"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

20 March, 2009

దళిత సాహిత్యం --మౌలిక భావనలు2

--డా//దార్ల వెంకటేశ్వరరావు
అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలుగు శాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం,
గచ్చిబౌలి, హైదరాబాదు-46, 09989628049, vrdarla@gmail.com

1.2.2 దళిత సాహిత్యం:
దళితుల జీవన విధానాన్ని చైతన్యవంతంగా వర్ణించిన సాహిత్యం దళిత సాహిత్యమవుతుంది. దళితుల అభ్యున్నతి కోసం ఎవరు రాసినా అది దళిత సాహిత్యంగానే పరిగణించవచ్చునని విమర్శకులు భావిస్తున్నారు. దళితులే తమ సమస్యలకు ప్రతిస్పందించి రాస్తే దాన్ని "ఆత్మాభిమానం వాదం' గానూ దళితేతరులు దళితుల పక్షాన్ని వహించి రాస్తే దాన్ని "ఉదారవాదం' గానూ పిలుస్తున్నారు.
దళిత సాహిత్యం మరాఠీ భాషలో ముందుగా స్థిరపడి, తరువాత భారతీయ భాషలన్నింటిలోనూ విస్తరించింది. కొంతమంది మరాఠీ రచయితలు దళిత సాహిత్యాన్ని ఇలా వివరించారు.
"This literature i closely associated with the hopes for freedom of a group of people who as untouchables are victims of social, economic and cultural in equalities"
- Arjun Dangle
""The Dalit literature was an all out plebeian attack on the orthodox establishment'
- Latha Murugakar






"Any work of literature which seeks to express to express in words, the people of those sections of humanity which are oppressed and which are engaged in struggle for there existence to be called in the broadest seance, dalit literature"
- Harish Mangalam
(గుజరాతీ రచయిత)
దళిత సాహిత్యాన్ని ఎవరు రాసినా దాని మౌలిక స్వభావం, లక్ష్యాలను వీడనంతవరకు దాన్ని దళిత సాహిత్యంగానే పరిగణించవచ్చుననే ఆలోచన ఇంచుమించుగా సర్వాంగీకారం పొందింది. కింది విషయాలు గమనిస్తే ఈ మౌలికాంశాలు ఉన్నదే దళిత సాహిత్యమని స్పష్టమవుతుంది.
1. ప్రాచీన, సాంప్రదాయిక స్వభావం కలిగిన సామాజిక నిర్మాణాన్ని (కులవ్యవస్థని) తిరస్కరించటం.
2. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం ఆశించే మానవతా దృక్పథాన్ని ఆశించటం.
3. హేతువుకు అందని అతీంద్రియ భావాలను తిరస్కరించటం.
4. వాస్తవికతకు ప్రాధాన్యమిచ్చి జీవితానుభవాలను సృజనీకరించటం.
5. వస్తువుకి రూపం సహకారి కావటం, సాహిత్యం సామాజిక చైతన్యాన్ని ఆకాంక్షించేటట్లు రూపొందటం, కళ సమాజం కోసమే అన్న దృక్పథానికి కట్టుబడటం.
6. సత్యం, శివం, సుందరం అనే భావనలను తిరస్కరించటం.
7. అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, సామాజిక, ఆర్థిక న్యాయం కోసం పోరాడటం.
8. కర్మ, పునర్జన్మ, పరమాత్మ వంటి భావనలను నిరసించటం.
9. దళితుల భాషను, ఆచార వ్యవహారాలను గౌరవించి, ఆత్మ గౌరవాన్ని పెంపొందించటం.
10. హిందూ లేదా మూఢత్వాన్ని ప్రబోధించే మత భావనలను తిరస్కరించి, ప్రత్యామ్నాయ సంస్కృతిని రూపొందించటం.
11. అస్పృశ్యత కారణంగా దూరంగా విసిరేయబడిన వారిని ప్రధాన జీవన స్రవంతిలో కలపటం, కులాన్ని నిర్మూలించటం ప్రధాన లక్ష్యాలుగా గ్రహించటం.
12. దళిత సాహిత్యాన్ని రాయటం వినోదం కోసం కాదనీ, సామాజిక చైతన్యం, సామాజిక పరివర్తనకు బాధ్యతాయుతమైన పనిగా గుర్తించటం - దళితులు రాజ్యాధికారాన్ని చేపట్టే దిశగా సాహిత్యం ప్రేరణనివ్వటం.
దళిత సాహిత్య స్వభావాన్ని తెలుసుకోవటానికి పై అంశాలను క్రోడీకరించినా, "దళిత సాహిత్యం' అని పిలుస్తున్న అన్ని రచనలకూ పైన పేర్కొన్న అన్ని లక్షణాలు సరి పోతున్నాయని చెప్పే వీలు లేదు. కానీ, మౌలికంగా ఈ లక్షణాలు చాలా వరకు దళిత సాహిత్యంలో కనిపిస్తున్నాయి. అలాంటి కొన్ని లక్షణాలు అభ్యుదయ, విప్లవ సాహిత్యంలోనూ కనిపిస్తున్నా, అవి వర్ణానికిచ్చిన ప్రాధాన్యం, కులానికివ్వలేదు. కనుక, కులనిర్మూలన ప్రధాన లక్ష్యంగా దళిత సాహిత్యం కొనసాగుతుంది.
జ్యోతిబా పూలే, పెరియార్‌, అంబేడ్కర్‌ భావజాలంతో పాటు, మార్క్సిజం ప్రభావం కూడా దళిత సాహిత్యంలో కనిపిస్తుంది. "దేశీయ మార్స్కిజం' అనే భావన కూడా తెలుగు దళిత సాహిత్యంలో చర్చలోకొచ్చింది. అందువల్ల దళిత సాహిత్యాన్ని కాలం, స్వభావాలను అనుసరించి గుర్తించవలసి ఉంది. అయినా, దళిత సాహిత్యం ఆవిర్భవించటానికి శతాబ్దాల సామాజిక పీడనను ఎదుర్కొన్న చారిత్రక నేపథ్యం ఉంది. ఆ నేపథ్యం నుండే "దళిత సాహిత్యం' స్పష్టమైన అంబేడ్కర్‌ తాత్త్విక భావజాల భూమికతో ఆవిర్భవించింది.

No comments: