"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

30 January, 2009

"దళిత" పదం నిషేధమా? ప్రత్యామ్నాయమేది?

-Dr.Darla Venkateswara Rao

Assistant Professor, Dept. of Telugu

School of Humanities,

UNIVERSITY OF HYDERABAD

Gachibowli, Hyderabad. A.P.,India

దళిత పదాన్ని అధికారిక పత్రాల్లో ప్రయోగించడం రాజ్యాంగ విరుద్దమని జాతీయ ఎస్సీ కమీషన్అభిప్రాయ పడినట్లు వార్తలు వస్తున్నాయి. న్యాయనిపుణుల సలహాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు కూడా వార్తలు వెలువడతున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం "షెడ్యూల్డు కులాలు " అని పేర్కొనడమే రాజ్యాంగ రీత్యా సరైనదనే అభిప్రాయాల్ని వ్యక్తీకరించినట్లు కూడా పత్రికలు రాస్తున్నాయి. ఇప్పటికే చత్తీస్ ఘర్ ప్రభుత్వం ఆయా అధికారులకు కూడా ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది.

మన రాష్ట్రంలో ఇటీవల పర్యటించిన జాతీయ ఎస్సీ కమీషన్సభ్యుడు కూడా ఈ విషయంలో తమ అభిప్రాయాల్ని వెల్లడించారు. "భారతదేశంలో షెడ్యూల్డ్ కులాలను దళిత పదంతో సంబోధించరాదు. అంబేద్కర్ కాలం నుంచి అమల్లో ఉన్న దళిత పదం 'అస్పృశ్యత' అనే భావం స్ఫురించేలా ఉండటంతో జాతీయ ఎస్సీ కమిషన్ ఆ పదాన్ని నిషేధించింది. ఆ మేరకు సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. మార్చి 17, 2008 నుంచి 'దళిత' పదంపై నిషేధం అమల్లో ఉంది. ఈ పదాన్ని ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలోగానీ అధికారికంగా గానీ, అనధికారికంగా కానీ ఎవరూ ఉపయోగించరాదు. రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలుగానే పిలవాలి. అసలు ఈ పదం దేశంలోని ఏ భాషలోనూ లేదు. ఈ పదాన్ని నిషేధిస్తూ విస్తృత ప్రచారం చేయనున్నాం"- అని జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ వి.ఎలీసా హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో "దళిత" పదాన్ని ఒకసారి సమీక్షించుకోవలసిన అవసరం ఏర్పడింది. ఇప్పటికే "దళిత" అనేది అన్ని రంగాల్లోనూ ప్రాచుర్యంలోకి వచ్చేసింది. 'దళితులు' అంటే రాజ్యాంగం పేర్కొన్న 'షెడ్యూల్డు కులాలు' అనే అందరూ అర్ధం చేసుకుంటున్నారు. అణగారిన వర్గాల్ని కూడా కలిపి దళితులు అని పిలుస్తుప్పటికీ, వాస్తవంలో అందరూ అలా భావించడం లేదు. దళిత అనే పదం ఒక రాజకీయ జిమ్మిక్కుగా మారిపోయింది. మళ్లీ ఈ మధ్య కాలంలో "బహుజన" పదం కూడా అదే రూపాన్ని సంతరించుకొంటుంది. మన రాష్ట్రంలో పరిస్థితినే తీసుకున్నా, ఇప్పటికే ఆయా కులాల వారికి ప్రత్యేకమైన పేర్లు స్థిరపడిపోయాయి. వెనుకబడిన వర్గాలంటే బి.సి. లనీ, గిరిజనులంటే ఎస్.టి.లనీ, దళితులంటే ఎస్.సి. లనీ అర్ధంచేసుకుంటున్నారు.

సాహిత్య రంగంలో కూడా 'దళిత' పదాన్ని ప్రధానంగా రెండు కోణాల్లో అధ్యయనం చేస్తున్నారు. అణగారిన అన్ని వర్గాలూ, అంటే ఎస్.సి.,ఎస్.టి., బి.సి., ముస్లింలలో మైనారిటీకి గురికాబడేవారు, స్త్రీలు, ఇంకా సామాజికంగా, ఆర్ధికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా అణచివేతకు గురవుతున్న వారంతా దళితులనే స్థూల దృష్టి కనిపిస్తుంది. మరో వైపు నిర్ధిష్ట కుల అస్తిత్త్వ చైతన్యంతో అంటే, సాంఘికంగా కులం వల్ల హీనత్వానికి గురవుతున్న షెడ్యూల్డు కులాల లోని ఉపకులాల వారే దళితులు అనే అవగాహన కనిపిస్తుంది. గిరిజనులకు లేని వంశపారంపర్య కులహీనత్వ భావానికి గురికావడమనేది దళితులకు మాత్రమే జరుగుతుండటం వల్ల అస్పృశ్యత మాత్రమే దళితులకు పునాది అవుతుందని భావిస్తున్నారు. సామాజికంగా మిగతా వర్గాలకు లేని వివక్షత కులం వల్ల దళితులకు మాత్రమే అదనంగా చేరింది. అందువల్ల 'దళిత' అనే పారిభాషిక పదం సమాజంలోని మిగతా వర్ణాలు, వర్గాల నుండి విడగొట్టబడిన వాళ్ళు అనే అర్ధంలోనే మొదట ప్రయోగించారు. ఈ పదాన్ని కేవలం ఆ అవగాహనతో మాత్రమే కాకుండా, అనేక చారిత్రక పరిస్థితుల వల్ల కూడా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు.

నర్సీమెహతా అనే రచయిత 'హరిజన' పదాన్నిఒక సందర్భంలో తండ్రి ఎవరో స్పష్టంగా తెలియని వ్యక్తిని సంబోధించడానికి ప్రయోగించినా, అది నచ్చి మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ దాన్నేవిస్తృతంగా ప్రచారం చేశాడు. భారత జాతీయోధ్యంలో గాంధీ కున్నతీవ్రమైన ప్రభావం వల్ల అది వేగంగానే ప్రచారంలోకి వచ్చింది. గాంధీ దాన్ని మంచికో చెడుకో వాడుకున్నా, దళితుల్ని ఏకం చేయడానికే దోహద అది పడింది. తమనంతా అస్పృశ్యులమని చూపడానికి జరిగిన కుట్రగా దాన్ని త్వరలోనే దళితులు గుర్తించారు.

భారతదేశంలో పుట్టుక, కులం వల్ల ఏర్పడి వంశ పారం పర్యంగా వెంటాడుతున్న అస్పృశ్యత వల్ల సమాజం నుండి విడగొట్టబడిన వాళ్ళు గా ఎస్సీలు పరగణింపబడ్డారు. దళిత పదాన్ని కూడా మొదట్లో తమకు జరిగిన అవమానాన్ని స్పష్టంగా చెప్పి, తమకి ప్రత్యేకమైన హక్కుల్ని రాబట్టుకోవడాకే ఆ పదాన్ని ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత దళిత పదం ఆ కులాల వారినందరినీ ఏకం చేసింది. అంతకు ముందు గాంధీ వాడుకలోకి తెచ్చిన హరిజన పదం కూడా ఏకం చేసినా, అది తమని అవమాన పరిచే విధంగా ఉందని కూడా గుర్తించారు. '' దేవుని బిడ్డలు" అనే అర్ధాన్నిచ్చే'హరిజన' పదం వెనుక దేవదాసీ బిడ్డలు, అక్రమసంతానం వంటి అర్థాలున్నాయి. హరిజన పదం తమకి ఆత్మ గౌరవాన్ని పెంచకపోగా కించపరిచేలా ఉందని భావించారు. పైగా హరిజన పదాన్ని అంబేద్కర్ తీవ్రంగా వ్యతిరేకించాడు. దానితో ఆయన అనుయాయులకు గాంధీ పట్ల గల వ్యతిరేకత కూడా తోడై హరిజన పదాన్ని నిరసించడానికి ప్రధాన కారణమైంది. దీనికి ప్రత్యామ్నాయంగా మహాత్మాజోతీ రావు పూలే దళిత పదాన్ని వాడుకలోకి తెచ్చారు. దాన్ని అంబేద్కర్ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. నేడు దళిత పదం ఒక ఆత్మ గౌరవ ప్రతీకగా మారింది. నేడు దళితులమని చెప్పుకోవడాన్ని ఎంతోమంది ఆత్మ గౌరవంగా భావిస్తున్నారు. నేడు దళిత పదం అర్ధ గౌరవం సాధించడమే దీనికి ప్రధాన కారణం. మన ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఒకప్పుడు మాదిగ అని చెప్పుకోవడానికి వెనుకాడే వాళ్ళు సహితం, నేడు ఆ పదాన్ని గౌరవప్రదమని భావిస్తున్నారు. అయితే, సమయ సందర్భాల్ని, పదాల్ని ఉచ్చరించే విధానాల్ని బట్టి గౌరవంగా పిలుస్తున్నారా? అగౌరవంగా అవమానంగా పిలుస్తున్నారా? అనేది తెలుస్తుంది. ఇప్పుడు దళిత అనే పదం దేశావ్యాప్తంగా గల ఎస్సీలంతా ఇంచుమించు అంగీకరించిందే. ఇంకా మరి కొంతమంది దళిత పదాన్ని వ్యతిరేకిస్తున్నారంటే, వాళ్ళలో గల దళిత చైతన్యాన్ని కూడా అనుమానించవలసిన పరిస్థితే కనిపిస్తుంది. అంబేద్కర్ భావజాలం కంటే, వారిలో మరొకరి భావజాలమేదో నిండి ఉందేమో తెలుసుకోవలసిన అవసరం, దాన్ని లోతుగా చర్చించ వలసిన ఆవశ్యకత కనిపిస్తుంది. పైగా మన రాజ్యాంగంలో లేదనో, మన దేశానికి చెందనిదనో దళిత పదాన్ని నిషేధించడం సమంజసమేనా? మనవి కాని అనేక భాషాపదాల్ని, భావాల్ని, విఙ్ఞానాన్ని మనం వాడుకుంటూ, దాన్ని మనలో ఒక భాగంగా మార్చుకోగలిగినప్పుడు దళిత పదమే నిషేధానికెందుకు గురవుతుందో లోతుగా చూడాలి.

ఒకప్పుడు ఒక అర్ధంలో ప్రయోగంలో ఉన్న పదాలు కాలక్రమంలో అర్ధ పరిణామానికి గురవుతాయి. ఛాందసుడు అంటే ఒకప్పుడు వేద ఛందస్సు బాగా తెలిసిన వాడని, పండితుడని అర్ధం. నేడు అది ప్రాచీన భావాల్ని పట్టుకొని వేలాడే అభ్యుదయ నిరోధకుడనే అర్ధ పరిణామానికి గురయ్యింది. ఒకప్పుడు సభికులు అంటే జూదరులు అని అర్ధం. నేడు సభలో ఉన్న ప్రేక్షకులు అని అర్ధం. అలాగే ఒకప్పుడు చీర అంటే వస్త్రం అని ఉన్న అర్ధం నేడు స్త్రీలు ధరించే వస్త్రంగా పరిణామాం చెందింది. ఇలాగే అనేక పదాలు అర్ధ విపరిణామానికి గురైనట్లే దళిత పదం కూడా నేడు దళితులు సమైక్య శక్తికీ, దళితుల ఆత్మగౌరవభావాన్ని సూచించే పదంగా మారింది. ఇలాంటి స్థితిలో దళిత పదాన్ని నిషేధించడమంటే, ఒక మహాచైతన్యాన్ని అడ్డుకోవడమేనేమో మేధావులంతా ఆలోచించ వలసిన సమయం ఆసన్నమయ్యింది.

--డా//దార్ల వెంకటేశ్వరరావు


3 comments:

Kathi Mahesh Kumar said...

ప్రత్యామ్న్యాయం ఆలోచించాల్సిందే!

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

"గాంధీ దాన్ని మంచికో చెడుకో వాడుకున్నా, దళితుల్ని ఏకం చేయడానికే దోహద అది పడింది. తమనంతా అస్పృశ్యులమని చూపడానికి జరిగిన కుట్రగా దాన్ని త్వరలోనే దళితులు గుర్తించారు. ..."

గాంధీగారిని గౌరవపూర్వకంగా సంబోధించడానికి సైతం ఇష్టపడని ఈ రచనలో విశేషాలు ఇంకా ఉన్నాయి. దీని అంతర్గత తాత్పర్యం-

౧. గాంధీగారు చెడు కోసం పదాల్ని వాడుకొనేవాడు.
౨. గాంధీ ఇతరుల మీద కుట్రలు చేసేవాడు
౩. గాంధీగారు దళితుల శత్రువు.
౪. గాంధీగారు ఒక విలన్ అని దళితులు కనిపెట్టారు.

గాంధీగారి పట్ల ఈ దృక్పథం సరైనదేనా ?

గాంధీగారి గొప్పతనాన్ని అంబేడ్కర్ గారు తన జీవితకాలంలో గుర్తించలేకపోయి ఉండొచ్చు. అంబేడ్కర్ గారు మన అభిమాన నాయకుడైనంత మాత్రాన ఆయన యొక్క యావత్తు శత్రుత్వాల్ని, పొరపాట్లనీ, దోషాల్ని మనం కూడా భుజాన వేసుకొని తరతరాలుగా తిరగాలా ?

"దేవుని బిడ్డ" అనే మాటకు "అక్రమసంతానం" అని అర్థం (అపార్థం) చెప్పడం విచారకరం. అదే నిజమైతే బైబిల్ లో దేవుని కుమారుడు అని వర్ణించబడే ఏసుక్రీస్తుని కూడా ఆ దృష్టితోనే అర్థం చేసుకోవాలా ? బ్రాహ్మణుడు అన్నా దేవుని బిడ్డ (బ్రహ్మ - సృష్టికర్త కుమారుడు) అనే అర్థం. అందులో అవమానకరం ఏముంది ?

చాలామంది మర్చిపోయే విషయం - ఎస్సీలంతా అస్పృశ్యులు కారు. కొద్దిపాటి సంఖ్యలో ఉన్న అస్పృశ్య ఎస్సీ కులాల్ని చూపించి ఎస్సీలంతా అస్పృశ్యులేనని వాదించడం చరిత్ర విరుద్ధం. ఉదాహరణకి మాదిగ కులస్థులు అస్పృశ్యులు కారు. మాదిగ కులస్థులతో అగ్రకులాలవారికి నిత్యావసరాలుండేవి. ఎవరైనా మాదిగ కులస్థుల పట్ల అస్పృశ్యత పాటిస్తున్నారంటే, లేదా వారిని అస్పృశ్యులుగా అర్థం చేసుకుంటున్నారంటే అది వారిని ఎస్సీలలో చేర్చిన తరువాత మొదలైన అపోహపూర్వకమైన నవీన పరిణామం అయి ఉంటుంది.

ఎస్సీలందరికీ కలిపి ఒక పేరు అవసరం లేదు. ఎవరి కులనామం వారికున్నప్పుడు, ఎవరి వ్యక్తిత్వం వారికున్నప్పుడు దాన్తో అవసరమేంటో నేనూహించజాలను.

దళిత్ పేరు నాకు వ్యక్తిగతంగా నచ్చదు. మరాఠీలో దాని అర్థం అంత వినసొంపుగా ఏమీ ఉండదు.

pseudosecular said...

Some extent I agree with తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారి analysis. Reservations and Dalitisam are stratifying the Caste system instead of dismantling it.

Above all Missionaries pumping Billions of Dollars into Dalit movement to convert them.

Dalits fail to understand the problesm faced by Blacks in the hands of Missionaries. They think that by convertig to Missionary religion, all of their problems will be solved.

As long as Caste is intact, that is not possible. Only thing it will happen is some other Castes go down the Caste hierarchy due to prevailing economic conditions.

It is a pyramid. As MS Srinivasan pointed out there is movement withing the pryramid, but pyramid is intact.

To destroy the Caste system, the change must come from within the system. External forces (missionaries) can not help in this matter.

As the lower classes gain economic and political power, they know that it was possible because of their lower caste status, so they will cling to it for ever.

Then where is the chance to dismantle Caste System?

As long as Caste is a pride for a person and it fetches economic and political rewards, he/she will cling to it for ever.