వినోదినిగారి 'బాధించే పాఠాలు..' వ్యాసం (వివిధ-12.01.09)లో శకుంతలోపాఖ్యానంపై వ్యాఖ్యానం పచ్చకామెర్లవాళ్లకి లోకమంతా పచ్చగా కనిపించినట్లుంది. 'తనర జనకుండు ప్రదాతయు..' అన్న పద్యాన్ని ఉదహరిస్తూ అధ్యాపకుడిని తండ్రిగా చెప్పడం జరిగింది. ఆ పద్యానికి మూలం, 'జనితా చోపనేతాచ యశ్చ విద్యాం ప్రయచ్చ తి/అన్నదాతా భయత్రాత పంచైతాః పితరః స్మ ృతాః'-ఇందులో 'యశ్చ విద్యాం ప్రయశ్చతి' (ఎవరైతే విద్యను బోధిస్తారో) అన్నప్పుడు ఇక్కడ ఉపాధ్యాయుడు అంటే 'అందరి కీ విద్యను అందించేవాడు' అన్న అర్ధం తీసుకోవాలి.
ఇక విద్యార్థులు/శిష్యులు అంటే వినోదినిగారు 'ద్విజులు'అన్నఅర్థం మాత్రమే తీసుకున్నారు. ఏం, వీరు ద్విజులకు మాత్రమే బోధిస్తున్నారా? పోనీ, ఏ అధ్యాపకుడైనా ద్విజులకు తప్ప అన్యులకు బోధించ ను అన్నాడా? పై పద్యంలో కూడా విద్యార్థులు అన్నదే ఉంది తప్ప, ద్విజులు అని నన్నయ వ్రాశాడా? లేదే. అది వినోదినిగారు కల్పించుకున్న అర్ధం. పూర్వం బ్రాహ్మణులకు మాత్రమే నేర్పేవారు కాదా? అని అడగవచ్చు. కావచ్చు. కానీ, నేటి కాలంలో వారితోపాటు అన్ని వర్ణాల వాళ్లు విద్యను అభ్యసిస్తున్నారు.
అటువంటప్పుడు 'శిష్యులు' అన్న పదానికి 'ద్విజులు' అన్న సంకుచితార్థాన్నే ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదు. వ్యాసుని, నన్నయను విమర్శించగలిగే స్థాయటండీ మనది? దిక్కూమొక్కూ లేకుండా అనాథగా ఉండిపోయిన తెలుగుకు సుస్థిర స్థానాన్ని, లిపిని, నుడికారాన్ని ఏర్పరచిన ఘనుడు నన్నయ. అంతటి మహానుభావునికి కులతత్వాన్ని అంటగడతారా? ఒకపక్క కులమతాల ప్రస్తావన ఉండకూడదు, కుల విభజనలు పోవాలని ఉద్యమాలు జరుగుతున్నాయని వ్రాశారు.
మరోప్రక్క పాఠ్యాంశాలు నిర్ణయించే 'బోర్డ్ ఆఫ్ స్టడీస్' లో దళితవాదులు, స్త్రీవాదులు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి ద్వంద్వ వైఖరి అవసరమా! అసలు కులమతాల ప్రస్తావనే అవసరం లేనపుడు వీరు దళితవాదాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నట్లు? 'అంటరానితనం నేరం' అని చెప్పడానికి సరైన మార్గదర్శకాలు లేనందున, అది చెప్పలేకపోతున్నారు అని వ్రాశారు. అసలు అలా చెప్పవలసిన అవసరం ఏముంది? వీరి తరగతిలో ఎవరినైనా అలా దూరంగా కూర్చోబెడుతున్నారా?
అలా కూర్చోబెట్టనపుడు, విడివిడిగా చూడనప్పుడు అటువంటి భావనను తేవాల్సిన అవసరం ఏముంది? దళితుల చెవులలో సీసం పోయడానికి కారణమైన సంస్కృతాన్ని సిలబస్ నుండి తొలగించాలన్న వీరి అసంబద్ధ ప్రతిపాదనను ఏమనాలో అర్థం కావడంలేదు. సీసం పోయడానికి కారణం సంస్కృతం కాదు. వేదాలు. అవి ఆ భాషలో ఉన్నంత మాత్రాన ఆ భాషనే ద్వేషించడం ఎంతమాత్రం సమంజసం? అసలు వీరి ద్వేషం వేదాలపై కాక, సంస్కృతంపై ఎందుకున్నట్లు?
Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి