14 జులై, 2008
నాగభైరవ స్మృతి
పిల్లల కోడి
రావి నూతల గ్రామ విభ్రాజితుండు
రమ్య గేయ కవిత్వ విరాజితుండు
పలుకు మార్దవ్య భరిత సంపదల కొలువు
నలరు-నాగభైరవ కవినిలభజింతు
కవనోత్సేజిత మూర్తిమత్వమున సౌఖ్యశ్రీలు జెన్నొందగా
కవి సమ్మేళన ఒంగవోల్ పురియశః కాంతిచ్ఛటల్ నిండ-స
త్కవులుత్సాహ మహాబ్ధి పొంగ కవితా ఖ్యాతిన్నిడెన్, 'నాగభై
రవ కోటేశ్వరరావు నిర్వహణ సౌరభ్యంబు పెంపారగన్;
సార్ధకమ్మున నీ 'యువ సంతకముల' పేర
వార్తలో ప్రతి భాను వారమరయ
యువ కవుల సుపరిచయ భాగ్యోదయుండ
వై, నిలిపినావు; ఆసక్తి బరపినావు
అందరచేరదీసి కవితాంబుధి నీదగ జేసి ముత్తెపుం
పందిరు వేయు భావముల
పద్య సుగంధము పంచినారు; ఆ
నందము తళ్కులీన మది నవ్య
పదాల వసంత శోభలన్
జిందగ తేనెలద్దు కవి
సంహకిశోరమ! నాగభైరవా!!
రోగభయము వార్ధక్యంబు మూగుచుండ
భావ చైతన్య కవితానవాంబువులును
నీరసించ సత్యాత్మ కన్నీరు విడువ
దేహమును వీడి చనినావ! దివిజ నీవు!
మృత్యువా! నాగభైరవ మేటి కవిని
పట్టి గొంపోవ నీకెట్లు గిట్టెనయ్య!
కలము మూగవోయిన మరుక్షణమునందు
కోటి కన్నులు అశ్రువుల్ కూర్మి రాల్చె
'కవన విజయం'బు వ్రాసి సత్కవి సుజన-మ
నోహరంబున దీర్చు గుణోన్నతాశ
యమ్ము లెటుల స్ఫురించెనో! హర్షవదన!
స్ఫురిత రచనాధురీణ-సంశోభితుండ;
(శ్రీ నాగభైరవ కోటేశ్వరరావు గారికి నివాళులర్పిస్తూ)
-మల్లవరపు రాజేశ్వరరావు
(నాగభైరవ కోటేశ్వరరావు గారి గురించి ఒక వ్యాసం రాయాలను కున్నాను. పనుల ఒత్తిడి వల్ల రాయలేక పోయాను. అందుకే వారిని స్మరించుకొంటూ... ఈ పద్యాలను మరలా ఇక్కడ ప్రచురిస్తున్నాను ....దార్ల )
(ఆంధ్రజ్యోతి 14-07-2008 సౌజన్యంతో)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి