"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

15 ఫిబ్రవరి, 2010

డా.దార్ల వెంకటేశ్వరరావు పరిచయం



   డా.దార్ల వెంకటేశ్వరరావు
 శ్రీమతి పెదనాగమ్మ, లంకయ్య దంపతులకు ఉపాధ్యాయ దినోత్సం నాడు తూర్పుగోదావరి జిల్లా, చెయ్యేరు అగ్రహారంలో జన్మించిన వెంకటేశ్వరరావు, కోనసీమలోనే  ప్రాథమిక విద్యను అభ్యసించారు. శ్రీబానోజీరామర్స్‌ కళాశాల, అమలాపురం (1995)లో ఇంటర్మీడియట్‌ నుండి బి.ఏ., ( స్పెషల్‌ తెలుగు) వరకు చదువుకున్నారు.

    యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాదు ( సెంట్రల్‌ యూనివర్సిటి)లో  ఎం.ఏ., తెలుగు (1997); ఎం.ఫిల్‌., ( 1997);  పి హెచ్‌.డి., (2003) చేశారు. ఆచార్య ఎస్‌.శరత్‌ జ్యోత్స్నారాణి గారి పర్యవేక్షణలో  జ్ఞానానందకవి ఆమ్రపాలి పరిశీలన పేరు చేసిన పరిశోధనకు ఎం.ఫిల్‌.; ''పరిశోధకుడుగా ఆరుద్ర ' పేరుతో చేసిన పరిశోధనకు పిహెచ్‌.డి., పట్టాలను అందుకున్నారు. నిజాం కళాశాల (ఉస్మానియా విశ్వవిద్యాలయం)లో సంస్కృతంలో డిప్లొమా (1997),  తెలుగు లింగ్విస్టిక్స్‌ అండ్‌ లాంగ్వేజ్‌ టీచింగ్‌ లో పి.జి.డిప్లొమా ని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం (2000) లో చేశారు. వీటితో పాటు  డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం (2005) లో ఎం.ఏ., (సోషియాలజీ) చేశారు.

    ఆంధ్రవిశ్వవిద్యాలయం పరిధిలో బి.ఏ., స్పెషల్‌ తెలుగు ఫస్ట్‌ర్యాంకు సాధించిన వారికిచ్చే కళాప్రపూర్ణ జయంతి రామయ్య పంతులు స్మారక బహుమతిని, కందుకూరి వీరేశలింగం, శ్రీమతి రాజ్యలక్ష్మి స్మారక బహుమతుల్ని అందుకున్నారు. వీటితో పాటు శ్రీ కోనసీమ భానోజీరామర్స్‌ కళాశాల వారు కాలేజీ ఫస్ట్‌ వారికిచ్చే నండూరి వెంకటరామయ్య, కుటుంబలక్ష్మి స్మారక బహుమతుల్ని సాధించారు.

    విద్యార్ధిగా మెరిట్‌ స్కాలర్‌ షిప్ఫుతో పాటు, యు.జి.సి., రీసెర్చ్‌ ఫెలోషిప్‌ని పొందారు. పరిశోధన చేస్తుండగానే ప్రభుత్వ , డిగ్రీ కళాశాలల్లో పోటీ పరీక్ష ద్వారా ఏకకాలంలో (2001) అధ్యాపకుడుగా ఎంపికయ్యారు. ఆ తర్వాత( 2004 నుండీ) హైదరాబాదు సెంట్రల్‌ యూనివర్సిటీలో అసిస్టెంటు ప్రొఫెసరు, అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేసి, ప్రస్తుతం ప్రొఫెసర్  పనిచేస్తున్నారు.

    విద్యార్ధి దశ నుండే వివిధ పత్రికల్లో కవితలు, వ్యాసాలు రాసే అలవాటున్న వెంకటేశ్వరరావు, హైదరాబాదు సెంట్రల్‌యూనివర్సిటీలో చేరిన తర్వాత ఆకాశవాణి, హైదరాబాదు కేంద్రం, యువవాణి విభాగంలో కొంతకాలం పాటు క్యాజువల్‌ (క్యాంపియర్‌) ఎనౌన్సర్‌గా పనిచేశారు.ఆ నాటి నుండి నేటి వరకు ఆకాశవాణిలో అనేక కవితలు, సాహితీప్రసంగాలు చేస్తున్నారు. పరిశోధన విద్యార్థిగా ఉన్నప్పుడే సివిల్‌ సర్వీసెస్‌ అభ్యర్థులకు తెలుగు సాహిత్యంలో శిక్షణనిస్తూ, దూరదర్శన్‌లో కూడా ప్రసంగాలిచ్చారు.

    వివిధ విశ్వవిద్యాలయాల్లో జరిగిన జాతీయ సదస్సుల్లో  సుమారు 32 పరిశోధన పత్రాలను సమర్పించారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ''వాఙ్మయి'', తెలుగు అకాడమీ వారి '' తెలుగు వైఙ్ఞానిక మాసపత్రిక'',  ద్రావిడ విశ్వవిద్యాలయం వారి 'ద్రావిడి' వంటి పరిశోధన పత్రికలు, ప్రత్యేక సంచికలు, దినపత్రికల్లో సుమారు 45 పరిశోధన, విమర్శ పత్రాలు ప్రచురితమైయ్యాయి.

    ఇవ్పటివరకు కవిత్వం, విమర్శ, పరిశోధనలకు సంబంధించి పది పుస్తకాలను ప్రచురించారు. మాదిగచైతన్యం (1997) సంపాదకత్వం, సాహితీ మూర్తుల ప్రశస్తి ( 1998) సహ సంపాదకత్వం, జ్ఞానానందకవి ఆమ్రపాలి పరిశీలన(1999) పరిశోధన, దళితతాత్త్వికుడు (2004) కవిత్వం,సృజనాత్మక రచనలు చేయడం ఎలా? ( 2005) విమర్శ, సాహితీసులోచనం (2006) విమర్శ, ఒక మాదిగస్మృతి -నాగప్పగారి సుందర్రాజు ( 2007) మోనోగ్రాఫ్‌, దళితసాహిత్యం: మాదిగదృక్పథం (2008) విమర్శ, వీచిక (2009) విమర్శ, పునర్మూల్యాంకనం (2010)  విమర్శ  గ్రంథాల్ని ప్రచురించారు.మరో మూడు గ్రంథాలు ప్రచురణలో ఉన్నాయి. ఈయన కవిత్వం త్వరలో ఆంగ్లం, కన్నడ భాషల్లో వెలువడనుంది.

    డా||వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో ఇప్పటి వరకు ఎనిమిది ఎం.ఫిల్‌.,పరిశోధనలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈయన పర్యవేక్షణలో ఆరుగురు  పిహెచ్‌.డి.,  పరిశోధనలు చేస్తున్నారు.

    చిన్ననాటి నుండే సాహిత్యాభిలాష గల వెంకటేశ్వరరావు వ్యాసరచన సోటీలో భారతీయ సాహిత్య పరిషత్‌ రాజమండ్రిలో జరిగిన రాష్ట్ర మహాసభల్లో  రాష్ట్రస్థాయి ప్రథమ బహుమతి (1996) ని అందుకున్నారు. సాహిత్యానికి ఈయన చేస్తున్న కృషికి గుర్తింపుగా భారతీయ దళిత సాహిత్య అకాడమీ, న్యూఢిల్లీ వారు 2007లో డా||బి||ఆర్‌|| అంబేద్కర్‌ పురస్కారంతో సత్కరించారు.

    బహుజన కెరటాలు, విద్య మాసపత్రికలకు సంపాదక వర్గ సభ్యులుగా, మాదిగసమాచారలేఖ మాసపత్రిక గౌరవసంపాదకులుగా, సొసైటీ అండ్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్టు సలహాదారుగా ఉన్నారు.జ్యోత్స్నాకళాపీఠం, తెలుగు సాహిత్య వేదిక, మాదిగ సాహిత్య వేదిక వంటి సాహిత్య సాంస్కృ    తిక సంస్థల్లో కార్యవర్గసభ్యుడుగా పనిచేశారు.

    ఆచార్య పరిమిరామనరసింహం గారి సూచనలతో యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాదులో ఎం.ఏ., తెలుగు విద్యార్థులకు ''దళితసాహిత్యం'' ఒక ఆఫ్షనల్‌ కోర్సుగా పఠ్య ప్రణాళికను రూపొందించి 2005 నుండీ బోధిస్తున్నారు.వీటితో పాటు తెలుగు సాహిత్య విమర్శ, సౌందర్యశాస్త్రం,  తులనాత్మక  కళాతత్త్వశాస్త్రం కోర్సులను బోధిస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాదు వారు దూరవిద్య ద్వారా బోధించే జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్స్‌ కోర్సు పి.జి. డిప్లొమా విద్యార్థులకు రెండు పాఠాలను రాశారు.    యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాదులో ఐదు సంవత్సరాల ఎం.ఏ. కోర్సు (ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్స్‌ డిగ్రీ) తెలుగు విభాగం కోర్డినేటర్‌గా సేవలందించారు.

    ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాదు, తెలుగు శాఖలో అసిస్టెంటు ప్రొఫెసరుగా పనిచేస్తూ,  ''తెలుగు సాహిత్యంలో మాదిగల సామాజిక, సాంస్కృతిక  అధ్యయనం'' అనే అంశంపై యు.జి.సి వారి మేజర్‌ రీసెర్చ్‌ ప్రాజెక్టు, ''గుర్రం జాషువ పదప్రయోగకోశ నిర్మాణం'' వంటి ప్రాజెక్టులు  చేస్తున్నారు.

    ఈయన రచనలను ఎప్పటికప్పుడు ఇంటర్నెట్‌ (http://vrdarla.blogspot.com/) లో అందుబాటులో ఉంచడంతో పాటు, దానిపై చర్చలు చేస్తుంటారు. విద్యార్ధులకు బోధించే కోర్సు వివరాలు, మెటీరియల్‌ కూడా  ఇంటర్నెట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకొనే వీలుకల్పిస్తుంటారు.

కామెంట్‌లు లేవు: