(కొమ్రన్న మరణాన్ని జీర్ణించుకోలేక నేను రాసిన వ్యాసాన్ని సూర్య దినపత్రిక 30.8.2010 న ప్రచురించారు. ఆ వ్యాసానికి నేను పెట్టిన పేరు తోనే దీన్ని ఇక్కడ అందిస్తున్నాను..దార్ల)
అర్ధాంతరంగా ఆరిపోయిన బహుజనుల ఆశాజ్యోతి ‘కొమ్రన్న ’
‘‘ ఈదేశంలో అన్ని భాషల్లో కలిపి సంవత్సరానికి ముప్పైవేల పై చిలుకు వ్యాసాలు రాయబడుతున్నాయి. అందులో కనీసం ఒక్కశాతం కూడ తొంబైశాతం వున్న చిన్న కులాల గురించి గాని, వారు చేస్తున్న అస్తిత్వపోరాటాలు, సాహితీ సంఘర్షణల గురించి పట్టించుకోవడం లేదు. ఈ సాంస్కృతిక విగతజీవుల అస్తిత్వ ఉద్యమాలను రోజూ వ్యాసాలు రాసే ఆధునిక వ్యాసులూ పట్టించుకోరు. సాహిత్యం, దాని ధోరణులు సమాజానికి భిన్నమైనవి కావు.’’ ఇవి బహుజన మేథావి ఆచార్య కొమ్రన్న అభిప్రాయాలు. కొమ్రన్న ఎవరని ఏ మాత్రం చైతన్యం ఉన్న బహుజనుణ్నడిగినా వెంటనే చెప్పేస్తాడు ` ఆయనొక ఉద్యమకారుడని, పీడిత వర్గానికి ఆశాజ్యోతని.ఆయన మెదడు సంబంధవ్యాధితో హఠాత్తుగా శుక్రవారం రాత్రి ( 20 `08`2010) చనిపోయారు.
ఈ వార్త తెలిసినవారంతా వారంతా ఆశ్చర్యపోయారు. విషాధంలో మునిగిపోయారు. ఆయనకేమాత్రం బి.పి. గాని, షుగర్ గాని లేదా మరేదైనా అనారోగ్యం ఉందని ఎవరూ ఊహంచనైనా ఊహించలేరు. అంత బలంగా కనిపించేవారు.సభలో ఆయన ఎంతో సంయమనంతో మాట్లాడేవాడు.ఆయన మాటగాని, రాత గాని బహుజన తత్త్వంతో నిండి ఉంటుంది. కుల ద్వేషంతో కాకుండా, కుల నిర్మూలన దిశగా బలహీన కులాలన్నీ ఏకంకావాలనే ఆశయం గలవారు.
ఆయన కూడా మనం పుట్టక ముందే నిర్ణయమైన ఒక కులంలోనే పుట్టారు.అది వెనుకబడిన తరగతులకు చెందిన ఒక ఉపకులం.వర్గపోరాటాల్ని విద్యార్ధి దశలో సమర్ధించినా, తర్వాత కాలంలో భారతదేశ పరిస్థితుల్ని బట్టి కులం కూడా దానికి తోడైనప్పుడే సమాజంలో అసమానతలు పోతాయనే నమ్మకం ఉన్న మేధావి. ఆయన స్వగ్రామం వరంగల్ జిల్లా, స్టేషన్‌ఘనాపూర్ మండలం కొండమీది. ప్రస్తుతం కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని ఒక పి.జి. కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసరుగా పనిచేస్తూ, హఠాత్తుగా చనిపోయారు.ఆయన పూర్తి పేరు కేశరాజు కుమార్. కానీ ఆయన్ని అందరూ ‘‘ కొమ్రన్న’’ అని పిలుస్తారు. రచనల్ని కూడా ‘‘ కొమ్రన్న’’ పేరుతోనే రాసేవారు.చాలా పత్రికల్లో రాసినా, సూర్య దినపత్రిక ఆయన రచనలకు అత్యధిక ప్రాధాన్యాన్నిచ్చిందనీ, తన భావజాలాన్ని ప్రకటించగలిగే చక్కని వేదిక దొరికిందని మాటల సందర్భంలో చెబ్తుండేవాడాయన. వృత్తిరీత్యా ఆంగ్ల ఆధ్యాపకుడైనా, తెలుగు ప్రజలకు తన భావాలు చేరువకావాలని తెలుగులోనే సాహిత్య, సామాజిక వ్యాసాల్ని అనేకం రాశారు.వివిధ పత్రికల్లో జరిగే చర్చల్లో పాల్గని బహుజనవాణిని బలమైన గొంతుతోనే వినిపించేవారు.
కొమ్రన్న పత్రికల్లో రాసిన వ్యాసాల్ని నాలుగు రకాలుగా విభజించవచ్చు. తన కులం ఒకటిగా ఉన్న వెనుకబడిన తరగతుల అభివృద్ధి గురించి రాసిన వ్యాసాలు.రెండు బహుజన వాదానికి బలం చేకూర్చే ఉద్యమంలో భాగంగా అణగారిన, అణచివేతకు గురౌతున్న కులాల గురించి, మూడు ప్రాంతీయ అసమానతలను పోగొట్టడానికి శాస్త్రీయమైన వాదనలను ముందుకి తీసుకురావడం, నాలుగవది, అత్యంత ముఖ్యమైంది, రాజ్యాధికార దిశగా బలహీన వర్గాలు అనుసరించాల్సిన వ్యూహాల్ని వివరించడం. ఈ దిశగా సాహిత్యాన్ని కూడా సామాజిక చైతన్యానికి ఒక మార్గంగా ఎన్నుకున్నారు. ‘‘ మా బోనులోకి మరో సింహం’’ పేరుతో ముస్లిం రిజర్వేషన్లను ఆహ్వానిస్తూ శ్రమ గౌరవ ఉత్పత్తి కులాల వారి కవితలను 2008 లో ఒక కవితా సంకలనంగా తీసుకొచ్చారు. దీనిలో ఎంపిక చేసిన కవితల్ని, వారి వ్యాసాల్ని, వారి ఉపన్యాసాల్ని, వారి రాజకీయ ఆచరణను పరిశీలించిన వారికి ఆయనొక బహుజనతాత్త్వికుడుగాస్పష్టమవుతుంది. ఇప్పుడెంతో బలంగా కొనసాగుతున్న తెలంగాణ ఉద్యమం గురించి కూడా ఒక సామాన్యుడిలా కాకుండా, గొప్ప మేధావిగా కొమ్రన్న తన భావజాలాన్ని వ్యక్తీకరించారు. నిజాం నవాబుల పాలన, ఆపేరుతో జరిగిన అకృత్యాల పట్ల ఎవరేమనుకున్నా, ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు మాట్లాడకుండా వాదించాడు. షెడ్యూల్డు కులాల్లోని వర్గీకరణ వాదాన్ని సమర్ధించాడు. దళితులై ఉండి మళ్ళీ దళితుల్లో జరుగుతున్న అన్యాయాల్ని ప్రశ్నిస్తూ వచ్చినకైతునకల దండెం గురించి నిష్పాక్షికంగా పెద్ద సమీక్ష రాసిన ఏకైక రచయిత కొమ్రన్న. తెలంగాణ కోసం ప్రాణాన్ని త్యాగం చేసిన సురేంద్ర మాదిగ పై వచ్చిన పుస్తకాన్ని సమీక్షించింది కూడా కొమ్రన్న. ఆశ్రిత కుల వ్యవస్థలో గల కొత్తకోణాల్ని బహిర్గతం చేసిన వాడు కొమ్రన్న. ముస్లింల రిజర్వేషన్లను సమర్ధించారు. ప్రతి ముస్లింనీ ఒక బిన్ లాడెన్‌గా ముద్ర వేయడం మంచిది కాదన్నారు. దళిత స్త్రీవాదాన్ని సమర్ధవంతంగా ప్రొతహించిన వారు. ఆయన సంకలనం చేసిన ‘‘ మా బోనులోకి మరో సింహం’’ పుస్తకానికి రాసిన ముందుమాటలో అభ్యుదయనిరోధక శక్తుల్ని బలంగా తిప్పికొట్టేప్రయత్నం చేశారు. ఈ కవితా సంకలనంలో కొమ్రన్న రాసిన ‘‘ తురకై, దేశ సమగ్రతకే సవాలై...’’ కవితలో ఒకప్పుడు మాతోనే కలిసిమెలిసి జీవించిన ముస్లిం ఉగ్రవాదం జడలువిప్పిన తర్వాత ఒక్కసారిగా దేశసమగ్రతకే ముప్పువాటిల్లిన వాడిగా ఒక్కసారిగా ఎలా మారిపోయాడని నిలదీశారు.
‘‘ నా చిన్నప్పటి నుండి ఒక్క కంచంలో తిని ఒక్క మంచంలో పన్నోడు/ ఇపుడు సడన్‌గా తురకై, దేశసమగ్రతకే సవాలైండు.../ పనిపాటల్లో, ఎండవానల్లో నాతో జీవితం పంచుకున్నోడు/ నేను మడుగులు గుప్పుతుంటే, వాడు జెల్లలు, పరుక పిల్లలు ఏరినోడు/ వాని సున్తిపండుగకు అబ్బ చేసిన బిర్యాని దాచి నాకిచ్చినోడు/హోళీ పండుగకు నా గుంపులో తిరుగుతు మోదుగుపూల రంగు జల్లుకున్నోడు/ మా అవ్వ సద్దులకు చేసిన అప్పాలని అడిగి అడిగి తిన్నోడు/ వాళ్ళ అమ్మి చేసిన ఆప్యాయపు సేమ్యా పాపడాలు నాకు పెట్టినోడు/ ఇపుడు సడన్‌గా తురకై, దేశసమగ్రతకే సవాలైండు..’’ అని మతసమైక్యత పేరుతో జరుగుతున్న కుట్రను వ్యంగ్యంగా బహిర్గతం చేశారు కొమ్రన్న. నిజమైన సామాజిక న్యాయాన్ని సమర్ధించే దార్శినిక దృష్టిని మరింత వేగవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఉత్సాహంగా పనిచేస్తున్న తరుణంలోనే బలహీన వర్గాల ఆశాజ్యోతి అర్ధంతరంగా ఆరిపోయింది.
దళితుల్లో చైతన్యం తేవడానికి తీవ్రంగా ప్రయత్నించిన వాళ్ళెందుకిలా హఠాత్తుగా చనిపోతున్నారో అనిపిస్తుంది. మాదిగ సాహిత్యాన్ని ఒక కెరటంలా ఎగిసిపడేలా చేసిన నాగప్పగారి సుందర్రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ ప్రాంతం నుండి చిన్న వయసులోనే గొప్ప ప్రభావాన్ని వేసిన వాగ్గేయకారుడు గ్యార యాదయ్య హఠాత్తుగా చనిపోయాడు. క్రైస్తవ జీవితంలో ఉంటూనే దానిలోనూ ప్రవేశించిన కులాన్ని ప్రశ్నించిన అంబేడ్కస్ట్ మద్దెల శాంతయ్య అనారోగ్యంతో చనిపోయాడు. వర్గ పోరాటంతో సమసమాజం వస్తుందని ఆశించి, ఆ పోరాటంలో భాగస్వామిగా మారిన తర్వాత అనుభవంలో కులాధిక్యతను గమనించి, దాన్ని నిలదీసిన శంబుక ( పత్తిపాటి మల్లేశ్వరరావు)ని హత్య చేశారు. ఈటెల్లా, తూటాల్లా దళిత కవితల్ని అల్లిన మద్దూరి నగేష్‌బాబు అనారోగ్యంతో చిన్న వయసులోనే చనిపోయాడు. ఇంకా ఇలాగే చాలా మంది స్ఫూర్తిని రగిలించి, బలహీన వర్గాల్లో కొత్త ఆశను కలిగించిన వాళ్ళు ఇలా హఠాత్తుగా చనిపోవడం బాధాకరం. ఇలాంటి పరిస్ధితి అన్నల శిభిరంలో నిత్యం విషాదమై అలముకుంటుంది. కొంచెం కన్నీళ్ళో , పిడికెడు పుష్పాలో, ఒక పాటో, ఒక కవితో, కాస్త నిట్టూర్పో, గడ్డ కట్టిన కన్నీళ్ళుగా నిలిచిపోవడమో జరుగుతుంటుంది. ‘‘ బతుకంతా/ స్మృతి గీతాలు రాయడమే అయ్యింది/ గట్టుకు కట్టెలు మొయ్యడమే అయ్యింద’’ని కవి హిమజ్వాల అన్నట్లు వీరి జీవితాల గురించి దు:ఖించే పరిస్ధితి దాపరించడానికి కారణమేంటిని ఆలోచించాల్సిన సమయమాసన్నమైంది. ఇంత వరకూ పైన చెప్పుకున్న వాళ్ళంతా దళితుల్లో ఇంచుమించు మొదటితరానికి చెందిన కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళే. ఒక్కసారిగా ఆయా రంగాల్లో జరుగుతున్న అన్యాయాల్ని కళ్ళారా చూసిన వాళ్ళే. ఆ అన్యాయానికి కదిలిపోయిన వాళ్ళే. ఆ అన్యాయాన్ని తమదైన రీతిలో స్పందించిన వాళ్ళే. ‘‘పుట్టరాని చోట’’ పుట్టి తమ ప్రతిభాపాటవాల్ని ప్రదర్శించలేని నిస్సహాయస్థితిలోకి నెట్టబడ్డవాళ్ళే. అందుకే ఆ ఆవేదన, ఆ సంఘర్షణ తమని మనశ్శాంతిగా ఉండనివ్వని పరిస్థితిల్లోకి నెట్టేస్తుంది. చాలా మంది పేరు ప్రఖ్యాతులచ్చిన తర్వాత వ్యక్తిగతమైన ప్రతిష్టలకు పోయి, వ్యవస్థ నిర్మాణాన్ని విస్మరించడం వల్ల కూడా ఇలాంటి అనర్ధాలకు కారణంగానే భావించాలేమో అనిపిస్తుంది. ఈ దిశగా దళితులు, బహుజనులు సత్వరమే ఆలోచించకపోతే మరింతమంది మేథావుల్ని కోల్పోకతప్పదు.కొమ్రన్న మరణం యావత్తు బహుజన, శ్రామిక వర్గాలకు తీరని లోటు.
-డా॥ దార్ల వెంకటేశ్వరరావు
Address:
Dr.Darla Venkateswara Rao
Assistant Professor,
Department of Telugu
School of Humanities,
UNIVERSITY OF HYDERABAD
Gachibowli, Hyderabad. A.P.,India
Phone: 040-23133563 (O),
Mobile: 09989628049
2 కామెంట్‌లు:
డా.దార్ల గారూ...,మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు
హారం
thank you sir,
komranna meeda mee abimaananiki thanks
E.VENKATESH
PSTU-HYD
కామెంట్‌ను పోస్ట్ చేయండి