"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

02 July, 2008

మాదిగ సాహిత్య విమర్శ

మాదిగ సాహిత్య విమర్శ

-డా//దార్ల వెంకటేశ్వరరావు
లెక్చరర్, తెలుగు శాఖ,
సెంట్రల్ యూనివర్సిటి.
గచ్చిబౌలి,హైదరాబాదు -46

Email: vrdarla@gmail.com

నీగ్రో సాహిత్య ప్రభావంతో భారతదేశంలో దళిత సాహిత్యం ఒక స్పష్టమైన రూపంతో ముందుకొస్తే, ఆంధ్రప్రదేశ్‌లో దళిత ఉద్యమంలో; దళిత సాహిత్యంలో జరుగుతున్న అంత: సంఘర్షణ ఫలితంగా మాదిగ దండోరా ఉద్యమం; మాదిగ సాహిత్యం ప్రారంభమైంది. దళిత ఉద్యమమైనా, దళిత సాహిత్యమైనా రావడానికి గానీ, మాదిగ దండోరా ఉద్యమమైనా, మాదిగ సాహిత్యమైనా రావడానికి గానీ "వివక్షే" ప్రధాన కారణం. దళితుల ఆత్మగౌరవ ప్రతిఫలన దిశగా 1985 తర్వాత దళిత సాహిత్యం స్పష్టమైన ప్రణాళికతో వచ్చింది. అంతే స్పష్టతతో సుమారు ఒక దశాబ్దం కూడా కాకముందే, అంటే 1996 నుండే మాదిగ సాహిత్యం కూడా తనదైన ప్రణాళికతో మాదిగ సాహిత్యం పేరుతోనే ముందుకొచ్చింది. మాదిగ హక్కుల దండోరా నేపథ్యంతోనే వచ్చినా, కేవలం ఆ హక్కులను అందరికీ సృజనాత్మక సాహిత్యం ద్వారా చేరవేయాలనేదే ఏకైక లక్ష్యం మాత్రం కాదని మాదిగ సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేసిన వారికి అర్థమవుతుంది. తమని అన్ని రకాలుగానూ విస్మరించిన పరిస్థితుల నుంచి, తమ పేరుతో ఇతరులు దోపిడీకి ప్రయత్నిస్తున్న వాస్తవిక జీవితాల నుంచీ మాదిగ సాహిత్యం తన సొంత గొంతుని వినిపించడం తప్పనిసరైన చారిత్రక పరిస్థితుల నుంచీ ఆవిర్భవించింది. అయినా, నేటికీ చాలా మంది దళిత సాహితీ వేత్తలు మాదిగసాహిత్యం పేరుతో ఒక ప్రత్యేక వాదం అవసరలేదనీ, అదికూడా దళిత సాహిత్యమేననీ వాదిస్తూ, మళ్ళీ మాదిగలను విస్మరించడానికి ప్రయత్నిన్నారు. అగ్ర వర్ణాలవారినీ, వర్గ స్వభావాన్నిప్రదర్శించే వారినీ మాదిగల గురించి రాయనివ్వకపోతే, మాదిగల గురించి మాదిగలు కాక మరెవ్వరు రాసుకోవాలనే అభిప్రాయాలు మాదిగ సాహిత్యకారుల నుండి ఎదురవుతున్నాయి. మాదిగ సాహిత్యం అలా ప్రారంభం కావడం వెనుక ఎంతో నేపథ్యం ఉంది. ఎన్నో చారిత్రక పరిణామాలున్నాయి. వాటిని సహృదయతతో అవగాహన చేసుకోకపోతే, మాదిగ సాహిత్యం వచ్చిన స్థితి గతులు అర్థం కావు.
మాదిగ సాహిత్యం ప్రారంభం, దాని కొనసాగింపులలో గల చారిత్రక పరిణామాలను మూడు విధాలుగా విభజించుకునే అవకాశం ఉంది.
1. మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎం.ఆర్.పి.ఎస్) పోరాటానికి ప్రేరణగా సాహిత్యం సృజనీకరించే ప్రయత్నం నుండి మాదిగ సాహిత్యం పాటలతో, కర పత్రాలతోనే ప్రారంభమైంది. దీన్ని మాదిగ హక్కుల ప్రచార దశగా అభివర్ణించుకోవచ్చు. తమ మాదిగ జాతికి జరుగుతున్న అన్యాయాలను అందరికీ తెలియజేయడం, సాధ్యమైనంతమంది అందరిచేతా మాదిగలు అడిగే వర్గీకరణ ఫలితాల వాదనను అంగీకరించాలనే ప్రయత్నం సహజంగానే ఈ దశలో జరుగుతుంది. అదే మాదిగ కవులు రాసిన తొలి దశ కవిత్వంలో ప్రతిఫలించింది. అలా అడగటంలో అప్పుడే కలం పట్టిన కవుల్లో ఉండే ఆవేశం మాదిగ కవుల కవితల్లోనూ ఉండక తప్పదు. ఉద్యమాధారంగా వచ్చే ప్రతి సాహిత్యంలోనూ ఇలాంటి ఆవేశం అక్కడక్కడా కనిపిస్తుంటుంది. అదే మాదిగ సాహిత్యంలోనూ జరిగింది. అయితే, ఆ ఆవేశం సహజంగానే తమకు శాశ్వత శత్రువు కాకపోయినా, ప్రత్యక్షంగా, తక్షణం ఆటంకంగా నిలిచే తమ సోదర దళితులైన మాలల పైనే వ్యక్తమవ్వడం వల్ల, మాదిగ సాహిత్యం ప్రారంభంలోనే విమర్శలను ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది. నిజానికి ఇంత కంటే తీవ్రంగా ఉమ్మడి దళిత సాహిత్యంలో దళితేతరులను నిరసిస్తూ కవిత్వం వచ్చింది. కానీ, దాన్ని సమర్థించే వర్గం అప్పటికే తయారుగా ఉంది. అది మాదిగ సాహిత్యంలో జరగలేదు. కనుక, మాదిగ సాహిత్యం తొలిదశలోనే అనేక ఒడిదుడుకులను ఎదుర్కోవలసి వచ్చింది.
2. దళిత సాహిత్యంలోనే కాకుండా, యావత్తు సాహిత్యంలోనే మాదిగలు తమ మాదిగ సాహిత్య అస్తిత్వాన్ని నిలుపుకోవాలని భావించి ముందుకు రావాలనుకున్నారు. ఒక వైపు మాదిగ హక్కుల దండోరా ఉద్యమాన్ని సమర్థిస్తూనే, దానికి కావలసిన సాహిత్యాన్ని వివిధ కరపత్రాలు, పాటలు, వీధి నాటికల రూపంలో అప్పడికప్పుడు మౌఖిక, లిఖిత సాహిత్య పద్ధతుల్లోనూ అందిస్తూనే, కవులను, కళాకారులను సంఘటిత పరిచే మార్గంలో నడిచింది. ఒక వైపు తమ ప్రాచీన మూలాలను జానపద, మౌఖిక సాహిత్యాలలో వెతుక్కోవడం, మరొకవైపు మాదిగ హక్కుల దండోరాకు సహకరించే భావజాలాన్ని అందించే ప్రయత్నం చేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో, అప్పటికే ఉమ్మడి దళితుల పేరుతో వ్యవస్థీకృతమైన వారిలో కొంతమంది, కలం పేర్లతో, చాటుమాటుగా సంధించే విమర్శలకు తగిన సమాధానాలను చెప్పడానికి ప్రయత్నించే ఈ కాలాన్ని మాదిగ అస్తిత్వ సంఘర్షణ దశగా అభివర్ణించవచ్చు. ఈ దశలోనే హైదరాబాదు లోని గోల్కొండ హోటల్లో మాదిగ కవులను, రచయితలను, కళాకారులను, మాదిగమేధావులు సమావేశ పరిచారు. మాదిగ హక్కుల కోసం తమ కలాలను, గళాలను స్పందించాలన్నారు. ఆ సమావేశానికి రాష్ట్రం లోని మాదిగ, దళితుల్లోని అనేక ఉపకులాల వాళ్ళు హాజరైయ్యారు. ఆ సమావేశంలో పాల్గొన్న మాదిగ హక్కుల పోరాట సమితి నాయకులు, మాదిగ మేధావులు ఉత్తేజకరమైన ప్రసంగాలు చేశారు. ఆ స్పూర్తితో కొంతమంది మాదిగ సాహిత్యాన్ని సృజనీకరించే ప్రయత్నం జరిగినా, అది చాలా వరకూ వ్యక్తిగత స్థాయిలోనే జరిగింది. ఒక బలమైన సాంస్కృతిక శాఖను ఎం.ఆర్.పి.ఎస్ ఏర్పాటు చేయకపోయింది. కానీ, తమ ఉద్యమానికి కావలసిన పాటలను, నినాదాలను, పోస్టర్ సాహిత్యాన్ని అనుభవజ్ఞుల దగ్గర నుండి ఉపయోగించుకోవడానికి ప్రయత్నించడం ద్వారా కూడా మాదిగ అస్తిత్వ సంఘర్షణ ఎదురైంది. ఈ దశలో ఎదురైన అనుభవాలనుండే మాదిగ సాహిత్య వేదిక ఏర్పడింది.
3. మాదిగ హక్కుల దండోరా ఉద్యమానికి వాళ్ళు అడిగినా, అడగకపోయినా, సహకరించినా, సహకరించకపోయినా కొన్ని స్పష్టమైన ఆశయాలు, లక్ష్యాలతో మాదిగ సాహిత్య వేదికను స్థాపించటం జరిగింది. దీని ద్వారా వ్యవస్థీకృతంగా మాదిగ జీవితాలను అధ్యయనం చేసి , గత, వర్తమాన, భవిష్యత్తు తరాల మాదిగల సర్వకోణాలను ఆవిష్కరించి, మాదిగల అస్తిత్వం కోసం కృషిచేయాలనే ప్రయత్నం మాదిగ సాహిత్య వేదిక లక్ష్యాలో కనిపిస్తుంది. ఈ కాలాన్ని మాదిగ సాహిత్య వ్యవస్థీకృత దశ అనవచ్చు. ఈ దశలో మాదిగ సాహిత్య వేదిక ఏర్పడి , మాదిగలకు ఒక ప్రత్యేక సంస్కృతి ఉందని చాటి చెప్తూ, ఆత్మగౌరవంతో ప్రత్యేక సాహిత్య వాదంతో నిలబడాలనుకోవడం కూడా కనిపిస్తుంది. మాదిగ సాహిత్యం ఒక వాదంగా రావడం వెనుక ఒక బలమైన ఆలోచనే ఉందని దీన్ని గమనించిన వారికి తెలుస్తుంది. దీన్ని గమనించి కూడా దీన్నీ పట్టించుకోకుండా కేవలం దళిత సాహిత్యంలో అంతర్భాగంగా మాత్రమే చూస్తే, ఈ చారిత్రక పరిణామాలు కేవలం ఊహాపరికల్పనలుగా మాత్రమే పరిగణిస్తారు.
పై విశ్లేషణను చూసినప్పుడు, "దళిత సాహిత్యం" షెడ్యూల్డు కులాల్లోని అన్ని ఉపకులాల పేరుతో వెలువడిన సాహిత్యమైతే, మాదిగ సాహిత్యం దళితుల లోని ఒక ఉపకులమైన మాదిగలనే ప్రధాన కేంద్రంగా చేసుకొని అంతర్వివక్షను కూడా నిలదీసే ప్రయత్నంతో వచ్చిన నిర్ధిష్టమైన కుల సాహిత్యం అవుతుంది. నిర్ధిష్ట కుల సాహిత్యం అనగానే కుల వ్యవస్థను కాపాడే ఆశయంతో కాకుండా కులం పేరుతో జరుగుతున్న వివక్షను ప్రశ్నించే దిశగా ఒక కులాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకొని కుల నిర్మూలన కోసం చైతన్యవంతంగా కృషి చేసే సాహిత్యం మాదిగ సాహిత్యం అని అర్థం చేసుకోవలసి ఉంది.
మాదిగల పుట్టుక, వారి వృత్తులు మొత్తం మీద వారి సంస్కృతిని మానవీయ కోణం నుండి చూపించే ప్రయత్నం చేస్తుంది మాదిగ సాహిత్యం. దళిత ఉద్యమానికి ఉన్నట్లే, మాదిగ సాహిత్యానికీ స్పష్టమైన లక్ష్యాలు కనిపిస్తున్నాయి.
అన్ని కులాల వారినీ గౌరవించినట్లే మాదిగలనూ, వారి వృత్తినీ గౌరవించాలని కోరుకోవటం.
మాదిగల సంస్కృతిని కించపరచకుండా, మాదిగల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని భావించటం.
ప్రతి కులానికీ, జాతికీ ప్రత్యేక అస్తిత్వం, సంస్కృతి ఉంటాయని ప్రబోధిస్తూనే, షెడ్యూల్డు కులాలు, తెగల్లోని అన్ని ఉపకులాలను చైతన్య పరచటం.
ఒక కులం లేదా జాతి పేరుతో ఆధిపత్యాన్ని చెలాయించే సంస్కృతికి చరమగీతం పాడి, అందరికీ ఆత్మగౌరవాన్ని కలిగించాలనుకోవడం.
అవసరమైతే ఆత్మగౌరవం కోసం ప్రారంభంలో వ్యవస్థీకృత కుల చిహ్నాలను కూడా తమ పేర్లకు తగిలించుకొని, 'ఉష్ణం ఉష్ణేణ శీతలం' అన్నట్టు 'కులం' కులంతోనే పోవాలనీ అందుకు కులాన్నే ఆయుధంగా వాడుకోవాలనీ భావించటం. సమాజంలో కొన్ని కులాలకు గౌరవ మర్యాదలు ఉంటూ, మరి కొన్నికులాలకు ఆ గౌరవ మర్యాదలు దక్కనప్పుడు వ్యవస్థీకృత కుల చిహ్నాలతోనే పోరాడడమనేది కుల నిర్మూలన చైతన్యం ఎలా అవుతుందనే సందేహం చాలా మందికి రావచ్చు. అందరూ తమ తమ కులాలను, కుల చిహ్నాలను వివిధ రకాలుగా ప్రదర్శించుకోవడం వలన కొన్నాళ్ళకు వాటి పట్ల వ్యతిరేకమైన అభిప్రాయం ఏర్పడి, చివరికి కుల చిహ్నాలనే విస్మరించటం జరుగుతుంది. దానికి కేవలం కులాధారిత విభజన మాత్రమే కాకుండా , ఆర్థికపరమైన వర్గ విభజన కూడా తోడవుతుంది. క్రమేపీ, వర్గ విభజనే ప్రధానమై, అదే ముందుకు వచ్చినప్పుడు సమాజంలో కులం అంతరించిపోతుంది. సమాజం వర్గ విభజనను ప్రధానం చేసుకోవాలనుకుంటే భారతదేశంలో కులమే ప్రధాన అవరోధంగా నిలుస్తుంది. కులం ఆధారంగానే అన్ని సౌకర్యాలు, అసౌకర్యాలు లభిస్తున్నాయి. కనుక, కులాన్ని కులంతోనే నిర్మూలించాలనేది మాదిగ దండోరా ఉద్యమం, మాదిగ సాహిత్య లక్ష్యాలలో ఒకటిగా కనిపిస్తుంది.
కులాన్ని కులంతోనే నిర్మూలించటం అనేది అనేక ఉపకులాల, బలహీన వర్గాల వ్యక్తిగత అభివృద్ధితో కూడిన సమైక్య ఉద్యమాలతోనే సాధ్యమవుతుంది. అది ప్రథమ దశగానూ, ఆ తర్వాత అన్ని కులాలలోను వర్గ విభజనే ప్రధానమై వర్గ పోరాటానికి దారి తీయడం అంతిమదశ. ఈ దార్శనికతతోనే మాదిగ దండోరా ఉద్యమం, మాదిగ సాహిత్యం పయనిస్తుందనిపిస్తుంది. అందుకనే, బలహీన వర్గాలతో కలిసి రాజ్యాధికారానికై రావాలనే ఆశయం కూడా మాదిగ దండోరా ఉద్యమంలో కనిపిస్తుంది. రాజ్యాధికారానికి వచ్చినా, రాకపోయినా మాదిగలు, మాదిగలవంటి వివక్షకు గురవుతున్న ఉపకులాలన్నీ ప్రధాన జీవనస్రవంతిలోకి రాగలుగుతాయి. అప్పుడు ఉమ్మడి ప్రయోజనాల కోసం , ఉమ్మడిగా పోరాడతాయి. కనుక, ప్రస్తుతం రావలసిన హక్కులను సాధించుకోవడం తక్షణ కర్తవ్యంగా గుర్తించి, తమహక్కుల తక్షణ సాధనకోసం అడ్డంకి పడేవారితోనే తమ తొలి సంఘర్షణ, పోరాటం తప్పదని మాదిగ ఉద్యమంతో పాటు, మాదిగ సాహిత్యం కూడా ముందుకెళ్ళడం కనిపిస్తుంది.
దళిత ఉద్యమం, దళిత సాహిత్యాలలో ఉమ్మడి ప్రయోజనాల పేరుతో అనేక ఉప కులాల వాస్తవికతను విస్మరించి, కొన్ని ఉపకులాలకే ప్రయోజనకరం చేసుకొని, అన్ని ఉపకులాల ప్రయోజనంగా ప్రచారం చేయడం కూడా కనిపిస్తుందనే విమర్శ అత్యంత ప్రధానంగా కనిపిస్తుంది.
ఇలాంటి అనేక లక్ష్యాలతో మాదిగ సాహిత్యం ప్రారంభమైనా, దాన్ని అర్థం చేసుకోవటంలో వ్యాఖ్యానించటంలో వక్రమార్గాలను పట్టించినవారు ఉన్నారు. కేవలం షెడ్యూల్డు కులం లోని రిజర్వేషన్‌లో తమ వాటా కోసమే మాదిగ దండోరా ఉద్యమం వచ్చినట్టు, దాన్ని ప్రచారం చేయడానికే మాదిగ సాహిత్యం పుట్టుకొచ్చినట్లు చెప్పడం సరైంది కాదు. అలా చెప్పడం లేదా అలా ప్రచారం చేయడం అనేక తరాలుగా సమాజానికి దూరంగా బతుకుతున్న వారి ఆవేదనను కనీసం వినకుండా వారి సమస్యలను సరైన కోణంలో అర్థం చేసుకోకపోవడమే కాక, మాదిగల మానవీయ స్పందనన వినకుండా, వినే అవకాశం లేకుండా చేసే అప్రజాస్వామిక ధోరణే అవుతుంది. చారిత్రక విషాధమేమిటంటే, అగ్రవర్ణ, వర్గపోరాట స్వభావం గల సాహితీ వేత్తలు కూడా మాదిగల వాదన, వేదనలల్లో ప్రజాస్వామిక ధోరణి కనిపిస్తుందని అంటున్నా, "సమైక్య దళిత" వాదులు మాత్రం దాన్ని అంగీకరించలేకపోతున్నారు. జరుగుతున్నదాన్నంతా అగ్రశ్రేణి రచయితలు, మేధావులు, ఉద్యమ నాయకులు మౌనంగా చూస్తున్నారు.
దళిత ఉద్యమం సమైక్యత పేరుతో "దళితు"లలోని... ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మాల - మాదిగలలో మాలల నాయకత్వంలో జరిగిన ఉద్యమం, మాలల అభివృద్ధి కోసమే జరిగే ఉద్యమంగా దళిత ఉద్యమాన్ని చాలా మంది మాదిగలు గుర్తిస్తున్నారు. అప్పటి సాహితీవేత్తలకు వీరిపట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల మాల - మాదిగల మధ్య భేదాన్ని పెద్దగా పాటించలేదు. పరిశోధన దృష్టితో చూస్తే అప్పుడు మాల - మాదిగ శబ్దాలు ప్రధానంగా మాదిగలను సూచించేవేనని స్పష్టమవుతుంది. సంస్కృతి పరంగా చూసినప్పుడు కూడా ఈ విషయం తెలుస్తూనే ఉంది. మాదిగల వృత్తి, పనిముట్లు మొదలైన వాటిని అనుసరించి చూసినప్పుడు ప్రాచీన సాహిత్యంలో మాదిగలను కూడా మాలలగానే సంభోదించారని నిరూపితమవుతుంది. అలాంటి మాదిగ జీవితాలను కూడా మాల శబ్దం ఉన్నవాళ్ళందరినీ దళిత , దళితేతర రచయితలు వక్రీకరించే ప్రయత్నం చేశారు.
దళితేతరులు తెలియక చేస్తే, దళితులు కావాలనే మాదిగలను కూడా మాలలుగా వివరించేప్రయత్నం కనిపిస్తుంది. గుర్రం జాషువా, మాల - మాదిగల మధ్య భేదాన్నీ వారి మధ్య ఉన్న అంతర్విభేదాలను చెప్పే ప్రయత్నం చేశారు. వీరిద్దరి మధ్యా సఖ్యత ఉండాలనేది కవి గారి ఆశయం. అయినా, గుర్రం జాషువా నాటికైనా మాల - మాదిగల మధ్య గల అనైక్యతనీ, కలవనితనాన్నీచెప్పినట్లైంది. మాదిగ యువతిని వివాహం చేసుకున్న గుర్రం జాషువాను తొలి దళిత కవిగా అంగీకరించని పరిస్థితి కనిపిస్తుంది. మాల కులస్తుడైన కుసుమ ధర్మన్నను తొలి దళిత కవిగా ప్రచారం తీసుకొచ్చే ప్రయత్నంలో మాదిగ సాంస్కృతిక వారసత్వ పునాదులపై దాడి చేయటంగా కొంతమంది మాదిగలు భావిస్తున్నారు. అలాగే, దళిత సాహిత్యానికి తెలుగులో నేపథ్యాన్ని అందించిన ఒక గొప్ప కవి గుర్రం జాషువాని కాదని బోయి భీమన్న పేరుతో విశ్వ విద్యాలయ స్థాయిలో పీఠాలను ఏర్పాటు చేయటం వెనుక దళితుల పేరుతో మాదిగ సాంస్కృతిక పునాదిని తిరస్కరించే ప్రయత్నమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దళిత ఉద్యమకారులు, సాహితీవేత్తలు "హరిజన పదాన్ని" ముక్త కంఠంతో వ్యతిరేకిస్తుంటే, తన జీవితాంతం వరకూ బోయి భీమన్న "హరిజన" పదాన్నే సమర్ధించుకున్నారు. అంతేకాదు, "దళిత" పదాన్ని తీవ్రంగానే వ్యతిరేకించారు. అలాంటి బోయి భీమన్నకు , గుర్రం జాషువా కంటే ముందు గానే విశ్వ విద్యాలయ స్థాయిలో పీఠం వేయడం వెనుక ఉ న్న రాజకీయాన్నీ అర్థం చేసుకోవలసి ఉందని కొంతమంది భావిస్తున్నారు. ఇలా మౌఖికంగాప్రసంగాల రూపంలోనూ ,లిఖితంగా కవిత్వం, కథలు, వ్యాసాల రూపంలోనూ మాదిగలు తమకీ, తమ వర్గానికీ జరుతున్న వివక్షను వివిధ రూపాలలో వ్యక్తం చేస్తున్నారు. మాదిగలకు జరుగుతున్న వివక్షను ప్రశ్నిస్తూ మొట్ట మొదటిసారిగా ఎండ్లూరి సుధాకర్ దండోరా అనే ఒక కవితను రాశారు. ఆ తరువాత 1996లో నాగప్పగారి సుందర్రాజు చండాల చాటింపు కవితా సంపుటిని ప్రచురించారు. 1997లో మాదిగ చైతన్యం పేరుతో మాదిగలే రాసిన కవిత్వాన్ని ఒక సంకలంగా మాదిగ సాహిత్య వేదిక వాళ్ళు ప్రచురించారు. ఈ మాదిగ సాహిత్య వేదిక, సెంట్రల్ యూనివర్సిటి, హైదరాబాదులో దళిత సాహిత్య వేదిక నుండి విడివడి మాదిగల అస్తిత్వాన్ని నిరూపించుకుంటూ ఏర్పడిన వేదిక. రాష్ట్ర వ్యాప్తంగా అనేక శాఖలతో వేలాది మంది ప్రజల మధ్య పుస్తక ఆవిష్కరణలతో మాదిగ సాహిత్య వేదిక మాదిగల వాదాన్ని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నాన్ని చేసింది. నాగప్పగారి సుందర్రాజు మాదిగోడు పేరుతో కథలు ప్రచురించారు. ఈ కథలన్నీ మాదిగ జీవితాలను ఎలా సాహిత్యీకరించాలో చెప్పే నమూనా కథలని చెప్పవచ్చు. ఆ తరువాత కాలంలో మాదిగ సాహిత్యం విస్తృతంగానే వచ్చింది.
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎం.ఆర్.పి.ఎస్) రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తుంటే, మాదిగ ఆత్మగౌరవ పోరాట సమితి మాదిగ హక్కులు, మాదిగ సాహిత్య స్థితిగతులను వివరిస్తూ ముందుకు వెళ్ళేది. అయితే, మాదిగలలో వచ్చిన అంతర్విభేదాలు కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిలో చిన్న చిన్న మనస్పర్థలకు కారణమై విభిన్న శాఖలుగా విడి వడిన ప్రయత్నం కూడా కనిపించింది. మాదిగ విద్యావంతులు మాదిగ ఆత్మగౌరవ పోరాట సమితికి అండగా నిలిచి నడిపించారనే వాదనలు కూడా ఉన్నాయి. తరువాత కాలంలో కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిలో వ్యవస్థాగత ఘర్షణలు కొన్ని జరిగినా, భిన్న పద్ధతులలో విభిన్నమైన పేర్లతో మాదిగల హక్కుల కోసం ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. కృష్ణ మాదిగ, కృపాకర్ మాదిగల మధ్య వచ్చిన కొద్దిపాటి విభేదాలు మాదిగ దండోరా ఉద్యమాన్ని కొంత నిర్వీర్యం చేసినా, కృష్ణ మాదిగ నాయకత్వం లోని మాదిగలు తమ హక్కుల కోసం ఉద్యమిస్తునే ఉన్నారు. కృపాకర్ మాదిగ ఏవో సైద్ధాంతిక కారణాల వలన కృష్ణ మాదిగతో కలిసి పని చేయకపోయినా, తనదైన పద్ధతులలో మాదిగ హక్కుల కోసం పని చేస్తూనే ఉన్నారు. కృపాకర్ మాదిగ మాదిగల వాదాన్ని పత్రికలలో వ్యాసాలను పుంఖాను పుంఖాలుగా ప్రచురిస్తూ ముందుకు తీసుకువెళ్తూనే ఉన్నారు. అంతేకాకుండా, మాదిగ సాంస్కృతిక జీవన ప్రతిఫలనాన్ని రికార్డు చేసే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో మాదిగ జీవితాలను అన్ని కోణాలనుండీ అభివ్యక్తీకరించిన కవితలను సేకరించి ఒక పుస్తకం రూపంలో తీసుకొచ్చేప్రయత్నంలో ఉన్నారు. ఆయనకు తెలంగాణ నుండి మాదిగ జీవిత వాస్తవికతను బలంగా వ్యక్తీకరిస్తున్న జూపాక సుభద్ర తోడు కావడంతో మాదిగ జీవిత సాంస్కృతిక అంశాలను మరింత సమర్థవంతంగా అందించే అవకాశం కనిపిస్తుంది. కనుక, మాదిగ ఉద్యమం; మాదిగ సాహిత్యం రెండు మార్గాలుగా పయనిస్తూనే ఉంది.
ఇక ప్రస్తుతం, మాదిగ సాహిత్యం విషయానికి వస్తే, మాదిగల వాదాన్ని అత్యంత శక్తివంతంగా సాహిత్యంలో వినిపించిన కవి రచయిత ఎండ్లూరి సుధాకర్. కవిత్వం, వ్యాసాల రూపంలో మాదిగల వాదాన్ని బలంగా ప్రతిఫలించేటట్లు రాయగలుగుతున్నారు. నిజానికి మాదిగల వాదాన్ని అంత వేగంగా, శక్తివంతంగా, అంత బహిరంగంగా వ్యక్తీకరించగలిగిన వాళ్ళు మరోకరు లేరేమో అనిపించేటట్లు ఎండ్లూరి సుధాకర్ వర్గీకరణీయం, కొత్త గబ్బిలం కావ్యాలను రాశారు. ఈ రచనలు వెలువడిన తరువాత వివిధ కలం పేర్లుతో వర్గీకరణ వాదాన్ని విమర్శిస్తూ కొంతమంది అనేక వ్యాసాలు రాశారు. చివరికి ఆయన వైయక్తిక జీవితాన్ని కూడాస్పర్శిస్తూ విమర్శ వ్యాసాలు రాశారు.
ఎండ్లూరి సుధాకర్ రచనలు వచ్చిన తరువాత దళిత సాహిత్యం, దళిత సాహితీవేత్తలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అంతవరకూ దళితేతరులను నిందిస్తూ, నిరసిస్తూ కవిత్వం రాసిన కవులు మాదిగల విషయంలో స్పందించటం లేదేమిటని నిలదీసినందుకే ప్రధానంగా ఎండ్లూరి సుధాకర్ గారి కవిత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. దళిత సమైక్యతకు మాదిగ సాహిత్యం గొడ్డలి పెట్టుగా ఈడ్చవలసిన పని లేదనీ విమర్శించారు.
మరికొంత మంది మాత్రం మాదిగలకు అన్యాయం జరిగిన మాట నిజమే గాని, వర్గీకరణతోనే సమస్య పూర్తిగా పరిష్కారం కాదనీ, నిజమైన పరిష్కారం దళితులంతా కలిసి రాజ్యాధికారం సాధించినప్పుడేనీ, దాని కోసం ముందు కలిసి ఉద్యమించాల నీ, నొప్పింపగా తానొవ్వక తప్పించుకొని తిరిగినట్టు కవిత్వం రాసిన వారు ఉన్నారు. ఆ కవిత ల సారాంశం మాత్రం మాదిగలకు అన్యాయం జరిగిన మాట నిజమైనా దాని కోసం మాలలనే నిందించవలసిన పని లేదనీ, మాలలకు కులవృత్తి లేకపోవడం వలన బతకడానికి అనేక వృత్తులను నేర్చుకుని అనేక రంగాలలో అభివృద్ధి చెందారనీ అన్నారు. ఆ విధంగా మాలలు ప్రతిభావంతులు కావడం వలనే అన్ని రంగాలలో ముందున్నారనీ, అది వారి తప్పు కాదనీ సమర్ధించే ప్రయత్నం కూడా వారి కవిత్వంలో కనిపిస్తుంది. తాత్కాలికంగా వచ్చే వర్గీకరణ రిజర్వేషన్‌ ఫలితాల కంటే ఉమ్మడిగా రాజ్యాధికారం కోసం పోరాడితే నిజమైన హక్కులు పొందగలుగుతామనే ఉద్బోధ కనిపిస్తుంది.
ఈ పరిస్థితుల్లో కొద్దో గొప్పో చదువుకున్న మాదిగలు తమకు తెలిసిన భాషలో, తమకు తెలిసిన ప్రయోగాలతో తమ వాటా తమకు కావాలని కవిత్వం రాశారు. అప్పకవీయాన్ని వ్యతిరేకించిన దళిత విమర్శకులే మాదిగ కవిత్వాన్ని శిల్పపరంగా లోప భూయిష్టంగా ఉందన్నారు. మాదిగ సాహిత్యాన్ని మాదిగ కవులను విమర్శించటంలో గల కుట్రను మాదిగలు గుర్తించగలిగారు. తమదైన రీతిలోపత్రికా ముఖంగా ప్రతి విమర్శ వ్యాసాలు రాశారు.
మాదిగ సాహిత్యం రావడానికి ముందు దళిత సాహిత్యంలో 'దళితుల' పేరుతో మాదిగలకు జరుగుతున్న వివక్షను ప్రశ్నించే దిశగా ప్రారంభమైందని ఇంతకుముందే చెప్పుకున్నాం. ఆ వివక్షలను గుర్తించి, అక్షరీకరించిన కొన్ని ఆధారాలనైనా స్థాలీపులాకన్యాయంగా కింది విధంగా గమనించవచ్చు.
కత్తి పద్మారావు గారు, మరికొందరి ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్బు (హైదరాబాదు)లో 28-7-2006 న ఒక సభ జరిగింది. ఆ సభలో దళిత కవుల రచనలను ఆవిష్కరించి, కవి సమ్మేళనం నిర్వహించారు. ఆ వివరాలను కత్తి పద్మారావు గారి సారధ్యంలో వెలువడిన దళిత రాజ్యం పత్రికలో సీరియల్‌గా ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో ఆ సభలో జరిగిన విశేషాలతో కూడిన నివేదికలను ప్రచురించారు. ఆ కవి సమ్మేళనంలో పాల్గొని మాదిగ హక్కుల గురించి చదివిన మాదిగ కవుల ఆర్తినిగాని కవుల వివరాలను గాని పేర్కొనలేదు. తమ పుస్తకంతో ఒక అవినాభావ సంబంధం ఉండటం వల్ల ఎండ్లూరి సుధాకర్ పేరు మాత్రం ఉటంకించారు. ఆ సభ ఒక చారిత్రక ప్రాధ్యాన్యం కలిగిన సభ అని ముందే ప్రకటించారు. అలాంటప్పుడు ఆ సభా విశేషాల్లో మాదిగ కవులను కావాలనే తప్పించారని విమర్శ వచ్చింది. నాగప్ప గారి సుందర్రాజు ఆ విషయాన్ని పస్తావిస్తూ ఏకలవ్య (జనవరి-ఫిబ్రవరి 1997; 45)లో ప్రశ్నించారు. దండోరాను సమర్ధిస్తూ "ఆ రోజు ఎందరో మాదిగ కవులు తమ గళాలను విప్పితే ఒక్క మాదిగ పేరును కూడా రాయలేదు. ఇలా మాదిగ పేర్లను బహిష్కరించటం పెద్ద కుట్ర'' అని దళితుల పేరుతో జరిగే వివక్షను... మాదిగలు ప్రశ్నించారు. ఇలాంటి విషయాలెన్నో చండాల చాటింపు , మాదిగ చైతన్యం కవితాసంపుటుల్లోనూ, మాదిగోడు కథాసంపుటిలోనూ నాగప్పగారి సుందర్రాజు సోదాహరణంగా రాశారు.
మాదిగ చైతన్యం పేరుతో మాదిగలు తమ ఆవేదనను కవిత్వీకరిస్తే ఆ కవితా సంపుటిలో శిల్పం, అభివ్యక్తి వంటి విషయాల గురించి ప్రస్తావిస్తూ సరైన కవిత్వం లేదని కొంతమంది దళిత విమర్శకులే విమర్శించారు . అంతే కాకుండా, దళితులలో మాలలు అధికంగా ఉండటం నేరం కాదు కదా అని ఒకాయన వ్యాఖ్యానించారు. దీనిని అంగీకరిస్తే దళితేతరులను వేలేత్తి చూపేటప్పుడు ఆ విషయం మరిచిపోయే దళిత విమర్శకులు ఆ విధంగా వాదనకు దిగారా? అని తరువాత మాదిగ విమర్శకులు సమాధానం చెప్పారు. అస్పష్ట ఆరోపణలతో ఆధారాలు లేవంటే ఏలా? అనే శీర్షికతో (ఆంధ్రభూమి 09-6-1997)లో దార్ల వెంకటేశ్వరరావు ఒక వ్యాసాన్ని రాశారు. ఆ తరువాత అంతకు ముందు మాదిగ చైతన్యం కవితా సంకలనాన్ని విమర్శించిన దళిత విమర్శకుడే తెలుగు సాహిత్య చరిత్రలో మాదిగ చైతన్యం పుస్తకానికి విశిష్ట స్థానం ఏర్పడిందని అంగీకరించారు. (మాదిగోడు కథలు 1997 ; XII) ఎండ్లూరి సుధాకర్ రాస్తున్న కవిత్వాన్ని కేంద్రంగా చేసుకొనికొంతమంది తీవ్రంగానే విమర్శించారని ముందే ప్రస్తావించుకున్నాం.
గూటం స్వామి 'ఏకీకరణీయం' 'నీలి పతాక' దీర్ఘ కావ్యాలు కవిత్వ రూపంలో , మాదిగ సాహిత్యంపై సందించిన విమర్శ ! కొత్త గబ్బిలం, వర్గీకరణీయం, మాకొద్దు ఈ మాలదొరతనం వంటివన్నీ మాదిగలకు రావలసిన హక్కులను వివరిస్తూ రాసిన వాదనలతో వేదనలతో కూడిన కవితాస్పందనలు.
దళితేతర సాహితీ వేత్తలు మాదిగల పోరాటాన్ని ప్రజాస్వామ్య బద్ధమైనది గాను, వారి హక్కులు న్యాయ బద్ధమైనవిగానూ సమర్థించిన వారున్నారు. దానితో కొంతమంది మాలలు అగ్రవర్ణ సాహితీవేత్తలను కూడా నిందించటం ప్రారంభించారు. ఎండ్లూరి సుధాకర్ వర్గీకరణీయం దీర్ఘకావ్యాన్ని ప్రచురించి అనేక పత్రికలకు అనేక మంది సాహితీవేత్తలకు అందుబాటులో ఉంచి వారి దగ్గర నుండి వచ్చిన అభిప్రాయాలను పునర్ముద్రణలో ప్రచురించారు. అందులో దళితేతర సాహితీవేత్తలే తమ అభిప్రాయాలను వ్యక్తీకరించటం ప్రధానంగా కనిపిస్తుంది. మాలలు స్పందించక పోగా స్పందించిన దళితేతర సాహితీవేత్తలను తీవ్రమైన పదజాలంతో విమర్శించటాన్ని ఎలా అర్థంచేసుకోవాలి? ఇలా మాదిగ సాహిత్యంపై కొంతమంది దళితుల అభిప్రాయాలను స్పష్టంగా గుర్తించే అవకాశం కలిగింది. విశేషమేమిటంటే దళిత సాహిత్యంలో అగ్రశ్రేణి కవులుగా రచయితలుగా పేరు ప్రఖ్యాతలు పొందినవారు మాత్రం మాదిగ సాహిత్యాన్ని కనీసం స్పర్శించటం లేదు. స్మృతి కవిత్వాన్ని చిన్న చిన్న సంఘటనలకు కూడా స్పందించారు. కానీ, దళితుల మధ్య దూరాలను పెంచకుండా, సామరస్యపూరితమైన పరిష్కారానికి ఉభయ వర్గాల్లోని మేథావులూ అంకితభావంతో ప్రయత్నంచటంలేదు. సీనియెర్ మాల కవులూ అత్యంత ముఖ్యమైన మాదిగ సమస్యను పట్టించుకోవడం లేదు. సుమారు దశాబ్దిన్నర కాలంగా జరుగుతున్న ఎస్. సి., రిజర్వేషన్‌ వర్గీకరణ గురించి స్పందించకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని మాదిగలు ప్రశ్నిస్తున్నారు. ఒకరిద్దరు కవులు మాదిగ హక్కుల గురించి కవిత్వం రాస్తే, వాటిని ఖండిస్తూ కలం పేర్లతో, మారు పేర్లతో మాదిగల మనోభావాలను కించ పరిచే విధంగా వ్యాఖ్యానించటం కనిపిస్తుంది.
మాదిగ దండోరా ఉద్యమాన్ని విమర్శిస్తూ, వర్గీకరణ వాదం సరికాదంటూ రాసిన రాతలన్నింటికీ సమాధానంగా, వర్గీకరణను సమర్ధిస్తూ 2006లో గుండిమెడ సాంబయ్య "బ్రాహ్మణత్వ మాలత్వమా? మానవత్వ అంబేద్కరత్వమా?" పేరుతో ఒక పుస్తకాన్నే రాశారు. దీనిలో అంబేద్కర్ భావజాలాన్ని ఆధారంగా చేసుకొని, పరిశోధనాత్మక దృష్టితో బ్రాహ్మణత్వ భావనలాగే, అలాంటి భావజాలాన్నే మాలత్వగా భావించిన కొంతమంది భావనల ఆధారంగా వర్గీకరణ వ్యతిరేకవాదాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ఆ తరువాత ఆవంత్స సోమసుందర్‌ ఎండ్లూరి సుధాకర్ గారి కొత్త గబ్బిలం దీర్ఘ కావ్యంపై విమర్శ రాశారు. వజ్రాయుధం వంటి అభ్యుదయ కావ్యాన్ని రాసిన ఆవంత్స సోమసుందర్‌ ఈ కాలంలో కొత్త గబ్బిలాలు సందేశ కావ్యాలు అవసరం లేదనడం వెనుక మాల సాహితీవేత్తల ప్రేరణలున్నాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ వ్యాసానికి సమాధానంగా టి. పున్నారావు ఆంధ్రప్రభలోనే (10-12-2007, 17-12-2007) కొత్త గబ్బిలం ఎందుకంటే గుర్రం జాషువా గబ్బిలం ఇచ్చిన స్పూర్తితో దళితులలో కొత్త చైతన్యాన్ని రగిలించటం కోసమని సోదాహరణంగా వివరించారు. ఇటీవల బహుజన కెరటాలు మాస పత్రిక (జూలై - 2007) ఎస్.సి., వర్గీకరణతోనే దళితుల ఐక్యత సాధ్యమవుతుందని ఒక ప్రత్యేక సంచికనే ప్రచురించారు. దీనిలో చల్లపల్లి స్వరూపరాణి, కేశవ కుమార్, జె. గౌతమ్‌, జి.ఎస్. రామ్మోహన్‌, దుర్గం సుబ్బారావు, బత్తుల కాంతయ్య, కలేకూరి ప్రసాద్, సాదు మాల్యాద్రి తదితరుల విశ్లేషణాత్మక వ్యాసాలున్నాయి. వర్గీకరణను సమర్ధించటం వీరందరి వాదనలలోను ప్రస్పుటంగా కనిపిస్తుంది. కొంతమందైనా రచయితలు వర్గీకరణ వాదానికి సానుకూలంగా స్పందించటం ఒక శుభపరిణామం. అయితే, ఈ ప్రత్యేక సంచిక లోని కొన్ని వ్యాసాలు మాదిగ దండోరా ఉద్యమానికంటే, మాలల ఉద్యమానికే ఉపయోగపడే భావాలనే అందించటం దళిత మేథావుల లోని ఒక గొప్ప నైపుణ్యం!
రాజకీయంగా చూసినప్పుడు దారా సాంబయ్య వంటి వారు మాల - మాదిగ ఇరువర్గాలను కూర్చోపెట్టి సమస్య పరిష్కారానికి ప్రయత్నించటం కూడా ఒక మంచి పరిణామమే. కానీ, అంతకుముందు గద్దర్ ఆధ్వర్యంలో మాల - మాదిగలను సమైక్య పరిచే ప్రయత్నాలేమీ అంకిత భావంతో జరగలేదు.
రామచంద్రరాజు కమీషన్‌ (1997) వర్గీకరణ కోసం చేసిన సిఫార్సులు 1981 జనాభా లెక్కల ప్రకారం జరిగాయని, అవి సరైనవి కాదని వాదించిన వారు, ఉషా మెహ్రా కమీషన్‌ తీసుకున్న 2001 జనాభా లెక్కల ప్రకారం కూడా మాదిగలకు అన్యాయం జరిగిందనే చెప్తున్నా, ఆ కమీషన్‌ నివేదికను కూడా వ్యతిరేకిస్తున్నారు. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి వర్గీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. మాదిగలకు అన్యాయం జరగకుండా ప్రత్యేక జీ.వో., విడుదల చేస్తే, దాన్ని సుప్రీం కోర్టుకు తీసుకువెళ్ళి చెల్లదని రద్దు చేయించారు. పార్లమెంటు ఆమోదించినప్పుడు మాత్రమే వర్గీకరణ సాధ్యమవుతుందని మాల మహానాడు ఆధ్వర్యంలో వాదనలు ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నారు. అంబేద్కర్ భావజాలం ప్రకారం ఆయా రాష్ట్రాలలో భిన్న పేర్లతో ఉన్న, దళితుల సామాజిక స్థితిగతులను ఆధారంగా చేసుకొని ఎప్పటికప్పుడు శాసనాలను మార్చుకోవలసిన అవసరం ఉంటుందనీ, అలాంటి అవసరమే ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిందని మాదిగ దండోరా, మాదిగ ఉద్యమ సాహితీకారులు ఆకాంక్షిస్తున్నారు. మాదిగ హక్కుల ప్రచారం కోసం మాత్రమే కాకుండా దాని ఆధారం చేసుకున్నా, మాదిగోడు (1997), మల్లె మొగ్గల గొడుగు (మాదిగ ఆత్మ కథలు- 1999), నల్లరేగడి సాల్లు (2006) వంటి కథా సంకలనాలు, జాతర (1997), కక్క(2000) వంటి నవలలు మాదిగ జీవితాల లోని అనేక కోణాలను, మాదిగల అస్తిత్వాన్ని స్థిరీకరించే ప్రయత్నం చేశాయి. గోగు శ్యామల, జాజుల గౌరి, కదిరి కృష్ణ, పరిమళ్, ఐనాల సైదులు, పసునూరి రవీందర్ వంటి వాళ్ళు మాదిగ సాంస్కృతిక జీవితాలను ప్రతిఫలించే దిశగా రచనలు చేస్తూనే ఉన్నారు. వీటన్నింటి దృష్ట్యా చూసినప్పుడు మాదిగ సాహిత్యం దళిత సాహిత్యంలో అంతర్భాగంగా కొనసాగినా గానీ, అవసరమైతే సొంత అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి కావలసినంత అవకాశం ఉంది. ఇంకా లోతుగా చెప్పాలంటే, దళిత సాహిత్యం మాదిగల జీవితం మీదే ప్రధానంగా ఆధారపడి ఉంది. కానీ, ఆ మాదిగలను నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారనే ఉద్దేశ్యంతోనే తనదైన అస్తిత్వంతో మాదిగ సాహిత్యం ముందుకొస్తుంది.
a

No comments: