వచన కవిత్వానికి లభించినంత ప్రాధాన్యత పద్య కవిత్వానికి పత్రికల్లో దొరకక పోవటం వల్ల, పద్య కావ్యాల గురించి తక్కువగా తెలుస్తుంది. కానీ, పద్య కవిత్వాన్ని చాలామంది రాస్తూనే ఉన్నారు. అలాంటి పద్య కవుల్లో డాక్టర్ ఎస్. టి. ఙ్ఞానానందకవి ఒకరు. ఇటీవల సుమారు 280 పైగా పద్యాలతో "క్రీస్తు ప్రబంధం" రాశారు. అంతకు ముందు బౌద్ధ ధర్శనాన్ని విశదీకరించే 'ఆమ్రపాలి' కావ్యం రాశారు. ఈ కావ్యం సాహిత్య అకాడమీ అవార్డు పొందింది. హిందూ ధర్మాన్నీ, సంసృతినీ విశ్వ విఖ్యాతం చేసిన స్వామి వివేకానంద గురించి 'శ్రీ వివేకానంద గానం'లో వర్ణించారు. ఇంకా, మత సామరస్యాన్ని చాటే 'గోల్కొండ', సామాజిక సంఘర్షణకు సంబంధించిన 'ధ్రర్మాగ్రహం' వంటి కావ్యాల్నీ రాశారు. వీరు రాసిన ఈ కావ్యాలను బట్టి నిజమైన లౌకికవాద కవిగా డాక్టర్ ఎస్. టి. ఙ్ఞానానందకవి కనిపిస్తారు.
కవులు కొన్ని వస్తువుల్ని తమ కావ్య ఇతివృత్తంగా మార్చుకునేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మత విషయాలను కావ్య వస్తువులుగా తీసుకున్నప్పుడు మరింత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఙ్ఞానానందకవి గారు 'క్రీస్తు ప్రబంధం'లో క్రీస్తుని కేంద్రంగా చేసుకున్నా, బైబిలులో గల పాలీ నిబంధన, కొత్త నిబంధనలలో గల అనేక అంశాల్ని చాలా జాగ్రత్తగా వర్ణించారు. సమకాలీన క్రైస్తవ సోదరులకు మానవ సంబంధాల్లో వస్తున్న మార్పుల్ని వివరిస్తూనే, అవన్నీ ప్రేమానుబంధాలుగా మారాలనే ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. ఈ 'క్రీస్తు ప్రబంధం'లో గుర్రం జాషువాగారు రాసిన అభిప్రాయాన్ని ప్రచురించారు. నిజానికి గుర్రం జాషువా 1944లో రాసిన అభిప్రాయం. 'కవితా లోకంలో మీకు గల గౌరవం క్రైస్తవ లోకంలో కూడా కలిగితే మీ శ్రమ సార్ధకమవుతుందని గుర్రం జాషువా వ్యాఖ్యానించారు. జాషువా ఆంతర్యం ఏమై ఉన్నా, క్రైస్తవుల్లో, క్రైస్తవేతరుల్లోనూ సార్థకమైన జీవితాన్ని ఆశిస్తున్నారు కవి.
కొంతమంది కవులు రాసే దాన్ని బట్టి ఆ కవి దృక్పథం స్పష్టంగా గుర్తించే వీలుంది. గుర్రం జాషువా రచనల్ని బట్టి పరిశోధకులు, విమర్శకులు భిన్న దృక్పథాలలో, అభిప్రాయ భేదాలతో నిర్ణయాలు చేశారు. జాషువాని నాస్తికుడనీ, ఆస్తికుడనీ, క్రైస్తవుడనీ, బాప్తిజం తీసుకోలేదనీ, హేతువాదనీ, విశ్వనరుడనీ, మానవతా వాదనీ ఇలా అనేక రకాలుగా నిర్ణయించిన విమర్శకులు ఉన్నారు. డాక్టర్ ఙ్ఞానానందకవిలో ఇన్ని అభిప్రాయ భేదాలు లేకపోయినా, 'కవి దృక్పథం' ప్రకటించటం కొంచెం ఇబ్బందికరమే! ఇలాంటి సందిగ్ధ పరిస్థితుల్లో, అన్ని కోణాలకీ మూల కేంద్రమైన మానవ సంబంధాలు, వీటిలోనూ పీడనకు గురవుతున్న వాళ్ళ పక్షమే 'కవి' వహించటం ఉంటుంది. అయితే, నీతి, ధర్మం, న్యాయం వంటివి ఆయా సమాజాల్ని బట్టి మారుతుంటాయి. కనుక, తన సమాజం నుండే, తాను అవగాహన చేసుకున్న జీవిత కోణాల నుండే తన సాహిత్యాన్ని ఉత్పత్తి చేస్తుంటాడు. డాక్టర్ ఙ్ఞానానందకవి కూడా వీటికి అతీతులు కారు.
'క్రీస్తు ప్రబంధం' భారతీయ కావ్య లక్షణాల్ని అనుసరించి 'శ్రీమన్మంగళ మూర్తి....' అంటూ ప్రారంభించి, 'స్వస్తి లోకానకున్' అని ముగించారు. 'ప్రబంధం' అని ఉండడం వల్ల, తెలుగు ప్రబంధాలలో లక్షణాల్ని స్ఫురింపజేస్తున్నా, 'క్రీస్తు'కి సంబంధించిన కథల్ని ఒకచోట చేర్చి, క్రీస్తు బోధనల్ని వివరించారు. ఆ విధంగా 'క్రీస్తు ప్రబంధం' క్రీస్తుకి సంబంధించిన కథలు, బోధనలతో ప్రకృష్టంగా ఏర్పడిన బంధం. ప్రబంధానికి ఉండే కొన్ని వర్ణనలు కూడా ఉన్నాయి. అష్టాదశ వర్ణనలు, రసం వంటి విషయాల్లో ప్రత్యేక పద్ధతి కనిపిస్తుంది.
ఈ లోకంలో ప్రేమానుబంధాల్ని పెంచడానికీ, పాపాత్ములను (?) పుణ్యాత్ములుగా మార్చటానికీ, పరలోక మార్గాన్ని స్థిర పరచటానికీ వచ్చిన దివ్య కుమారుడిగా 'క్రీస్తు' ని కవి వర్ణించారు. కావ్యం చదివే పాఠకుడికి క్రైస్తవ మత బోధనలు ప్రధానంగా అవగాహనకొస్తున్నా, సమకాలీన సంఘటనలతో సరిపోల్చుకుంటూ విధ్వంసాలకూ, హింసలకూ కారణాలవుతున్న సంఘటనలు స్పురణ కలిగి, అవి శాంతియుతంగా మారాలంటే, ప్రేమానుబంధాలు కావాలంటే మనిషిలో మానవత్వం మేల్కొనాలనే కోణం పాఠకుడిలో ఏర్పడుతుంది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలవుతున్న పరిస్థితుల్లో, పవిత్రంగా, స్వచ్ఛంగా ఉండవలసిన శిష్యుడు కూడా డబ్బు ఆశతో క్రీస్తుని చంపాలని ప్రయత్నించిన వారికి సహకరిస్తాడు. నాటి సమాజ 'ఆర్థిక సంబంధాల'కీ, నేటి ఆర్థిక సంబంధాలకీ వ్యత్యాసం ఉన్నా, 'మహిమాన్వితుణ్ణి' కూడా ధన ప్రలోభం వల్ల క్రీస్తుని హింసించే మార్గాన్ని చూపడానికి కూడా వెనుకాడని స్పృహను పాఠకులు అందుకోగలుగుతారు. క్రీస్తుని శిలువ వేసిన తర్వాత తల్లి మరియమ్మ హృదయాన్ని కవి వర్ణిస్తూ...
'నిన్నటి దాక భక్తి మెయి నీ పద పద్మములన్ భజించు వా
రెన్నగ నిన్ను దూషణపు హేళన చేయుచునున్న వారు నే
డన్న! భవన్మహోన్నతపు టద్భుతముల్ గనినట్టి వారు నీ
కన్ని విధాల శత్రువులుగనైరి కృతఘ్నల్ క్రూరకర్మకుల్'
అన్నారు. ఇది క్రీస్తుని శిలువ వేసినప్పటి పరిస్థితిని వర్ణిస్తున్నా, దాన్ని మాత్రమే కాకుండా నేడు కొందరు క్రైస్తవులుగా మారి దాన్ని ఆర్థిక లావాదేవిలకు మార్గంగా చేసుకుంటున్న వాళ్ళూ, క్రైస్తవంలో కూడా ప్రవేశించిన 'కులం' లో అధిపత్యాన్ని చెలాయిస్తున్న వాళ్ళూ స్ఫురించి, క్రైస్తవాన్ని మంటగలుపుతున్న వాళ్ళ పనులూ గుర్తుకొస్తాయి. కవిలో 'క్రైస్తవం' పట్ల గల లోతైన అనుభవం, ఆలోచనల స్పష్టత దీనిలో కనిపిస్తుంది. క్రీస్తు దేనికోసమైతే శిలువకి 'బలి' కాబడ్డాడో ఆ ప్రేమబంధాల పట్ల కవి తపన పడుతున్నారు.
కావ్యాన్ని ప్రారంభిస్తూ, క్రీస్తుని, మరియమ్మ, యోసేపు, ఆదాము అవ్వలను, అబ్రహము, దేవదూతలు జఖాయేల్, గాబ్రియేల్, ఇజ్రాయేల్ని తన వాక్ శక్తితో నడిపించిన మోషే తర్వాత యోజోవా, దావీదు, సాలోమోను, ప్రవక్తలు, మత్తియి, మార్కు, లూకా, యోహాను పాలు వంటి వారందరినీ స్మరించి, వారి దీవెనలను ఆశించి 'నా జాతి పావనమౌరీతి' రచింతు నా ప్రభుని దివ్యంబైన చారిత్రమున్' అని కవి ప్రకటించుకున్నారు. పాత నిబంధన నంతటినీ సంక్షిప్తంగా, సారాన్ని కొన్ని పద్యాల్లో వర్ణించేసి, క్రీస్తు పుట్టుకకు వర్ణనను తీసుకుకొనిపోయారు.
క్రీస్తుని దైవంగా వర్ణిస్తూ 'సత్యవాక్కు చేత సర్వసర్వం సహా / చక్రగతికి మూల సాధకుండు / జీవ జాలములకు దేవాదిదేవుండు / ప్రభవ మందినాడు పనుల సాల' (పు: 40) అన్నారు. ప్రపంచంలో సత్యంతో ప్రవర్తిల్లాలనీ, దాని కోసమే జీవ జలాన్ని తాగించి, నిత్య జీవితాన్ని ప్రసాదించడానికి పుట్టిన మహోన్నుడిగా క్రీస్తుని ప్రశంసిస్తూ రాసిన ఈ పద్యం, ఛందోబద్ధమే అయినా, నేటి వచన కవిత్వం కంటే సరళంగా ఉండి, చక్కని కవిత్వాన్ని పండిస్తుంది. క్రీస్తు బో్ధనలు ప్రస్తుత ప్రపంచానికి అవసరం అనేది కవి ఆలోచన. క్రీస్తు బోధనల్ని సరళమైన పద్యాల్లో అందించిన డాక్టర్ ఙ్ఞానానందకవి ఈ కావ్యంలో నిజమైన 'లౌకిక కవి'గా ప్రశంసించబడతారు.
(క్రీస్తు ప్రబంధం, కవి: డాక్టర్ ఎస్. టి. ఙ్ఞానానందకవి, పుటలు: 285, ప్రతులకు; డాక్టర్ ఎస్. టి. ఙ్ఞానానందకవి, దంతులూరి వారి వీధి, పేర్రాజు పేట, కాకినాడ 533003, వెల: 100 రూపాయులు.)
1 కామెంట్:
namasthe darla garu,
modati sariga mee blog choosanu. chala baga vundi.chala kotta vishayalu telisaayi.mee gurinchi 'telugu litetature in web' ane community lo hemalathaputla garu parichayam chesaru.link:http://www.orkut.co.in/Main#CommMsgs.aspx?cmm=60859654&tid=5325586239777443776&na=3&nst=11&nid=60859654-5325586239777443776-5331753469213508832
కామెంట్‌ను పోస్ట్ చేయండి