--డా//దార్ల వెంకటేశ్వరరావు
అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలుగు శాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం,
గచ్చిబౌలి, హైదరాబాదు-46, 09989628049, vrdarla@gmail.com
1.3. దళిత సాహిత్యం - చారిత్రక నేపథ్యం:
అపౌరుషేయాలని భావించే వేదాల్లో (ఋగ్వేదం - 10వ మండలం - పురుష సూక్తం) చాతుర్వర్ణ వ్యవస్థ గురించి ప్రస్తావన కనిపిస్తుంది. దాని ప్రకారం భారతదేశంలో కుల వ్యవస్థ సాంఘిక అసమానతలకు కారణమయ్యింది. కులం వల్ల కలిగిన అసమానతలపై బౌద్ధం, జైనం, చార్వాకం మొదలైనవి నిరసనను తెలిపాయి. అవి కుల నిర్మూలనకంటే అహింస, జ్ఞానబోధ, బౌద్ధిక దృక్పథాలపై ప్రధాన దృష్టిని కేంద్రీకరించాయి. కొన్ని వందల యేండ్లుగా బ్రాహ్మణ, క్షత్రియ వర్ణాల వారు తమ అధికారాన్ని చెలాయిస్తూ సంస్కృత సాహిత్యాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ కాలంలోనే ముస్లిములు భారతదేశంపై దండయాత్రలు చేసి, చాలా చోట్ల అధికారం హస్తగతం చేసుకున్నారు. ముస్లిములు మొదట్లో సంస్కృత సాహిత్యానికి ప్రాధాన్యాన్ని తగ్గించారు. ఆ తరువాత కాలంలో పరోక్ష పద్ధతులలో హిందూ సామాజిక వ్యవస్థలో కనిపించే అణచివేత స్వభావాన్నే ముస్లిం పాలకులు కూడా అనుసరించారు. ముస్లిం పాలనలో హిందూ వ్యవస్థలో తమకు అనుకూలమైన వాటిని స్వీకరించి, మిగిలిన వాటిని అణచివేశారు. ఈ నేపథ్యంలోనే భక్తి సాహిత్యం ప్రారంభమయింది. ఈ సాహిత్యంలో హిందూ మతంలోని మౌలిక లక్షణాలను విస్మరించకుండా, కొన్నింటిని సంస్కరించే ప్రయత్నం మాత్రం జరిగింది. హిందూ - ముస్లిం పాలకుల సంఘర్షణలో బ్రిటీష్ వాళ్ళు భారత దేశాన్ని ఆక్రమించుకున్నారు. వారి పాలనలో పాశ్చాత్య విజ్ఞానం భౌతిక దృష్టిని కలిగించింది. కొన్ని వందల యేండ్ల బ్రిటీష్ వారి పాలనను వ్యతిరేకిస్తూ జాతీయోద్యమం ఊపందుకుంది. ఈ పరిస్థితుల్లో "జాతీయోద్యమ సాహిత్యం' లో భాగంగా కుల నిర్మూలన కూడా ఒక అంశమయ్యింది. జ్యోతిబా పూలే, నారాయణగురు, సాహు మహారాజ్, పెరియార్ ఇ.వి. రామస్వామి నాయర్, డా.బి.ఆర్. అంబేడ్కర్ మొదలైన వారి ఆలోచనలు దళిత సాహిత్యానికి చారిత్రక, తాత్త్విక భూమికను ఏర్పరిచాయి.
జ్యోతి బాపూలే నిమ్నజాతుల ఉద్ధరణ కోసం "సత్య శోధక సమాజం' (1873) స్థాపించారు. పూలే హిందూమతంలోని లోపాలను వివరిస్తూ అనేక పుస్తకాలను రాశారు. 1910లో కలకత్తా కాంగ్రెస్ సమావేశం అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. 1918లో అఖిలభారత దళితజాతుల సమావేశాలు బొంబాయిలో జరిగాయి. 1924లో డా.బి.ఆర్. అంబేడ్కర్ అస్పృశ్యత నివారణోద్యమాన్ని ప్రారంభించారు.
ఈ ప్రభావం భారత దేశంలో ప్రధానంగా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో బలంగానే కనిపించి, దళిత ఉద్యమాలు ఊపందుకున్నాయి. తెలుగువారికీ ఈ ఉద్యమాలు మార్గదర్శకమయ్యాయి. 1967 నాటికి జ్యోతిబా పూలే, సాహూ మహారాజ్, కారల్ మార్క్స్ సిద్ధాంతాలు నీగ్రో సాహిత్యంలోని తిరుగుబాటు కలగలిసి అంబేడ్కర్ భావజాలాన్ని ప్రధానంగా చేసుకొని "దళిత సాహిత్యం' ఆవిర్భవించింది.
1981లో భారతీయ దళిత సమాచార పత్రికా సంపాదకుల సదస్సు జరిగింది. 1984లో భారతీయ దళిత సాహిత్య అకాడమీనీ స్థాపించారు. కాన్షీరామ్ 1984 నాటికి అంబేడ్కర్ భావజాలంతో బహుజన సమాజ్ పార్టీని స్థాపించారు. దీనితో రాజకీయంగా కూడా దళితులలో చైతన్యం వెల్లువెత్తింది. ఈ ప్రభావం కూడా తెలుగు సాహిత్యంపై కనిపించింది.
1968లో కంచకచర్లలో కోటేశుని సజీవ దహనం చేయడం, 1985 జూలై 17న కారంచేడు ప్రాంతంలో దళితులపై మారణకాండ సాగించడం వంటి సంఘటనలు జరిగాయి. 1990 ఆగస్టు 6న చుండూరులో దళితులను ఊచకోత కోశారు. దీనితో అంతవరకు సంస్కరణోద్యమ, అభ్యుదయ, విప్లవ సాహిత్యం రాస్తున్న తెలుగు రచయితలు, కవులు దళిత సాహిత్యం పై దృష్టిని కేంద్రీకరించారు.
తెలుగు సాహిత్యచరిత్ర పరంగా చూసినపుడు 12వ శతాబ్దంలో శివకవులు నిమ్న జాతీయులని పిలువబడుతున్న దళితులను శైవమతం వైపు ఆకర్షించేటట్లు చేసిన రచనలు కొన్ని కనిపిస్తున్నాయి.
13 వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు భక్తి ఉద్యమం పేరుతో హిందూ మతంలో సంస్కరణ దిశగా రచనలు వచ్చాయి. 16వ శతాబ్దానికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు ""ఆముక్తమాల్యద''లో మాలదాసరి కథ రాయడంలోనూ కుల ప్రభావాన్ని
గుర్తించారు. 17వ శతాబ్దంలో పోతులూరి వీరబ్రహ్మం, వేమన వంటి కవులు కులం వల్ల కలిగే సాంఘిక నిమ్నోన్నతాలను నిరసిస్తూ రచనలు చేశారు. 18, 19 వ శతాబ్దాలలో జమీందారీల పెత్తనం, వారి అధికారం క్షీణించటంతో పాశ్చాత్య పాలనకు, పాశ్చాత్య విద్యకు ద్వారాలు తెరిచాయి. క్రైస్తవ సాహిత్యం ప్రారంభమయింది. ఉన్నత వర్ణాలు, వర్గాల వారు క్రైస్తవ రచనలను చేసే నేపథ్యంలో కింది వర్ణాల వారి గురించి రాయడం ఒక అనివార్యగా మారింది.
1.4 దళిత సాహిత్యం - ఆరంభ వికాసాలు:
భారతదేశ వ్యాప్తంగా జరిగిన పాలన, ఆర్థిక పర అంశాల కారణంగా వచ్చిన సామాజిక ఉద్యమాలు వచ్చాయి. దాని ప్రభావంతో వెలువడుతున్న సాహిత్యంలో దళిత సాహిత్యం ఒక ప్రత్యేక విభాగమయ్యింది. 1960 నుండి దళిత సాహిత్యం ప్రాచుర్యాన్ని పొందింది. ఈ పరిణామాలను ప్రముఖ విమర్శకులు ఆచార్య కె.కె. రంగనాథాచార్యులు కింది విధంగా విశ్లేషించారు.
1970లలో మరాఠీ, కన్నడ భాషలలో నిర్ధిష్ట లక్ష్యాలతో, ప్రత్యేకమైన అభివ్యక్తులతో దళిత సాహిత్యం పురోగమించింది. 1980ల ఉత్తరార్దంలో తెలుగు సాహిత్యంలో దళిత చైతన్యం నిర్ధిష్ట రూపాన్ని పొంది, 1990 మొదలయ్యే నాటికి ""దళిత సాహిత్యం'' సాహిత్యంగా నిలదొక్కుకొనే ప్రయత్నం చేసింది. ప్రాచీన, ఆధునిక సాహిత్యాన్ని ప్రశ్నిస్తూ తనదైన అస్తిత్వంతో ముందుకొచ్చింది. వేమన, తత్వ కవులు మానవతా దృక్పథంతోనూ, గురజాడ హేతువాద దృక్పథంతోనూ దళితుల సమస్యలను సృజనీకరించారు. సంఘసంస్కరణోద్యమాలు ప్రధానంగా స్త్రీ సమస్యలపైనే కేంద్రీకరించినా, కొంతవరకు కుల సమస్యను కూడా గుర్తించాయి. జాతీయోద్యమం అస్పృశ్యతా సమస్యను ప్రధానంగా గుర్తించి, మతస్పృహలో దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేసింది.
అభ్యుదయ సాహిత్యం పీడిత శ్రామిక వర్గ సమస్యలలో భాగంగానే దళిత సమస్యలకు పరిష్కారాన్ని సూచించింది. అది ఎక్కువగా ఆర్థిక సంస్కరణలకే ప్రాధాన్యాన్నిచ్చింది. విప్లవ సాహిత్యం గిరిజన సమస్యలతో పాటు దళిత సమస్యలను వర్గ దృష్టితో ప్రత్యేక ప్రాధాన్యాన్నిచ్చింది. ఆర్థిక కోణానికి అధిక ప్రాధాన్యాన్నిచ్చే విప్లవ స్పృహతో సమాంతరంగా సామాజిక, సాంస్కృతిక రంగాలలో కూడా దళిత చైతన్యం విస్తరించింది. వర్గం కంటే దళిత సమస్య "కులం' తోనే ముడిపడి ఉందని గుర్తించి, ఆ అంశాలను ప్రధానంగా తీసుకొచ్చింది.
1909లో ఒక అజ్ఞాత కవి రాసిన ""మాలవాండ్ర పాట''ను తొలి దళిత గేయంగా పరిశోధకులు భావిస్తున్నారు. ఇది ఆంధ్రభారతి (భాద్రపద) మాసపత్రికలో అచ్చయ్యింది. ఆ తరువాత గురజాడ అప్పారావు 1911లో కుల సమస్యను స్పర్శిస్తూ ముత్యాలసరాల్లో రాశారు. 1915లో మంగిపూడి వెంకటశర్మ ""నిరుద్ధ భారతం'' అనే పద్య కావ్యాన్ని రాశారు. అస్పృశ్యతను నిరసిస్తూ దళితేతరులు రాసిన తొలి పద్యకావ్యంగా దీన్ని విమర్శకులు భావిస్తున్నారు. కొండపల్లి జగన్నాథరావు 1921లో రాసిన ""మేలుకొలుపు'' గీతం పురాణాల్లో దళితుల గొప్పతనాన్ని కీర్తించే విధంగా ఉంది. 1930లో జాలా రంగస్వామి రాసిన ""అంటరానివాడెవ్వడు'' పాట, 1933లో కుసుమ ధర్మన్న రాసిన ""హరిజన శతకం'' దళితుల మనోభావాలను బాగా పట్టుకోగలిగాయి. 1933లోనే కుసుమ ధర్మన్న రాసిన ""మాకొద్దీ నల్ల దొరతనము'' గేయం ఒక ఊపు ఊపింది.
గుర్రం జాషువా రాసిన ""గబ్బిలం''(1941) కావ్యంలో దళితుల వేదనా భరిత జీవితాలను, అప్పుడే మొలకలెత్తుతున్న తిరుగుబాటు స్వభావాన్ని శక్తివంతంగా అభివ్యక్తీకరించారు. ఈయనే రాసిన ""నా కథ'' దళిత ఆత్మ కథకు ప్రేరణనిచ్చే రచన. బోయి భీమన్న పురాణేతిహాసాల సమగ్ర అవగాహనతో గాంధీ, అంబేడ్కర్ తాత్త్విక భావాల సమ్మేళనంతో గొప్ప రచనలు చేశారు. ""గుడిసెలు కాలిపోతున్నై'', ""రాగవాశిష్టం'' ""పాలేరు''
వంటివి బోయి భీమన్న రచనలలో ప్రముఖమైనవి. ఈ రచనలు దళితులకు గొప్ప ప్రేరణనిచ్చాయి.
ఇలా అస్పృశ్యతను నిరసిస్తూ దళిత, దళితేతరులు అనేక రచనలు చేశారు.
ఇంచుమించు ఈ రచనలన్నీ ""జీవితానుభవాలనుంచి పొందిన స్పందన, నిరసన, సంస్కరణ, ఉద్ధరణ, విమర్శ, విజ్ఞాపన, సంఘటన, ప్రతిఘటన దశలుగా పరిణామం చెందాయని'' విమర్శకులు భావిస్తున్నారు. 1968లో కృష్ణా జిల్లా కంచికచెర్లలో కోటేశు అనే దళితునిపై అగ్రవర్ణాల వారు దొంగతనం కారణాన్ని మోపి అతడిని సజీవ దహనం చేశారు. ఆ
తరువాత కారంచేడు ప్రాంతం(17-7-1985)లో దళితులపై జరిగిన మారణకాండతో దళితుల్లో చైతన్యం వెల్లువెత్తింది. అంతకుముందు పదిరికుప్పం ప్రాంతం(5-8-1983)లోనూ కొతమంది దళితులను కిరోషిన్ పోసి కాల్చేశారు. నీరుకొండ ప్రాంతం( 15-7-1987)లోకొంతమంది దళితులను చంపేశారు. చుండూరు ప్రాంతం( 6-8-1991)లోనూ కొంత మంది దళితులను ఊచకోత కోశారు. ఈ నేపథ్యంలో జి. లక్ష్మీ నరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్‌ల సంపాదకత్వంలో ""చిక్కనవుతున్న పాట'' వెలువడింది.ఈ సంకలనంతో దళిత కవిత్వం ఒక సమగ్ర రూపం పొందింది. ఆ తర్వాత ఇంచుమించు ప్రతి సాహిత్య పేజీలోను దళిత సాహిత్యంపై చర్చోపచర్చలు జరిగాయి. జి. లక్ష్మీనరసయ్య ఆంధ్రజ్యోతి (ఆదివారం అనుబంధం) లో రాసిన వ్యాసాలు దళిత సాహిత్యానికి శాస్త్రీయమైన వివరణలను అందించగలిగాయి.
1.5 దళిత సాహిత్య ప్రక్రియలు:
తెలుగులో దళిత సాహిత్యం ప్రధానంగా "దళిత కవిత్వమే' అన్నంతగా కవిత్వం వెలువడింది. అదే స్థాయిలో కాకపోయినా కథలు కూడా ఎక్కువగానే వచ్చాయి. నవలలు, నాటకాలు కూడా వచ్చినా సంఖ్యాపరంగా కూడా చెప్పుకోదగినన్ని రాలేదు. దీర్ఘకావ్యం, పాటలు కూడా ఎక్కువగానే వెలువడ్డాయి. ఆత్మ కథ అనువాదాలు కూడా కొన్ని వచ్చాయి. 1985 తరువాత వచ్చిన రచనల్లో జీవితానుభవాలతో కూడిన దళిత చైతన్యం ప్రతిఫలిస్తుంది. వివిధ పుస్తకాలకు రాసిన ముందుమాటలు, పత్రికా వ్యాసాలు, పుస్తకాల రూపంలో దళిత సాహిత్య విమర్శ వచ్చింది. విశ్వవిద్యాలయాల్లో దళిత సాహిత్యంపై పరిశోధనలు జరుగుతున్నాయి. అలా దళిత సాహిత్యం ప్రక్రియా వైవిధ్యాన్ని సాధించింది.
1.5.1 దళిత గేయం:
అస్పృశ్యతను నిరసిస్తూ 1909లో అజ్ఞాత కవి "మాలవాండ్ర పాట' లో ""అందారు పుట్టిరీ హిందమ్మ తల్లికి - ఎట్టాగు ఎక్కూవ బ్యాపన్లు మాకంటె'' అని నిలదీశారు.. "" మంచియన్నది మాలయైతే మాలనే అగుదున్'' అని గురజాడ అన్నారు. జయధీర్ తిరుమలరావు ప్రధాన సంపాదకత్వంలో వెలువడిన "దళిత గీతాలు' (1993)లో చాలా వరకు అస్పృశ్యత నివారణకు ప్రయత్నించిన గేయాలున్నాయి. జాలా రంగస్వామి (1930) రాసిన "అంటరానివారెవరు?' గేయం బొబ్బిలి యుద్ధం బుర్రకథ వరుసలో వీర రసాత్మకంగా సాగింది. నక్కా చిన వెంకయ్య "హరిజన కీర్తనలు' బాగా ప్రసిద్ధి పొందాయి. అస్పృశ్యతా నివారణకై శక్తివంతమైన పాటలు రాసిన వారిలో కుసుమ ధర్మన్న ప్రతిభావంతుడైన కవి. బోయి భీమన్న డా.బి.ఆర్. అంబేడ్కర్పై రాసిన "జయ జయ అంబేడ్కర' (1992), మాష్టార్జీ "అందుకో దండాలు బాబా అంబేడ్కరా' గేయాలు ప్రార్థనా గీతాలయ్యాయి. గద్దర్ "పొట్టకూటి కోసం పోలీసోడు', "దళిత పులులమ్మా' గేయాలు, యువక "కర్మభూమిలో పూసిన ఓ పువ్వా', గూడ అంజయ్య రాసిన "ఊరు మనదిరా ఈ వాడ మనదిరా' గేయాలు దళితులను నేటికీ ఉర్రూతలూగిస్తున్నాయి. శివ సాగర్, వంగపండు ప్రసాదరావు, ఉ. సాంబశివరావు, ఇంకా అనేక మంది రాసిన గేయాలలో చాలా వరకు సంస్కరణ, మార్క్సిస్టు భావాలు అధికంగా ఉన్నా దళిత జీవితమే స్పష్టమవుతుంది.
1.5.2 దళిత పద్య కవిత్వం:
అస్పృశ్యతా నివారణను ప్రతిఫలించే గేయాలు మాత్రా ఛందస్సులో పద్యాలలో దళిత, దళితేతరులు రాసినా, 1915లో మంగిపూడి వెంకట శర్మ గారి "నిరుద్ధ భారతం' ఛందోబద్ద దళిత పద్యకావ్యాల్లో మొదటి రచన. ఆ తరువాత పేర్కొనదగిన పద్యాలు, కావ్యాలు శతకాలు చాలా వరకు వచ్చాయి. అయితే అవి జాతీయోద్యమ సాహిత్యంలో భాగంగా గాంధీ ప్రభావంతో వెలువడినవి. కుసుమ ధర్మన్న ( హరిజన శతకం - 1933), కర్ణ వీర నాగేశ్వరరావు (అస్పృశ్యుల విజ్ఞప్తి -1936), బిర్నీడి మోషే (హరిజనాభ్యుదయం, పృథ్వీ భాగవతం - 1966), జోసెఫ్ కవి ( కన్నీటి కబురు), గుర్రం జాషువా (గబ్బిలం - 1941), కె.సి. జాన్ (బహిష్కారం -1948, ధర్మచక్రం), ఎడ్లపల్లి సామ్యూల్ (చిక్కడు -1963), మల్లవరపు జాన్ ( విశ్వ ప్రకాశం - 1974, అతుకుల బ్రతుకులు), సవ్వప్పగారి ఈరన్న (కడలి కెరటం - 1987), నంబూరు దూర్వాస మహర్షి (లోకాలోకనం - 1971), నూతక్కి అబ్రహాం (మత్కణం), రావూరి ఏకాంబరం (అంబేడ్కరో సమరసింహ -1994), కొలకలూరి స్వరూపరాణి (ప్రబోధము), ఎస్.టి.జ్ఞానానంద కవి (పాంచజన్యం, ధర్మాగ్రహం), ఆశావాది ప్రకాశ రావు (అంతరంగ తరంగాలు - 1990) తదితరులు ఎంతో మంది కవులు కుల నిర్మూలనను ఆకాంక్షిస్తూ తమదైన దృక్పథంతో పద్య కవిత్వాన్ని రాశారు. ఛందోబద్ద పద్య కవిత్వం దళితుల దగ్గరకు చేరే సాహిత్య రూపం కాదని ఎనభయ్యో దశకం వచ్చే నాటికి చాలా మంది వాదించినా కావ్యాలు వెలువడుతూనే ఉన్నాయి. గుర్రం జాషువా పద్యాలు నేటికీ దళితులకు ప్రేరణనిస్తూనే ఉన్నాయి.
దళిత సాహిత్యంతో పరిచయం ఉన్న ప్రతీ వారికి గుర్రం జాషువా రాసిన ఒక పద్యం అయినా నోటికి రాకుండా ఉండదు. ఆ పద్యాల్లో ఉండే వస్తువు, లాలిత్యం, మాధుర్యంతో రసభరితంగా ఉండటమే దానికి ప్రధాన కారణం. గబ్బిలం కావ్యంలో పరమేశ్వరునికి సందేశం పంపిస్తూ దళితుని గురించి ...
ముప్పు ఘటించి వీని కులమున్, గలిమిన్ గబలించి దేహమున్
బిప్పి యొనర్చు నీ భరత వీరుని పాదముకందకుండగా
జెప్పులు కుట్టి జీవనము సేయును గాని నిరాకరింపలే
దెప్పుడు నప్పువడ్డది సుమీ భారతావని వీని సేవకున్'' - అని వర్ణించారు జాషువా.
దళితుల శ్రమను విలువ కట్టడం సాధ్యం కాదంటున్నారు కవి. గాంధీ ప్రభావంతో దళితేతరుడైనా తుమ్మల సీతారామమూర్తి అస్పృశ్యతా నివారణను కోరుతూ...
"హరిజనుల యందు నేను నొక్కరుండననుచు
నెపుడు ప్రతి హైందవుడు నిర్ణయించుకొనునొ
యపుడె యస్పృశ్యతా భూతమాపసరిల్లు
నపుడె శుచితామయ సమాజమవతరించు''ను అనే భావాలతో పద్యాలను రాశారు.
ఇలా అనేక మంది పద్య కవిత్వం ద్వారా కూడా దళిత సమస్యను వర్ణించే ప్రయత్నం చేశారు. కుసుమ ధర్మన్న, గుర్రం జాషువా, బోయి భీమన్నలను దళిత పద్యకవిత్రయంగా అభివర్ణించవచ్చు.
దళితుల గురించి తొలిసారిగా ‘‘"నిరుద్ధభారతం’‘' కావ్యాన్ని రాసిన మంగిపూడి వేంకటశర్మ అస్పృశ్యతను నిరసిస్తూ...
"మాలలని, పంచములటంచు, మాదిగలని
శ్వపచులని, చెప్పగారాని వారటంచు
మరియు చండాలురని తోడి మానవులను
దురలి వేయుట సాంఘిక ధర్మమగునె'' అని సంఘాన్ని ప్రశ్నించారు.
మొత్తం మీద దళిత పద్య కవిత్వంలో మూడు ప్రధాన ధోరణులు కనిపిస్తున్నాయి. గాంధీ ప్రభావం, గాంధీ - అంబేడ్కర్ ప్రభావం, హేతువాద భావాలు గల పురాణ విమర్శతో కూడిన మానవతా వాద ధోరణులుగా వాటిని చెప్పుకోవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి