"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

02 February, 2009

ప్రాచీన సాహిత్యాన్ని అర్త్ధం చేసుకోవడమిలా!

('సాంస్కృతిక వ్యతిరేకత'లో భాగం" పేరుతో ఆంధ్ర జ్యోతి లో26-1-2008 న ప్రచురితమైన వ్యాసం)

హిందూ సంస్కృతికి చెందిన ఏ విషయాన్నీ నేటి విద్యార్థులకు బోధించకూడదనే 'సాంస్కృతిక వ్యతిరేకత' డాక్టర్ ఎం.ఎం.వినోదినిగారి వ్యాసంలో ('వివిధ' 12 జనవరి) స్పష్టంగా గోచరిస్తోంది. ఎం.ఎ తెలుగు సాహిత్యంలో ప్రాచీన సాహిత్యం పాఠ్యాంశంలో భారతీయ సాంస్కృతిక విలువలకు సంబంధించిన విషయాలు మాత్రమే పాఠ్యాంశాలుగా ఉంటాయి. ఈ పాఠ్యాంశాలు మానవ జాతికి సంబంధించిన విలువలను మాత్రమే బోధించేవిధంగా ఉన్నాయి. ఇవి ఏ వర్గం అస్తిత్వాన్నీ ద్విగుణీకృతం చేసేవిగాగానీ, కించపరిచేవిగాగానీ లేవు. శకుంతలోపాఖ్యానం విషయానికొస్తే- 'నిజ మనుస్మృతి'ని అధ్యయనం చేయకుండా 'ప్రక్షిప్తాల (ఇంటర్‌పొలేషన్స్) మనుస్మృతి' ఆధారంగా దుర్వ్యాఖ్యలు చేయడం విజ్ఞత అనిపించుకోదు.

వేదప్రతిపాదిత మనుస్మృతిలో చాతుర్వర్ణ వ్యవస్థే పేర్కొనబడింది. నేడు మనకు కనిపించే జన్మజాత కులవ్యవస్థ లేదు. కులాలు లేని వ్యవస్థలో కులాల ప్రస్తావన ఎలా ఉంటుంది? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్గాలు మినహా మిగిలిన వారంతా శూద్రవర్గం వారని పేర్కొనబడింది. ఈ వర్గాలు గుణ, కర్మ స్వభావముల ఆధారంగా ఏర్పడతాయని స్పష్టంగా పేర్కొనబడింది. కాల ప్రవాహంలో కొందరు స్వార్థపరశక్తులు, సంఘ వ్యతిరేకులు, సమాజ కంఠకులు 1214 శ్లోకాలతో ఉండిన విశుద్ధ మనుస్మ ృతికి 1471 ప్రక్షిప్తాలను జతచేసి వక్రీకరించారు.

అదేవిధంగా భారతం 10 వేల శ్లోకాలతో వ్యాసుని కాలంలో ఉండగా, విక్రమాదిత్యుని కాలంలో 20 వేలకు, భోజరాజు కాలంలో 30 వేలకు, నేడు 1 లక్ష పైగా శ్లోకాలతో మహాభారతమైంది. ఇలా ఇంటర్‌పొలేషన్స్ ఆధారంగా మనుస్మ ృతిని వ్యాఖ్యానించడం సమంజసమేనా? ఇక మునికన్య అయిన శకుంతలను మోహించినందుకు, ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయినందుకు దుష్యంతుడు పశ్చాత్తాపపడిన సన్నివేశాన్ని ఉదాత్తమ గుణంగా భావించకుండా కులాంతర వివాహాలను వ్యతిరేకించే 'ఇరుకు' మనస్తత్వంగా వ్యాసంలో పేర్కొనడం సంస్కారమనిపిస్తుందా? భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో మానవుని ప్రవర్తన ఎలా వుంటుందో వ్యాసమహర్షి తన భారతంలో స్పష్టీకరించాడు.

శకుంతల దుష్యంతుల సంభాషణలో భార్యాభర్తల సంబంధం, తండ్రీ కొడుకుల బాంధవ్యం, సత్యవాక్కు విలువ, తండ్రీ కూతురు ప్రేమాభిమానాలు, ఆశ్రమ ప్రశాంతత ఇత్యాది జీవన సత్యాలెన్నో ఉండగా ఒక వర్గానికి సంబంధించిన పెళ్లి ప్రస్తావన లేదనడం ఎలాంటి సంకుచిత మనస్తత్వమనాలి? 1946లో తయారుచేయబడిన రాజ్యాంగం ద్వారా పాలన సాగించే పాలకులు ప్రజాకంఠకులైనారు. దీనికి రాజ్యాంగ రచయితను దూషిస్తే సరిపోతుందా? హిందూ సమాజంలోని సామాజిక రుగ్మతలకు మనుస్మ ృతిని దూషించడం భావ్యమా? మన పురాణాలు, శృతులు (వేదా లు) స్మ ృతులు, కావ్యాలు మనిషి ధర్మం ఆధారంగా అర్థ, కామ, మోక్షాలను సాధించాలని ప్రాచీన సాహిత్యం స్పష్టీకరిస్తోంది.

అస్తిత్వ సాహిత్యం తద్భిన్నంగా సమాజ విఘటనను, అసూయ, ఆగ్రహావేశాలను, మానసిక అశాంతిని ప్రోదిచేస్తున్నది. వేదాలను శూద్రులు, స్త్రీలు చదవరాదని మనుస్మృతిలో పేర్కొనబడినట్లు తప్పుడు ప్రచా రం ఇప్పటికీ కొనసాగిస్తున్నారు కొందరు ప్రబుద్ధులు. భవిష్య పురాణంలో (44.33) విద్వాంసుడైన శూద్రుడు బ్రాహ్మణుని కంటే అధికుడని నొక్కివక్కాణించబడింది. అదేవిధం గా పద్మపురాణంలో (11.203) నిష్ఠాగరిష్ఠుడైన వ్యక్తి చండాలుడైనా దేవతల చేతనే బ్రాహ్మణుడిగా కీర్తించబడతాడని స్పష్టీకరించబడింది. మహాభారతం అనుశాసన పర్వంలో (143-51) సత్ప్రవర్తన గల శూద్రునికి బ్రాహ్మణత్వం లభిస్తోందని స్పష్టంగా విశదీకరించబడింది.

ఇలాంటి విషయాలు మనువును దూషిం చే వారికి తెలుసా? సంఘవ్యతిరేక శక్తులవల్ల, స్వార్థపరుల వల్ల హిందూ సమాజంలోని దళితులు అనేక అవమానాలకు, వివక్షతలకు, అమానవీయ సంఘటనలకు గురైనారు. అందుకు సంస్కృత భాష కారణమని చెప్పడం మూర్ఖత్వం కాదా? ఇంగ్లీషువాళ్లు వలసరాజ్యాల్లోని ప్రజలను పశువుల కంటే హీనంగా చూసి, అనేక అరాచకాలు చేశారు. అందుకు ఇంగ్లీషు భాషను దూషిస్తే సరిపోతుందా? శంకరాచార్య మొదలు గాంధీ వరకు హిందూ సమాజంలోని రుగ్మతల తొలగింపుకు శాయశక్తులా కృషి సల్పారు.

వారెవరూ నిమ్నకులాల దుస్థితికి సంస్కృత భాష కారణమని చెప్పలేదు. జీవన విలువలకు సంబంధించి ఉత్కృష్ట విషయాలను పరిగణనలోకి తీసుకోకుండా సామాజిక సమరసతకు ఏమాత్రం పనికిరాని వక్రీకరణలతో వాదనలు కొనసాగించే సంకుచిత మనస్తత్వం గల వారివల్ల సమాజానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు.

- ఉల్లి బాలరంగయ్య, పోరుమామిళ్ల

1 comment:

Malakpet Rowdy said...

Makes a lot of sense!