-డా దార్ల వెంకటేశ్వరరావు లెక్చరర్, తెలుగుశాఖ, సెంట్రల్ యూనివర్సిటి, గచ్చిబౌలి, హైదరాబాదు. 09989628049
"శ్రీరామ' అనే నామం విన్నా, అన్నా, రాసినా పుణ్యమని భావించే భక్తులెంతో మంది ఉన్నారు. అలాగే రామాయణాన్ని రాసి, తమ జన్మలను చరితార్థం చేసుకోవాలని భావించిన వాళ్ళూ ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో శ్రీమతి పెయ్యేటి లక్ష్మీకాంతమ్మగారొకరు. ఆమె గేయ రూపంలో ''అంతరార్థ రామాయణం'' పేరుతో ఒక రామాయణాన్ని రాశారు. రామయణంలోని కథలను గేయ రూపంలో, చిన్న చిన్న కథలుగా చెప్తూనే, ఆ కథల్లోని అంతరార్థాన్ని వివరించే ప్రయత్నం చేశారు. రచయిత్రి పరిచయం: శ్రీమతి పెయ్యేటి లక్ష్మీకాంతమ్మ గారికి ''ముక్తికాంత'' అనే బిరుదు ఉంది. శ్రీవత్స గోత్రానికి చెందిన శ్రీమతి లక్కరాజు సుందరి, సీతారామయ్యల పుత్రిక. ఆమె పుట్టిన తేదీ విషయంలో స్పష్టత లేదు. కానీ, 'అంతరార్థ రామాయణం' లోని ఆంతంగిక ఆధారాలను అనుసరించి ఆమె 1950 (వికృతి నామ) సంవత్సరంలో స్వర్గస్థులయినట్లు మాత్రం తెలుస్తుంది. ఆమె జీవించి ఉండగా ఈ కావ్యం ముద్రితం కాలేదు. ఆమె మరణానంతరం మనవరాలు శ్రీమతి ఆత్రేయపురపు లక్ష్మీసుందరీ జ్ఞానప్రసూనాంబ గారు చొరవ తీసుకొని దాన్ని 1982లో ప్రచురించారు. జ్ఞానప్రసూనాంబ గారికి స్వయంగా సంస్కృతాంధ్ర సాహిత్యాలలో ప్రావీణ్యం ఉన్నా, గ్రంథ పరిష్కారానికి వివిధ పండితుల సహకారాన్ని కూడా తీసుకున్నారు. ఈ కావ్య పరిష్కరణకు శ్రీమతి ముట్నూరి సీతామహాలక్ష్మమ్మ, డా చిలుకూరి వీరభద్ర శాస్త్రి గార్లు సహకరించినట్లు తన కృతజ్ఞతలలో పేర్కొన్నారు. రచయిత్రి ఇతర రచనలు : శ్రీమతి పెయ్యేటి లక్ష్మీకాంతమ్మగారు అంతరార్థ రామయణంతో పాటు వివిధ పురాణేతిహాసాలను, వాటిలోని అంతరార్థాలనూ వివరిస్తూ వివిధ కావ్యాలను గానం చేసేవారు. అంతరార్థ రామాయణంలో పేర్కొన్న వివరాల ప్రకారం ఆమె కింది రచనలను చేసినట్లు తెలుస్తుంది. 1. అంతరార్థ నరకాసురవధ, 2. అంతరార్థ రుక్మిణీ కల్యాణం, 3. అంతరార్థ గజేంద్ర మోక్షం, 4. అంతరార్థ సాగర మధనం, 5.వచన భగవద్గీత, 6. లాలి పాటలు.
అంతరార్థ రామాయణం కావ్య విశేషాలు: 1) ''అంతరార్థమున కాధారభూతమై! అవని అంతా నిండుగా వెలుగులు విరజిమ్మ చిమ్మచీకటులు చెదిరిపోవ ఓ గజాననా నీకు నమస్కారశతములు'' అంటూ విఘ్నేశ్వర స్తుతితో ఈ కావ్యాన్ని ప్రారంభించారు. 2) ఇతర రామాయణాల వలే కాకుండా, అంటే బాలకాండ, అయోధ్య కాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ద కాండ, ఉత్తరకాండ అనే భాగాలుగా కావ్యాన్ని విభజించలేదు. చిన్న చిన్న కథా భాగాలుగానే కావ్యాన్నంతా రూపొందించారు. దశరథుని వృత్తాంతం, శ్రీరామ జననం, సీతాకన్యల జననం, విశ్వామిత్రుడనెడి విశ్వాస శర్మ రాక, జ్ఞానవివేకంబులు మునివెంట వెడలుట, తాటకయను భ్రాంతీ దేవియు, సుభాహువను దుర్గుణ పుంజంబుల వధ, అహల్యా దేవి శాపవిమోచనం, అహంకార ధనుర్భంగం, అయోధ్య ప్రవేశం......మొదలైన శీర్షికలుగా ఈ కావ్య విభజన జరిగింది. 3). ఈ కావ్యంలోనూ వాల్మీకి రామాయణ కథనే మూలంగా గ్రహించినా, ఇతర రామాయణాల్లోని కొన్ని కల్పితాంశాలను కూడా ఈ అంతరార్థ రామాయణంలో తీసుకున్నారు. ఉదాహరణకు అహల్యా శాపవిమోచనం ఘట్టాన్ని చూసినట్లైతే, వాల్మీకి రామాయణంలో లేకపోయినా, అది మొల్ల రామాయణంతో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. 4). కావ్యమంతా గాన యోగ్యమైన శైలిలో కొనసాగింది. కావ్య రచన ద్విపద, మంజరి, కీర్తనలతో వర్ణించారు. 5). అంతరార్థాన్ని వివరిస్తున్నా, శ్రీరాముని కథను సంపూర్ణంగా వినిపించే ప్రయత్నమే కావ్యమంతా కనిపిస్తుంది. 6). వేదాలు, ఉపనిషత్తులు, యోగ శాస్త్రాది విషయాలను ఆధారంగా చేసుకొని రామాయణ అంతరార్థాన్ని వివరించారు. 7) రామాయణాన్ని ఎవరు రాసినా, ఏ విధంగా వర్ణించినా సాధారణంగా శ్రీరాముని మాహాత్మ్యమే అందులోనూ ప్రతిఫలించటం జరుగుతుంది. అంతరార్థ రామాయణం కూడా అలాగే కొనసాగింది. అయితే ఈ కావ్యంలో కథను వివరిస్తూనే, మానవుని జీవాత్మ- పరమాత్మల స్వరూపాన్ని వివరించే మార్గంలో ఈ రచన కొనసాగింది. మరో విశేషమేమిటంటే, శ్రీరాముని ప్రస్తావన వచ్చినప్పుడల్లా అనేక విశేషాలతో ప్రస్తుతించారు. ఈ రచనా విధానం వల్ల పాఠకుని లేదా శ్రోతను శ్రీరాముని పైనే కేంద్రీకరించేటట్లు చేయగలిగే అవకాశం ఉంది. 8) అంతరార్థాన్ని వివరించడంలో ఆయా పాత్రలను అన్వయించడంలో కొంత గందరగోళం కనిపిస్తుంది. అందువల్ల పాఠకులు లేదా శ్రోతలు గందరగోళానికి గురయ్యే అవకాశం లేకపోలేదు. 9) మొత్తం మీద మానవ జీవితంలోని పరమార్థాన్ని గ్రహించి, తదనుగుణమైన జీవనాన్ని కొనసాగించి, జీవాత్మ - పరమాత్మలో లీనమవ్వడంతో ''ముక్తి'' లభిస్తుందని చెప్పడానికి ''రామాయణం'' ఆవిర్భవించిందని వివరించటమే లక్ష్యంగా ఈ కావ్య రచన కొనసాగిందని భావించవచ్చు. వీటిలో ముఖ్యమైన వాటిని ఇక్కడ వివరించే ప్రయత్నం చేస్తాను. ఉపనిషత్తుల్లో రామ ప్రస్తావన -అంతరార్థ వివరణ: మానవుని మానసిక ప్రవృత్తులను వివరించడంలో వేదాలు, ఉపనిషత్తులు ఎన్నో లోతైన ఆలోచనలను అందించాయి. అధర్వణ వేదాంతర్గతమగు రామరహస్యోపనిషత్తులో శ్రీరాముని తత్త్వము గురించి అడిగిన సనక సనందాది యోగేశ్వరులు, ఇతర ఋషీశ్వరులకు హనుమంతుడిలా వివరిస్తాడు. ''..... ఈసర్వ తత్త్వాలలో తారక బ్రహ్మ తత్త్వము ఉత్తమమైనది. రాముడే పర బ్రహ్మ, రాముడే పరమ తపము, రాముడే పరమతత్త్వము.. రాముడే తారక బ్రహ్మ ' ''వాయు పుత్రుని, విఘ్నేశ్వరుని, సరస్వతిని, దుర్గా దే్విని, క్షేత్ర పాలకుని, సూర్యుని, చంద్రుని, నారాయణుని, నరసింహుని, వాయు దే్వుని, వరాహుని వీరందరునూ మరియు మాతా సహితులగు సీతమ్మను, లక్ష్మణుని, శత్రుఘ్నుని, భరతుని, విభీషణుని, సుగ్రీవుని, అంగదుని, జాంబవంతుని - ఈ తెలిపిన అందరును శ్రీరామునికి అంగములని తెలిసికొనవలెను. అంగములు లేకుంటే రాముడు విఘ్నకరుడు'' అనే వివరణ కనిపిస్తుంది. ఆత్మ వివిధ రూపాలలో కనిపించడమే దీనిలోని అంతరార్థం. ఇంచుమించు ఇలాంటి భావాలనే శ్రీమతి పెయ్యేటి లక్ష్మీకాంతమ్మగారు తన ''అంతరార్థ రామాయణం''లో వర్ణించారు. 'దశరథుని వృత్తాంతం' తో అంతరార్థరామాయణం కథ ప్రారంభమవుతూ ఇలా వర్ణితమయ్యింది... ''ఇంద్రియంబులనెడి ఇంపైన గుర్రములు! కాయమనే రధము కడువేడ్కతోను !! పంచ కోశాపురి పరగ వర్ణింప! వశముకాదు గద వసుధలోపల!! సందు గొందులు సరస సావిళ్ళు! వింత వింత మేలు కట్ల మరియుండె ఇళా పింగళ వీధులింపుతో గలవు! సుఘమ్న పురమున కే సూటిజాపునుగ!! నయము మీరగ నవ ద్వారములు గలవు! నాథుడై దశరథుడు పాలించుచుండె దశేంద్రియములు తా పాలనము సేయ! నా దశరథునకు నాత్మ రాజనెడి !! నామంబు చేకూరె న్యాయాను సరణి! మగువలు ముగ్గురు కలరు రాజుకు!! నివృత్తి, ప్రవృత్తి, భక్తియనెడి ! కౌసల్య, కైక, సుమిత్ర సుదతులు !!'' (అంతరార్థ రామాయణం,1982: 1) ఈ వర్ణనలో మానవుని దేహం , మనసులకు సంబందించిన విషయాలే రామ కథగా రూపోందిందనే ఆలోచన కలుగుతుంది. ''దాశరథి (రాముడు) ఎంత అంతర్ముఖుడో, ఇంద్రియ నిగ్రహం కలవాడో దశముఖుడంతగా బహిర్ముఖుడు, ఇంద్రియలోలుడు. ఒక్క మాటలో చెప్పాలంటే దశ దిశలకూ Ê బహిర్ముఖమైన ఇంద్రియ చాపల్యానికి లంకేశ్వరుడు సంకేతం. ''దశముఖడంటే కుడి వైపు ఐదు తలలు, ఎడమ వైపు ఐదు తలలుండి ఒకే మెడకాయ ఉన్న విచిత్ర పురుషుడు కాడు. ఇక్కడ ముఖ్యంగా చెప్పవలసిందేమిటి అంటే రావణుని ఇంద్రియ లోలుత దశ దిశా పరివ్యాప్తములైన వని అర్థం. '' అని డా ముదివేడు ప్రభాకార రావుగారు వ్యాఖ్యానించటం కూడా ఇలాంటి రామాయణంలో ఒక అంతరార్థాన్ని నిరూపించే ప్రయత్నమే ఆయనా చేశారనిపిస్తుంది ఆయనే అయోధ్య అంటే ఏమిటో వివరిస్తూ ఇలా వ్యాఖ్యానించారు. ''మనలో ఏ సత్యం నిత్యమూ జాగృతమవుతూ ఉంటుందో, ఏ స్వచ్ఛ స్ఫాటికమైన అంత:కరణం ఆత్మానూభూతిగా జీవుని అనుభవంలో కసిస్తున వికసితున్నదో అదేరామతత్త్వం - ఆత్మా రాముడంటే అతడే. మనలోని ఈ ఆధ్యాత్మిక సారం బాహ్యంగా ఆకృతి ధరిస్తే ఎలా ఉంటుందంటే, దశరథుని కుమారుడైన దాశరధి వలే ఉంటుంది. ఈ దాశరథి దశేంద్రియాలను జయించిన వాడు - ( అవి ఐదు జ్ఞాఅనేంద్రియాలు ఘ్రాణ, రసన, చక్షు, త్వక్, శోత్రియములు జ్ఞానేంద్రియ పంచకం అంటారు. వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్థ కర్మేంద్రి య పంచకం అంటారు.) దాశరథియైన దాశరథి మనలో అవతరించవలెనన్నా ఉన్నా లేక లోకంలో చక్షుర్గోచరం కావాలన్నా ఆ ప్రదే్శం 'అయోధ్య ' కావాలి. యుద్దమంటే సంఘర్షణ. అయోధ్య అంటే సంఘర్షణ రహితమైనది. ఎక్కడ సర్వేంద్రియ సంఘర్షణలు బాహ్యాభ్యంతరంగా శమించి ప్రశాంత వాతావరణం నెలకొని ఉంటుందో అదే 'అయోధ్య ' అన బడుతుంది. అటువంటి అయోధ్యను పరిపాలించడానికి ఆత్మనిగ్రహం గలవాడే అన్ని విధాలా అర్హుడు. రాముడు ఎటువంటి వాడంటే స్వాహంకారం, భౌతిక భోగాలు జీవితంలో శాంతినీ సమాధానాన్ని సమకూర్చవని చక్కగా తెలిసిన వాడు '' అని అన్నారు. (వాల్మీకి - విశ్వనాథ రామకథానుశీలనము, 1993: 2) విశ్వాసమిత్రుడు యఙ్ఞం చేస్తుంటే కామశర్మ, దుర్గుణశర్మ,భ్రాంతిదేవి ఆటంకం పరుస్తున్నారని రచయిత్రి వివరించారు (అంతరార్ధ రామాయాణం, 1982;10) దశరథుడు ఆందోళన పడతాడు. కొడుకుని పంపించటానికి వెనుకాడినపుడు - వశిష్ట మహర్షి ఇలా చెప్పారట. నరుడని నీ పుత్రుణ్ణి భ్రమిస్తున్నావు. అది పురుషుడు, అమర తేజశ్శీలి. మీరు అతిథి కశ్యవులు మీ తపస్సుకి మెచ్చి " భూ భారహరణార్థం రాముడు పుట్టెనయ్య భూవర ! భావ వినాశి రాముడనగ భవ్య చరిత " ( అంతరార్ధ రామాయణం ,1982: 17) అని చెపుతాడు. అంతేకాదు. -- " శంఖు చక్రంబులు రెండు భరత శతృఘ్నలు శేషుడు సుమి లక్ష్మణుడు జగము మెచ్చన్" అని చెప్పి , " జనకపురంలో యోగమాయ జానికై జన్మించెను" అని చెపుతాడు. రాముడు యాగ రక్షణకు వెళ్ళి, తాటకి అనే భ్రాంతి దేవిని, సుభామవను దుర్గుణాలను వధిస్తాడు. ఆ తరువాత మరీచుడనే కామాన్ని అణిచివేస్తాడు. అహంకార ధనుర్భంగం చేసి జానకిని రాముడు వివాహమాడాతాడు. అహల్య అనేది క్షమాదేవి. ఆమెకి రాముని పాద ధూళితో శాప విముక్తి కలుగుతుంది. ( అంతరార్థ రామాయణం 1982:22.)ఇలా కొనసాగింది ఈ రామాయణం. ఆత్మ పరమాత్మ తత్త్వము: ఆత్మ పరమాత్మల తత్త్వాన్ని తేల్చడం అంత సులభం కాదు. ఈ విషయంలో యోగులు, మహర్షులు ఎంతో మంది వివరించే ప్రయత్నం చేశారు. ''ముక్తికి మెట్లు'' అనే గ్రంథంలో - డా వేదుల సూర్యనారాయణ శాస్త్రి గారిలా వివరించారు. ''కర్మ బద్దమైన ఆత్మ 'జీవాత్మ' అన బడతాడు. కర్మ విముక్తుడైన జీవుడు 'పరమాత్మ' అన బడతాడు. ' 'సుగుణంగా ఉన్న జీవుణ్ణి ప్రకృతిగానూ, అందున్న నిర్గుణ పరమాత్మను పురుషుణ్ణి గాను '' గ్రంథాలు పేర్కొంటున్నాయి అని అన్నారు.''పురమంటే దేహం. పురుషుడంటే పురంలో ఉండేది 'ఆత్మ' అని అర్థం. ఇంద్రియాలు, మనస్సు, బుద్ది అనే దేహంలోని. అందులో బుద్దిని నడిపించే శక్తి ఆత్మది.'' (ముక్తికి మెట్లు : 48) అందుకనే కఠోపనిత్ లో దేహం గురించిన చర్చ కొంత కనిపిస్తుంది. దీని సారాంశాన్ని చూస్తే ఆత్మ, రథి శరీరం, రథం, బుద్ది, సారథి, మనస్సు, పగ్గం, ఇంద్రియాలు, గుర్రాలు, విషయాలు, మార్గం అని స్పష్టమవుంది. ఈ భావాలను వివరించటంలో రచయిత్రి చాలా వరకూ కృతకృత్యురాలైయ్యారు. అయినా మరింత స్పష్టంగా వివరిస్తే బాగుండేదనిపిస్తుంది. అందువలనే వాల్మీకి మహర్షి మెదలు కొని నేటి వరకు వస్తున్న ఏ రామాయణాన్ని చదువుతున్నా, వింటున్నా ఏదో ఒక మాధుర్యం కలుగుతూనే, వాటిలో ఏదో అంతరార్ధం వినిపిస్తూనే ఉంటుంది. కానీ "అది" "ఇదే" అని చెప్పడం అంత సులువు కాదు. ప్రతి వాళ్ళూ రామయాణాన్ని చదవాలి. దానిలోని అంతరార్ధాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఉత్తమ జీవితాన్ని జీవించాలి. దానికి మానవునిగా జన్మించిన ప్రతి ఒక్కరూ తమ దేహన్ని, మనసుని, ఇంద్రియాల్ని తమ ఆధీనంలో ఉంచుకోవటానికి నిరంతరం సాధన చేయాలి. మనకు జీవిస్తూనే మన కర్మను మనం నిర్వర్తించాలని రామాయణం బోధిస్తుంది. ''శరీరంలో త్వక్(చర్మం) చక్షు, శ్రోత్ర, ఘ్రాణ, జిహ్వేంద్రియములనే పంచ జ్ఞానేంద్రియాలయాక్కయూ మనస్సు యోక్కయూ 'నేను నాది ' అనే భావం యొక్క క్రియా కలాపాల్ని జరిపించే దానికి మనోమయ కోశం అని పేరు. పదార్థాల యుక్క వైవిధ్యములైన స్వరూపము యొక్క పరిజ్ఞానం , దీని యొక్క ప్రత్యేక లక్షణంగా తెలిసికోవాలి. ఇది ప్రాణ కోశంతో ముడిపడి విజృంభిస్తూ ఉంటుంది. దీనిలో కలిగే 'నేను నాది' అనే భావాలు ప్రశాంతిని నాశనం చేస్తూ ఉంటాయి. అహం, లేక 'నేను ' అనేదానికి సంభంధించిన దేహం 'నాది' లేక 'మమ' అనే భావం. ఈ రెండు అహంకార మమకార కార్యాలే ' లోపల ఉండేది 'నాది' అనేది. బైట ఉండేది నేను (ముక్తికి మెట్లు : 129) '' అని వివరించడంలో కొంతలోతైన విశ్లేషణ కనిపిస్తుంది. ''ఈ జీవించే శరీరం నీకు సాధనం మాత్రమే అనుకోవాలి. కాని, అది నేనే అనుకోవడం కూడదు. నేను ఈ శరీరం కంటే విభిన్నుడనైయ్యే ఉన్నాను. అనే అనుభవాన్ని నీవు పొంది ఉండాలి. నీ వాహనాన్ని నీ పనులు జరుపుకోవడం కోసం చక్కగా నీవు ఎప్పటికప్పుడు శుభ్రపరిచి మలినం లేకుండా ఉంచుకొన్నట్లుగానే ఈ శరీరాన్ని కూడా నీలోని జన్మ వాసలన్నింటినీ నాశనం చేసి మరణాంతంలో నీకు కైవల్యాన్ని (ముక్తిని) సమకూర్చేందుకు పరిశుద్ద ఆహార విహారాల నియమంతో శుభ్రపరచి ఉంచుకొనే ఉండాలి. నీ లక్ష్యం సిద్ధించే వరకు దానిని అలక్ష్యం చెయ్యకూడదని కూడా గ్రహించాలి'' (ముక్తికి మెట్లు: 127-128) అని వివరించారు. ఇలా వివరించిన డా వేదుల సూర్యనారాయణ శాస్త్రి గారు కూడా అంతరార్థ రామాయణాన్ని రాసినట్లు వారి గ్రంథాలను బట్టి తెలుస్తుంది. మొత్తం మీద శ్రీమతి పెయ్యేటి లక్ష్మీకాంతమ్మ గారి రామాయణంలోని అంతరార్థాన్ని నాకు అర్థమైనంత వరకూ ఇలా అర్థం చేసుకోవచ్చునిపించింది. రాముడు - ఆత్మారాముడు, (జ్ఞాన పరిపూర్ణుడు), లక్ష్మణుడు - జితేంద్రి యుడు (ఇంద్రియాలను జయించిన వాడు),భరతుడు-పరిపూర్ణ వైరాగ్యుడు (తనకు రాజ్యం వచ్చినా రాజ్యం పాలించలేదు.యోగిగా జీవించాడు),శత్నఘ్నుడు - అరిషడ్వర్గముల(కామ, క్రోధ, లోభ, మోహ, మధ, మాత్సర్యా దుల) ను శత్రువులను జయించిన వాడు. సీత- శాంతి, తాటకిని భ్రాంతిగానూ, మంధరను దుర్భుద్దిగానూ,శూర్పణకను తృష్ణగానూ, జటాయువును ధర్మస్వరూపుడు గానూ, ఆంజనేయుడు- సత్సాంగత్యం, రావణాసురుడు - రవ్వంత సేపు ఈశ్వరాధ్యానం కలవాడే కానీ, అజ్ఞానంగలవాడు గానూ ఈ రామాయణంలో అంతరార్థాన్ని తత్త్వపరంగా వివరించే ప్రయత్నం చేశారనుకుంటున్నాను. లంకను శంక రూపంగానూ, రావణుణ్ని అజ్ఞాన రూపుడుగాను ఆ పాత్రల్లోని అంతరార్థాన్ని రచయిత్రి వర్ణించారు. ''జన్మ రాహిత్యం కల్గడమే మోక్షం'' ఆ ఆ మోక్షాన్ని కలిగించడానికి అవతరించిన మహాత్ముడే శ్రీరాముడు. అలాంటి శ్రీరాముడే ప్రతి మానవునిలోనూ దేహం, మనసు, దశేంద్రియాల, అరిషడ్వవర్గాల రూపంలో వివిధ మానసిక ప్రవృత్తుల్లో ఉంటారు. ఎప్పుడైతే జ్ఞానం ప్రకాశిస్తుందో అప్పుడు అతడు పరమాత్మలో ఐక్యమవుతాడు. అజ్ఞాని కూడా జ్ఞాని అవుతాడు. పరమాత్మను చేరతాడు. అలా చేరే మార్గాలను వివరించేదే్ రామాయణం. ఇదే ప్రధానంగా రామాయణం లోని అంతరార్థం!
పాదసూచికలు: 1.మం. శ్లో హనుమాన్ ఉవాచ: భో యాగీం ద్రాశ్చ ఋష యో విష్ణుభక్తా స్తథై వ చ, శృణుధ్వంమామకీం వాచం భవబంద నాశినీమ్, ఏతేషు చైవ సర్వేషు తత్త్వంచ బ్రహ్మతారకమ్, రామఏవ పరం బ్రహ్మ రామఏవ పరం తప:, రామ ఏవ పరం తత్వగ్ం శ్రీరామో బ్రహ్మ తారకమ్ (రామరహస్యోపనిషత్ 1-1-3 , 970) మం. శ్లో హనుమాన్ ఉవాచ: వాయుపుత్రం విఘ్నేశం వాణీం దుర్గాం క్షేత్రపాలకమ్, సూర్యం చంద్రం నారాయణం, నరసింహం వాయు దేవం వరాహం, తత్సర్వాన సమాత్రాన్ సీతాం లక్ష్మణగ్ం శత్రుఘ్నం భరతం భీషణం సుగ్రీవ మంగదం జాంబవంతమ్, ప్రణవ మేతాం రామస్యాంగాని జానీథా:, తాన్యంగాని నా రామో విఘ్నకరో భవతి (రామరహస్యోపనిషత్ 1-5 ( పుట: 971) 2. పెయ్యేటి లక్ష్మీ కాంతమ్మ - అంతరార్ధ రామాయణం , పుట: 1 3. ముదివేడు ప్రభాకర రావు ,వాల్మీకి విశ్వనాథ రామ కథానుశీలన , 1993- 62,63. 4. ముదివేడు ప్రభాకర రావు ,వాల్మీకి విశ్వనాథ రామ కథానుశీలన ,1993.26. 5.వేదుల సత్యనారాయణ శాస్త్రీ , ముక్తికి మెట్లు - పుట 48. 6.వేదుల సత్యనారాయణ శాస్త్రీ , ముక్తికి మెట్లు - పుట129. 7.వేదుల సత్యనారాయణ శాస్త్రీ , ముక్తికి మెట్లు - పుట127,128. ఆధార గ్రంధాలు: 1. ఉపనిషత్ కల్ప తరువు (మూడు భాగాలు) విద్వానం గర్రె సత్య నారాయణ గుప్త (సంగ్రహ కర్త ), ప్రార్థనా గాన ప్రచార సంఘం, విజయవాడ :1997. 2. ప్రభాకర రావు, ముదివేడు వాల్మీకి విశ్వనాథ రామ కథానుశీలము , ~ జ్నాన ప్రసూన మాలిక ప్రచురణలు, ఎస్ వి, యూనివర్శిటి క్యాంపస్ , తిరుపతి:1993. 3. పెయ్యేటి లక్ష్మీకాంతమ్మ, అంతరార్ధ రామాయణం, అతేయపురపు లక్ష్మీసుందరి జ్నాన ప్రసూనాంబ , త్యాగరాజు భవనము, నర్సాపురము:1982. 4.సూర్య నారాయణ శాస్త్రీ, వేదుల ., ముక్తుకి మెట్లు గంగాధర పబ్లికే్షన్ , విజయవాడ :1987
దళిత పదాన్ని అధికారిక పత్రాల్లో ప్రయోగించడం రాజ్యాంగ విరుద్దమని జాతీయ ఎస్సీ కమీషన్ అభిప్రాయ పడినట్లు వార్తలు వస్తున్నాయి. న్యాయనిపుణుల సలహాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు కూడా వార్తలు వెలువడతున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం "షెడ్యూల్డు కులాలు " అనిపేర్కొనడమే రాజ్యాంగ రీత్యా సరైనదనే అభిప్రాయాల్ని వ్యక్తీకరించినట్లు కూడా పత్రికలు రాస్తున్నాయి. ఇప్పటికే చత్తీస్ ఘర్ ప్రభుత్వం ఆయా అధికారులకు కూడా ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది.
మన రాష్ట్రంలో ఇటీవల పర్యటించినజాతీయ ఎస్సీ కమీషన్ సభ్యుడు కూడా ఈ విషయంలో తమ అభిప్రాయాల్ని వెల్లడించారు. "భారతదేశంలో షెడ్యూల్డ్ కులాలను దళిత పదంతో సంబోధించరాదు. అంబేద్కర్ కాలం నుంచి అమల్లో ఉన్న దళిత పదం 'అస్పృశ్యత' అనే భావం స్ఫురించేలా ఉండటంతో జాతీయ ఎస్సీ కమిషన్ ఆ పదాన్ని నిషేధించింది. ఆ మేరకు సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. మార్చి 17, 2008 నుంచి 'దళిత' పదంపై నిషేధం అమల్లో ఉంది. ఈ పదాన్ని ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలోగానీ అధికారికంగా గానీ, అనధికారికంగా కానీ ఎవరూ ఉపయోగించరాదు. రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలుగానే పిలవాలి. అసలు ఈ పదం దేశంలోని ఏ భాషలోనూ లేదు. ఈ పదాన్ని నిషేధిస్తూ విస్తృత ప్రచారం చేయనున్నాం"- అనిజాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ వి.ఎలీసా హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో "దళిత" పదాన్ని ఒకసారి సమీక్షించుకోవలసిన అవసరం ఏర్పడింది. ఇప్పటికే "దళిత" అనేదిఅన్ని రంగాల్లోనూప్రాచుర్యంలోకి వచ్చేసింది. 'దళితులు' అంటే రాజ్యాంగం పేర్కొన్న'షెడ్యూల్డు కులాలు' అనేఅందరూఅర్ధంచేసుకుంటున్నారు. అణగారిన వర్గాల్ని కూడా కలిపి దళితులుఅనిపిలుస్తుప్పటికీ, వాస్తవంలోఅందరూ అలాభావించడం లేదు. దళిత అనే పదం ఒక రాజకీయ జిమ్మిక్కుగా మారిపోయింది. మళ్లీ ఈ మధ్య కాలంలో "బహుజన" పదం కూడా అదే రూపాన్ని సంతరించుకొంటుంది. మన రాష్ట్రంలో పరిస్థితినే తీసుకున్నా, ఇప్పటికే ఆయా కులాల వారికి ప్రత్యేకమైన పేర్లు స్థిరపడిపోయాయి. వెనుకబడిన వర్గాలంటే బి.సి. లనీ, గిరిజనులంటే ఎస్.టి.లనీ, దళితులంటే ఎస్.సి. లనీ అర్ధంచేసుకుంటున్నారు.
సాహిత్య రంగంలో కూడా 'దళిత' పదాన్ని ప్రధానంగారెండు కోణాల్లో అధ్యయనం చేస్తున్నారు. అణగారిన అన్ని వర్గాలూ, అంటేఎస్.సి.,ఎస్.టి., బి.సి., ముస్లింలలో మైనారిటీకి గురికాబడేవారు, స్త్రీలు, ఇంకా సామాజికంగా, ఆర్ధికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా అణచివేతకు గురవుతున్న వారంతా దళితులనే స్థూల దృష్టి కనిపిస్తుంది. మరో వైపు నిర్ధిష్ట కుల అస్తిత్త్వ చైతన్యంతో అంటే, సాంఘికంగా కులం వల్ల హీనత్వానికి గురవుతున్న షెడ్యూల్డు కులాల లోని ఉపకులాల వారే దళితులు అనే అవగాహనకనిపిస్తుంది.గిరిజనులకు లేని వంశపారంపర్య కులహీనత్వ భావానికి గురికావడమనేదిదళితులకు మాత్రమేజరుగుతుండటం వల్లఅస్పృశ్యత మాత్రమే దళితులకు పునాది అవుతుందని భావిస్తున్నారు. సామాజికంగామిగతా వర్గాలకు లేని వివక్షతకులం వల్ల దళితులకు మాత్రమేఅదనంగా చేరింది. అందువల్ల 'దళిత' అనే పారిభాషిక పదం సమాజంలోని మిగతా వర్ణాలు, వర్గాల నుండి విడగొట్టబడిన వాళ్ళు అనే అర్ధంలోనే మొదట ప్రయోగించారు. ఈ పదాన్ని కేవలం ఆ అవగాహనతో మాత్రమే కాకుండా, అనేక చారిత్రక పరిస్థితుల వల్ల కూడా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు.
నర్సీమెహతా అనే రచయిత 'హరిజన' పదాన్నిఒక సందర్భంలో తండ్రి ఎవరో స్పష్టంగా తెలియని వ్యక్తిని సంబోధించడానికి ప్రయోగించినా, అది నచ్చిమోహన్దాస్ కరమ్‌చంద్‌గాంధీ దాన్నేవిస్తృతంగాప్రచారం చేశాడు.భారతజాతీయోధ్యంలో గాంధీ కున్నతీవ్రమైనప్రభావం వల్లఅది వేగంగానే ప్రచారంలోకి వచ్చింది. గాంధీ దాన్నిమంచికో చెడుకో వాడుకున్నా, దళితుల్ని ఏకం చేయడానికే దోహద అదిపడింది. తమనంతా అస్పృశ్యులమని చూపడానికి జరిగిన కుట్రగా దాన్ని త్వరలోనే దళితులు గుర్తించారు.
భారతదేశంలో పుట్టుక, కులం వల్ల ఏర్పడి వంశ పారం పర్యంగా వెంటాడుతున్న అస్పృశ్యత వల్ల సమాజం నుండి విడగొట్టబడిన వాళ్ళు గా ఎస్సీలు పరగణింపబడ్డారు. దళిత పదాన్ని కూడా మొదట్లో తమకు జరిగిన అవమానాన్ని స్పష్టంగా చెప్పి, తమకి ప్రత్యేకమైన హక్కుల్ని రాబట్టుకోవడాకే ఆపదాన్ని ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత దళిత పదం ఆ కులాల వారినందరినీ ఏకం చేసింది. అంతకు ముందు గాంధీ వాడుకలోకి తెచ్చిన హరిజన పదం కూడా ఏకం చేసినా, అదితమని అవమాన పరిచే విధంగా ఉందని కూడా గుర్తించారు. '' దేవుని బిడ్డలు" అనే అర్ధాన్నిచ్చే'హరిజన' పదం వెనుక దేవదాసీ బిడ్డలు, అక్రమసంతానం వంటిఅర్థాలున్నాయి. హరిజన పదం తమకి ఆత్మ గౌరవాన్ని పెంచకపోగా కించపరిచేలా ఉందని భావించారు. పైగా హరిజన పదాన్నిఅంబేద్కర్తీవ్రంగావ్యతిరేకించాడు. దానితో ఆయన అనుయాయులకు గాంధీ పట్ల గల వ్యతిరేకత కూడా తోడై హరిజన పదాన్ని నిరసించడానికి ప్రధానకారణమైంది. దీనికి ప్రత్యామ్నాయంగా మహాత్మాజోతీ రావు పూలే దళిత పదాన్ని వాడుకలోకి తెచ్చారు. దాన్ని అంబేద్కర్ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. నేడు దళిత పదం ఒక ఆత్మ గౌరవ ప్రతీకగా మారింది. నేడుదళితులమని చెప్పుకోవడాన్నిఎంతోమంది ఆత్మ గౌరవంగా భావిస్తున్నారు. నేడుదళిత పదం అర్ధ గౌరవం సాధించడమే దీనికి ప్రధానకారణం. మన ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఒకప్పుడు మాదిగ అని చెప్పుకోవడానికి వెనుకాడేవాళ్ళు సహితం, నేడు ఆ పదాన్ని గౌరవప్రదమని భావిస్తున్నారు. అయితే, ఆ సమయ సందర్భాల్ని, పదాల్ని ఉచ్చరించే విధానాల్ని బట్టి గౌరవంగా పిలుస్తున్నారా? అగౌరవంగా అవమానంగా పిలుస్తున్నారా? అనేది తెలుస్తుంది. ఇప్పుడు దళిత అనే పదం దేశావ్యాప్తంగా గల ఎస్సీలంతా ఇంచుమించు అంగీకరించిందే. ఇంకా మరికొంతమందిదళిత పదాన్ని వ్యతిరేకిస్తున్నారంటే, వాళ్ళలో గల దళిత చైతన్యాన్ని కూడా అనుమానించవలసిన పరిస్థితే కనిపిస్తుంది. అంబేద్కర్ భావజాలం కంటే, వారిలో మరొకరి భావజాలమేదో నిండి ఉందేమో తెలుసుకోవలసిన అవసరం, దాన్ని లోతుగా చర్చించ వలసిన ఆవశ్యకత కనిపిస్తుంది. పైగా మన రాజ్యాంగంలో లేదనో, మన దేశానికి చెందనిదనో దళిత పదాన్ని నిషేధించడం సమంజసమేనా? మనవి కాని అనేక భాషాపదాల్ని, భావాల్ని, విఙ్ఞానాన్ని మనం వాడుకుంటూ, దాన్ని మనలో ఒక భాగంగా మార్చుకోగలిగినప్పుడు దళిత పదమే నిషేధానికెందుకు గురవుతుందో లోతుగా చూడాలి.
ఒకప్పుడు ఒక అర్ధంలో ప్రయోగంలో ఉన్న పదాలు కాలక్రమంలో అర్ధపరిణామానికి గురవుతాయి. ఛాందసుడు అంటే ఒకప్పుడు వేద ఛందస్సు బాగా తెలిసిన వాడని, పండితుడని అర్ధం. నేడు అదిప్రాచీన భావాల్ని పట్టుకొని వేలాడే అభ్యుదయ నిరోధకుడనే అర్ధ పరిణామానికి గురయ్యింది. ఒకప్పుడు సభికులు అంటే జూదరులు అని అర్ధం. నేడు సభలో ఉన్న ప్రేక్షకులు అని అర్ధం. అలాగే ఒకప్పుడు చీర అంటే వస్త్రం అని ఉన్న అర్ధం నేడు స్త్రీలు ధరించే వస్త్రంగా పరిణామాం చెందింది. ఇలాగే అనేక పదాలు అర్ధ విపరిణామానికి గురైనట్లే దళిత పదం కూడా నేడు దళితులు సమైక్య శక్తికీ, దళితుల ఆత్మగౌరవభావాన్ని సూచించే పదంగా మారింది. ఇలాంటి స్థితిలో దళిత పదాన్ని నిషేధించడమంటే, ఒక మహాచైతన్యాన్ని అడ్డుకోవడమేనేమో మేధావులంతా ఆలోచించ వలసిన సమయం ఆసన్నమయ్యింది.
మనమేంటో మనకి తెలిసినా ఒకరినొకరు తెలుపుకోవటం మనకిష్టముండదు మనసులో స్వచ్చంగా మాట్లాడుకోవాలని బాధలన్నింటినీ ఓ పాత్రలో ఒంపేసుకోవాలనీ ఉంటుంది అయినా మనం లోతుల్ని తాకని ఏవో కబుర్లతో కాలాన్ని స్వారీ చేయిస్తూ యాంత్రిక సంభాషణలైపోతుంటాం! మోసం చేసుకుంటున్నామని తెలిసినా మన మూలాల్లోకి వెళ్ళటానికేదో అలజడి చులకన భావమో సానుభూతి చినుకులో అలముకున్న ఆధిక్యతో ఏదో ఏదో మనల్ని దూరం చేస్తుందేమోనని మనల్ని మనం వంచన చేసుకోవటానికైనా సిద్దపడిపోతుంటాం! ఊహల్లో విహరించలేక వాస్తవాల్ని జీర్ణించుకోలేక ఒకరినొకరు తడిమి చూసేసుకోవాలని వడి వడిగా నడిచే తలపులతో మనం సిద్దమవుతూనే హృదయపు తలుపుల్ని మాత్రం తాకటానికేదో తొట్రుపాటు! " వద్దు ఎవరి గురించీ ఎవరూ తెలుసుకోవద్దు" పరస్పర గౌరవం బ్రద్దలు కాకూడనుకొంటూనే ఆలోచనల వంతెనల్ని కృత్రిమంగా దాటలేక మనకి మనమే ఒంటరిగా బ్రద్దలైపోతుంటాం! -డా//దార్ల వెంకటేశ్వరరావు - (ఆంధ్ర ప్రదేశ్ మాస పత్రిక - ఫిబ్రవరి 2000) లో ప్రచురితం.
--డా//దార్ల వెంకటేశ్వరరావు అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలుగు శాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం,
గచ్చిబౌలి, హైదరాబాదు-46, ఫోను: 09989628049, vrdarla@gmail.com
1.0.ప్రస్తావన: తెలుగుసాహిత్యానికి సుమారు పదిహేను వందల సంవత్సరాల చరిత్ర ఉంది. నన్నయ క్రీ.శ .11వ శతాబ్దంలో ఆంధ్రమహాభారతాన్ని రాశాడు. రాజరాజ నరేంద్రుని ఆస్థానంలోఉన్న నన్నయ ఆంధ్రమహాభారతాన్నివర్ణాశ్రమ ధర్మ పరిరక్షణ కోసం రాశాడు ( ఆంధ్రమహాభారతం-ఆది:1 - 6). వర్ణాశ్రమధర్మాలను పరిరక్షించటం నాటి పాలకుల విధి. ఆవర్ణాశ్రమ ధర్మాలు హిందూ ధర్మాన్ని బోధించే మనుస్మృతి మొదలైన గ్రంథాలనుఅనుసరించి రూపొందినవి.అలాంటి వర్ణాశ్రమధర్మాల గురించివివరించటంలో ప్రాచీన తెలుగు కవులు ‘మాదిగ’లను కూడా ‘శూద్రులు’గానేపరిగణించారు. బ్రాహ్మణ, క్షత్రియ ,వైశ్యులకు అసూయలేకుండా సేవచేయటమేశూద్రుల ధర్మమని మనుస్మృతి (1-91) స్పష్టం చేస్తుంది. ప్రధానంగా ప్రాచీన తెలుగు సాహిత్యంలో ఆ భావజాలాన్నివిస్తరించే ప్రయత్నమే కనిపిస్తుంది.దీనికి భిన్నంగా ఆధునిక సాహిత్యం చాలా వరకూ మానవీయ కోణంతో మాదిగ జీవితాలనువర్ణించింది. కనుక, తెలుగు సాహిత్యంలోని మాదిగల గురించి పురాణ, ప్రాచీన, ఆధునిక విభాగాలుగా విభజించుకుని పరిశీలించటం జరుగుతుంది. ఆయా కాలాలలోవెలువడిన వివిధ సాహిత్య ప్రక్రియలలో మాదిగల జీవితమెలా ప్రతిఫలించిందోఈవ్యాసంలో వివరించే ప్రయత్నం చేస్తాను.
1.1.‘మాదిగ’జాతి-వివరణ: భారతదేశంలోఉన్న కులాలు, తెగలను రాజ్యాంగం షెడ్యూల్డ్ కులాలు(S.C), షెడ్యూల్డ్తెగ(S.T)లని పేర్కొన్నది. షెడ్యూల్డ్ కులాల్లో ” మాదిగ” ఒక ఉప కులం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో S.C ల లో ఉన్న 6 1కులాల్లో ఇదొకటి. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాల-మాదిగ కులాలు అనేక సాంస్కృతిక విషయాల్లోభిన్నమైనవిగా కనిపిస్తాయి. వ్యవహారంలో వీటికి అనుబంధంగానే ఈ మిగిలినకులాలన్నీ ఉన్నాయి. ఈ పరిస్థితే ఇంచుమించు తెలుగు సాహిత్యంలోనూకనిపిస్తుంది. అందుకనే ‘మాల-మాదిగ’ కులాలను అస్పృశ్యులు, చండాలురు, పంచములు, హరిజనులు, దళితులు మొదలైన పేర్లతో పిలుస్తున్నారు. ఇన్ని పేర్లతోపిలుస్తున్నా, ఆశ్రితకుల విభజన వల్లా, మరికొన్ని కుల సాంస్కృతిక లక్షణాలవల్లా సాహిత్యంలో ‘మాదిగ’లను సాధ్యమైనంత స్పష్టంగా నే గుర్తించేవీలుకలుగుతుంది. తరతరాలుగా ‘మాదిగ’లకు కొన్ని ప్రత్యేక లక్షణాలుఉన్నాయి(ఆచార్య కంచె ఐలయ్య 1996: iii). వాటిలో గొడ్డుని కోయటం, గొడ్డుమాంసం తినటం, చర్మంతో చెప్పులు కుట్టట్టం, డప్పులు తయారు చేయటం, వాటినివాయించటం మొదలైన పనులు మాదిగలు మాత్రమే చేస్తుండేవారు. ప్రాచీన తెలుగుసాహిత్యాన్ని వివరించేటప్పుడు “మాదిగ” అని స్పష్టంగా కవులు పేర్కొనకపోయినా పైన పేర్కొన్న సాంస్కృతిక లక్షణాల ఆధారంగానే వీరిని గుర్తించకతప్పదు. ఒక సందర్భంలో బోయిభీమన్నగారు కూడా మాల మాదిగలను ప్రాచీనసాహిత్యంలో మాల అనే పేరుతోనే పిలిచారని ఆయన రాసిన రాగ వాసిష్టం నాటకానికిరాసిన ముందుమాటలో పేర్కొన్నారు.
1.1.1.నిఘంటవుల్లో“మాదిగ”శబ్దం: తెలుగునిఘంటుకర్తలు మాదిగ అనే శబ్దానికి జాతిపరమైన అర్థాన్నిచ్చారు. జాంబవులు, అరుంధతీయులు, మాతంగులు, గోసంగులు, చండాలురు, బైండ్లవాళ్ళు, కొమ్ములవాళ్ళు, పంభలవాళ్ళు మొదలైన అర్థాలు కూడా నిఘంటువుల్లో కనిపిస్తున్నాయి. మాల-మాదిగలకు కూడా పెద్ద భేదాన్ని పాటించకుండానే ప్రాచీన సాహిత్యంలోనూప్రయోగాలున్నాయి. దీన్నిఅనుసరించితెలుగు సాహిత్యంలో మాదిగల జీవిత ప్రతిఫలనాన్ని కింది విధంగా తెలుసు కోవచ్చు
1.2. పురాణాల్లో మాదిగలు - సాహిత్యం :
మాదిగలజీవితంలోని అనేక కోణాలను, మాదిగల ఆత్మ గౌరవాన్ని తెలియ చెప్పే పురాణంజాంబపురాణం. దీన్ని వ్యవహారంలో జాంబవపురాణం అని కూడా పిలుస్తారు. దీనిలోమాదిగ- బ్రాహ్మణ సంబంధాల చర్చ తాత్త్విక స్థాయిలో కనిపిస్తుంది. సృష్టికిముందు పుట్టినవాడు జాంబవముని.ఆ తర్వాతనే ఆదిశక్తి, త్రిమూర్తులు,కామధేనువు,సరస్వతి,లక్ష్మీ,పార్వతుల జననం వంటివి ఈ పురాణం లోఉన్నాయి.జాంబపురాణాన్ని తెలుగు జానపద కళారూపాల్లో ఒకటిగా కూడా పరిశోధకులుభావిస్తున్నారు. అయితే, సంప్రదాయ సాహితీవేత్తలు జాంబపురాణాన్నిభారతీయఅష్టాదశ (18) పురాణాల్లో ఒకటిగా గుర్తించలేదు. అలా గుర్తించకపోవటంలో హిందూభావజాలం పాత్ర చాలా ఉంది. ఎవరు ఎలా భావించినా జాంబపురాణానికి మాదిగసాహిత్యం లో ప్రముఖ స్థానమే ఉంది.
మాదిగల చరిత్ర, సంస్కృతులనుఅర్థంచేసుకోవటానికి ఈ జాంబపురాణం ఎంతగానో ఉపయోగపడుతుంది. తమ వంశాన్నిఉన్నతీకరించుకోవటానికి అగ్రవర్ణాలవారెలా ప్రయత్నిస్తున్నారో, అలాగేమాదిగలు కూడా తమ వంశం గొప్పదని చెప్పుకోవటానికి జాంబపురాణాన్ని ఆధారంగాచూపుతున్నారు. ఈ వాదనలతో వచ్చిన మాదిగ పురాణ సాహిత్యాన్ని పరిశీలిస్తే, డా.బోయి భీమన్న గారు రాసిన ‘ రాగవాసిష్టం ( 1959) తొలి తెలుగు పౌరాణిక -సాంఘిక నాటకంగా కనిపిస్తుంది. పురాణాలను అధారంగా చేసుకొని మాదిగలగొప్పతనాన్ని తెలియజేసిన గొప్పనాటకంగా అభివర్ణించవచ్చు. డా.బోయి భీమన్నగారు’మాల’ కులానికి చెందినా ఆయన తొలిదశలో రాసిన రచనల్లో ‘మాల - మాదిగలు’ ఒకటే అనే దృష్టి కనిపిస్తుంది. ఆ నాటకానికి రాసిన ముందుమాటలోనూ ఆవిషయాన్ని స్పష్టంగానే వివరించారు. మాదిగల ఆడపడుచుగా ప్రసిద్ధి చెందిన ‘ అరుంధతీ దేవి - వసిష్ఠుల ప్రేమ కథకు పురాణ ఇతివృత్తాన్ని తీసుకుని ఈనాటకాన్ని రాశారు. ఆ తరువాత నముల కంటి జగన్నాథం గారు ‘అరుంథతీ దేవిచరిత్రము(1968 ) పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు. మాదిగల చరిత్రఉన్నతమైందనీ, వేద, పురాణ కాలంలో ఈ కులవ్యవస్థ లేదనీ, తరువాత కాలంలో వసిష్ఠమహర్షికీ, అరుంథతీ దేవికీ కులాలను అంటగట్టారనీ నిరూపించే ప్రయత్నం (1968 : 47 ) చేశారు.
పురాణాలను, సంస్కృత, తెలుగు మహాభారత, భాగవత, రామాయణాలనుచూపుతూ మాదిగ సాహిత్యానికి అంకురార్పణ చేశారు. పాండవుల జన్మకు కారణమైనవాడు కూడా వ్యాస మహర్షే. అతడు పరాశరుడు, ఓ శూద్ర స్త్రీ సత్యవతికీపుట్టినవాడు. అతడు విభజించిన వేదాలను తమ మూలధనాలుగా బ్రాహ్మణులుభావిస్తారు. పాండవులనూ గౌరవిస్తారు. వాళ్ళు హీన జన్ములు కాదు. కనుక వర్ణంకంటే కర్మ వల్లనే జాతి, కుల భేదాలు నిర్ణయించబడ్డాయి (అదే :1968 : 47 ) అని ఈ రచయిత అభిప్రాయం. ఈయనే ” అరుంథతీయుల వంశ వృక్షం ” అనే పుస్తకాన్నీరాశారు. దీని తరువాత పేర్కొనదగిన పురాణ సాహిత్యం మాదిగ రచనల్లో నల్లపాటిశివనారయ్య గారి వ్యాసాలు మాదిగల గురించి బలమైన ఆధారాలను వివరించేవిగాఉన్నాయి.
మాదిగల చరిత్ర, సంస్కృతులను పురాణేతిహాసాలఆధారంగానిరూపించటానికిఇవిఎంతగానోతోడ్పడతాయి.ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి మునివాహనుడు(1976) నాటకం లో తిరుప్పాణ్ ఆళ్వార్ కథ మాదిగల జీవనాన్ని, భక్తినీగుర్తుకి తెచ్చేలా ఉంటుంది. పురాణాల్లో మాదిగ, అస్పృశ్యుల కథలను డా. బి.విఎస్. మూర్తి గారు ‘ దళిత కథామంజరి ( 1992) పేరుతో రాశారు. దీనిలో ” అరుథతీదేవి చరిత్ర ” తో పాటు మాతంగి కులానికి చెందిన శ్రీ లక్ష్మమ్మ అనేభక్తురాలి కథ కూడా ఉంది (1992 : 111 - 118 ). బొనిగల రామారావు గారు ” మాల - మాదిగల ప్రాచీన చరిత్ర” (1997)ను రాశారు. దీనిలో మాదిగలు బ్రాహ్మణులకంటే ముందే సృష్టించబడ్డారని (1997 : 83)జాంబ పురాణాన్ని బట్టినిర్ణయించారు. జాతిని తెలిపే పౌరాణిక కథలను భాష, చరిత్రలతో ముడి పెట్టేప్రయత్నం చేశారు. మాదిగ జాతిని తొలి జాతిగా పేర్కొన్నారు. డా.యస్.టి.ఙ్ణానానంద కవి ”షెడ్యూల్డ్ కులాలుఅంటరానివా?” (1997) అంటూ పురాణాల్లోనికథలను, ఉదాహరణలను పేర్కొంటూ మాదిగలు చరిత్రలో గొప్పవారనీ నిరూపించేప్రయత్నం చేశారు. కానీ ఉట్టంకింపులకు సరైన ఆధారాలను చూపించిఉంటేమరింతబాగుండేది.
“అరుంధతీయుల చరిత్ర” (1998) పేరుతో అల్వాల మల్లేష్ ఒకపుస్తకాన్ని రాశారు. దీనిలో అంతకు ముందు వచ్చిన పుస్తకాలలో ఉన్న విషయాలనుసమీక్షిస్తూ వివరించారు. తాళ్ళూరి లాబన్ బాబు గారు ” మాదిగ వారి చరిత్ర” (2001) ను కొత్త కోణంతో రాశారు. మాదిగలే జాంబవులు. వారు పూర్వం భారతదేశాన్ని పరిపాలించిన క్షత్రియ వంశస్థులు, మాదిగల దేశమే జంబూద్వీపం (2001:2-6) అనీ అన్నారు. “జాంబవంతుడు” అనేది వ్యక్తి నామం కాదనీ, అదిమాదిగ జాతి పేరనీ (పు: 31) నిరూపించటానికి పురాణాలను ఆధారలుగా చూపారు.చలి నుండి రక్షించుకోవటానికి జంతువుల చర్మాలు ఉపయోగపడతాయని కనుగొన్నారు.వాటిని వస్త్రాలుగా తయారు చేసుకోవటంలో నైపుణ్యం ప్రదర్శించిన మాదిగలనుచర్మకారులుగా గుర్తించారు. ఇదంతా సామాజిక శాస్త్రాలను ఆంత్రోపాలజీని, పురాణ సాహిత్యాన్ని ఆధారం చేసుకుని మాదిగలు పశుసంబంధ వృత్తినిచేపట్టటానికి గల
కారణాలను శాస్త్రీయంగా చెప్ప గలిగిన పుస్తకం.
ఆచార్యకంచె ఐలయ్య గారు ఏకలవ్య మాసపత్రికలో ఆర్థిక కోణంతో మాదిగ పురాణ అంశాలనువివరించారు. వాటిని తరువాత 1996లో “మాదిగ, ఆర్థిక సాంఘిక తత్వం”అనేపేరుతో చిన్న పుస్తకంగా ప్రచురించారు. తాళ్ళూరి లాబన్ బాబుగారు “మాదిగచరిత్ర”ను అత్యధిక శాతం చరిత్ర , పురాణాలు, ఆంత్రోపాలజీ ల ను ఆధారంచేసుకునే రాశారు. బొనిగల రామారావు గారు ”ఆది గురువు ఆచార్య చండాల“ ( 2005) పేరుతో చండాలునితో ఆది శంకరాచార్యుల తాత్త్విక సంభాషణను గమనిస్తేపాఠకులకు ఆ చండాలుడు ‘మాదిగ’ అనే స్పృహే కలుగుతుంది.
డా.ఎండ్లూరిసుధాకర్”మల్లె మొగ్గల గొడుగు మాదిగ కతలు” (1999) లో పురాణాల్లోమాదిగల జీవితానికి సంబంధించిన రెండు కథలు ఉన్నాయి. త్రిమూర్తులుజాంబవమునిని తక్కువ కులంగా పరిగణించటంలో గల నేపథ్యాన్ని ‘జాంబమంతుడూ -పిచ్చి మామా’ (పు:17-20 ) కథలో రాశారు. “ఆరంజోతి” (పుట :113-116) లోఅరుంథతిని బ్రాహ్మణులు తక్కువ కులంగా భావించి కుట్ర చేసి చంపేసినట్లుతెలుస్తుంది. తమ తప్పును సరిదిద్దుకోవడానికి బ్రాహ్మణులు మాదిగ కూడలిలోకివచ్చి, ఇంటి సూరిని ఇరుసుకొని దాన్ని పెళ్ళి సందర్భంగా జరిగే అగ్నిలోవేస్తారు. ఈ ఆచారం వెనుక అరుంథతి కథ ఉందని రచయిత భావన.హిందువులు తమవివాహానంతరం అరుంథతీ నక్షత్రాన్ని వధూవరుల చేత దర్శింపచేయటం, అరుంథతీదేవిపట్ల చూపే పవిత్ర భావనే అనీ ఇంకా చాలా మంది తమ కథల్లో వివరించారు.పురాణాల్లో ఉండే కథలు కల్పనలు. అవి మానవ సమాజ అసమానతలకు వర్ణవ్యవస్థపెరగాటానికి వర్గ ప్రయోజనం పొందటానికి ఉపయోగ పడుతుందనీ, కిందివర్గాల, వర్ణాల వాళ్ళకు పురాణాలు శాపాల వంటివి అనీ హేతువాదులు భావిస్తారు. అలాపురాణాలను విమర్శించిన వాళ్ళలో నార్ల వెంకటేశ్వరరావు గారు ప్రముఖుడు.అలాగే బి. విజయ భారతి గారు “పురాణాలు - కుల వ్యవస్థ” (2001,2003 హైదరాబాదుబుక్ ట్రస్ట్) పేరుతో కొన్ని పుస్తకాలు రాశారు. పురాణ కథలనుపరిశోధించినపుడు అష్టాదశ పురాణాలను నమ్మితే జాంబపురాణాన్నీ నమ్మాలని, అప్పుడు మాదిగలు అందరికంటే ముందు పుట్టిన వాళ్ళు అవుతారనీ, అంతేకాకుండాగౌరవనీయులైన వాళ్ళేనని దృక్పథంతో మాదిగ పురాణ సాహిత్య రచన కొనసాగింది. ఇలాకొన్ని పురాణాంతర్గత కథలను తీసుకొని మాదిగల గురించి వివరించే సాహిత్యంకూడా మాదిగల జీవితాన్ని కొంతవరకు ప్రతి ఫలిస్తుంది.
1.3 ప్రాచీన తెలుగు సాహిత్యం - మాదిగ జీవితం :
ప్రాచీనతెలుగు సాహిత్యంలో మాదిగల గురించి ప్రస్తావించినా, శూద్రులు , చండాలురుమొదలైన పేర్ల తోనే కనిపిస్తుంది. శివకవుల్లో పాల్కురికి సోమనాథుడు (12 వశతాబ్ది) మాదిగ భక్తుడు “బోగయ్యగారి కథ” ను రాశారు. శ్రీకృష్టదేవరాయులు (16వ శతాబ్ది ) రాసిన ‘మాలదాసరికథ’లో‘మాల’ అని పేర్కొన్నంత మాత్రం చేతఇప్పుడు వ్యవహారంలో ఉన్న ‘మాల’ అనే అర్థలో కాకుండా, చండాలుడు అనేఅర్థంలోనే ప్రయోగించారు. వేమన (17వశతాబ్ది) మాదిగల గురించిచెపుతూ, ఆరుంథతిని పొగిడినా చాలా చోట్ల దళితుల పట్ల సదభిప్రాయం లేనట్లుకొన్ని పద్యాలు కనిపిస్తున్నాయి. అయితే వేమన చెప్పినట్లుగా చాలా పద్యాలుప్రచారంలో ఉన్నాయి. అందువల్ల అభ్యుదయభావాలను ఎన్నింటినో చేప్పిన కవిఅమాంతంగా ఆ వర్గాల వారినే నిరసిస్తూ పద్యాలు చెప్పాడని అనుకోవటాన్నిఅనుమానించక తప్పదు.
తరువాత గురజాడ అప్పారావు గారు (19 వ శతాబ్ది) మాల -మాదిగల గురించి లవణరాజు కల కథలో ‘మంచి యన్నది మాలయైతేనే మాలనే అగుదున్'అన్నాడు. ఇక్కడ మాల అన్నది నేడు వ్యవహారంలో ఉన్న మాల కాదు. అస్పృశ్యుడుఅని మాత్రమే అర్థం చేసుకోవాలి.“తెలుగుసాహిత్య” పరంగా చూస్తే మహా భారతం (11 వ శతాబ్ది)నుండి 19 వ శతాబ్ది దాకావర్ణ వ్యవస్థను కాపాడే దృష్టితోనే సాహిత్య కృషి కొనసాగుతుంది. అయితే, మార్గ మధ్యంలో వీరశైవులు, బ్రహ్మ నాయుడు, వేమన మొదలగువారు వర్ణ వ్యవస్థనువ్యతిరేకించినా, సాహిత్యం మీద వీరి ప్రభావం పడలేదు ( డా. బన్నఅయిలయ్య - తెలుగు కవిత అభినవ దృక్పథం : 2001 - 17) అనేది విమర్శకులఅభిప్రాయం. అంతేగాకుండా పదహారో శతాబ్దంలో మాల దాసరి కథ రాసినా అతడు పూర్వజన్మలో బ్రాహ్మణుడే. కనుకనే విమర్శకులు“భక్తిభావముతో పరిశీలిస్తే మాలదాసరిని కవి (శ్రీకృష్ణ దేవరాయలు) ఉన్నతుడిగాచిత్రీకరించినట్లు కనిపించినా, వర్ణవ్యవస్థ దృష్ట్యా ఆలోచిస్తే హీనుడిగానేచిత్రణ జరిగింది. ఒక నిమ్న వర్ణస్థుని భక్తితత్పరత ఉన్నత వర్ణస్థుడిశాపవిముక్తికి అవసరమైంది. కానీ, ఆ భక్తి ఆలయ ప్రవేశానికి పనికి రాలేదు.దీనికి కారణం వర్ణ వివక్షయే ” (అదే : పు : 21) అని అన్నారు.పాల్కురికి సోమనాథుడు బసవ పురాణంలో చెప్పిన కథ ఇది. “బోగయ్య గారి కథలోశివుడు మారువేషంలో “బోగయ్య గారి” ఇంటికి వస్తాడు. చచ్చిన దూడను వండిపెట్టమంటాడు. దాసయ్య గారింటికి వెళ్ళి వండి పెట్టమన్నానని శివుడు, భక్తుడైన బోగయ్య గారితో చెప్తాడు (బసవ పురాణం - ఏడో ఆశ్వాసం - బోగయ్య గారికథ : పు : 268) ఆ మాంసాన్ని బోగయ్య వండుతాడు. ఆ విషయం బ్రాహ్మణులకుతెలుస్తుంది. మూకుమ్మడిగా అతడి పై దాడి చేస్తారు. “మాదిగ కొయ్యను పోనియ్యొద్దు. అగ్రహారం వీడి మూలంగా చండాలమైపోయింది ” (పు : 269 ) అని నిందిస్తారు. దానితో బోగయ్య “మీ అగ్రహారంలో వృత్తులకోసం మేఅంగలార్చామా? అంటూ” ఊరు వదిలి వెళ్ళిపోతాడు. ఊరంతా అల్లకల్లోలమైపోతుంది.దానితో మళ్ళీ బ్రాహ్మణులు బోగయ్యగారిని గౌరవిస్తారు (పు:269). శివభక్తులకు కులం లేదని బోగయ్యగారి కథని బిజ్జలుడికి బసవేశ్వరుడువినిపించాడని బసవపురాణంలో పాల్కురికి సోమనాథుడు స్పష్టంచేశాడు. ఈయనే రాసిన ‘పండితారాధ్య చరిత్ర’లో కూడా ‘సూరసాని కథలో మాదిగ ప్రస్తావన వస్తుంది.
మంగిపూడి వేంకటశర్మ(20 వ శతాబ్దం) “నిరుద్ధ భారతం” పద్య కావ్యంలో మాతంగమహాముని వంశం వాళ్ళే మాదిగలని చెప్పారు. తెలుగు పద్య కవిత్వంలో తొలిసారిగామాదిగల గురించి చైతన్యవంతంగా వర్ణించిన కవి జాషువా (20 వ శతాబ్దం). ఆయనేస్వయంగా తాను మాదిగ కులానికి చెందిన వాడినని చెప్పుకున్నాడు. కానీ,తనకవిత్వంలో హరిజనులు అనే ఎక్కువగా ప్రయోగించారు. గాంధీ ప్రభావంతో అస్పృశ్యతనిర్మూలన కావాలన్నారు. ఆయన రాసిన “గబ్బిలం” గొప్ప దళిత ఆర్తిని తెలిపేకావ్యం.
1.4. ఆధునిక తెలుగుకవిత్వం - మాదిగ కవిత్వం :
తెలుగు కవిత్వంలో దళిత కవిత్వానికి ఒక ప్రత్యేకత ఉంది. అందులోనూ సమకాలీనసామాజిక ఉద్యమాలను పట్టించుకున్న కవిత్వంగా మాదిగకవిత్వాన్నిచెప్పుకొవచ్చు. దండోరా ఉద్యమం ప్రారంభమైన తరువాత మాదిగలు కూడాతమకు చెందవలసిన హక్కులు తమకు చెందాలని మాదిగ కవిత్వాన్ని రాశారు. వారిలోఎండ్లూరి సుధాకర్ ప్రథమవరుసలోనిలుస్తున్నారు. ఆయన వర్గీకరణీయం(2003), కొత్త గబ్బిలం (1998), నల్ల ద్రాక్ష పందిరి (Darky- 2002) అనే రెండు దీర్ఘకావ్యాలను రాసి ఎస్.సి వర్గీకరణ సమస్యను బలంగా అభివ్యక్తీకరించారు. “మాదిగసాహిత్య వేదిక” ప్రచురించిన “మాదిగచైతన్యం” (1997) కవితా సంకలనాన్నిమాదిగలగురించి మాదిగలే రాసిన మొట్టమొదటి మాదిగ కవితా సంకలనంగా దీన్నిచెప్పుకోవచ్చు. దీనిలో మాదిగలే తమ సమస్యను వివరిస్తూ కవితలు, పాటలురాశారు.ఇందులోఎండ్లూరి సుధాకర్ (దాసును చూడాలి),కొలుకులూరిఇనాక్(చెప్పులకునమస్కరిస్తున్నాను), నాగప్పగారి సుందర్రాజు (మాదిగోడు) దార్లవెంకటేశ్వరరావు (మాదిగ మేనిఫెస్టో),కత్తి కళ్యాణ్ చంద్ర (ఉనికి) వంటిప్రముఖ మాదిగ కవుల రచనలు ఉన్నాయి.ఈ కవితా సంకలనంలో సుమారు 26 కవితలున్నాయి. ఎమ్. జాన్‌సన్ (మాదిగ చైతన్యం), రావినూతుల ప్రేమ్ కిషోర్ (దండోరా),విజయరత్నం (మాదిగ మహత్తు), ఆనంద్ (ఎల్లమ్మ జాతర),కాశి మాదిగ (రోడ్డు మీద దండోరా), తుడి మహేందర్ (మాదిగ జీవితం),కొల్లూరి చిరంజీవి(నేను మాదిగోన్ని), చిత్రం ప్రసాద్ (చాటింపు),ఆశావాది శశాంకమౌళి (పెద్దింటోళ్ళ శ్వేత పత్రం),వేమల ఎల్లయ్య (కత్తె ఆరిని పదునుపెడుతున్నాం),కొలుకులూరి శ్రీనివాస్ రావు (తెరదించుతాం),రాజలింగం (ఓమాదిగా ఉద్యమించు),తాళ్ళూరి భానుప్రతాప్ (ఆహ్వానించు), మష్టార్జీ (ఎవరనుకున్నారు) మొదలయిన కవితలను మాదిగ చైతన్యం (1997) కవితా సంకలనంలోచూడవచ్చు.
నాగప్పగారి సుందర్రాజు చండాల చాటింపు” (1996) పేరుతోఒక కవితా సంపుటిని ప్రచురించారు. గ్యార యాదయ్య “గూటం దెబ్బ”, “ఎర్కోషి”కవితా సంపుటిలలో మాదిగ సంస్కృతిని వర్ణించారు. రావినూతల ప్రేమ్ కిషోర్ (గుండె దరువు- 2000) అనే దీర్ఘ కావ్యాన్ని రాశాడు. ఇంకా మల్లవరపుప్రభాకరరావు, జూపాక సుభద్ర, గోగుశ్యామల, గౌరి, కదిరికృష్ణ, ఓబిలేసు, ఆంజనేయుడు, ఐనాల సైదులు, మణీందర్ ఇలా చాలా మంది మాదిగకవిత్వాన్నిరాస్తున్నారు.
ఇలా రాస్తున మాదిగ కవిత్వాన్ని విమర్శకులుఆహ్వానించారు. “మాదిగ కవులు రాసిన ప్రత్యేక కవిత్వం దళిత కవిత్వానికిసరికొత్త ట్రెండ్ అయి దాన్నింకా బలోపేతం చేయబోతోంది”అని ప్రముఖవిమర్శకుడు జి.లక్ష్మీనరసయ్య (1995 - 65) వ్యాఖ్యానించారు.
మాదిగ కవిత్వంలో కనిపించే ధోరణులను కింది విధంగా విశ్లేషించవచ్చు.
• కులాన్ని ఆధారంగా చేసుకొని చూపే వివక్షను స్పష్టంగా ఖండిస్తూ మాదిగ కవిత్వం వస్తుంది.
• దళితులలో సమైక్యత పేరుతో జరుగుతున్న మోసాన్ని బయట పెట్టే ప్రయత్నం చేసిందిమాదిగ కవిత్వం.
• తమకు రావలిసిన హక్కులను హరించి వేస్తున్న వారిని నిరసిస్తూనే తమ హక్కులనుకాపాడుకోవాలనే స్వరం మాదిగ కవిత్వంలో ప్రధానంగా కనిపిస్తుంది.
• తమ చరిత్ర సంస్కృతులలో గల ప్రత్యేకతను మాదిగ కవిత్వం వర్ణించగలుగుతుంది.
•నిజమైన అంబేడ్కరిజాన్ని మాదిగ కవిత్వం వివరించగలుగుతుంది.
• దళితులకు అందరికీ (అన్ని ఉపకులాల) సమాన హక్కులు లభించాలనేదే మాదిగ కవిత్వం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది.
• దళితులను విభజించడానికి లేదా చీలిపోవడానికి వారిలో శత్రు వైరుధ్యాన్నిపెంచడానికి కాకుండా చారిత్రక వాస్తవాన్ని వివరిస్తూ ఈ దళితులలోని అన్నిఉపకులాలకు ఉండే అస్పృశ్యత లేదా అంటరానితనం అనే వివక్ష అందరికీ ఉందని అయినాఆ వివక్ష దళితుల్లోని కొన్నిఉపకులాల వారు మరింతగా అనుభవిస్తునారని మాదిగకవిత్వం స్పష్టం చేసింది.
• మాదిగ కవిత్వం వచ్చిన తరువాత వివిధ అణగారినకులాల వారు కూడా తమ ప్రత్యేక సమస్యలను వర్ణిస్తూ కవిత్వం రాశారు.
గిరిజనులు, బి.సి లు మాదిగ కవిత్వ ప్రేరణతో తమ ప్రత్యేక సంస్యలనువర్ణించటం జరుగుతుంది. ఆ విధంగా అణిచివేతకు గురి కాబడుతున్న అన్ని కులాలవారిని చైతన్యం చేయడంలో మాదిగ కవిత్వం చెప్పుకోదగిన పాత్ర వహిస్తుంది. • మాదిగ కవిత్వంలో వృత్తి పట్ల గౌరవం పెంచుతూ తమ సాంస్కృతిక ఔన్నత్యాన్నికాపాడుకుంటూ ఆ పారిభాషిక పదాలను సాహిత్యానికి పరిచయం చేసింది. ఆ విధంగాతెలుగు భాషకు కొత్త పదాలను పరిచయం చేసినట్లయింది.
ఈ విధంగా దళిత కవిత్వంగా భావింపబడుతూనే తమ ప్రత్యేక వైవిధ్యాన్ని మాదిగ కవిత్వం ప్రదర్శించింది.
మాదిగ కవిత్వాన్ని రాస్తున్న వారిలో జూపాక సుభద్ర, శ్యామల, జాజుల గౌరి లుతెలంగాణ మాదిగ జీవితాల్లోని కొత్త కోణాలను రసభరితంగా ఆవిష్కరిస్తున్నారు.తెలంగాణా పలుకుబడి మాదిగ ఉపకులాల మనోభావాలు వీరి కవిత్వంలో చక్కగావర్ణితమవుతున్నాయి. మాదిగ కవిత్వాన్ని వ్యతిరేకిస్తూ దళిత సమైక్యతపేరుతో మాలలు కవిత్వాన్ని రాస్తున్నారు. వారిలో సతీష్ చంద్ర, పైడి తెరేష్‌బాబు, గూటం స్వామి తదితరులను ప్రముఖంగా చెప్పుకోవచ్చు.
అగ్ర వర్ణాలనువాళ్ళు చేస్తున్న ప్రతి పనినీ దళిత కవులు ఖండిస్తూ కవిత్వం రాసేవారు.అలాంటి వివిధ రచనలను చేసిన చాలా మంది దళిత కవులు మాదిగ దండోరా ఉద్యమంతరువాత తమ దళితకవిత్వ దృక్పథాన్ని దారి మళ్ళించి అనుభవ కవిత్వాన్నిరాసుకుంటున్నారు. అదికూడా భావకవితాధోరణితో కవిత్వాన్ని రాసుకుంటున్నారు.శిఖామణి, కత్తి పద్మారావు వంటి ప్రముఖ కవులు సుమారు దశాబ్ద కాలంగా ఎస్.సివర్గీకరణ కోసం జరుగుతున్న ఉద్యమం గురించి స్పందిస్తూ ఒక వాక్యం కూడారాసినట్లు కనబడదు. సమాజంలో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా కవులుదళితుల్లోని అంతర్విభేదాల గురించి ఒక కవిత కూడా రాయకపోవడం దళిత కవిత్వంలోమాదిగల పట్ల జరుగుతున్న వివక్షతకు నిదర్శనంగా నిలుస్తుందని చాలామందివిమర్శకులు వ్యాఖ్యానించడం కనిపిస్తుంది. అందుకనే మాదిగలు తమఅస్తిత్వాన్ని నిరూపించుకోవటం కోసం కలం పట్టారని మాదిగ చైతన్యంకవితాసంకలనం ముందుమాటల్లో కనబడుతుంది. మాదిగ కవులు తమజీవితాలనుప్రతిబింబిస్తూ ఆణిముత్యాల్లాంటి కవితలను రాస్తున్నారు. మాదిగలుదళితుల్లోని ఉపకులాలందరినీ చైతన్య పరుస్తున్నారు.
1.5. కథా సాహిత్యం - మాదిగ జీవితం :
తెలుగుకథాసాహిత్యంలోమాదిగల గురించి ప్రస్తావిస్తూ మొట్ట మొదటి సారిగా శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు ” పుల్లంరాజు” కథను రాశారు. ఆ తరువాత ఆయనే “సాగర సంగమం” (1931) ; “మాదిగ పల్లె” ; “ఇలాంటి తవ్వాయి వస్తే” (1934) కథలను రాశారు.వీటిలో మాల – మాదిగల ప్రస్తావన ఉంది. వారిమధ్య అనైక్యత, సాంస్కృతికవ్యత్యాసాలను ఈ కథలలో వర్ణించారు. ఈ అనైక్యతను ఆసరా చేసుకుని అగ్రవర్ణాలుచెలాయిస్తున్న ఆధిపత్యాన్న్ని వివరించారు. గోపీచంద్ గారు ”చెప్పులుకుట్టేవాడు“(1961) కథలో రోడ్డు పక్కనకూర్చుని చెప్పులు కుట్టుకునే మాదిగజీవితాలను వర్ణించారు. ఆ దుమ్మూ, ధూళీ వల్ల ఊపిరి తిత్తులు పాడై చెప్పులుకుట్టే వారు ఎలా చనిపోతున్నారో వర్ణించారు.
1969లో ఆచార్య కొలకలూరిఇనాక్ గారు “ఉరబావి”అనే పెద్ద కథను రాశారు. మాల – మాదిగల మంచినీళ్లసమస్యను వర్ణించిన కథ. అగ్ర వర్ణాల వారి దౌర్జన్యాలను ఒక మాదిగ స్త్రీ ఎలాఎదుర్కొందో చెప్పిన కథ . అగ్రవర్ణాల వారి పీడనను అగ్రవర్ణ చాణక్య నీతితోనేసమధానం చెప్పిన కథ. వ్యవస్థ కోసం వ్యక్తి చేసిన సాహసం దీనిలోకనిపిస్తుంది. జి.భానుగారు ‘’ పాపానికి జీతం” కథ (1969) లో అగ్ర వర్ణభూస్వామి మాదిగ స్త్రీని బలాత్కరించబోయి, ఆమె తిరగ బడటంతో చంపేసి, ఎవరికీతెలియకుండా తిరిగినా, తాను చేసిన పాపం వల్ల కాలు పుండు పడి అతడుచనిపోయినట్లు చిత్రించారు. ఇది కర్మ సిద్ధాంతాన్ని బోధించే కథ . స్వామి ” తల్లి మట్టి “(1991) కథలో మాదిగ ఉపాధ్యాయుడు కులం చెప్పుకోడానికిచదువుకున్న మాదిగలు కూడా ఆత్మ న్యూనతకు గురవుతున్నారని తెలిపిన కథ. దీన్నిమాదిగ జీవితాల పై మరింత అవగాహనతో రాస్తే బాగుండేది. శాంతి నారాయణ గారి“జీవనాడులు”(1991) కథలో మాదిగల ఇండ్లలో జరిగే పెండ్లికి ఎవరెవరు వస్తారనేవిషయాలు వర్ణించారు. మాదిగ ఇండ్లలో పెండ్లి జరిగితే తమతో పాటు వీరణంవాయించే మంగలి వాళ్ళు కూడా రారనీ చెప్పిన కథ. కాలువ మల్లయ్య గారి “అగ్నిగుండం” ( 1991) కథలో మాదిగలు డప్పు కొడుతూ సమాజానికి సహకరిస్తున్నా, ఆమాదిగలకు గౌరవం లేదనీ, కనుక ఆ పరిస్థితి తన కొడుక్కి రాకూడదని భావించియూనివర్సిటిలకు పంపిస్తే అక్కడ జరిగే గొడవల్లో అతడిని ఇరికించి అరెస్టుచేస్తున్న అగ్రవర్ణాల వారి అధికారాన్ని, కుట్రలను వివరించారు. పరిశ్రమలవల్ల చర్మకార వృత్తి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుందో, దానికి ప్రభుత్వంఎలాంటి చర్యలను తీసుకుంటుందో బోయ జంగయ్య గారి “ఇదికతా!” లో చూడవచ్చు.శాంతినారాయణ గారి ” ఉక్కుపాదం” కథలో మాదిగ వ్యక్తి మంత్రి అయినా, అధికారాన్ని అగ్రవర్ణాలవాళ్ళే ఎలా ఉపయోగించు కుంటారో, ఎదురు తిరిగితేఎలాంటి అవమానాలను ఎదుర్కోవలసి వస్తుందో వివరించ గలిగింది.ఆర్థిక శక్తిలేని అధికారం కేవలం నామ మాత్రమేనని, సాంఘిక సమానత్వం రానిదే కేవలంరిజర్వేషన్లు ఉన్నా అవి మాదిగలు అనుభవించలేని స్థితే ఉంటుందని నిరూపించినకథ. ఎస్.సి వర్గీకరణ నేపథ్యంలో చాలా మంది రచయితలు మాల - మాదిగల మధ్యవైరుధ్యాలని వర్ణించే కథలు రాశారు. తోలేటి జగన్మోహనరావు “వర్ణక్రమాలు”;పైడి తెరేష్‌బాబు “అనుబంధ ప్రశ్న” ( 1996 ) సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి“అంటు”;మద్దూరి నగేష్ బాబు “దోమతెర” కథలలో మాల - మాదిగల వర్గీకరణ సమస్యకనిపిస్తుంది.
ఆచార్య కొలకలూరి ఇనాక్ అంబేడ్కర్ దృక్పథంతోమాదిగ కథలను రాశారు. ఈయన రాసిన కథల్లో మాదిగ జీవితం అనేక కోణాల్లోప్రతిఫలిస్తుంది. వాటిలో తప్పనిసరిగా ప్రస్తావించుకోవలసిన కథల్లోఊరబావి,తాకట్టు, గొడ్లదొంగ , పొట్ట పేగులిబ్బందిగోడు, కులవృత్తిముఖ్యమైనవి. ఊరబావి గురించి పైన వివరించటం జరిగింది. ఇక తాకట్టు కథ లోబ్రాహ్మణ- మాదిగ అధ్యాపకుల మధ్య నిజమైన మానవ సంబంధాలను జంధ్యం అప్పుగాతాకట్టు పెట్టమనటం ద్వారా నిరూపించే ప్రయత్నం చేశారు. గొడ్లదొంగ కథలోఊళ్ళో దొంగ తనానికి గురవుతున్న పశువుల గురించి ప్రజలకు ఆ ఊళ్ళో మాంసంఅమ్ముకుని జీవించే నాగడు మీద అనుమానం వస్తుంది. దానితో నాగడే ఒక రాత్రంతానిద్రపోకుండా కనిపెడతాడు. ఆ ఊరి దొరే పశువుల్ని దొంగతనానికి పాల్పడటాన్నినాగడు గుర్తిస్తాడు. ఆ దొరని ఊరి ప్రజలందరికి పట్టించినా, వదిలేస్తారనిభావించి, అతడిని చంపేసి, ఎద్దు పొట్టలో పెట్టి కుట్టేసి కాలవలో పడేస్తాడు.నాటినుండీ ఆ దొరా కనిపించడు, గొడ్ల దొంగతనాలు ఆగిపోతాయి. మాదిగ లను దొరలేదొంగలుగా ముద్ర వేసే ఒక వాస్తవాన్ని చిత్రించే ప్రయత్నంచేసిన కథ. మాదిగలఅమాయక తనాన్ని ఆసరా చేసుకుని వాళ్ళభూమిని లాగేసుకున్న దొరను, ఒకమాదిగయువకుడు పేగులు చీల్చేసి చంపిన కథ పొట్ట పేగులిబ్బందిగోడు. అన్నివృత్తులకూ, ఆ వృత్తి చేసేవారికీ గౌరవం కలిగినట్లే మాదిగలు చేసేకులవృత్తికీ గౌరవం కలగాలని వాదించే కథ “కులవృత్తి“(2006). మాదిగలజీవితాలకు సంబంధించిన అనేక కోణాలను వర్ణిస్తూ కథలు రాసిన వారిలో ఆచార్యకొలకలూరి ఇనాక్, డా.ఎండ్లూరి సుధాకర్ గార్లు ప్రథమ వరుసలో నిలుస్తారు. డా.ఎండ్లూరిసుధాకర్ గారు మాదిగ జీవితానికీ, వారి వృత్తికీ ఆత్మ గౌరవాన్నికలిగించేటట్లుగా ‘మల్లెమొగ్గల గొడుగు మాదిగ కతలు ‘(1999) రాశారు. ఈకథల్లో పురాణాల్నుండి నేటి వరకు మాదిగ జీవితాల్లోని సంఘర్షణలను సమస్యలనుచిత్రించారు. మాదిగ వృత్తి పనితనంలోని గొప్పతనాన్ని, భాషని, సంస్కృతినివర్ణించారు. చెప్పులు మాదిగలకు దేవతలని ప్రకటిస్తారు రచయిత. చెప్పులుకుట్టి నవాబులని మెప్పించి సన్మానాలని పొందారని చర్మకార వృత్తిలోమాదిగలుచూపే ప్రతిభా పాటవాలను వివరించారు.
క్రైస్తవ మతం తొలిరోజుల్లో మాదిగలనుదగ్గరకు తీసినా తర్వాత కాలంలో క్రైస్తవంలోనూ కులం, దోపిడీ బయలుదేరిందనిఅంబేడ్కరిజంతోనే మాదిగల విముక్తి సాధ్యమని వివరించే కథలు దీనిలో చాలాఉన్నాయి. ప్రముఖ విమర్శకుడు జి. లక్ష్మీనరసయ్య ఈ కథలను వ్యాఖ్యానిస్తూడా.ఎండ్లూరి సుధాకర్‌గారిని ' మాదిగ గోర్కీ' అని (ముందుమాట : 1999 - 12) అభివర్ణించారు. నాగప్పగారి సుందర్రాజు “మాదిగోడు” (1997 )పేరుతో కొన్నికథలను రాశారు. మాదిగల సంస్కృతిని అర్థం చేసుకోవడానికి, ఆత్మ గౌరవాన్నిగమనిచడానికీ ఈ కథలు ఎంతగానో దోహదపడతాయి. డా.ఎండ్లూరి సుధాకర్, నాగప్పగారిసుందర్రాజు గారలు రాసిన మాదిగ కథలు తెలుగు సాహిత్యంలో ఆత్మకథా ప్రక్రియనుప్రవేశపెట్టాయని విమర్శకులన్నారు (గుడిపాటి, ఇతివృత్తం:2002-12).
మొత్తంమీద వస్తు వైవిధ్యంతో అనేక మంది రచయితలు మాదిగ జీవితాలను వర్ణిస్తూ కథలురాశారు. మాదిగేతర రచయితలు రాసిన కథలలో అస్పృశ్యత, దేవాలయ ప్రవేశం, కులాంతరవివాహాలు వంటి సమస్యలు చిత్రితమైనా సానుభూతినుండి రూపొందినవే తప్ప, మాదిగజీవిత సంఘర్షణ పెద్దగా కనపడదు.మాదిగలు చదువుకున్నప్పటికీ, రిజర్వేషనుతోఉద్యోగాలు పొంది కూడా కులాన్నిచెప్పుకోలేకపోతున్నారనే దృక్పథంతో అగ్రవర్ణరచయితలు కథలను రాశారు. అగ్రవర్ణ రచయితల కథల్లో అవకాశాల కోసం మాదిగలుమతాన్ని మార్చుకుంటున్నారనే ఆలోచనను కలిస్తాయి. కానీ, మాదిగ రచయితలు రాసినకథల్లో జీవిత లోతులు, చక్కని పరిష్కారాలు, ప్రతిపనిలోనూ ఉండే కార్యకారణసంబంధాన్ని సహేతుకంగా వర్ణించగలిగారు.
మాదిగ సంస్కృతి, ఆత్మ గౌరవంవ్యక్తమయ్యింది. అలాంటి వారిలో ఆచార్య కొలకలూరి ఇనాక్ , బోయ జంగయ్య, డా.ఎండ్లూరి సుధాకర్, నాగప్పగారి సుందర్ రాజు, గోగుశ్యామల, జూపాక సుభద్ర, జె. గౌరి తదితరులను చెప్పుకోవచ్చు. జూపాక సుభద్ర, గోగు శ్యామల గార్లసంపాదకత్వంలో వచ్చిన “నల్లరేగడి సాల్లు” (2006) కథల్లో మాదిగ సంస్కృతిలోకొత్త కోణాలు కనిపిస్తాయి. దీనిలో మాదిగ ఉప కులాల స్త్రీల జీవితాలనుకేంద్రంగా చేసుకొని వెలువడిన కథలు చాలా ఉన్నాయి.
1.6. నవలా సాహిత్యం : మాదిగ జీవితం :
తెలుగులోసాంఘిక నవలగా భావించబడుతున్న కందుకూరి వీరేశలింగం గారి ‘రాజశేఖర చరిత్రము (1878 )’ లో కథా నాయకుడు అస్పృశ్యుడు ఇచ్చిన నీళ్ళు తాగడానికి ఇష్టపడడు.కానీ, నరహరి గోపాలకృష్టమ శెట్టి రాసిన ‘సోనాబాయీ పరిణయం’పేరుగల ‘ శ్రీరంగ రాజ చరిత్రము’ (1872) లో ఒక గిరిజన కుటుంబం లో పెరిగన క్షత్రియ యువతికథ కనిపిస్తుంది. తొలిసారిగా మాల - మాదిగల సమస్యలను సానుభూతితో వర్ణించిననవల తల్లాప్రగడ సూర్యనారాయణగారి హేలావతి (1910). ఆ తర్వాత మాల - మాదిగలగురించి రాసిన నవలలు చాలా వచ్చాయి. వాటిలో వేంకట పార్వతీశ్వర కవుల'మాతృమందిరం ( 1918 ); ఉన్నవ లక్ష్మీ నారాయణ ' మాలపల్లి ( 1921 - 22 ) వేలూరిశివరామ శాస్త్రి ' ఓబయ్య (1920); రంగనాయకమ్మ 'బలిపీఠం (1962) ముఖ్యమైనవి.ఇంకా నైమిశారణ్యం, రథచక్రాలు, కొ్ల్లాయిగట్టితేనేమి, ఓనమాలుమొదలైననవలల్లోనూ మాల - మాదిగల పట్ల సానుభూతి కనిపిస్తుంది. అక్కినేని కుటుంబరావుసొరాజ్జెం (1981 ); ఓల్గా ఆకాశంలో సగం ( 1990); నవలలో మార్క్సిస్ట్దృక్పథంతో కూడిన మాల - మాదిగల జీవితం కనిపిస్తుంది.
తెలంగాణా ప్రాంతంలో అగ్రవర్ణ భూస్వాములుమాదిగల్ని పెట్టే కష్టాల గురించి వేముల ఎల్లయ్య “కక్క” నవలలో చిత్రించారు.భాష, సంస్కృతి, ఆచార వ్యవహారాలు ఈ నవలలో బాగా కనిపిస్తాయి. చిలుకూరిదేవపుత్ర “పంచమం” నవలలో కథా నాయకుడు శివయ్య మాదిగకులానికి చెందిన వాడు.తండ్రి డప్పు కొట్టే వెట్టివాడు. శివయ్య మాత్రం అగ్ర వర్ణానికే చెందినఒకతని ప్రోత్సాహంతో బాగా చదువుకొని జిల్లా ఉన్నతాధికారి అవుతాడు. గ్రామపెత్తందారులు మంత్రులవుతారు. రెవెన్యూ శాఖలో ఉన్నతోద్యోగం చేస్తున్నశివయ్య చేతనే భూసంస్కరణలు అమలు కాకుండా చూడాలనుకుంటారు. వారికి శివయ్యసహకరించక పోవటంతో లంచం తీసుకున్నట్లుగా కుట్ర పన్ని అతడ్ని సస్పెండ్చేయిస్తారు. అప్పటికే ఒక మాదిగ వ్యక్తి ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్నాసస్పెండ్ అయిన శివయ్యను రక్షించలేని స్థితి . సామాజిక చైతన్యం లేనిఉన్నతోద్యోగాలు, రిజర్వేషన్‌తో వచ్చిన రాజకీయ పదవులు మాదిగలనుబాగుచేయలేవని నిరూపించిన నవల ఇది. దీనిలో సుమారు యాబై సంవత్సరాల దళితజీవితం సామాజిక వాస్తవికత వర్ణింపబడింది. మాల - మాదిగల రిజర్వేషన్లవర్గీకరణ సమస్యను కూడా ఈ నవల చిత్రించింది.
1.7. నాటక సాహిత్యం - మాదిగ జీవితం :
కోరాడరామచంద్ర శాస్త్రి గారు రచించిన “మంజరీ మధుకరీయం” ( 1860 ) రూపకాన్ని తొలితెలుగు నాటకంగా పరిశోధకులు చెప్తున్నారు (పి.ఎస్.ఆర్. అప్పారావు: 1967-1). దశరూపకాల్లో నాటకం, నాటిక వంటివాటిని ప్రత్యేకంగా పేర్కొన్నా, వ్యవహారంలోమాత్రం నాటకాలు అనే అంటున్నారు. ‘హరిజనాభ్యుదయం - తెలుగు నాటకం’ (1994) పేరుతో డా.వి. పోతన్న చేసిన పరిశోధనలో మాదిగల గురించి చిత్రించిననాటకాలను, నాటికలను వివరించారు. మాల - మాదిగలను ఈ పరిశోధనలో ‘హరిజనులు’ అనే పారిభాషిక పదంతోనే పేర్కొన్నారు.”హరిజనులుఅంటే మాదిగలు మాత్రమే, మాలలు కాదనే ఒక అభిప్రాయం కూడా మాలల్లో ఉంది” అని పోతన్న (1994 : 240 ) చెప్పినా, మాల - మాదిగలను ‘హరిజనులు’ గానే చాలా మంది పిలుస్తున్నారనిఆయనే (1994 : 54 ) స్పష్టం చేశారు. కనుక, మాదిగలను గుర్తించటంలో నాటకసాహితీవేత్తలు ప్రత్యేకతను చూపినవాళ్ళు చాలా కొద్దిమందే కనిపిస్తారు.అయినా, నాటకాల్లో మాదిగలను వారి సంస్కృతీ సంప్రదాయాల ఆధారం చేసుకొనిగుర్తించటం కష్టం కాదు.
మాదిగల ఆడపడుచుగా భావించే అరుంధతీదేవి, వసిష్ఠుడిని వివాహం చేసుకున్న ప్రేమ కథను డా. బోయి భీమన్న “రాగవాసిష్ఠం” (1959) అనేపేరుతో పౌరాణిక సాంఘిక నాటకంగా రాశారు. దీన్నిమాదిగ జీవితం చిత్రించిన తొలి తెలుగు నాటకంగా అభివర్ణించవచ్చు.అరుంధతీదేవి కులం తెలియగానే బ్రాహ్మణుడైన వసిష్ఠమహర్షి ఆమెను వివాహంచేసుకోవడానికి సందేహించటం, చివరకు ఆమె గొప్పతనాన్ని భక్తి తత్పరతలనుతెలుసుకుని వివాహం చేసుకోవటం దీనిలోని ఇతివృత్తం.
మాదిగ స్త్రీనిబలాత్కరించబోయిన అగ్రవర్ణ భూస్వామి కొడుకు పై తిరగబడినందుకు ఆమెనూ ఆ జాతివాళ్ళందరినీ అగ్రవర్ణ భూస్వాములు దారుణ కృత్యాలు చేయటాన్ని వర్ణించినసాంఘిక నాటకం “నీలి దీపాలు”.దీన్ని కె. చిరంజీవి గారు రాశారు. ఇంచుమించుఇలాంటి ఇతివృత్తమే కె.ఎస్.టి. సాయిగారు రచించిన “పరమపదం”నాటకంలోనూకనిపిస్తుంది. ఆచార్య కొలకలూరి ఇనాక్‌గారు “ముని వాహనుడు”నాటకంలోశ్రీరంగనాథ దేవాలయ ప్రవేశానికి ప్రయత్నించి విజయుడైన తిరుప్పాణ్ ఆళ్వార్కథ మాదిగ జీవితాన్ని స్ఫురించేటట్లుగా ఉంది. దేవాలయంలోకి ప్రవేశించటానికీ, పూజ చేసుకోవటానికీ దేవుడికి ఇబ్బంది లేకపోయినా అక్కడున్న పూజారి అభ్యంతరంపెట్టేవాడు. ఇదంతా మాదిగ జీవితాలకూ వర్తిస్తుంది. ఆచార్య కొలకలూరి ఇనాక్గారే రచించిన “నిర్భయం”నాటికలో కళాశాలలో చదువుకునే మాదిగ విద్యార్థికిసహవిద్యార్థుల నుండి ఎదురైన కులపరమైన అవమానాలను కళ్ళకు కట్టినట్టుగావర్ణించారు. ఆయన రాసిందే “త్యాగి”అనే నాటకం కూడా. దీనిలో కులం తెలియకముందు అన్యోన్యంగా బతికే మాదిగ - బ్రాహ్మణ దంపతులు కులం తెలిసిన తర్వాతపొందే సంఘర్షణను గొప్పగా చిత్రించారు. అవగాహన ఉంటే సహజీవనాన్ని కులం ఏమీచేయలేదని నిరూపించిన నాటకం ఇది. కులవృత్తినే నమ్ముకున్న తండ్రి దానినుండిబయటికి వచ్చి భూస్వామ్య దౌర్జన్యాలను అడ్డుకున్న మాదిగల జీవితాన్నివర్ణించిన నాటిక ఎం. కన్నబాబు రాసిన “రత్నగర్భలో నిత్య దరిద్రుడు”. బ్రాహ్మణ - మాదిగ వర్ణాల మధ్య జరిగిన ప్రేమా - పెళ్ళీ - కుల కట్టుబాట్లు, వాటి వల్ల వచ్చే సంఘర్షణలు, వాటిని ఎలా అధిగమించాలో తెలియజెప్పిన నాటకంమాగంటి పార్థసారథిగారు రచించిన “హరిజనోద్ధరణము”.తరతరాలుగా అక్షరాలకుదూరంగా ఉంచబడిన మాదిగలకు అక్షరాలు ఎలా నిషిద్ధమయ్యాయో పాటిబండ్లఆనందరావుగారి “నిషిద్ధాక్షరి”నాటకం తెలుపుతుంది. ఇలా తెలుగు నాటకాల్లోమాదిగల జీవితాల్లోని భిన్న కోణాలను ప్రతిపలింపజేస్తూ నాటకాలు వెలువడ్డాయి.
అస్పృశ్యత, ప్రేమ, కులాంతర వివాహాలు మాల - మాదిగల అనైక్యత సాంఘిక, ఆర్థిక, సాంస్కృతికవిషయాల్లో ఉండవలసిన చొరవను రచయితలు వర్ణించగలిగారు. మాదిగల చర్మకారవృత్తికి గౌరవం లభించనపుడు, అది వారి ఆర్థిక, జీవన పరిపుష్టికితోడ్పడనప్పుడు ప్రత్యామ్నాయ వృత్తులను ఎన్నుకోవాలని ప్రబోధించిన నాటకాలూఉన్నాయి. మొత్తం మీద నాటక సాహిత్యం మాదిగల జీవితాల్లోని అనేక కోణాలనుస్పర్శించగలిగింది. అయితే దళితులు రాసిన నాటకాల్లో మాదిగల మానసిక కోణంబాగా వ్యక్తమయింది. కానీ, దళితేతరులే మాదిగ జీవితాలను స్పర్శిస్తూ నాటకాలురాశారు.
1.8. ముగింపు :
తెలుగు లో వివిధ సాహిత్య ప్రక్రియల్లో మాదిగల గురించి ప్రస్తావనకనిపించింది. భిన్న పార్వ్సాలలో, భిన్న దృక్కోణాల్లో మాదిగల గురించిచర్చించారు. సంప్రదాయక , దళిత సాహిత్యాల్లో భాగంగానే చాలాకాలం మాదిగసాహిత్యం కొనసాగింది. మాల - మాదిగ తదితర కులాలన్నీ దళిత కులాలు గాపరిగణింపబడటం వల్ల , వీరందరినీ అస్పృశ్యులు , అంటరాని వాళ్ళు అని మాత్రమేసాహిత్యం లో పేర్కొనేవారని ఈ పరిశీలనలోతెలుస్తుంది. ఇటీవల ఎస్సీ వర్గీకరణతరువాత తప్పనిసరి పరిస్థితుల్లో మాదిగలు తమ సాహిత్యాన్ని ప్రత్యేకంగారాసుకుంటూ తన స్వీయ అస్తిత్వానికై ప్రయత్నిస్తున్నారు. దళితుల్లో అన్ని ఉపకులాల వారికీ కొన్ని సమాన లక్షణాలునప్పటికీ, మాదిగలకు కొన్ని సాంస్కృతికప్రత్యేకతలున్నాయని గుర్తించారు. ఏభై ఏళ్ళ భారత స్వాతంత్ర్యాననంతరందళితుల్లో చాలా మార్పులు వచ్చాయి. అయినా, అలాగే మాదిగలలోనూ ఈ మార్పులుచాలా వరకూ కనిపిస్తున్నాయి. వాటిని సాహిత్యీకరించే ప్రయత్నం మాదిగలు కూడాచేస్తున్నారు. ఆ విధంగా తమ ప్రత్యేక సంస్కృతినీ, సంప్రదాయాన్నిపదిలపరుచుకొంటున్నారు. తమ జీవన విధానాలను ప్రతిఫలిస్తున్నారు. తమ జీవితానుభవాలను, తమ సంస్కృతి గొప్పదనాన్ని కనీస మాత్రంగా కూడా గౌరవించని సంప్రదాయసాహిత్యం నుండి, తమ జాతి పేరుతోనే ఒక ప్రత్యేక సాహిత్యాన్ని కొనసాగించేస్థితికి చేరుకుంటున్నారు.
REFERENCES
1. నన్నయ్య ,1998. అంధ్ర మహాభారతం .తిరుపతి ; తిరుమల తిరుపతి దేవస్థానం పబ్లికేషస్. 2. ఐలయ్య కంచె, 1996. మాదిగ ఆర్దిక సాంఘిక తత్త్వము .హైదరాబాద్ ;ఏకలవ్య ప్రచురణలు. 3. బన్న అయిలయ్య - తెలుగు కవిత అభినవ దృక్పథం : 2001నానీ ప్రచురణలు, వరంగల్ 4. లక్ష్మయ్య,మల్లే పల్లి .(ed)1997 జాంబవ పురాణం .హైదరాబాద్ ;జానపద పరిశోదన. 5. భీమన్న బోయి. 1959 రాగ వాశిష్ఠం .హైదరాబాద్ ; సుకేలానికేతన్ ప్రచురణలు .
6. జగన్నాధంనములకంటి .1968, ఆరుంథతీదేవి చరిత్రము. హైదరాబాద్ ; వైదిక గ్రంథప్రచారమండలిప్రచురణలు .
7.మూర్తి .బి .బి.యస్ ,1992.దళిత కధామంజరి .రాజమండ్రి ; త్రివేణిప్రింటర్స్ . 8.రామారావు బొనిగల ,1998 .మాలమదిగల ప్రాచీన చరిత్ర .కాకినాడ్; ప్రశాంతి ఆఫ్ సెట్ ప్రింటర్స్ . 9. జ్ఞానానందకవి యస్.టి ,1997.షెడ్యూలు కులాలు అంటరానివా!కాకినాడ సురగాలి ప్రచురణలు . 10.లాబన్ బాబు.తాళ్ళూరి,2001. మాదిగ వారి చరిత్ర .హైదెరాబాద్ ;కుసుమాంజలి ప్రచురణలు .
11. రామారావు బొనిగల,2005. ఆదిగురువు ఆచార్య చెండాల.తెనాలి ; స్వీయ పబ్లికేషన్. 12.సుధాకర్ ఎండ్లూరి,1999. మల్లెమొగ్గల గొడుగు మాదిగ కథలు .హైదరాబాద్ ;దండోరా చురణలు .
13.విజయ భారతి,బి,2001.పురాణాలు కులవ్యవస్థ .హైదరాబాద్ ;హైదరాబాద్ బుక్ ప్రె స్. 14.సుధాకర్ ఎండ్లూరి,2002. నల్లద్రాక్షపందిరి- darky.సికింద్రాబాద్ ;మానస ప్రచురణలు .
15.సుధాకర్ ఎండ్లూరి,2003.వర్గీకరణీయం .రాజమండ్రి ;మానస ప్రచురణలు 16.సుధాకర్ ఎండ్లూరి ,1998. కొత్త గబ్బిలం. రాజమండ్రి ;మానస ప్రచురణలు .
17. సుందర్రాజు నాగప్ప గారి, (సం)1997.మాదిగ చైతన్యం .హైదరాబాద్ ;మాదిగ సాహిత్య వేదికప్రచురణలు 18.సుందర్రాజు నాగప్ప గారి, 1996 చండాల చాటింపు హైదరాబాద్ ;మాదిగ సాహిత్య వేదిక.ప్రచురణలు .
19. లక్ష్మీనర్సయ్య.జి,1999. దళిత సాహిత్యం,తాత్త్విక భూమిక. హైదరాబాద్ ;దళిత సానప్రచురణలు