Sunday, November 21, 2010

సాహిత్య సృజనలో పరిశోధన ఉంటుందా?

 
Courtesy : Surya Literary Special 22-11-2010‘‘ కవిత్వానికి కూడా సైన్సుకి వలే
కావాలి రీసెర్చ్‌ ఎక్సెపెరిమెంటూ
కాని దాని పరమార్ధం
పలాయనం కాదు ప్రజాక్షేమం’’ - ఇది ఆరుద్ర ‘‘సాహిత్యోపనిషత్‌’’ లో శ్రీశ్రీ మాటలుగా చెప్పాడు. ఇక్కడ ‘‘ కవిత్వం’’ అని చెప్పినా, అందులోని విషయాలు అన్ని సృజన ప్రక్రియలకూ వరిస్తాయి. కవులు వాస్తవాన్ని యథాతధంగా చెప్పకుండా తమ అనుభవాన్నీ, అనుభూతినీ, భావుకతనూ జతచేసి సృజనాత్మక రచనల్లో అందంగా అందిస్తారు. కేవలం కాల్పనిక అంశాలే సృజనాత్మక రచనలు కాదు.కానీ, సృజనాత్మక రచనల్లో కాల్పనిక అంశాలెక్కువగా ఉంటాయి. ఏదైనా ఒక కవితో, కథో, నవలో, నాటకమో, గేయమో రాయాలంటే రచయితకి కేవలం సృజనాత్మక ప్రతిభ ఉంటే సరిపోతుందా అనేది ఒక చర్చనీయాంశం. దీన్నే ఆరుద్ర కవిత్వం ద్వారా మనముందు చర్చకు పెట్టాడు.
కవిత్వం లేదా సాహిత్య ప్రయోజనం గురించి నేటికీ చర్చ కొనసాగుతునే ఉంది. కానీ, కవిత్వానికి రీసెర్చ్‌ ఎక్స్పెరిమెంటు ఉండాలనడంలో మరే ఆంతర్యం లేదా? మార్క్సిస్టు సాహిత్యం వచ్చిన తర్వాత సాహిత్య విమర్శలో కొన్ని భావనలు బలంగా చర్చలోకొచ్చాయి. వాస్తవికత, సామాజికస్పృహ, నిబద్దత అలా చర్చలోకొచ్చిన వాటిలో ముఖ్యమైనవి. ఇవి సృజన సాహిత్యాన్ని ఒక విధంగా లోక పరిశీలన వైపు, ఇంకా చెప్పాలంటే పరిశోధన చేసి తెలుసుకున్న తర్వాతనే రాయాలనే ఆలోచనని చాలా వరకూ కలిగించాయి. వీటి కంటే మరింతలోతుల్లోకి తీసుకెళ్ళిన భావన మరొకటి స్త్రీవాద, దళిత సాహిత్య సృజనతో మొదలైంది. నిమగ్నత అనేది ఈ సాహిత్య సృజనకు, దాన్ని అవగాహన చేసుకోవడానికీ అవసరం. ఇది ఆధునిక సాహిత్యాన్ని శాస్త్రీయంగా అర్థం చేసుకోవడానికున్న విమర్శసూత్రం. ఇలాంటి సృజన రచనల్లో పరిశోధనతో పాటు, జీవితానుభవాలు రచనకు జీవితాన్నిస్తాయి. అలాగని ఇవే వాస్తవాలనో, ఇవే పరిశోధనలనో ప్రజలు భ్రమ పడ్డానికి వీల్లేదు. ప్రతి రచయితకూ తనదైన ఒక ప్రాపంచిక దృక్పథం ఉంటుంది. ఆ దృక్పథంతో సాహిత్య సృజన చేస్తాడు. ఒక వాస్తవాన్ని  చెప్పడానికి సృజన రచనను చేస్తున్నాడా? ఒక వాస్తవిక సత్యాన్ని అనేకమందికి అనుభవంలోకి తెస్తున్నాడా ? ఈ రెండు ప్రశ్నల కొచ్చే సమాధానాలే సృజనాత్మక సాహిత్యంలో ఉండే పరిశోధన మౌలికతత్త్వాన్ని పట్టిస్తాయి.
కవులు కొన్ని కావ్యాల్ని రాసేముందు ఆ వస్తువుకి సంబంధించిన విషయాన్ని సేకరించతప్పదు.రచయిత తాను సేకరించిన ఆధారాల్ని తన సృజనాత్మక రచనకు సహాయంగా తీసుకొంటాడు.కానీ, తారీఖూ, దస్తావేజుల్లా రాయకుండా చారిత్రక సత్యాన్ని కళాత్మక సత్యంగా మారుస్తాడు. యస్‌.టి.జ్ఞానానందకవి ‘‘ఆమ్రపాలి’’ అనే పేరుతో ఒక చారిత్రక కావ్యాన్ని రాశారు. షోడషజనపథాల పాలనలోని వికృతస్వభావాన్ని చెప్పడానికి ఆ కావ్యాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు. ఈ కావ్యంలో బుద్దుడు, బింబిసారుడు, ఆమ్రపాలి మొదలైన పాత్రలన్నీ చారిత్రకాలే. అయినా వాళ్ళ గురించే చదువుకోవాలంటే చరిత్ర గ్రంథాలున్నాయి. షోడషజనపథాలకు చెందిన వైశాలినీ గణతంత్రరాజ్యంలో ఉండే గణభోగ్య ఆచారాన్ని ఈ కావ్యంలో వర్ణించారు. ఆమెను పెంచిన తల్లిదండ్రులు పడిన ఆవేదన కవి అద్భుతంగా వర్ణించారు. ఆ వర్ణనతో పాఠకుల హృదయం ద్రవించిపోతుంది. అలాంటి రసాత్మక స్థితిని కలిగించడమే సృజనాత్మక రచనల ప్రధాన లక్ష్యం. అందుకే ఈ కావ్యానికి సాహిత్య అకాడమీ బహుమతి కూడా వచ్చింది.
               అమరావతి రాజధానిగా పాలించిన వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు దారిదోపిడీలు, దొంగతనాలు చేస్తున్న సుమారు 500 మంది చెంచుల్ని ఊచకోత కోసి హత్యచేశాడు. అధికారిక గణాంకాల ప్రకారం ఐదువందలమంది. నిజానికి అంతంకంటే ఎక్కువ మంది ఉంటారనేది జనపథం మాట. అది 1794లో జరిగిన ఘోరసంఘటన. చెంచుల్ని చంపొద్దని రాజుతో వాదించిన వాడు ఆ ఆస్థానంలో సైన్యాధ్యక్షుడుగా ఉన్న భుజంగరాయుడు. అతడు ఒక మాదిగ జాతికి చెందిన వ్యక్తి. అతడు  సేనానిగా, మంత్రిగా వెంకటాద్రినాయుడి దగ్గరుండి ప్రజలకు సేవలందించాడు. అతడ్ని చరిత్ర గుర్తించవలసినంత స్థాయిలో గుర్తించలేదు. దానికి కారణం అతడు కింది వర్ణానికి చెందిన వాడు కావడమే ఒక ప్రధాన కారణం. కానీ, భుజంగరాయుడి చరిత్రను తవ్వుకుంటూ వెళ్ళితే అద్భుతం కలిగించే విషయాలు బయటపడతాయి.వీటిని డా చిలుమూరి శ్రీనివాసరావు ‘‘ మాదిగల చరిత్ర ` సంస్కృతి’’లో సవివరంగా ప్రకటించారు.
మన ఆంధ్రప్రదేశ్‌ రాజలాంచనంలో పూర్ణకలశం ఉంటుంది. ఇది అమరావతీస్తూపం మీద ఉండే పూర్ణఘటం. ఆంధ్రుల తొలిపాలకులు శాతవాహనుల కాలం నాటిది. దీనికి బౌద్ధమతశిల్పరీతిని జోడించి అమరావతీస్తూపంపై ఉంచారు. ఈ పూర్ణఘటం రూపశిల్పి పేరు విధిక. విధిక తండ్రి నాగన. ఆ కుటుంబానికి చెందినవాడే భుజంగరాయుడు. ఆచార్య కొలకలూరి ఇనాక్‌ ‘‘ ఆదిఆంధ్రుడు’’ పేరుతో రాసిన చారిత్రక కావ్యంలో ఇతివృత్తం అదే. భుజంగరాయుడి చరిత్రను ఊహకుతెస్తూ, ఎవ్వరి మాటా వినని చెంచులతో నిరాయుధుడిగా వెళ్ళి రాయబారం నిర్వహించడంలో భుజంగరాయుడి ధైర్యసాహసాల్ని వీర, అద్భుత రసాల్లో కవి వర్ణించిన సన్నివేశాలు శాశ్వతంగా పాఠకులకి గుర్తుండిపోతాయి.
ఇలాగే అల్లూరి సీతారామరాజు, తాండ్రపాపారాయుడు మొదలైన వాళ్ళ గురించి చారిత్రక కావ్యాలు వచ్చాయి. వీటిని కావ్యంగా రాయాలంటే చారిత్రక అంశాల్ని తెలుసుకోవడానికి రచయితకు పరిశోధన తప్పదు.అయినా వీటిని పరిశోధనలు అనలేం. ఇక్కడ మనం చర్చించుకోవాల్సింది ఒకటుంది. సృజనాత్మకరచనలో పరిశోధన ఉన్నా, దాన్ని మించిన అనుభూతి, భావుకతలే శాశ్వతంగా నిలిచిపోతుంటాయి. దానిలో వర్ణించిన పాత్రలూ, సన్నివేశాలూ నిజం కాదు. అవి కవి అపరబ్రహ్మగా మారి సృజించిన అంశాలు. సృజనాత్మక రచన చేయడానికి పరిశోధన దృష్టి అవసరమే, కానీ అదే పరిశోధన అనిపించుకోదు. కవిత్వం రాసేవాళ్ళకు విమర్శదృష్టి ఉన్నా, వాళ్ళలోను విమర్శకులు ఉన్నా, అవసరమైతే నియమాల్ని వ్యతిరేకించడానికీ వెనుకాడరు. అందుకనే నియతికృత నియమరహితాం, హ్లాదైకమయీ మనన్యపరతంత్రానామ్‌, నవరసరుచిరాం నిర్మతి మాదధతీ భారతీ కవేర్జయతి’’ అని మమ్మటుడు తన కావ్యప్రకాశంలో కవికి బ్రహ్మకంటే ఉన్నతమైన స్థానం ఇస్తున్నట్లు కనిపిస్తుంది.
చెప్పాల్సిన సందేశం ఇంచుమించు ఒకటే అయినా స్థల, కాలాల్ని, పాత్రలు, సన్నివేశాల్ని మార్పుచేసి మానవజీవితాన్వేషణ తత్త్వాన్నీ హెమింగ్వే ‘‘ ది ఓల్డ్‌ మ్యాన్‌ అండ్‌ సీ’’లోను, కేశవరెడ్డి ‘‘ అతడు అడవినిజయించాడు ’’ నవలికల్లో ఉదాత్తంగా వర్ణించారు. ఒక నవలికలో ముసలివాడు సొరచేప చంపడానికొస్తున్నా, దాన్ని పట్టుకొని ఒడ్డుకి తేవాలనుకుంటాడు. మరోనవలికలో ముసలివాడు రక్షించడానికి వెళ్ళినా, అదే తనని దగ్గరకు రానివ్వకపోయినా, దాన్నెలాగైనా కాపాడాలనుకుంటాడు. ఇంచుమించు ఇలాగే వినుకొండనాగరాజు రాసిన ‘‘ ఊబిలో దున్న ’’ నవల్లోనూ కనిపిస్తుంది. ఊబిలో నుండి దున్నను రక్షించిన తర్వాత అదే తనపై తిరగబడటం ఒక విషాధం. ఇవి రాయాలంటే కూడా రచయితలు పరిశోధన చేయాల్సిందే. కానీ, ఆ పరిశోధన సృజనముందు కనిపించదు. ఇలాంటివే గురజాడ అప్పారావు రాసిన ‘‘ కన్యాశుల్కం’’ నాటకం, ఆరుద్ర రాసిన ‘‘ కాటమరాజుకథ ’’ నాటకం వంటివి ఎన్నో ఉన్నాయి. 
               అయోధ్యలో బాబ్రీమసీదు కూలగొట్టిన తర్వాత చెలరేగిన మత సంఘర్షణల్ని తస్లిమా నస్రీన్‌ ‘‘లజ్జ’’ నవల్లో వివిధ పాత్రల పరంగా వర్ణించారు. నవల సగం వరకూ పాత్రలుగా కనిపించినా, తర్వాత  చారిత్రక నేపథ్యాన్ని చదువుతున్నట్లనిపిస్తుంది. ఒక పరిశోధన గ్రంథమేదో చదువుతున్న అనుభూతి కలుగుతుంది. పాకిస్తాన్‌ కుట్రని భగ్నం చేయడానికి భారత ప్రభుత్వం రాజనీతజ్ఞతను ఉపయోగించి బెంగాల్‌ రెండుగా విడిపోయి, దానిలోని కొంత భాగం బంగ్లాదేశ్‌ అనే దేశంగా ఏర్పడినా ఫర్వాలేదనుకుంది. ఆ వ్యూహంలో భాగంగానే బంగ్లాదేశ్‌ ఏర్పడింది. అప్పుడు  అక్కడి ప్రజలు తమ మాతృదేశం ఇండియాను వదిలి మరోదేశంగానో, మరోదేశంలోనో ఉండాల్సి వస్తుందని ఫీలయినట్లు రచయిత్రి నవల్లో వర్ణించారు. ఆ పరిస్థితుల్ని వర్ణించడంలో సరిహద్దు ప్రజల మానసిక సంఘర్షణ పాఠకుల్ని ఎప్పటికీ మరిచిపోకుండా చేయగలిగారు. 
ఇండియా వదిలి బంగ్లాదేశ్‌ వెళ్ళిపోయిన ముస్లిం, హిందూ జీవితాల్లో బాబ్రీమసీదు సంఘర్షణ తెచ్చిన విషాదం ఒకచోట మెజారిటీగా ఉన్న వాళ్ళు మరోచోటికి వెళ్ళేసరికి ఎలా మైనారిటీగా మారిపోయి దాడులకి గురవుతుంటారో ఈ నవల్లో తెలుస్తుంది. ఈ నవల ఇండియాలోని ముస్లిముల కంటే, బంగ్లాదేశ్‌లోని హిందువుల మైనారిటీభావనని లోకానికి చెప్పడానికి బాగా ఉపయోగపడింది. ఈ నవల్లో రెండు పరిశోధనాంశాలున్నాయి. బాబ్రీమసీదు చారిత్రక పరిణామాన్ని పాఠకులకి వివరించడం, రెండవది మైనారిటీ, మెజారిటీ భావనల్లో కనిపించే అభద్రత. ఆ భద్రతాభావం పుట్టుకొచ్చే పరిస్థితులు. కానీ, వీటిని శాస్త్రీయ నిరూపణల కంటే, మానసిక స్పందనాత్మక అనుభూతులకే ప్రాధాన్యతనిచ్చారు. ఇదే సృజనాత్మక రచనకు కావాల్సింది.
ఉన్నవలక్ష్మీనారాయణ ‘‘మాలపల్లి’’ నవల్లో 1922 నాటి భారత స్వాతంత్య్రోద్యమకాలం నాటి అనేక పరిస్థితుల్ని వర్ణించారు. సాంఘికపరిస్థితుల్ని వర్ణిస్తున్నా, కింది వర్ణాలుగా చెప్తున్న వాళ్ళలో చాలా తక్కువ మందిలో ఉండే శ్రీవైష్ణవమతాచారాల్ని ఆసరాగా చేసుకొని, దాన్ని జనరలైజ్‌ చేసి నవల ద్వారా క్రైస్తవప్రాబల్యానికి అడ్డుకట్టవేయాలనుకున్నారు. అందులో చాలా అంశాలున్నా, దాన్ని నాటి ప్రభుత్వం నిషేధాన్ని విధించడంలో అత్యంత ప్రభావాన్నేసిన అంశం మతపరమైందే! దానిలో తక్కెళ్ళజగ్గడు తిరుగుబాటు తత్త్వమో, జాతీయోద్యమాన్ని రగులు గొల్పడమనే అంశాలున్నా, మతపరమైన అంశాలతో పోలిస్తే  వీటి స్థాయి తక్కువే.
పరిశోధనలో అన్వేషణ ప్రధానం. కొత్త అంశాన్ని కనుక్కోవడం ముఖ్యం. ఇంకా లోతుల్లోకెళితే కొత్త విషయాల్ని కనిపెట్టడం పరిశోధనలో ఉండాలి. సాహిత్య పరిశోధనలో సత్యాన్ని అన్వేషిస్తారు. జీవితసత్యాల్ని రచనలతో సమన్వయిస్తారు. తొలినాళ్ళలో ‘‘సేకరణ’’ కూడా పరిశోధనగానే భావించేవారు. అందుకే తాళపత్రగ్రంథాల్ని సేకరించడం, లభించిన కావ్యాల్లోని పాఠాంతర భేదాల్ని గమనించి, సరైనదాన్ని గుర్తించడం పరిశోధనలో భాగంగా ఉండేది. సి.పి.బ్రౌన్‌ తన పండితుల ద్వారా అనేక తెలుగు కావ్యాల్ని సేకరించగలిగారు. ఆయన దగ్గర పని చేస్తున్న పండితులు కూడా బయటకు రాకుండా తొక్కి పెట్టడానికి ప్రయత్నించిన కవి వేమనను ప్రపంచానికి తెలిసేలా చేశాడు బ్రౌన్‌. సంస్కరణవాదిగా పేరు ప్రఖ్యాతులున్న కందుకూరి వీరేశలింగం చాలా మంది కింది వర్ణాల రచయితల్ని చేర్చకపోయినా, ‘‘ఆంధ్రకవుల చరిత్ర’’  రాయడానికి చాలా విషయాన్ని సేకరించాల్సి వచ్చింది. తాను రాసిన అన్ని సృజనాత్మక రచనలకంటే ఎక్కువగా శ్రమపడి రాసిన రచనగా తన ‘‘ ఆంధ్రకవుల చరిత్ర’’ గురించి చెప్పుకున్నాడు. నేటికీ ఇలాంటి పరిశోధన కొనసాగుతున్నా, దీనికంటే పరిశోధన పరిథి విస్తరించింది. సృజనాత్మకరచనల్లోని ‘‘సత్యాన్ని’’ శోధించే దిశలో పరిశోధనలు కొనసాగుతున్నాయి.
వివిధ భాషలు, కావ్యాలు, ప్రక్రియల్ని తులనాత్మకంగా పరిశీలించడం పెరిగింది. ఇప్పుడు సాహిత్య పరిశోధన కేవలం ఆధ్మాత్మిక సిద్ధాంతాలకే పరిమితం కాకుండా, సామాజిక, సాంస్కృతిక దృక్పథం వైపు పయనిస్తోంది. సాహిత్య పరిశోధనలో స్త్రీ వాద, దళిత,బహుజన, ముస్లిం ధోరణులు ప్రవేశించి, సాహిత్యం కూడా ఇతర శాస్త్రాల మాదిరిగానే విజ్ఞానాంశాల్ని బోధిస్తాయనే స్ఫృహని కలిగించగలుగుతున్నాయి.
 ‘అంటరానివసంతం’’లో చరిత్ర చెప్పాలని నవల రాశారా? చరిత్రని అనుభవానికి తేవాలనుకున్నారా? దీనిలో ఆదిమసమాజం నుండి ఆధునిక సమాజం వరకూ అంటరానివాళ్ళ జీవితాల్లోని అనేకపార్శ్వాల్ని అనుభూతిలోకి తెచ్చేప్రయత్నం చేశారు. బోయిజంగయ్య ‘‘జాతర’’ నవల్లో దేవుడి పేరుతో అమాయకులపై జరుగుతున్న దారుణాల్ని ఎండగట్టారు. ఈ నవలలు ఒకటి కోస్తా నుండి మరొకటి తెలంగాణ నుండి వచ్చాయి. భిన్న సమస్యల్ని శోధించే రాసినా, వీటిలో పరిశోధన కంటే, అనుభూతి ప్రధానమైంది.
మన తెలుగు సాహితీ విమర్శకులు, పరిశోధకులు సృజనాత్మక విమర్శ, సృజనాత్మక పరిశోధన అనే పదాల్ని అక్కడక్కడా ఉపయోగిస్తున్నారు. వచనరచన కళాత్మకంగా ఉండడాన్నే సృజనాత్మకమనే అనుకుంటున్నారా? సృజనాత్మక తత్త్వాన్ని గుర్తించే ఈ పదాల్ని ప్రయోగిస్తున్నారా? అనేవి అధ్యయనం చేయాల్సిన అంశాలు. ఇప్పటికే హెన్రీ లూయీబెర్గసన్‌ ( 1859 - 1941) ‘‘క్రియేటివ్‌ ఎవల్యూషన్‌’’ అనే గ్రంథంలో ఉనికిలో లేనిదాన్ని సృష్టించడం సృజనాత్మకత అంటూనే జీవశక్తి ( వైటాలిటీ) దీనికి కారణం అన్నారు. పాల్‌ డావ్‌సన్‌ ‘‘ సృజనాత్మక సాహిత్యం ’’ భావనలపై పరిశోధన చేసి డాక్టరేట్‌ కూడా పొందాడు. ఇతడు సాధన చేస్తే ఎవ్వరికైనా సృజనాత్మక శక్తి వస్తుందంటాడు. కానీ, సాహిత్యంలో, పరిశోధనలో ఉండేది కళా? సృజనాత్మకతా? అనే విషయాల్ని లోతుగా చర్చించాల్సిన అవసరం కనిపిస్తుంది. 
ఒకసారి మా యూనివర్సిటీకి ఒక ఆర్టిస్టు వచ్చాడు.వేలాది రకాల పక్షుల్ని  కలర్స్‌లో అందంగా గీసిన పెద్ద ఆల్బమ్‌ ఒకటి పట్టుకొని వచ్చాడు. ‘‘ఇన్ని రకాల పక్షుల్ని గుర్తించి, వాటి బొమ్మల్ని వేశాను. అయినా ఏ యూనివర్సిటీ డాక్టరేట్‌ ఇవ్వడం లే’’దన్నాడు. ఆ పక్షులున్నాయో లేదో గానీ, అంత చక్కగా ( ఊహించి ) వేసినందుకు అభినందిస్తున్నామనీ అన్నారట. మరికొన్ని యూనివర్సిటీల్లో చూపిస్తే, ఆ భావుకతకు డాక్టరేట్‌ కి సిఫారసు చేయొచ్చన్నారట. ఇది పరిశోధననీ, సృజనాత్మకతల్లోని భేదాన్ని గుర్తించడానికి సరిగ్గా సరిపోతుందనిపిస్తుంది.
-Dr.Darla Venkateswara Rao,
Assistant Professor, 
Dept .of Telugu, 
University of Hyderabad, (Central University), 
Gachibowli, Hyderabad-500 046 
e-mail: vrdarla@gmail.com 
Ph: 040-23133563 (O), Mobile: 09989628049,

No comments: