"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

04 మే, 2009

తొలి దళిత గేయమా నీ జాడెక్కడ?

( విశాలాంధ్ర సాహిత్యానుబంధం లో 4-5-2009 న ప్రచురితమైన వ్యాసం)

-డా// దార్ల వెంకటేశ్వరరావు

శ్రమించేటప్పుడు పాట పుట్టింది. శ్రమను మరచి పోవటానికి ఊతమిచ్చే రాగాల నుండి పాట పుట్టింది. వ్యాక్తావ్యక్త భావాల్ని లయాత్మకంగా నింపుతూ పాట పుట్టింది. జన చైతన్యం కోసం పాట ఉపయోగపడుతుంది. అలాగే దళితులు తమ బాధల్ని, గాధల్ని స్వేచ్ఛగా వ్యక్తీకరించుకొనే సాధనంగా పాట మొదట్లో మౌఖికంగానే ప్రారంభమైంది. తర్వాత దశలో దళితుల్లో చైతన్యం కలిగించడానికి ఒక ప్రధాన వాహికగా మారింది. "గేయం' సంస్కృత సమం. "పాట' దేశ్యం. కనుక దళితుల "పాట' పాడుకున్నా, గేయమాలపించినా రెండిటినీ దళిత గేయంగానే సంభావించవచ్చు.

ఆది మానవుడు ఆరంభించిన పని నుండే పాట పుట్టిందని చెప్పడం బాగానే ఉంటుంది. కానీ, ఫలాన సంవత్సరం నుండే దళిత గేయాన్ని గుర్తించవచ్చని ఖచ్చితంగా చెప్పాలంటే పరిశోధన చేయాల్సిందే. అలా పరిశోధన చేసిన వాళ్ళు తొలి దళిత గేయాన్ని 1909 లో వెలువడిందని, అది ""మాల వాండ్ర పాట'' అనీ చెప్తున్నారు. దాన్ని ఒక అజ్ఞాత కవి రాశాడు. ""అజ్ఞాతాన్ని'' లోతుగా విశ్లేహించుకోవలసిన అవసరం ఉంది. 1909 సంవత్సరంలో ఆంధ్ర భారతి (భాద్ర పద మాస పత్రిక) ""మాల వాండ్ర పాట'' ను ప్రచురించింది. కర్తృత్వం ఎవ్వరో తెలియట్లేదు. గేయాన్ని మాత్రం పరిశీలిస్తే అందరూ హిందువులుగానే పుట్టినా, బ్రాహ్మణుల కంటే దళితులెలా తక్కువయ్యారనే ప్రశ్నలు రేకెత్తుతాయి. నిజానికి దళితులు కూడా హిందువులే అనే దృక్పథంతోనే గేయం కొనసాగుతుంది.

అందారు పుట్టిరి హిందమ్మ తల్లీకి

అందారు ఒక్కటై ఉందారి సక్కంగ!!

కష్టమ్ము లొచ్చీన నిష్టూర మొచ్చీన

ఇష్టమ్ము గానుండి కట్టూగ నుందాము!! !!అందా!!

ఎట్టాగూ యెక్కూవ బ్యామ్మర్లు మాకంటె

ఎట్టాగూ యెక్కూవ యేరైన మాకంటె!! !!అందా!!

వర్ణాల యెక్కూవ పుట్టంగ లేదయ్య

మమ్మేల క్రిందీకి కుమ్మేరు మానోరు!! !!అందా!!

వేదాలు మాన్యారు ఇంగ్లీషు చదివారు

ఎగబడు చున్నారు ఎట్టి వృత్తులకైన!! అందా!!

మతముచ్చు కుంటేను మావోడ వంటారు

మతముచ్చు కోకుంటే మాలోడ వంటారు!! !!అందా!!

సోపెట్టి కడిగితే శుబ్రమౌ నంటారు

సోపెట్టి కడుగూకొ శుబ్రంగ నుంటాము!! !!అందా!!

సారాయి తాగాము సక్కంగ నుంటాము

వేదాలు సక్కంగ ఇనిపించుతామయ్య!! !!అందా!!

హిందూల మౌమమ్ము మందూల మానవద్దు

హిందూల మౌయిప్డు ముందూకు వస్తాము!! !!అందా!!

తమ్మూలంమనిమీరు మమ్మూల జూడండి

అమ్మోరు దీవించి అయిశ్వర్య మిచ్చును!! !!అందా!!

గేయంలో ముఖ్యమైన విషయాల్ని మాత్రమే ఉటంకించాను. స్థలభావం వల్ల గేయాన్ని పూర్తిగా రాయలేదు. దీన్ని నిజంగా దళితులే రాశారో లేదో కూడా చెప్పలేం. అయితే 1909 ప్రాంతం నాటి పరిస్థితుల్ని చూసినట్లయితే, అప్పటికి భారత స్వాతంత్ర్యోద్యమం ఉధృతంగానే కొనసాగుతుంది. క్రైస్తవ మత ప్రాబల్యం కూడా బాగానే పెరిగి పోయింది. అగ్ర వర్ణాల వాళ్ళప్పటికే తమ బతుకుల్లో కొత్త కాంతులు వెతుక్కుంటూ వంశ పారంపర్యంగా వస్తున్న అనేక కుల వృత్తుల్ని వదిలేస్తున్నారు. కొత్త అవకాశాల్ని అన్వేషిస్తున్నారు. ఆంగ్లేయ విద్యా ప్రభావం వల్ల కింది వర్ణాల వాళ్ళు కూడా బాగానే విద్యావంతులవుతున్నారు. ఇలాగే క్రైస్తవీకరణ జరిగితే కింది వర్ణాల వాళ్ళల్లోనూ చైతన్యం మరింత పెరిగే అవకాశం ఉంది. అందువల్ల ""మాలవాండ్ర పాట'' పేరుతో ఎవరో ఒక గేయాన్ని రాసి, గాంధీ సంస్కరణోద్యమంలో దళితుల్ని కూడా భాగస్వామ్యం చేయాలని ప్రయత్నించి ఉంటారు. అది నిజంగా దళితులు రాసిన తొలి దళిత గేయమే అని కొంతమంది పరిశోధకులు అభిప్రాయ పడుతున్నా, దానిలో హిందూ మత నిరసన కంటే మతం పట్ల ఆరాధన భావమే ఎక్కువగా కనిపిస్తుందని గుర్తించలేదని లోతుగా పరిశీలిస్తే తెలుస్తుంది.

నిజానికి ఈగేయంలో దళితుల్ని హిందువులుగా పరిగణించాలని ఆశిస్తున్నట్లు, అంతే కాకుండా అన్నదమ్ములుగా కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు కనిపిస్తుంది. అలా జరిగితే అప్పుడు వేదాల్ని పరిరక్షిస్తామని దానికి ""అమ్మోరు'' దీవించాలని అభిప్రాయపడుతున్నట్లూ ఉంది. భావాలన్నీ ఆంగ్ల విద్యా ప్రభావం విస్తృతంగా కొనసాగుతున్న పరిస్థితుల్లో గేయం అజ్ఞాతంగా రాసినా అది దళిత కవిది కాదేమో అనే అనిపిస్తుంది. అయినా కొంతమంది దళిత పరిశోధకులు కూడా దీన్నే తొలి గేయంగా ప్రచారం చేయడంలో ఒక ఆంతర్యం మాత్రం తెలుస్తుంది. ""మాలవాండ్ర పాట'' అని లిఖిత రూపంలో కనపడడం ఒక ప్రధాన కారణం కావచ్చు.

సందర్భంలో ఒకటి గుర్తు చేసుకోవాలి. అప్పటికే అనేక మంది దళిత కవులు కూడా గాంధీ ప్రభావానికి గురయ్యారు. జాషువా లాంటి వారే దీనికి ఉదాహరణగా నిలుస్తారు. గేయం కంటే భౌతిక ధృక్పథమే ప్రధానంగా కనిపిస్తున్నా, గురజాడ అప్పారావు ""లవణ రాజు కల'' ముత్యాల సరాల్లో రాసిన గేయంలోనే నిజమైన దళిత నిరసన కనిపిస్తుంది. దీన్నీ ఆంధ్ర భారతి పత్రికే 1911 సంవత్సరంలో ప్రచురించింది.

""మలిన వృత్తులు మాలవారని

కులము వేర్చిన బలియు రొక ; దే

శమున కొందరి వెలికి దోసిరి

మలినమే మాల?''

""మలిన దేహుల మాల లనుచును

మలిన చిత్తుల కధిక కులముల

నెల వొసంగిన వర్ణ ధర్మము

ధర్మ ధర్మంబే''

అని జాతిని బట్టి వర్ణాశ్రమ ధర్మాన్ని నిర్ణయించిన వాళ్ళు మనిషి వర్ణానికి ప్రాధాన్యతనివ్వడం సరికాదని గురజాడ ఖరాఖండిగా చెప్పాడు. మనుషుల్లో మానసిక అశుభ్రతను గుర్తించటం లేదని, నిజమైన సౌందర్యం వర్ణాన్ని బట్టి కాక, మనిషి ప్రవర్తనను అనుసరించి వస్తుందని చెప్ప గలిగాడు కవి. " ఈస్తటిక్స్'లో అంతః సౌందర్యంలో గమనించవల్సిన చక్కటి మౌలిక సూత్రాన్ని కవి చూపిస్తున్నాడు. గేయం శ్రమ సౌందర్యాన్ని తెలిపేదిగా ఉండాలి. అది దళిత దృక్పథంతో అన్వయిస్తున్నప్పుడు, దళిత సౌందర్యాన్ని గుర్తిస్తూ నిర్ణయాల్ని చేస్తే బాగుంటుంది. దళిత సాహిత్యంలో తొలి రచనల్ని గుర్తించేటప్పుడు సమస్య ఎలాగూ తప్పదు. కానీ, దళితేతరుడైనంత మాత్రం చేత దళిత మనోభావాల్ని సమర్థవంతంగా చెప్పిన కవిని కూడా గుర్తించడం అవసరమనుకుంటాను.

"కన్యాశుల్కం' నాటకంలో, గురజాడ పలికించిన సంభాషణలు దళితుల పట్ల సరైన అవగాహనతో రాసినవి కాదని, అందువల్ల ""మంచియన్నది'' మాలయైతే...'' గేయంలోని "మంచి అన్నది' అనే విషయాన్ని లోతుగా పరిశీలించవలసి ఉందనే అభిప్రాయాలు కొంత మంది విమర్శకుల్లో వ్యక్తమవుతున్నాయి. గురజాడ ఒకచోట మాలవాడి కొడుకు చండాలుడే అనే మాటను ఒక పాత్ర ద్వారా పలికించడం కూడా గురజాడకు దళితుల పట్ల సదభిప్రాయం లేదనే వ్యాఖ్యానాలూ వినిపిస్తున్నాయి. చండాల అనేదీ ఒక కులమని తెలిసి కూడా నిత్యసంభాషణల్లో దళితులు కూడా పదాన్ని అప్రయత్నంగా వాడేయడం కనిపిస్తుంది. నేటికీ ఎంతో అభ్యుదయవాదులమని చెప్పుకుంటున్న వారి రాతల్లో కూడా అక్కడక్కడా పదం కనిపించింది. తమకి తెలియకుండానే స్త్రీలు కూడా కొన్ని సందర్భాల్లో ?ాజులు తొడుక్కున్నావా? అంటు ంటారు. కానీ దాని లోతులు ఆలోచేస్తే అలా అంటారా? గురజాడ ని కూడా కొంతవరకూ కోణంలో అర్థం చేసుకోవాలేమో అనుకుంటున్నాను. ఎందుకంటే "మతములన్నియు మాసిపోవును / జ్ఞానమొక్కటి నిలిచి వెలుగుననే భావాల్లో ఆయన సాహసం సామాన్యమైనది కాదు. అందువల్లనే గురజాడలో అభ్యుదయ దృక్పథాన్నే ప్రధానంగా చూడాలని విమర్శకులు అంటున్నారు. అయినా ఇలాంటి కొన్ని వ్యాఖ్యానాల వల్ల గురజాడ రాసిన గేయం కూడా తొలి దళిత గేయంగా నిలిచే అవకాశం కనిపించడం లేదు. అయినా గాని గురజాడ "లవణరాజు కల'లో చెప్పిన అనేక అంశాలు దళితుల్ని ఉన్నతీకరించే ప్రయత్నం చేశాయని మాత్రం చెప్పక తప్పదు.

""మలిన దేహుల మాల లనుచును

మలిన చిత్తుల కధిక కులముల

నెల వొసంగిన వర్ణ ధర్మము

ధర్మ ధర్మంబే''

అని ప్రశ్నించటంలో మానవత్వానికి కవి ఇచ్చిన ప్రాధాన్యాన్ని మాత్రం గుర్తించాలి.

1919లో గరిమెళ్ళ ""మన చిన్ని తమ్ములను జేరదీసి దయ / చేసి మహాదరమమ్మ'' ని రాశారు. 1921లో చెరకువాడ వెంకట రామయ్య, దామోజీపురపు వెంకట నరసింహారావులు దళితులను ""సోదురులవలే'' ఆదరించమని, అంతవరకూ బానిసత్వం పోదనీ, స్వరాజ్యం రాదనీ, విముక్తి లభించదనీ జాతీయోద్యమ ప్రభావంతో గేయాల్ని రాశారు. 1921లోనే కొండపల్లి జగన్నాథరావు దళితుల్ని "మేలుకొలుపు'తూ గేయాల్ని రాశారు. "" గాంధీ దేవుండవతరించెననీ, నీచ వృత్తుల్ని మానుకోమనీ, బూతు మాటల్ని ఆడవద్దనీ, గొడ్డు మాంసం తినొద్దనీ, ""మాల- మాదిగ కులము హిందూ మతంలో భాగమేననీ దళితులకి నీతుల్ని చెప్పే దిశగా గేయాల్ని రాశారు. దళితుల్ని సాంస్కృతికంగా మార్పు తెచ్చుకోమనే హిత బోధ కనిపిస్తుంది. ఇలా దళిత గేయాల్ని లోతుగా పరిశీలించినప్పుడు తొలి దళిత గేయంగా దేన్ని గుర్తించాలనే విషయంలో సందిగ్దత కొనసాగుతూనే ఉంది!

------------

కామెంట్‌లు లేవు: