"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

24 ఫిబ్రవరి, 2009

జాతి అస్తిత్వాన్ని చిత్రించిన మాదిగ కథలు


-డా//దార్ల వెంకటేశ్వరరావు

లెక్చరర్ , తెలుగు శాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం,

గచ్చిబౌలి, హైదరాబాదు-46

9989628049, vrdarla@gmail.com


తెలుగులో అస్తిత్వ వాద సాహిత్యం విస్తృతమవుతుంది. దీనికి పత్రికల తోడ్పాటు ఉన్నా, లేకపోయినా ఏదొక రూపంలో తమ సాహిత్యాన్ని ప్రతి కులం, ప్రాంతం, మతం వాళ్ళు లోతైన దృష్టితోనే చూస్తున్నారు. స్త్రీవాద, దళిత,ముస్లిం,బి.సి,. గిరిజన, తెలంగాణ, రాయలసీమ సాహిత్యాలుగా తెలుగులో అనేక విభజనలు కంపిస్తున్నాయి.ఈ కోణంలో దళిత సాహిత్యాన్ని చూసినప్పుడు దానిలో అంతర్భాగంగా ఉంటూనే మాదిగ సాహిత్యం ప్రత్యేక అస్తిత్వంతో ముందుకొస్తుంది. వీటిని చారిత్రక దృష్టి కోణం నుండి కూడా అధ్యయనం చేస్తున్నారు. సాహిత్యంలో పునర్మూల్యాంకనం జరుగుతునే ఉంది. దీని వల్ల సమాజంలోనూ, సాహిత్యంలోనూ నూతన విలువలు ప్రవేశిస్తున్నాయి.

తెలుగుకథాసాహిత్యంలో మాదిగల గురించి ప్రస్తావిస్తూ మొట్ట మొదటి సారిగా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి "పుల్లంరాజు" కథను రాశారు. ఆ తరువాత ఆయనే "సాగర సంగం" (1931) ; "మాదిగ పల్లె " ; "ఇలాంటి తవ్వాయి వస్తే" (1934) కథల్నిరాశారు. వీటిలో మాల–మాదిగల ప్రస్తావన ఉంది. వీరి మధ్య అనైక్యత, సాంస్కృతిక వ్యత్యాసాల్ని ఈ కథల్లోవర్ణించారు. ఈ అనైక్యతను ఆసరా చేసుకుని అగ్రవర్ణాలు చెలాయిస్తున్న ఆధిపత్యాన్న్ని వివరించారు. మాల మాదిగల్లో జరుగుతున్న మతాంతరీకరణకు గల కారణాల్ని హిందూమత దృష్టితో రాసిన కథలవి. గోపీచంద్ "చెప్పులు కుట్టేవాడు"(1961) కథలో రోడ్డు పక్కనకూర్చుని చెప్పులు కుట్టుకునే మాదిగ జీవితాల్ని వర్ణించారు. ఆ దుమ్మూ, ధూళీ వల్ల ఊపిరి తిత్తులు పాడై చెప్పులు కుట్టే వారు ఎలా చనిపోతున్నారో వర్ణించారు.

1969లో ఆచార్య కొలకలూరి ఇనాక్ "ఉరబావి" అనే పెద్ద కథను రాశారు. మాల – మాదిగల మంచినీళ్ల సమస్యను వర్ణించిన కథ. అగ్ర వర్ణాల వారి దౌర్జన్యాల్ని ఒక మాదిగ స్త్రీ ఎలా ఎదుర్కొందో చెప్పిన కథ . అగ్రవర్ణాల వారి పీడనను అగ్రవర్ణ చాణక్య నీతితోనే సమధానం చెప్పిన కథ. వ్యవస్థ కోసం వ్యక్తి చేసిన సాహసం దీనిలో కనిపిస్తుంది. జి.భాను ''పాపానికి జీతం" కథ (1969) లో అగ్ర వర్ణ భూస్వామి మాదిగ స్త్రీని బలాత్కరించబోయి, ఆమె తిరగ బడటంతో చంపేసి, ఎవరికీ తెలియకుండా తిరిగినా, తాను చేసిన పాపం వల్ల కాలు పుండు పడి అతడు చనిపోయినట్లు చిత్రించారు. ఇది కర్మ సిద్ధాంతాన్ని బోధించే కథ . స్వామి "తల్లి మట్టి"(1991) కథలో మాదిగ ఉపాధ్యాయుడు కులం చెప్పుకోడానికి చదువుకున్న మాదిగలు కూడా ఆత్మ న్యూనతకు గురవుతున్నారని తెలిపిన కథ. దీన్ని మాదిగ జీవితాల పై మరింత అవగాహనతో రాస్తే బాగుండేది. శాంతి నారాయణ గారి "జీవనాడులు"(1991) కథలో మాదిగల ఇండ్లలో జరిగే పెండ్లికి ఎవరెవరు వస్తారనే విషయాలు వర్ణించారు. మాదిగ ఇండ్లలో పెండ్లి జరిగితే తమతో పాటు వీరణం వాయించే మంగలి వాళ్ళు కూడా రారనీ చెప్పిన కథ. కాలువ మల్లయ్య గారి "అగ్ని గుండం" ( 1991) కథలో మాదిగలు డప్పు కొడుతూ సమాజానికి సహకరిస్తున్నా, ఆ మాదిగలకు సమాజంలో గౌరవం లేదనీ, కనుక ఆ పరిస్థితి తన కొడుక్కి రాకూడదని భావించిన ఒక తండ్రి కొడుకిని యూనివర్సిటిలకు పంపిస్తే అక్కడ జరిగే గొడవల్లో అతడిని ఇరికించి అరెస్టు చేస్తున్న అగ్రవర్ణాల వారి అధికారాన్ని, కుట్రల్ని వివరించారు. పరిశ్రమల వల్ల చర్మకార వృత్తి ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటుందో, దానికి ప్రభుత్వం ఎలాంటి చర్యల్ని తీసుకుంటుందో బోయ జంగయ్య గారి "ఇదికతా!" లో చూడవచ్చు. శాంతినారాయణ గారి "ఉక్కుపాదం" కథలో మాదిగ వ్యక్తి మంత్రి అయినా, అధికారాన్ని అగ్రవర్ణాల వాళ్ళే ఎలా ఉపయోగించు కుంటారో, ఎదురు తిరిగితే ఎలాంటి అవమానాల్ని ఎదుర్కోవలసి వస్తుందో వివరించ గలిగింది. ఆర్థిక శక్తి లేని అధికారం కేవలం నామ మాత్రమేనని, సాంఘిక సమానత్వం రానిదే కేవలం రిజర్వేషన్లు ఉన్నా అవి మాదిగలు అనుభవించలేని స్థితే ఉంటుందని నిరూపించిన కథ.

ఎస్.సి. వర్గీకరణ నేపథ్యంలో చాలా మంది రచయితలు మాల - మాదిగల మధ్య వైరుధ్యాలని వర్ణించే కథలు రాశారు. తోలేటి జగన్మోహనరావు "వర్ణక్రమాలు"; పైడి తెరేష్‌బాబు "అనుబంధ ప్రశ్న" ( 1996 ) సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి "అంటు"; మద్దూరి నగేష్ బాబు "దోమతెర" కథల్లోమాల - మాదిగల వర్గీకరణ సమస్య కనిపిస్తుంది.సమైక్యత లేకపోవడం వల్లనే దళితులు మోసపోతున్నారనీ, దళితుల్ని అగ్రవర్ణాలవాళ్ళే విడగొట్టేస్తున్నారనేది ఈ కథల్లోని సారాంశం. అన్నంటికీ అగ్రవర్ణాలవాళ్ళే కారణమనడం ఎంతవరకూ వాస్తవమో ఆలోచించ వలసిన అవసరాన్ని కూడా ఈ కథలే రచయితలు, ప్రజల్ని హెచ్చరిస్తాయి. సామాజిక న్యాయాన్ని పాటించమని అడుగుతున్న మాదిగల వాదాన్ని అగ్రవర్ణాల కుట్రతో దళిత సమైక్యత నాశనమై పోతుందనే వర్గీకరణ వాదమే ఎక్కువగా కథల్లో కనిపిస్తుంది. నాగప్పగారి సుందర్ రాజు, జూపాక సుభద్ర, గోగు శ్యామల లాంటి ఒకరిద్దరు వర్గీకరణ వాదాన్ని సమర్థిస్తూ కథల్ని రాసినా, ఈ దిశాగా మరిన్ని రావాల్సి వుంది.

ఆచార్య ఆచార్య కొలకలూరి ఇనాక్ అంబేడ్కర్ దృక్పథంతో మాదిగ కథల్ని రాశారు. ఈయన రాసిన కథల్లో మాదిగ జీవితం అనేక కోణాల్లో ప్రతిఫలిస్తుంది. వాటిలో తప్పనిసరిగా ప్రస్తావించుకోవలసిన కథల్లో ఊరబావి,తాకట్టు, గొడ్లదొంగ , పొట్ట పేగులిబ్బందిగోడు, కులవృత్తి ముఖ్యమైనవి. ఊరబావి గురించి పైన వివరించటం జరిగింది. తాకట్టు కథ లో బ్రాహ్మణ- మాదిగ అధ్యాపకుల మధ్య నిజమైన మానవ సంబంధాల్ని జంధ్యం అప్పుగా తాకట్టు పెట్టమనటం ద్వారా నిరూపించే ప్రయత్నం చేశారు. గొడ్లదొంగ కథలో ఊళ్ళో దొంగ తనానికి గురవుతున్న పశువుల గురించి, వాటి గరరించి ప్రజలను కొనే అభిప్రాయాల్ని ఒక మంచి చైతన్యం కలించే కథ రాశారు. ప్రజలకు ఆ ఊళ్ళో మాంసం అమ్ముకుని జీవించే నాగడు మీద అనుమానం వస్తుంది. దానితో నాగడే ఒక రాత్రంతా నిద్రపోకుండా ఏమి జరుతుందో కనిపెడతాడు. ఆ ఊరి దొరే పశువుల్ని దొంగతనానికి పాల్పడటాన్ని నాగడు గుర్తిస్తాడు. ఆ దొరని ఊరి ప్రజలందరికి పట్టించినా, వదిలేస్తారని భావించి, అతడిని చంపేసి, ఎద్దు పొట్టలో పెట్టి కుట్టేసి కాలవలో పడేస్తాడు. నాటినుండీ ఆ దొరా కనిపించడు, గొడ్ల దొంగతనాలు ఆగిపోతాయి. మాదిగ ల్ని దొరలే దొంగలుగా ముద్ర వేసే ఒక వాస్తవాన్ని చిత్రించే ప్రయత్నం చేసిన కథ. మాదిగల అమాయక తనాన్ని ఆసరా చేసుకుని వాళ్ళ భూమిని లాగేసుకున్న దొరను, ఒకమాదిగ యువకుడు పేగులు చీల్చేసి చంపిన కథ పొట్ట పేగులిబ్బందిగోడు. అన్ని వృత్తులకూ, ఆ వృత్తి చేసేవారికీ గౌరవం కలిగినట్లే మాదిగలు చేసే కుల వృత్తికీ గౌరవం కలగాలని వాదించే కథ "కులవృత్తి "(2006). మాదిగల జీవితాలకు సంబంధించిన అనేక కోణాల్ని వర్ణిస్తూ కథలు రాసిన వారిలో ఆచార్య కొలకలూరి ఇనాక్, డా.ఎండ్లూరి సుధాకర్ గార్లు ప్రథమ వరుసలో నిలుస్తారు.

డా.ఎండ్లూరి సుధాకర్ మాదిగ జీవితానికీ, వారి వృత్తికీ ఆత్మ గౌరవాన్ని కలిగించేటట్లుగా 'మల్లెమొగ్గల గొడుగు మాదిగ కతలు' (1999) రాశారు. ఈ కథల్లో పురాణాల్నుండి నేటి వరకు మాదిగ జీవితాల్లోని సంఘర్షణల్ని సమస్యల్ని చిత్రించారు. మాదిగ వృత్తి పనితనంలోని గొప్పతనాన్ని, భాషని, సంస్కృతిని వర్ణించారు. చెప్పులు మాదిగలకు దేవతలని ప్రకటిస్తారు రచయిత. చెప్పులు కుట్టి నవాబులని మెప్పించి సన్మానాలని పొందారని చర్మకార వృత్తిలోమాదిగలు చూపే ప్రతిభా పాటవాల్ని వివరించారు. క్రైస్తవ మతం తొలిరోజుల్లో మాదిగల్ని దగ్గరకు తీసినా తర్వాత కాలంలో క్రైస్తవంలోనూ కులం, దోపిడీ బయలుదేరిందని అంబేడ్కరిజంతోనే మాదిగల విముక్తి సాధ్యమని వివరించే కథలు దీనిలో చాలా ఉన్నాయి. ప్రముఖ విమర్శకుడు జి. లక్ష్మీనరసయ్య ఈ కథల్ని వ్యాఖ్యానిస్తూ డా.ఎండ్లూరి సుధాకర్‌గారిని మాదిగ గోర్కీ అని (ముందుమాట : 1999 - 12) అభివర్ణించారు. నాగప్పగారి సుందర్రాజు "మాదిగోడు" (1997 )పేరుతో కొన్ని కథల్ని రాశారు . మాదిగల సంస్కృతిని అర్థం చేసుకోవడానికి, ఆత్మ గౌరవాన్ని గమనిచడానికీ ఈ కథలు ఎంతగానో దోహదపడతాయి. డా.ఎండ్లూరి సుధాకర్, నాగప్పగారి సుందర్రాజు గారలు రాసిన మాదిగ కథలు తెలుగు సాహిత్యంలో ఆత్మకథా ప్రక్రియను ప్రవేశపెట్టాయని విమర్శకులన్నారు (గుడిపాటి, ఇతివృత్తం : 2002 - 12). కాసుల పతాప రెడ్డి రాసిన వెంటాడిన అవమానం కథ మాదిగ ఎల్లయ్య, బాగా చదువుకొని రాహుల్ గా పేరు మార్చుకుని, నగరంలో జీవించినా, కులం వంటాడుతున్న పరిస్థితుల్ని సామాజిక వాస్తవి దృక్పథాన్ని వివరిస్తుంది. ఇంకా అనేక మంది మాదిగ జీవితాల్లోని వివిధ కోణాల్ని వర్ణిస్తూ కథలు రాస్తున్నారు.

మొత్తం మీద వస్తు వైవిధ్యంతో అనేక మంది రచయితలు మాదిగ జీవితాల్ని వర్ణిస్తూ కథలు రాశారు. మాదిగేతర రచయితలు రాసిన కథల్లో అస్పృశ్యత, దేవాలయ ప్రవేశం, కులాంతర వివాహాలు వంటి సమస్యలు చిత్రితమైనా సానుభూతినుండి రూపొందినవే తప్ప, మాదిగ జీవిత సంఘర్షణ పెద్దగా కనపడదు.మాదిగలు చదువుకున్నప్పటికీ, రిజర్వేషనుతో ఉద్యోగాలు పొంది కూడా కులాన్నిచెప్పుకోలేకపోతున్నారనే దృక్పథంతో అగ్రవర్ణ రచయితలు కథల్ని రాశారు. అగ్రవర్ణ రచయితల కథల్లో అవకాశాల కోసం మాదిగలు మతాన్ని మార్చుకుంటున్నారనే ఆలోచనను కలిస్తాయి. కానీ, మాదిగ రచయితలు రాసిన కథల్లో జీవిత లోతులు, చక్కని పరిష్కారాలు, ప్రతిపనిలోనూ ఉండే కార్యకారణ సంబంధాన్ని సహేతుకంగా వర్ణించగలిగారు. మాదిగ సంస్కృతి, ఆత్మ గౌరవం వ్యక్తమయ్యింది. అలాంటి వారిలో ఆచార్య కొలకలూరి ఇనాక్ , బోయ జంగయ్య, డా.ఎండ్లూరి సుధాకర్, నాగప్పగారి సుందర్ రాజు, గోగుశ్యామల, జూపాక సుభద్ర, జె.గౌరి తదితరుల్ని చెప్పుకోవచ్చు. జూపాక సుభద్ర, గోగు శ్యామల గార్ల సంపాదకత్వంలో వచ్చిన "నల్లరేగడి సాల్లు" (2006) కథల్లో మాదిగ సంస్కృతిలో కొత్త కోణాలు కనిపిస్తాయి. దీనిలో మాదిగ ఉప కులాల స్త్రీల జీవితాల్ని కేంద్రంగా చేసుకొని వెలువడిన కథలు చాలా ఉన్నాయి.

కామెంట్‌లు లేవు: