"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

18 జనవరి, 2011

నిలువెత్తు భారతీయతను నింపుకున్న కవి. పద్మశ్రీ జ్ఞానానందకవి

(సూర్య దినపత్రిక 17.1.2011 సౌజన్యంతో)
(ఇమేజ్ పై రెండు సార్లు క్లిక్ చేయండి. చదవడానికి పెద్దదిగా కనిపిస్తుంది)
‘‘ భరియించెద భర్తలుగా
వరియించెద మీ మనోజ్ఞభావమ్ముల, నే
చరియించెద నిష్టామతిు
గురియించెద వలపు మలపు కూర్ములెసంగన్‌’’ ఇది డా॥ యస్‌.టి.జ్ఞానానందకవి సాహిత్య అకాడమీ బహుమతి పొందిన ‘‘ ఆమ్రపాలి’’ కావ్యంలోని ఒక చక్కని కంద పద్యం.ఆమ్రపాలి అందమైన అమ్మాయి. ఆమెను షోడషజనపథాలకు చెందిన రాజులు అనుభవించాలని ఆమె తండ్రినే నిర్భంధిస్తారు. అందమైన అమ్మాయిని గణభోగ్యగా చేసుకునే ఒక ఆచారం ఆనాడు ఉండేది. దానికి అనుగుణంగానే ఆమెను అలా అందరిభార్యగా మార్చుకోవాలనుకున్నప్పుడు, తండ్రి ఎలాంటి సమాధానం చెప్పలేని నిస్సహాయ స్థితిలోకి కూరుకుపోతాడు అప్పుడు ఆమ్రపాలి ప్రకటించిన నిర్ణయం ఆ పద్యంలో వర్ణించారు కవి. కందం రాసిన వాడే కవి, పందిన కొట్టినవాడే మొనగాడు’’ అనే సామెత ఒకటుంది. కవిత్వాన్ని పద్యంలో చెప్పడమే కాకుండా, దాన్ని రసభరితంగా వర్ణించగల నేర్పు కందంలో అందంగా రాయగలిగినవారికే సాధ్యమనే విషయాన్ని చెప్పడానికా సామెతను సాహితీవేత్తలు చమత్కారంగా ప్రయోగిస్తుంటారు. కందం మాత్రమే కాదు, తెలుగులో ఏ పద్యాన్నైనా వర్ణించడంలో అభినవ శ్రీనాథుడనే కీర్తికి పాత్రమైన కవి పద్మశ్రీ డా॥ యస్‌.టి.జ్ఞానానందకవి. ‘‘కూలీ నుండి కళాప్రపూర’’్ణ వరకూ ఎదిగిన ఈయన ఈనెల ( జనవరి ) 6 వతేదీన శాశ్వతంగా కన్నుమూశారు.
జ్ఞానానందకవిగారు విజయనగరం జిల్లా బొబ్బిలిలో 1922 జూలై 16న సురగాలి పాపమ్మ, ఎల్లయ్య దంపతులకు జన్మించారు. తనమేనమామ దగ్గర రామాయణ, భారత, భాగవత, ప్రబంధాలను చదువుకున్నారు. ఉపాధ్యాయుడైన తన మేనమామ పద్యాల్ని రాగయుక్తంగా పాడేవారు. ఆ ప్రభావంతో తానూ పద్యం పాడటమే కాదు, రాయగలగాలనుకునేవారు. తెలుగు పండితులు అప్పయ్యశాస్త్రి, ఆదినారాయణశాస్త్రిగార్ల సహాయంతో వ్యాకరణంతో పాటు, పద్యవిద్యను అవగాహన చేసుకున్నారు. తన పదిహేనో సంవత్సరం నాటికి శతకాల్ని, శబ్దమంజరినీ కంఠస్థం చేసి, దీనబంధు శతకాన్ని రాశారు. చిన్నవయసులోనే సీసపద్యాలతో ఒక శతకాన్నే పూర్తిచేయడాన్ని గమనించిన తెలుగు పండితులు జ్ఞానానందకవి గార్ని చూసి ఆశ్చర్యపోయేవారు. అలా పద్యాల్లో కవిత్వం చెప్తూ, వివిధ సాహితీ సభల్లో వాటిని చదవాలని ప్రయత్నించేవారు. 1947 ఆగస్టు 15 వతేదీన స్వాతంత్య్రదినోత్సవాన్ని వర్ణిస్తూ రాసిన పద్యాల్ని ఒక సభలో ఆలపించారు. దానికి ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావుగారు సభాధ్యక్షులు. ఆ పద్యాల్ని విని ‘‘ఇకపై నీపేరు ‘ జ్ఞానానందకవి’గా ప్రసిద్ధి చెందుతుంది’’ అని ఆశీర్వదించారు. అలా నాటి నుండీ సురగాలి తిమోతి జ్ఞానానందంగారు, ‘‘యస్‌.టి. జ్ఞానానందకవి’’గానే ప్రాచుర్యం పొందారు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన వ్యక్తి కవిగా గుర్తింపుపొందడమే కష్టం. అటువంటిది సంప్రదాయపండితుల మెప్పు పొంది, కనకాభిషేకాల్ని, అభినవ జాషువ, కవికోకిల, కవితాశ్రీనాథ, కవిలోక విభూషణ వంటి ఎన్నో బిరుదుల్ని పొందడం వెనుక కవి నిరంతర కృషి ఎంతో దాగి ఉంది.
జ్ఞానానందకవి అనగానే సాహితీలోకానికి గుర్తొచ్చే అంశాలు కొన్నైనా చెప్పుకోవాలి. భావకవిత్వం పేరు చెప్తే కృష్ణశాస్త్రి వేష, భాషలెలా గుర్తుకొస్తాయో, చాసో అంటేనే కాల్చుకుంటున్న చుట్టెలా గుర్తుకొస్తుందో, జ్ఞానానందకవి అనగానే కూడా గుర్తొచ్చే విషయాలు కొన్ని ఉన్నాయి. కవిగారి ‘‘ధర్మాగ్రహం’’ ఖండకావ్యానికి స్ఫూర్తిశ్రీ రాసిన ముందుమాటలో ఇది కనిపిస్తుంది. ‘‘ రోజువారీ జీవితంలో సైతం ఆయన నిండైన కవి. వెనక్కి దువ్విన ఒత్తయిన శిరోజాలు, ఎంతో ముద్దుగా పెంచుకున్న పొడుగాటి మీసాలు, వాటిని స్పృశించడానికి దిగివస్తున్నట్టు అనిపించే చెంపలు, మోకాళ్ళు దిగజారి వ్రేలాడే ఖద్దరు లాల్చీ, కొన్ని సమయాల్లో సిల్కు లాల్చీ, అందంగా తీర్చి దిద్దినట్టు కట్టిన పంచె ` వీటన్నింటికీ అందం తెచ్చే ధీరగంభీరమైన నడక... ఇది నాకు చేతనైనంతలో శ్రీ జ్ఞానానందకవిగారి రూపం’’ అని స్ఫూర్తిశ్రీ వర్ణించిందెంతో సముచితంగా ఉంది.
డా॥ జ్ఞానానందకవి రచనాతత్త్వాన్ని మూడుప్రధానమైన అంశాలుగా విశ్లేషించవచ్చు. తాను పుట్టిపెరిగిన కుల, మత, ప్రాంతమేదైనా, తనని భారతీయతకు ప్రతిరూపంగా అందరూ భావించాలనే ఆత్మవిశ్వాసం కలిగించే ప్రయత్నం ఆయన ప్రతిరచనలోను కనిపిస్తుంది.భారతదేశాన్ని వర్ణిస్తూ, హిమాలయాల్ని
‘ ఇది ఋషిచంద్రుల హృదయాల బంధించు
తతగాఢయోగ సాధన తలమ్ము
ఇది నిశాట ధ్వంసి పదముల లయ ఘోష
తాండవించిన దేవతా భువనము
ఇది చలిమిరిమల సదనమ్ము పరమప
విత్ర జాహ్నవికి నవేశనమ్ము
ఇది శత్రు సైన్యాల విదళింప నిలచిన
అరి భయంకర కరాళాయుధమ్ము
ఇది భరింపరాని హిమశృంగములజాడ
భరత ఖండమునకు వజ్రకుడ్య
మిది నగాగ్రగామి యిది వేలుపుల కొండ
ఇది మహా మహితము హిమకుధరము
ఇది ప్రకృతి యందచందాల కింపు గూర్చు
సురుచిర మనోజ్ఞ నృత్యనిర్జరుల నెలవు
ఇది హిమాద్రి ముక్కంటి యేలు నేల
స్వామి! కనులార తిలకించి పరవశించె’’ (శ్రీవివేకానందగానము) అంటారు. రెండవది, ఇంచుమించు పద్యంలోనే తన కవిత్వానంతటినీ చెప్పినా, తన ప్రతిభా పాండిత్య ప్రదర్శన కంటే, పాఠకులందరికీ పద్యం కూడా సులభంగానే అర్థమవుతుందనే ఆలోచనను కలిగించేలా పద్యాన్ని వర్ణించడం. మూడవది, అహింస, దయ, కరుణ, విశ్వమానవుడిగా ఎదిగే ఆలోచనలు కలిగించిన మహానుభావుల్ని కీర్తించడం వీరి రచనల్లో ప్రధానంగా కనిపిస్తుంది.
సమకాలీన కవుల్లో గుర్రం జాషువ, విశ్వనాథ సత్యనారాయణ, మధునాపంతుల సత్యనారాయణ, దాశరథి వంటి వారెందరో జ్ఞానానంద కవి కవిత్వాన్ని ప్రశంసించారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం, మైసూరు, ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో అనేక సంవత్సరాల పాటు వీరి ‘‘ఆమ్రపాలి’’ కావ్యం పాఠ్యాంశంగా ఉంది. అనేక విశ్వవిద్యాలయాల్లో వీరిపై పరిశోధనలు జరిగాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణతో సత్కరించగా, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం డాక్టరేటుతో గౌరవించింది.కవి సాహిత్యానికి గుర్తింపుగా భారతప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.మొత్తం మీద పద్యకవుల్లో సామాజిక విషయాల్ని పద్యంలో ద్రాక్షాపాకంలో రాయడంలో చేయితిరిగిన కవిగా గుర్తింపుపొందారు. కఠినమైన భావాన్ని కూడా సులభంగా అర్థమైయ్యేరీతిలో వర్ణించి పాఠకుల్ని ఆనందింపజేయగల శక్తిమంతులు.దీనికి ఉదాహరణగా ఒక పద్యం చూద్దాం.
‘‘ రక్తప్లావితమైన మానగరమార్తధ్వానముల్‌ విన్న దు
శ్శక్తుల్‌ నెత్తురుద్రావు రాక్షసుల దౌర్జన్యాలు హింసల్‌ మహో
ద్రిక్తంబై చెలరేగ మానవత గోరి చొచ్చె నీవేళ నే
శక్తిన్‌ జూపి ప్రశాంతినింపెదవహో! సంక్రాంతి యీ నేలకున్‌’’ ` ఈ పద్యం ఈ మధ్యనే ఎవరో రాశారనుకుంటారు. ఇది 1993లో ‘‘ ఆహ్వానం ’’ లో రాసిన కవితా ఖండిక. కవిని ద్రష్ట అంటారు. నగరాల్లో నేరప్రవత్తుల్ని చూసినప్పుడల్లా అప్పుడే ఈ పద్యం చెప్పారా అనిపించేటట్లుంది. ఇలాంటివెన్నో సామాజిక అంశాల్ని పద్యాల్లో వర్ణించారు.
జ్ఞానానందకవిగారు నాటి నుండీ తుదిశ్వాస విడిచే వరకూ అవిశ్రాంతంగా తన పద్యవిద్యను కొనసాగించారు.తరంగమాల, వసంతగానం, దేశబంధు, పాంచజన్యం, గోల్కొండ, క్రీస్తుశతకం, రాజధాని, వంశధార, శ్రీవివేకానందగానం, క్రీస్తుప్రబంధం మొదలైన 36 కావ్యాల్ని ప్రచురించారు. షెడ్యూలు కులాలు అంటరానివా? అనే పరిశోధన గ్రంథాన్ని రాస్తే, దాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే ప్రచురించింది. దీనిలో షెడ్యూలు కులాలు అంటరానివిగా ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో ప్రముఖపాత్ర వహించిన మనువాదభావజాలాన్ని తూర్పారగట్టారు. నిజంగా వేదాల్లో, పురాణాల్లో లేని కులం, తర్వాత కాలంలో స్వార్థపరులు దాన్ని వాడుకుని సమాజాన్ని విచ్ఛిన్నం చేశారని నిరూపించేప్రయత్నం చేశారు. తన జీవితంలో ఎదురైన కష్ట నష్టాల్ని వివరిస్తూ ‘‘ కూలీ నుండి కళాప్రపూర్ణ వరకూ’’ అనే గ్రంథం రాశారు. వీరి సాహిత్య కృషిని వివరిస్తూ ‘‘ ది విజన్‌ ఇన్‌ ది వెర్సెస్‌ ఆఫ్‌ డా॥జ్ఞానానందకవి’ అనే ఆంగ్ల గ్రంథం కూడా వెలువడిరది. ఇంకా వీరి ‘ నా జీవితగాథ, ఏడు దశాబ్దాల కవితా పరిశ్రమ, సాహిత్య వ్యాససంపుటి, తొలిసంజ’’ వంటి అనేక రచనలు ముద్రితం కావాల్సినవి ఉన్నాయి.సాహిత్యమే జీవితమై బతికిన పద్మశ్రీ జ్ఞానానందకవి. తనలో, తన రచన్లో నిలువెత్తు భారతీయతను నింపుకున్న కవి. ఆయన రచనల్ని ప్రభుత్వం పునర్ముద్రించి, అన్ని విద్యాలయాలు, గ్రంథాలయాల్లో అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేయడం ద్వారానే ఆయనకు నిజమైన నివాళిని ప్రకటించిన వాళ్ళమవుతాం.
-డా॥ దార్ల వెంకటేశ్వరరావు
అసిస్టెంటు ప్రొఫెసరు, తెలుగు శాఖ,
సెంట్రల్‌ యూనివర్సిటీ, గచ్చిబౌలి, హైదరాబాదు` 46
ఫోను: 9989628049

కామెంట్‌లు లేవు: