నిన్ను తూద్దామంటే
సరిపడే త్రాసు దొరకలేదు
నిన్ను చూద్దామంటే
నా చూపుల అంచులు ఆనలేదు
కల్లోల కలల సాగరంలో
ఆలోచనల వల వేస్తే
అభిమానుల ఆశల
సామ్రాజ్యాల దుర్గంలో మహాశ్రీ
అనుచరుల ఊహా
సౌందర్యాల స్వర్గంలో మరోశ్రీ
జాతి కనుకొలకుల్లో అశ్రుకుండలు శ్రీశ్రీ
హోమజ్వాలై మండే అగ్నిశిఖలు శ్రీశ్రీ
మన ఎడమ చెవిలో ఎగసిన
విశ్వవ్యాపిత భూంకారధ్వనిగా ఒకశ్రీ
వేరే చెవిన రాలి పడిన
బంగరు మేడల ప్రతిధ్వనిగా ఇంకొకశ్రీ
నెర్రెలు కొట్టిన ఉద్యమ క్షేత్రంలో
విస్ఫోటించే విత్తనం శ్రీశ్రీ
తలో దిక్కుకి చెదిరిన
సూర్యదేవుని సప్తహయముల
పగ్గం శ్రీశ్రీ
తెలుగు వాడి త్రినేత్రం శ్రీశ్రీ
వాని వెలుగు జాడల అనంతం శ్రీశ్రీ
మన బలం శ్రీశ్రీ
మన బలహీనత శ్రీశ్రీ
-దివికుమార్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి