలుగు కవుల్లో నన్నయ, వేమన పేర్లతో కొన్నాళ్ళ క్రితం ఆంధ్రప్రదేశ్‌ లో రెండు విశ్వవిద్యాలయాల్ని ఏర్పాటు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. నిజంగా అది తెలుగు కవులకు దక్కిన గొప్ప గౌరవంగానే పైకి అనిపిస్తున్నా, వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తే అలా విశేషణాలతో పేర్లు పెట్టడం సమంజసమేనా అనిపించకమానదు. ఒక దానికి ‘‘ ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం’’ అని పేరు పెట్టారు. విశ్వవిద్యాలయానికి తెలుగు కవి పేరు పెట్టినా, దానిలో ఎం.ఏ., తెలుగు కోర్సు  లేదు. తెలుగు కోర్సులు కూడా తర్వాత పెట్టే అవకాశం ఉండొచ్చు.నన్నయ పేరుకి ముందు ఆదికవి అనే బిరుదు అవసరమా?  నన్నయే తొలి తెలుగు కవి అవుతాడా? నన్నయకు ముందు తెలుగు సాహిత్యం లేదా? ఉంటే మరి నన్నయనే ఆదికవి అని ఎందుకంటున్నారు?
నన్నయ నాటికే తెలుగు కవిత్వం ఉందని కొంపెల్ల జనార్ధనరావు ఉదయిని ( సంచిక 5 ` మే) లో రాశారు. నన్నయ కంటే ముందు సర్వదేవుడనే కవి ఉన్నాడనీ, అతడు ఆదిపురాణం, విరాట పర్వ అనే కావ్యాల్ని రాశాడని కొంపెల్ల విశ్వసించారు. ఇతడు జైనమతస్థుడు. ఇతడినే పొన్నమయ్య అని కూడా అంటారని నేలటూరి వెంకటరమణయ్య నిరూపించారు. కన్నడ కవిత్రయం పంప, పొన్న, రన్నడులో ఇతడొకడు. అయితే తెలుగులో  పొన్నమయ్యగా ప్రసిద్ది చెందిన ఈ కవి  రాసిన ఆదిపురాణంలో మూడుపద్యాలు దొరికాయి. ఆ పూర్తి కావ్యం గానీ, కొంత భాగంగానీ దొరికితే  పొన్నమయ్యగార్ని ఆదికవి పోటీకి నిలబెట్టొచ్చని ఆరుద్ర అన్నారు. జైనమతం పట్ల ఉన్న వ్యతిరేకత వల్ల ఆ కావ్యాన్ని కూడా ప్రాచుర్యంలోకి తీసుకురాలేదేమోనని సందేహించాల్సి వస్తోంది.
నన్నయకు ముందే కవిజనాశ్రయం అనే ఛందోగ్రంథం వచ్చింది. దీన్ని క్రీ.శ. 940 ప్రాంతంలో మల్లియరేచన రాశాడు. ఈ కవి వైశ్యుడు. జైనమతస్థుడు.  దీని కర్తృత్వాన్ని వివాదం చేశారు. దీన్ని వేముల వాడ భీమన కవి రాశాడనీ, అయితే రేచన దగ్గర డబ్బు తీసుకుని అతని పేరుతో ప్రచారం చేశాడనీ, అందువల్ల దీన్ని వేములవాడ భీమన రాసిన కృతంగానే గుర్తించాలనేది జయంతి రామయ్య పంతులు వాదన.
వీరితో పాటు గజాంకుశుడనే కవి నన్నయ కంటే ముందే నీతిసారం రాశాడని సాహిత్య చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఇతడు కేవలం తెలుగులోనే కాకుండా కన్నడంలో కూడా కవిత్వం చెప్పినవాడన్నారు. దీనితో పాటు కవిరాజశిఖామణిగా పేరొందిన నన్నెచోడుడు రాసిన కుమారసంభవం తెలుగులో తొలి కావ్యమనే వాదన తెలుగు సాహిత్యాన్నొక ఊపుఊపింది. క్రీ.శ. 940 ప్రాంతానికి చెందిన నన్నెచోడుడే ఆదికవి అవుతాడనీ మానవల్లి రామకృష్ణకవి వాదించారు. దీన్ని తర్వాత సాహిత్య చరిత్రకారులు అంగీకరించలేదు. అతడు క్రీ.శ. 1080- 1130 ప్రాంతానికి చెందుతాడని నిర్ణయించారు. అయితే ఇక్కడో గమ్మత్తుంది. నన్నెచోడుడు క్షత్రియుడనీ, అందుకే అతడిని ఆదికవిగా గుర్తించనిరాకరించారనే వాదనలున్నాయి. వేములవాడ భీమకవిని కూడా నన్నయకు ముందున్న కవి అనీ, అతడూ మహాభారతాన్ని రాసినా, దాన్ని నన్నయ గోదావరిలో కలిపేశాడనేది ఒక పుక్కిటపురాణంగా కొట్టిపారేసిన వాళ్ళే ఎక్కువమంది. అందు వల్ల అనివార్యంగా సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనుసృజన చేసిన నన్నయనే ఆదికవి అని పిలుస్తున్నారు.
నవ్య సంప్రదాయాన్ని ఒక ‘‘ఉద్యమం’’గా కీర్తించిన సాహిత్య చరిత్ర కారులు కూడా నన్నయను ‘‘ఆదికవి’’గా సమర్థించడానికెంతగానో కష్టపడ్డారు.అసలు తెలుగులో నన్నయ ‘‘ఆదికవి’’ అవుతాడా? ‘ఆంధ్రమహాభారతంరెండున్నర పర్వాల్ని పూర్తి చేసి, లిఖిత రూపంలో దాన్ని ఒక కావ్యంగా అందించినందు వల్లే ఆయన్ని ఆదికవిగా గుర్తించాలా? అంతకు ముందు తెలుగు సాహిత్యం లేదా? తెలుగు కవుల్లేరా? పద్యకావ్యంగా రాస్తేనే దాన్ని సాహిత్యంగా పరిగణించాలా? పద్యకావ్యం రాసినందు వల్లనే నన్నయని తెలుగులో ఆదికవిగా పిలుస్తున్నారా? ఇవన్నీ మన తెలుగు సాహిత్య చరిత్రకారులు వేసుకుని వివిధ సమాధానాలతో సంతృప్తి పడ్డవాళ్ళున్నారు. మరికొంతమంది ఆ అసంతృప్తిని వెళ్ళగక్కుతూనే ఉన్నారు. ఆ అసంతృప్తికి పరిశోధనాత్మక, వైయక్తికమైన అనేక కారణాలెన్నో ఉన్నాయి.

కవుల్ని, వారి రచనల్ని కులం, అగ్రవర్ణత్వం ఆధారంగా వివక్షను ప్రదర్శించిన వైనాన్ని  బహుజన సాహిత్య వాదం బయటపెడుతుంది. సాహిత్య చరిత్రలో వర్ణ వివక్ష కొనసాగిన తీరుని ఎండగడుతుంది. ఇక్కడ అగ్రవర్ణత్వమంటే ఏమిటో అంబేద్కర్‌ చెప్పిన అభిప్రాయాలు గుర్తించాల్సిన అవసరముంది. ఉదాహరణకు చాతుర్వర్ణ వ్యవస్థనే తీసుకుందాం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలున్నాయి. దీనిలో అంత్యవర్ణం శూద్ర. శూద్రులకు వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణలు అగ్రవర్ణాలవుతాయి. వైశ్యులకు ఆ పై రెండూ, అలాగే క్షత్రియులకు బ్రాహ్మణులు అగ్రవర్ణాలవుతాయి. ఇలా భారతదేశంలో వేలాది వర్ణాలున్నాయి. వీటిలో ఒకదానిపై మరొకటి అగ్రవర్ణత్వాన్ని చెలాయిస్తున్నాయి. ఈ వివక్ష నిచ్చెన మెట్ల వ్యవస్థను కలిగి ఉంటుంది. దీన్ని కొన్ని వర్గాలుగా మాత్రమే విభజించి చూస్తే సరిపోదు. దీన్ని బహుజన  సాహిత్య దృక్పథం లోతుగా అధ్యయనం చేయాలంటుంది. కనుక, అగ్రవర్ణత్వాన్ని నిర్మూలించాలంటే, ముందుగా దాని వికృత స్వరూపమెలా విస్తరించిందో చూపాల్సిన అవసరముంది. ఈ అగ్రవర్ణత్వం వల్ల అత్యంత ఎక్కువగా కష్ట నష్టాలకు గురైందెవరో, వాళ్ళంతా చైతన్యం కావాలంటుంది. ఈ దృష్టితో చూసినప్పుడు అత్యంత అగ్రవర్ణంగా ఉన్న వర్ణమే సాహిత్యంలోనూ ఆధిపత్యాన్ని చెలాయించుకోవడంలో భాగంగానే నన్నయను ఆదికవిగా నిలిపే ప్రయత్నం జరిగిందని గుర్తించాలి. 
నన్నయను ఆదికవి అనడమొక చర్చనీయాంశమైతే, రెండవది వేమన పేరుతో ఒక విశ్వవిద్యాలయాన్ని పెట్టినా, దీనికి కూడా ‘‘యోగివేమన’’ అని ఒక విశేషణాన్ని ముందుంచడం మరో చర్చనీయాంశమైంది. ‘‘వేమన’’ అంటే సరిపోతుంది కదా! కానీ కొంత నిర్దిష్టమైన పద్ధతిలో పేర్లు పెట్టకపోతే, భవిష్యత్తులో కొన్ని వివాదాలు తలెత్తే అవకాశముందని భావించామనొచ్చు. బహుశా గట్టిగా సమర్థించుకోవడానికి నాగార్జున విశ్వవిద్యాలయం పేరు ముందు ‘‘ఆచార్య’’ చేర్చి నాగార్జునుడిని స్మరించేటట్లు చేశారు కదా అని, దాన్ని చూపించి, వాదించే అవకాశం కూడా ఉంది. దీనికీ, పై రెండింటికీ మధ్య చాలా తేడా ఉంది. వేమనను హిందూభావజాల చట్రంలో కట్టిపడేయాలనే ఆలోచన ఉండొచ్చు. ఇది తెలియాలంటే వేమన చెప్పిన నిజమైన పద్యాల్ని గుర్తించాలి. ఆ సమయం కూడా వస్తుందని ఆశిద్దాం.
-డా దార్ల వెంకటేశ్వరరావు
అసిస్టెంటు ప్రొఫెసరు, తెలుగు శాఖ,
సెంట్రల్‌ యూనివర్సిటీ, గచ్చిబౌలి, హైదరాబాదు` 46
ఫోను: 9989628049
            






కామెంట్‌లు లేవు: