"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

20 March, 2009

దళిత సాహిత్యం --మౌలిక భావనలు1

--డా//దార్ల వెంకటేశ్వరరావు
అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలుగు శాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం,
గచ్చిబౌలి, హైదరాబాదు-46, 09989628049, vrdarla@gmail.com


1.1 ప్రవేశిక:

సమాజం వైరుధ్యాలమయం. అది సంఘర్షణలతో పరిణామ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఆదిమ సమాజం దశ నుండి ఆధునిక సమాజం వరకూ అంతరాలు కొనసాగుతూనే ఉన్నాయి. మత, వర్గ, వర్ణ, భాష, ప్రాంతీయ, లింగ భేదాల వల్ల మానవుల మధ్య సంఘర్షణ అనివార్యమవుతుంది. సవ్యదిశలో జరిగే సంఘర్షణల వల్ల సమాజంలో కొత్త పరిణామాలు సంభవిస్తున్నాయి. తెలుగు సాహిత్యంలోనూ ఇటువంటి పరిణామాలు వర్ణితమవుతున్నాయి. సంప్రదాయ, అభ్యుదయ, దిగంబర, విప్లవ, స్త్రీ వాద సాహిత్య ధోరణులకు సమాజ పరిణామాలే ప్రధాన కారణాలయ్యాయి. అలాంటి నేపథ్యం నుండే దళిత సాహిత్యం కూడా ఆవిర్భవించింది. దళిత సాహిత్య ఆవిర్భావంతో తెలుగులో సాహిత్య విస్తృతి పెరిగింది.

భారతీయ సమాజంలో ప్రత్యేకంగా కనిపించే వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థగా రూపాంతరం చెందటం, కులాన్ని ఆశ్రయించుకొని వృత్తులు, వృత్తులు వంశ పారంపర్యం కావటం, దానివల్ల వల్ల కొన్ని వృత్తులవారికే సామాజిక గౌరవం ఆపాదింపబడటం వల్ల దళితులు ఆత్మన్యూనతకు గురి కావలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వివిధ సామాజిక ఉద్యమాల వల్ల వచ్చిన మార్పుల ఫలితంగా, ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చర్యల వల్ల దళితులు కూడా విద్యావకాశాలను పొందగలుగుతున్నారు. ఉద్యోగ రంగాల్లో ప్రవేశించగలుగుతున్నారు. వృత్తులు మారడంతో ఆర్థిక స్థితిగతుల్లోనూ మార్పులు స్పష్టంగా కనిపిస్తునాయి. ఫలితంగా "సంస్కృతి'లోనూ అనూహ్యమైన మార్పులు సంభవిస్తున్నాయి. ఆత్మన్యూనత నుండి ఆత్మగౌరవం ప్రకటించే స్థాయికి దళితులు ఎదుగుతున్నారు. ఇవన్నీ దళితులు, దళితేతరులు రాస్తున్న వివిధ సాహిత్య ప్రక్రియల వల్ల స్పష్టమవుతున్నాయి.

1.2 దళితులు - దళిత సాహిత్యం:

భారతీయ సమాజంలో చాతుర్వర్ణ వ్యవస్థ కొనసాగింది. దాన్ని అనుసరించి కులవ్యవస్థ రూపొందింది. ప్రధానంగా కుల వివక్షను ఆధారం చేసుకొనే దళితులను, దళిత సాహిత్యాన్ని సాహితీవేత్తలు గుర్తిస్తున్నారు. నేపథ్యంలో దళితులు, దళిత సాహిత్యం అనే మౌలిక విషయాల పట్ల విస్తృతమైన చర్చ జరిగింది.

1.2.1 దళితులు:

నిఘంటువుల్లో "దళితము' అనే శబ్దానికి "ఖండింపబడినది, ఛేదింపబడినది, వికసించినది' అనే అర్థాలు కనిపిస్తున్నాయి. "Dalit' అంటే Broken or reduced to pieces generally అని ఆంగ్ల నిఘంటువులు వివరిస్తున్నాయి.

అస్పృశ్యత కారణంగా సమాజం నుండి "విడగొట్టబడిన' వారనే అర్థంలోనే సాహితీవేత్తలు దళితులను వివరిస్తున్నారు. ప్రత్యేకించి ఒక్క కులం లేదా కొన్ని కులాలకు మాత్రమే పరిమితం చేసుకొని దళిత శబ్దాన్ని ఉపయోగించటం సరికాదనే వాదనలు కూడా ఉన్నాయి.

1) సామాజిక వ్యవస్థలో సరైన స్థానం లభించని, వివక్షకు గురవుతున్న వారందరికీ "దళిత' శబ్దం వర్తిస్తుంది.

2) శతాబ్దాల తరబడి జరిగిన పోరాటంలో వ్యక్తమైన ఆత్మ గౌరవ నినాదం "దళిత'.

3) మతాన్ని ఆధారం చేసుకొని ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో జరిగే వివక్షను ప్రశ్నించే శబ్దం "దళిత'.

4) సమాజంలో నిమ్నస్థాయిలో బతుకీడుస్తూ, కష్టాల నుండి బయటపడటానికి శాస్త్ర విజ్ఞానాన్ని విశ్వసిస్తూ, హేతువాద భావనా బలంతో పోరాడుతూ, అస్తిత్వం కోసం నిత్యం ప్రయత్నించే వారికి ప్రాతినిధ్యం వహించే శబ్దం "దళిత'.

5) దేవుడు, విధి, స్వర్గ-నరకాలు : జన్మ-పునర్జన్మ: ఆత్మ- అంతరాత్మ: అదృష్టం దురదృష్టం వంటి భావనలన్నీ దళితులను బానిసలుగా మారుస్తున్నాయని భావిస్తూ నాస్తికత్వం, హేతువాద భావాలతో మానవతావాదాన్ని బలపరుస్తూ సామాజిక విముక్తిని ఆశించే విస్తృత పరిధిగల శబ్దం "దళిత'.

ఇలా "దళిత' శబ్దం గురించి రచయితలు భిన్న కోణాల్లో వివరించారు. అయితే, 1971 బొంబాయి నుండి వెలువడిన మరాఠీ "దళిత పాంథర్స్మ్యానిఫెస్టో' దళిత శబ్దాన్ని కింది విధంగా వివరించింది.

"Who is Dalit?

Members of scheduled castes and tribes, Neo - Buddhists, the working people, the landless and poor peasants, women and all those who are being exploited politically, economically and in the name of religion'

దీని ప్రకారం షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు, నయా బౌద్ధులు, శ్రామికులు, భూమిలేని పేద రైతులు, స్త్రీలు, మతం పేరుతో రాజకీయంగా ఆర్థికంగా దోపిడీకి గురయిన వారంతా "దళితు'లవుతారని తెలుస్తుంది. కానీ, గిరిజనులకు అస్పృశ్యత సమస్య లేదు. అన్ని రంగాల్లోనూ వెనుకబాటుతనం ఉంది. అగ్రవర్ణ స్త్రీలను "దళితులు'గా భావించనవసరం లేదనీ భావిస్తున్నారు. ముస్లిం, క్రైస్తవ, బౌద్ధ, సిక్కు వంటి మైనారిటీ వారి పై హిందూమత ఆధిపత్యం ఉంది. అణిచివేతకు గురవుతున్నారని, వీరినీ దళితులుగా గుర్తించాలనీ కొంతమంది భావిస్తున్నారు.

సామాజికంగా నిమ్నస్థానంలో ఉన్న అనుభవిస్తున్న ప్రజలు దళిత శబ్దాన్ని ఆత్మ గౌరవానికి ప్రతీకగా భావిస్తున్నారు. చారిత్రక ఆధారాలను బట్టి వీరిని అవర్ణులు, అతిశూద్రులు, అనార్యులు, దాసులు, దాస్యులు, ప్రతిలోములు, అంత్యజులు, అంత్య వాసులు, అంత్యులు, అసురులు, చండాలురు, బాహ్యులు, మ్లేచ్చ్యులు, హీనులు, అస్పృశ్యులు, అంటరానివాళ్ళు, పంచములు, హరిజనులు వంటి వివిధ పేర్లతో పిలిచారు. అయితే పంచములు, హరిజనులు శబ్దాలతో కొన్ని వందల సంవత్సరాలుగా వీరిని పిలిచేవారు. భారత స్వాతంత్రోద్యమకాలంలో నర్సీమెహతా అనే రచయిత పెట్టిన "హరిజన' శబ్దాన్ని మోహన్దాస్కరమ్చంద్గాంధీ విస్తృతంగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. మతపరంగా దేవుని బిడ్డలనే అర్థంలో శబ్దాన్ని ప్రచారం చేశారనీ, అది తమ ఆత్మగౌరవ భంగకరమని దళితులు నిరసించారు. అప్పటినుండే "దళిత' శబ్దం ఆత్మ గౌరవానికి సమైక్య శక్తికీ ప్రతీకగా ప్రయోగంలో ఉంది. శబ్దంతో పిలిపించుకోవడానికి ఇష్టపడుతూ, పేరుతోనే తమ భావాలను వివిధ సాహిత్య ప్రక్రియలుగా అందిస్తున్నారు. అన్ని భారతీయ భాషల్లోనూ "దళిత సాహిత్యం' పేరుతోనే రచనలు చేస్తున్నారు.

No comments: