("బాధించే పాఠాలు బోధించేదెట్లా? " పేరుతో ఆంధ్ర జ్యోతి లో 12-1-2009 డా.వినోదిని ఒక వ్యాసం రాశారు. దీనిలో కొన్ని చర్చించ వలసిన అంశాలు ఉన్నాయని పించింది. అందుకే ఆంధ్ర జ్యోటి సౌజన్యంతో దీన్ని పున:ప్రచురిస్తున్నాను...దార్ల )
ఆయా వర్గాలకు చెందిన ఉపాధ్యాయులు వారి వారి సామాజిక నేపథ్యం ఆధారంగా, లేదా నమ్మకం ఆధారంగా ఈ కావ్యాల్లోని ధర్మం మంచిదనో, చెడ్డదనో చెప్పడం కన్నా ఇటువంటి కావ్యాల బోధనలో తప్పక చర్చించవలసిన విషయాల గురించిన మార్గదర్శకాలు ఉండటం అవసరం.. పురాణాలు ప్రాచీన విలువలతో కూడి ఉన్నా- రాజ్యాంగం ప్రకారం అంతా సమానమేనన్న విషయాన్ని, పౌరాణిక ధర్మాలు ఈనాడు చెల్లవన్న సంగతిని విద్యార్థులు అర్థం చేసుకునేలా తరగతి గదిలో చర్చ జరగాలి..
ఇప్పటి అస్తిత్వ చైతన్య ఉద్యమాల నేపథ్యంలో తెలుగు సాహిత్యాన్ని విద్యార్ధులకు బోధించే విషయ విశ్లేషణలను కొత్త దృష్టితో చూడాల్సిన అవసరముంది. చిన్నప్పుడు 'సైన్సు టీచర్- సూర్యుడు ఒక గ్రహమని చెబితే, తెలుగు టీచర్ సూర్యుడు ఒక దేవుడు అని చెబుతారు' అని జోకులేసుకునేవాళ్ళు.
ఇట్లా సూర్యుడు గ్రహమనో, దేవుడనో చెప్పినందున విద్యార్ధులు ఎంత సంశయానికి, సందేహానికి, తర్జన భర్జనకి లోనవుతారన్నది నేనిక్కడ చర్చించడంలేదు. కానీ అది విద్యార్ధుల అస్తిత్వాన్ని ప్రశ్నించేదిగా ఉన్నపుడు, విద్యార్ధులలోని కొన్ని వర్గాలను అవమాన పరిచేదిగా ఉన్నపుడు, కొందరికి విలువ నిచ్చేదిగా- కొందరిని కించపరిచేదిగా ఉన్నపుడు మాత్రం ఆ అంశాలపై తప్పనిసరిగా చర్చ జరగాలి. విద్యార్థుల ఆత్మగౌరవానికి సంబంధించి బోధనా విధివిధానాలపై చర్చ ఎంతైనా అవసరం.
హైస్కూల్ నుండి యూనివర్శిటీ స్థాయి దాకా తెలుగు సాహిత్యం చదివే విద్యార్ధులకు ప్రాచీన సాహిత్యం నుండి భారత రామాయణాలు పాఠ్యాంశాలుగా ఉంటాయి. అనేక యూనివర్సిటీలలో ఎం.ఏ తెలుగు విద్యార్ధులకు ప్రాచీన సాహిత్యం ఒక పేపర్. ఇందులో ఈ మత గ్రంధాలలోని కొన్ని భాగాలు, పురాణ ఇతివృత్తాలు, ప్రబంధాల నుండి కొన్ని భాగాలు బోధనాంశాలు. వాటిలో శకుంతలోపాఖ్యానం, సుగాత్రీ శాలీనుల వృత్తాంతం, వరూధినీ ప్రవరాఖ్యుల కథ, కచదేవయానుల కథ అనేవి కొన్ని. ఈ కావ్యాలను ఆనాటి ధర్మాలను, పరిస్థితులను, విలువలను అనుసరించి రచించారు. అయితే ఈ ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ తమ అస్తిత్వాన్ని గురించి, ఆత్మగౌరవాన్ని గురించి స్పృహతో ఉన్నారు. ప్రశ్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో, విస్మరణకు, అవమానాలకు, అణచివేతకు గురైన వర్గాలకు రాజ్యాంగం ప్రత్యేక హక్కులనిచ్చి, వారి గౌరవానికి భంగం వాటిల్లకుండా ప్రత్యేక రక్షణ చట్టాలను చేసింది. ప్రత్యేక చట్టాలు-విలువలకు సంబంధిం చే విధంగా పాఠ్యాంశాల బోధనా విధానంలో, విశ్లేషణలో మౌలికమైన మార్పులు జరగవలసిన అవసరం ఉంది. పాత విలువలతో కూడిన ఈ కావ్యాల బోధనను ఆధునిక విలువలతో అనుసంధానం చేయాల్సి వుంది. ఈ అంశాలను చర్చించేందుకుగాను 'శకుంతలోపాఖ్యానం' అనే పాఠ్యాంశాన్ని ఉదాహరణగా తీసుకుందాం..
దళితులను కనీసం మనుషులుగా సైతం గుర్తిం చకుండా పంచములుగా పక్కకునెట్టేసిన మనుస్మృ తికి ప్రాతిపదికగా శకుంతలోపాఖ్యానం సాగుతుం ది. కణ్వుడు- శకుంతల తనకు కుమార్తెగా లభించిన విధానాన్ని చెప్పే సందర్భంలో- 'తనర జనకుండు నన్న ప్రదాతయును..'అనే పద్యంలో స్త్రీల కు జన్మనిచ్చినవాడు, అన్నం పెట్టినవాడు, భయం నుంచి రక్షించినవాడు ముగ్గురు తండ్రులని చెప్పి, పురుషులకు ఈ ముగ్గురితో పాటు ఉపనయనం చేసినవాడు, నిరంతరాధ్యాపకుడు అంటే వేదాలను చెప్పేవాడు కలిపి అయిదుగురు తండ్రులని అంటా డు.
అంటే ఈ శిష్యులు ఉపనయనానికి, వేదం వినడానికి అర్హులైన వారు అన్నమాట. అంటే ద్విజులు. ఇక్కడ శూద్రులుగానీ,దళితులుగానీ అస్సలు ప్రస్తా వనలో లేరు. అంటే వారికి మనిషి విలువ ఇవ్వలేదు. అట్లాగే 'బ్రాహ్మంబు దైవంబు బరగ నార్షం బు, బ్రాజాపత్యమును..' అనే పద్యంలో ఎనిమిది రకాల పెళ్లిళ్లను గురించి చెప్పారు. ఏ ఏ పెళ్లి ఏ ఏ వర్ణం వాళ్లు చేసుకోదగిందో వ్యాఖ్యానాలు తెలియజేశాయి. వారిలో-బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలవారు ఉన్నారు. కానీ దళితుల ప్రస్తావనే లేదు. వారికి అర్హమైన పెళ్లి ఈ ఎనిమిది రకాలలో లేదు.
అంటే ఈ పద్యంలో సైతం దళితులను మనుషులుగా గుర్తించకపోవడం వాళ్ల వివాహ ఆచార వ్యవహారాలను ప్రస్తావించకపోవడం గమనార్హం. పై రెండు పద్యాలలో మొత్తం మానవ సమాజంలో భాగమైన దళితులను అటు మూలంలోనూ ఇటు అనువాదంలోనూ విస్మరించారు. కారణం- మూలకర్త మనుస్మృతిని ఆచరించిన వ్యాసుడు కాగా, ఆంధ్రీకరించిన నన్నయ ఆపస్తంభ సూత్రుడు. పైగా ఈ అనువాదం మనువాది అయిన రాజరాజ నరేంద్రుని ఆదేశాల మేరకు జరిగింది.
'ఇది మునికన్యయేని మఱి యేలొకొ...' అనే పద్యంలో శకుంతలను చూసిన దుష్యంతుడు ఆమె సౌందర్యంపట్ల ఆకర్షితుడవుతాడు. ఆమెను మోహిస్తాడు. మళ్లీ ఒక్కసారి తనను తాను సంభాళించుకొని- ఈ ముని కన్యపట్ల తాను ఆకర్షణకు లోను కావడమేమిటని ఆత్మావలోకనం చేసుకుంటాడు.
అంటే తాను క్షత్రియుడు కాబట్టి క్షత్రియ కన్యకాని స్త్రీ పట్ల ఆకర్షితుడు కావటం 'ధర్మం కాదని' భావిస్తాడు. కులాంతర వివాహాలను మనుధర్మం వ్యతిరేకించింది కాబట్టి ఈ ధర్మానుసారం ఈ కావ్య రచన జరిగింది కాబట్టి- చాలా పద్యాలలో, చాలా పాత్రలలో 'మనుధర్మ' ఆచ రణ కనిపిస్తుంది. అయితే ఈనాటి పరిస్థితులకి ఈ 'ధర్మం' వర్తిస్తుందా? 'ఒక పక్క కుల విభజనలు పోవాలని సామాజిక ఉద్యమాలు జరుగుతున్నాయి. మరోపక్క కులాంతర వివాహాలకు ప్రత్యేక చట్టాలు, ప్రోత్సాహకాలు ప్రభుత్వం కల్పించింది. కులాంతర వివాహాల ద్వారా సామాజిక అంతరాలను రూపుమాపవచ్చని అంబేద్కర్ ప్రవచించాడు.
ఆ విషయాలేవి చర్చకు రాకుండా ఈ కావ్యంలోని ప్రాచీన ధర్మాన్ని యధాతథ ధర్మంగా బోధించవచ్చా? వ్యక్తిగత జీవితంలో ఏదైనా సాధ్యమే. కానీ అన్ని కులాల విద్యార్ధులున్న క్లాసులో బోధించేటప్పుడు వివాహపు విశాల దృక్పథం గురించి చర్చించే అవసరం లేదా? తమ తమ కులాల పరిధిలోనే విద్యార్థులు ఆలోచించుకునేటట్లు 'ఇరుకు'ని ధర్మంగా భావించే దుష్యంతుడిదే ధర్మమని బోధించాలా? లేదు కదా!
కుల విభజనను పదేపదే గుర్తు చేసే పద్యాలు ఈ కావ్యంలో చాలా ఉన్నాయి. ఇంకాస్త ముందుకెళ్ళి 'విమల యశోనిధి పురుష వృత్తమెరుంగుచు నుండు చూవె!..' అనే పద్యంలో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థకు మూలమైన వేదాలను ప్రకృతి సరసన చేర్చి దీన్నొక ధర్మంగా సహజాతి సహజమైన సృష్టికి సంబంధించిన విషయంగా, పదార్ధాలలో ఒకటిగా (లెజిటమైస్) సూత్రీకరించేశారు.
అంటే పంచభూతాలు, సంధ్యలు, చంద్రసూర్యులు, పగలు, రాత్రి వంటి ప్రకృతి అంశాల సరసన మూలంలో లేని వేదాలను నన్నయ అనువాదంలో చేర్చాడు. ప్రకృతికి వివక్ష లేదు. జీవజాలం పట్ల అసమానత లేదు. మానవుల మధ్య కులభేదాలను గీసే కుట్ర లేదు. మరి వేదాలు? మనుషుల్లో కొందరిని పశువుల కన్నా హీనం చేసి మరికొందరికి దైవత్వాన్ని ఆపాదించాయి. మరి 'వేదాలు' ప్రకృతి సరసన చేర్చదగినవా? దీనిని విద్యార్థులకు బోధించే సందర్భంలో ఉపాధ్యాయులు ఈ అసంబద్ధ అంశాల పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం లేదా? విద్యార్థులకు పాఠ్యాంశాలతోపాటు విచక్షణని బోధించకపోతే అది ఉన్నత బోధన అవుతుందా?
ఈకావ్యపు అంతస్సూత్రం హైందవధర్మం అని చెబుతున్న మనుస్మృతిని, దానికి ఆధారమైన వేదాలను పునరుజ్జీవింప జెయ్యడం, వాటిలో ధర్మాలుగా చెప్పిన వాటిని సాహిత్య రూపంలో ప్రకటించడం.
ఈ కావ్యాన్ని చదివినవాళ్లు తమకు తాము అతిశయత్వంతో కూడిన హైందవులుగా, గొప్ప నియమావళితో బతికేవారుగా గర్వానికి లోనుకావాలని కోరుకోవడం. ఏ విధంగా చూసినా ఈ గ్రంథం కింది కులాలవారికి ముఖ్యంగా దళితులకు వర్తించే గ్రంథం కాదు. వారికి ఇందులో మనుషులుగా ఏ విధమైన గౌరవం, విలువ కాదు కదా, కనీసం గుర్తింపు కూడా లేదు.
ఇటువంటి పాఠ్యాంశాలను బోధించే సందర్భంలో దళిత ఉపాధ్యాయులు నిస్సహాయస్థితికి గురవుతారు. బయటి సమాజంలో నిరంతరం ప్రత్యక్ష వివక్షకూ, హేళనకూ గురవుతున్న దళితులు, విద్యావంతులుగా అత్యంత బాధ్యతాయుతమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి, ఇలాంటి అంశాలను బోధించాల్సి రావడంతో క్లాస్‌రూంలో పరోక్ష వివక్షకూ, హేళనకూ గురవుతున్నారు. కార్నర్ చేయబడతారు. అధర్మంగా తమను అస్పృశ్యులను చేసిన మను స్మృతిని ధర్మం అని చెప్పవలసి రావడం, తమను తామే కించపరుచుకునే స్థితి కలగడం వీరిని కుంగదీసే విషయం.
రాజ్యాంగపరంగా అంటరానితనం నేరం అని చెప్పే చట్టాలు, శిక్షాస్మ ృతులు ఉన్నా- అది ఈ పాఠ్యాంశాల బోధనా సందర్భంలో చెప్పేందుకు, చర్చించేందుకు అనువైన, అవసరమైన మార్గదర్శకాలు లేకపోవడం వారిని ఇరకాటంలో పడేస్తుంది. దళిత ఉపాధ్యాయుల స్థితి ఇలా ఉంటే, ఇక దళిత విద్యార్ధులు ఈ పాఠం తమను మరింత దిగజార్చడాన్ని ఏ విధంగా తీసుకుంటారు? మరింత అవమానానికి గురవుతారు. ధర్మంగా బోధింపబడే మనుస్మ ృతి దళిత విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఒకవైపు రాజ్యాంగం మనుషులంతా సమానమంటుంటే ఇటువంటి పురాణ పాఠ్యాంశాలు మాత్రం రాజ్యాంగంతో సంబంధం లేకుండా ప్రాచీన వర్ణ ధర్మాన్నే బోధిస్తుంటే దళిత విద్యార్థులు అవమానంతో పాటు అభద్రతను తలొంచుకు భరించవలసి వస్తుంది.
దళిత విద్యార్థులే గాక మిగతా విద్యార్థులు కూడా దీన్ని విశాల దృక్పథంతో అర్థం చూసుకొనే విశ్లేషణ, చర్చ తరగతి గదిలో జరగాలి. పురాణాలు ప్రాచీన విలువలతో కూడి ఉన్నా- రాజ్యాంగం ప్రకారం అంతా సమానమేనన్న విషయాన్ని, పౌరాణిక ధర్మాలు ఈనాడు చెల్లవన్న సంగతిని విద్యార్థులు అర్థం చేసుకోవాలి. ఆయా వర్గాలకు చెందిన ఉపాధ్యాయులు వారి వారి సామాజిక నేపథ్యం ఆధారంగా, లేదా నమ్మకం ఆధారంగా ఈ కావ్యాల్లోని ధర్మం మంచిదనో, చెడ్డదనో చెప్పడం కన్నా ఇటువంటి కావ్యాల బోధనలో తప్పక చర్చించవలసిన విషయాల గురించిన మార్గదర్శకాలు ఉండటం అవసరం.
పైన రాసినవి ఒక పాఠ్యాంశానికి పరిమితమై దళిత అస్తిత్వపు దృష్టికోణంతో చూసినవి. కాని తెలుగు పాఠ్యపుస్తకాలలో సాధారణంగా కన్పిం చే పాఠ్యాంశాలను స్త్రీ దృష్టికోణం నుంచీ, దళిత దృష్టికోణం నుంచీ చూసి కింది విషయాలను సూచిస్తున్నాను. సిలబస్‌లో ఏఏ పాఠ్యాంశాలు ఉండా లో నిర్ణయించే 'బోర్డ్ ఆఫ్ స్టడీస్'లో దళితవాదం, స్త్రీవాదం వంటి అస్తి త్వ చైతన్య ఉద్యమాల- సాహిత్య, సామాజిక ప్రతినిధులు ఉండితీరాలి. పాఠ్యాంశాల్లో ఆయా వర్గాల వారిని కించపరిచే, వారి విలువలను తగ్గించే అంశాల పట్ల విశ్లేషణ అంశాలను వీరి సూచనల మేరకు రూపొందించాలి.
ప్రాచీన కావ్యాల్లో, దళితులను, స్త్రీలను అవమానించే విధంగా వ్యక్తీకరణలున్నచోట- అవి తప్పని, ఈ కాలానికి చెల్లవని ఉపాధ్యాయులు తప్పక చెప్పే విధంగా 'మార్గదర్శక సూత్రాలు' ఉండాలి.దళితులను కించపరిచే, విస్మరించే వాక్యాలు- మనుస్మ ృతి గొప్పదని చెప్పే వాక్యాలు తప్పని చెప్పే మార్గదర్శకాలు ఉండాలి. వ్యాఖ్యానాలలో వీటికి చోటు కల్పించాలి.
దళితుల పట్ల మనుస్మ ృతి చూపిన వివక్ష, మనుస్మ ృతిలో చెప్పిన అనేక అంశాలు రాజ్యాంగ విరుద్ధాలు. నూతన చట్టాలకు విరుద్ధాలు. విద్యార్థులు వాటిని విశ్లేషణాత్మకంగా అర్థం చేసుకొనే విధంగా ప్రశ్నలను రూపొందించాలి. ఆయా వాక్యాలను సందర్భ సహిత వ్యాఖ్యలకు ఇవ్వదగిన అంశాలుగా గుర్తించాలి.
ముఖ్యంగా దళితుల వైపు నుండి దీన్ని మానవ హక్కుల సమస్యగా గుర్తించాలి. పుస్తకాల అట్టల వెనుక 'అంటరానితనం నేరం' అని రాసి, పాఠ్యాంశాల్లో మనుస్మృతి గొప్పదని చెప్పాల్సి రావడం, వినాల్సి రావడం కూడా రాజ్యాంగ ఉల్లంఘనే కాబట్టి ఇది మానవ హక్కుల సమస్య. కాబట్టి బోర్డ్ ఆఫ్ స్టడీస్‌లో మానవ హక్కుల ప్రతినిధులు కూడా ఉండాలి.
ఉపాధ్యాయులందరూ వివక్షకు గురయిన వర్గాలపట్ల సానుభూతి, సహానుభూతిపరులుగా ఏ విధమైన విశ్లేషణ చేయాలో సూచనలు ఉండాలి. జూ పాఠ్యాంశాలలో పదేపదే కన్పించే 'భూసురులు' దాని పర్యాయపదాలకు ప్రత్యామ్నాయంగా 'బ్రాహ్మణులు'ను భాషాంతరం చెయ్యాలి. జూ దళితుల చెవుల్లో సీసం పోసి హింసించటానికి, అవమానించటానికి కారణమైన సంస్కృతాన్ని ఒక తప్పనిసరి పేపరుగా సిలబస్ నుండి తొలగించాలి. జూ కొన్ని కావ్యాల్లోని పద్యాలు 'కామోద్దీపనకు' మాత్రమే ఉపకరించేవి తప్ప వాటివల్ల మరొక ప్రయోజనం లేదు. అటువంటి శృంగారాత్మక పద్యాలకు 'అ' మార్కు ఇచ్చి సిలబస్ నుంచి తొలగించాలి. అలాగే నిష్ప్రయోజనమైన కావ్యాలకు అసలు సిలబస్‌లో చోటు లేకుండా చూడాలి. ఉదా: కళాపూర్ణోదయంలోని సుగాత్రీశాలీనుల వృత్తాంతం.
ఈ విధివిధానాలు, మార్గదర్శక సూత్రాలు ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులకందరికీ అందుబాటులో ఉండాలి. స్త్రీవాదం, దళితవాదం వంటివి కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కాబట్టి విధివిధానాల్లో, విశ్లేషణలో మార్పుకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమవ్వాలి. దళిత విద్యార్థులు, ఉపాధ్యాయులు అనుభవిస్తున్న ఈ 'క్లాస్ రూం హింస', మానసిక ఘర్షణ కొంత వరకు తగ్గించడానికి ఈ మార్పు అవసరమని ప్రగాఢంగా నమ్ముతున్నాను. సమానత్వాన్ని ఒక విలువగా బోధించలేని విద్య- విద్య కాదు- అంధకారం. - డా.ఎం.ఎం.వినోదిని
1 కామెంట్:
I am very happy to go through the comments of Dr. M M Vinodhini, on hermeneutic interpretation and understanding of texts, in the Indian context. She levelled very thought provoking questions, which were & are persisting the disadvantaged sections and egalitarian people over the years.
It is unfortunate still even after sixty years of Independent India, the vernacular languages are being thought, under the opium of stratified caste hierarchy.
Language plays a crucial role in moulding the over all personality of an individual, in such circumstances one should take extreme care while bringing up the future citizens. So, unless and other wise our language syllabus are framed on egalitarian basis, we can not establish a harmonious society.
It is the responsibility of the political leadership to see egalitarian and constitutionally valid literature is offered to the up coming generations.
Egalitarian concepts like Dalit, Women and Minority literatures are being produced on a massive scale in the contemporary periods. So let us be optimistic to have a constitutionally democratic egalitarian syllabus for building a better nation in the years to come, without hegemony of a few.
కామెంట్‌ను పోస్ట్ చేయండి