"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

23 January, 2009

తెలుగు సాహిత్యం - మాదిగ జీవిత ప్రతిఫలనం

--డా//దార్ల వెంకటేశ్వరరావు
అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలుగు శాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం,
గచ్చిబౌలి, హైదరాబాదు-46, ఫోను: 09989628049, vrdarla@gmail.com

1.0.ప్రస్తావన:
తెలుగు సాహిత్యానికి సుమారు పదిహేను వందల సంవత్సరాల చరిత్ర ఉంది. నన్నయ క్రీ.శ .11వ శతాబ్దంలో ఆంధ్ర మహా భారతాన్ని రాశాడు. రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉన్న నన్నయ ఆంధ్ర మహా భారతాన్ని వర్ణా శ్రమ ధర్మ పరిరక్షణ కోసం రాశాడు ( ఆంధ్ర మహాభారతం-ఆది:1 - 6). వర్ణాశ్రమ ధర్మాలను పరిరక్షించటం నాటి పాలకుల విధి. ఆ వర్ణాశ్రమ ధర్మాలు హిందూ ధర్మాన్ని బోధించే మనుస్మృతి మొదలైన గ్రంథాలను అనుసరించి రూపొందినవి. అలాంటి వర్ణాశ్రమ ధర్మాల గురించి వివరించటంలో ప్రాచీన తెలుగు కవులు మాదిగలను కూడా శూద్రులుగానే పరిగణించారు. బ్రాహ్మణ, క్షత్రియ ,వైశ్యులకు అసూయలేకుండా సేవచేయటమే శూద్రుల ధర్మమని మనుస్మృతి (1-91) స్పష్టం చేస్తుంది. ప్రధానంగా ప్రాచీన తెలుగు సాహిత్యంలో ఆ భావజాలాన్ని విస్తరించే ప్రయత్నమే కనిపిస్తుంది. దీనికి భిన్నంగా ఆధునిక సాహిత్యం చాలా వరకూ మానవీయ కోణంతో మాదిగ జీవితాలను వర్ణించింది. కనుక, తెలుగు సాహిత్యంలోని మాదిగల గురించి పురాణ, ప్రాచీన, ఆధునిక విభాగాలుగా విభజించుకుని పరిశీలించటం జరుగుతుంది. ఆయా కాలాలలో వెలువడిన వివిధ సాహిత్య ప్రక్రియలలో మాదిగల జీవితమెలా ప్రతిఫలించిందో ఈవ్యాసంలో వివరించే ప్రయత్నం చేస్తాను.

1.1.‘మాదిగజాతి-వివరణ:
భారతదేశంలో ఉన్న కులాలు, తెగలను రాజ్యాంగం షెడ్యూల్డ్ కులాలు(S.C), షెడ్యూల్డ్ తెగ(S.T)లని పేర్కొన్నది. షెడ్యూల్డ్ కులాల్లో మాదిగఒక ఉప కులం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో S.C ల లో ఉన్న 6 1 కులాల్లో ఇదొకటి. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాల -మాదిగ కులాలు అనేక సాంస్కృతిక విషయాల్లో భిన్నమైనవిగా కనిపిస్తాయి. వ్యవహారంలో వీటికి అనుబంధంగానే ఈ మిగిలిన కులాలన్నీ ఉన్నాయి. ఈ పరిస్థితే ఇంచుమించు తెలుగు సాహిత్యంలోనూ కనిపిస్తుంది. అందుకనే మాల-మాదిగకులాలను అస్పృశ్యులు, చండాలురు, పంచములు, హరిజనులు, దళితులు మొదలైన పేర్లతో పిలుస్తున్నారు. ఇన్ని పేర్లతో పిలుస్తున్నా, ఆశ్రితకుల విభజన వల్లా, మరికొన్ని కుల సాంస్కృతిక లక్షణాల వల్లా సాహిత్యంలో మాదిగలను సాధ్యమైనంత స్పష్టంగా నే గుర్తించే వీలుకలుగుతుంది. తరతరాలుగా మాదిగలకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి (ఆచార్య కంచె ఐలయ్య 1996: iii). వాటిలో గొడ్డుని కోయటం, గొడ్డు మాంసం తినటం, చర్మంతో చెప్పులు కుట్టట్టం, డప్పులు తయారు చేయటం, వాటిని వాయించటం మొదలైన పనులు మాదిగలు మాత్రమే చేస్తుండేవారు. ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని వివరించేటప్పుడు మాదిగఅని స్పష్టంగా కవులు పేర్కొనక పోయినా పైన పేర్కొన్న సాంస్కృతిక లక్షణాల ఆధారంగానే వీరిని గుర్తించక తప్పదు. ఒక సందర్భంలో బోయిభీమన్నగారు కూడా మాల మాదిగలను ప్రాచీన సాహిత్యంలో మాల అనే పేరుతోనే పిలిచారని ఆయన రాసిన రాగ వాసిష్టం నాటకానికి రాసిన ముందుమాటలో పేర్కొన్నారు.

1.1.1.నిఘంటవుల్లోమాదిగశబ్దం:
తెలుగు నిఘంటు కర్తలు మాదిగ అనే శబ్దానికి జాతిపరమైన అర్థాన్నిచ్చారు. జాంబవులు, అరుంధతీయులు, మాతంగులు, గోసంగులు, చండాలురు, బైండ్లవాళ్ళు, కొమ్ముల వాళ్ళు, పంభల వాళ్ళు మొదలైన అర్థాలు కూడా నిఘంటువుల్లో కనిపిస్తున్నాయి. మాల-మాదిగలకు కూడా పెద్ద భేదాన్ని పాటించ కుండానే ప్రాచీన సాహిత్యంలోనూ ప్రయోగాలున్నాయి.
దీన్నిఅనుసరించి తెలుగు సాహిత్యంలో మాదిగల జీవిత ప్రతిఫలనాన్ని కింది విధంగా తెలుసు కోవచ్చు


1.2.
పురాణాల్లో మాదిగలు - సాహిత్యం :


మాదిగల జీవితంలోని అనేక కోణాలను, మాదిగల ఆత్మ గౌరవాన్ని తెలియ చెప్పే పురాణం జాంబపురాణం. దీన్ని వ్యవహారంలో జాంబవపురాణం అని కూడా పిలుస్తారు. దీనిలో మాదిగ- బ్రాహ్మణ సంబంధాల చర్చ తాత్త్విక స్థాయిలో కనిపిస్తుంది. సృష్టికి ముందు పుట్టినవాడు జాంబవముని.ఆ తర్వాతనే ఆదిశక్తి, త్రిమూర్తులు,కామధేనువు,సరస్వతి,లక్ష్మీ,పార్వతుల జననం వంటివి ఈ పురాణం లో ఉన్నాయి.జాంబపురాణాన్ని తెలుగు జానపద కళారూపాల్లో ఒకటిగా కూడా పరిశోధకులు భావిస్తున్నారు. అయితే, సంప్రదాయ సాహితీవేత్తలు జాంబపురాణాన్నిభారతీయ అష్టాదశ (18) పురాణాల్లో ఒకటిగా గుర్తించలేదు. అలా గుర్తించకపోవటంలో హిందూ భావజాలం పాత్ర చాలా ఉంది. ఎవరు ఎలా భావించినా జాంబపురాణానికి మాదిగ సాహిత్యం లో ప్రముఖ స్థానమే ఉంది.

మాదిగల చరిత్ర, సంస్కృతులను అర్థంచేసుకోవటానికి ఈ జాంబపురాణం ఎంతగానో ఉపయోగపడుతుంది. తమ వంశాన్ని ఉన్నతీకరించుకోవటానికి అగ్రవర్ణాలవారెలా ప్రయత్నిస్తున్నారో, అలాగే మాదిగలు కూడా తమ వంశం గొప్పదని చెప్పుకోవటానికి జాంబపురాణాన్ని ఆధారంగా చూపుతున్నారు. ఈ వాదనలతో వచ్చిన మాదిగ పురాణ సాహిత్యాన్ని పరిశీలిస్తే, డా.బోయి భీమన్న గారు రాసిన రాగవాసిష్టం ( 1959) తొలి తెలుగు పౌరాణిక - సాంఘిక నాటకంగా కనిపిస్తుంది. పురాణాలను అధారంగా చేసుకొని మాదిగల గొప్పతనాన్ని తెలియజేసిన గొప్పనాటకంగా అభివర్ణించవచ్చు. డా.బోయి భీమన్న గారుమాలకులానికి చెందినా ఆయన తొలి దశలో రాసిన రచనల్లో మాల - మాదిగలుఒకటే అనే దృష్టి కనిపిస్తుంది. ఆ నాటకానికి రాసిన ముందుమాటలోనూ ఆ విషయాన్ని స్పష్టంగానే వివరించారు. మాదిగల ఆడపడుచుగా ప్రసిద్ధి చెందిన అరుంధతీ దేవి - వసిష్ఠుల ప్రేమ కథకు పురాణ ఇతివృత్తాన్ని తీసుకుని ఈ నాటకాన్ని రాశారు. ఆ తరువాత నముల కంటి జగన్నాథం గారు అరుంథతీ దేవి చరిత్రము (1968 ) పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు. మాదిగల చరిత్ర ఉన్నతమైందనీ, వేద, పురాణ కాలంలో ఈ కులవ్యవస్థ లేదనీ, తరువాత కాలంలో వసిష్ఠ మహర్షికీ, అరుంథతీ దేవికీ కులాలను అంటగట్టారనీ నిరూపించే ప్రయత్నం (1968 : 47 ) చేశారు.

పురాణాలను, సంస్కృత, తెలుగు మహాభారత, భాగవత, రామాయణాలను చూపుతూ మాదిగ సాహిత్యానికి అంకురార్పణ చేశారు. పాండవుల జన్మకు కారణమైన వాడు కూడా వ్యాస మహర్షే. అతడు పరాశరుడు, ఓ శూద్ర స్త్రీ సత్యవతికీ పుట్టినవాడు. అతడు విభజించిన వేదాలను తమ మూలధనాలుగా బ్రాహ్మణులు భావిస్తారు. పాండవులనూ గౌరవిస్తారు. వాళ్ళు హీన జన్ములు కాదు. కనుక వర్ణం కంటే కర్మ వల్లనే జాతి, కుల భేదాలు నిర్ణయించబడ్డాయి (అదే :1968 : 47 ) అని ఈ రచయిత అభిప్రాయం. ఈయనే అరుంథతీయుల వంశ వృక్షం అనే పుస్తకాన్నీ రాశారు. దీని తరువాత పేర్కొనదగిన పురాణ సాహిత్యం మాదిగ రచనల్లో నల్లపాటి శివనారయ్య గారి వ్యాసాలు మాదిగల గురించి బలమైన ఆధారాలను వివరించేవిగా ఉన్నాయి.

మాదిగల చరిత్ర, సంస్కృతులను పురాణేతిహాసాల ఆధారంగా నిరూపించటానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి. ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి మునివాహనుడు (1976) నాటకం లో తిరుప్పాణ్ ఆళ్వార్ కథ మాదిగల జీవనాన్ని, భక్తినీ గుర్తుకి తెచ్చేలా ఉంటుంది. పురాణాల్లో మాదిగ, అస్పృశ్యుల కథలను డా. బి.వి ఎస్. మూర్తి గారు దళిత కథామంజరి ( 1992) పేరుతో రాశారు. దీనిలో అరుథతీదేవి చరిత్ర తో పాటు మాతంగి కులానికి చెందిన శ్రీ లక్ష్మమ్మ అనే భక్తురాలి కథ కూడా ఉంది (1992 : 111 - 118 ). బొనిగల రామారావు గారు మాల - మాదిగల ప్రాచీన చరిత్ర ” (1997)ను రాశారు. దీనిలో మాదిగలు బ్రాహ్మణుల కంటే ముందే సృష్టించబడ్డారని (1997 : 83)జాంబ పురాణాన్ని బట్టి నిర్ణయించారు. జాతిని తెలిపే పౌరాణిక కథలను భాష, చరిత్రలతో ముడి పెట్టే ప్రయత్నం చేశారు. మాదిగ జాతిని తొలి జాతిగా పేర్కొన్నారు. డా.యస్.టి.ఙ్ణానానంద కవి షెడ్యూల్డ్ కులాలు అంటరానివా?” (1997) అంటూ పురాణాల్లోని కథలను, ఉదాహరణలను పేర్కొంటూ మాదిగలు చరిత్రలో గొప్పవారనీ నిరూపించే ప్రయత్నం చేశారు. కానీ ఉట్టంకింపులకు సరైన ఆధారాలను చూపించి ఉంటే మరింత బాగుండేది.


అరుంధతీయుల చరిత్ర(1998) పేరుతో అల్వాల మల్లేష్ ఒక పుస్తకాన్ని రాశారు. దీనిలో అంతకు ముందు వచ్చిన పుస్తకాలలో ఉన్న విషయాలను సమీక్షిస్తూ వివరించారు. తాళ్ళూరి లాబన్ బాబు గారు మాదిగ వారి చరిత్ర (2001) ను కొత్త కోణంతో రాశారు. మాదిగలే జాంబవులు. వారు పూర్వం భారత దేశాన్ని పరిపాలించిన క్షత్రియ వంశస్థులు, మాదిగల దేశమే జంబూద్వీపం (2001:2-6) అనీ అన్నారు. జాంబవంతుడుఅనేది వ్యక్తి నామం కాదనీ, అది మాదిగ జాతి పేరనీ (పు: 31) నిరూపించటానికి పురాణాలను ఆధారలుగా చూపారు. చలి నుండి రక్షించుకోవటానికి జంతువుల చర్మాలు ఉపయోగపడతాయని కనుగొన్నారు. వాటిని వస్త్రాలుగా తయారు చేసుకోవటంలో నైపుణ్యం ప్రదర్శించిన మాదిగలను చర్మకారులుగా గుర్తించారు. ఇదంతా సామాజిక శాస్త్రాలను ఆంత్రోపాలజీని, పురాణ సాహిత్యాన్ని ఆధారం చేసుకుని మాదిగలు పశుసంబంధ వృత్తిని చేపట్టటానికి గల

కారణాలను శాస్త్రీయంగా చెప్ప గలిగిన పుస్తకం.


ఆచార్య కంచె ఐలయ్య గారు ఏకలవ్య మాసపత్రికలో ఆర్థిక కోణంతో మాదిగ పురాణ అంశాలను వివరించారు. వాటిని తరువాత 1996లో మాదిగ, ఆర్థిక సాంఘిక తత్వం అనే పేరుతో చిన్న పుస్తకంగా ప్రచురించారు. తాళ్ళూరి లాబన్ బాబుగారు మాదిగ చరిత్రను అత్యధిక శాతం చరిత్ర , పురాణాలు, ఆంత్రోపాలజీ ల ను ఆధారం చేసుకునే రాశారు. బొనిగల రామారావు గారు ఆది గురువు ఆచార్య చండాల“ ( 2005) పేరుతో చండాలునితో ఆది శంకరాచార్యుల తాత్త్విక సంభాషణను గమనిస్తే పాఠకులకు ఆ చండాలుడు మాదిగఅనే స్పృహే కలుగుతుంది.


డా.ఎండ్లూరి సుధాకర్మల్లె మొగ్గల గొడుగు మాదిగ కతలు” (1999) లో పురాణాల్లో మాదిగల జీవితానికి సంబంధించిన రెండు కథలు ఉన్నాయి. త్రిమూర్తులు జాంబవమునిని తక్కువ కులంగా పరిగణించటంలో గల నేపథ్యాన్ని జాంబమంతుడూ - పిచ్చి మామా (పు:17-20 ) కథలో రాశారు. ఆరంజోతి” (పుట :113-116) లో అరుంథతిని బ్రాహ్మణులు తక్కువ కులంగా భావించి కుట్ర చేసి చంపేసినట్లు తెలుస్తుంది. తమ తప్పును సరిదిద్దుకోవడానికి బ్రాహ్మణులు మాదిగ కూడలిలోకి వచ్చి, ఇంటి సూరిని ఇరుసుకొని దాన్ని పెళ్ళి సందర్భంగా జరిగే అగ్నిలో వేస్తారు. ఈ ఆచారం వెనుక అరుంథతి కథ ఉందని రచయిత భావన.హిందువులు తమ వివాహానంతరం అరుంథతీ నక్షత్రాన్ని వధూవరుల చేత దర్శింపచేయటం, అరుంథతీదేవి పట్ల చూపే పవిత్ర భావనే అనీ ఇంకా చాలా మంది తమ కథల్లో వివరించారు. పురాణాల్లో ఉండే కథలు కల్పనలు. అవి మానవ సమాజ అసమానతలకు వర్ణవ్యవస్థ పెరగాటానికి వర్గ ప్రయోజనం పొందటానికి ఉపయోగ పడుతుందనీ, కిందివర్గాల, వర్ణాల వాళ్ళకు పురాణాలు శాపాల వంటివి అనీ హేతువాదులు భావిస్తారు. అలా పురాణాలను విమర్శించిన వాళ్ళలో నార్ల వెంకటేశ్వరరావు గారు ప్రముఖుడు. అలాగే బి. విజయ భారతి గారు పురాణాలు - కుల వ్యవస్థ” (2001,2003 హైదరాబాదు బుక్ ట్రస్ట్) పేరుతో కొన్ని పుస్తకాలు రాశారు. పురాణ కథలను పరిశోధించినపుడు అష్టాదశ పురాణాలను నమ్మితే జాంబపురాణాన్నీ నమ్మాలని, అప్పుడు మాదిగలు అందరికంటే ముందు పుట్టిన వాళ్ళు అవుతారనీ, అంతేకాకుండా గౌరవనీయులైన వాళ్ళేనని దృక్పథంతో మాదిగ పురాణ సాహిత్య రచన కొనసాగింది. ఇలా కొన్ని పురాణాంతర్గత కథలను తీసుకొని మాదిగల గురించి వివరించే సాహిత్యం కూడా మాదిగల జీవితాన్ని కొంతవరకు ప్రతి ఫలిస్తుంది.

1.3 ప్రాచీన తెలుగు సాహిత్యం - మాదిగ జీవితం :


ప్రాచీన తెలుగు సాహిత్యంలో మాదిగల గురించి ప్రస్తావించినా, శూద్రులు , చండాలురు మొదలైన పేర్ల తోనే కనిపిస్తుంది. శివకవుల్లో పాల్కురికి సోమనాథుడు (12 శతాబ్ది) మాదిగ భక్తుడు బోగయ్యగారి కథను రాశారు. శ్రీకృష్టదేవరాయులు (16వ శతాబ్ది ) రాసిన మాలదాసరికథలో మాలఅని పేర్కొన్నంత మాత్రం చేత ఇప్పుడు వ్యవహారంలో ఉన్న మాలఅనే అర్థలో కాకుండా, చండాలుడు అనే అర్థంలోనే ప్రయోగించారు. వేమన (17వశతాబ్ది) మాదిగల గురించి చెపుతూ, ఆరుంథతిని పొగిడినా చాలా చోట్ల దళితుల పట్ల సదభిప్రాయం లేనట్లు కొన్ని పద్యాలు కనిపిస్తున్నాయి. అయితే వేమన చెప్పినట్లుగా చాలా పద్యాలు ప్రచారంలో ఉన్నాయి. అందువల్ల అభ్యుదయభావాలను ఎన్నింటినో చేప్పిన కవి అమాంతంగా ఆ వర్గాల వారినే నిరసిస్తూ పద్యాలు చెప్పాడని అనుకోవటాన్ని అనుమానించక తప్పదు.

తరువాత గురజాడ అప్పారావు గారు (19 వ శతాబ్ది) మాల - మాదిగల గురించి లవణరాజు కల కథలో మంచి యన్నది మాలయైతేనే మాలనే అగుదున్‌' అన్నాడు. ఇక్కడ మాల అన్నది నేడు వ్యవహారంలో ఉన్న మాల కాదు. అస్పృశ్యుడు అని మాత్రమే అర్థం చేసుకోవాలి. తెలుగు సాహిత్యపరంగా చూస్తే మహా భారతం (11 వ శతాబ్ది) నుండి 19 వ శతాబ్ది దాకా వర్ణ వ్యవస్థను కాపాడే దృష్టితోనే సాహిత్య కృషి కొనసాగుతుంది. అయితే, మార్గ మధ్యంలో వీరశైవులు, బ్రహ్మ నాయుడు, వేమన మొదలగువారు వర్ణ వ్యవస్థను వ్యతిరేకించినా, సాహిత్యం మీద వీరి ప్రభావం పడలేదు ( డా. బన్న అయిలయ్య - తెలుగు కవిత అభినవ దృక్పథం : 2001 - 17) అనేది విమర్శకుల అభిప్రాయం. అంతేగాకుండా పదహారో శతాబ్దంలో మాల దాసరి కథ రాసినా అతడు పూర్వ జన్మలో బ్రాహ్మణుడే. కనుకనే విమర్శకులు భక్తి భావముతో పరిశీలిస్తే మాలదాసరిని కవి (శ్రీకృష్ణ దేవరాయలు) ఉన్నతుడిగా చిత్రీకరించినట్లు కనిపించినా, వర్ణవ్యవస్థ దృష్ట్యా ఆలోచిస్తే హీనుడిగానే చిత్రణ జరిగింది. ఒక నిమ్న వర్ణస్థుని భక్తితత్పరత ఉన్నత వర్ణస్థుడి శాపవిముక్తికి అవసరమైంది. కానీ, ఆ భక్తి ఆలయ ప్రవేశానికి పనికి రాలేదు. దీనికి కారణం వర్ణ వివక్షయే ” (అదే : పు : 21) అని అన్నారు. పాల్కురికి సోమనాథుడు బసవ పురాణంలో చెప్పిన కథ ఇది. బోగయ్య గారి కథలో శివుడు మారువేషంలో బోగయ్య గారిఇంటికి వస్తాడు. చచ్చిన దూడను వండి పెట్టమంటాడు. దాసయ్య గారింటికి వెళ్ళి వండి పెట్టమన్నానని శివుడు, భక్తుడైన బోగయ్య గారితో చెప్తాడు (బసవ పురాణం - ఏడో ఆశ్వాసం - బోగయ్య గారి కథ : పు : 268) ఆ మాంసాన్ని బోగయ్య వండుతాడు. ఆ విషయం బ్రాహ్మణులకు తెలుస్తుంది. మూకుమ్మడిగా అతడి పై దాడి చేస్తారు. మాదిగ కొయ్యను పోనియ్యొద్దు. అగ్రహారం వీడి మూలంగా చండాలమైపోయింది ” ( పు : 269 ) అని నిందిస్తారు. దానితో బోగయ్య మీ అగ్రహారంలో వృత్తులకోసం మే అంగలార్చామా? అంటూఊరు వదిలి వెళ్ళిపోతాడు. ఊరంతా అల్లకల్లోలమైపోతుంది. దానితో మళ్ళీ బ్రాహ్మణులు బోగయ్యగారిని గౌరవిస్తారు (పు:269). శివ భక్తులకు కులం లేదని బోగయ్యగారి కథని బిజ్జలుడికి బసవేశ్వరుడు వినిపించాడని బసవపురాణంలో పాల్కురికి సోమనాథుడు స్పష్టంచేశాడు. ఈయనే రాసినపండితారాధ్య చరిత్రలో కూడా సూరసాని కథలో మాదిగ ప్రస్తావన వస్తుంది.

మంగిపూడి వేంకటశర్మ(20 వ శతాబ్దం) నిరుద్ధ భారతంపద్య కావ్యంలో మాతంగ మహాముని వంశం వాళ్ళే మాదిగలని చెప్పారు. తెలుగు పద్య కవిత్వంలో తొలిసారిగా మాదిగల గురించి చైతన్యవంతంగా వర్ణించిన కవి జాషువా (20 వ శతాబ్దం). ఆయనే స్వయంగా తాను మాదిగ కులానికి చెందిన వాడినని చెప్పుకున్నాడు. కానీ,తన కవిత్వంలో హరిజనులు అనే ఎక్కువగా ప్రయోగించారు. గాంధీ ప్రభావంతో అస్పృశ్యత నిర్మూలన కావాలన్నారు. ఆయన రాసిన గబ్బిలంగొప్ప దళిత ఆర్తిని తెలిపే కావ్యం.

1.4. ఆధునిక తెలుగుకవిత్వం - మాదిగ కవిత్వం :

తెలుగు కవిత్వంలో దళిత కవిత్వానికి ఒక ప్రత్యేకత ఉంది. అందులోనూ సమకాలీన సామాజిక ఉద్యమాలను పట్టించుకున్న కవిత్వంగా మాదిగ కవిత్వాన్నిచెప్పుకొవచ్చు. దండోరా ఉద్యమం ప్రారంభమైన తరువాత మాదిగలు కూడా తమకు చెందవలసిన హక్కులు తమకు చెందాలని మాదిగ కవిత్వాన్ని రాశారు. వారిలో ఎండ్లూరి సుధాకర్ ప్రథమవరుసలోనిలుస్తున్నారు. ఆయన వర్గీకరణీయం (2003), కొత్త గబ్బిలం (1998), నల్ల ద్రాక్ష పందిరి (Darky- 2002) అనే రెండు దీర్ఘ కావ్యాలను రాసి ఎస్.సి వర్గీకరణ సమస్యను బలంగా అభివ్యక్తీకరించారు. మాదిగ సాహిత్య వేదికప్రచురించిన మాదిగచైతన్యం(1997) కవితా సంకలనాన్ని మాదిగలగురించి మాదిగలే రాసిన మొట్టమొదటి మాదిగ కవితా సంకలనంగా దీన్ని చెప్పుకోవచ్చు. దీనిలో మాదిగలే తమ సమస్యను వివరిస్తూ కవితలు, పాటలురాశారు. ఇందులోఎండ్లూరి సుధాకర్ (దాసును చూడాలి) ,కొలుకులూరి ఇనాక్ (చెప్పులకు నమస్కరిస్తున్నాను), నాగప్పగారి సుందర్రాజు (మాదిగోడు) దార్ల వెంకటేశ్వరరావు (మాదిగ మేనిఫెస్టో), కత్తి కళ్యాణ్ చంద్ర (ఉనికి) వంటి ప్రముఖ మాదిగ కవుల రచనలు ఉన్నాయి.ఈ కవితా సంకలనంలో సుమారు 26 కవితలున్నాయి. ఎమ్. జాన్‌సన్ (మాదిగ చైతన్యం), రావినూతుల ప్రేమ్ కిషోర్ (దండోరా), విజయరత్నం (మాదిగ మహత్తు), ఆనంద్ (ఎల్లమ్మ జాతర), కాశి మాదిగ (రోడ్డు మీద దండోరా), తుడి మహేందర్ (మాదిగ జీవితం), కొల్లూరి చిరంజీవి (నేను మాదిగోన్ని), చిత్రం ప్రసాద్ (చాటింపు), ఆశావాది శశాంకమౌళి (పెద్దింటోళ్ళ శ్వేత పత్రం), వేమల ఎల్లయ్య (కత్తె ఆరిని పదును పెడుతున్నాం), కొలుకులూరి శ్రీనివాస్ రావు (తెరదించుతాం), రాజలింగం (ఓ మాదిగా ఉద్యమించు), తాళ్ళూరి భానుప్రతాప్ (ఆహ్వానించు), మష్టార్జీ (ఎవరనుకున్నారు) మొదలయిన కవితలను మాదిగ చైతన్యం (1997) కవితా సంకలనంలో చూడవచ్చు.

నాగప్పగారి సుందర్రాజు చండాల చాటింపు (1996) పేరుతో ఒక కవితా సంపుటిని ప్రచురించారు. గ్యార యాదయ్య గూటం దెబ్బ”,ఎర్కోషి కవితా సంపుటిలలో మాదిగ సంస్కృతిని వర్ణించారు. రావినూతల ప్రేమ్ కిషోర్‌ (గుండె దరువు- 2000) అనే దీర్ఘ కావ్యాన్ని రాశాడు. ఇంకా మల్లవరపు ప్రభాకరరావు, జూపాక సుభద్ర, గోగుశ్యామల, గౌరి, కదిరికృష్ణ, ఓబిలేసు, ఆంజనేయుడు, ఐనాల సైదులు, మణీందర్ ఇలా చాలా మంది మాదిగకవిత్వాన్ని రాస్తున్నారు.

ఇలా రాస్తున మాదిగ కవిత్వాన్ని విమర్శకులు ఆహ్వానించారు. మాదిగ కవులు రాసిన ప్రత్యేక కవిత్వం దళిత కవిత్వానికి సరికొత్త ట్రెండ్ అయి దాన్నింకా బలోపేతం చేయబోతోంది అని ప్రముఖ విమర్శకుడు జి.లక్ష్మీనరసయ్య (1995 - 65) వ్యాఖ్యానించారు.

మాదిగ కవిత్వంలో కనిపించే ధోరణులను కింది విధంగా విశ్లేషించవచ్చు.

కులాన్ని ఆధారంగా చేసుకొని చూపే వివక్షను స్పష్టంగా ఖండిస్తూ మాదిగ కవిత్వం వస్తుంది.


దళితులలో సమైక్యత పేరుతో జరుగుతున్న మోసాన్ని బయట పెట్టే ప్రయత్నం చేసింది మాదిగ కవిత్వం.


తమకు రావలిసిన హక్కులను హరించి వేస్తున్న వారిని నిరసిస్తూనే తమ హక్కులను కాపాడుకోవాలనే స్వరం మాదిగ కవిత్వంలో ప్రధానంగా కనిపిస్తుంది.


తమ చరిత్ర సంస్కృతులలో గల ప్రత్యేకతను మాదిగ కవిత్వం వర్ణించగలుగుతుంది.


నిజమైన అంబేడ్కరిజాన్ని మాదిగ కవిత్వం వివరించగలుగుతుంది.


దళితులకు అందరికీ (అన్ని ఉపకులాల) సమాన హక్కులు లభించాలనేదే మాదిగ కవిత్వం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది.


దళితులను విభజించడానికి లేదా చీలిపోవడానికి వారిలో శత్రు వైరుధ్యాన్ని పెంచడానికి కాకుండా చారిత్రక వాస్తవాన్ని వివరిస్తూ ఈ దళితులలోని అన్ని ఉపకులాలకు ఉండే అస్పృశ్యత లేదా అంటరానితనం అనే వివక్ష అందరికీ ఉందని అయినా ఆ వివక్ష దళితుల్లోని కొన్నిఉపకులాల వారు మరింతగా అనుభవిస్తునారని మాదిగ కవిత్వం స్పష్టం చేసింది.


మాదిగ కవిత్వం వచ్చిన తరువాత వివిధ అణగారిన కులాల వారు కూడా తమ ప్రత్యేక సమస్యలను వర్ణిస్తూ కవిత్వం రాశారు.

గిరిజనులు, బి.సి లు మాదిగ కవిత్వ ప్రేరణతో తమ ప్రత్యేక సంస్యలను వర్ణించటం జరుగుతుంది. ఆ విధంగా అణిచివేతకు గురి కాబడుతున్న అన్ని కులాల వారిని చైతన్యం చేయడంలో మాదిగ కవిత్వం చెప్పుకోదగిన పాత్ర వహిస్తుంది.
మాదిగ కవిత్వంలో వృత్తి పట్ల గౌరవం పెంచుతూ తమ సాంస్కృతిక ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ ఆ పారిభాషిక పదాలను సాహిత్యానికి పరిచయం చేసింది. ఆ విధంగా తెలుగు భాషకు కొత్త పదాలను పరిచయం చేసినట్లయింది.

ఈ విధంగా దళిత కవిత్వంగా భావింపబడుతూనే తమ ప్రత్యేక వైవిధ్యాన్ని మాదిగ కవిత్వం ప్రదర్శించింది.

మాదిగ కవిత్వాన్ని రాస్తున్న వారిలో జూపాక సుభద్ర, శ్యామల, జాజుల గౌరి లు తెలంగాణ మాదిగ జీవితాల్లోని కొత్త కోణాలను రసభరితంగా ఆవిష్కరిస్తున్నారు. తెలంగాణా పలుకుబడి మాదిగ ఉపకులాల మనోభావాలు వీరి కవిత్వంలో చక్కగా వర్ణితమవుతున్నాయి.
మాదిగ కవిత్వాన్ని వ్యతిరేకిస్తూ దళిత సమైక్యత పేరుతో మాలలు కవిత్వాన్ని రాస్తున్నారు. వారిలో సతీష్ చంద్ర, పైడి తెరేష్ బాబు, గూటం స్వామి తదితరులను ప్రముఖంగా చెప్పుకోవచ్చు.


అగ్ర వర్ణాలను వాళ్ళు చేస్తున్న ప్రతి పనినీ దళిత కవులు ఖండిస్తూ కవిత్వం రాసేవారు. అలాంటి వివిధ రచనలను చేసిన చాలా మంది దళిత కవులు మాదిగ దండోరా ఉద్యమం తరువాత తమ దళితకవిత్వ దృక్పథాన్ని దారి మళ్ళించి అనుభవ కవిత్వాన్ని రాసుకుంటున్నారు. అదికూడా భావకవితాధోరణితో కవిత్వాన్ని రాసుకుంటున్నారు. శిఖామణి, కత్తి పద్మారావు వంటి ప్రముఖ కవులు సుమారు దశాబ్ద కాలంగా ఎస్.సి వర్గీకరణ కోసం జరుగుతున్న ఉద్యమం గురించి స్పందిస్తూ ఒక వాక్యం కూడా రాసినట్లు కనబడదు. సమాజంలో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా కవులు దళితుల్లోని అంతర్విభేదాల గురించి ఒక కవిత కూడా రాయకపోవడం దళిత కవిత్వంలో మాదిగల పట్ల జరుగుతున్న వివక్షతకు నిదర్శనంగా నిలుస్తుందని చాలామంది విమర్శకులు వ్యాఖ్యానించడం కనిపిస్తుంది. అందుకనే మాదిగలు తమ అస్తిత్వాన్ని నిరూపించుకోవటం కోసం కలం పట్టారని మాదిగ చైతన్యం కవితాసంకలనం ముందుమాటల్లో కనబడుతుంది. మాదిగ కవులు తమజీవితాలను ప్రతిబింబిస్తూ ఆణిముత్యాల్లాంటి కవితలను రాస్తున్నారు. మాదిగలు దళితుల్లోని ఉపకులాలందరినీ చైతన్య పరుస్తున్నారు.


1.5.
కథా సాహిత్యం - మాదిగ జీవితం :


తెలుగుకథాసాహిత్యంలో మాదిగల గురించి ప్రస్తావిస్తూ మొట్ట మొదటి సారిగా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పుల్లంరాజుకథను రాశారు. ఆ తరువాత ఆయనే సాగర సంగమం (1931) ; “మాదిగ పల్లె ” ; “ఇలాంటి తవ్వాయి వస్తే” (1934) కథలను రాశారు. వీటిలో మాల మాదిగల ప్రస్తావన ఉంది. వారిమధ్య అనైక్యత, సాంస్కృతిక వ్యత్యాసాలను ఈ కథలలో వర్ణించారు. ఈ అనైక్యతను ఆసరా చేసుకుని అగ్రవర్ణాలు చెలాయిస్తున్న ఆధిపత్యాన్న్ని వివరించారు. గోపీచంద్ గారు చెప్పులు కుట్టేవాడు “(1961) కథలో రోడ్డు పక్కనకూర్చుని చెప్పులు కుట్టుకునే మాదిగ జీవితాలను వర్ణించారు. ఆ దుమ్మూ, ధూళీ వల్ల ఊపిరి తిత్తులు పాడై చెప్పులు కుట్టే వారు ఎలా చనిపోతున్నారో వర్ణించారు.


1969
లో ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు ఉరబావి అనే పెద్ద కథను రాశారు. మాల మాదిగల మంచినీళ్ల సమస్యను వర్ణించిన కథ. అగ్ర వర్ణాల వారి దౌర్జన్యాలను ఒక మాదిగ స్త్రీ ఎలా ఎదుర్కొందో చెప్పిన కథ . అగ్రవర్ణాల వారి పీడనను అగ్రవర్ణ చాణక్య నీతితోనే సమధానం చెప్పిన కథ. వ్యవస్థ కోసం వ్యక్తి చేసిన సాహసం దీనిలో కనిపిస్తుంది. జి.భానుగారు ‘’ పాపానికి జీతం కథ (1969) లో అగ్ర వర్ణ భూస్వామి మాదిగ స్త్రీని బలాత్కరించబోయి, ఆమె తిరగ బడటంతో చంపేసి, ఎవరికీ తెలియకుండా తిరిగినా, తాను చేసిన పాపం వల్ల కాలు పుండు పడి అతడు చనిపోయినట్లు చిత్రించారు. ఇది కర్మ సిద్ధాంతాన్ని బోధించే కథ . స్వామి తల్లి మట్టి “(1991) కథలో మాదిగ ఉపాధ్యాయుడు కులం చెప్పుకోడానికి చదువుకున్న మాదిగలు కూడా ఆత్మ న్యూనతకు గురవుతున్నారని తెలిపిన కథ. దీన్ని మాదిగ జీవితాల పై మరింత అవగాహనతో రాస్తే బాగుండేది. శాంతి నారాయణ గారి జీవనాడులు”(1991) కథలో మాదిగల ఇండ్లలో జరిగే పెండ్లికి ఎవరెవరు వస్తారనే విషయాలు వర్ణించారు. మాదిగ ఇండ్లలో పెండ్లి జరిగితే తమతో పాటు వీరణం వాయించే మంగలి వాళ్ళు కూడా రారనీ చెప్పిన కథ. కాలువ మల్లయ్య గారి అగ్ని గుండం ” ( 1991) కథలో మాదిగలు డప్పు కొడుతూ సమాజానికి సహకరిస్తున్నా, మాదిగలకు గౌరవం లేదనీ, కనుక ఆ పరిస్థితి తన కొడుక్కి రాకూడదని భావించి యూనివర్సిటిలకు పంపిస్తే అక్కడ జరిగే గొడవల్లో అతడిని ఇరికించి అరెస్టు చేస్తున్న అగ్రవర్ణాల వారి అధికారాన్ని, కుట్రలను వివరించారు. పరిశ్రమల వల్ల చర్మకార వృత్తి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుందో, దానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలను తీసుకుంటుందో బోయ జంగయ్య గారి ఇదికతా!లో చూడవచ్చు. శాంతినారాయణ గారి ఉక్కుపాదంకథలో మాదిగ వ్యక్తి మంత్రి అయినా, అధికారాన్ని అగ్రవర్ణాలవాళ్ళే ఎలా ఉపయోగించు కుంటారో, ఎదురు తిరిగితే ఎలాంటి అవమానాలను ఎదుర్కోవలసి వస్తుందో వివరించ గలిగింది.ఆర్థిక శక్తి లేని అధికారం కేవలం నామ మాత్రమేనని, సాంఘిక సమానత్వం రానిదే కేవలం రిజర్వేషన్లు ఉన్నా అవి మాదిగలు అనుభవించలేని స్థితే ఉంటుందని నిరూపించిన కథ. ఎస్.సి వర్గీకరణ నేపథ్యంలో చాలా మంది రచయితలు మాల - మాదిగల మధ్య వైరుధ్యాలని వర్ణించే కథలు రాశారు. తోలేటి జగన్మోహనరావు వర్ణక్రమాలు”; పైడి తెరేష్‌బాబు అనుబంధ ప్రశ్న ( 1996 ) సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి అంటు”; మద్దూరి నగేష్ బాబు దోమతెరకథలలో మాల - మాదిగల వర్గీకరణ సమస్య కనిపిస్తుంది.


ఆచార్య కొలకలూరి ఇనాక్ అంబేడ్కర్ దృక్పథంతో మాదిగ కథలను రాశారు. ఈయన రాసిన కథల్లో మాదిగ జీవితం అనేక కోణాల్లో ప్రతిఫలిస్తుంది. వాటిలో తప్పనిసరిగా ప్రస్తావించుకోవలసిన కథల్లో ఊరబావి,తాకట్టు, గొడ్లదొంగ , పొట్ట పేగులిబ్బందిగోడు, కులవృత్తి ముఖ్యమైనవి. ఊరబావి గురించి పైన వివరించటం జరిగింది. ఇక తాకట్టు కథ లో బ్రాహ్మణ- మాదిగ అధ్యాపకుల మధ్య నిజమైన మానవ సంబంధాలను జంధ్యం అప్పుగా తాకట్టు పెట్టమనటం ద్వారా నిరూపించే ప్రయత్నం చేశారు. గొడ్లదొంగ కథలో ఊళ్ళో దొంగ తనానికి గురవుతున్న పశువుల గురించి ప్రజలకు ఆ ఊళ్ళో మాంసం అమ్ముకుని జీవించే నాగడు మీద అనుమానం వస్తుంది. దానితో నాగడే ఒక రాత్రంతా నిద్రపోకుండా కనిపెడతాడు. ఆ ఊరి దొరే పశువుల్ని దొంగతనానికి పాల్పడటాన్ని నాగడు గుర్తిస్తాడు. ఆ దొరని ఊరి ప్రజలందరికి పట్టించినా, వదిలేస్తారని భావించి, అతడిని చంపేసి, ఎద్దు పొట్టలో పెట్టి కుట్టేసి కాలవలో పడేస్తాడు. నాటినుండీ ఆ దొరా కనిపించడు, గొడ్ల దొంగతనాలు ఆగిపోతాయి. మాదిగ లను దొరలే దొంగలుగా ముద్ర వేసే ఒక వాస్తవాన్ని చిత్రించే ప్రయత్నంచేసిన కథ. మాదిగల అమాయక తనాన్ని ఆసరా చేసుకుని వాళ్ళభూమిని లాగేసుకున్న దొరను, ఒకమాదిగ యువకుడు పేగులు చీల్చేసి చంపిన కథ పొట్ట పేగులిబ్బందిగోడు. అన్ని వృత్తులకూ, ఆ వృత్తి చేసేవారికీ గౌరవం కలిగినట్లే మాదిగలు చేసే కులవృత్తికీ గౌరవం కలగాలని వాదించే కథ కులవృత్తి “(2006). మాదిగల జీవితాలకు సంబంధించిన అనేక కోణాలను వర్ణిస్తూ కథలు రాసిన వారిలో ఆచార్య కొలకలూరి ఇనాక్, డా.ఎండ్లూరి సుధాకర్ గార్లు ప్రథమ వరుసలో నిలుస్తారు.
డా.ఎండ్లూరి సుధాకర్ గారు మాదిగ జీవితానికీ, వారి వృత్తికీ ఆత్మ గౌరవాన్ని కలిగించేటట్లుగా మల్లెమొగ్గల గొడుగు మాదిగ కతలు ‘(1999) రాశారు. కథల్లో పురాణాల్నుండి నేటి వరకు మాదిగ జీవితాల్లోని సంఘర్షణలను సమస్యలను చిత్రించారు. మాదిగ వృత్తి పనితనంలోని గొప్పతనాన్ని, భాషని, సంస్కృతిని వర్ణించారు. చెప్పులు మాదిగలకు దేవతలని ప్రకటిస్తారు రచయిత. చెప్పులు కుట్టి నవాబులని మెప్పించి సన్మానాలని పొందారని చర్మకార వృత్తిలోమాదిగలు చూపే ప్రతిభా పాటవాలను వివరించారు.

క్రైస్తవ మతం తొలిరోజుల్లో మాదిగలను దగ్గరకు తీసినా తర్వాత కాలంలో క్రైస్తవంలోనూ కులం, దోపిడీ బయలుదేరిందని అంబేడ్కరిజంతోనే మాదిగల విముక్తి సాధ్యమని వివరించే కథలు దీనిలో చాలా ఉన్నాయి. ప్రముఖ విమర్శకుడు జి. లక్ష్మీనరసయ్య ఈ కథలను వ్యాఖ్యానిస్తూ డా.ఎండ్లూరి సుధాకర్‌గారిని ' మాదిగ గోర్కీ ' అని (ముందుమాట : 1999 - 12) అభివర్ణించారు. నాగప్పగారి సుందర్రాజు మాదిగోడు (1997 )పేరుతో కొన్ని కథలను రాశారు. మాదిగల సంస్కృతిని అర్థం చేసుకోవడానికి, ఆత్మ గౌరవాన్ని గమనిచడానికీ ఈ కథలు ఎంతగానో దోహదపడతాయి. డా.ఎండ్లూరి సుధాకర్, నాగప్పగారి సుందర్రాజు గారలు రాసిన మాదిగ కథలు తెలుగు సాహిత్యంలో ఆత్మకథా ప్రక్రియను ప్రవేశపెట్టాయని విమర్శకులన్నారు (గుడిపాటి, ఇతివృత్తం: 2002-12).


మొత్తం మీద వస్తు వైవిధ్యంతో అనేక మంది రచయితలు మాదిగ జీవితాలను వర్ణిస్తూ కథలు రాశారు. మాదిగేతర రచయితలు రాసిన కథలలో అస్పృశ్యత, దేవాలయ ప్రవేశం, కులాంతర వివాహాలు వంటి సమస్యలు చిత్రితమైనా సానుభూతినుండి రూపొందినవే తప్ప, మాదిగ జీవిత సంఘర్షణ పెద్దగా కనపడదు.మాదిగలు చదువుకున్నప్పటికీ, రిజర్వేషనుతో ఉద్యోగాలు పొంది కూడా కులాన్నిచెప్పుకోలేకపోతున్నారనే దృక్పథంతో అగ్రవర్ణ రచయితలు కథలను రాశారు. అగ్రవర్ణ రచయితల కథల్లో అవకాశాల కోసం మాదిగలు మతాన్ని మార్చుకుంటున్నారనే ఆలోచనను కలిస్తాయి. కానీ, మాదిగ రచయితలు రాసిన కథల్లో జీవిత లోతులు, చక్కని పరిష్కారాలు, ప్రతిపనిలోనూ ఉండే కార్యకారణ సంబంధాన్ని సహేతుకంగా వర్ణించగలిగారు.

మాదిగ సంస్కృతి, ఆత్మ గౌరవం వ్యక్తమయ్యింది. అలాంటి వారిలో ఆచార్య కొలకలూరి ఇనాక్ , బోయ జంగయ్య, డా.ఎండ్లూరి సుధాకర్, నాగప్పగారి సుందర్ రాజు, గోగుశ్యామల, జూపాక సుభద్ర, జె. గౌరి తదితరులను చెప్పుకోవచ్చు. జూపాక సుభద్ర, గోగు శ్యామల గార్ల సంపాదకత్వంలో వచ్చిన నల్లరేగడి సాల్లు” (2006) కథల్లో మాదిగ సంస్కృతిలో కొత్త కోణాలు కనిపిస్తాయి. దీనిలో మాదిగ ఉప కులాల స్త్రీల జీవితాలను కేంద్రంగా చేసుకొని వెలువడిన కథలు చాలా ఉన్నాయి.


1.6.
నవలా సాహిత్యం : మాదిగ జీవితం :


తెలుగులో సాంఘిక నవలగా భావించబడుతున్న కందుకూరి వీరేశలింగం గారి రాజశేఖర చరిత్రము (1878 )’ లో కథా నాయకుడు అస్పృశ్యుడు ఇచ్చిన నీళ్ళు తాగడానికి ఇష్టపడడు. కానీ, నరహరి గోపాలకృష్టమ శెట్టి రాసిన సోనాబాయీ పరిణయం పేరు గల శ్రీ రంగ రాజ చరిత్రము (1872) లో ఒక గిరిజన కుటుంబం లో పెరిగన క్షత్రియ యువతి కథ కనిపిస్తుంది. తొలిసారిగా మాల - మాదిగల సమస్యలను సానుభూతితో వర్ణించిన నవల తల్లాప్రగడ సూర్యనారాయణగారి హేలావతి (1910). ఆ తర్వాత మాల - మాదిగల గురించి రాసిన నవలలు చాలా వచ్చాయి. వాటిలో వేంకట పార్వతీశ్వర కవుల ' మాతృమందిరం ( 1918 ); ఉన్నవ లక్ష్మీ నారాయణ ' మాలపల్లి ( 1921 - 22 ) వేలూరి శివరామ శాస్త్రి ' ఓబయ్య (1920); రంగనాయకమ్మ ' బలిపీఠం (1962) ముఖ్యమైనవి. ఇంకా నైమిశారణ్యం, రథచక్రాలు, కొ్ల్లాయిగట్టితేనేమి, ఓనమాలు మొదలైన నవలల్లోనూ మాల - మాదిగల పట్ల సానుభూతి కనిపిస్తుంది. అక్కినేని కుటుంబరావు సొరాజ్జెం ( 1981 ); ఓల్గా ఆకాశంలో సగం ( 1990); నవలలో మార్క్సిస్ట్ దృక్పథంతో కూడిన మాల - మాదిగల జీవితం కనిపిస్తుంది.

తెలుగులో 1980 తర్వాత మాత్రమే చైతన్యవంతమైన మాల - మాదిగల గురించి రాసిన నవలలు కనిపిస్తాయి. స్పార్టకస్ కలం పేరుతో జి. రామమోహన్‌రావు ' ఖాకీ బతుకులు ( 1980 - 82 ); సదానంద శారద ' మంచి నీళ్ళ బావి ( 1992 ); కాలువ మల్లయ్య గద్దలాడు తండాయి ( 1996 ), నీ బాంచెన్‌కాల్మొక్తా ( 1987 ), సాంబయ్య చదువు, బతుకు పుస్తకం ; చిలుకూరి దేవపుత్ర ' పంచమం ( 1998 ); సన్నపురడ్డి వెంకటరామిరెడ్డికాడి ( 1998); పి. నాసరయ్య మాదిగ పల్లె ( 1998); జి. కళ్యాణరావుఅంటరాని వసంతం ( ); వేముల ఎల్లయ్య కక్క (2000), సిద్ధి ( 2006); పినాక పాణి నిప్పులవాగు ( 2001 ); గోపరాజు నాగే్శ్వరరావు దండెం మీద చిలుకలు ( 2001 ); బోయి జంగయ్య జాతర” ( 1997 ), మరోమార్పు” (2002 ); కేశవరెడ్డి రావుడుండాడు రాజ్జెముండాది ; శాంతి నారాయణ పెన్నేటి మలుపులు మొదలైన నవలలో మాల - మాదిగల జీవితం చైతన్యవంతంగా కనిపిస్తుంది. అయితే వీటిలో కక్క, సిద్ధి, మాదిగ పల్లె నవలల్లో మాదిగ జీవితం, సంస్కృతి ఎక్కువగా ప్రతిఫలించాయి.

తెలంగాణా ప్రాంతంలో అగ్రవర్ణ భూస్వాములు మాదిగల్ని పెట్టే కష్టాల గురించి వేముల ఎల్లయ్య కక్కనవలలో చిత్రించారు. భాష, సంస్కృతి, ఆచార వ్యవహారాలు ఈ నవలలో బాగా కనిపిస్తాయి. చిలుకూరి దేవపుత్ర పంచమంనవలలో కథా నాయకుడు శివయ్య మాదిగకులానికి చెందిన వాడు. తండ్రి డప్పు కొట్టే వెట్టివాడు. శివయ్య మాత్రం అగ్ర వర్ణానికే చెందిన ఒకతని ప్రోత్సాహంతో బాగా చదువుకొని జిల్లా ఉన్నతాధికారి అవుతాడు. గ్రామ పెత్తందారులు మంత్రులవుతారు. రెవెన్యూ శాఖలో ఉన్నతోద్యోగం చేస్తున్న శివయ్య చేతనే భూసంస్కరణలు అమలు కాకుండా చూడాలనుకుంటారు. వారికి శివయ్య సహకరించక పోవటంతో లంచం తీసుకున్నట్లుగా కుట్ర పన్ని అతడ్ని సస్పెండ్ చేయిస్తారు. అప్పటికే ఒక మాదిగ వ్యక్తి ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్నా సస్పెండ్ అయిన శివయ్యను రక్షించలేని స్థితి . సామాజిక చైతన్యం లేని ఉన్నతోద్యోగాలు, రిజర్వేషన్‌తో వచ్చిన రాజకీయ పదవులు మాదిగలను బాగుచేయలేవని నిరూపించిన నవల ఇది. దీనిలో సుమారు యాబై సంవత్సరాల దళిత జీవితం సామాజిక వాస్తవికత వర్ణింపబడింది. మాల - మాదిగల రిజర్వేషన్‌ల వర్గీకరణ సమస్యను కూడా ఈ నవల చిత్రించింది.


1.7.
నాటక సాహిత్యం - మాదిగ జీవితం :


కోరాడ రామచంద్ర శాస్త్రి గారు రచించిన మంజరీ మధుకరీయం” ( 1860 ) రూపకాన్ని తొలి తెలుగు నాటకంగా పరిశోధకులు చెప్తున్నారు (పి.ఎస్.ఆర్. అప్పారావు: 1967-1). దశరూపకాల్లో నాటకం, నాటిక వంటివాటిని ప్రత్యేకంగా పేర్కొన్నా, వ్యవహారంలో మాత్రం నాటకాలు అనే అంటున్నారు. హరిజనాభ్యుదయం - తెలుగు నాటకం (1994) పేరుతో డా.వి. పోతన్న చేసిన పరిశోధనలో మాదిగల గురించి చిత్రించిన నాటకాలను, నాటికలను వివరించారు. మాల - మాదిగలను ఈ పరిశోధనలో హరిజనులుఅనే పారిభాషిక పదంతోనే పేర్కొన్నారు. హరిజనులు అంటే మాదిగలు మాత్రమే, మాలలు కాదనే ఒక అభిప్రాయం కూడా మాలల్లో ఉంది అని పోతన్న (1994 : 240 ) చెప్పినా, మాల - మాదిగలను హరిజనులుగానే చాలా మంది పిలుస్తున్నారని ఆయనే (1994 : 54 ) స్పష్టం చేశారు. కనుక, మాదిగలను గుర్తించటంలో నాటక సాహితీవేత్తలు ప్రత్యేకతను చూపినవాళ్ళు చాలా కొద్దిమందే కనిపిస్తారు. అయినా, నాటకాల్లో మాదిగలను వారి సంస్కృతీ సంప్రదాయాల ఆధారం చేసుకొని గుర్తించటం కష్టం కాదు.

మాదిగల ఆడపడుచుగా భావించే అరుంధతీదేవి, వసిష్ఠుడిని వివాహం చేసుకున్న ప్రేమ కథను డా. బోయి భీమన్నరాగవాసిష్ఠం (1959) అనే పేరుతో పౌరాణిక సాంఘిక నాటకంగా రాశారు. దీన్ని మాదిగ జీవితం చిత్రించిన తొలి తెలుగు నాటకంగా అభివర్ణించవచ్చు. అరుంధతీదేవి కులం తెలియగానే బ్రాహ్మణుడైన వసిష్ఠ మహర్షి ఆమెను వివాహం చేసుకోవడానికి సందేహించటం, చివరకు ఆమె గొప్పతనాన్ని భక్తి తత్పరతలను తెలుసుకుని వివాహం చేసుకోవటం దీనిలోని ఇతివృత్తం.

మాదిగ స్త్రీని బలాత్కరించబోయిన అగ్రవర్ణ భూస్వామి కొడుకు పై తిరగబడినందుకు ఆమెనూ ఆ జాతి వాళ్ళందరినీ అగ్రవర్ణ భూస్వాములు దారుణ కృత్యాలు చేయటాన్ని వర్ణించిన సాంఘిక నాటకం నీలి దీపాలు”. దీన్ని కె. చిరంజీవి గారు రాశారు. ఇంచుమించు ఇలాంటి ఇతివృత్తమే కె.ఎస్.టి. సాయిగారు రచించిన పరమపదం నాటకంలోనూ కనిపిస్తుంది. ఆచార్య కొలకలూరి ఇనాక్‌గారు ముని వాహనుడు నాటకంలో శ్రీరంగనాథ దేవాలయ ప్రవేశానికి ప్రయత్నించి విజయుడైన తిరుప్పాణ్ ఆళ్వార్ కథ మాదిగ జీవితాన్ని స్ఫురించేటట్లుగా ఉంది. దేవాలయంలోకి ప్రవేశించటానికీ, పూజ చేసుకోవటానికీ దేవుడికి ఇబ్బంది లేకపోయినా అక్కడున్న పూజారి అభ్యంతరం పెట్టేవాడు. ఇదంతా మాదిగ జీవితాలకూ వర్తిస్తుంది. ఆచార్య కొలకలూరి ఇనాక్‌ గారే రచించిన నిర్భయం నాటికలో కళాశాలలో చదువుకునే మాదిగ విద్యార్థికి సహవిద్యార్థుల నుండి ఎదురైన కులపరమైన అవమానాలను కళ్ళకు కట్టినట్టుగా వర్ణించారు. ఆయన రాసిందే త్యాగి అనే నాటకం కూడా. దీనిలో కులం తెలియక ముందు అన్యోన్యంగా బతికే మాదిగ - బ్రాహ్మణ దంపతులు కులం తెలిసిన తర్వాత పొందే సంఘర్షణను గొప్పగా చిత్రించారు. అవగాహన ఉంటే సహజీవనాన్ని కులం ఏమీ చేయలేదని నిరూపించిన నాటకం ఇది. కులవృత్తినే నమ్ముకున్న తండ్రి దానినుండి బయటికి వచ్చి భూస్వామ్య దౌర్జన్యాలను అడ్డుకున్న మాదిగల జీవితాన్ని వర్ణించిన నాటిక ఎం. కన్నబాబు రాసిన రత్నగర్భలో నిత్య దరిద్రుడు”. బ్రాహ్మణ - మాదిగ వర్ణాల మధ్య జరిగిన ప్రేమా - పెళ్ళీ - కుల కట్టుబాట్లు, వాటి వల్ల వచ్చే సంఘర్షణలు, వాటిని ఎలా అధిగమించాలో తెలియజెప్పిన నాటకం మాగంటి పార్థసారథిగారు రచించిన హరిజనోద్ధరణము”. తరతరాలుగా అక్షరాలకు దూరంగా ఉంచబడిన మాదిగలకు అక్షరాలు ఎలా నిషిద్ధమయ్యాయో పాటిబండ్ల ఆనందరావుగారి నిషిద్ధాక్షరి నాటకం తెలుపుతుంది. ఇలా తెలుగు నాటకాల్లో మాదిగల జీవితాల్లోని భిన్న కోణాలను ప్రతిపలింపజేస్తూ నాటకాలు వెలువడ్డాయి.


అస్పృశ్యత, ప్రేమ, కులాంతర వివాహాలు మాల - మాదిగల అనైక్యత సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక విషయాల్లో ఉండవలసిన చొరవను రచయితలు వర్ణించగలిగారు. మాదిగల చర్మకార వృత్తికి గౌరవం లభించనపుడు, అది వారి ఆర్థిక, జీవన పరిపుష్టికి తోడ్పడనప్పుడు ప్రత్యామ్నాయ వృత్తులను ఎన్నుకోవాలని ప్రబోధించిన నాటకాలూ ఉన్నాయి. మొత్తం మీద నాటక సాహిత్యం మాదిగల జీవితాల్లోని అనేక కోణాలను స్పర్శించగలిగింది. అయితే దళితులు రాసిన నాటకాల్లో మాదిగల మానసిక కోణం బాగా వ్యక్తమయింది. కానీ, దళితేతరులే మాదిగ జీవితాలను స్పర్శిస్తూ నాటకాలు రాశారు.


1.8.
ముగింపు :

తెలుగు లో వివిధ సాహిత్య ప్రక్రియల్లో మాదిగల గురించి ప్రస్తావన కనిపించింది. భిన్న పార్వ్సాలలో, భిన్న దృక్కోణాల్లో మాదిగల గురించి చర్చించారు. సంప్రదాయక , దళిత సాహిత్యాల్లో భాగంగానే చాలాకాలం మాదిగ సాహిత్యం కొనసాగింది. మాల - మాదిగ తదితర కులాలన్నీ దళిత కులాలు గా పరిగణింపబడటం వల్ల , వీరందరినీ అస్పృశ్యులు , అంటరాని వాళ్ళు అని మాత్రమే సాహిత్యం లో పేర్కొనేవారని ఈ పరిశీలనలోతెలుస్తుంది. ఇటీవల ఎస్సీ వర్గీకరణ తరువాత తప్పనిసరి పరిస్థితుల్లో మాదిగలు తమ సాహిత్యాన్ని ప్రత్యేకంగా రాసుకుంటూ తన స్వీయ అస్తిత్వానికై ప్రయత్నిస్తున్నారు. దళితుల్లో అన్ని ఉప కులాల వారికీ కొన్ని సమాన లక్షణాలునప్పటికీ, మాదిగలకు కొన్ని సాంస్కృతిక ప్రత్యేకతలున్నాయని గుర్తించారు. ఏభై ఏళ్ళ భారత స్వాతంత్ర్యాననంతరం దళితుల్లో చాలా మార్పులు వచ్చాయి. అయినా, అలాగే మాదిగలలోనూ ఈ మార్పులు చాలా వరకూ కనిపిస్తున్నాయి. వాటిని సాహిత్యీకరించే ప్రయత్నం మాదిగలు కూడా చేస్తున్నారు. ఆ విధంగా తమ ప్రత్యేక సంస్కృతినీ, సంప్రదాయాన్నిపదిల పరుచుకొంటున్నారు. తమ జీవన విధానాలను ప్రతిఫలిస్తున్నారు. తమ జీవితాను భవాలను, తమ సంస్కృతి గొప్పదనాన్ని కనీస మాత్రంగా కూడా గౌరవించని సంప్రదాయ సాహిత్యం నుండి, తమ జాతి పేరుతోనే ఒక ప్రత్యేక సాహిత్యాన్ని కొనసాగించే స్థితికి చేరుకుంటున్నారు.

REFERENCES

1. నన్నయ్య ,1998. అంధ్ర మహాభారతం .తిరుపతి ; తిరుమల తిరుపతి దేవస్థానం పబ్లికేషస్.
2.
ఐలయ్య కంచె, 1996. మాదిగ ఆర్దిక సాంఘిక తత్త్వము .హైదరాబాద్ ;ఏకలవ్య ప్రచురణలు.
3.
బన్న అయిలయ్య - తెలుగు కవిత అభినవ దృక్పథం : 2001నానీ ప్రచురణలు, వరంగల్
4.
లక్ష్మయ్య,మల్లే పల్లి .(ed)1997 జాంబవ పురాణం .హైదరాబాద్ ;జానపద పరిశోదన.
5.
భీమన్న బోయి. 1959 రాగ వాశిష్ఠం .హైదరాబాద్ ; సుకేలానికేతన్ ప్రచురణలు .

6. జగన్నాధం నములకంటి .1968, ఆరుంథతీదేవి చరిత్రము. హైదరాబాద్ ; వైదిక గ్రంథప్రచారమండలిప్రచురణలు .

7.మూర్తి .బి .బి.యస్ ,1992.దళిత కధామంజరి .రాజమండ్రి ; త్రివేణి ప్రింటర్స్ .
8.
రామారావు బొనిగల ,1998 .మాలమదిగల ప్రాచీన చరిత్ర .కాకినాడ్; ప్రశాంతి ఆఫ్ సెట్ ప్రింటర్స్ .
9.
జ్ఞానానందకవి యస్.టి ,1997.షెడ్యూలు కులాలు అంటరానివా !కాకినాడ సురగాలి ప్రచురణలు .
10.
లాబన్ బాబు.తాళ్ళూరి,2001. మాదిగ వారి చరిత్ర .హైదెరాబాద్ ;కుసుమాంజలి ప్రచురణలు .
11.
రామారావు బొనిగల,2005. ఆదిగురువు ఆచార్య చెండాల. తెనాలి ; స్వీయ పబ్లికేషన్.
12.
సుధాకర్ ఎండ్లూరి,1999. మల్లెమొగ్గల గొడుగు మాదిగ కథలు .హైదరాబాద్ ;దండోరా చురణలు .
13.
విజయ భారతి,బి,2001.పురాణాలు కులవ్యవస్థ .హైదరాబాద్ ;హైదరాబాద్ బుక్ ప్రె స్.
14.
సుధాకర్ ఎండ్లూరి,2002. నల్లద్రాక్షపందిరి- darky.సికింద్రాబాద్ ;మానస ప్రచురణలు .
15.
సుధాకర్ ఎండ్లూరి,2003. వర్గీకరణీయం .రాజమండ్రి ;మానస ప్రచురణలు
16.
సుధాకర్ ఎండ్లూరి ,1998. కొత్త గబ్బిలం. రాజమండ్రి ;మానస ప్రచురణలు .
17.
సుందర్రాజు నాగప్ప గారి, (సం) 1997.మాదిగ చైతన్యం .హైదరాబాద్ ;మాదిగ సాహిత్య వేదిక ప్రచురణలు
18.
సుందర్రాజు నాగప్ప గారి, 1996 చండాల చాటింపు హైదరాబాద్ ;మాదిగ సాహిత్య వేదిక.ప్రచురణలు .
19.
లక్ష్మీ నర్సయ్య.జి,1999. దళిత సాహిత్యం,తాత్త్విక భూమిక. హైదరాబాద్ ;దళిత సానప్రచురణలు

http://prajakala.org/mag/2008/06/darla_june08_essay



3 comments:

Unknown said...

Sir,ee books Akkada dorukuthavi place, shop, lantivi address cheppindi

Unknown said...

అద్భుతమైన మాదగల మానవతా చరిత్ర
ఎంతో విశిష్టత కలదని ఈ వ్యాసం చదువుతుంటే
తెలుస్తోంది...🙏🙏🙏❤💙🌷

Unknown said...

PDF file unadha Sir? please send me for their information