"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

07 May, 2008

ఎస్సీల వర్గీకరణపై రాజ్యాంగ సవరణ చేయాలి - ఈనాడు రిపోర్ట్

Justice Usha Mehra



ఎస్సీల వర్గీకరణపై
రాజ్యాంగ సవరణ చేయాలి
కొత్త క్లాజును చేర్చాలి అన్ని కులాలకు లబ్ధి చేకూరేలా వర్గీకరణ ఉండాలి
ఎస్సీల్లో మాలలే ఎక్కువగా లాభపడుతున్నారు
ఉషామెహ్రా నివేదికలో సిఫార్సులు
హైదరాబాద్ - న్యూస్‌టుడే
ఎస్సీల వర్గీకరణకు రాజ్యాంగ సవరణ చేపట్టాలని జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చింది. ఈ మేరకు సమర్పించిన నివేదిక కాపీని 'న్యూస్‌టుడే' సంపాదించింది. ఏదైనా రాష్ట్రంలో, లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో ఎస్సీల్లోని అన్ని కులాలు, జాతులు, తెగలకు ప్రభావ వంతమైన ప్రాతినిధ్యం లభించేందుకు ఉప వర్గీకరణ చేయడానికి రాజ్యాంగ సవరణ అవసరమని కమిషన్ అభిప్రాయపడింది. ప్రస్తుతం వర్గీకరణకు రాజ్యాంగం 341 నిబంధనలో ఉన్న 1, 2 ఉప నిబంధనలు ఆటంకంగా ఉన్నాయని, వాటిని అధిగమించేందుకు అదనంగా 341(3) ఉప నిబంధనను చేర్చాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం చట్టం చేయడం ద్వారాగానీ, రాజ్యాంగంలోని 341(1) నిబంధన ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేయడం ద్వారా గానీ వర్గీకరణ చేపట్టవచ్చని, అప్పటికే ఉన్న వర్గీకరణలను రద్దు చేయవచ్చని ఉషామెహ్రా కమిషన్ సూచించిన 341(3) ఉప నిబంధన పేర్కొంటోంది. వర్గీకరణలపై రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉండాలని కమిషన్ అభిప్రాయ పడింది. రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించి పంపితే, పార్లమెంట్ చట్టం చేయాల్సి ఉందని సూచించింది. రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణపై నియమించిన జస్టిస్ ఉషామెహ్రా కమిషన్- వర్గీకరణ చేయాలనికానీ లేదా చేయొద్దని కానీ ఎక్కడా విస్పష్టంగా చెప్పలేదు. అయితే పార్లమెంటు రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత వర్గీకరణ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌కు అవకాశం ఉంటుందని పేర్కొంది. కమిషన్ తన నివేదికలో విద్య, ఉపాధి రంగాల గురించి ప్రస్తావించడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది.మొత్తం 162 పేజీల నివేదికలో అభిప్రాయాలు, సిఫారసులను 37 చేసింది. ఈ నెల ఒకటోతేదీన కేంద్ర ప్రభుత్వానికి కమిషన్ సమర్పించిన నివేదికను 'న్యూస్‌టుడే' సంపాదించింది. రాజ్యాంగంలో ఆర్టికల్ 341కు సవరణ చేయాలని, ప్రస్తుతం ఉన్న 341(1), (2)లకు అదనంగా (3) చేర్చాలని కమిషన్ సూచించింది. కొత్త క్లాజు(3) ప్రకారం వర్గీకరణ/రద్దుకు సంబంధించి పార్లమెంటు తనంతటతానుగానీ లేదా రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించి పంపితేగానీ... చట్టం చేయాల్సిఉందని సూచించింది. రాజ్యాంగంలోని 341(1) ప్రకారం పార్లమెంటు చట్టం, ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా ఏదైనా కులం, జాతి, తెగ, లేదా ఏదేని కులంలోని భాగం లేదా సమూహానికి వర్గీకరణ చేయడానికిగానీ, దాన్ని రద్దు చేయడంగానీ చేయొచ్చు. 341(2) ప్రకారం దీన్ని మరో నోటిఫికేషన్ ద్వారా మార్చకూడదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగానికి సవరణ తీసుకురావాలని కమిషన్ సూచించింది. ఆ ప్రకారం 341(3) ద్వారా రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తే పార్లమెంట్ చట్టంచేసేలా సవరణ ఉండాలంది.
కమిషన్ అభిప్రాయాలు, సూచనలివి...
చి ఎస్సీ జాబితాలో రెండు మూడు కులాలు మాత్రమే ఎక్కువ లబ్ధిపొందుతున్నాయి. ఇందులో మాల, మాల ఉపకులాలు రిజర్వేషన్ల ఫలాలను ఎక్కువగా ఉపయోగించుకున్నాయి. చి సమాజంలో వెనుకబడిన కులాల అభ్యున్నతి కోసం విద్య, ఉపాధి, ఉపకారవేతనాలు కల్పించే విషయంలో రాష్ట్రాలకు పూర్తిస్వేచ్ఛ ఉంది. అన్ని కులాలు, వర్గాలకు లబ్ధిచేకూరే విధంగా ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంది. ఎవరికి ఏ మేరకు రిజర్వేషన్లు కల్పించాలో నిర్ణయించే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉంది. అన్ని కులాలకు లబ్ధి చేకూరే విధంగా ఎస్‌సీ వర్గీకరణ ఉండాలి. చి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌సీల సంక్షేమానికి అనేక పథకాలు అమలవుతున్నా...చాలా మంది వివక్షతకు గురవుతున్నారు. ఒకట్రెండు కులాల వారు మాత్రమే రిజర్వేషన్ల లబ్ధి పొందుతున్నారు. ఇది అసమానతలకు దారితీస్తోంది. చి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌సీల్లో 60 కులాలున్నాయి. వీరిలో భిక్షాటన చేస్తూ సంచార జీవితం గడిపేవారు చాలామంది ఉన్నారు. రెల్లి, మేదర, పాకీ, మోటీ, థోటీ ఉపకులాలు పాకీ పని చేస్తున్నారు. దుర్భర పేదరికం, నిరక్షరాస్యతలో మగ్గుతున్నారు. సామాజిక వివక్షకు గురవుతున్నారు. ఇవి ఎస్‌సీల్లో అసమానతలకు దారితీస్తున్నాయి. చి రాష్ట్రంలోని 11 జిల్లాల్లో పర్యటించి, ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ప్రముఖులు, ఎస్‌సీ సంఘాల నుంచి సమాచారాన్ని సేకరించాం. మాలలు, మరో ఒకట్రెండు వర్గాల నుంచి వర్గీకరణపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. చి ఎస్‌సీల ఆర్థిక అభ్యున్నతి కోసం వివిధ పథకాలను రాష్ట్రంలో అమలుచేస్తున్నా... చాలా కులాలకు చెందినవారు విద్యాపరంగా ప్రతిభవంతులుగా ఎదగలేదు. అన్ని వర్గాలకు సమానంగా రిజర్వేషన్లు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. చి విద్యా, ఉపాధి కోసం ఎస్‌సీ వర్గీకరణ చేయడం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితం. ఇది కేంద్ర ప్రభుత్వ రిజర్వేషన్లపై ప్రభావం చూపకూడదు. చి రెల్లి, మాదిగలు 50.21 శాతం ఉండగా, మాల, మాల ఉపకులాలు 42.78 శాతం ఉన్నారు. కానీ రాష్ట్ర సర్వీసుల్లో క్లాస్-1, క్లాస్-3 పోస్టులను 70 శాతం మంది మాల, మాల ఉపకులాల వారు అనుభవిస్తున్నారు. ప్రయోజనాల విశ్లేషణ:రాష్ట్రంలోని ప్రభుత్వ పథకాలు, విద్యా, ఉద్యోగాల్లో ఎస్సీలు పొందుతున్న ప్రయోజనాలను కమిషన్ కింది విధంగా విశ్లేషించింది. ప్రభుత్వం అందించిన సమాచారాన్ని పరిగణనలోనికి తీసుకుని ఈ పనిచేసింది. చి మాదిగలు తెలంగాణాలోని అన్ని జిల్లాలు, కోస్తాంధ్ర, రాయలసీమల్లోని ఐదు జిల్లాల్లో ఎక్కువగా ఉన్నారు. కోస్తాంధ్ర, రాయలసీమల్లోని మిగతా 8 జిల్లాల్లో మాలలు ఎక్కువగా ఉన్నారు. చి ఎస్సీ విద్యార్థులందరికీ ఉపకార వేతనాలు అందాలి. కానీ, ఇది జరగడం లేదు. ఆరు జిల్లాల్లో 10 కులాల వారే ఉపకారవేతనాలు పొందుతుండగా... మిగతా 41 కులాల వారు 2 నుంచి 3 శాతమే వాటిని పొందుతున్నారు. కోస్తాంధ్రతో పాటు రాయలసీమ, తెలంగాణాలోని కొన్ని జిల్లాల్లో మాలలు ఎక్కువ మంది ఉపకారవేతనాలు పొందుతుండగా... తెలంగాణాతో పాటు రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో మాదిగలకు ఎక్కువగా ఉపకారవేతనాలు అందుతున్నాయి. చి మాలలు, మాదిగలు మినహాయిస్తే మిగిలిన కులాలు రెండు నుంచి మూడు జిల్లాల్లోనే ప్రభుత్వ పథకాలవల్ల లబ్ధిపొందాయి. చి ఎస్సీల్లో మొత్తం 60 కులాలకుగాను 54 కులాలు ప్రభుత్వ ఉద్యోగాలు పొందాయి. ఇందులో 90 శాతం ఉద్యోగాలు మాల, మాదిగలకే దక్కాయి. వరంగల్, నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి మినహా ఇతర అన్ని జిల్లాల్లో మాలలు ఎక్కువ పోస్టులు పొందారు. ఇవి వారి జనాభా నిష్పత్తి కంటే ఎక్కువ. ఈ నాలుగు జిల్లాల్లో మాదిగలకు ఎక్కువ పోస్టులు లభించాయి. రాష్ట్రంలోని బ్యాంకుల్లో 50 శాతానికి పైగా పోస్టులు మాలలకు దక్కాయి. మాదిగలు 28.4 శాతం పోస్టులు పొందారు. రాష్ట్రంలోని 23 విశ్వవిద్యాలయాల్లో 50 శాతానికి పైగా పోస్టులు మాలలకే దక్కాయి. ఒక్క ఎన్టీఆర్ వైద్యవిశ్వవిద్యాలయంలోనే 86 శాతం పోస్టులు వారే పొందారు. వివిధ సంస్థలు కమిషన్‌కు అందించిన విజ్ఞాపన పత్రాల్లో పేర్కొన్న సమాచారం మేరకు... 2001 జనాభా తీరిదీ... మాదిగలు: 60.74 లక్షలు;మాలలు: 51.39 లక్షలు,రెల్లి: 1.21 లక్షలు,ఆది ఆంధ్ర: 1.42 లక్షలు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎస్సీల ప్రాతినిధ్యం మాదిగ: 31 శాతం,మాల: 61.8 శాతం, రెల్లి: 0.25 శాతం, ఆది ఆంధ్ర: 2.77 శాతం డిప్యూటీ కలెక్టర్ స్థాయి ఉద్యోగాల్లో మాల: 78.13 శాతం, మాదిగ: 21.18 శాతం, మెజిస్ట్రేట్లు మాల: 86.21 శాతం; మాదిగ: 13.79, స్థానిక సంస్థల్లో... మాదిగ: 37 శాతం, మాల: 43.3 శాతం, రెల్లి: 9 శాతం, ఆది ఆంధ్ర: 9.9 శాతం విద్యా సంస్థల్లో... మాల: 57.2 శాతం, మాదిగ: 38.18 శాతం, ఆది ఆంధ్ర: 0.56 శాతం, రెల్లి: 0.56 శాతం సచివాలయంలో... మాల: 59.5 శాతం, మాదిగ: 34.4 శాతం,ఆది ఆంధ్ర : 4 శాతం,రెల్లి: 1.2 శాతం రాష్ట్రంలో ఐపీఎస్ అధికారులు; మాల: 76.92 శాతం, మాదిగ: 23 శాతం,ఇతరులు: లేరు ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారులు మాల: 86.21 శాతం,మాదిగ: 13.79 శాతం
( ఈనాడు దినపత్రిక 06-5-2008 వారి సౌజన్యంతో...)

No comments: