ఆ ఘనత మనమెపుడో సాధించాం
'ఒకే ఒక్కడు' మనకక్కర్లేదు
నితీశ్ తరహా నేతలు 20 మంది చాలు
ఒబామా విజయం నుంచి భారత్ స్వీకరించగల అర్థవంతమైన సందేశం ఉందా? అందర్నీ కలుపుకొనిపోవాలనే ఆయన ప్రచార సూత్రం నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోగలం? భారత రాజకీయాల్లో ఒబామా తరహా నేతలు ఉన్నారా? భవిష్యత్తులోనైనా ఉద్భవిస్తారా? అమెరికా అధ్యక్ష ఎన్నికల కవరేజీ సందర్భంగా మన టీవీ ఛానెళ్లు సగటు భారతీయుడికి సంధించిన ప్రశ్నలివి.
అణగారిన జాతి నుంచి ఒబామా తరహా రాజకీయ ఉత్థానం భారతీయులకు అనూహ్యం కాదు. భారత్‌లో దశాబ్దాల క్రితమే బి.ఆర్.అంబేద్కర్ అణగారిన వర్గం నుంచి అత్యున్నత శిఖరాలకు ఎదిగారు. ఒబామాకన్నా స్ఫూర్తిదాయకమైన విజయ గాథను అందించారు.
సామాజిక వివక్ష విషయంలో కులం, జాతి... రెండిట్లో ఏదీ తక్కువ కాదు. అయితే, ఒబామా సగం తెల్లవాడు. అంబేద్కర్ వంద శాతం దళితుడు. ఇద్దరూ న్యూయార్క్‌లోని మెట్రొపాలిటన్ విశ్వవిద్యాలయంలో చదువుకొన్నారు. అంబేద్కర్ అక్కడే పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఒబామా హార్వార్డులో న్యాయశాస్త్రం చదివారు. కొన్ని దశాబ్దాల ముందే అంబేద్కర్ లండన్ బార్‌లో సభ్యుడయ్యారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో డాక్టరేట్ కూడా పుచ్చుకున్నారు. ఈనాటి హార్వార్డు పట్టాకన్నా నాటి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ డాక్టరేట్ తక్కువ కాదు.
దళితుడైన అంబేద్కర్ తండ్రి సైన్యంలో చిన్న ఉద్యోగం చేసేవారు. కుటుంబంలో చదువుకున్న వారు లేరు. అందుకు భిన్నంగా ఒబామా తండ్రికి కళాశాల డిగ్రీ ఉంది. తల్లి శ్వేత జాతీయురాలు.
అంబేద్కర్-ఒబామా ఇద్దరూ అసాధారణ ధైర్య సాహసాలను, అంతకు మించిన అసాధారణ తెలివితేటలను ప్రదర్శించారు. అత్యున్నత స్థాయికి ఎదగడానికి తెలివితేటలు, కఠోర శ్రమనే నమ్ముకున్నారు. ప్రతికూలతలను అధిగమించి, విజయాలను సాధించడమే వ్యాపకంగా పెట్టుకున్న అంబేద్కర్‌కు చివర్లో తీవ్ర పోరాటం అనంతరం ఫలితం దక్కింది. బ్రిటీష్ ఇండియా ప్రభుత్వంలో 'వైశ్రాయి కార్యనిర్వాహక మండలి' సభ్యుడు అయ్యారు. స్వాతంత్య్ర భారత ప్రభుత్వంలో తొలి న్యాయశాఖా మంత్రి అయ్యారు. అమెరికా బానిసత్వ చరిత్ర రెండొందల ఏళ్లయితే భారత్‌లో రెండువేల సంవత్సరాలుగా కుల వివక్ష ఉంది. ఈ నేపథ్యంలో భారత్ రాజ్యాంగ రచనను ఒక దళితుడు పర్యవేక్షించడం గొప్ప మేలి మలుపు. అది సగం నల్లజాతి పౌరుడు అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడం కన్నా ఏ మాత్రం తక్కువ కాదు. ఒబామా అమెరికా అధ్యక్షుడు అవ్వడానికి 60 ఏళ్ల ముందే అంబేద్కర్‌ను న్యాయమంత్రిని చేయడం ద్వారా భారతీయులు సామాజిక న్యాయంలో ప్రపంచానికి మార్గదర్శులుగా నిలిచారు.
సర్వామోదం కలిగిన నేతగా అవతరించడంలో భాగంగా ఇప్పటి బరాక్ ఒబామా అనుసరించిన రాజకీయ వ్యూహాలను 60 ఏళ్ల ముందే భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అమలు చేశారు. ఒబామా తన ప్రచారం ఆసాంతం జాతుల రాజకీయాల జోలికి పోలేదు. తెల్లవారు- నల్లవారు, మధ్య తరగతి-పేదలు, స్వలింగ సంపర్కులు-వారిని వ్యతిరేకించే వారు, డెమోక్రాట్లు-తటస్థులు ఇలా సమాజంలో పరస్పర విభిన్న వర్గాలను చేరారు. నెహ్రూ కూడా కులాలు, మతాలు, భాషల ప్రాతిపదికన చీలిపోయిన భారతీయులందరి మనసులు వర్గాలకతీతంగా గెలుచుకున్నారు. 1952లో నెహ్రూ ఎన్నికల ప్రసంగాలను ఒబామా తాజా ఎన్నికల ప్రసంగాలతో పోల్చిచూస్తే ఈ విషయం తెలిసిపోతుంది. నాటి ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టడానికి ప్రధాన కారణం నెహ్రూ ముస్లిముల విశ్వాసాన్ని చూరగొన్న హిందువుగా, పెట్టుబడిదారుల అభిమానాలను అందుకున్న సోషలిస్టుగా, మహిళలు ఆరాధించిన పురుషుడిగా, దక్షిణాది, ఒరియా, బెంగాలీ ప్రజల గౌరవాలందుకున్న హిందీ భాషా వక్తగా సర్వామోదాన్ని పొందడమే.
అమెరికా రెండు యుద్ధాలతో తాను సృష్టించుకున్న ఊబిలో చిక్కుకుని సుదీర్ఘ ఆర్థిక సంక్షోభాన్ని అనుభవించడానికి సిద్ధం అవుతోంది. ఈ సమస్య పరిష్కారానికి అమెరికా కాబోయే అధ్యక్షుడు తెలివిగా పక్షపాత రహిత వైఖరిని ఎంచుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఒబామా షికాగోలో మాట్లాడినపుడు, తనకు ఓటేయని వారి గొంతులూ వింటానని, వారికీ అధ్యక్షుడిగా ఉంటానని చెప్పారు. ఒబామా పాలనలో ముఖ్యమైన పదవులు డెమోక్రాట్లు కాని వారికి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని పదవులు రిపబ్లికన్లకు దక్కినా ఆశ్చర్యం లేదు. అత్యంత ఆందోళనకర సమయంలో గాబరా పెట్టకపోవడమే రాజనీతిజ్ఞుడి లక్షణం.
1948 నాటి భారత్ ఇప్పటి అమెరికా కన్నా పెద్ద సంక్షోభంలో చిక్కుకొని ఉంది. ఆహార ధాన్యం కొరత, విదేశీ మారకద్రవ్య నిల్వల సమస్య తీవ్రంగా ఉన్నాయి. ఒకపక్క హిందూ అతివాదులు మహాత్మా గాంధీని బలి తీసుకున్నారు. హిందూ రాజ్యంగా మార్చేందుకు దేశ వ్యాప్తంగా బలగాలను సమీకరిస్తున్నారు. మరోపక్క సోవియట్ బాస్‌ల ఆదేశాల మేరకు వామపక్షాలు సాయుధ పోరాటానికి తెర తీశాయి. అటు హిందూ అతివాదుల్ని నియంత్రించాలి. వామపక్షాలను జయించాలి. ఇంకా చేయాల్సినవి అనేకం ఉన్నాయి. 80 లక్షల మంది శరణార్థులు దేశంమీద వచ్చిపడ్డారు. స్వతంత్రంగా ఉండాలని ఉబలాటపడుతున్న 500 పైగా సంస్థానాలను విలీనం చేయాలి. భారతదేశ ఐక్యతను కాపాడే విధంగా, రాష్ట్రాల ఆకాంక్షలకు, హక్కులకు హామీ ఇచ్చే విధంగా సమాఖ్య రాజ్యాంగాన్ని చర్చల ద్వారా రూపొందించాలి. అంతర్గత గాయాలను మాన్పడంతోపాటు, మారుతున్న ప్రపంచ క్రమంలో సముచిత స్థానాన్ని సంపాదించాలి. రెండు అగ్రరాజ్యాల మధ్య ఎవరికీ తలొగ్గకుండా స్నేహ సంబంధాలు పెంపొందించుకోవాలి.
ఒబామా లాగే నాడు జవహర్లాల్ నెహ్రూ కూడా భారత జాతీయ పునరుద్ధరణ కార్యక్రమానికి సొంత పార్టీయే కాకుండా బయటి వ్యక్తుల సహకారం కూడా కోరక తప్పదని అర్థం చేసుకున్నారు. అందుకోసం కొందరు కాంగ్రెస్ నేతలు తాము కష్టపడి నెగ్గిన సీట్లను ఖాళీచేసి, విపక్షాల కోసం రాజ్యాంగ సభలో చోటిచ్చారు. అందువల్లే రాజ్యాంగ సభకు అంబేద్కర్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ లాంటి సమర్థులైన న్యాయ కోవిదులు ఎన్నికయ్యే వీలు కలిగింది. కేంద్ర మంత్రివర్గంలోనూ కాంగ్రెస్ బద్ధ శత్రువులైన ఎస్.పి.ముఖర్జీ, బల్‌దేవ్‌సింగ్, షణ్ముగ చెట్టిలాంటి విపక్ష దిగ్గజాలకు చోటివ్వడం నెహ్రూ అనుసరించిన కలుపుగోలు విధానానికి నిదర్శనం.
ఇక వర్తమానానికి వద్దాం. ఒబామా శైలి, వ్యూహాలకు దగ్గరగా భారతీయ నాయకుడు ఒక్కరు లేరా? అంటే... ఒకరున్నారు. తన్ను చూస్తే అలా అనిపించరు. అంత ఆకర్షణీయంగా కూడా ఉండరు. నితీశ్ కుమార్‌కు హార్వార్డు పట్టా లేదు. ఎప్పుడూ ముడతలు పడ్డకుర్తా, సరిగా ఇస్త్రీలేని కోటు వేసుకుంటారు. ప్రసంగం అంతంత మాత్రమే. అయినా, ఆయన కూడా కలుపుకొని పోయే వ్యక్తి. విధానాల్లో, చర్యల్లో, రాజకీయాల్లో ఎక్కడా తరతమ భేదాలుండవు. దేశమంతటా గుజరాత్ తరహా అభివృద్ధిని అమలు చేస్తామని ఎన్‌డీఏ ప్రకటించినపుడు ఆ కూటమికే చెందిన నితీశ్ బీహార్ తరహా అభివృద్ధిని ప్రస్తావించారు. 'సమవృద్ధి' తన ప్రత్యేకతని చెప్పారు. ఆయన దృష్టిలో సమవృద్ధి అంటే ముస్లిములకు వ్యతిరేకం కాకపోవడం.
భారత్ అమెరికా కన్నా ఎక్కువ వైవిధ్యం ఉన్న దేశం. ఇక్కడ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నడుస్తుంది. రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో భారతీయ ఒబామా కోసం ప్రయత్నించడం వృధా. ఈ దేశానికి ఒక్క ఒబామా ఉండటం కుదరదు. దేశాన్ని సమూలంగా మార్చివేయగల తెలివైన, ఆకర్షణీయుడైన, ఒక్కనేత కోసం వెతకడం కన్నా ఆ లక్షణాలను కొంతవరకు పుణికిపుచ్చుకున్న డజను మంది నాయకుల ఏలుబడిలో ఉండటం మనకు ఉత్తమం. వర్గతత్వం లేకపోవడం, రాజకీయ కుటుంబం నుంచి రాకపోవడం, నిజాయితీపరుడిగా కనిపించడం, సుపరిపాలనకు కట్టుబడి ఉండటం, ఏ ఒక్క మతానికి, కులానికి కొమ్ము కాయకుండటం... వంటి సుగుణాలున్న నితీశ్ కుమార్‌ను ఆ డజనులో ఒకరిగా స్వీకరించవచ్చు. నితీశ్‌కు ఒబామాతో పోల్చదగ్గ లక్షణాలు ఎక్కువగా లేకపోవచ్చు. కానీ, ఒబామాకు భిన్నంగా ఉండే లక్షణాలు తక్కువగా ఉన్నాయి. ఈ విషయంలో ఆయన మాయావతి, రాహుల్‌గాంధీ, నరేంద్ర మోడీల కన్నా చాలా మెరుగు. ఆయన తరహా ముఖ్యమంత్రులు పదిహేను ఇరవై మంది ఉంటే భారత్ ఇప్పటికన్నా మెరుగ్గా ఉంటుంది. కనీసం ఇప్పటికన్నా తక్కువ విషాదాన్ని, తక్కువ హింసను చవిచూస్తుంది.
- వ్యాసకర్త ప్రముఖ చరిత్ర పరిశోధకుడు
Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.
3 కామెంట్‌లు:
దార్ల గారూ,
ఈ వ్యాసం ఇక్కడ పంచుకున్నందుకు చాలా కృతజ్ఞతలు.
ఒక్క విషయంలో నా అభిప్రాయం చెపుదామని రాస్తున్నాను. నచ్చకపోతే వదిలేయండి..వాదన ల్లోకి వెళ్ళటం నాకు ఇష్టం లేదు.
దయచేసి..మళ్ళీ దయచేసి అడుగుతున్నాను..ఒబామాని, అంబేడ్కర్ అంత మహానీయుని తో పోల్చకండి సార్..అది అంబేద్కర్ గారిని అవమానించడం అవుతుంది. మొన్ననే శోభాడే గారి ఆర్టికల్ లో చదివా..ఒబామా గాంధీ అంతటి వాడంట.. భగవంతుడా.. ఏమయ్యింది సార్ మన జనాలకి? ఈ సో కాల్డ్ మేధావులే, ఇలా మత్తు మందు తిని, మన్ను తింటే వచ్చే మెదడు తో మాట్లాడుతా ఉంటే, నాకే ఆశ్చర్యమేస్తా ఉంది. మనల్ని మనం అంత అవమానపర్చుకోవాలా?
ఒబామా ఒక గ్రేట్, నాన్-ఐడియాలాగ్, కామన్ సెన్స్ బేస్డ్ పొలిటీషీయన్..బట్ ఇన్ ద ఎండ్ హి ఈజ్ ఎ అ పొలిటీషియన్. ఆయన ఒక ఇంటలెక్చువల్, ఒక గ్రేట్ ఓరేటర్ కూడా..ఒక నాన్ త్రెటెనింగ్ పొలిటీష్యన్ కాదు కాబట్టి, తనకున్న విపరీతమయిన కరిష్మా, తను ప్రజలతో బాగా కనక్ట్ అవ్వగలడు కాబట్టి, ఇది డెమొక్రటిక్ పార్టీ ఈయర్ కాబట్టి గెలిచాడు. (ఏపి వారి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం హిల్లరీ ఇంకా ఎక్కువ(11 శాతం)మెజారిటీ తో గెలచి ఉండేది).
క్షమించాలి.. నేను ఒబామా ని తక్కువ చేయడం కోసం చెప్పట్లేదు. ఒబామా భవిష్యత్తులో అంబేద్కర్ అంత గొప్పవాడూ, లేక ఇంకా గొప్పవాడు అవ్వచ్చు. అతనికి అంత సత్తా ఉంది. కాని అతను ఇప్పటి వరకూ జీవితంలో చేసింది, అంబేద్కర్ గారితో పోలిస్తే(సేం ఏజ్లో) దాదాపు శూన్యం. ఆయన అకంప్లిష్మెంట్ సున్నా ఇప్పటివరకూ(సమాజపరంగా), ఇప్పుడు ప్రసిడెంట్ గా గెలవడం తప్ప. ఈ ఈయర్ కాకపోయినా, హిల్లరి ప్రైమరీ ప్రాసెస్ లో అంత ఓవర్ కాంఫిడెంట్ గా ఉండకపోయినా, ఒబామా గారు తన పార్టీ ప్రసిడెన్షియల్ కాండిడేట్ అయ్యి ఉండలేక పోయేవారు(ఈయన కాకస్ స్టేట్స్ లో వచ్చిన మెజార్టీతో చివర్లో న్యార్రో గా బయట పడ్డారు, అంతేకాని నిజమైన ఓట్లు గణించబడే ప్రైమరీ స్టేట్స్ లో కాదు. గణాంకాలే సాక్షం వీటికి). అప్పుడు మనమంతా(నేను కాదు లెండి) ఆయన్ని ఆల్సొ రాన్ క్రింద అతి తొందరలో మరచిపోయేవారం.
సరే కొంచేం డైగ్రెస్స్ అయినట్లున్నాను.
చెప్పదల్చుకున్నదల్లా ఏంటంటే సార్..
ఒబామా గారు, అంబేద్కర్, గాంధీ(నాకు ఒబామా ని, గాంధీ పేరునీ ఒకే వ్యాక్యం లో ఉపయొగించడం ఇష్టం లేదు) గార్లంత అయ్యినప్పుడు, వాళ్ళంతటి పనులు చేసినప్పుడు పొగుడుదాం. ఇప్పుడే వద్దు దయచేసి.
నల్ల వాళ్ళకి ప్రాణాలొడ్డి పోరాడింది వేరేవాళ్ళు..అందులో ఒబామాకి వీసమెత్తు పాలు కూడా లేదు. అసలాయన పోస్ట్ సివిల్ వార్ కాండిడేట్. అందుకే సౌత్ కెరోలినా ప్రైమరీ వరకూ కూడా నల్ల వాళ్ళు ఆయన్ని నమ్మలేదు..ఈజ్ హి బ్లాక్ ఎనఫ్? అనే ప్రశ్నలు ఆయనకు ప్రతి ఇంటర్యూ వేదిక పైన ఎదురయ్యేవి. ఎందుకంటే ఆయన ఆ పోరాటాల్లో పాల్గొనలేదు(లేడు కాబట్టి)..లోయర్ ఇంకం గ్రూప్స్ లో నల్ల వాళ్ళ మధ్య పెరగలేదు. తను పెరిగింది తెల్ల వాల్లయిన..వాళ్ళ అమ్మ, అమ్మమ్మల ఇంట్లో..తన అమ్మమ్మ వాళ్ళు ఆయన్నిPunahou School, Hawaii కి పంపించారు. అదొక చాలా ఎక్స్ పెన్సివ్ ప్రైవేట్ స్కూల్. As per Wiki, it costs $16000 a year today in that school..అమెరికా లో ప్రైవేట్ స్కూళ్ళు భయంకరమయిన ఖరీదు..మధ్య తరగతి వాళ్ళు సాధారణంగా పంపించరు..ఇక చాలా మంది నల్ల వాళ్ళ కయితే అలాంటి ఖరీదు..కలలో కూడా ఊహించలేనటువంటిది. ఆ తరవాత ఆయన్ కొలంబియా కి, హార్వర్డ్ కి వెళ్ళాడు..
ఎక్కడా ఆయన బయాస్ కు కాని, రేసిజం కు గురవడం కాని(ఆయన పూర్వీకుల్లాగా, అంతెందుకు నలభై సంవత్సరల క్రితం లాగా) జరగలేదు.
నాకు మన తెలుగు పత్రికల్లో ఆయన మీద వస్తున్న కవితలూ అవీ చూస్తుంటే నాక్కొంచెం ఎంబరాసింగ్ గా ఉంది సార్. మొన్నెప్పుడో స్కై బాబా గారి కవిత చదివా..భగవంతుడా అనుకున్నా..
మనుషుల్ని వాళ్ళ అర్హతల్తో సంబంధం లేకుండా, వాళ్ళని Mythify చేయడానికి, Deify చేయడానికి దూరంగా ఉండడం అనేది చదువుకున్న వాళ్ళ కనీస భాధ్యత అని నేను నమ్ముతాను సార్.
I guess I wrote with some 'aavesham'.. I am sure there would be lots of mistakes on sentence structures. Kindly excuse.., but I guess you would understand what I was trying to say.
కుమార్ గారూ!
నిజంగా చాలా సంతోషంగా ఉందండీ! ఆ వ్యాసాన్ని చర్చలోకి తేవడానికే నేను ఈనాడు సౌజన్యంతో దాన్ని నా బ్లాగులో పెట్టాను. ఆ వ్యాసం ఒక కుట్రతో రాసిన దానిలా అనిపించింది నాకు. ఒబామా గురించి నాకు చాలా అనుమానాలున్నాయి. అయితే, ఆయన ఒక నల్ల జాతి వాడనేదే నా ఆనందం తప్ప, అతని విధానాలు, అతని ఆలోచనలు ఇంకా మనం గుర్తించ వలసిన అవసరం ఉంది. మన దేశ ప్రయోజనాలే మనం కూడా ఆలోచిస్తాం. అదే మనకీ ప్రధానమని భావించేవారిలో నేనూ ఒకడిని. అయితే అమెరికా వంటి దేశంలో ఒక నల్ల జాతి వ్యక్తికి పీఠం కట్టారు. మరి మనదేశంలో ఒక దళితుడికి ఆ గౌరవం దక్కుతుందా? ఇలా ఆ ఒక్కటి తప్ప మిగతా అంశాలేవీ ఇంకా చర్చించలేదు. ఆ దిశగా చర్చ జరగాలి. దివికుమార్ గారి కవిత ఆంధ్ర జ్యోతి 17-11-2008 చూశారనుకుంటాను. ఆయన చాలా నిజాయితీగా తన అభిప్రాయాన్ని కవిత్వీకరించారు. ఇలా చర్చను లేవదీసిన మిమ్మల్ని అభినందిస్తున్నాను.
మీ
దార్ల
వెల్ సెడ్ కుమార్ గారు. ప్రవాహంలొ కొట్టుకుపోకుండా మనదైన పంథాలో సాగటమంటే ఇదేనేమో! ఎవరు చెప్పేది లేదా నడిచేది సరైన దారి అనేది తర్వాత తేలుతుంది...
మీరన్నారు ఇందులో ఆవేశముందేమో అని... కాదు, తర్కానికి నిలిచే ఆలోచన ఉంది. మీ అభిప్రాయంతో నిలుస్తూ, వింతగా జరుగుతున్న ఈ ప్రచారాన్ని చూస్తుంటె మీక్కలిగిన అశ్చర్యాన్ని నేనూ అనుభవిస్తున్నాను...
ఈ మధ్యే నాకు తెలిసినొకాయన "నా ప్రియ ఒబామా" అని రాసేసాడో కవిత. ఆ ప్రియమైన వాడి నేపథ్యం వగైరా ఏవీ తెలీకుండానే... తొలి చూపు ప్రేమలాగా...
ఇదెలా ఉందంటే ఎరుపు రంగు వైర్ లోనె కరంట్ ప్రవహిస్తుంది... నలుపు రంగు వైర్ లొ ఎర్త్ ఉంటుంది అన్నట్టు... కనెక్షన్ ఎలా ఇచ్చామా అన్నది కదా కావల్సింది... అది తెలీక గుడ్డిగా ముట్టుకుంటె షాక్ తగులదూ...
సింపుల్ గా చెప్పాలంటే తెల్లని వన్నీ పాలు నల్లనివన్నీ నీళ్ళు అనుకున్నట్లు... మరి అలా కాదు కదా...
అందుకే
ఓ నా కవి మిత్రులారా....
కాస్త వేచి చూద్దాం
ఒబామా నల్ల సూరీడా... లేక ...
కామెంట్‌ను పోస్ట్ చేయండి