(అమెరికాలో ఏమి జరుగుతుందో ప్రపంచదేశాల్లోని చిన్న పిల్ల వాడికి కూడా నిమషాల్లో తెలిసిపోతుంది. అమెరికా ప్రభావం అంతగా ఉండటమే దానికి ప్రధాన కారణం. అలాగే అమెరికా అధ్యక్షుల గురించి మన కవులు కూడా కవిత్వం విరివిగా రాయడంలోనూ అదే ఆలోచన కనిపిస్తుందేమో!
ఏది ఏమైనా మన వాళ్ళు అమెరికా అధ్యక్షుల గురించి, అంటే ఆ దేశ విధానాల గురించి రాయడం ఎక్కువయ్యింది.ఈ నేపథ్యంలోనే దివికుమార్ నవంబరు, 17, 2008 న ఆంధ్రజ్యోతి లో ఒక కవిత రాశారు. దాన్ని కొంతమంది మన బ్లాగు ద్వారా అందుబాటులోకి తీసుకురమ్మన్నారు. అందువల్ల ఒబామాను మన కవులు ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఎలా అర్థం చేసుకోవాలి? అనే ఆలోచనలతో ఒబామా గురించి వచ్చిన కవితలను ఇక్కడ ఒక చోట నే చదువుకొనే విధంగా పెట్టాలని ఆలోచిస్తున్నాను.....దార్ల )
వరపుత్రుడా?!
- దివికుమార్
రంగులు చూపి భ్రమించొద్దని
వేమన తాత చెప్పిపోయినా
పుణ్య పురుషోత్తములను
కనిపెట్టు విద్య మాకింకా అలవడలేదు
అల్ప సంతోషుల ఆశలు ఎంతమంచివైనా
వాటికవే నెరవేరి ఒప్పులకుప్పలు కాలేవు
భారత రాజ్యాంగాన్ని దళితుడే రాసినా
అరవై యేళ్లకు కూడా
పీడితులతలరాత మారలేదు
ఇనుప కుల చట్రాన్ని ఎన్ని
సుత్తులతో మోదుతున్నా
వంకరటింకర్ల వయ్యారిభామై
కుక్కమూతి పిందెల్నే
పూయటం మానలేదు
భారత గద్దెను ఒక ముస్లిం
అధిష్టించిన తరవాతైనా
గుజరాతు గాయాలు ఆగలేదు
దళారీలు ఒంటరిగా
పశ్చాత్తాపం ప్రకటించినా
సామ్రాజ్యవాదపు దారుణ
దుశ్చర్యలు నిదానించలేదు
ఐక్యరాజ్యాధిపత్యం ఒక నల్లనయ్యకే దక్కినా
ప్రపంచ అశాంతి, యుద్ధాలు
ఒక్కడుగైనా వెనక్కుపడలేదు
తన స్వేచ్ఛా కిరీటాన్ని
అణ్వాయుధాలతో
అలంకరించుకున్నవాడు
ఇతరుల ఆత్మగౌరవాన్ని అంగీకరించలేడు
నాడు చైనా, కొరియా, వియత్నాంలలో
ఘోరంగా భంగపడినా
నేడు పాలస్తీనా ఆఫ్ఘన్ ఇరాక్‌లను
మండించటం మానలేదు
తెల్లమేడకు ఎట్టకేలకు నల్లరంగు పూసినా
దేశదేశాల బడుగుల బతుకు తెల్లారబోదు
పల్లకీలో ఎక్కేది తెల్లత్రాచైనా, నల్లనాగైనా
బోయీ ఎలుకలపై జీవన
భారపు కాట్లు తరిగిపోవు
లాభాల నెత్తురు తాగితే తప్ప శ్వాస
ఆడని మార్కెట్ భూతం
తన యింటి గూటిలోనే
ఒదిగి ఒదిగి వుండలేదు
ఈసారి నల్లని మేలిముసుగు
ధరించినంత మాత్రాన
విశ్వమోహిని, ధనకామిని, జనగామినియై
అమృతాన్ని అందరికీ పంచబోదు
నాటి పంచ కళ్యాణీలను నల్లకృష్ణుడే
గీతాచార్యుడై నడిపించినా
నేటి ప్రపంచ సంక్షోభీకరణాల
డైనోసార్ గీతలను
నీలిసారధి నిర్దేశించలేడు
ప్రజలు విప్లవించకుండా
జాతులు విముక్తినీ, దేశాలు
స్వాతంత్రాన్నీ పొందలేవు.
( ఆంధ్ర జ్యోతి 17-11-2008, సౌజన్యంతో)
Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి