ఒక్కొక్క ఇటుక కూలిపోయింది
ఒక్కొక్క నెత్తుటి చుక్క రాలిపోయింది
మగ్గుతున్న ఉద్యమ ఫలం
మట్టిపాలైంది
మంచితనపు పేరు కింద
మచ్చ ఏదో చేరినట్టైంది
అరాచక సందర్భాలన్నీ
కిరాతక చర్యలేనని
చరిత్ర కోడి గొంతెత్తి అరుస్తూ ఉంది
ఏ రాజ్యాంగ నేత నేర్పిన దాడులివి?
ఏ బహుజన పిత చూపిన దారులివి?
అక్షరాలను
అక్షరాలతోనే ఎదుర్కోవడం నాయక విద్య
నేతలే నిర్ణేతలు కారు
నేతల చేతలన్నీ జాతికి ఆమోదం కాదు
తోటను కాపాడుకోలేని వాడు
మాలి కాలేడు
మందను చెదరగొట్టేవాడు
మంచి కాపరి కాలేడు
డేగల్ని నమ్ముకుని
పావురాల గుంపు బలికాకూడదు
చిదుగుల మంటల్లో
చీమలు మాడిపోకూడదు
రాళ్ళు విసిరినా
నిప్పులు కురిసినా
నిరసనకో నీతుండాలి
లోపలి వాడైనా
బయటి వాడైనా
లోక న్యాయం చూడాలి
అక్షరాల మీద దాడులు
రాతియుగపు చేతబడులు
కూలిపోయిన మర్యాద మందిరం
ఎలాగో కూలిపోయింది
చేరవలసిన గమ్యం చేరుకోనే లేదు
చేతికందిన కూడు నోటిదాకే రానేలేదు
పద్నాలుగేళ్ళ పోరాటం కళ్ళముందే బద్దలైపోయింది
ఒక్కొక్క ఇటుక ముక్కనూ ఏరుకుందాం
ఒక్కొక్క నెత్తుటి చుక్కను సమీకరించుకుందాం
ఒక కొత్త ఉద్యమలోకం నిర్మించుకుందాం
ఇప్పుడు నాయకత్వం
ఏకవచనం కాదు
బహువచనం కావాలి
దీపధారి నాయకుడు
దిష్టిబొమ్మ కావడం
ఎంత విషాదం?!
నియంత ఎక్కడున్నా నిచ్చెనకే ప్రమాదం
('ఆంధ్రజ్యోతి' మీద జరిగిన దాడికి క్షమాపణలతో)
(andhra jyothy 2-6-2008)
2 కామెంట్‌లు:
Excellent!
Mr.Endluri Sudhakar is one of my
favourite poet..
కామెంట్‌ను పోస్ట్ చేయండి