"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

06 నవంబర్, 2009

దళిత కవి నిబద్ధతను నిలదీసిన మరో దళిత కవి కవితా కరపత్రం!

(మాజీ ముఖ్యమంత్రి వై. యస్. రాజశేఖర రెడ్డి దుర్మరణం చెందిన తర్వాత చాలా మంది తెలుగు కవులు తమ ఫీలింగ్స్ ని వ్యక్తం చేస్తూ స్మృతి కవితలు రాశారు. వాటిని ద్రవిడ విశ్వవిద్యాలయం వారు వివిధ భాషలలోకి అనువాదం చేసి కూడా ప్రచురించేపనిలో ఉన్నట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఒక దళిత కవి జి. కె. డి. ప్రసాద్ మరో దళిత కవి శిఖామణి ని ప్రశ్నిస్తూ ఒక కవితా కరపత్రాన్ని చాలా మందికి Private Circulation గా అందించారు. దీన్ని దళిత సాహిత్య చరిత్ర పరిణామాన్ని అంచెనా వేయడానికి ఉపయోగిస్తుందనే ఆలోచనతో ఆ కవి అనుమతితో ఇక్కడ ఉంచుతున్నాను. )

దళిత కవీ... నీ చిరునామా?

మీకు ’ మువ్వల చేతికర్ర’ తెలుసుకదా!
దీనికి “దండోరా” అంటే మహాభయం
ఐనా అది మూగబోయింది

నాడు “చిలక్కొయ్య”
మనల్ని చిద్విలాసం చేయించింది కదా!
అది కాలి పోయింది
చిరిగిన చొక్కాను తగిలిస్తేనే
బూడిదయి రాలిపోయింది

“ పూల బాలుడు” మద్యం సీసాలను
అమ్ముకుంటున్నాడిప్పుడు
జెర్రిపోతులాంటి “ ఆ బాప్పజడ”
బోడిగుండయిందిప్పుడు
కారంచేడు, చుండూరుల్లో
పుట్టదిక

తొలినాటి “ హోరుగాలి”
నల్లమల అడవుల్లోనే నక్కింది
పావురాల గుట్ట పై ఆవరించింది
నిక్షేపాల కోసం “తవ్వకం” మొదలెట్టింది
“తాత్త్విక సౌందర్యం”తో
రెడ్ లైట్ ఏరియాల్లో రెపరెపలాడుతోంది

కవిలో ఆత్మ చచ్చినప్పుడు
సమాంత “రమ్ము”గా
“వ్యాసం” వస్తోంది
కొంచెం నత్తయినా కాని
ఎత్తులు తెలుసుకొని
పీఠాలెక్కుతోంది
ఉద్యమాన్ని “మద్యం” చేసి
బిరడా బిగించింది
మాధ్యమాల్లో మరో రకం
బ్రాండ్ గా బయట పడుతోంది
ఆంజనేయుని చేతిలో సంజీవిని కాదిది
అనామకుని నోటిలో పందుంపుల్ల
రెండు బద్దలు చేసి నాలుగ్గీసుకొని
బయట పారేయాలి

నల్లగేటు దగ్గర .....
నందివర్థనం చెట్టు
ఇప్పుడు గన్నేరు పూలు పూస్తోంది
ఇప్పుడు కిర్రుచెప్పుల భాష
శుద్ద గ్రాంథికమయ్యింది
తలతెగిన శంబూకుని మొండెంలా
గిలగిల కొట్టుకొని అదృశ్యమైంది
ఇప్పుడు పాతాళ గంగ
మన పాదాల కింద నుంచి కాకుండా
మన ప్రాపకంలా ప్రవహిస్తోంది

నువ్వు ప్రోత్సహించి ప్రేరేపించిన
యువకవులు “ యవ్వనం” కోల్పోతున్నారు
నపుంసకులుగా తీర్చిదిద్దకన్నా... ....
దళిత కవులు దళారీలవుతారు
ఏ దినమో “బాడుగ కవులు”గా
పత్రికల్లో పతాక శీర్షికలవుతారు

అప్పుడు ... ..... .....
ఈ నయవంచక చాతుర్వర్ణలోకంలో
మన అవయవాలను అమ్మేసుకుంటుంది
అస్థిపంజరాలను చేసి
ఏ విఠలాచార్య మ్యూజియంలోనో
నిలబెట్టేస్తుంది


ఉద్యమం " ఉద్యోగాల - సంపాదన" కు
పరిమితమయి పోతే ఎలాగన్నా……….
పదవుల పాకులాటలో
పెదవులు మూత పడిపోవా?
" కవి కలం" రవికలిప్పుతే
" మన పగ" పడకలేస్తే…
అక్రమ సంతానం సంఖ్య అధికమయిపోదూ…!

కథా వస్తువు కల చెదురుతోంది
ఇతివృత్తం వీధుల్లో
మళ్ళీ మన మూతికి ముంతే
ముడ్డికి తాటాకే
పాత కాలాన్ని
కొత్త సీసాల్లోకెక్కించడం
నేరమే…!
మనకైనా ఎతిక్స్ వుండాలి కదా!

కుసుమ ధర్మన్న కుమిలిపోతాడేమో
జాషువా జాలి పడాతాడేమో
బోయి భీమన్న … బోరున విలపిస్తాడేమో
ఈ పాపులను క్షమించండంటూ
నగేష్ బాబు " నరకలోక ప్రార్థన" చేస్తాడేమో
నీ కెంతటి స్నేహితుడైనా కాని
మద్దిల శాంతయ్య
" ఓ. సీ. క్రీస్తు" ను నిన్ను ఓదార్చమని
మోకరిల్లతాడేమో..

బొటన వేలును చూపుడు వేలును కలిపి
కీర్తించే అక్షరాలు
పదపుష్పాలై, భావ వాక్యాలై
మహోన్నత ప్రజాస్వామ్య మాలలుగా
అంబేద్కరుని మెడలో వికసించాలి
అక్కడే ఆగాలి … అవును … అవి అక్కడే ఆగాలి

దళితుల జీవితాలే ఒక విషాదగీతమైనప్పుడు
కొత్త " ఎలిజీ" లెందుకు
భవిష్యత్ భద్రత కోసం సరికొత్త మజిలీలెందుకు

జాతిని బతికిద్దాం – నీతిని పెంచుదాం
దళిత రాజ్యాధికారాన్ని కాంక్షిద్దాం

- జైభీములన్నా…మీకు జైభీములు …..

స్వర్గీయ వై. యస్. రాజశేఖర రెడ్డి గారి స్మృతి కవితా సంకలనానికి ప్రముఖ దళిత కవి " శిఖామణి" గారు " పరోక్ష సారధ్యం" వహిస్తున్న సందర్భంగా… అన్నగారికి కవితాభినందనలు
నమస్కారాలతో…. జి. కె. డి. ప్రసాద్ (ఫోన్ : 939 311 1740)

కామెంట్‌లు లేవు: