"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

02 ఫిబ్రవరి, 2009

ప్రాచీన సాహిత్యాన్ని అర్త్ధం చేసుకోవడమిలా!-2

వేదాల పట్ల అవగాహన లేకనే..! " పేరుతో ఆంధ్రజ్యోతిలో 26-1-2009 న వచ్చిన వ్యాసం)

'బాధించే పాఠాలు..' అన్నవ్యాసం వినోదిని గారి ఆలోచనా ధోరణిని వివరంగా చూపిస్తోంది. మనం రాస్తున్న వ్యాసంలోని విషయం ఏ కాలానికి చెందినదో, నాటి సాంఘిక రాజకీయ మత పరిస్థితులు ఎట్లా ఉన్నాయో తెలుసుకొని రాయటం రచయిత కనీస బాధ్యత. గడిచిన కాలాన్ని ఇప్పటి పరిస్థితులతో పోలిస్తే మిగిలేది ఆయాసం, కంఠశోష మాత్రమే. పాఠశాల నుంచి విశ్వవిద్యాలయం వరకు చదివే పాఠ్యాంశాలు మత గ్రంధాలు కావు. రామాయణ భారతాలు కేవల మతగ్రంధాలు కావు అన్న విషయం రచయిత్రి గమనించినట్లు లేదు.

'ఈ కావ్యాలను ఆనాటి ధర్మాలను, పరిస్థితులను, విలువలను అనుసరించి రచించారు' అని రచయిత్రి రాసారు. ఏ కాలంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా సమకాలీన సమస్యలనే సాహిత్యం ప్రతిబింబిస్తుంది. కాలానుగుణంగా లేని అభూత కల్పనలు ఏ సాహిత్యం సృష్టించలేవు అని ప్రపంచ సాహిత్య చరిత్ర చదివిన ఎవరికైనా తెలిసే విషయమే. 'పాత విలువలతో కూడిన ఈ కావ్యాల బోధనను ఆధునిక విలువలతో అనుసంధానం చేయాల్సి ఉంది' అన్న రచయిత్రి అభిప్రాయం అర్థం లేనిది. ఎందుకంటే విలువలు ఎన్నడూ మారవు. అవి నిత్య సత్యాలు.

శకుంతలోపాఖ్యానం గురించి రచయిత్రి చెబుతూ దళితులను అణచివేసిన సమాజమది అని ఆ కాలాన్ని గుర్తించారు. మౌలికంగా ఏ ప్రాతిపదికన వర్ణ వ్యవస్థ ఏర్పడిందో, ఆ వ్యవస్థను క్రమంగా స్వార్థపరులైన నాయకులు లేదా కొందరు వ్యక్తులు కులాల పేరిట తునాతునకలు చేసి, తమ పబ్బం గడుపుకుంటున్న విషయం రచయిత్రికి తెలియదంటే ఆశ్చర్యంగా ఉంది. అయిదు రకాల తండ్రుల ప్రస్తావన సందర్భంలో రచయిత్రికి ఏ అర్హత ఒక వ్యక్తికి తండ్రి స్థానాన్ని ఇస్తుందో తెలియదని స్పష్టపడుతోంది. ఇక్కడ శూద్రులు, దళితుల ప్రసక్తి అసందర్భమని రచయిత్రికి ఇప్పటికి అర్థమైవుండాలి.

8 విధాలైన పెళ్లిళ్లు నాటి సమాజంలో ప్రాచుర్యంలో ఉన్నాయని అర్థం, అంతేగాని నాటి వ్యవస్థలో ఇంకా మొలకెత్తని దళితులను నాటి కవులు ఊహించి వారి గురించి చెప్పలేదనడం రచయిత్రి సుదూరదృష్టి అనుకోవచ్చా? తన దృష్టిలోపాన్ని సరిదిద్దుకోకుండా వ్యాసుడిని, నన్నయను ఆడిపోసుకోవడం సమంజసం కాదేమో! భారతదేశంలో పుట్టిన వ్యక్తికి వేదాల గురించి తెలియదంటే వారి పుట్టుకను అనుమానించాలి. వేదాలపట్ల అవగాహన లేని వ్యక్తులు చెప్పే పైపై మాటలు విని వేదంలో అదే ఉందని నమ్మే అజ్ఞానులు నిజంగా తెలుసుకోవాలన్న నిజాయితి, చిత్తశుద్ధి ఉంటే, చదివి అర్థం చేసుకోగల సత్తా ఉంటే వేదాన్ని సంపూర్తిగా చదివి మాట్లాడితే బాగుంటుంది. వేదంలో ఏయే విషయాలు చర్చించబడ్డాయో తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది.

వేదాలు చెప్పిన ప్రాకృతిక, వైజ్ఞానిక విషయాల పైననే విదేశీయుల పరిశోధనలు కేంద్రీకృతమైనాయి అన్న విషయం అర్థం చేసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది. అప్పుడు 'ప్రకృతి సరసన వేదాలు చేర్చి' అన్న పదబంధమే రచయిత్రి ఉపయోగించరు. ప్రకృతికి వివక్ష లేదు, కాని వేదాలలో కొందరిని పశువుల కన్నా హీనంగా చూసారన్న విషయాన్ని మాత్రమే అర్థం చేసుకున్న రచయిత్రికి వేద మంత్రద్రష్టలు ఎందరో జన్మతః బ్రాహ్మణులు కాదన్న విషయం గాని, ఉపనిషత్కర్తలు చాలామంది బ్రాహ్మణులు కాదన్న విషయం గుర్తుకొచ్చినట్లు లేదు, లేదా అర్థం అయినట్లు లేదు. ఇట్లాంటి పాఠ్యాంశాలు బోధించే దళిత ఉపాధ్యాయుల నిస్సహాయతపై రచయిత్రి సానుభూతి చూపించారు. అత్యంత బాధ్యతాయుతమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వ్యక్తులకు సమాజంపట్ల తమ బాధ్యత తప్పకుండా తెలుస్తుంది కాబట్టి వారు రచయిత్రి భావించినంతగా కుంగిపోయే అవకాశం లేదు.

స్వాతంత్య్రం వచ్చిన 60 సంవత్సరాలలో రాజ్యాంగపరంగా వచ్చిన అనేక చట్టాలు రచయిత్రి వంటివారికి కేవలం శస్త్రాలుగా పనికివస్తున్నాయి కాని వ్యక్తిత్వాన్ని పెంచటంలేదు. ఈ రోజు అందరిచేత మన్ననలందుకుంటున్న అంబేడ్కర్ ఎంత పట్టుదలతో పైస్థాయిని అందుకున్నాడో రచయిత్రికి తెలియదా? ప్రతీదానికి అంబేడ్కర్ ఇట్లా అన్నాడు అని ఉదాహరణ లివ్వడమే తప్ప అతని మార్గాన్ని అంటే ఆ పట్టుదల, ఆ నిర్భీకత నేర్చుకోవాలన్న తపనని ఎంతమంది అనుసరిస్తున్నారు? వచ్చినా రాకపోయినా తప్పులతోనైనా ఇంగ్లీషును మాట్లాడ్డానికి తపన పడే వీరు ఈ దేశపు మౌలికమైన భాషను తిరస్కరిస్తారా! సంస్కృతం ఈ దేశపు భాష. నేడు జరుగుతున్న అసంఖ్యాక నేరాలకు వయస్సుతో సంబంధం లేకుండా జరిగే మానభంగాలకు, హత్యలకు ఈ సంస్కృత గ్రంధాలలోని 'కామోద్దీపన' పద్యాలే కారణమా? అందుకే కళాపూర్ణోదయంలోని సుగాత్రీశాలినుల కథ రచయిత్రికి అర్థం కాలేదు.

మనిషికి పైపై మెరుగులు ముఖ్యం కాదు. కష్టించి పనిచేసే స్వభావం, నిరాడంబరత ముఖ్యమని ఈ ఉపాఖ్యానం చెబుతుంది. ఈ వ్యాసం చదివాక ఎంతోమంది ఉపాధ్యాయులను, విద్యార్థులను నేను కలిసి, ప్రశ్నించి తెలుసుకున్న సమాధానం ఇక్కడ ఇస్తున్నాను. రచయిత్రి భావించినట్లుగా 'క్లాస్ రూం హింస' ఎక్కడా లేదు. మరి రచయిత్రి ఎవరి బాధలు చూసి కరిగిపోయి ఇంత పెద్దవ్యాసం రాసారో వివరిస్తే బాగుంటుంది. సామాజిక నియమాలు మనుషుల ప్రవర్తన, అవసరాల ఆధారంగా మారుతుంటాయి గాని విలువలు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాయి.

- డాక్టర్ కృష్ణ, హైదరాబాద్

కామెంట్‌లు లేవు: