24 జనవరి, 2009
ఒంటరిగా బ్రద్దలౌతూ...
మనమేంటో మనకి తెలిసినా
ఒకరినొకరు తెలుపుకోవటం మనకిష్టముండదు
మనసులో స్వచ్చంగా మాట్లాడుకోవాలని
బాధలన్నింటినీ
ఓ పాత్రలో ఒంపేసుకోవాలనీ ఉంటుంది
అయినా
మనం లోతుల్ని తాకని ఏవో కబుర్లతో
కాలాన్ని స్వారీ చేయిస్తూ
యాంత్రిక సంభాషణలైపోతుంటాం!
మోసం చేసుకుంటున్నామని తెలిసినా
మన మూలాల్లోకి వెళ్ళటానికేదో అలజడి
చులకన భావమో
సానుభూతి చినుకులో
అలముకున్న ఆధిక్యతో
ఏదో ఏదో
మనల్ని దూరం చేస్తుందేమోనని
మనల్ని మనం
వంచన చేసుకోవటానికైనా సిద్దపడిపోతుంటాం!
ఊహల్లో విహరించలేక
వాస్తవాల్ని జీర్ణించుకోలేక
ఒకరినొకరు తడిమి చూసేసుకోవాలని
వడి వడిగా నడిచే తలపులతో
మనం సిద్దమవుతూనే
హృదయపు తలుపుల్ని మాత్రం తాకటానికేదో తొట్రుపాటు!
" వద్దు ఎవరి గురించీ
ఎవరూ తెలుసుకోవద్దు"
పరస్పర గౌరవం బ్రద్దలు కాకూడనుకొంటూనే
ఆలోచనల వంతెనల్ని కృత్రిమంగా దాటలేక
మనకి మనమే ఒంటరిగా బ్రద్దలైపోతుంటాం!
-డా//దార్ల వెంకటేశ్వరరావు -
(ఆంధ్ర ప్రదేశ్ మాస పత్రిక - ఫిబ్రవరి 2000) లో ప్రచురితం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి